ఊసుపోక – కాలూ, కారూ

(ఎన్నెమ్మకతలు 130)

పనిలేనివాళ్ళనీ పాటు పడనివాళ్ళనీ చూస్తే చాలామందికి చిరాకు. నాకు పని లేదనీ, నేను పాటు పడనని అనుకునేవాళ్ళని చూస్తే … ఎందుకులెండి. నేను చెప్పను కానీ మీకు అర్థమయే ఉంటుంది. ఎవరిపనులు వాళ్ళవి. నేను ఇదివరకోసారి వివరించేను నాకు దినము ఎలా గడుచునో. ఆ కార్యక్రమానికి గంటు పడింది నేను టెక్సస్‌లో వచ్చి పడ్డాక. ఎందుకంటే, నేను మొన్న పెట్టిన విడియో చూస్తే అర్థమయేఉంటుంది. ఆ చెట్లమధ్య తిరుగుతుంటే, నిద్రాసమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్! అనిపించేది. నేను విడిగా చేసే పూజలేమీ లేవు. నా సంచారమే ప్రదక్షిణ, ఏం మాటాడితే అదే స్తోత్రం, ఏం చేస్తే అదే నీకు సమర్ఫణ – మన మతం ఎన్నివిధాల సుకరం చేస్తుందో … అనుకుంటూ తిరిగేదాన్ని. శ్రీశైలపరిసరాలు మరిపించే ఆ వాతావరణంలోంచి సహారా ఎడారిలాటి ప్రదేశానికొచ్చి పడ్డాను.

<

p>ఇక్కడ వియత్పథాన విహరించే విహంగాల కిలకిలారావాలు వినిపించవు. నీటి కొంగల క్రేంకారములు అప్పుడప్పుడు వినిపిస్తాయి కానీ అవి శ్రవణానందంగా ఉండవు. ఆహా ఈ పక్షులు నన్ను ప్రేమగా పిలుస్తున్నాయి అనిపించదు. ఆదమరిచి కాల్తున్న పెనంమీద చెయ్యిపడితే నానోట వెలువడే కేకలా హృదయవిదారకంగా ఉంటుంది. తుపాకీగుండుకి ఎర అయిన అడవిజంతువు చేసే ఆర్తనాదంలా ఉంటుంది. మదపుటేనుగు ఘీంకరించినట్టు కూడా ఉండొచ్చు. ఒక్కమాటలో ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్టు ఉంటుంది.

అయినా అర్థమనస్కంగానే వీధికెక్కుతాను. తిట్టే నోరూ, చేసే చెయ్యీలాగే నాకాలు ఊరుకోదు. నాజీవితంలో మొదటి అర్థభాగం మనదేశంలోనే గడిచింది. అక్కడున్నంతకాలం నూటికి 90 పాళ్ళు కాలిమీదే నా తిరగుళ్లు. ఎక్కడికెళ్ళాలన్నా పాదచారినే.

అమెరికా వచ్చేక, ఏదీ కాలినడకదూరంలో లేనందున కారుమీద తిరగవలసి వచ్చింది. మళ్ళీ దాదాపు 36 ఏళ్లయినతరవాత, ఈ ఇంటికొచ్చేక, నాకు కావలసినవన్నీ గట్టిగా కాలు సాగిదీసి బయల్దేరితే పదినిముషాల్లో చేరిపోయే గమ్యములే కావడంచేత, బోలెడు ఆనందపడిపోయేను. అలాటిది, మరి నెలరోజులుగా కాలు బాధ పెట్టేస్తోంది. అదే బహుశా నేను ఏ క్వేక్ డాక్టరుకో చెప్తే, దానికో పేరు పెట్టి, అదొకరకం జబ్బు. నిన్ను నువ్వు – అదే నీకాలుని – అదుపులో పెట్టుకోలేకపోవుట నీ తప్పు కాదు. అదొకరకం మానసిక లేదా మేధకి సంబంధించిన జబ్బు అంటూ నా తల  తిరిగిపోయే పాఠం ఒకటి చెప్పి, నా బాంకెకౌంటు దోపిడీ అయిపోయే  మందులచిట్టా ఒకటి రాసిస్తాడు. అంచేత ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన ఏ డాక్టరుగారినో సంప్రదించుదాంలే అని అలా కుంటుకుంటూ, అప్పుడప్పుడు కాపడం పెట్టుకుంటూ గడుపుకొస్తున్నాను. అలా నిన్న ఓ డాక్టరుగారొచ్చేరు. ఆయన్ని సలహా అడిగి సంగతి సందర్భాలు తెలిసేసుకున్నాను (హుమ్, మనఇండియనులు అని అనకండి మరి. మనం ఇండియనలుమే కదా.) ఇది కాలు కథ.

ఇంక కారు మాటకొస్తాను. ఎనిమిది నెలలక్రితం నాకారుని కొత్తగా చక్రం చేతికొచ్చిన ఓ చిన్నారి అరివీరభయంకరులకి సాటి రాగల సమరోత్సాహంతో తన 3 వేల పౌన్ల ఆయుధంలాటి కారుని నాకారుకి పెట్టేసి, నన్ను కారుహీనురాలిని చేసేసింది తృటిలో. రెండు కార్లూ తుక్కు తుక్కు అయిపోయేయి కానీ ఇద్దరం అంటే ఆ చిన్నదీ ఈ పెద్దదీ, అనగా నేనూ, బతికిపోయేం. ఆహా విధిలీలలు అని మర్నాడో మూడోనాడో అనుకున్నాననుకోండి అది వేరే సంగతి.

ఇదే సమయంలో సరయు కొత్తకారు కొనుక్కునే పథకం వేస్తున్నానని చెప్పింది. చూసేరా, వాన పడ్డప్పుడే గొడుగు కనిపిస్తుంది అని చెప్పుకున్నాను, వాడుకలో ఉన్న నానుడిని సమయానుకూలంగా మార్చుకుని.

“నాకారు నువ్వు తీసుకో, నేను కొత్తకారు కొనుక్కుంటాను,” అంది సరయు. అది చాలా మంచి కారని కూడా చెప్పింది. ఆమాట నేను నమ్ముతాను. నమ్మేను. ఎందుకంటే, వస్తువులని భద్రంగా చూసుకునేవిషయంలో సరయుని మెచ్చుకోవాలి. ప్రతి మూణ్ణెల్లకీ ఆయిలు ఛేంజి చెయ్యమంటారు కారు కంపెనీవాళ్ళు. అది వాళ్ళు డబ్బు చేసుకోడానికి పెట్టిన నియమం అని నానమ్మకం. కానీ సరయు అలా అనుకోదు. ఖచ్చితంగా తు చ తప్పకుండా ఆ నియమాలన్నీ పాటిస్తుంది. అంచేతన్నమాట తను ఆ కారుని అపురూపంగా చూసుకుంటున్నానంటే నమ్మేను.

కారు వచ్చిన వారంరోజులకి కాబోలు బేటరీ హరీమంది. హుమ్మనుకుని, బేటరీరక్షకులయిన ట్రిపుల్యే ని పిలిచేను. వారొచ్చి బేటరీకి ప్రాణం పోసేరు. మర్నాడు, అక్షరాలా మర్నాడే మళ్లీ పడుకుంది. … మూడు వారాలయింతరవాత మరోసారి చచ్చి ఊరుకుంది. సరే, కొత్త బేటరీ వేయించేను. అదీ అంతే. అలా రెండుచుట్లయినతరవాత, ఆ బేటరీవాడు మరో కొత్త బేటరీ ఇచ్చేడు. అదీ అంతే. … ఇలా ఆరునెలలయింది ఏడు సార్లు నా బేటరీకీ నాకు తగువులయేయి. మధ్య మధ్యలో ఆయా మెకానిక్కుల సలహాలనుసరించి ఆల్టర్నేటరు కొత్తది వేయించేను. ఎలెక్ట్రిక్ సిస్టమ్ చెక్ చేయించేను….

ఇంతకీ ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి. ఇదే కారు మాఅమ్మాయిదగ్గర ఉన్నన్నాళ్ళూ ఎందుకు ఏ పేచీ పెట్టలేదు? ఆహా విధి లీల అని మరియొక మారు తలుచుకోవలెనా?

చివరిసారి మెకానిక్కు, “అమ్మా, మీకారు మూలవిరాట్టు కాదు అలా ముంగిట పెట్టుకుని చూసి సంతోషించడానికి. అది ఉత్సవవిగ్రహం. మీరు రోజూ నాలుగువీధుల్లో తిప్పాలి,” అన్నాడు.

అతనిమొహంలోకి పరీక్షగా చూసేను, “South Asian studies, Wisconsin?”

“Pittsburgh, Pennsylvania,” అన్నాడు.

అదీ సంగతి. మాఅమ్మాయికి రోజులో ముప్పాతిక భాగం కారులోనే కనక అది అక్కడ బంగారంలా ఉంది. నాకేమో కారుమీద కంటే కాలుమీద తిరగడమే ఎక్కువ కనక కారు మూలుగులు మొదలెట్టింది. అంతే కాదుట, టెక్సస్ చలిదేవరా, ఎండదేవరా కూడా కారుబతుకుకి అనుకూలం కాదుట. “అందరూ బేటరీలకి మంచు ఆ గర్భశత్రువు అంటారు కానీ ఇక్కడ ఎండలు బేటరీల పాలిట యమదూతలు,” అని కూడా ఆ మెకానిక్కు చెప్పేడు.

అంచేత,

నేనిప్పుడు కాలుమీద ఒకరోజూ, కారుమీద రెండు రోజులచొప్పున తిరగవలసిన అగత్యం ఏర్పడింది. కాలుమీద రోజుకు ముప్పావు మైలు తిరిగితే, కారుమీద మైలున్నర దూరంలో ఉన్న షాపుకి చుట్టు తిరిగి ఆరుమైళ్ళు వెళ్తున్నాను.

ఇవ్విధమున నాకాలు ఆరోగ్యం, కారు ఆరోగ్యం కాపాడబడుతున్నాయి. ఇలా జరగగలదని నేను కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు. :(

(డిసెంబరు 2, 2013).

About these ads
గురించి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను. www.thulika.net లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఆవిష్కరించే కథల అనువాదాలు, తెలుగురచయితలమీద విశ్లేషణాత్మకవ్యాసాలు చదవగలరు.

ఊసుపోక లో రాసారు
4 comments on “ఊసుపోక – కాలూ, కారూ
 1. మాలతి అంటున్నారు:

  కాలుకి రెస్టూ, కారుకి రొష్టూ :))

 2. Mohan అంటున్నారు:

  Rest for legs and exercise for the car , nice

 3. Narayanaswamy అంటున్నారు:

  brilliant. ఈ సారిగనక కారు మళ్ళీ ట్రబులిస్తే .. అదీనూ .. ఏదైనా వింత వింత శబ్దాలు చేస్తే, NPR వాళ్ళ కార్ టాక్ సోదరులకి కాల్ చెయ్యండి :)

 4. శారద అంటున్నారు:

  Delightful!!! :)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

భాండారం
Blog Stats
 • 166,092 hits
అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 369గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: