తెలుగు తూలిక

జనవరి 21, 2009

కనుపర్తి వరలక్ష్మమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం

ప్రచురించిన వర్గము వ్యాసాలు, సాహిత్యం — మాలతి @ 7:42 అపరాహ్నం
Tags: ,

కనుపర్తి వరలక్ష్మమ్మగారు విశిష్ట వ్యక్తి. సాంఘికసేవలో స్త్రీల అభ్యుదయంకోసం పాటుపడిన మొదటితరం తెలుగు వనితలలో ముఖ్యులు. వారిగురించి రెండువ్యాసాలకి లింకులు కింద ఇస్తున్నాను.

మరొక మనవి. వారి రచనలలో అత్యంత ప్రాముఖ్యత పొందిన వ్యాసాలు శారదలేఖలు. ఆవ్యాసాలు పుస్తకంగా పునర్ముద్రించేరని నాకు నాలుగు రోజుల కిందట తెలిసింది. మీకు ఎవరికైనా వివరాలు తెలిస్తే దయచేసి నాకు రాయండి. శ్రమ తీసుకుని నాకు కాపీ పంపగలగితే, పూర్తి ఖర్చులు నేను పెట్టుకుంటాను. ఇంకా ఋణపడి వుంటాను కూడా. ధన్యవాదాలు.

http://pustakam.net/?p=342

http://www.thulika.net

- మాలతి

జనవరి 10, 2009

మీబాసలోనే

ప్రచురించిన వర్గము ఊసుపోక, సాహిత్యం — మాలతి @ 9:17 అపరాహ్నం
Tags: ,

(ఎన్నెమ్మ కతలు 28 )

ఈసారి ఊసుపోక టపా రాయడం మీవంతు.

నిన్నట్నించీ ఎక్కళ్లేని దిగులూ ముంచుకొస్తోంది నాకు. హఠాత్తుగా తెలుగుభాష తీరుతెన్నుల గూర్చిన యావ నన్ను కలవరపెడుతోంది. నిన్న చదువు.వర్డ్ ప్రెస్.కామ్‌లో రవిగారితో నాముచ్చట్లు, ఇవాళ మరో బ్లాగులో అచ్చుతప్పులు,

(ఇంకా…)

డిసెంబరు 22, 2008

ఊసుపోక – “కలం బలం” అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?

ప్రచురించిన వర్గము ఊసుపోక, వ్యాసాలు, సాహిత్యం — మాలతి @ 6:08 పూర్వాహ్నం
Tags: , ,

(ఎన్నెమ్ కతలు 25)

 

 నాచిన్నప్పుడు స్కూళ్లలో వక్తృత్వపోటీలకి కలం బలమా - కత్తి బలమా అన్న విషయం తరుచూ తీసుకునేవారు. విద్యార్థులు అమాయకత్వంచేతా, పంతులిగారి కటాక్షం ఆశించీ కలం బలం అన్నవాదనకే ఎక్కువగా మొగ్గు చూపేవారు. (ఇంకా…)

డిసెంబరు 10, 2008

రచయితలు పాత్రల్ని ఎందుకు చంపుతారు?

ప్రచురించిన వర్గము వ్యాసాలు, సాహిత్యం — మాలతి @ 9:42 అపరాహ్నం
Tags: ,

 

 

కథల్లో చావుగురించి చాలాకాలంగా రాయాలనుకుంటున్నాను. నాకు మొదటిసారిగా ఈ ఆలోచన వచ్చింది తెలుగు రచయిత్రులమీద నేను పుస్తకం రాయడంకోసం కథలూ, నవలలూ చదువుతున్నప్పుడు. ఆరోజుల్లోనే నాకథల్లో ఎంతమందిని హత్య చేశానో కూడా చూసుకున్నాను. అదృష్టవశాత్తు అట్టే లేవు. ప్రధానపాత్రలే చనిపోయినవి మూడు కథలు. 

నేను 2002లో తురగా జానకీరాణిగారిని కలిసినప్పుడు, మాటలసందర్భంలో, ఒక పేరుగల రచయిత్రి సుబ్బయ్య చచ్చిపోయాడు అంటూ మొదలుపెట్టారు. చచ్చిపోయింతరవాత కథ ఏముంటుంది? కథ అలా మొదలపెట్టకూడదు, అన్నారావిడ..

నేను అప్పుడు ఆవిడతో వాదించలేదు కానీ తరవాత ఆలోచిస్తే మానవసమాజంలో చావు కథకి ముగింపు మాత్రమే కానక్కరలేదు అనిపించింది. ఒకరోజు నేను ఇల్లిందల సరస్వతీదేవిగారి సంకలనం చూస్తుంటే ఒక కథ కనిపించింది రంగయ్య చచ్చిపోయాడు అన్నవాక్యంతో కథ మొదలవుతుంది. ఒకకుంటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినతరవాత, ఆస్తికోసం కుటుంబంలో వచ్చే కలహాల మీద కథ అది. అంటే ఆ చావు జరిగితేనే ఆకథ నడుస్తుంది. లేకపోతే కథ లేదు.

అలాగే కాళీపట్నం రామారావుగారు రాసిన చావు కథలో ఒక కటికదరిద్రుల కుటుంబంలో ఓ ముసలమ్మ చనిపోతే, శవాన్ని తగలపెట్టడానికి కట్టెలకోసం పడే అవస్థలు. అంటే మళ్లీ ఇక్కడ కూడా చావు లేకపోతే కథ లేదు.

బండి నారాయణస్వామి కథ సావుకూడు, పురాణం సూర్యప్రకాశరావు కథ కాకులు కూడా ఒక మనిషి పోయినతరవాత జరిగే, జరపవలసిన కర్మకాండ.

ఒకొకపుడు కథల్లో చావు ప్రధానాంశం కాకపోయినా, ముఖ్యభాగం కావచ్చు.

నాకథలు మంచుదెబ్బలో వకుళ, నవ్వరాదులో కమలిని చనిపోతారు. ఈపాత్రలని ఎందుకు చంపేను అంటే నిర్దుష్టంగా ఇదీ కారణం అని చెప్పలేను కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కారణాలుగా తోచినవి చెప్తాను.

మంచుదెబ్బ కథలో ప్రధానపాత్రకి ఆధారమయిన అమ్మాయి నిజజీవితంలో చనిపోలేదు. ఆతరవాత బిడ్డతల్లి అయిందని కూడా విన్నాను.  ఆవిషయంమీద కూడా ఆమెని కించపరచే భాషణలు కొన్ని విన్నాను. నిజంగా ఏంజరిగిందో నాకు తెలీదు. కేవలం పుకార్లు ఆధారంగా ఒక మనిషిని కించపరచడం నాకు ఇష్టం లేకపోయింది. అది ఒక కారణం కావచ్చు.  నేను సృష్టించిన పాత్రమీద నాకు కలిగిన గౌరవం, అభిమానం కావచ్చు. పోతే, వరసగా కొన్ని సంఘటనలలో నిస్సారమయిన జీవితాన్ని చూపించిన తరవాత కథ ఎలా ముగించడం? ఆపాత్ర గడుపుతున్న జీవితం దృష్ట్యా చూస్తే ఆమె జీవచ్ఛవం. బతికున్నా చచ్చినమనిషితో సమానం. ఇక్కడ చావు ఒక ముగింపుగా చూపడం ఒక ప్రతీకగా మాత్రమే అని చెప్పుకోవాలి. దాన్ని సాంఘికప్రయోజనంకథ చెయ్యాలంటే, వకుళ భర్త తన తప్పుని గ్రహించి, ఆ అమ్మాయికి విడాకులిచ్చి, ఇంకా కావాలంటే తనే మరో పెళ్లి కూడా చేయించేయొచ్చు. సుమారుగా అదే అర్థం వచ్చే కథ ఒకటి నేను ఈమధ్యనే చదివేను. అందులో నాకు తోచిన లోపం ఏమిటంటే వకుళపాత్రలాటి పాత్రని వ్యక్తిగా గౌరవించి ఆమె అభిప్రాయం అడక్కపోవడం. సంఘసంస్కరణపేరుతో సంస్కర్తే నిర్ణయాలు చేసేయడం. ఇంతకీ నాకథలో అలా చెయ్యకపోవడానికి కారణం 60వ దశకంలో అది వాస్తవం కాదు నేను చూసిన ప్రపంచంలో.

నవ్వరాదు కథలోనూ అంతే. కమలిని తాను అందర్నీ నవ్వించడమే కానీ తనని నవ్వించేవాళ్లు ఎవరూ లేరు అని తెలుసుకున్న తరవాత కథ ఎలా నడపడం? ఎంతదూరం నడపగలం? ఎంత రాసినా అదే సందేశం. అలాటి సంఘటనలే మళ్లీ మళ్లీ రాయాలి. వకుళ లాగే, కమలిని కూడా బతికున్నా చచ్చినవారితో సమానం. మరో కారణం ఆపాత్రసృష్టికి ఆధారమయిన వ్యక్తి నిజజీవితంలో చనిపోవడం. అంచేతే ఆముగింపు ఇవ్వడం జరిగింది అనుకుంటాను. రెడీమేడ్ జవాబు వుండడంచేత నేను ఎక్కువగా ఆలోచించలేదేమో.

మరొక కోణం ఏమిటంటే ఆరోజుల్లోఅంటే 50, 60 దశకాల్లో చాలా కథల్లో చావు కనిపిస్తుంది. ఒకొకప్పుడు అనవసరంగానే. ఆనాటికీ ఈనాటికీ కాలగతిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. సంఘంలో, స్త్రీచైతన్యంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ మార్పు కథలని తీర్చి దిద్దడంలో,  ముగింపులు ఇవ్వడంలో కూడా కనిపిస్తుంది.

సుజాత (మనసులోమాట) రాసిన నీలమ్మకథ చూడండి. అదే కథ మాకాలంలో (50, 60 దశకంలో) రాసివుంటే, నీలమ్మ ఆత్మహత్య చేసుకున్నట్టు  ముగించే అవకాశాలే ఎక్కువ. ఈనాడు నీలమ్మ తాను బతికి వుండి, తనపిల్లలికి ఒక మార్గం కల్పించడానికి నిర్ణయించుకున్నట్టు చూపించడం జరిగింది. అలా చిత్రించడంలో సంఘాన్ని ధిక్కరించగల మనోదారుఢ్యం ఆపాత్రకి కల్పించడం జరిగింది. దాన్ని నైతికపతనం అనను నేను. ఆవిధమయిన నిర్ణయం తీసుకోడానికి తగిన వాతావరణం కూడా ఈనాడు వుంది. ముఖ్యంగా ఈరోజుల్లో స్వేచ్ఛపేరుతో పదవీవ్యామోహాలతో హైక్లాస్ జనాల్లో  జరుగుతున్న నాటకాలు చూస్తే, వాళ్లకంటే నీలమ్మే నయం అనిపిస్తుంది.

ఒకొకపుడు చావే ప్రధానఘట్టం కాకపోయినా, కథలో ఒక ముఖ్యమయిన సంఘటన అవుతుంది. అంటే ఆ పాత్ర చనిపోతే కథ ఓ దారిలో నడుస్తుంది. చనిపోకపోతే మరోరకంగా నడుస్తుంది అన్నమాట.

శివుడాజ్ఞ కథ చూడండి. చావు ఒక ముగింపుగా రాద్దాం అన్న ఆలోచన నాకు మొదటినుండీ వుంది. మీరేం అంటారో చూద్దాం అని మిమ్మల్ని అడిగేను. 

చదువరి అత్తయ్యగారి మరణం సూచించినా, అది శాడిస్టిక్గా వుంటుందేమో అని సందేహం కూడా వెలిబుచ్చారు వెంటనే. దారిలో కారుప్రమాదం జరిగి సుమన అత్తయ్యగారిని చూడడం పడకపోయివుండొచ్చు అని ఒక పాఠకురాలు సూచించారు. ఇది నామొదటి కథకి అనుగుణంగా వుంది. ఒక సన్నివేశం - కథలో సుమన అత్తయ్యగారల సమావేశం - జరగకపోవడానికి కారణాలు అనేకం. అమెరికాలో ప్రమాదాలు సర్వసాధారణం.

 శివుడాజ్ఞ కథ రెండోకథలో అత్తయ్యగారు చనిపోయినట్టే రాసి తెలుగుజ్యోతిలో ప్రచురణకోసం, సంపాదకవర్గంలో ఒకరైన వైదేహికి పంపించేను.

తను వెంటనే ఫోను చేసి, అదేంటండీ అత్తయ్యగార్ని అలా చేసారు. చదవగానే కొంచెం బాధేసింది” అంది.

ఆపైన ఇంకో కారణం కూడా చెప్పింది. అత్తయ్యగారు ఇంకా వున్నట్టే చూపిస్తే, ఆవిడతో ఇంకా చాలా కథలు రాయొచ్చు కదా. ఇప్పుడే ముగించేస్తే తరవాతేం చేస్తారు? అంది.

నేను సీరీస్ రాయాలనుకోడంలేదు. ఒకవేళ రాయాలనుకుంటే, సుమన గతాన్ని నెమరు వేసుకుంటున్నట్టు ఫ్లాష్బాక్లో రాయొచ్చు కదా అన్నాను.

అవుననుకోండి. అయినా నాకు బాధేసింది,అంది వైదేహి.

 పై సమాధానం ఇచ్చానే కానీ నాకు ఒక అభిమాన పాఠకురాలిని నొప్పించడం ఇష్టం లేకపోయింది. అంచేత అత్తయ్యగారిని ఆస్పత్రిలో పెట్టేశాను. కర్ర విరక్కుండా, పాము చావకుండా.

నాలుగురోజులతరవాత మళ్లీ మాటాడుకుంటున్నాం. వైదేహి మాటలసందర్భంలో మా చిన్న మేనత్త చాలా బాగా కధలు చెప్పేవారు, ముఖ్యంగా కాశీమజిలీలు, బొమ్మలు చెప్పిన కధలూ. ఆవిడ ప్రతి చిన్న విషయాన్ని వివరంగా వర్ణిస్తూ,కధలో కధ ,కధలో కధ గా ఎన్నో కధలు చెప్పేవారు. మేం పిల్లలందరం చెవులు రిక్కించుకుని కదలకుండా బొమ్మల్లాగా వినేవాళ్ళం” అంటూ ఒక్క క్షణం ఆగింది.

అందుకే నీకు అత్తయ్యగారంటే అంత ఇష్టం అయింది,అన్నాను నేను.

ఓ, కావచ్చుఅంది తను.

కథల అత్తయ్యగారి పాత్రద్వారా Unconsciousగానే కావచ్చు తనకి ఆ మేనత్త తాలూకూ జ్ఞాపకాలు  మనసులో మెదిలేయి. అంచేత నాకథలో పాత్ర తనకి ప్రేమపాత్రురాలయింది. సాధారణంగా పాఠకులు పాత్రలకి చేరువ కావడం, పాత్రలమీద అభిమానాలు పెంచుకోడం, ఇలాగే కదా జరుగుతుంది.

ఇహ పోతే, నేను ఎందుకు అత్తయ్యగారు చనిపోయినట్టు చూపాలనుకున్నానో కూడా సూక్ష్మంగా చెప్తాను. మానవనైజం ఒకటుంది. కథలు చదువుతున్నప్పుడు పాఠకులస్పందన ఏస్థాయిలో వుంటుందన్నది సంఘటనని బట్టి వుంటుంది. సంఘటన ఎంత బలంగా వుంటే, ముద్ర అంత బలంగా పడుతుంది. అందుకే సినిమాల్లో, టీవీలో హింస పెరిగిపోతోంది. ప్రతి డైరెక్టరూ మరింత భయానకంగా, మరింత భీభత్సంగా సీనులు సృష్టిస్తున్నారు.

ఒక పాత్ర చావు కూడా అలాటిదే. కేవలం చర్చకోసమే అనుకోండి. రెండో శివుడాజ్ఞకథలో ఇద్దరూ కలుసుకున్నారు, సంతోషంగా ఆపూట గడిపేశారు అంటే బాగానే వుంటుంది. మరో వ్యాఖ్యాతని తృప్తి పరచడానికి అత్తయ్యగారు సుమనని నొప్పించే ప్రశ్నలేవీ అడగలేదని కూడా రాయగలను. కానీ నాదృష్టిలో అది కథ కాదు. వెబ్లాగ్ అవుతుంది. పాఠకులని చావు కదిలించినట్టు అది కదిలించదు. అందులో కథ అయిపోయింతరవాత పాఠకులని కదిలించే గుణం, పట్టుకు వదలని గుణం వుండదు.

నాకథలో సుమనా, అత్తయ్యగారూ పదే పదే కలుసుకునే పరిస్థితులు లేవు. జీవితంలో కొన్ని సంఘటనలు ఒకసారి మాత్రమే జరుగుతాయి. ఒకవేళ అత్తయ్యగారు గ్రీన్ కార్డు తెచ్చుకుని అమెరికాలో స్థిరపడిపోయినా, దరిమిలా ఇక్కడి నాగరీకానికి కూడా ఆవిడ అలవాటు పడిపోతారు. మరోరకంగా వారిద్దరిమధ్యా  అభిమానాలు తిరిగీ మొదలవొచ్చు కానీ అచ్చంగా అలనాటి ఆప్యాయతలు పునరుద్ధరింపబడడం జరగదు. ఆనాటి స్నేహం శాశ్వతంగా ముగిసిపోయింది అత్తయ్యగారి మరణంతో అని చెప్పడం నాఅభిప్రాయం.

చావు ఒక ముగింపు అన్న విషయానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా మరోవిషయం కూడా చెప్పాలి.   

నేను కథ ఎందుకు రాస్తానంటే రెండు కారణాలు. మొదటిది - అందరికీ తెలిసినవిషయమే అయినా చాలామంది పట్టించుకోనిది పాఠకులదృష్టికి మరోసారి తీసుకురావాలి అనుకున్నప్పుడు.

రెండోది - ఒక కొత్త కోణం ఆవిష్కరించాలనుకున్నప్పుడు. అంటే, ఈనాటి మనస్తతత్త్వాల దృష్ట్యా ఒక విషయం ఎవరూ గమనించడంలేదు అని అనిపించినప్పుడు.

ఉదాహరణకి, ఈనాటి నాగరీకతలో మ నం మాటాడుకునే తీరులో చాలా గొప్ప మార్పు వచ్చింది. ఎవరు ఏం మాటాడాలో ఎలా మాటాడాలో టీవీగురువులు చెప్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంటు పుస్తకాలు నేర్పుతున్నాయి.

రెండు తరాలకి ముందులాగ, అమాయకంగా, నిష్కల్మషంగా మనసు విప్పి మాటాడుకోడం తగ్గిపోతోంది. కానీ ఇంకా అక్కడా అక్కడా అలాటివారు వున్నారు. వారు తమకి తోచిన విషయాలు తమకి తెలిసిన భాషలో మాటాడతారు. వాళ్ల ప్రపంచం చిన్నదే కావచ్చు. వారి భాష నవనాగరీకం కాకపోవచ్చు. అంతమాత్రంచేత వాళ్లని పరమదుర్మార్గులనో మూర్ఖులనో అనుకోడం న్యాయం కాదు అని చెప్పాలనిపించినప్పుడు రాస్తాను.

నాకథలో జరిగింది అదే.  సుమన అది అర్థం చేసుకుంది అని చెప్పాను అత్తయ్యగారు రాసివుండగల ఉత్తరం తనే రాయడం ద్వారా.

 

 

(డిసెంబరు 2008.) 

నవంబరు 2, 2008

Telugu Women Writers, 1950-1975 పై సమీక్షలు 2

ప్రచురించిన వర్గము పుస్తకాలు, సాహిత్యం — మాలతి @ 10:37 అపరాహ్నం
Tags: , ,

 

 నాపుస్తకం, Telugu Women Writers, 1950-1975: A Unique Phenomenon in the History of Telugu Fiction మీద సమీక్షలు రెండు:

1. ఈమాట.కామ్ లో వేలూరి వెంకటేశ్వరరావు -

http://www.eemaata.com/em/issues/200811/1369.html

2. museindia.comలో అంబికా అనంత్ -

http://www.museindia.com/showcurrent12.asp?id=1181

అక్టోబర్ 28, 2008

Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India by Peter L. Schmitthenner

ప్రచురించిన వర్గము పుస్తకాలు, వ్యాసాలు, సాహిత్యం — మాలతి @ 2:33 పూర్వాహ్నం
Tags: , ,

 

మామూలుగా ఇంగ్లీషు పుస్తకాలు చదవడం తక్కువ. అందులో కథాసాహిత్యం కానివి మరీ తక్కువ. కానీ ఈపుస్తకం నాదృష్టిని ఆకట్టుకోడానికి కారణం తరవాత చెప్తాను.

19వ శతాబ్దంలో బ్రిటిష్ పండితులు తెలుగుభాష నేర్చుకోడానికి కారణాలు మతప్రచారమూ, పాలనాదక్షత పటిష్ఠం చేసుకోడంకోసం అని అందరికీ తెలిసినదే.

ఆనాటి పాశ్చాత్యపండితులలో ఘనత వహించినవాడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను. బ్రౌనుకీ ఆనాటి ఇతర పాశ్చాత్యపండితులకీ (ఓరియంటలిస్టులు) తేడా బ్రౌను ప్రజలతో మాటాడడానికి వాడుకభాష నేర్చుకోవడంఅవసరం అని గుర్తించడం.

రచయిత పీటర్ ష్మిట్‌హెనర్ బ్రౌన్ జీవితంలో బాల్యంనుండీ చివరివరకూ సంఘటనలు వరుసక్రమంలో తీసుకుని ఆయనని ప్రభావితం చేసిన వ్యక్తులూ, సంఘటనలూ విశ్లేషించాడు ఈపుస్తకంలో. తెలుగుభాష ప్రాచుర్యానికి మాత్రమే కాక, తెలుగువారి సంస్కృతిని అర్థం చేసుకోడానికి బ్రౌను పడిన ఆరాటం, ఆతపనలో ఆయన ఎదుర్కొన్న దుర్ఘటనలూ, సాటి ఓరియంటలిస్టులతో స్నేహాలూ, వైరాలూ, అపోహలూ, ఉద్యోగానికి సంబంధించిన విధులు నిర్లక్ష్యం చెయడం, తన్మూలంగా ఆర్థిక ఇబ్బందులకు లోను కావడం వంటి ఎన్నో విషయాలను సూక్ష్మంగా పరిశీలించి, ఆవిష్కిరించాడు ఈపుస్తకంలో.

ఆరోజుల్లో ఎవరు తెలుగు నేర్చుకోవాలన్నా బ్రాహ్మణ పండితులు ప్రబంధాలతో మొదలుపెట్టేవారట. బ్రౌను ఆచదువు నిత్యజీవితంలో ఉపయోగపడదని గ్రహించి, తనకు తానే స్వయంకృషితో తెలుగు నేర్చుకున్నాడు. తనకి ఉపయోగపడేభాష వేమనపద్యాలలాటి మౌఖికసాహిత్యంలో వుందని గ్రహించి, వేమనపద్యాలు నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆవిధంగా వాడుకభాషకి సాహిత్యస్థాయి కల్పించడానికి బ్రౌను దోహదం చేశాడని చెప్పొచ్చు. ఆసందర్భంలోనే వాడుకభాషకి వ్యాకరణం కూడా రచించడం మొదలుపెట్టేడు. ఆదిని ఆయన ఆపుస్తకం ఉద్దశించింది తెలుగు నేర్చుకోదలచిన పాశ్చాత్యులకోసమే. 

ఓరియంటలిస్టులూ, వారి అధ్వర్యంలో తెలుగుపండితులూ తయారు చేసిన అనువాదాలూ, తెలుగు పుస్తకాలూ కూడా నిత్యజీవితంలో సామాన్యజనులకి అర్థంకాని గ్రాంథికంలో వుండడం బ్రౌను స్వయంగా తెలుగు నేర్చుకోడానికి నిశ్చయించుకున్నాడు. అనువాదం అంటే మాటకి మాట అర్థం రాయడం కాదు, ఆజాతి సంస్కృతీ, జీవనసరళీ క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి అని బ్రౌను గ్రహించి, పాలకుడుగా కాక స్నేహితుడుగా, ఆప్తమిత్రుడుగా స్థిరపడడానికి కృషి చేసేడు అంటాడు పీటర్. “In 1825, I found Telugu literature dead. In thirty years I raised it to life” అని ఆయన గట్టిగా నమ్మి, తెలుగుసాహిత్యాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నాడు.

గ్రాంథికభాష వాడే పండితులని నిరసించిన బ్రౌను వారిలాగే వ్యావహారికభాషవిషయంలో అక్షరదోషాలూ, వ్యాకరణదోషాలగురించి  అంత పట్టుదలా చూపడం చూస్తే నాకు నవ్వొచ్చింది. బ్రౌను కూడా మరొకరకమైన బ్రాహ్మణీకం స్వీకరించినట్టు అనిపిస్తుంది.

బ్రౌన్ మొదట చేసిన పని వాడుకభాషకి వ్యాకరణసూత్రాలు రాయడం. ఆయన చదివిన, వాడుకభాషలో రాసిన మొదటి పుస్తకం ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీయాత్ర చరిత్ర కావచ్చునట. కానీ బ్రౌన్కి ఆపుస్తకంలో నచ్చనివిషయం రచయిత వీరాస్వామి విరివిగా ఇంగ్లీషూ, తమిళపదాలు విరివిగా వాడడం. బ్రౌన్కి భాషాసంకరం సమ్మతం కాదు. తెలుగువాళ్లు మంచితెలుగు రాయాలని బ్రౌను చాలా పాటుపడ్డట్టు కనిపిస్తుంది.

ఆయన తెలుగుని పరిశుద్ధం చేసి [purify], ఒక క్రమపద్ధతిలో తెలుగుభాషని తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నాలలో శాశ్వతంగా స్థిరపడిపోయినవి - ప్రింటులో ని తొలగించడం, రకారం ‘L’ లాగ రాయడం అంటాడు పీటర్.

 బ్రౌను తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, తరవాత ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు ప్రాచుర్యంలో వున్నగ్రంథాలు. తెలుగు వ్యాకరణం, అనేక ప్రతులు సేకరించి, సమీకరించి, పరిష్కరించి ప్రచురించిన వేమన పద్యాలు. కనీసం యూనివర్సిటీలలో కొందరు తెలుగు సాహితీవేత్తల గమనికలో నిలిచిన పుస్తకాలు, ఇవి కాక, ఇంకా తాతాచార్ల కథలు వంటివి ఎన్నో సేకరించి, ఇంగ్లీషులోకి అనువదించేడు.

అయితే, చాలామంది తెలుగువారిదృష్టికి రాని విషయాలు - అసలు తెలుగువారంటే, తెలుగుభాష అంటే బ్రౌన్‌కి అంత ఆసక్తి ఎందుకు కలిగింది, ఆయన క్రైస్తవవిశ్వాసాలకీ తెలుగుసాహిత్యానికీ మధ్య ఏర్పడిన అవినాభవసంబంధం ఎలాటిది, సామూహికంగా, భాష ప్రాతిపదికగా తెలుగువారు ఒక ప్రత్యేక జాతిగా చైతన్యం పొందడంలో బ్రౌన్ పాత్ర ఏమిటి, ఆయనకి తెలుగువారంటే వున్న అభిప్రాయాలేమిటి, కాలక్రమంలో ఆ అభిఫ్రాయాలు ఎలాటి మార్పులు చెందేయి, ఆయన సమకూర్చిన నిఘంటువులకీ, పరిష్కరించి ప్రచురించిన పుస్తకాలకీ వెనక ఆయన పడిన శ్రమ, ఆక్రమంలో ఆయన విషయసేకరణకి చేస్తున్న కాలంలో రూపొందిన అభిప్రాయలూ.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అనేకం పీటర్ నిశితంగా పరిశీలించి గ్రంథస్థం చేసేడు ఈపుస్తకంలో. బ్రౌన్ పండితుడుగానే కాక, ఉప్పూ పులుసూ తినే మామూలుమనిషిగా కూడా దర్శనమిస్తాడు ఈపుస్తకంలో. తనకి తెలుగు పాఠాలు చెప్పిన బ్రాహ్మణపండితులు సాంప్రదాయాలను వదలలేక, ఒకొకప్పుడు కొన్ని విషయాలు గుప్తంగా దాచుకున్నారు అంటాడు. అలాగే పుస్తకాలు ఎరువు అడిగితే కూడా తెలుగువారు ఇవ్వడానకి ఇష్టపడరు అంటాడు. అలాటప్పుడు ఆయన తెలుగులో మర్యాదగా మాటాడితే సంతోషించి తమ పుస్తకాలు ఇచ్చేవారట.

బ్రౌన్ నిర్విరామ కృషిలో చెప్పుకోదగ్గ మరొక విశేషం ఆయన ఎప్పుడూ ఒక ఎడిషన్‌తో తృప్తి పడకపోవడం. ప్రతి పుస్తకం ప్రచురింపబడినతరవాత కూడా మళ్లీ సంస్కరిస్తూనే వుండేవాడట. 

మరొక తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు సమకూర్చిన జె.పి.యల్. గ్విన్ ఆపుస్తకానికి పరిచయవాక్యాలు రాస్తూ, మామూలుగా  బ్రౌనుగురించి ప్రాచుర్యంలో వున్న పరస్పరభిన్నమయిన రెండు అభిప్రాయాలనూ (అద్వితీయమైన సేవ చేసిన ఘనుడని కొందరు పొగిడితే, కేవలం పాశ్చాత్యులకి సర్వసాధారణమైన కపటదృష్టితో చేసాడని మరికొందరు తెగడడం) పీటర్ సాకల్యంగా పరిశీలించి ఆవాదనల వెనక గల కారణాలూ, అవి ఏర్పడడానికి తోడ్పడిన పరిస్థితులనీ సమగ్రంగా చర్చించాడు అని మెచ్చుకున్నారు. ఆమాటల్లో ఎంతో నిజం వుందనిపించింది నాకు పుస్తకం చదివిన తరవాత.

నామాటగా - ఇటీవల గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న తెలుగుభాషని గురించిన చర్చలు చూస్తే, ఒకవిధంగా ఆనాటి వ్యవస్థే మళ్లీ ఇప్పుడు ఉందా అనిపిస్తోంది.  ఈమధ్య బ్లాగుల్లోనూ పత్రికలలోనూ తెలుగుని పునరుద్ధరించాలన్న ఆవేశం కనిపిస్తోంది. క్షీణిస్తోంది అనుకుంటేనే కదా పునరుధ్ధరించాలి అనే వాదం తలెత్తేది. కొందరు తెలుగుభాషయందు తమకు గల అభిమానంతో తెలుగులో రాయాలనీ, తెలుగుకథలు చదవాలనీ మాటాడాలనీ విశేషమైన ఆసక్తి చూపుతుంటే, మరికొందరు మాకు తెలుగురాదని దాదాపు ఆనందించే స్థితిలో వున్నట్టు వున్నారు. ఇది ఒక కారణం నేను ఇప్పుడు ఈపుస్తకం పరిచయం చెయ్యడానికి.

రెండోకారణం - ఈపుస్తకం నాకు ఆప్యాయంగా పంపిన పీటర్ యల్. ష్మిట్‌హెనర్ మావూళ్లోనే (మాడిసన్, విస్కాన్సిన్) హిస్టరీ ప్రొఫసర్, బాబ్ ఫ్రికెన్‌బర్గ్‌ ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేశాడు. ప్రస్తుతం వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్‌టిట్యూట్, చరిత్రవిభాగం ఛైర్‌గా పని చేస్తున్నాడు. పీటర్‌కి తెలుగుపాఠాలు చెప్పిన గురువులలో నేను కూడా వున్నాను. పీటర్ తన ముందుమాటలో ఈవిషయం పేర్కొనడం నాకు సంతోషంగా వుంది J.

పుస్తకానికి సంబంధించిన వివరాలుః

Author: Peter L. Schmitthenner

Title: Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India.

324 pages.

Rs. 600.00

Publisher & distributor:

Manohar Publishers and Distributors

4753/23 Ansari Road, Daryaganj

New Delhi 11002

 

(మాలతి.ని. అక్టోబరు 2008.)

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.