Feed on
టపాలు
వ్యాఖ్యలు

పాఠకుల అభిప్రాయాలు

పాఠకులకీ రచయితలకీ మధ్యగల అవినాభావసంబంధం
ఈరోజుల్లో వస్తున్న విమర్సలూ అభిప్రాయాలమీద నా అభిప్రాయం ఏమిటని నిన్న ఓస్నేహితురాలు అడిగారు. కథలకీ బ్లాగులకీ తేడా వున్నా, ఈవ్యాసం ఇక్కడ కూడా వర్తిస్తుందన్న అభిప్రాయంతో ఇక్కడ పెడుతున్నాను. మీరేం అంటారో చెప్పండి.

ఊసుపోక - ఏపేరెట్టి పిల్చినా …
(ఎన్నం కతలు 6)

రోజు విరజిమ్మునవే పరిమళములు అన్నాడు ఇంగ్లీషుకవి. కాని పేరులు వేరులయినప్పుడు రాగల తికమకలు ఆయన గుర్తించినట్టులేదు.
నాలుగురోజులకిందట సాటిబ్లాగరులలో ఒకరు పొరపాటున నాపేరు రవంత సవరిస్తేనూ మరొకరు అది గమనిస్తేనూ, నాకు కొన్ని పాత సంగతులూ, మరికొన్ని కొత్త ఆలోచనలూ తగిలేయి.

అందులో మొదటిది అమెరికాలో అడుగెట్టగానే తెల్లవారినాలుకలమీద మాఅమ్మా నాన్నగారు బారసాలనాడు పెట్టినపేరు పొందగల రూపాంతరాలు - మానికా, మెలనీ, మేరీ, మలాతీ, మరతీ, మెలథై — ఇలా నాపేరుని నానావిధాలా పచ్చడి చేస్తూంటే నేను అన్నివిధాలుగానూ వారికి సరైన ఉచ్చారణ చెప్పడానికి తంటాలు పడ్డాను. నువ్వు బోలెడు కారం తింటావు కనక నీకు నాలుక తిరుగుతుంది అందొకావిడ ఆఖరికి. ఇంగ్లీషులో పేర్లు చూడండి - మెలనీ, డోరతీ, మెరీనా, — ద్విత్వాక్షరాలు లేనిపేర్లు బోలెడు. ఉచ్చారణరీత్యా వాటిలో నాపేరుకీ వాటికీ పెద్ద తేడా కనిపించదు. అయినా నాపేరేదో అవాచ్యం అన్నట్టు చూస్తారు వీళ్లు.

ఇహ పోతే. ఇతరత్రా కలిగిన అనుభవాలు. అమెరికనులకి నాపేరు చెప్పుకోడానికి అక్షరాలా టాఠాలు గుణించాలి.. మొదట మన తెలుగుపేర్లు వినగానే వాళ్లు అయోమయంలో పడతారు అసలు అర్థం అయిందో లేదో, చెప్పొచ్చో చెప్పకూడదో నిర్ణయించుకోలేక. ఆతరవాత స్పెల్లింగడుగుతారు.
ఈభాగం అమెరికాలో వున్నవారికి అనుభవమే కనక, దాటెయ్యొచ్చు.
మాలతి అని చెప్తాను కదా. మానికా? అంటారు. కాదంటాను. ఎలా స్పెల్చేస్తావు అని అడుగుతారు మర్యాదాగానే.
నాగుణించడం వరసః
నేను m as in mother అంటూ మొదలెడతాను.
a as in adam
l as in love
as in adam
t as in tom
h…
ఇక్కడ తొలితంటా మొదలవుతుంది. మనం హెచ్ అంటాం, వీళ్లు ఎచ్ అంటారు. పైగా ఈగుణింతాలు అలవాటు లేకపోవడంచేత కూడా నాకు ఎచ్ తరవాత ఏం చెప్పాలో చప్పున తట్టదు.
నేను ఆగడం చూసి అవతలిమనిషి ఎదురుగా వుంటే, అర్థం అయిపోయిందంటారు. ఫోనులో అయితే, నేన్చప్తానంటూ మొదలెడతారు.
m as in mother
o as in opal
n as in nancy

నేను, నో, నో, నో, నో … అంటూ అడ్డుపడతాను. ఏమయి వుంటుందంటే, నేను మాలతికి గుణింతాలు చెబుతుంటే, ఆవిడకి మొదట వినిపించిన మానికాయే గుర్తుండి వుంటుంది. నామాట వినరో, వినిపించలేదో, వినిపించుకోరో …
అదే లాజిక్కుతో మాలతి అని ఎదురుగా వున్నప్పుడు గుణింతాలన్నీ అయేక, ఐ గాటిట్ అని, ఓకే మాలథై అంటారు. ఇంకా కావలిస్తే ఓకాయితమ్మీద తనమాటకనుగుణంగా malathai అని రాసుకుంటారు.
నేను యూయస్కొచ్చిన కొత్తలో మాలతీరావు గా చలామణీ అయేను. (కనీసం అవడానికి ప్రయత్నించేను). ఆరోజుల్లోనే ఓవెబ్‌ పత్రికకి ″నేనోకథ రాసేను, వేసుకుంటారా″ అని రాసేను. తిరుగుటపాలో ″నువ్వెప్పుడయినా కథలు రాసేవా?″ అన్న ప్రశ్న వచ్చింది.
అప్పుడు నేను చాలా వినయవిధేయతలతో, ″రాసి వున్నాననీ, అప్పట్లో నాపేరు నిడదవోలు మాలతి″ అని చెప్పుకున్నాను.
వెంటనే, ″అయ్యొయ్యో మిమ్మల్ని తెలియకపోవటమేమిటి, …″ అంటూ అమితోత్సాహం చూపించారు ఆయన. అప్పుడు తెలిసింది నాపేరులోనున్న పవరు నాకు.
ఇక్కడ మరో ప్రశ్నకి కూడా జవాబిచ్చేస్తాను. ప్రముఖసాహితీ వేత్త, పండితులూ, సాహిత్యచరిత్రకారులూ అయిన నిడదవోలు వెంకటరావుగారు నాకు ఏమవుతారన్నది. ఈసందర్భంలో నేను విన్న ఒకచిన్నకథ - నేను కథలు రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఆయన్ని ఎవరో అడిగారట, ″ఎవరండీ ఈమాలతి, మీ అమ్మాయా?″ అని. ఆయన, ″ఆఁ, మాఅమ్మాయే″ అన్నారట. ఇది చాలాకాలంతరవాత మరెవరో చెప్పారు నాకు. నన్నెవరూ ఆరోజుల్లో అడగలేదు కాని ఇప్పుడు అడుగుతున్నారు. ఇదుగో నాజవాబు — ఆయనా, మానాన్నగారూ అన్నదమ్ములపిల్లలు. ఆయన్ని కలుసుకునే భాగ్యం కలగలేదు నాకు.

ఇంతకీ, ఆవెబ్‌పత్రికవారు అలా అన్నతరవాత, తెలుగులో ప్రచురించేవి మాలతి నిడదవోలు, అనీ ఇంగ్లీషులో ప్రచురించేవి మాలతీరావు అనీ రాస్తూ వచ్చేను. అలావుండగా, కొండొకరోజున ఒక ఇంగ్లీషుసైటులో నాకథ ఒకటి పడింది. ఆవెంటనే మరో మైలొచ్చింది, ″ఈకథ రాసింది నేను కాదు. నాపేరు ఎవరో వాడేసుకుంటున్నారు. ఇంకమీద ఈపేరుమీద వచ్చినకథలు చదవకండి″ అంటూ.

నాకు కళ్లు తిరిగేయి. ఎవరో మరో మాలతీరావుట, మద్రాసులో వుంటున్న, కాబోయే మహానటిట. నాకథ చదివి ఎవరో ఆపిల్లకి అభినందనలు చెప్పినట్టున్నారు. దానికి జవాబు అది. మీకిప్పుడు తికమకగా వుందా? నేనూ సరిగ్గా అలాటి అయోమయంలో పడిపోయాను. తాను రాయలేదని చెప్పడం ఒకదారి. ఇంకెప్పుడు ఈవిడరాసినవి చదవకండి అంటూ హోల్ మొత్తం పేరుని వెలేయడానికి ఎన్ని గుండెలుండాలి? ఆమాటే ఆసైటువారిని అడిగాను. దానికి వారు జవాబుగా అది సమంజసం కాదని ఒప్పేసుకుని, ఆపిల్ల సభ్యత్వం మాపు చేసేసినట్టు నాకు తెలియజేసారు.

ఎందుకొచ్చిన బాధ అని అప్పట్నుంచీ ఇంగ్లీషులో కూడా మాలతి నిడదవోలు అనే రాయడం మొదలుపెట్టేను. మాలతి అని పలకలేనివాళ్లు నిడదవోలు పలకగలరా అని అడగకండి. ఇప్పుడు నేను ఏదేనా ఫారం నింపితే, అవతలివారు ఆకాయితం అందుకుని, తేరిపారచూస్తున్న సుందరదృశ్యం చూడవలసిందే గాని చెప్పనలవి గాదు.

ఇంకా చెప్పుకోవలసినవిః ″నాపేరు మాలతి, నేను కథలు రాస్తాను″ అనగానే,
″అయ్యో మీరు తెలీకపోవడం ఏమిటి. మీప్రమదావనం కాగితాలు చింపి, పుస్తకంగా కుట్టి, అందమైన అట్టవేసి, ఇప్పటికీ చదువుకుంటుంటాను.″ (నేనుః ఆమాలతిని కాదండీ, ఆవిడ మాలతీచందూర్,).
″అమెరికా మాలతి పేరుతో మీరు రాస్తున్న ఆధ్యాత్మిక వ్యాసాలు … ప్రముఖ పత్రికలో ఎంత బావున్నాయో మాటల్లో చెప్పలేను″ (మళ్లీ, నేనుః ఆమాలతిని కాదండీ.)
″మీకు కేంద్ర సాహిత్య ఎకాడమీ బహుమతి వచ్చిందని ఇప్పుడే చూశాను. నామనఃపూర్వక అభినందనలు అందుకోండి″ (నేనుః ఆ మాలతీరావుని కానండీ).
ఇలా పేరుమూలంగా వచ్చే పాటులు చాలా వున్నాయి కనక మాలతి అనగా నేను మాత్రమే అనుకోలేను, మరియు విప్రపతిపత్తి కూడా సత్యమేనని ఒప్పుకుతీరాలి. (కాన్వర్స్ ఈజ్ ట్రూ). అంటే ఏపేరెట్టి పిలిచినా నేను నేనే.

చివరిమాటగా, రాజేంద్రగారూ, మీపొరపాటు సమర్థనీయమే మాలతి, లలితలలో శబ్దమైత్రి వుంది కనక.
కావలిస్తే ఈమెలికమాట, మాలలితమ్మ, లలితమ్మ, మాలతమ్మ.. ఒక్కగుక్కలో రెండుసార్లు చెప్పండి చూద్దాం. :)).

ఇంకా సరదా వుంటే, మాలతీ హూ చూడండి.

(మార్చి 200 8)

నవ్వరాదు

నవ్వరాదు కథ

జయశ్రీ సంక్రాంతి, 1968, ప్రత్యేకసంచికలో ప్రచురితం.

నాసాహిత్యదృక్పథం

నాజీవనదృక్పథం నాసాహిత్యదృక్పథమే…
–నిడదవోలు మాలతి
(“మీభూమి” వారపత్రిక, హైదరాబాదు, కి సమర్పించినవ్యాసం, మార్పులతో)

నాజీవనదృక్పథం రాయమని మీభూమి వారపత్రికకోసం కేతు విశ్వనాథరెడ్డిగారు అడిగింతరవాత చాలా నేను ఆలోచించవలసివచ్చింది. ఎందుకంటే నేను జీవితంగురించి అంత లోతుగా ఆలోచించను ఆరోగ్యంకాదని. జీవితం సీరియస్‌గా తీసుకోను. చాలా చిన్ననాడే “నేను వేర”న్న అభిప్రాయం నామనసులో స్థిరపడిపోయింది. అంటే హెచ్చుతగ్గులమాట కాదు నేను చెప్తున్నది. నేనెక్కువ అని నేనెప్పుడూ అనుకోలేదు కాని వేరని మాత్రం అనుక్షణం అనిపిస్తుంది. పదిమంది నడిచేదారి పనిగట్టుకు తప్పుకుతిరిగే జాతి నాది.

మేం ఐదుగురం. నానెంబరు నాలుగు. నాకు జ్ఞానం వచ్చిందగ్గర్నించీ (ఆలస్యంగానేలెండి) నేను మాఅమ్మతోపాటే ఎక్కువగా తిరుగుతూండేదాన్ని అంటే, పురాణాలకీ, ఉపన్యాసాలకీను. అంచేతేనేమో కాస్త నిరీహ(నిర్మోహం?)లాటిది అలవాటయి, దేనికోసం గానీ దేవులాట్టం కొరవడింది. కలడు కలడనేవాడు కలడో లేడో గానీ, నాకు మాత్రం ఎవరో నావెనకుండి నన్నాదుకుంటున్నారనిపించిన సందర్భాలనేకం. అది తెచ్చే ధైర్యం మూలాన బీపీ గట్రా రావనీ, నావెనక దేవుడో మరోడో సదా వున్నాడనుకోడం సుఖం అని తెలుసుకున్నాను. దానివల్ల నష్టం లేకపోలేదు. అది పోటీమనస్తత్త్వం బొత్తిగా లేకపోవడం. నాకు ఏంబిషనుందని చాలామంది అంటారు. నాకు మాత్రం కాగడా పెట్టి వెతుక్కున్నా కనిపించలేదు. నాదృష్టిలో అది బతుకుతెరువుకోసం తడుములాడుకోడం అంతే.

మరో సౌఖ్యం నిర్భీతి. ముందు చూసుకోకుండా పూరాగా విచ్చుకున్న కనులతో గోతిలోకి దూకేస్తాను. ఇప్పటికీ తల్చుకుంటే అంత మూర్ఖత్వమేమిటి అనిపించే సంఘటన 1953లో, ప్రత్యేకాంధ్రకోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో. అప్పుడు నాకు పదహారు, ఇప్పటిపిల్లలతో పోలిస్తే ఆరనుకోవచ్చు. విశాఖపట్నంలో మాయింటిముందు కలెక్టరాఫీసు-అరమైలు నిడివిగల రాతికట్టడం. జనాలు ఆబిల్డింగుమీద పడ్డారు. పోలీసులు తుపాకీలతో తయారయేరు వాళ్లని తరిమికొట్టడానికి. నేను మాడాబామీద నిలబడి చూస్తున్నాను. బెదిరి, చెదిరి పారిపోతున్న జనాలు, వారిని బెదరగొడుతున్న పోలీసులూ కనిపించారు కాని నిజంగా ఏం జరుగుతోందో తెలిసింది కాదు. అంచేత నేను నిదానంగా మెట్లు దిగి, గేటు తోసుకుని, మాయింటిముందున్న మట్టిదిబ్బచుట్టుతిరిగి కలెక్టరాఫీసువేపు నడక సాగించాను బీచిలో షికారు కొడుతున్నంత కులాసాగా. కలెక్టరాఫీసు వందగజాలు దూరం వుందనగా, అందరూ నాకెదురొచ్చి నన్ను దాటుకు ఉరకలూ పరుగుల్తో సాగితుండగా. ఓజవాను నన్ను చూసి, “ఏయ్, ఏడకి” అన్నాడు. నేను కలెక్టరాఫీసువేపు చూస్తూ, “ఏంజరుగుతోందో”నని అన్నాను. అతను, “ఫో, ఫో, ఇంటికి పో”, అన్నాడు. “సరే”, అని వెనుదిరిగి వచ్చేసాను.
ఇది నారెండో దుర్వ్యసనం - ఎవరు ఏంచెప్పినా వినడమే. ఏడాదిక్రితం “కోపం” కథ రాసినప్పుడు ఓపాఠకుడు “ఆకాంతంపాత్ర ఏమిటి - కూచోమంటే కూచోడం, నిల్చోమంటే నిల్చోడం, ఆవిడకి ఎన్నేళ్లు?” అని విసుక్కున్నాడు. ఏంచేస్తాం సార్, ఉంటారు అలాటివాళ్లు కూడా. నాజీవితం ఇంచుమించు ముప్పాతిక ముగిసినా రక్తంలో అలనాటి సాంప్రదాయాలు అలాగే స్థిరంగా ఉండిపోయాయి జీడిమరకల్లా. ఎవరేం చెప్పినా వింటానిప్పటికీ చిన్నా, పెద్దా అన్న వివక్షత లేకుండా. మాఅమ్మాయి నన్ను జబ్బ పుచ్చుకు పక్కకి లాగి, మామ్ వుయ్ నీడ్ టు టాక్ అంటే సరేనంటాను కాని వాదనలకి దిగను.

నాచిన్నతనంలో విరివిగా వెలువడిన పత్రికలో పుస్తకాలో చదవడం, వాటిని గురించి ఆలోచిస్తూ డాబామీద కూర్చోడం నాకు అలవడిన మరో దురలవాటు. మాఅమ్మ “ఎందుకలా ఆలోచిస్తూ కూర్చుంటావు, బ్రెయిను చెడిపోతుంది” అంటూ చీవాట్లేసేది కూడాను మా అమ్మ.

పదికథలు చదివితే ఓకథరాయొచ్చు అనిపించింది ఆరోజుల్లోనే. ఎలాగంటే, ఒకకథ చదివినప్పుడు, ఆకథగురించి ఆలోచిస్తాం కదా. ఇప్పుడయితే పాఠకులు గబగబా తమ అభిప్రాయాలు సంపాదకులకి రాసిపారేసి పొంగిపోతున్నారు కాని ఆరోజుల్లో తమలో తాము ఆలోచించుకునే పాఠకులే ఎక్కువ. కనీసం అది నాఅలవాటు. ఉదాహరణకి ఒకకథలో ఒకాయన బుకాయింపుల పుట్ట అనుకోండి. పొట్ట కోస్తే ఒక్కనిజం కనిపించదు. మరి ఆయన అబధ్ధాలు చెప్పకపోతే కథ లేకుండా పోతుందా? నాకథ దేవీపూజ చదివి ఒక యువరచయిత్రి “ఆయన భార్యతో ఉన్నదున్నట్టు స్పష్టంగా చెప్తే తగువు లేకపోను కదా” అన్నారు. అదే నిజమై, ఆభర్త నిత్యసత్యవ్రతుడే అయి సదా సత్యవాక్కులే ప్రవచించుతుంటే ఏమవుతుంది? కథ ఆగిపోతుందా? పోవచ్చు. పోకపోవచ్చు. ఆయన తన నిజాలతో అదేపనిగా వూదర పెట్టేసి మరోకథకి శ్రీకారం చుట్టొచ్చు. ఈకూర బాగులేదు, ఆచీర బాగులేదు, నీతో కంటే మీచెల్లెలితో సినిమాకెళ్లడమే నాకు ఎక్కువ ఇష్టం అంటూ ఏకధారగా కటికసత్యాలు చెప్పేశాడనుకోండి. అపుడు మరో రకం సంఘర్షణ పుడుతుంది. “అలా కాకపోతే ఇలా అవొచ్చు” అన్న ఊహే మలికథకి తొలిమెట్టు.

సరిగ్గా 20 ఏళ్లకిందట 1987లో నేనురాసిన, ఇప్పటికీ నిత్యనూతనంగా సంకలనాల్లోనూ పత్రికలలోనూ (నాప్రమేయం లేకుండానే) పునః పునః ప్రత్యక్షమౌతున్న నాకథ, “నిజానికీ, ఫెమినిజానికీ మధ్య”కథకి కూడా ఇదే ప్రాతిపదిక - పేరుప్రతిష్ఠలకోసం కుహనావిలువల చెక్కభజన. ఆరుద్ర రాసిన “సీతాకోకచిలకలు” రేడియో నాటికలో ఈమనస్తత్త్వం అద్భుతంగా చిత్రించారు, మీకూ గుర్తుండేవుండొచ్చు.

నిజానికి “నిజం చెప్పడం” ఒక వైయక్తిక విలువ. అలా నిజం, నిజం, నిజం, అంటూ సంధి కొట్టినవాడిలా గిలగిల్లాడుతూనే కొంపమీదకి తెచ్చుకున్నాను. చాలామంది సుహృన్మిత్రులు అనుకున్నవారికి నీళ్లధార అయింది ఈకారణంగానే. అంచేత కూడా నాజీవనదృక్పథం ఏమిటో ఎందుకు ఇలా రూపొందిందో నాకే తెలీదు.

ఓహెన్రీ చదివినతరవాత అలాటికథ రాయాలన్న ఉత్సాహం, అప్పట్లో నేను పనిచేస్తున్న లైబ్రరీలో ఒక ఎటెండరు ఒక పాతకాలపు గొలుసు అమ్ముకోడానికి నాదగ్గరకి తీసుకురావడం “ఓగొలుసుకథ”గా రూపు దిద్దుకుంది. నాకెప్పుడూ నగలమీద సరదాలేదు, ఇది కూడా పురాణకాలక్షేపాల ఫలితమే కావచ్చు. ఆరోజు అతను “మీరు తీసుకుంటే బావుంటదమ్మగారూ” అన్నమాట నేను జన్మలో మరవలేను. తనదగ్గర కాకపోతే, తనకి ఆప్తులయిన వారిదగ్గర తనవస్తువు వుంటుందని అతను తృప్తి పడడం చూసి అవాక్కయిపోయాను. అదొక అద్భుతమైన అనుభవం. ఒకరకం మనస్తత్త్వం సూచనప్రాయంగా ఆరోజున విశదమయింది నాకు.

కథల్లో నన్ను ఆకట్టుకునే మరోలక్షణం చమత్కారం. ఈనాడు కొందరు అడిగే ప్రశ్నలు అసందర్భంగా కనిపించేది ఈకారణంగానే. అరిటిపండు చేతిలో పెడితే, ఏపక్కనించి మొదలెట్టాలి, ఇన్స్‌ట్రక్షన్ మాన్యూల్ ఏదీ అని అడిగినట్టు అడిగేపాఠకులకి నేను చెప్పగల సలహా ఏమీలేదు. కధలు గోరుముద్దలు తినిపించినట్టు ఉంటే నాకు కిట్టదు. ఒక సమస్యనో, సందర్భాన్నో తీసుకుని సూచనప్రాయంగా ఓకోణాన్ని ఆవిష్కరిస్తుంది మంచికథ. పాఠకుల మెదడుకి మేత పెడుతుంది. నిజానికి చిన్నకథ ఏసమస్యనైనా సంపూర్ణంగా చర్చించి తాడో పేడో తేల్చేయాలి అనుకోడం ఒకరకంగా అమాయకత్వమే నన్నడిగితే.

దేశంలో వున్నప్పుడు పత్రికలు, పుస్తకాలు నానేస్తాలయితే, అమెరికా వచ్చేక టీవీ, కంప్యూటరూ నాకు ఆప్తమితృలయేయి. ఇక్కడ (మాడిసన్లో) తెలుగువాళ్లు అట్టే మంది లేకపోయినా, వున్నవాళ్లకి నేనంటే ప్రత్యేకాభిమానమే అయినా, వాళ్లకీ నాకూ అంతస్థుల్లో, అభిరుచుల్లో, వ్యాపకాల్లో సహస్రాంతం తేడా వుండడం మూలానా, మొదట్నుంచీ నాది ఒంటెత్తుగుణం అవడం మూలానా, … ఇలా చాలా చాలా మూలాల మూలాన నేను నాగూట్లోనే పడి వుంటానెప్పుడూను. నాకు నేనే నాబెస్టుఫ్రెండునీ, క్రిటికునీ, కాన్పడాంటునీ.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అలాటిరోజుల్లోనే కంప్యూటరుమీద పడి వెబ్‌సైటు తయారు చేయడం నేర్చేసుకున్నాను. దానికి కారణాలుః మొదటిది ఎదురుపడిన ప్రతి అమెరికనూ పదేపదే దంపుళ్లపాటలా అడిగే స్టీరియోటైపు ప్రశ్నలు. మనసంస్కృతి తెలుసుకోవాలనుకునే వారికి కేవలం చీరకట్టు, ఎరుపుబొట్టు, అరేంజిడు మేరేజీలు, కులవ్యవస్థలూ మాత్రమే కాదని తెలియాలంటే వాళ్లు మనకథలు చదవాలి అనిపించింది నాకు. అప్పటికే కొందరు అమెరికన్ స్నేహితులు అలాటి అనువాదాలు వస్తే బాగుంటాయని అన్నారు కూడాను. రెండోది తెలుగుకథలకి అనువాదాలు వస్తూన్నా అమెరికాలో ఇంకా తెలుగు అంటే “నెవర్ హర్డాఫిట్” అనేవాళ్లే ఎక్కువ. అంచేత నాకు అనువాదాలు చెయ్యాలన్న సరదా మొదలైంది. ఆతరవాత వెబ్‌సైటు చెయ్యడం వచ్చింది. రెండూ చేరిస్తే తూలిక వచ్చింది. అయితే, అచిరకాలంలోనే నాసైటు తెలుగువాళ్లని కూడా ఆకర్షిస్తోందని అర్థం అయింది. దానికి కారణం విదేశాల్లో స్థిరపడినవాళ్లకీ, ఇంగ్లీషు అలవాటైయిపోయినవాళ్లకీ రెండిందాలా అనుభవం — కొత్తగా అలవాటైనభాషలో తాము అభిమానించే పాతకథలు చదవగలగడం. ఇక్కడ మరోమాట కూడా చెప్పాలి. నేను ప్రత్యేకించి ఇతరసైటులూ, మీడియాలలో అపురూపం అయిన రచనలకి అంటే 50, 60లనాటి రచనలకీ ప్రాధాన్యం ఇవ్వడం. ఇది మరింత బలాన్నిచ్చింది. మరోకారణం ఇంగ్లీషు మీడియంస్కూళ్లలో చదువుకున్నవాళ్లు తెలుగుమీద అభిమానం వున్నా తెలుగు చదవలేకపోవడం. వారికి తూలిక ఒక మంచి వనరు అయింది.

తూలికకి నేను అనుకోనంత విశేషంగా విశేషమైన ఆదరణ లభించింది. 1950, 60ల నాటి రచయిత్రుల రచనలకి దోహదం చేసిన సాంఘికపరిస్థితులమీద నేను రాసిన వ్యాసానికి తగిలిన హిట్లు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం ఆనందం కూడా కలిగేయి. ఒక ఫ్రొఫెసరు వారి సైటులో మొత్తం వ్యాసం కాపీ పెట్టుకున్నారు. తొలిసారిగా నాకృషికి అర్థం వుందనిపించిన క్షణం అదీ. 2002లో నేను హైదరాబాదు వచ్చినప్పుడు అప్పటికి నాతో ఏమాత్రం పరిచయంలేని వాసా ప్రభావతిగారు పూనుకుని భారీఎత్తున సభలు నిర్వహించినప్పుడూ, విశాఖలో చిరకాలమిత్రులు గణపతిరాజు నరసింహరాజుగారు, సభలు పెట్టినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. మొత్తంమీద అనేకులు అనేకవిధాల ప్రోత్సహించి, తూలిక నడపడం వృథా కాదు, ఒక సత్సంకల్పమే అనిపించేలా చేసారు.

తూలికలో నాతరం రచయితల, ప్రతిఒక్కరి కథ కనీసం ఒకటైనా ప్రచురించాలన్నది నా ఆశయం. అయితే చాలామంది ఎక్కడున్నారో తెలియకపోవడంచేత వాళ్ల కథలు వెయ్యడం జరగలేదు. కాని నాప్రయత్నం నేను చేస్తూనే వున్నాను. ఇంతవరకూ ప్రచురింపబడని రచయితల కథలవివరాలు మీకు తెలిస్తే నాకు పంపండి. తప్పకుండా అనువదించి వేసుకుంటాను.

వ్యక్తిగతంగా తూలికమూలంగా నాకు పడ్డ అక్షింతలు కూడా చెప్పుకోడం న్యాయం. మహారచయిత అయిన కవనశర్మగారు ఒకసారి నాతో అన్నారు, “సొంతంగా రాయగలిగినవాళ్లు అనువాదాలు చెయ్యడం ఎందుకండీ” అని. అప్పుడు నేను కేవలం అనువాదాల రచయిత (?)గా స్థిరపడిపోతున్నానా అన్న అనుమానం వచ్చింది నాకు. దాంతో నేను ఒరిజినల్ కథలు కూడా రాశాను కదా అన్న మీమాంసలో పడి, కొంత రిసెర్చి చేసి, నేను అమెరికా వచ్చిన తరవాత, అంటే 1973-2007 మధ్య, నేను రాసిన ఒరిజినల్ రచనలపట్టిక ఒకటి తయారు చేసుకుని చూసుకున్నాను. ఇది నాపూర్వపు “రైటింగు ఏవరేజి”కి దీటుగానే వుంది. అంటే నావ్యాసంగం ఎప్పుడూ ఒక్కలాగే వుందన్నమాట. అయితే మరి, నారచనలకంటె అనువాదాలకి ఎక్కువ గుర్తింపు రావడానికి కారణం ఏమిటి అంటే పాఠకులే చెప్పాలి. బహుశా నెంబర్స్ గేమ్ కావచ్చు. అనువాదాలు చేసినప్పుడు మరొకరచయిత పేరు కూడా చేరుతుంది కద!

అనువాదాలే కాకుండా,నారచనలవిషయానికొస్తే కూడా ఎవరోఒకరు భుజం తట్టినట్టు అనిపించిన సమయాలు స్వల్పంగానే అయినా లేకుండా పోలేదు. ఒకసారి ఇక్కడ ఒక స్టూడెంటు మరేదో దేశం అబ్బాయికి ఇంగ్లీషు నేర్పుతున్నప్పుడు (ఒక ప్రాజక్టుగా) తను పడ్డ శ్రమగురించి చెప్పింది. ఆఅమ్మాయి మాటతీరు చూసి, కడుప్మండి రాసిన కథ bilingual kid (తెలుగులో ఉభయభాషాప్రవీణ). కడుప్మండినప్పుడు కథలొస్తాయనడానికి ఇదొక నిదర్శనం.

నాకథ ప్రచురించాక ఒకరిద్దరు ఆంధ్రాలో ఇంగ్లీషుమీడియంస్కూళ్లలో తమ అనుభవాలు నాకు రాశారు. దానిమీద Is bilingualism in Andhra Pradesh an impossible concept? అని మరొక వ్యాసం రాసాను. అది కూడా మరేదో సైటులో కాపీ చేసుకున్నారు. నేనేదో అర్థముగలమాటే చెప్పినట్టున్నాను అనిపించిన మరొక ఘట్టం ఇది.

నాచిన్నతనంలో పిల్లలు రెండు భాషలు నేర్చుకోవడం కష్టం అని ఎవరూ అనుకోలేదు. మేం పిల్లలం కూడా అనుకోలేదు. మాకాలంరచయితలలో మూడు నాలుగు భాషలు చదివి, అర్థం చేసుకుని, అనువాదాలు చేసినవాళ్లు అనేకులు వున్నారు. నేను ఇండియాకి వచ్చినప్పుడు తెలుగు మాటాడితే, “మీరు తెలుగు మాటాడుతుంటే బావుందండీ” అంటున్నారు ఇప్పుడు!

ఒకొక్కపుడు నాకనిపిస్తుంది - మనది వీరపూజలదేశం. మన హృదయాలు చాలా విశాలం. మనకున్నది నిలబెట్టుకుందాం అన్న తాపత్రయం కన్నా పొరుగువారి నీతినీ రీతినీ హక్కుభుక్తములు చేసుకుని మురిసిపోవడమే ఎక్కువని. మీరు కాదంటే నిరభ్యంతరంగా ఒప్పేసుకుంటాను. ఈభాషాఘోష ఇప్పటికి ముగిస్తాను కాని మీరందరూ కాస్త ఆలోచించుకోవాలి రానున్న యువత తెలుగుకథలు తెలుగులోనే చదవగలపరిస్థితిలో వుంటారా అన్నది.

చూడగా చూడగా నాసాహతీవ్యవసాయమే నాజీవనసరళిలా వుంది. అంచేత చివరిమాటగా మరో రెండు విషయాలు కూడా రచనలపరంగానే ప్రస్తావిస్తాను. “అది మీకథే!”అన్నది ఒకటీ - నేనే కాదు దాదాపు ప్రతిరచయితా ఎప్పుడోఅప్పుడు ఎక్కడోఅక్కడ వినే వుంటాడీమాట. రెండోది కథకి ప్రయోజనం ఏమిటి అన్నది.
ఎవరికథ అన్నది మొదట చూద్దాం. ఏ రచయితా వున్నదున్నట్టుగా, అంతా తనకథగా రాయరు. తన అనుభవమైనా లేదా తాను విన్న, కన్న అనుభవమైనా, కథగా మలిచినప్పుడు, చిలవలూ, పలవలూ చేర్చి “చదివించే గుణం” కూర్చిపెట్టి, రెండో మూడో పాత్రలూ, వేరే వేరే సందర్భాలూ తీసుకుని ఒక కథ తయారు చేస్తారు. అలా చెయ్యకపోతే కథ చప్పగా వుంటుంది. ఎవరూ చదవరు. సమర్థుడయిన రచయితకలంనుండి వెలువడినకథలో ఏది నిజం ఏది కల్పన అన్నది విడమర్చి చెప్పలేం. నిజానకి కథకి అది ధ్యేయం కాదు కూడా. అలాగే సాహిత్యభిమానులైన పాఠకులు కూడా ఈ కథలో మనిషి ఫలానావాడా, ఆవిడా అని కాక, కథలో ఏంచెప్తున్నాడు రచయిత అనే చూస్తారు.

రెండోది కథకి ప్రయోజనం ఏమిటి అన్నది. మరి పైన చెప్పినట్టు మార్పులూ, చేర్పులూ చేసినందున అది సాహిత్యప్రయోజనం గల కథ కాకపోతుందా?

సాహిత్యప్రయోజనం మీద నాకాట్టే నమ్మకం లేదు. ఎంచేతంటే ఒకకథ చదివి మనుషులు మారిపోతారని నాకు తోచదు. “అబ్బే, అది నాకథ కాదు, నేనలా అనలేదు, నేనలా చేయ్యలేదు” అంటూ తమని తాము సమర్థించుకున్నవాళ్లే ఎక్కువగా కనిపించారు నాకు. నాదృష్టిదోషమేమో మరి. అంతేకానీ ఈకథ “నాగురించే, నాకే ఈసందేశం, నేనింక మంచివాణ్ణయిపోతాను” అన్నవాళ్లెవరూ తటస్థపడలేదు. కొన్నివేలసంవత్సరాలుగా మనకి కథలు వస్తూనే వున్నాయి, మంచిని పెంచమనీ, దుర్మార్గాన్ని విడనాడమనీ బోధిస్తూ. అయినా, మనుషుల్లో దుర్మార్గలక్షణాలు నశించలేదు కద. అందుకే నేను నాటైము వేస్టు చేసుకోడానికే రాస్తున్నాను అనే అనుకుంటున్నాను.

కొడవటిగంటి కుటుంబరావుగారు 80వ దశకంలో ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. ఆంధ్రజ్యోతివారపత్రికలో జానకివిముక్తి వస్తున్నరోజుల్లో అనుకుంటాను. ఆయన మాటలు వున్నదున్నట్టు నాకు గుర్తు లేదు కాని ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం, ఎవరూ ఒక కథ చదివి చెడిపోవటం జరగదు. ఆదారినే పోతున్న లేక పోదల్చుకున్నవారు ఆకథని ఆసరాగా వాడుకుంటారు తమచేష్టలు సమర్థించుకోడానికి అని. అంటే ఒక మనిషి చెడిపోడానికి గానీ, బాగుపడడానికి గానీ ఒక కథ, ఒక సినిమా, ఒక లెక్చరూ చాలవు. ఆమనిషి చెయ్యదల్చుకున్న పనికి కొంత దన్ను ఇవ్వొచ్చు.

ఈవ్యాసం “మీభూమి వారపత్రిక”వారికి పంపినతరవాత, ఇంకా ఆలోచిస్తుంటే మరొక విషయం నాకు తోచింది. నాకు కోపం ఎక్కువ. అసలు మాయింట్లో అందరికీ కోపం ఎక్కువే. నేను ఆకథ రాయడానికి ఆపరిస్థితి కొంత కారణం. ఇంతకీ అసలు విషయం–ఆకథ రాసినతరవాత నాకోపం ఉధృతం తగ్గింది! నేను నాకోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాను. అంటే నాకథ పాఠకులలో మార్పు తేగలిగినా, తేలేకపోయినా, కనీసం నామటుకు నాకు పనికొచ్చింది. అదెంత కాదు!
000

(ఆగస్ట్ 2007)

ఊసుపోక - నసాంకేతికాలు

ఊసుపోక - నసాంకేతికం
(ఎన్నెం కతలు - 3)

హెచ్చరిక - ఘనసాంకేతికనిపుణులకు ఈ అసాకేంతికాలూ, నసాంకేతికాలు నచ్చవు. ఇది కేవలం నాలాటి అసాంకేతికేయులతోనూ (బొత్తిగా సాంకేతికపరిజ్ఞానం లేనివారు), నసాంకేతికేయులతోనూ (ఏదో తెలుసుకోవాలన్న తహతహతో నస పెట్టే మధ్యస్థ సాంకేతికేయులు) కలబోసుకు ఇకిలించుకోడానికి మాత్రమే.

ఈతరతమతరగతులని ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే - బుద్ధిగా కాలేజీకెళ్లి చక్కగా చదువుకుని సాంకేతికనిపుణులుగా చెలగుతున్నవారు ఘనసాంకేతికనిపుణులు. వీరు నిరంతరం ప్రోగ్రాములు రాయడమో, పాతవి తిరగరాయడమో చేస్తూ సకలజనులకు వెలుగు చూపుతారు. (అందువల్ల నాలాటివారికి కాస్త ఇబ్బందే కాని అది తరవాత చెప్తాను) రెండోతరగతి - కీబోర్డుమీద చెయ్యేస్తే అరిగిపోతుందో విరిగిపోతుందోనని బెదిరపోయేవాళ్లు అసాంకేతికేయులు. అవును, తల్లీ, బాబూ, ఇలాటివారు 21వ శతాబ్దంలో అమెరికాలోనే వున్నారు. ఇహ మూడో తరగతి - నసాంతికేయులు కొంచెం తెలిసీ, అట్టే తెలీకా, కీబోర్డుని గెలవలేకా వదిలిపెట్టలేకా త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడేవాళ్లు. కొన్నివిషయాల్లో అసాంకేతికేయులకి చాలా తెలిసినదానిలా కనిపిస్తూనూ, సాంకేతికేయులకి అదేమిటీ ఇదేమిటీ అంటూ నసపెట్టే నసాంకేతికేయులుగానూ కనిపించే జాతి. నేను ఈకోవలో చేరుతాను. (ఎసైడు - ఒక్కొక్కప్పుడు మావూళ్లో అసాకేంతికేయులకి ప్రాథమికపాఠాలు నేర్పుతుంటాను. ఆకారణంగా కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న తాపత్రయం.)

అసలు మాయింట్లో అందరూ లెక్కలవాళ్లే. ఇంటరులో లెక్కలగ్రూపు తీస్కోపోతే లెక్కలోకి రామని లెక్క మాఇయింట్లో. నేను మాత్రం కాదు కూడదని సాహిత్యంలోకి దిగేను. సాహిత్యం చదివి ఏంచేస్తావంటే పాఠాలు చెప్పుకుంటానన్నాను. ఇంగ్లీషులో ఓసామెతుంది. చెయ్యలేనివారు చెప్పడానికి సిద్ధమవుతారని. (those who can’t do, teach). అలాటి ఉన్నతాశయంతో సాహిత్యంలో పడ్డాను. కానీ నాది ఇంజినీరింగు బుర్ర అని నాకు నేనే చాలా చిన్నతనంలోనే కనిపెట్టేసుకున్నాను.
మాయింట్లో నాఇంజినీరింగు హార్డ్‌వేరుతోనే మొదలయింది. ఇంట్లో రేడియోలూ, ట్రాన్సిస్టార్లూ మాత్రం వీలయినప్పుడల్లా ఓ స్క్రూడ్రైవరు పుచ్చుకుని కనిపించిన స్క్రూ నల్లా వూడతీసి మళ్లీ సమీకరించేస్తూండేదాన్ని. అలా ఏకీలుకాకీలు వూడదీసి కూర్చిబెట్టింతరవాత సహజంగానే పొరపాట్లొస్తాయి. సరిగ్గా పనిచెయ్యదు. అప్పుడు రేడియో అయితే ఓమొట్టికాయ వెయ్యడమో, బల్ల కుదపడమో చేస్తాను. ట్రాన్నిస్టారయితే రెండుచేతులతోనూ పుచ్చుకుని గలగల్లాడించడమో ఎగరేసి పట్టుకోడమో చేస్తాను. ఒక్కోప్పుడు పని చేస్తాయి, … చెయ్యవు. .
ఆతరవాత కంప్యూటర్లు - నామొదటి కంప్యూటరు 8084 ప్రాసెసర్. అంటే కంప్యూటర్లకాలమానంలో పాతరాతియుగం అన్నమాట.
ఆరోజుల్లోనే నా సాఫ్టువేరు చదువు మొదలయింది. పైన చెప్పినరీతిలోనే. ప్రతి కీకొట్టి ఏమవుతుందో చూడ్డం అన్నమాట. నాకసలు పుస్తకాలు చదివి తెలుసుకోడం అన్నది ఆదినుండీ అట్టే పట్టుబడలేదు (ఇదీ అసలు కారణం నేను ఇంజినీరింగులో చేరకపోవడానికి).
దానికి యూజర్స్ మాన్యూల్లు కూడా కొంత సాయం చేసాయి. వైరు గోడనున్న ప్లగ్గుకి తగిలించేవా, కంప్యూటరు స్విచ్చి ఆన్చేశావా.. అంటూ సృష్టిప్రారంభందగ్గర మొదలు పెడితాయవి. అంచేత, మామూలుగా పుస్తకం పుచ్చుకున్నా నాలుగు పేజీలు దాటేసి, చూస్తాను నాకు కావలసిన అంశం వుందేమోనని.
సాఫ్టువేరు విద్యలో నాతొలియత్నం ఈమెయిలు సెటప్ చెయ్యడం. తీరా నాక్కావలసిన విషయానికొచ్చేసరికి, నీకు పనికొచ్చే బాడ్రేటు ఎంచుకో అని వచ్చింది. (ఆరోజుల్లో 28 బీపీయస్తో మొదలయిందని ఎంతమందికి తెలుసు మరియు గుర్తుంది?) నాకేది పనికొస్తుందో తెలిస్తే ఈమాన్యూలెందుకు అనుకుని, ఆపుస్తకం పక్కన పారేసి, ఒక్కొక్క కీయే కొట్టడం మొదలెట్టాను. అన్నీ పనిచేస్తున్నట్టే వున్నాయి. కాని మళ్లీ ఏదీ పనిచేసినట్టు లేదు. అలా కుస్తీలు పడుతూ కొయ్యగుర్రంలా ముందుకీ వెనక్కీ వూగుతూ వున్నచోటే వుంటూ రెండుగంటలసేపు గడిపి, ఆతరవాత మొత్తం మూసేసి, వెళ్లిపోయాను.
కాని నేనలా వూరుకోలేను అట్టేసేపు. అటూ ఇటూ తిరిగొచ్చి, మళ్లీ మొదలెపెట్టాను సాఫ్టువేరు ఇన్‌స్టాలు చేయడం. ఈసారి కస్టమ్ (ఫర్ ఎడ్వాన్సుడు యూసర్స్) అన్నది ఎంచుకున్నాను, చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి. (నువ్వు ఎడ్వాన్సుడు కాదు కదా అని ఎవరైనా రొకాయిస్తారేమోనని). ఆకస్టములో ఏదీ మార్చకుండా వున్నదున్నట్టుంచి, పద, పదమంటూ నడిపించుకు పోయాను మొదటివరస. మళ్లీ వెనక్కొచ్చీ ఒకొక సెట్టింగూ మార్చుకుంటూ పోయేను. …ఇలా చేస్తుంటే ఒక్కోసారి మనకి పనికొచ్చేది సరిగ్గా తగులుతుంది. ఒక్కొక్కప్పుడు మొత్తం సిస్టమంతా పొలోమంటూ కూలిపోతుంది పేకమేడలా. సాహసమువలన సమకూరు పనులు ధరలోన అని అనిపించదప్పుడు. (అంటే నేను అలా చెయ్యడం మానేశానని అపార్థం చేసుకోకండి).
మొత్తంమీద ఇలా నేను సాఫ్టువేరు రహస్యాలు చాలానే గ్రహించేను. కొండొకచో నాదుష్టబుద్ధిని కంప్యూటర్లు అప్రీషియేటు చెయ్యలేవని తెలుసుకోడం కూడా ఈచదువులో భాగమే.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, శనివారం,, సోంవారం, పోలేరమావాస్యా, వైకుంఠేకాదశీ ,.. వుపోషాలుండడం తేలికేనేమో కాని కీబోర్ఢుమీద చెయ్యెయ్యకుండా దినము గడవదు నాకు - అర్జనుడికి శ్రీకృష్ణునివలె సచివుడూ, గురువూ, దైవమూ, బంధువూ, ఇహమూ, పరమూను.
ఇంకా ఈకీకారణ్యంలో వెలుగురేఖ - నా పూర్వజన్మ సంచితార్థం, ఈలోహ మరియు ప్లాస్టిక్ సంచయం,మూలంగా నాకు ఆప్తులయిన నిజమనుషులు కూడా వున్నారు. దేశ, కాల, పరిస్థితులనీ, జాతి, కుల, మత, వయో వివక్షతలనీ అధిగమించిన కంప్యూటరుని కాదనడం ఎవరితరం, సాంకేతికంగా ఎంత నాస్తికులయితే మాత్రం?
000

(మార్చి 200 8)

Eyes story

My stories in English. Please, visit, eng-thulika at wordpress.com
Thanks

ఊసుపోక 5 - వినదగు నెవ్వరు చెప్పిన
(ఎన్నెంకతలు)
వినదగు నెవ్వరు జెప్పిన
వినినంత వేగిరపడక వివరింపం దగు
కని కల్లనిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుండు మహిలో సుమతీ.

నేను నాచిన్నప్పుడూ, మీరు బహుశా ఈమధ్యనా, చదివిన సుమతీశతకంలోని ఈపద్యం నాకంటే మీకే ఎక్కువ గుర్తుండొచ్చు. ఎవరు చెప్పినా వినాలి. నాజీవితంలో మొదటిసగం మాఅమ్మమాట వింటూ వచ్చేను. తరువాతిసగం మాఅమ్మాయిమాట వింటున్నాను. మా అమ్మా, నాన్నగారూ, అక్కయ్యా, అన్నయ్యా, ఇరుగూ, పొరుగూ, క్లాసుమేటులూ, కూరగాయలమనిషీ .. ఎవరు చెప్పినా వింటూనే వచ్చేను. అదేం అని అడిగేదాన్ని కాను, కళ్లప్పగించి చూస్తూ వినడమే.

అలా వింటుంటే ఏం జ్ఞాపకం వుండిపోతాయో, ఏవి మనమనసుల్లో శాశ్వతముద్రలేస్తాయో తెలుసా. నాచిన్నతనంలో సిలోనురేడియోలో శ్రోతలు కోరినపాటలు అని రోజూ సాయంత్రం ఓగంటసేపు శ్రోతలు కోరిన పాటలే వేసేవారు. నేను ప్రతిరోజూ వినేదాన్ని ఎంతో శ్రద్ధగా. కాని ఇప్పుడు ఆవిన్నపాటలేవీ గుర్తులేవు. గుర్తున్నదల్లా “జంతువులలో అందమైనవి గుర్రాలు. బీడీలలో శ్రేష్ఠమైనవి మూడుగుర్రాలబీడీలు” అన్న ప్రకటన మాత్రమే. చూసారా, ఏది ఎంతబలంగా నాటుకుందో. .. సినిమాలో శ్రీరాముడు వేషంవేసిన ఏ యంటీయారో టీవీలో సిగరెట్టువల్ల పొందగల ఆనందం చెప్తే నిజమేకాబోలు అనిపిస్తుంది.

టీవీలో ఈమధ్య ప్రకటనలు ఎక్కువయిపోయేయి. నేను ఇక్కడికి వచ్చినకొత్తలో 20 సెకనులుండేది ఒక్కోప్రకటన. ఇప్పుడు 90 అయిపోయింది. ఎంత వినేదాన్ని అయితే మాత్రం ఎంతకని వినగలను? అందులోనూ మందులకంపెనీలవాళ్లవి నాకు మరీ చిరాగ్గా వుంటాయి. నేనేదో కాలక్షేపంకోసం, మనశ్శాంతికోసం టీవీ పెట్టుకుంటే, సుఖంగా వున్ననాప్రాణాన్ని ప్రకటనదారులు పనిగట్టుకు హింసిస్తున్నట్టనిపిస్తుంది..
ముందు నాకు ఏ లక్షణాలుంటే ఏజబ్బు రావడానికవకాశం వుందో చెప్తాడు. తరవాత సైడెఫెక్టులంటూ ఇంకా ఏఏబాధలు రాగలవో చెప్తాడు. ఆతరవాత నాచావుకి అవకాశం ఎన్నిపాళ్లో చెప్తాడు. ఇంకా జీవితంమీద ఆశేమైనా వుంటే డాక్టరుని అడగమంటాడు. నాకు వచ్చే అనుమానం - డాక్టరుదగ్గరికెళ్లి, అయ్యా ఈమందులకంపెనీవాడు చెప్పేడు ఈమందు నన్ను రక్షించగలదని, అంచేత ఓకాగితంముక్క రాసియ్యండి అనడిగితే ఇచ్చేసే డాక్టరుంటాడా? అసలు డాక్టరుదగ్గరికి వెళ్లడమంటూ జరిగితే ఈ ఒకటిన్నరనిముషం హరికథంతా ఎందుకు? ఆడాక్టరు ఎలాగా చెప్తాడుకదా. డాక్టర్లకి కదా తెలీయాలీ ఏరోగాలకి ఏమందులు వాడాలో. నేనా చేప్పేది ఇది కావాలి అది కావాలి అని. ఈపనసంతా ఆడాక్టరుదగ్గరే పెట్టొచ్చు కదా.
ఈప్రకటనలు 20 సెకన్లున్నరోజుల్లో ఓగ్లాసు నీళ్లు తాగి వచ్చేదాన్ని. ఇప్పుడు కప్పుకాఫీ పెట్టుకుని, తాగేసి, కప్పు కడుక్కోడానికి కూడా సరిపోతోంది ఆ 90 సెకనులు. అంటే టీవీలు ఒక్క ప్రకటన వేసి వూరుకోవు. మూడో, నాలుగో పెడతాయి. అంచేత పొడుగు ప్రకటనలవల్ల నాకు సుఖంగానే వుంది అని ఒప్పుకోక తప్పదు.

మామూలుగా నేను వినీ, చాలాసేపో, చాలారోజులో ఆలోచించుకునీ కానీ ఏపనీ చెయ్యను. మనవాళ్లయితే మాచెడ్డ నిదానం అనో పిచ్చిమాలోకం అనో అంటారు కానీ అమెరికాలో అయితే దానికో పేరెట్టేస్తారు. ఏడీడీ అనో స్లో అనో. ఇది నాకెలా తెలిసిందంటే, ఓరోజు కారు కొనడానికెళ్తే డీలరు పెద్దపడవంత కారు చూపించి, ఆకారులో లెగ్రూమూ, హెడ్రూమూ అంటూ ఊదర పెట్టేశాడు. అప్పటికప్పుడు ఆకారు తీసేసుకుంటే నాక్కనక మూడువందలు తగ్గించి ఇచ్చేస్తానన్నాడు రహస్యం చెప్తున్నట్టు ముందుకి వంగి..
“నాకెందుకు లెగ్రూము? నాకు గాస్పెడలూ, బ్రేకుపెడలూ అందితే చాలూ, ఎదురుగా రోడ్డు కనిపిస్తే చాలు, రోడ్డుమీద జనాలు కారులో నేనున్నానని గమనించగలిగితే చాలు” అనాల్సింది నేను కాని అనలేదు. కళ్లు పైకెత్తి అతని చొక్కాజేబూ, కాలరూ ఆపైన ఐఫిల్ టవరులా వున్న అతనిమొహమూ చూస్తూ, తలూపేను.
 ఆకచేరి అంతా ఓపిగ్గా ఆసాంతం విని, ఆతరవాత, ఒంట్లో వున్న శక్తినంతా కూడగట్టుకుని, “నేను అలా నిల్చున్నపాళాన నిర్ణయాలు తీసుకోలేన”న్నాను. నిజానికి ఇంగ్లీషులో “ఐయాం స్లో” అన్నాను. దాంతో ఆఅబ్బాయి మొహం దమ్మిడీకాసంత చేసుకుని, అత్యంత జాలిగా మొహంపెట్టి ఓ అని, “తొందరలేదు, ఆలోచించుకో, దా, ఇక్కడ కూర్చో, కాఫీ తేనా.”. అంటూ నన్ను బుజ్జగించడం మొదలెట్టాడు. నేను మరీ అంత స్లో కాదనీ, హాస్యానికన్నాననీ, షాపింగ్ ఎరౌండనీ సకలవిధాలా ప్రత్యామ్నాయ జవాబులు చెప్పుకుని అతన్ని శాంతింపచేశాను.
ఆతరవాత ఎవరు చెప్పిన వినదగదు అని తెలిసిపోయింది. ′ఏప్రకటన చూసినా, ఏటెలిమార్కెటరుమాట విన్నా అదే మాట. “మీమేలు కోరే, మీకు డబ్బు ఆదా చెయ్యడానికే” అని హామీలమీద హామీలిచ్చేస్తారు. కల్లనిజము తెలుసుకోడానికంటూ వివరించుకోడానిక్కూడా అట్టే టైము లేకుండా.
నిజంగా “వినదగు నెవ్వరు చెప్పిన … ”అన్నమాట వినరాదు.
ఇంతరాసినతరవాత నాకు మరో సందేహం వస్తోంది. వినరాదన్న నామాట మీరు వింటారా వినరా?

(మార్చి 15, 200 8)
,

చిరుచక్రం

చిరుచక్రం

“డీయీవో బాబొస్తన్నాడంట”
రోజూ అయ్యగారింటికి ఆరుగంటలకి పరుగెత్తే స్కూలు ప్యూను వెంకన్న ఆరోజు అర్థరాత్రి లేచి ముస్తాబు మొదలెట్టాడు.
“బాగానే వుంది. సంబడం అద్దరేతిరి మద్దెలదరువని. డీయీవో అయ్నా ఆడి బాబైనా వొచ్చి నీకేటి ఒరగబెడతారు. వోరంరోజుల్నంచీ ఒక్కలా కాళ్లిరగదొక్కుకుంటున్నావ్” ఇట్నుంచి అటు వొత్తిగిలుతూ విసుక్కుంది సింవాచెలం.
“ఏటొరగబెడతారో నీకేటి తెల్సు” తలెగరేశాడు వెకన్న, పన్నెండు పైసలిచ్చి ప్రత్యేకంగా ఇస్త్రీ చేయించుకున్న చొక్కా తొడుక్కుంటూ.
వాడికళ్లముందు నాగయ్యలా వూగిపోతు తండ్రి కనిపించేడు. ఎనిమిదేళ్లకిందట తను ఉద్యోగంలో చేరేటప్పుడు ఏంచెప్పేడు, “ఒరేయ్, వెంకా, వాళ్లకళ్ల కప్పి ఒళ్లు దాచుకుని మనఁవే మిద్దెలు లేపబోంవు. కాయకష్టం చేసుకుని గంజినీలు దాగి ఏచెట్టుకింద తొంగున్నా మనకి పరువే” అని చెప్పాడు. అందుకే స్కూలుచుట్టూ తోట పెంచేడు, అదితనపని కాకపోయినా, దానికి వాడికేం స్పెషల్ ఎలవెన్సు లేకపోయినా, హెడ్‌మాస్టరుగారిదగ్గరినుంచి “ఊఁ బాగానే వుంది” కంటె మరోముక్క రాకపోయినా.
ముందటేడు వచ్చిన స్కూళ్ల ఇన్స్‌పెక్కరుగారి భార్యకి బంగారుపువ్వుల్లా మెరిసిపోతున్న ముద్దబంతిపూలు తామరాకులో పెట్టి అందించేడు.
అవి చూస్తూ ఆవిడ, “లవ్లీ” అంది సార్‌తో. అంచూ వెంకన్నవేపు మెచ్చుకోలుగా చూసింది.
ఇన్‌స్పెక్టరుగారు హింటందుకున్నట్టు మందహాసం చేసి, “గార్డనింగంతా నువ్వేనా?” అన్నారు.
“అవునండీ సార్” అన్నాడు వెంకన్న ఉప్పొంగిపోతూ. వాడప్పుడు మొదటి పిక్చరే శతదినోత్సవం చేసుకున్న నిర్మాతలా ఫీలయేడు. ఆతోట అప్పుడు వాడికళ్లకి కోడెవయసు ఆడపిల్లలా పండుగ చేసింది.
“గుడ్. మీలాంటు యువకులంతా ఇలా కష్టపడితేనే దేశం బాగుపడేది,” అన్నారు ఆయన.
“యస్యస్. హీ ఈజ్వెరీ ఇండస్ట్రయస్ ఎండ్ సిన్సియర్” అన్నారు శర్మాజీ కూడా వీలయినంత మాత్రమే విశాలంగా నవ్వుమొహం పెట్టి.
వెంకన్న మళ్లీ బ్రహ్మానందపడిపోయేడు. ఆతరవాత అందరూ కలిసి తీయించుకున్న ఫొటోలో కూడా పడ్డాడు. ఆఫొటో చూరున వేలాడుతూ, సింవాచెలం అటు వెళ్లినప్పుడల్లా దానినెత్తిన ఒకటేస్తూ, అందుకు చీవాట్లు తింటూ ఇప్పటికీ వుంది.
అసలు స్కూల్లో ఉద్యోగం అయితే గవురంగా వుంటుందనీ, పెద్దపెద్దవాళ్లు స్కూలికి వచ్చినప్పడు చూడొచ్చనీ, మాటాడొచ్చనీ ఇక్కడ చేరేడు కాని పల్లెలో తనకి గడవక కాదు. వెంకన్న స్కూల్లో చేరి ఎనిమిదేళ్లయింది. ఓమాటు సినిమాల్లో రవుడీవేషాలేసే సూర్యనారాయణ వచ్చేడు. అతను రవుడీలా కాక చాలాబాగా మాటేడేడనీ అందరూ అనుకున్నారు. వెంకన్న కూడా అలాగే అనుకున్నాడు. మరోమారు ఎవరో మంత్రిగారొచ్చారు. ఓహ్ ..మంగళగిరి తిరణాలక్కూడా అంత జనం వుండరు.
ఆయన బిల్డింగు శంకుస్థాపన చేస్తున్నప్పటిఫొటోలో కూడా పడ్డాడు. ఆయన కూడా వెంకన్నని మెచ్చుకున్నారు.

ఇలాటి అనుభవాలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని వున్నాయి. సింవాచెలానికి అర్థం కావు. “ఆయ్‌గా ఆకలిగినచెక్క చూసుకుంటూ ఆపల్లెలో పడుంటే పోదూ” అంటుంది. పొలంలో ఏఁవుంది. ఒక్కమారు ఏరొచ్చిందంటే గన్‌షాట్‌లా తుడిచిపెట్టుకుపోడఁవే కదా!
“మూడు సంవత్సరాలుగా ఒక్కగింజ రాల్లేదని అన్న చెప్పడంలే?”
“ఆడిమాట నమ్మకంవేంటి?” అంటుంది సింవాచెలం.
ఒకమనిషినేనా నమ్మాలి, ఒక దేవుణ్ణేనా నమ్మాలని చెప్పింది ఎవురు - జగ్గయ్య కాబోలు.
స్కూలువ్యవహారాల్లో ఇంత తకరారుందని నింవాచెలానికి తెలియనందుకు వెంకన్న సింవాచెలంమీద జాలి పడ్డాడు కూడా.
హుషారుగా ఈల వెసుకుంటూ వెళ్లిపోయిన వెంకన్నని చూసి, నవ్వుకుంటూ లేచింది సింవాచెలం కూడా పన్లోకెళ్లడానికి.
0000
వెంకన్నని చూస్తూనే ఉగ్రులయిపోయారు శర్మాజీ. “స్టేషనుకెళ్లాలి రమ్మంటే ఇప్పుడా రావడం” అని “ఇంకా కాఫీ కాలేదూ” అంటూ ఇంట్లోకి ఒక విసురు విసిరి, “వెళ్లు, వెళ్లు, వెగిరం జట్కా తీసుకురా. ఆకుంటుగుఱ్ఱం కాదు. అదెంత నీ బావమర్ది మాఁవగారిదయినా దాని స్పీడు గంటకి అయిదు మైళ్లే. ఫో, ఫో. పోయి ఆవీరాసామిబండి పిల్చుకురా” అని వాడికి పురమాయిస్తూ పంచెకుచ్చెళ్లు పెట్టుకోడం పూర్తి చేసి, షక్టు తొడుక్కోసాగారు.
వెంకన్న అప్పటికే చాలాదూరం వెళ్లిపోయాడు. అంచేత ఆయన తిరిగి ఇంట్లోకి ఆజ్ఞలు ప్రసారం చెయ్యడంలో ములిగిపోయారు.
వారంరోజుల్నుంచీ ఆయన ఒఖ్కలా ఆరాటపడిపోతున్నారు. పెద్దపండుక్కి ఇల్లు కడిగించినట్టు స్కూలుబిల్డింగంతా దగ్గిరుండి కడిగించేరు. మూలమూలలా దుమ్ములు దులిపించేరు. మూలపారేసిన లాబొరేటరీ సామగ్రీతో టేబుళ్లలంకరించేరు. ఇంటింటా వాడవాడా చెదిరిపోయిన లైబ్రరీపుస్తకాలు గూళ్లు చేరేయి. గోడలకి సున్నాలేయించేరు. తోటచుట్టూ పడిపోతున్న కంచె నినబెట్టించేరు.
ఒక్కొక్క పనికోసం ఆయన రైలింజన్‌లా రంకెలెయ్యాల్సొచ్చింది. “మాసినచోటల్లా సున్నం కొట్టరా” అని ఎలమందతో చెప్తే, బకెట్‌లో సున్నం కలుపుకొచ్చి, సినిమాలో యాక్షను చేసినట్టు కుంచే తనమొహమ్మీద ఆడించి, గోడచాటున చేరేడు బీడీదమ్ము కొట్టడానికి.
“అలా కూచుంటే పనెలా అవుతుందిరా” అంటే, “ఇప్పుడే ఇలా వచ్చేనండీ” అంటాడు. వాడిచేత మళ్లీ కుంచె పట్టించి ఇటు తిరిగి చూస్తే, వెంకన్న తోటలో చేరేడు. “తోట షోకులు తరవాత చూద్దువుగానీ, ముందా బోర్డులన్నటికీ రంగులెయ్యి” అని వెంకన్నకి స్పష్టంగానే చెప్పి వున్నారాయన. వాడిని తోటలోంచి లాక్కురమ్మని పుట్టన్నని తరిమేరు. ఎంతసేపు చూసినా ఇద్దరిలో ఏఒక్కడూ వస్తున్న జాడ కనిపించలేదు. రుసరుసలాడుతూ, ఆయనే వాళ్లని వెతుక్కుంటూ బయల్దేరేరు. సౌత్వింగులో ఫస్టసిస్టెంటుగారు వాళ్లచేత బీరువాలు మోయిస్తున్నారు.
లైబ్రరీలో ఎలాగా పుస్తకాలు లేవు కదా అని బీరువాలు సైన్సులాబొరేటరీలో పెట్టి అందులో సైన్సుపరికరాలూ, నానాచెత్తా పెట్టేరు. ఇప్పుడు మళ్లీ ఎక్కడివక్కడ పెట్టిస్తున్నారు.
శర్మగారికి రావలిసినంత కోపం వచ్చింది. “అన్నిటికీ ఈవెధవలిద్దరే దొరికేరుచండీ? లాబ్‌లో ఉన్న అటెండర్లని ఉపయోగించుకోమని చెప్పేను కదా” గరళంలాటి కోపాన్ని కంఠంలో నోక్కిపట్టుకుని ప్రశ్నలాటి ఆదేశం వెళ్లగ్రక్కేరు.
“ఎక్కడున్నారండీ ఎటెండర్లు. ఒకడేమో మీపిల్లల్ని స్కూలినించి తీసుకురావడానికి వెళ్లేడు. రెండోవాడేమో అమ్మగారెందుకో రమ్మన్నారని మీయింటికెళ్లేడు,” ఫస్టసిస్టెంటుగారి స్వరంలో ఎన్నాళ్లనుంటో వున్న కక్ష తీర్చుకున్న సంతృప్తి బయల్పడింది. ప్యూన్లని తనయింటికి రానివ్వరని ఆయనకి మంట.
“హుమ్. స్కూల్నించి పిల్లల్ని తీసుకురావడం ఎంతసేపండీ. ఆయిదు నిముషాలపని చెప్తే అరగంట చేస్తారు వాళ్లు. తెందరగా రమ్మి మీరు చెప్పొచ్చుకదా. అదీ నేనే చెప్పాలా? నిజఁవేలెండి. హెడ్‌మాష్టరు కర్కోటకప్ముండాకొడుకన్నపేరు నాకు రావాలి. మీరంతా వాళ్లకి మంచివాళ్లు కావాలి.”
శర్మగారు నిష్క్రమించేరు. తాను చెప్పిందేఁవిటో, ఆయన చెప్పిందేఁవిటో, పొంతన కుదరక తికమక పడిపోయేరు ఫస్టసిస్టెంటుగారు.
ఆరేంజిమెంట్సు అయినట్టనిపించేసరికి అందరికీ ఇంచుమించు షేక్స్పియరు మొహాలు పడ్డాయి. ఎంతచేసినా ఏదోఒకటి తరుగు కనిపిస్తూనే వుంది.
000

చిన్నకూతురు తెచ్చిన కాఫీ శర్మగారు పూర్తి చేసేసరికి వీధిమలుపులో గుఱ్ఱం పగ్గం పట్టుకుని వస్తున్న రాములూ, పక్కనే వెంకనే కనిపించారు. తనదింక ఆలస్యంలేదు కనక శర్మగారు గుమ్మం దిగుతూ, “ఏఁవిరా ఇంతసేపా బండి తీసుకురావడం” అని లాంఛనంగా కసురుకుని బండెక్కి కూచున్నారు.
“వీరాసామి బండికిరుసు ఇరిగిపోయిందండీ. మీరేమో మాబండి ఒద్దన్నారుకదా. రాఁవులు దొరికేసరికి ఇంతసేపయిందండీ,” శర్మగారు విన్నా వినకపోయినా జవాబు చెప్పడం ధర్మంగా వెంకన్న సమాధానం చెప్పి బండిముందుకు వచ్చాడు.
రాములుగుఱ్ఱం కుంటిది కానీ కొత్త కావడంచేత ఇంకా రాములువాటానికది అలవాటు పడలేదు. అంచేత వాడు ఛెర్నాకోల ఛెళ్ మనిపించి, ఎగిరి కమ్మీమీద కూర్చునేసరికి అదొక రౌండు కొట్టింది. ాములు బండి దిగి, గుర్రానికి దిక్కులు సూచిస్తుండగా, అది ప్రొటెస్టు చేస్తున్నట్టు వెనక్కి నడవసాగింది.
బండిలో కూర్చున్న శర్మగారికి దాని ప్రటెస్టుకన్నా ఫ్రైటెక్కువ గలిగింది.
బంఢలోనించి ఓకాలు బయట పెట్టి, దిగలేకా కూర్చోలేకా ఇబ్బంది పడిపోతూ, గుఱ్ఱాన్నీ, వెంకన్ననీ, రాముల్నీ వుద్దేశించి, “రేయ్, రేయ్, దరిద్రుడా, ఈబండెక్కడ దొరికిందిరా. ఇదెక్కడి గుఱ్ఱంరా. గుఱ్ఱఁవేనా గాడిదా. డీయీవోగారొస్తున్నారంటే ఇలాటిగుఱ్ఱంట్రా తీసుకొస్తావు…” మొదలుగాగల ప్రశ్నలు వేస్తూ, ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆరాటపడిపోతున్నారు.
“మరేఁ పరవాలేదండీ. కొంచెం కొత్త. అంతే. కాని పంచకల్యాణి కాదుటండీ. పరుగందుకంటే ఆకాశంలో పోతుందండీ,” అంటూ రాములు ధైర్యం చెప్పుతున్నాడు.
“శర్మగారా, రాములా - ఎవర్ని సైడు చెయ్యడం అన్నసదసత్సంశయంలో పడిపోయాడు వెంకన్న.
ఆలా ముగ్గురూ అవస్థలు పడుతుండగా, స్టేషను వచ్చింది. లేక రాములూ, గుఱ్ఱమూ, శర్మగారూ. వెంకన్నా స్టేషనుకొచ్చేరు. రైలు రెండుగంటలు లేటని తెలిసినతర్వాత అందరిమనసులూ కుదుటపడ్డాయి. గుఱ్ఱంమనసు దాణామీద పడింది.
ఫ్లాస్కూ, కాఫీ కూడా సేఫ్‌గానే ఉన్నందుకు ఆనందించేరు.
ర000
రెండుగంటలు లేటుగా వచ్చిన రైల్లోంచి డీయీవోగారూ, వారిచిన్న సంతానం సరోజా, క్లర్కూ, జవానూ దిగేరు. డీయీవోగారిని మొదటగా ఎదుర్కొని స్వాగతం చెప్పే మహద్భాగ్యం తనకి కలిగినందుకు వెంకన్న ప్యూనులందరిలోనూ రాజులా గొప్పపడిపోయేడు.
డీయీవోగారి ప్యూను డీయీవోగారంత దర్జాగానూ - ఒకడుగు వెనకే అయినా - నడుస్తూ లగేజీ అంతా తనచేత మోయించేడు.. “అలా గెడకర్రలా చూస్తూ నిలబడతావేం, ఆసూట్‌కేసూ, బుట్టా ఆందుకో,” అని శర్మగారు వెంకన్నని కసిరి, డీయీవోగారి ప్రయాణం సుఖంగానే జరిగిందని తాను అనుకుంటున్నట్టు ఆయనకి మనవి చేస్తూ, వెయింటింగ్రూములాటి రూముకి వారిని తీసుకెళ్లారు.
డీయీవోగారూ, అమ్మాయిగారూ మొహం కడుక్కుంటుంటే వెంకన్న కాఫీ ఎవరెవరికి ఎలా సర్దడమా అన్న ఆలోచనలో పడ్డాడు.
వెంకన్న వులిలక్కి పడ్డాడు. శర్మగారు వాణ్ణి దివిటీస్థంభంతో పోల్చి, అయ్యగారికి కాఫీ ఇవ్వమని ఆదేశించేరు.
శాపగ్రస్తుడయిన గంధర్వుడిలా ఫ్సాస్కు తీసుకున్నాడు వెంకన్న. కాని కాఫీ అందరికీ చాలదని ఎలా చెప్పడమో తెలీక నిలబడిపోయాడు.
శర్మగారు మరొకసారి ఉరిమిచూశారు. వున్నవాళ్లలో నువ్వు నయం అని తీసుకొస్తే నువ్విలా చేస్తున్నావేమిటి అన్న నిష్ఠూరం వుంది చూపులో. దేవుడా ఇంత చేశావా అన్న దైన్యం వుంది ఆచూపులో. పోర్షను మర్చిపోయిన నటుల్లా వీళ్లిద్దరూ చూపులు చూసుకోవడం చూసి డీయీవోగారిక్కోపం వచ్చింది. వారి అమ్మాయిగారికి చిరాకు కలిగింది. ఫర్టసిస్టంటుగారు కలగజేసుకుని కఫ్పుల్లో పోసి డీయీవోగారికీ వారమ్మాయికీ ఇవ్వమని సౌంజ్ఞ చేశాడు. క్లర్కు వెంకన్నని పక్కకి పిలిచి “ఇక్కడెక్కడా టీ దొరకదా అని ప్రశ్నించేడు.
ఈయనకి టీ దొరికితే బాగుండును అనిపించింది వెంకన్నకి.
“దొరకదు సార్. ఈసుట్టుపక్కల నాలుగుమైళ్లలో టీదుకాణం లేదు. మనూరు పోంగానే ఫస్ట్‌క్లాసయిన టీ తెస్తానండీ” అంటూ ఒకే నిముషంలో అతగాడి విచారానికీ, ఉల్లాసానికీ కారణభూతుడయేడు.
శర్మగారూ, కొత్తగుఱ్ఱమూ ఒక్కలా అవస్థ పడిపోతూ ఢీయీవోగారినీ, వారిపరివారాన్ని వారిమకాంకి చేర్చారు. వారిమకాం స్కూల్లోనే ఏర్పాటు చేయబడింది. ఆరూము అప్పటికే మూడుసార్లు దులపడం, కడగడం, దులపడం, కడగడం, అయింది.
డీయివోగురు అప్రసన్నంగా రూమొకసారి పరికించడం గమనించిన శర్మాజీ వెంకన్నవేపు తిరిగి, “పొద్దున్నే రూము ఊడిపించలేదూ” అని కసిరినట్టు ప్రశ్నించి, లేజీబగ్గర్ అని కాంప్లిమెంటిచ్చారు.
వెంకన్న ఆసమయంలో - తాను గాజుగ్లాసులో అమర్చిన ఒంటిరెక్కమందార అందాన్ని చూసి ఆనందిస్తున్న అమ్మాయిగారిని సూసి మురిసిపోతున్నాడు. అందుచేత శర్మగారు అన్నమాటకి నొచ్చుకోకుండా, ఏదో పెద్దవారు, ఆయనబాధలు ఆయనకున్నాయి, అందుకే ఉదయంనుంచి తాను ఆయనవెంటే వున్నసంగతి మర్చిపోయేరు అనుకుని ఊరుకున్నాడు.
శర్మగారు కూడా డీయీవోగారడిగిన మరేదో ప్రశ్నకి సమాధానంకోసం తడుముకోసాగేరు.
“ఇక్కడ సిగరెట్లు దొరకవా?” ఢీయీవోగారడిగేరు. ఆయనకి నేవీకట్ కావాలి. ఇక్కడ బర్క్‌లీ తప్పిస్తే బీడీలు మాత్రమే దొరుకుతాయని ఎలా చెప్పడఁవో తెలీక, వెంకన్నకి పురమాయించేరు. “వేగిరం వెళ్లి ఒకటిన్ నేవీకట్ తీసుకురా.. ఇక్కడున్నట్టు రావాలి.”
వెంకన్న బరిలోకురికిన పుంజుకుని సైకిలెక్కేడు. కలికం వేసి చూస్తే, ఏ నాటుదొర జేబులోనో ఒకటో అరో దొరకొచ్చునేమో కాని పూర్తి టిన్ను దొరకదని వాడికి తెలుసు. కాని పుట్టించేడంటే బాబుగారెంత సంతోషిస్తారో వాడూహించేడు. మిట్టమధ్యాహ్నం అయేసరికి అర్థపేకెట్ ఒకచిన్నకొట్లో దొరికింది.
“అయిదు సిగరెట్లు తేవడానికి నీకో పట్టిందా?” శర్మగారు కళ్లెర్ర జేసినా, ఆకళ్లలో వాడికి ఎకర్రజీర కనిపించలేదు.
“ఇంటికెళ్లి కారియర్ తీసుకురా. ఇప్పటికే ఆలస్యం అయింది”
వెంకన్న మళ్లీ సైకిలెక్కి శర్మగారింటికి వెళ్లాడు. అమ్మగారు కారియర్ రెడీగానే ఉంచేరు కానీ అరిటాకుల్లేవు. ఆకులకోసం ణళ్లీ ఓగంటసేపు వాడు వేటాడవలసివచ్చింది. సంభారాలన్నీ సమకూర్చుకుని స్కూలుకి వెళ్లేసరికి అక్కడ అందరూ ఆకలితోనూ ఆపైన కోపంతోనూ కణకణలాడిపోతున్నారు.
వెంకన్న క్విక్విగ్గా టెబులుమీద అన్నీ సిద్ధం చేశాడు.
అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించేసరికి మూడయింది.
అప్పుడు శర్మగారు వెంకన్నకి ఇంటికెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చేరు. “అన్నం తినేసి అయిదు నిముషాల్లో వచ్చేయాలి.”
తిండి తినడంమాట దేవుడెరుగు ఇంటికెళ్లడానిక్కూడా ఆ అయిదు నిముషాలు చాలవని ఒక్క వెంకన్నకే తెలుసు. అంచేత వాడు బస్టాండుదగ్గర బన్ను తిని, టీ తాగి వచ్చేశాడు. అప్పటికీ పదినిముషాలు పట్టింది.
డీయీవోగారు ఆరోజుకి విశ్రాంతి తీసుకుంటారనీ, స్కూలు మర్నాడు దర్శిస్తారనీ ప్రకటించబడింది. వెంకన్న మాత్రం ఆయనక్కావలసినవి అందిస్తూ అక్కడే వున్నాడు.
డీయీవోగారమ్మాయి తోట చూడాలని సరదా పడ్డందున తోట ఇన్స్‌పెక్షను ఆసాయంత్రం చేశారు.
అమ్మాయి కావలసినన్ని పువ్వులు కోసుకుంది. డీయీవోగారు నవనవలాడుతూ ఏపుగా పెరిగిన కూరగాయనవేపు అప్రూవంగయిస్‌తో చూశారు. అందులో తమకి ఇష్టమయినవేవో చెప్పకయే చెప్పేరు. వెంకన్నవైపు తిరిగి వెరీగుడ్ అన్నారు. వారి అమ్మాయి బ్యూటిఫుల్ అంది. వెంకన్న వెగరుస్తూ నమస్కారమండీ అన్నాడు.
రాత్రి మళ్లీ హెడ్‌మాష్టరుగారింటినించి కారియర్ తెచ్చాడు. వాళ్ల భోజనాలు అయేసరికి పదిన్నర అయింది. వెంకన్నకి ఇంటికెళ్లడానికి ఇంకా పర్మిషను దొరకలేదు.
డీయీవోగారు విలాసంగా ఈజీచైరులో వాలి, సిగరెట్ వెలిగించి, అగ్గిపుల్ల వెనక్కి విసిరేరు.. అది వెళ్లి టేబులుమీద నాజూగ్గా పరుచుకున్న ప్లాస్టిక్ టేబుల్ క్లాతుమీద వాలింది. ఆటోమేటిగ్గా ఒక్కడొక డిజైను ఏర్పడింది.
శర్మగారు వెనువెంటనే ఆటేబులుక్లాతులాగే మండిపడ్డారు. అది ఆయనస్వంతం. డీయీవోగారి మెప్పుకోసం తనఇంటినుండి తెచ్చి వేశారు.
“యూ బ్లడీరాస్కెల్, నీకెన్నిమార్లు చెప్పేను ఎలర్ట్‌గా ఉండాలని. నీకు ఇలా బుద్ధిరాదు. డిస్మిస్ చేసేస్తే అప్పుడ1స్తుంది. ఎలెర్ట్‌నెస్. నిన్న చెప్పేను సార్, యాష్‌ట్రే తెచ్చిపెట్టమని. కనీసం సిగరెట్లు తెచ్చినప్పుడేనా తేవాలా?”
యాష్‌ట్రే సంగతి తనకి చెప్పలేదని వెంకన్న చెప్పలేదు.
డీయీవోగారు నిర్లిప్తంగా, “యూమస్ట్ నో హౌ టు మానేజ్ దెమ్. ఫైన్ హిమ్” అన్నారు తత్త్త్వబోధ చేస్తున్నట్టు.
శర్మగారు వెంకన్నకి అయిదురూపాయలు ఫైను వేసినట్టు తెలియజేశారు. కారణం నెగ్లిజన్సాఫ్ డ్యూటీట.
మర్నాడు డీయీవోగారు క్లాసులూ, బిల్డింగూ, లాబొరేటరీ, లైబ్రరీ తణిఖీ చేశారు. బిల్డింగంతా శుభ్రంగా వుందనీ, తోట అందంగా వుంతనీ, టీచర్లంతా మంచివాళ్లలా వున్నారనీ మెచ్చుకున్నారు. శర్మగారినీ మిగతా ఉపాధ్యాయవర్గాన్నీ కరచాలనం చేసి అభినందించారు. పిన్నలని కష్టపడి పనిచెయ్యమని ఆశీర్వదించేరు.
డీయీవోగారిని రైలెక్కించి వచ్చి, శర్మగారు “హమ్మయ్య, వెళ్లాడురా తండ్రీ. ఇంతకంటె ఇద్దరాడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యడం సుళువు” అనుకుని నిట్టూర్చారు. ఇంత కష్టపడ్డందుకు ఆయన బేడ్ రిపోర్టు రాయకుండా వుంటే అంతే చాలు అనుకున్నారు. డీయీవోగారు తనతో కరచాలనం చేస్తూ “మీకు కంగ్రాచ్యులేషన్సు చెప్పాలి” అన్నారని గర్వంగా భార్యతో చెప్పారు.
అదే సమయంలో వెంకన్నముందు సింవాచెలం పళ్లెంలో అన్నం పెట్టి, అమ్మగారింటినించి అపురూపంగా తెచ్చిన ఆవకాయముక్క వేసి, “వారంరోజుల్నించీ తిండే నేదు. ఇప్పుడైనా కాస్త తీరిగ్గా తిను,” అంది ఆప్యాయంగా.
వెంకన్న తృప్తిగా ఆవకాయముక్క కొరుకుతూ సింహాచలంతో విశేషాలు చెప్తున్నాడు, “అయ్యగారు తోట ఎంత మెచ్చుకున్నారో తెలుసా. వెరీగుడ్డన్నారు. అమ్మాయిగారు పూలు చూస్తూ బీయాటిఫుల్ అన్నారు. లౌలీ అన్నారు. హెడ్‌మాష్టరుగారు బుట్టనిండా కాయగూరలు కోయించి ఆరితో పంపించారు. ఆరికి పందిరిచిక్కుడంటే ప్రాణంట. మళ్లీ హెడ్‌మాస్టరుగారితోనూ, పంతుళ్లతోనూ షేకెండు కూడా ఇచ్చారు. మంచి బాబు ….”
వెంకన్న చెప్తూనే వున్నాడు.
సింవాచెలం ముసిముసినవ్వులు నవ్వుతూ వింటూనే వుంది.
వాడు సింవాచెలానికి చెప్పని విషయం ఒక్కటే - ముందురోజు తనకి అయిదు రూపాయలు ఫైను పడిన సంగతి!!

(ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఏప్రిల్ 2, 1971,లో ఉగాదికథలపోటీలో ప్రథమబహుమతి పొందినకథ. - మాలతి ని. )

పూర్వకవులు -వెంగమాంబ (తరువాయిభాగం)
(ఎన్నెం కతలు)

మొదటి వ్యాసం రాసినతరవాత, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు రాసిన సరస్వతీ సామ్రాజ్యవైభవము రూపకం నాకు కనిపించింది. బెజవాడ గోపాలరెఢ్డిగారి కోరికపై ఆంధ్రరచయిత్రుల ప్రజ్ఞాపాటవాలు లోకులకు తెల్లం చేసే ఉద్దేశ్యంతో రాసినరూపకమని ముందుమాటలో చెప్పారు ఆమె. తొమ్మదిమంది ప్రముఖకవయిత్రులని ఒకచోట చేర్చి, వారి కావ్యాలలో ప్రాచుర్యం పొందినపద్యాలను ఉటంకిస్తూ, సూత్రధారుడు, కలభాషిణివంటి సముచితపాత్రలతో రసవత్తరంగా నడిపిన రూపకం ఇది.

అందులో వెంగమాంబరచనలుగా ఉదహరించిన రెండు పద్యాలు ఇక్కడ చేరుస్తున్నాను. మొదటిది వెంగమాంబగారు రచించిన వేంకటేశ్వరమహాత్మ్యంలోనిది. సున్నితమైన చమత్కారం, మనోహరమైన భాష చూస్తాం ఇక్కడ. వరాహావతారంలో తాను లక్ష్మి ఎదుటపడలేను అంటాడుట విష్ణుమూర్తి!

ధారుణి నీటన్ మునిగిన
కారణమున దాని నెత్తు కార్యంబున నీ
ఘోరాకారము దాల్చితి
నా రూపము చూచి లచ్చిన