తెలుగు తూలిక

ఆగష్టు 9, 2008

అక్షరమ్ పరమమ్ పదమ్

ప్రచురించిన వర్గము డయాస్ఫొరా, నాకథలు, సాహిత్యం — malathi @ 5:55 అపరాహ్నం
Tags: , ,

 

                                                                        000

 

అక్షరం అంటే క్షరము కానిది అని అర్థంట. అంటే శాశ్వతంగా వుండిపోయేదని, దానికి ఏనాటికీ చెరుపూ, మరుపూ వుండవనీనుట.

యస్సెల్సీ డింకీ కొట్టింతరవాత, సెప్టెంబరులో అయిందనిపించుకుని మరుసటేడు కాలేజీలో చేరేవరకూ మాఅమ్మ వెనక తచ్చాడుతూ నేను నేర్చుకున్న పాఠాలు చాలా వున్నాయి.

వాటిల్లోముఖ్యంగా చెప్పుకోదగ్గది కూరగాయలమ్మి సంద్రాలుదగ్గర నేర్చుకున్నవి. ప్రతిరోజూ తెల్లార్తూనే  నవనవలాడే వంకాయలూ, నూగు నూగు నేత బెండకాయలూ, గోరాన్తే కమిలిపోతాయమ్మాలాటి హెచ్చరికలతో ఆనపకాయలూ నిండినతట్టతో ముంగిట్లోకొచ్చి, హావభావాల్తో రసవత్తరంగా, సంద్రాలు వినిపించిన కథలు. నేను స్కూల్లో నేర్చుకున్ననీతులకన్నా స్థిరస్థాయిగా నా ఎదలో పాదుకుపోయినవి ఆ సంద్రాలు సుభాషితాలే..

ఏటుండిపోతాత్తల్లీఅంటూ మొదలెట్టి, తాను కిరస్తానీ పాదరీమాటల్నమ్మి ఆళ్లలో కలిసిపోయి, అక్కడ వాళ్లు ఒరగబెట్టిందేం లేదని తెలుసుకుని, తిరిగొచ్చి, అత్తమ్మచేత మొహంవాచేలా చీవాట్లు తిని, పోస్పొమ్మనుకుని, అందిన బస్సెక్కేసి, సింవాచెలంసివార్ల టీకొట్టు జీరుసాయిబుపంచన చేరి పొద్దు పుచ్చుకుంటున్న వైనం నాకు ఏరోజుకారోజు కొత్తే.

సంద్రాలు జాలారాళ్లింట పుట్టింది.

చేపలమ్ముకోకుండా, కూరలమ్ముకుంటున్నావేమిటి అనడిగానోరోజు. దానికంత పనస చదివింది ఈదురుగాలిలో పూలతీవెలా వూగిపోతూ.

అదేనమ్మగారూ, పిదపకాలం పిదపబుద్ధులు. మావోడొట్టుకొచ్చిన సేపలమ్ముకొని, కమ్మంగ వొండి  ఆడికింతెట్టి నానింత కతికి మారాజుల్లా బతికినోల్లం. నలుగురు బిఢ్డల్ని కంటి. ఆ దొరబాబొచ్చి వూదరెట్టేసినాడూ, మిమ్ముల్ని ఈపెద్దిల్లోల్లు సరింగ సూసుకోట్నేదూ, మీరూ మడుసులే గంద, మీకైన ఆరికైన గిల్లితే రగతంవే గంద కారత్తది, ఆల్లకేం పాలు గారవు గంద, మీరూ ఆల్లూ అందురూ సమానంవే గంద, మిమ్ముల్నేల ముంగిట్లోకి రానీరూ అంటా. ఆమీన కిరస్తవంవుచ్చీసుకో, మేంవణ్ణంఎడతం, గుడ్డలెడతం, మాఇల్ల మాసరిసమంగ కూసోనెట్టుకుంటం, అంట వూఁ ఊదరెట్టీసినాడు. మాం గుబగుబలాడిపోయ్నం. నామగోడు నేన్రాను పొమ్మన్నడు. మాఅత్తమ్మ ను పోతే పో, పోరగాల్లని తీసికెల్తానికీల్లేదంది. ఆడివాక్కుల్నమ్మి నాను పోతిని. తీరా సేస్తే ఏటుందక్కట మాత్తరం. మీఇల్ల మీ ఇల్ల సేసుకునే దాసీకంవే ఆడికీ సెయ్యనంవయిందంతే. ఏరాయయైతేనేం పల్లూడకుంతానికని…నాకు సంద్రాలు మాటలు సగం అర్థం అయేయి, సగం కాలేదు. ఆ వాగ్ధార చూస్తే మటుకు, ఏబళ్లో చదువుకున్నావు, చెప్పు, నేనూ అక్కడే చదూకుంటాన బుద్ధేసేది నాకు.

నాన్సెపతన్న యినుకో. నివ్వు సాచ్చాత్తు మాలచ్చి అస్మంటి ఆతల్లికి బుట్టేవు నివ్వు. ఆయమ్మని మార్సేస్కోగలవా. నేవు. మీయమ్మే మీయమ్మ. మరేయమ్మా మీయమ్మ గానేదు. అసుమంటిదే మతఁవూని. ఎక్కన్నో ఏదో వున్నాదని పరువులెత్తితే ఏటున్నది, ఏంనేదు, దిబ్బ. ఉన్నదాన్లనే సుకం సేసుకోవాల. అద్గదీ నిజింవైన తెలివి. నివు గొప్ప సదూలు సదూకుంతన్నవు. ఇమానంలో ఏలండనో వమిరికవో ఎల్పోతవు కడుపు సేతట్టుకుని. .

నాకు నవ్వొచ్చింది కాని కడుపు సేతట్టుకుని అన్నమాటతో కాస్త ప్రాణం చివుక్కుమంది.

ఎలా తెలుసు? అన్నాను.

అదంతా నాకెరికే. నాకన్నీ తెలస్తయ్ బుల్లెమ్మా. ఈతట్ట సెల్లిపోనంక, అప్పల్సాంవి కొట్టుకాడ కూసుంట బస్సుకోసం. ఆడ జనాలు వూసులాడుకుంతరు, వాలిండియరేడియనాగే,అంది కొంటెగా నవ్వుతూ.

సంద్రాలుకి నలుగురు పిల్లలు. వాళ్లని బళ్లో వెయ్యలేదేం అన్నాను మరోరోజు.

మాకేల సదుగుల్తల్లీ. ఆబోగాలన్నీ తమనాటోరికి తగుతవి. రెక్కాడితే గాని డొక్కాడని బతుగులు మాంవి. డొక్కలోకి సంగటెల్తేనే రెక్కలాడే పేనాలు. ఆల్లు నలువురూ నాల్రూకల్తెస్తే, నానో నాలుగట్టుకొస్తె తలో ముద్దా మింగుడడతది. నేకుంటే అందురం పస్తులే. మాబిడ్డలే మాకు ఆస్తి బుల్లెమ్మా,అంది.

విద్యలేనివాడు వింతపశువు, విద్యవలన కలుగు వినయంబు అంటూ చదవడానికి నాకు నోరు రాలేదు.

తాను మతం వుచ్చుకున్నంతమాత్రాన తనబతుకేం రంగేళీ బతుకయిపోలేదనీ, అధికంగా ఒరిగిందేం లేదనీ, జ్ఞానోదయం అయి ఇంటికి తిరిగొచ్చేసింది సంద్రాలు. కాని అప్పటికే దానిమొగడు మరో జూనియర్ సంద్రాలుని తెచ్చీసుకుని సెటిలయిపోయేడు.

దాంతో కనిపించిన బస్సెక్కేసి, సింహాచలం సివార్ల దిగిన సంద్రాలుకి జిగినీసాయిబు తగిలేడు. నాకింత గంజి కాసొయ్యి, నీకింత సోటిస్తాను అన్నాడు వాడు. తలూపింది సంద్రాలు. అయితే సంద్రాలుకి ఆ టీకొట్టు వెనక కమ్మలగుడిసెలో కూచుని జిగినీసాయిబు తెచ్చిన డబ్బుల్తో కాలచ్చేపం సేసుకుంటా కూకోడం నచ్చలేదు. అంచేత, దొఢ్లో నాలుగు పాదులు పెట్టి, ఆకూరలు నాలుగు వీధులంట తిరిగి అమ్ముకు, వచ్చిన డబ్బుల్తో నానూ ఓమడిసినేని గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నాది.

ఏటుండిపోతాదంటూనే మల్లీ ఈతాపత్రయం అంతా ఏమిటి? అన్నాను మరోరోజు నవ్వుతూ.

కూరలవ్యాపారం ఎందుకూ, టీకొట్టుమీద వచ్చిన ఆదాయం ఇద్దరికీ సుష్టుగా సరిపోతుంది గదా అన్నాట్ట జిగినీసాయిబు. అందుకని అడిగానామాట.

మడుసులం గంద. ఆపరమాతుముడేటి సెప్పినాడూ నీడూటీ నువ్ సేసుకుంట పో. ఆపైయవ్వారంవంత నాన్ సూసుకుంతనన్నడు గంద. అంటే ఏటీ. నువ్వు మడిసి జలమెత్తనందుకు నీకో దరమం వున్నాది. అది నువ్ సేసుకోవాల. అంతే గానీ అదేటీ, ఇదేటీ అంట లాపాయంటులు నాగరాదు,అంటూ లాపాయింట్ పాఠాలు చెప్పేసింది నాకు ఏకటాకీని. 

                                                                                000

అర్థశతాబ్దం దాటినా సంద్రాలు భాషణలు నామనసులో చెక్కు చెదరకుండా అలానే వున్నా.యి ఈనాటికీనూ నిన్నో మొన్నో విన్నట్టు..

నీర్కావిపంచెలా వెలవెలబోతున్న నింగీ, ఆనింగిలోకి తొంగి చూస్తూ, బోడికొమ్మల్తో అస్థిపంజరాల్లా వాకిట్లో నిలబడ్డ మేపుల్ చెట్లు, మీద పడుతున్న మంచుతో బూడిద పూసుకుని తపోనిష్ఠలో వున్న పరమయోగుల్లా నిలబడి కాలగతికి అద్దం పడుతున్నాయి.

చెప్పుకోదగ్గ కారణంలేకుండానే నామనసు మొద్దు బారిపోయింది. వేడి వేడి పకోడీలు సేవిస్తూనో, వెచ్చగా ముసుగుదన్ని ఏలోకాల్లోకో తేలిపోతూనో పొద్దుపుచ్చుకోవలసిన సుందర సమయం. సంద్రాలు గుర్తొచ్చింది ఏటుండిపోద్తల్లీ అంటూ, అసందర్భంగానే.

అమెరికాలో దిగడి ముప్పై ఏళ్లు దాటుతోంది.. గత ఇరవై యేళ్లలోనూ ఏడు కంప్యూటర్లు అయేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఆమలకములవలె ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను ఏటివాలులో ఓటుపడవలా… ఏటా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నన్యూ అండ్ ఇంప్రువుడు గాడ్జెట్టుల అడుగులకి మడుగులొత్తుతూ, నాతిచరామి అనుకుంటూ నడవకపోతే నా రాతలు కాలదోషం పట్టిపోతాయేదేమోనని భయం. అయిదురకాల తెలుగుఫాంటులు మార్చాను నిత్యనూతనంగా వచ్చిపడుతున్న సిస్టములవత్తిడికి గిలగిల్లాడుతూనే.

ఈవైరాగ్యానికి అసలు కారణం నిన్న నా బాసురుడి సతాయింపు. అ-నుంచి క్షవరకూ తెలుగు నేర్చిన ఓఅమెరికను ఓచిన్న కంపెనీ మొదలుపెట్టాడు భారతీయభాషలలో వున్న సాహిత్యాన్ని డిజిటలైజు చేసి, సర్వాంగసుందరంగా ఫార్మాటింగు చేసి, చక్కని ముఖపత్రంతో శాశ్వతంగా పదిలపరుస్తాం అంటూ. ఆయన మార్కెటింగ్ చూసుకుంటానన్నాడు. నాకు బిజినెస్ బుర్ర లేనందున నేను అతని దగ్గర చేరేను. నాపని పైన చెప్పిందంతా చెయ్యడం.

తెలుగువాళ్లు బోలెడు డాలర్లు గుమ్మరించి మాచేత ఈపని చేయించుకోడం ఎంచేతో నాకు అర్థంకాదు. దేశంలోనే తెలుగువారిచేతే చేయించుకోవచ్చు కదా. అవుట్సోర్సింగులో ముచ్చట్లు అనుభవించడానకా? అలాచేస్తే కానీ ప్రపంచీకరణ అనిపిపించుకోదనా? తెల్లవారిచేతిలో తెలుగు మరింత తెల్లమవుతుందనా?

ఏమో మరి.

 

ఇంతకీ నాకు వచ్చిన తెలుగుపుస్తకంలో భాష పరమఘోరంగా వుంది. ’’ఆయన పచ్చి శాకాహరము తినిపించబడవలసిన అవుసరము కలిగెను. స్నీనము చేపించుటకు ఇతరులు లేక పరివేషకులు పస్తువులు తెచ్చి ఇచ్చుడకు కవలసిన వస్తు సందాయంనకు వారు దుకానములో తీసుకొనిరాకుండుటకు… ఇలా తలా తోకా లేని వాక్యాలూ, ముద్రారాక్షసాలూ పుష్కలంగా వున్నాయి.

నేను బాసుబాబుకి ఆమాట చెప్పి, తప్పులు దిద్ది పంపమని అడగండి అన్నాను.

దానికి ఆయన కోపం తెచ్చుకోకుండా, స్వరం బాగా తగ్గించి, కాస్త ముందుకి వంగి, నీకు ఇచ్చినపని చెయ్యడమే నీవంతు. మనం వారిని తప్పులు పట్టరాదు అన్నాడు, మళ్లీ ఏం అనుకున్నాడో, నేను వాళ్లని అడుగుతాను, ఈలోపల నీపని మొదలుపెట్టు అన్నాడు.

మంచి కాపీ వచ్చింతరవాత ఒకేసారి చెయ్యొచ్చు కదా అంటే అతనికి నచ్చలేదు. ఆయనగారి నిజబాధ ఆతప్పులు నేను పట్టేననేమో. నేనేదో నాపాండిత్యం ప్రదర్శించేస్తున్నాననకుంటున్నాడేమో…. మిడిమిడి భాషాపరిజ్ఞానంగలవారితో మామూలుగా వచ్చే చిక్కే ఇది.

 

అంతర్జాలంలో తెలుగు ముంగిళ్లు చూస్తూ కూచున్నాను. తెలుగుపుస్తకాలన్నీ డిజిటలైజు చేస్తున్నారుట, వాటిని శాశ్వతం చేసి కాపాడుకోడానికి. నాకు నవ్వొచ్చింది. నేను కూడా ఆదోవలోనే నడుస్తున్నాను మరి. 

అసలు మనదేశంలో 19వ శతాబ్దంలో ముద్రణ మొదలు పెట్టినప్పుడు వాళ్లవుద్దేశ్యం మనజ్ఞానసంపద ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకురావాలని. శాశ్వతంగా వుంటుందన్నది రెండోకారణం. ఇప్పుడు ఆఅభిప్రాయానికి తకరారొచ్చింది. - కాయితాలు చెదలుతినేస్తాయనీ, వానల్లో వరదల్లో ఆనవాలు లేకుండా కొట్టుకుపోతాయనీ డిజిటలైజు చేస్తున్నారు. అలా చేస్తే దేశంలోనే కాక ఖండఖండాంతరాలకి విస్తరిల్లుతాయనీ, అవి పరమ శాశ్వతం అయిపోడానికి మరి ఇహ ఢోకా లేదనీ అభిజ్ఞుల అబిప్రాయం. 

నిజంగా??

నాకు దిగులు ముంచుకువస్తోంది. …

నేను కూడా కంప్యూటరుయుగం వచ్చేసింది కదాని నాకథలు శాశ్వతం చేయడంకోసం నీలితెరకెక్కించడం మొదలుపెట్టేను.

ముందు మరోమాట చెప్పాలి. నేను ఇరవై ఏళ్లకిందట. ఓసంస్కృతం నేర్చిన అమెరికనుప్రొఫెసరుగారు తయారుచేసిన తెలుగుఫాంట్స్తో టైపు చేసి ఐదుంబావు అంగుళాల ఫ్లాపీలమీద పదిలపర్చుకుంటూ వచ్చేను. ఆఫాంట్స్ వాడకం అట్టే కాలం నిలవలేదు. కంప్యూటరు అప్గ్రేడు చేసుకున్నప్పుడే పోతన ఫాంటులు వాడడం మొదలుపెట్టేను. ఆతరవాత శ్రీఫాంట్స్ బావున్నాయని ఓసుమిత్రుడు ఇండియావెళ్లినప్పుడు కొనుక్కొచ్చి ఇస్తే, అవి వాడేను. మధ్యలో ఇంకేవో వాడేను. ఐందుబావుఫ్లాఫీలు పోయి మూడున్నర అంగుళాల ఫ్లాపీలొచ్చేయి.

ఇప్పుడు నాకంప్యూటరులో అసలు ఫ్లాపీడ్రైవే లేదు. దానికోసం వేరే ఫ్లాఫీ డొక్కు కొనుక్కోమన్నారు. నేను కొన్న శ్రీఫాంటులతో పీడీయఫ్ చేసినకథలు ఈనాడు కొన్ని సరికొత్త కంప్యూటరులు అపార్థం చేసుకుని అక్షరాల్ని గజిబిజిగా ఆలికేస్తున్నాయి బాబిగాడు వేసే ముగ్గుల్లా.  ప్రోగ్రామరులు వున్న ఫాంటులని శాశ్వతంగా వాడే ప్రయత్నం చెయ్యడానకి బదులు కొత్త కొత్త ఫాంటులు రాసిపారేస్తున్నారు. ఇప్పటికి అయిదు రకాలు వాడిన నన్ను ఈసాంకేతికులు మరో ఫాంటు రాసేం దీనికి తిరుగులేదు, దీనికిదే సాటి, వాడి చూడండంటున్నారు.

నాబాధ - నాపాత కథలు ఎంతకని మళ్లీ మళ్లీ టైపు చేసుకుంటూ కూర్చోనూ? నావల్ల కాదు.

చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి ….

పదికాలాలపాటు నిలబెట్టుకుని తరతరాలా వారసత్వపుహక్కుగా అనుభవించవలసిన మిద్దెకి ఉద్వాసన చెప్పి, నేను ఎడతగని న్యూ … ఇంప్రువ్డ్ … ఎండ్ అల్టిమేట్ … అనుక్షణం మారిపోతున్న సంస్కృతికి దాసోహం అనుకుంటూ, నిత్యనూతనమైన వింతలకోసం, నాలుగుక్షణాల మెరుపులకోసం ఆత్రపడిపోతూ దినములు గడుపుతున్నాను.

ఏది శాశ్వతం అనుకుంటూనే ఏదో ఒకటి చెయ్యకపోతే పొద్దు పోదు. ప్రతివాణ్ణీ జీవితంలో పదిహేను నిముషాలపాటు కీర్తికాంత వరించి తీరుతుందంటారు అమెరికనులు. అందులో శాశ్వతం ప్రస్తావన లేదు. నిరుడు కురిసిన హిమసమూహములూ, నిన్నటి వార్తలూ పట్టించుకునే ఓపికలేదు. .. మనబతుకులు ఇవాళా, రేపటితో ముడిపడి వున్నాయి. నాడూటీ నేను చేసుకుంటూ పోవాలి. అంతే.

సంద్రాలు ఎదురుగా నిలబడి ఏటుండిపోత్తల్లీ అంటూ ఎత్తిపొడిచినట్టయింది. సంద్రాలు నోట వెలువడిన మాటే అక్షరం అనిపిస్తోంది ఈనాటి వెబ్జాలంలో చిక్కుకుపోయిన నాకు. నాడూటీ నేను సేస్కంటా పోవాల. అంతే. 

తెలివొచ్చింది. ఆచెత్తపుస్తకం తీసుకుని వున్నదున్నట్టు టైపు చెయ్యడం మొదలెట్టాను. మాబాసుకి కావలసింది నావేళ్లు కీబోర్డుమీద తకతకలాడుతున్నాయా లేదా అన్నదే కదా.

 

(నామాట- ఇది ఎందుకు రాసిందన్న సందేహం కొందరికైనా రాకమానదు. ఆసందేహనివృత్తికోసం మనసంస్కృతిలో వున్నచోట వుండడం, వస్తువు పదికాలాలపాటు మనడం కోరుకుంటారు. ఆధునికయుగంలో కదలిక పురోగమనానికి సంకేతం. కదుల్తూంటే పైకి పోతున్నట్టే లెక్క [moving is moving up]. పురోగమనంపేరుతో ఒకొక్కప్పుడు మనం పనికిమాలినపనులు కూడా చేస్తున్నామేమో, చేయాల్సొస్తుందేమో అనిపిస్తుంది నాకు. - ఎన్నెమ్. మార్చి 2008

ఈమాట.కాం. లో ఇది ప్రచురింపబడింది.)

 

ఆగష్టు 5, 2008

కథల వెనక కథలు

ప్రచురించిన వర్గము చర్చలు, నాకథలు, వ్యాసాలు, సాహిత్యం — malathi @ 7:41 పూర్వాహ్నం
Tags: , ,

కథలవెనక కథలు

ఏకథ అయినా ఎక్కడ మొదలవుతుంది, ఒక కథకి ప్రేరణ ఏమిటి అన్న ప్రశ్న ఎలా వచ్చిందో ముందు చెప్తాను.

నేను కిందటివారం రాసిన “నేనూ, నారచనలూ” టపామీద కొత్తపాళీగారు ఓ వ్యాఖ్య పెట్టేరు.  “రచయిత రాసిందే పట్టించుకోవాలి మిగతా వివరాలన్నీ ఎందుకూ అంటారు కొంతమంది. కానీ నా మట్టుకి నాకు ఆయా కథల వెనుక రచయితకి ఉన్న ప్రేరణ ఏవిటి అనేది తెలుసుకోవడం చాలా బాగుంటుంది” అని.

దానిమీద నేను,  సమాధానం రాస్తూ, ప్రేరణమీద రాయడానికి చాలా వుంది అన్నాను, అనాలోచితంగానే.

అయితే రాయండి అని పూర్ణిమగారు అన్నారు. అప్పుడు నాకు తెలివొచ్చింది. J ఏంరాయాలా అని ఆలోచిస్తూ వాక్‌కి బయల్దేరి, దారి తప్పి పొరుగూరు వెళ్లిపోయాను. మాయింటినించి మైలున్నర నడిస్తే పొరుగూరే లెండి. దారి తప్పి తిరుగుతూంటే నాలుగుముక్కలు తోచేయి. ఇవి మీప్రశ్నకి సమాధానం అవునో కాదో మీరే చెప్పాలి.

నిజానికి రాస్తున్నవారందరూ ప్రేరణ కలగబట్టే కదా రాస్తున్నారు. అందుకు సందేహం లేదు. అయితే ఏకథ ఏప్రేరణతో వచ్చింది అంటే అప్పుడు బోలెడు కథలవెనక కథలు తెలుస్తాయి. ఈవిషయమే కొత్తపాళీ అన్నది, కథలకి ప్రేరణ ఏమిటో తెలుసుకోడం తనకి ఇష్టమని. దానికి నాకు తోచిన టీక ఏమిటంటే - చిన్నకథలకి ఒక ముఖ్యలక్షణం క్లుప్తత. అంటే, అటు ఆరుతరాలూ, ఇటు మూడు తరాలూ, లోకంలో గల సమస్త జనుల సమస్యలూ, మినిఎన్‌సైక్లోపిడియాలాగ రాసుకుంటూ పోడానికి నవలలో అయితే సాగుతుందేమో కానీ చిన్నకథలో అలా కాదు.. కథలో ప్రధానాంశంమీద మాత్రమే కేంద్రీకరించి కథ నడపాలి. తెలుగువాళ్లలో అలా రాయడానికి రావిశాస్త్రిగారికి పెట్టింది పేరు. ఆయన కథని శిల్పం చెక్కినట్టు ఒక్కొక్కమాట చెక్కుతారని ప్రసిద్ధి. అలా క్లుప్తంగా చెప్పినప్పుడు సహజంగానే చెప్పకుండా వుండిపోయినసంగతులు చాలా వుంటాయి.

ప్రతిభగల రచయిత కథలోనే మొత్తం చెప్పగలగాలి అంటారు గానీ దానికో లిమిటుంటుంది. చాలా మంచికథలో రచయిత తాను చెప్పదలుచుకున్న విషయం అంతా క్లుప్తంగా, స్పష్టంగా చెప్పి వుండొచ్చు. కానీ, ఆ కథ వెనక కథ ఏమిటో తెలుసుకున్నప్పుడు, ఆకథకి ప్రయెజనం ద్విగుణీకృతమవుతుంది. అంటే ఒకకథగా పరిపూర్ణంగా ఆవిష్కరించడం జరిగినా, దానికి వెనక వున్న ప్రేరణ ఏమిటో తెలిసినప్పుడు మరొకస్థాయి అర్థాన్ని సంతరించుకుంటుంది అని. (కొత్తపాళీగారూ, నా అర్థం తప్పయితే, చెప్పండి).

ఉదాహరణకి, నేను రాయని కథ ఒకటి, అంటే నిజంగా జరిగింది, చెప్తాను. ఒకసారి నేను మాఅమ్మాయిని చూడ్డానికి లాసాంజలస్ వెళ్లేను. తన గదిలో గోడమీద ఒక ఇంగ్లీషు కవిత వుంది. మామూలుగా మనం రోజూ అనుకునే మాటలే - రేపు ఏంఅవుతుందో తెలీదు, అంచేత ఈరోజు హరివిల్లు చూసి ఆనందించు .. అని. కింద తన స్నేహితురాలి పేరు చూసి, టాషా కవితలు రాస్తుందని నాకు తెలీదే అన్నాను.

అది టాషా కాదు, సారా రాసింది అంది మా అమ్మాయి. (నేను పేరు తప్పు చదివాను.).

నేను గతుక్కుమన్నాను. ఎందుకంటే -

టాషా చిన్న చెల్లెలు సారా. చిన్నమ్మాయి. తొమ్మిదేళ్లు.

అంతచిన్నమ్మాయికి అంత ఫిలాసఫీ ఏమిటి అని.

ఆకవిత రాసిన రెండునెలలకి

ఆఅమ్మాయి మరో ఇద్దరు స్నేహితులతో, సైకిళ్లమీద రోడ్డు దాటుతోంది.

అటునించి వస్తున్న కారు చూసుకోలేదు.

ప్రమాదం జరిగింది.

మిగతా ఇద్దరికి చిన్న దెబ్బలే కానీ సారాకి ప్రాణాంతకమైంది.

మరో రెండు వారాలకి ఆచిన్ని ప్రాణం పోయింది.

అవును, మీలాగే, నాకు చాలా బాధగా అనిపించింది. అంతేకాదు, ఇతర ఆలోచనలు - అంతచిన్నమ్మాయికి అంత గంభీరమైనవిషయం ఎందుకు రాయాలనిపించింది,, తాను అట్టే కాలం బతకనని తనకి తెలుసా, కాకతాళీయమా, …

ఇక్కడ నేను ఉదాహరణగా ఇవ్వడానికి కారణం, వాక్యం తరవాత వాక్యం చదువుతుంటే, మీఆలోచనలు మారుతూ వచ్చేయి కదా. అలా మీఆలోచనలు మారుతూ సాగడానికి అనువుగా వాక్యాలు విరిచేను కూడా అనుకోండి. 

కథల్లో కూడా అంతే జరుగుతుంది. మీకు ఒకొక్కవిషయం తెలుస్తుంటే, కథ పువ్వు విడినట్టు వెల్లివిరుస్తుంది. కథ అంతకంతా అర్థవంతమవుతుంది.

నారచనలువ్యాసంలో చాలా చోట్ల నేను ఒక చిన్నవాక్యం ఇచ్చి, ఇదే ఈకథకి ప్రేరణ అని చెప్పేను. అంటే ఆ ఒక్కవాక్యంతో కథ తయారయిపోయిందని కాదు. అది ప్రేరణలో తొలిమెట్టు మాత్రమే. అంతకుముందూ, ఆతరవాతా జరిగిన చాలా సంఘటనలు -విన్నవీ, కన్నవీ, చదివినవీ- చాలా విషయాలు బుర్రలో పురుగుల్లా తొలుస్తూనే వుంటాయి నాకు ఎప్పుడూను.. అందులో కధకి పనికొచ్చేవి ఏరుకుని, కూర్చుకుని కథని ఓకొలిక్కి తెస్తాను. 

ఈవ్యాసంలో, ఏదో ఒకకథ మొదలు పెట్టినతరవాత ఆతొలి ప్రేరణని ఎలా మలుచుకున్నానో చెప్తాను. మీరూ మీకథలని ఎలా మలుచుకుంటున్నారో రాస్తే మంచి చర్చ అయి, మరిన్ని పనికొచ్చే విషయాలు తెలుస్తాయి. 

ఒకొక్కప్పుడు ఏదో ఒకవాక్యం ఠకీమని తగులుతుంది అన్నాను. నవ్వరాదు కథకి మూలం కూడా ఒక్కవాక్యమే. అది 1968లో రాశాను. కాని దానికి మూలకారణమైన వాక్యం విన్నది 1957 ప్రాంతాల్లో. ఆ ఒక్క వాక్యంమీద కథ రాయడానికి అంతకాలం పట్టింది నాకు.

ఆవాక్యం - మావాళ్లలోనే, ఒకాయన. ఆయనకి సంగీతం చాలా ఇష్టం. నలుగురు ఆడపిల్లలకీ వీణ చెప్పించేరు. పెద్దమ్మాయిని మేనత్త తనంత తనే కోరి కోడలుగా చేసుకుంది. మేనరికం అంటే ఈపిల్ల ఏం నేర్చుకుందో తెలిసే వుండాలి కద. పెళ్లి అయింతరవాత, ఆఅమ్మాయి వీణ తీస్తే, సంగీతం ఏమిటి సానికొంపలాఅందిట అత్తగారు. ఆమాట మాఅమ్మ ఎవరితోనో చెప్తుంటే విన్నాను. ఆతరవాత కొంతకాలానికే. చిన్నతనంలోనే ఒక రకమైన మస్క్యలర్ డిస్ట్రెఫీతో చనిపోయింది. నేను షాకు తిన్నాననే అనుకుంటాను. అందుకే నాకు దాన్నిగురించి రాయడానికి అన్నేళ్లు పట్టింది.

 

అయితే, వాళ్లింట్లో సంగతులు నాకు పూర్తిగా తెలీవు. నిజంగా ఏంజరిగిందో, వున్నదున్నట్టు రాయడానికి లేదు. నాకు అర్థం అయిందల్లా తనవాళ్లే అంత కఠినమైన మాట అన్నారు అన్నదే. అచ్చంగా ఆకథే రాయాలని మొదలుపెట్టలేదు నేను నాకథ.

నాకు చిన్నప్పుటినుండీ నవ్వుతాననీ, నవ్విస్తాననీ పేరుంది. అంచేత, నవ్వడంమీద సరదాగా రాద్దాం అనే మొదలుపెట్టేను. అందుకే ఆమధ్యకాలంలో, 1957-68, అప్పుడప్పుడు వింటున్నమాటలు, చూస్తున్నవిషయాలు పెళ్లి కాని ఆడపిల్లలు అన్నగార్ల ఇంట్లో కాలక్షేపం చెయ్యడం, కాలేజీలో హాస్యాలూ, సినిమాకబుర్లూ … ఇవన్నీ ఆకథలో చోటు చేసుకున్నాయి. హాస్యంగా మాటాడినా, మరోవేపు జనాలని తప్పుకుతిరగడం కూడా నాలక్షణమే. నేనంటే ప్రత్యేకంగా అభిమానం చూపించే స్నేహితురాళ్లు కూడా వున్నారు ఆ పదేళ్లకాలంలోనూ. అలా అనేక విషయాలు, వేరు వేరు స్థలాల్లో వేరు వేరు కాలాల్లో జరిగినవి అనేకం కలిసి ఓకథగా రూపు సంతరించుకున్నాయి. అయితే అందులో సౌందర్యం ఏమిటంటే వాటినన్నటిని ఒకగూట్లోకి చేర్చడం. అది సమర్థవంతంగా చేసానా లేదా అన్నది మీరే చెప్పాలి.

 

ఇంతటి విషాదకరమైన విషయమే అక్కర్లేదు కథ రాయడానికి. జీర్ణతృణంకథ రాయడానికి ఆధారం అక్షరాలా గరికపోచలే. నేను 1961-62లో లైబ్రరిసైన్సులో చేరేను. అదే సంవత్సరం కొత్తలైబ్రరీ భవనానికి ప్రారంభోత్సవం అయింది. ఇప్పుడున్న లైబ్రరీ అదే. అప్పుడు లైబ్రేరియన్, కోనేరు రామకృష్ణరావుగారు లైబ్రరీచుట్టూ తోట వేస్తే బాగుంటుందనీ, అందర్నీ మొక్కలు తీసుకురమ్మనీ ప్రోత్సహించారు. నేను నిజంగానే అవేవో గడ్డిపరకలు తీసుకువెళ్లేను. ఎక్కడినుంచో నాకిప్పుడు జ్ఞాపకంలేదు కానీ గడ్డి ఇచ్చిన మాట నిజం. ఆతరవాత కొంతకాలం తరవాత చూస్తే, నిజంగానే ఆ గరికపోచలు పచ్చని తివాసీలా కన్నులపండుగ చేసేయి. ఇది అమెరికాలోలాగ కత్తిరింపులసొగసు కాదు. నిలువుగా పెరిగి, సహజమైన కొనలతో వుండే అందం.

అయితే పచ్చగడ్డిమీద కథ ఏం రాయగలం, పల్లెపదాలు రాయొచ్చునేమో కానీ. అంచేత మళ్లీ నా ఖజానాలోంచి కథ లాగాల్సివచ్చింది పత్తిలోంచి దారం లాగినట్టు. చెప్పేను కదా మానాన్నగారు స్కూలుటీచరు కనక, స్కూళ్లలో జరిగే ట్రాన్సఫరులూ, పెన్షనుకోసం పడే అగచాట్లూ నాకు అవగతమే. అంచేత, నా గరికపోచలకి ఓ టీచరమ్మని కథానాయకిని చేసేను. వూరిబయట బంగళా, తుపాకీతో దొరగారూ కొంత రావిశాస్త్రిగారి కథలు చదవగా పట్టుబడ్డ (లేదా పట్టుకోవాలని తాపత్రయపడుతున్న) నుడికారం. రావిశాస్త్రిగారి పువ్వులు కథలో ఈతుపాకీ పేలదు అని ఓవాక్యం వుంది. అది చాలా గొప్పవాక్యం ఆకథలో. పోతే, విశాఖ హార్బరులో అప్పుడప్పుడు కనిపించే తెల్లదొరలూ.

 

అంటే నేననడం ప్రేరణ అంటే మీట నొక్కినట్టు ఏదో ఒక మాటా, ఒక సంఘటనా, ఒక వస్తువూ .. వూపునివ్వడం మాత్రమే కాదు. కథ మలచడం మొదలు పెట్టిన్నప్పుడు ఇతర సామగ్రి చాలా వాడుకోడం జరుగుతుంది.. ప్రేరణనిచ్చేది ఒకటి కావచ్చు, కథ మరొకటి కావచ్చు.

 

ప్రతికథకీ ఓమనిషో ఓసంఘటనో మాత్రమే కావాలని ఏం లేదు. ఫలరసాదుల గురియవే పాదపములూ”, “వానరహస్తంలాటి కథలు ముందు శీర్షిక పెట్టేసుకుని, తరవాత కథలు ఆలోచించేను. వానరహస్తంఅన్న శీర్షిక ఎందుకు పెట్టేనని ఎవరైనా అడుగుతారేమోనని చూస్తున్నా కానీ ఇంతవరకూ ఒక్కరూ అడగలేదు. ఇంక సస్పెన్సు భరించలేక నేనే చెప్పేస్తున్నాను.

నేను ఆంధ్రాయూనివర్సిటిలో ఆనర్సు చదివేరోజుల్లో వానరహస్తం అన్న శీర్షకతో ఒక నాటిక చూసాను భారతి మాసపత్రికలో. దానికి మూలం w.w. Jacobs రాసిన Monkey’s paw అన్న ఓ చిన్నకథ. నాకు నాటకాలంటే సరదాలేదు కానీ ఆశీర్షికా, దానివెనక కాంసెప్టూ చాలా నచ్చేయి.  శీర్షికే ప్రేరణ అయినా, నాకథకీ దానికీ మరే సంబంధమూ లేదు. మళ్లీ సంఘటనలకోసం నాభోషాణం వెతక్కోవాల్సొచ్చింది. అంతకుముందు, అంటే ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో మా అప్పాయమ్మ కొడుకు పదేళ్ల కుర్రాడు నాకు కాలేజీకీ కాఫీ తెచ్చేవాడు. రెండునెలలు అయింతరవాత అప్పాయమ్మ చెప్పింది వాడు ఆపని చెయ్యనంటున్నాడని. తోటి పిల్లలు హేళన చేస్తున్నారట కాఫీలు మోస్తున్నాడని. అది తలుచుకున్నప్పుడు నాకు తోచింది అతని వ్యక్తిత్వం. నాకథలో ముత్తయ్యని అలా దిద్దేను. అలాగే నేను లైబ్రరీలో పని చేసేరోజుల్లో ఒకమ్మాయి వుండేది యల్.డి. క్లర్కు. ఇంటినిండా పదిమంది పెద్దా, చిన్నా. తన ఆదాయం ఒక్కటే అందరికీ ఆధారం. అలాటి కొందరు క్లర్కులని చూసిన తరవాత తయారయిన పాత్ర సావిత్రి.

ఆఅమ్మాయికి కన్నీరు పిలిచిన పలుకు తల్లి. ఆవిషయం నేను హాస్యానికైనా వాడుకోవచ్చు, విషాదం సృష్టించడానికేనా  వాడుకోవచ్చు. ఆకళ్లు, … వాటినిండా నీళ్లులాటి వాక్యాలు వాడుకోవాలంటే, కథకుడి బలహీనత చూపాలి. అలాగే ముత్తయ్య తల్లి కల్లూ ఒల్లూ తిప్పుకుంటూ ఊసులాడతాదని ఆయమ్మనొగ్గేసి నాకొడుకు పొట్ట కొట్టీసినాడులాటి వాక్యాలు రాయడానికి కూడా కథకుడిని సావిత్రికి ఆపోజిట్‌గా నిలబెట్టాను. అంచేతే, కథకుడిని అబ్బాయిని చేసేను.

 

నిజానికి రాయడం ఫుల్‌టైం ఉజ్జేగమే. మీరు రోజుకో కథ రాయక్కర్లేదు. కానీ దానిగురించిన తపన వుండాలి సదా. కనిపించిన ప్రతివస్తువూ, ప్రతి సంఘటనా, ప్రతి మనిషీ కథగా వెంటనే మారిపోరు. పదిలంగా దాచుకుంటే ఎప్పుడేనా పనికొస్తాయి. ప్రేరణ విషయంలో నాకు తెలిసింది ఇంతే.

 

 

(ఆగస్ట్. 1008.)

 

« వెనుకటి పుటముతరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.