మామ్మగారి మరణం

1955లో తెలుగు స్వతంత్రలో వచ్చిన నా స్కెచ్ శీలా సుభద్రాదేవిగారు రాస్తున్న వ్యాసంలో చూసేవరకూ నాకు గుర్తే లేదు.

ధన్యవాదాలు సుభద్రాదేవిగారూ, 66 ఏళ్లనాటి స్కెచ్ తవ్వి తీసినందుకు.

కథానిలయంలో ఇక్కడ చూడగలరు.

కథానిలయం నిర్వాహకులకు మనఃపూర్వక ధన్యవాదాలు.

(నవంబరు 15, 2021)

వ్యాసంలో ఏమి చెప్పేరు? శీర్షిక ఏమి చెప్తోంది?

డా. రమేష్ ప్రసాద్ రావెళ్ళ గారు రచించిన వ్యాసానికి శీర్షిక ఇలా ఉంది.

Aricle Heading in Misimi 11/2021


ఈవ్యాసం నిడివి 20 పేజీలు. మొదటి 3 పేజీలలో నిడదవోలు మాలతి రచనావ్యాసంగంగురించి ఉంది. మిగతా 16 పేజీలలో తెలుగుకథలకి ఆంగ్లఅనువాదాల సంకలనాలూ, అనువాదాలు, ఇతర దేశరచయితలకథలు ఉన్నాయి.

నామొదటి సందేహం- 20 పేజీల వ్యాసంలో 4 పేజీలు మాత్రమే నిడదవోలు మాలతి సాహిత్యం గురించిన చర్చ అయినప్పుడు ఆవ్యాసానికి మాలతిపేరూ, ఫొటో సమంజసమా అన్నది. నాఅభిప్రాయంలో సమంజసం కాదు.

రెండవ సందేహం ప్రవాససాహిత్యం అన్న running title గురించి. నిజానికి ఇదే మొదటి సందేహం అనాలేమో.

అసలు ఏది ప్రవాససాహిత్యం అన్నది మొదట ప్రస్తావిస్తాను. ఈవిషయంమీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

ఆదిని ఒక సంస్కృతివారు మరొక సంస్కృతినీడన నివసిస్తూ ఆ రెండు సంస్కృతులమూలంగా తమలో కలిగిన సంఘర్షణలకు లోనై, దరిమిలా దానిమూలంగా తమజీవితాలలో కలిగిన మార్పులను ఆవగాహన చేసుకుని, సమన్వయపరుచుకుని మరో సంస్కృతి సృష్టించుకున్నవారు రాసిన కథలు అని నిర్వచించేరు. అంటే రెండు భిన్నసంస్కృతులను సమన్వయపరుచుకుని ఆ అవగాహనతో చేసిన రచనలు అని.

నేను చాలాకాలం ఈ భిన్నసంస్కృతులు అన్నది రెండు దేశాలయితేనే తమకి ప్రత్యేకమైన సంస్కృతి సృష్టించుకునే పరిస్థితి ఏర్పడుతుందని అనుకున్నాను. కానీ ఈమధ్య మనదేశంలోనే ఒక రాష్ట్రంనుండి మరొకరాష్ట్రానికి తరలివెళ్లి స్థిరపడి రచనలు చేసేవారిని కూడా ప్రవాసులనే అంటున్నారు. ఇంకొంచెం ముందుకి వెళ్లి మరొకఊరులో స్థిరపడినవారి అనుభవాలు కూడా అవే అంటున్నారు. ఇలా మరోఊరికి మరో వీధికీ మారినవారిని కూడా ప్రవాసులంటే తెలుగుదేశంలో ప్రవాసులు కాని రచయితలు లేరనే అనుకోవాలి. పెళ్లిళ్లూ, ఉద్యోగాలూ, పిల్లలచదువులూ ఇలా ఏదో ఒక కారణంగా ఊరుమారని రచయితలు లేరు. అలాటప్పుడు సాహిత్యమంతా ప్రవాససాహిత్యమే. వేరుగా ప్రవాససాహిత్యం అన్నపేరు అనవసరమే కదా.

ఇన్ని రకాలవాదనలు లేక నిర్వచనాలు ఉన్నప్పుడు సహజంగానే వ్యాసకర్త తనకు తాను ఒక నియమాన్ని విధించుకుని ఆ పరిధిలో వ్యాసం వ్రాస్తాడు. ఈ నియమాన్ని వ్యాసం మొదట్లో వివరిస్తే బాగుంటుంది.
ఈవ్యాసకర్త, రమేష్ ప్రసాద్ రావెళ్ళగారు ఈవ్యాసంలో వివరించలేదు కానీ ఇది 14వది కనక మొట్టమొదటి వ్యాసంలో వివరించేరనుకుందాం.

నేను ఈ ఒక్క వ్యాసమే చూసేను కనక నాకు అర్థమయినపరిధిలో రమేష్ ప్రసాద్ గారు ఏవి  ప్రవాసకథలుగా గుర్తించేరు అంటే ఇంగ్లీషు అనువాదాలు అన్నీ అని అనుకున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అరికాళ్ళకింద మంటలు ఈవ్యాసంలో చోటు చేసుకుంది. అంటే రమేష్ ప్రసాద్ గారి అభిప్రాయంలో అది ప్రవాసకథే అనుకోవాలి.

నాఅభిప్రాయంలో అది ప్రవాసకథ కాదు. ప్రతి ఆంగ్లానువాదాన్ని ప్రవాసకథ అనడం సమంజసం కాదు.

నిడదవోలు మాలతికథలను చెహోవియన్ కథలు అని, చెహోవ్ కథలలో శిల్పంగురించి తరవాత ప్రస్తావిస్తాననీ వ్యాసకర్త మొదట్లో అన్నారు కానీ తరవాత చెహోవ్ కథలు చర్చిస్తున్నప్పుడు మళ్లీ మాలతికథలు ప్రస్తావించి సారూప్యం ఎత్తి చూపడం జరగలేదు. అలా చేసి ఉంటే ప్రధానశీర్షికకి కొంత బలం కలిగేది.

వ్యాసరచనగురించి కూడా ఒకమాట చెప్పుకోవాలి. నిజానికి ఇది ఈ ఒక్క వ్యాసంగురించే కాదు. సాధారణంగా వ్యాసాలు, విమర్శలు, సమీక్షలగురించి. వ్యాసాలలో విమర్శలలో తమ వాదన లేదా అభిప్రాయానికి అవుసరమైన సన్నివేశమో పాత్రో సూక్ష్మంగా వివరించవచ్చు కానీ కథంతా ఆసాంతం చెప్పడం సమంజసము కాదు. అలా కథంతా చెప్పేయడం మూలరచయితకి అన్యాయమే అవుతుంది. పాఠకులకు మూలకథ చదవాలన్న ఆసక్తి నశిస్తుంది.  

ఈవ్యాసంలో చాలాకథలు అలా సంక్షిప్తంగా చెప్పేయడం జరిగింది. కొన్నకథలకి రచయిత తమఅభిప్రాయాలు జోడించేరు. కొన్ని కథలకి అది కూడా లేదు.

స్థూలంగా ఈ వ్యాసానికి నిడదవోలు మాలతి అన్నపేరు సమంజసం కాదు. ఒకరకంగా ఇది నన్ను కించపరుస్తుంది అని కూడా అనుకోవచ్చు.

ప్రవాససాహిత్యం అన్న పదం కూడా సరికాదు. ఇందులో ప్రవాసులజీవితాలు చిత్రించనివి, ప్రవాసరచయితలు చేసిన రచనలు కానివి ఉన్నాయి కనక.

మరోలా చెప్పాలంటే, మాలతిసాహిత్యంమీద అయితే మిగతా రచయితలచర్చ అంతగా విస్తరించకూడదు. తులనకి ఉపయోగపడేవరకే.

అలాకాక, ప్రవాససాహిత్యంగురించి అయితే, మాలతి కథలలో ప్రవాసజీవితానికి సంబంధించినవి మాత్రమే చర్చించాలి. ఆ రెండూ జరగలేదు ఈవ్యాసంలో.   

ఇప్పుడు నా ప్రశ్నలు –

1. వ్యాసకర్తకి, ఈ వ్యాసానికి నిడదవోలు మాలతి అని పేరు పెట్టడం ఎలా సమర్థనీయం? రమేష్ ప్రసాద్ గారూ, ఈ వ్యాసాలు సంకలనంగా వేస్తే, శీర్షిక మార్టవలసిందిగా కోరుతున్నాను. ఆసందర్భంలో నాసాహిత్యానికి సంబంధించిన భాగాలు తొలగించినా నాకు సమ్మతమే. ధన్యవాదాలు.

2. మిసిమి సంపాదకులకు, ఏమి చెప్పాలో నాకు తెలియడంలేదు. ఈవ్యాసం చదివి వారే గ్రహించుకోవాలి.

(నవంబరు 8, 2021)

గూడు లేనివాడు (చిన్నకథ)

హేమీకి కోర్టువారినుండి తాఖీదు వచ్చింది.

ఫలానారోజున ఫలానా టైముకి స్థానికకోర్టులో హాజరు కావలసింది అని. లేదు. అతనేమీ నేరం చేయలేదు. అతను ఇచ్చుకున్న ఒక నేరారోపణవిషయంలో అతని సాక్ష్యం అవుసరం కనక కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వవలసిందిగా ఆహ్వానం అది.

నేరారోపణ ఏమిటో చెప్పేముందు, అసలు అంతవరకూ జరిగిన కథ చెప్పాలి.

ఈ హేమీ అనబడువాడు ఉన్న మూడంతస్తుల మేడకి ఎదురుగా ఓ చిన్న ఇల్లుంది. అది పడగొట్టి మరో మేడ లేపే ఉద్దేశంతో ఆఇంటివారు ఆ ఇంటిని నేలమట్టం చేయనున్నారు. ఈలోపున గతిలేని దరిద్రులు ఇద్దరు ఆ ఇంట నివాసం ఏర్పరుచుకున్నారు. అది కంటకప్రాయమయింది పొరుగుమేడలో ఉన్నవారికి. వారు హేమీ ఉంటున్న మేడ మేనేజరుకి ఓ ఘాటయిన నోటిసు పంపించేరు.  

ఆ నోటీసు వివరాలు ఇలా ఉన్నాయి.

— ఆ పడగొట్టబోయే చిన్నఇంటిలో ఉన్న దరిద్రులు (మేనేజరు వాళ్ళని squatters అంటాడు) అడ్డుగోడలు దూకి పొరుగుమేడ ప్రవేశిస్తున్నారు, వీధిలో పాదచారులవెంట బడుతున్నారు.

తమ పరిసరాలు పరిరక్షించుకోవలసిన బాధ్యత ఆప్రాంతంలో ఉన్న అందరికీ ఉంది కనక చుట్టుపక్కల నివసిస్తున్నవారు అందరూ తమ ప్రాంతాన్ని భద్రముగా ఉంచుకోడానికి సాయపడాలి కనక ఆ దరిద్రులను అరికట్టాలనీ, వారిని ఆ ఇంటినుండి బహిష్కరించాలనీ కోరుతూ స్థానిక అధికారులకు ఉత్తరములు  రాయవలసింది. 

ఆ నోటీసులోనే రెండు పేర్లు సూచించబడ్డాయి కానీ అవి ఎవరివి? యింటియజమానులవో, నోటిసుకర్తలవో, ఆ దరిద్రులవో స్పష్టం చేయలేదు.  

ఇహ అసలు విషయానికొస్తే, ప్రజాక్షేమము కోరేవాడూ సమాజసేవకి అంకితమైనవాడూ అయిన హేమీ ఆ నోటీసులో ఆదేశంప్రకారం స్థానిక అధికారులకు ఉత్తరం రాసేడు. ఈ ఉత్తరం ఇలా ఉంది –

 — ఫలానావీధిలో కూలద్రోయనున్న ఇంటి యజమాని ఆఇంటిని కూలద్రోయక తాత్సారము చేయుటవలన ఆ ఇల్లు దిక్కులేనివారికి ఆశ్రమయి ఇరుగుపొరుగులకు ఇబ్బంది కలిగించుచున్నది. ఆ ఇంట చేరిన ఖబ్జాదారులు గోడలు దూకి, మా వీధిన పోయే బాటసారుల వెంటబడి మాప్రాంతమున భయంకరపరిస్థితులు కల్పించుచున్నారు. ఏతత్కారణమున తమరు వారిని బహిష్కరించి, మాప్రాంతమునకు భద్రత పునఃప్రతిష్ఠించవలసినదిగా  ఇందుమూలముగా కోరడమైనది.”

ఆ ఉత్తరం పోస్టు చేసి తనవిధి నిర్వర్తించినందుకు బహువిధాల ఆనందించేడు హేమీ.

అయితే అతను ఎదురు చూడని వాస్తవం స్థానికఅధికారులనుండి రాగల ఆహ్వానం. అతను అనుకోలేదు కానీ అది వచ్చింది, “మీఫిర్యాదు మాకు చేరినది. మేము దానిని కూలంకషముగా పరిశీలించినాము. దురాక్రమణదారులు ఆ నేరమును అంగీకరించలేదు. అందుచేత రెండు పార్టీలను సమావేశపరచి. మాతీర్పు చెప్ప నిశ్చయమైనది. ఫలానారోజున ఫలానా టైముకి హాజరు కావలసినది,” అని ఆ ఉత్తరం ఆదేశం.

ఆ ఫలానారోజు హేమీమహాశయుడు కోర్టులో హాజరయేడు.

అతనిప్రాంతంలో అభద్రపరిస్థితులు కల్పించినట్టు నేరము ఆరోపించబడిన దురాక్రమణదారులు ఇద్దరూ హాజరయేరు. ఇక్కడ వారిని నిందితులుగా గుర్తించడమైనది.

నిందితులలో ఒకడైన మీకో తమకి వేరే న్యాయవాదులు లేరనీ, తానే ఇద్దరితరఫునా మాటాడతాననీ విన్నవించుకున్నాడు. జడ్జీగారు అందులో గల తికమకలు కొంత వివరించి, చివరికి అంగీకరించేరు.

ఇరు పార్టీలవారూ తమతమ వాదనలను ప్రతిపాదించేరు.  

సాక్షులను ప్రశ్నించడం మొదలయింది. -మీకో ప్రశ్నలు, హేమీ సమాధానాలు ఇలా ఉన్నాయి.
“నేను  గోడ దూకుతుండగా నువ్వు చూసేవా?”

“నేను చూడలేదు”

“గోడ దూకుతూండగా చూసేవా?”

“లేదు.”

“నేను వీధిలో ఎవరివెంట బడుతుండగా చూసేవు?”

“ఎవరివెంటబడడం చూడలేదు.”

“నువ్వు మమ్మల్ని మొదటిసారిగా చూసేవు?”

“ఈరోజు ఇక్కడ మొదటిసారిగా చూస్తున్నాను.”

“మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేసేవు?”

“నాకు మామేనేజరు పంపిన నోటీసులో అలా ఉంది కనక.”

“నువ్వు చూడనివిషయం చూసినట్టు సాక్ష్యం ఇచ్చుట నేరము అని నీకు తెలుసా?”

హేమీకి ఏమని జవాబివ్వలో తెలీలేదు.

“నీకు ఆ నోటీసు పంపినవారింట్లో ఏవస్తువులైనా పోవడం గానీ, ఎవరికైనా హాని కలగడం గానీ జరిగిందా?”

“నాకు తెలీదు.”

మీకో జడ్జివేపు తిరిగి, “యువరానర్, ఈ సాక్ష్యం hearsay కనుక అంగీకారయోగ్యం కాదు. ఆకారణముగా కేసు కొట్టివేయవలసిందిగా కోరుచున్నాము,” అన్నాడు.

కేసు కొట్టివేసేరు వాది నమ్మదగ్గ ఋజువులు చూపించని కారణముగా.

అందరూ బయటికి నడిచేరు.

మిస్టర్ హేమేష్ మళ్లీ ఆ నిందితుడివేపు చూసేడు. ఎవరో పారేసిన కోటూ, అరిగిపోయిన చెప్పులూ, తుప్పజుత్తూ ఇతనికి న్యాయశాస్త్రంగురించి ఇంత ఎలా తెలిసింది అని ఆశ్చర్యం.

ఆమాటే అడిగేడు. “నువ్వు ఏం చదువుకున్నావు?”

“పదోక్లాసు. నువ్వేం చదివేవు?”

“హార్వర్డు లా స్కూల్.” 

“హఁ. Perry Mason చూసేను 5 సీజన్లు.” 

“నీకు ఇల్లు లేదు, ఎక్కడ చూసేవు టీవీ?”

“నేను ఈ కూలబోయే గోడలమధ్యే పుట్టేననుకున్నావా?”

హేమీకి ఆపైన ఏం అడగడానికీ తోచలేదు.

మీకో అన్నాడు, “నాకు ఇల్లు లేదు కానీ బుర్ర ఉంది. నీకు ఇల్లుంది కానీ బుర్ర లేదు.” 

000

చిన్న వివరణ: ఈకథలో ప్రస్తావించిన నోటీసు మేనేజరుద్వారా నాకు వచ్చినమాట నిజం. నేను మాత్రం దానిమీద ఏమీ చర్య తీసుకోలేదు. చెత్తబుట్ట దాఖలా చేసేను. కథలో ఉన్నాయి నాకారణాలు.

Pandemic కారణంగా ఓ మోస్తరు జరుగుబాటు గలవారు చాలామంది వీధిపాలయేరు.

ఈకథ రాయడానికి కారణం కొందరు ఇల్లులేనివారిగురించి ఎంత హేయమైన అభిప్రాయాలు  ఏర్పరుచుకుంటారో, వాటిని ఎలా ప్రచారం చేస్తారో చెప్పడానికే.

(నవంబరు 2, 2021)

భారతనారి – నాడూ నేడూ

రచన: ఇల్లిందల సరస్వతీదేవి

ఇది చాలాకాలం క్రితమే చూసేను కానీ ఫేస్బుక్కులో రాస్తున్న పోస్టుకోసం మళ్లీ చూసేను. ఇక్కడ మీతో కూడా పంచుకోవాలనిపించింది.

ఇల్లిందల సరస్వతీదేవిగారి ‘భారతనారి – నాడూ నేడూ’ పుస్తకరూపంలో  మనకి లభించిన సుదీర్ఘవ్యాసం. 40 పేజీలలో  చారిత్ర్యకంగా వేదకాలంనుండీ ఇప్పటివరకూ మనదేశంలో స్త్రీలస్థానం ఎలా ఉండేదో, మనకాలం వచ్చేసరికి ఎలా మారుతూ వచ్చిందో అద్భుతంగా వివరించేరు సరస్వతీదేవిగారు.

ఈరోజుల్లో ఏ హక్కులకోసం పోరాడుతున్నారో అవి వేదకాలంలో ఉండేవిట. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి’ అంటూ మనువు ధర్మసూత్రం వల్లిస్తారు కానీ ఎవరూ ఇంట్లోనూ సమాజంలోనూ శ్రుతి, స్మృతులలో ప్రవచించిన స్త్రీలస్థానంగురించి మాటాడరు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులు,  యాజ్ఞవల్క్యుడు స్త్రీలకి ఆస్తిహక్కులు, దత్తత తీసుకునే అధికారం ఉన్నాయంటాడు. అసలు అంతకుముందే కౌటిల్యుడు క్రీ.పూ. 4వ శతాబ్దంలోనే స్త్రీలు వివాహం రద్దు చేసుకోవచ్చునని నిర్ణయించేడు.  కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పునర్వివాహానికి కూడా వీలు కల్పించేడాయన.  

అసలు వివాహసంస్థ విషయంలో కూడా పాశ్చాత్యులకీ మనకీ కొండంత తేడా ఉంది. వాళ్ళది విషయలోలుత పురస్కరించుకుని ఏర్పడ్డది. భారతదేశంలో ధర్మము మూలహేతువు అంటారు సరస్వతీదేవిగారు. విషయలోలుత అంటే భౌతికం అన్న అర్థంలో కావచ్చు. వాళ్లకి వివాహం తను, భార్య, పిల్లలకి పరిమితం. మనకి వివాహం మూడుతరాలకి విస్తరించింది. సామాజికధర్మం కూడా. సంఘసంక్షేమవిషయంలో కూడా గృహస్తుడికి బాధ్యత ఉంది. వివేకానందుడు ఉపన్యాసాలలో మనకీ పాశ్చాత్యులకీ దృష్టిలో తేడాగురించి చెప్తూ, ‘మీరు స్త్రీని స్త్రీగా చూస్తారు, మేం స్త్రీని తల్లిగా పూజిస్తాం’ అంటాడు అందుకే..

మధ్యకాలంలో మహమ్మదీయులకాలంలో స్థితిగతులు మారేయి ఆనాటి అరాచకీయ పరిస్థితులమూలంగా. అసలు ఏ శాస్త్రాలయినా ఆయా కాలాల్లో పరిస్థితులనిబట్టి ఏర్పడతాయి కదా.  మనకి స్వాతంత్ర్యం వచ్చేక రాజ్యాంగచట్టాలు తయారు చేసినప్పుడు స్త్రీలహక్కుల ప్రసక్తి వచ్చింది కానీ న్యాయం జరగలేదు. దానికి సరస్వతీదేవిగారు చెప్పిన కారణం ఆ చట్టాలు చేసినవారికి మనసంస్కృతిలో వేదకాలంనుండి స్త్రీలకి ఉన్న హక్కులగురించిన అవగాహన లేకపోవడం అంటారు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న పండితులకి వేదకాలంలో స్త్రీలస్థానంగురించి తెలుసుకోగల సంస్కృత భాషాజ్ఞానం లేదు. వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్న సంస్కృతపండితులకు ఆ వేదసూత్రాలను వివరించగల ఇంగ్లీషు భాషాజ్ఞానం లేదు. దాంతో అంతా అస్తవ్యస్తం అయిపోయింది.”

సరస్వతీదేవిగారి పుస్తకం archive.org లో ఉంది. ఈపోస్టు చివర్లో లింకు ఇచ్చేను.

ఈవిషయంలో విదేశాలలో స్త్రీలస్థానంగురించి నా ఆలోచనలు కూడా పంచుకుంటున్నాను ఇక్కడ, కొంచెం శాఖాచంక్రమణమే అయినా. పోల్చి చూసుకోడానికి ఉపయోగపడవచ్చు.

“సుమారుగా పద్ధెనిమిదో శతాబ్దం మధ్యలో- అప్పటికి స్త్రీవాదం అన్న పదం వాడుకలో లేదు కానీ ఫ్రాన్సులో కార్మికులతిరుగుబాటు వచ్చింది. ఆ కార్మికులని నిరసిస్తూ Edmund Blake ఓ పుస్తకం రాసేడు. దాన్ని పూర్వపక్షం చేస్తూ, బ్రిటిష్ రచయిత్రి Mary Wollstonecraft మరో పుస్తకం Vindication of Rights of Men అని రాసి ప్రచురించింది 1790లో. ఆతరవాత మరో రెండేళ్ళకి Vindication of Rights of Women అని మరో పుస్తకం రాసింది. సమాజంలోనూ ఇంట్లోనూ స్త్రీలస్థానం, హక్కుల న్యాయాన్యాయవిచారణ చేస్తూ రాసిన ఈ పుస్తకం అనేకమంది మేధావులదృష్టిని ఆకట్టుకుంది. తన తండ్రి తల్లిని హింసించడం, ఆడవారిపట్ల హేయంగా ప్రవర్తించడంలాటివి ఆమె స్వయంగా చూడ్డం, పదిహేడేళ్ళకే స్వయంశక్తితో చదువుకోడం, బతుకుతెరువు చూసుకోడంతో ఆమెకి సమాజాన్నిగురించిన అవగాహన ఏర్పడింది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించి, విశ్లేషించి స్త్రీల పరిస్థితి మెరుగుపరచడానికి ఉద్యమించింది. స్త్రీలకి చదువు, ఉద్యోగాలు, వివాహచట్టాలలో అన్యాయాలూ లాటి విషయాల్లో విశేషంగా కృషి చేసింది. అయితే మనం ముఖ్యంగా గమనించవలసినవిషయం – స్త్రీస్థానం సమాజంలోనూ, ఇంట్లోనూ కూడా ఘనమైనదే, గౌరవించదగ్గదే అని ఆమె అభిప్రాయం. దీన్ని తొలిదశ స్త్రీవాదంగా పరిగణించేరు తరవాత అంటే “స్త్రీవాదం” అన్న పేరు ప్రచారంలోకి వచ్చినతరవాత. ఈదశలో ఈ సమస్యలచర్చ కేవలం మధ్యతరగతి స్త్రీలకి మాత్రమే పరిమితమయింది, అది కూడా బ్రిటన్లోనే. ఒక దశాబ్దం తరవాత, 1900-1918 మధ్యలో మేధావంతులయిన స్త్రీలు అమెరికాలో వోటు హక్కులకోసం అలజడి లేవదీశారు. క్రమంగా ఇతర అంశాలు కూడా వారి పోరాటంలో చోటు చేసుకున్నాయి. కొంతవరకూ సాధించేరు కూడాను – ఆడవారికి పైచదువులూ, హైస్కూల్ విద్యావిధానంలో ఆడపిల్లలకి అనుగుణమైన మార్పులు, వివాహితులకి ఆస్తిహక్కులు, అలాగే దంపతులు విడిపోయినప్పుడు పిల్లల సంరక్షణలో స్త్రీలస్థానం లాటివి. వోటు హక్కులు మాత్రం మొదటి ప్రపంచయుద్ధం వరకూ రాలేదు.

వోటు హక్కులవిషయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఇక్కడ ఉన్న తరతమబేధాలు. మనకి 1947వరకూ స్వాతంత్ర్యమే లేదనుకో. కానీ అది వచ్చింతరవాత వోటు హక్కంటూ వచ్చినప్పుడు, అందరికీ ఆడవారికీ మగవారికీ ఒక్కసారే వచ్చింది. అమెరికాలో అలా కాదు. ముందు ఉన్నతవర్గాలలో శ్వేతజాతి స్త్రీలకి మాత్రమే వచ్చింది. ఆతరవాత క్రమంగా, స్త్రీఉద్యమాలవల్ల నల్లవారికీ, వారిలో స్త్రీలకీ, బీదవారికీ … అలా అంచెలంచెలుగా హక్కులకోసం పోరాడవలసి వచ్చింది.

రెండవప్రపంచయుద్ధం సమయంలో మగవారంతా యుద్ధరంగానికి వెళ్ళిపోయినప్పుడు, దేశంలో కర్మాగారాల్లోనూ, ఇతర వ్యాపారాల్లోనూ పని కుంటుపడడంతో స్త్రీలని ఆ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇది రెండోదశలో చెప్పుకోదగ్గ మలుపు.  ఆరోజుల్లోనే స్త్రీలు ఉద్యోగాల్లో అసాధారణ ప్రతిభ చూపించి, తాము మగవారికి ఏమాత్రమూ తీసిపోమనీ, ఇంకా కొన్నిచోట్ల మగవారికంటే మెరుగ్గానే చేయగలమనీ కూడా నిరూపించుకున్నారు. 60వ దశకంలో బెటీ ఫ్రీడాన్ (Betty Friedan) ప్రచురించిన పుస్తకం Feminine Mystique దేశంలో సంచలనం లేపింది. “స్త్రీలకి కేవలం మాతృత్వం, గృహిణిబాధ్యతలు మాత్రమే పరిపూర్ణమయిన సంతృప్రిని కలిగిస్తాయన్నది భ్రమ” అని ఆమె వాదం. ఈకాలంలో స్త్రీలు రాజకీయాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించేరు. మధ్యతరగతిస్త్రీ స్థితిగతులతో మొదలయిన ఉద్యమం దిగువతరగతి స్త్రీలసమస్యలు కూడా తీసుకుంది. దీనికి ప్రధానకారణం ఫోర్డ్ కంపెనీలో పని చేస్తున్న స్త్రీలు తమకి మగవారితో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె ప్రారంభించడం. ఇది జరిగింది 1968లో. అప్పటికి బెటీ ఫ్రీడాన్ పుస్తకం వచ్చి ఐదేళ్ళయింది. అది ప్రజలలో గట్టిగా ఆలోచించేలా చేసింది. క్రమంగా ఇంటా బయటా కూడా స్త్రీలకి సంబంధించిన ఇతరవిషయాలు – స్త్రీల ఆరోగ్యసమస్యలు, ముఖ్యంగా గర్భధారణకి సంబంధించిన అంశాలలోనూ తదితరవిషయాల్లోనూ స్త్రీలకి సంపూర్ణ అధికారంవంటివి ఈ ఫెమినిస్టు ఉద్యమం రెండో దశలో చోటు చేసుకున్నాయి. ఈదశలో ప్రముఖ స్థానం వహించింది గ్లోరియా స్టైనమ్ (Gloria Steinem). కాస్త విపరీతధోరణి మొదలయింది కూడా ఇక్కడే. ఈవిడే మొదలు పెట్టిందని ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక వాక్యం “మగవాడిఅండలేని ఆడదానిబతుకు సైకిలులేని చేపబతుకులాటిది” అన్నది. ఆ తరవాత స్టైనమ్ ఆ వాక్యం తాను సృష్టించింది కాదని చెప్పినా, స్థూలంగా మగవారిపట్ల ఆమె ధోరణివల్ల ఆవాక్యం ఆమెదిగానే ప్రచారంలో ఉంది. ఇంతకీ స్త్రీలు తమ తిరుగుబాటుధోరణిని ఎంతవరకూ తీసుకుపోయేరో అన్నది తెలుస్తుంది ఇక్కడ. ఆరోజుల్లోనే ప్రస్తుతం ప్రజలు మాటాడుతున్నది “మగభాష” అనీ, ఆడవాళ్ళకి వేరే భాష కావాలనీ వాదించేరు. Woman అన్న పదంలో man ఉందని దానికి ప్రతిగా womyn అని మార్చడంలాటివి కూడా చేసేరు. 69, 70 దశకాల్లో ఇది ఉధృతంగా సాగింది. ఆ ఊపులోనే గ్లోరియా స్టైనమ్ పెళ్ళికి కూడా విముఖురాలు.

క్రమంగా ఆ ఉధృతం చల్లబడి, 80లు వచ్చేసరికి ఉద్యమం మరొక మలుపు తిరిగింది. ప్రముఖ రచయిత్రి ఆలిస్ వాకర్ (Alice Walker) కూతురు రెబెకా వాకర్ (Rebecca Walker) “నేను మూడో మలుపుని” అన్న శీర్షికతో వ్యాసం రాసి గ్లోరియా స్టైనమ్ నడుపుతున్న Ms Magazine లో ప్రచురించింది. ఆ వ్యాసం అనేకమంది ప్రముఖలనీ, ముఖ్యంగా ఆనాటి యువతనీ ఆకట్టుకుంది. స్ర్రీలు ఎదుర్కొంటున్న అసమానత్వం –  వయసు, లింగబేధం, జాతివివక్షతలు, గే, లెస్బియన్ జీవనవిధానం, దారిద్ర్యం, స్త్రీల విద్యాస్థాయి వంటి అనేక కోణాలు ఆమె ఎత్తి చూపి, సకల రంగాల్లోనూ అందరికీ సమస్థాయి ఉండాలి వంటి అంశాలు ఈ మూడోదశ స్త్రీవాదనలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. ఈదశలో వెనకటి ఔద్ధత్యం తగ్గి, అందరం మనుషులమే అంటూ కొంత సమతూకంతో ఆలోచించడం కూడా మొదలయింది. ఇది అమెరికా, బ్రిటన్, యూరపులలో నడిచిన కథ.ఈ విషయాలన్నీ కొంతవరకూ మన సమాజంలో స్త్రీలకీ వర్తిస్తాయి అనిపించినా మనకీ వారికీ ఉన్న తేడాలు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, కేవలం హక్కులగురించే పోరాటం చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడంలాటిదే. అసలు మనదేశంలో స్త్రీలహక్కులగురించి మరోదారిలో సాగింది.

వ్యత్యాసాలు గమనించాలి మనం. భౌగోళికంగా, సామాజికంగా, జనాభాదృష్ట్యా ఏర్పడిన కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి మనకి. అవి కూడా మన జీవనవిధానాన్ని తీరిచి దిద్దుతాయి. ఇంతకుముందు ఒకసారి మాటాడుకున్నాం అనుకుంటా ఈవిషయాలు. మనకి కుటుంబం అంటే ఒక్క భార్యా, భర్తా, పసి పిల్లలు మాత్రమే కాదు కదా. నిజానికి బ్రిటన్లో కూడా మనసమాజంలో ఉన్నలాటి ఆనవాయితీలు పందొమ్మిదో శతాబ్దంలో కనిపిస్తాయి. జేన్ ఆస్టిన్ నవలలు చూడు. ఇరవయ్యవ శతాబ్దం తొలిపాదంలోనే మన స్త్రీలు స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నారు కదా. గాంధీకి సత్యాగ్రహం చేయాలన్న స్ఫూర్తి మన ఆడవారినుండే వచ్చింది అంటారు.      

పాశ్ఛాత్యుల జీవనవిధానం మన జీవనవిధానం కంటె వేరు అయినా సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అవి భిన్నంగా కనిపించవచ్చు కానీ క్రియాశీలకం కాదు. వారిబాధలు వారు ఎదుర్కొన్న విధానం మనకి ఆ క్షణానికి ఘనంగా కనిపించవచ్చు కానీ ఆచరణీయం కాదు. ఎంచేతంటే మన జీవనవిధానం వేరు. మన సామాజికపరిస్థితులు, కుటుంబపరిస్థితులు, మన వాతావరణం – వీటన్నటి ప్రభావం మన బతుకులమీద ఉంది. మన కుటుంబాలలో స్త్రీకి ఉన్న స్థానం వేరు.

మనం వారిని అనుసరించేముందు ఇవన్నీ అలోచించాలి. గుడ్డిగా అమెరికావో బ్రిటనో ఇలా చేస్తోందని అనుసరించడం అభ్యుదయం కాదు.

000

ఇల్లిందల సరస్వతీదేవి గారి భారతనారి – నాడూ నేడూ వ్యాసానికి లింకు https://archive.org/details/in.ernet.dli.2015.389592

000

(అక్టోబరు 30, 2021)

డా. పి. శ్రీదేవి. రచన శీలా సుభద్రాదేవి

సాహిత్య ఎకాడమీ ఆధ్వర్యంలో డా. పి. శ్రీదేవిగారి సాహిత్యవ్యాసంగం క్షుణ్ణంగా పరిశీలించి ప్రముఖ కవయిత్రీ రచయిత్రీ శీలా సుభద్రాదేవి రచించిన పుస్తకం ఇది.

పి. శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు, కాలాతీతవ్యక్తులు అంటే పి. శ్రీదేవి అని తెలుగులోకంలో సుప్రసిద్ధం. కొంతమందికి ఆమె తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరని తెలిసిఉండొచ్చు. కానీ శ్రీదేవి చిన్నకథలు, కవితలు కూడా రాసేరనీ, విమర్శలు, సమీక్షలు కూడా ప్రచురించేరనీ, ఆమెకి చిత్రలేఖనంలో పరిచయం ఉందనీ తెలిసినవారు లేరేమో. ఉంటే చాలా తక్కువ అనుకోవాలి.

ఈ మోనోగ్రాఫ్‌లో లభ్యమైనంతవరకూ శ్రీదేవి జీవితచరిత్ర, తెలుగు సాహిత్యంలో వివిధశాఖలలో ఆమె చేసిన కృషిని సూక్ష్మదృష్టితో పరిశీలించి, విశ్లేషణాత్మకంగా వివరించేరు సుభద్రాదేవి. సుమారు పది సంవత్సరాలలో వృత్తిరీత్యా వైద్యరంగంలో పని చేస్తూనే సాహిత్యంలో ఇంత కృషి చేసేరా అని ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రాదేవి సమకూర్చిన సమాచారం చూస్తే.

ఒక్క కాలాతీతవ్యక్తులు నవల 38 పేజీలలో విశ్లేషించేరు రచయిత్రి.  ఇతివృత్తం, పాత్రచిత్రణ, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులనేపథ్యంలో శ్రీదేవి ఈనవలను ఎంత సమర్థవంతంగా నిర్వహించేరో గ్రంథస్థం చేయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. శ్రీదేవిగారి తాత్వికచింతనగురించిన విశ్లేషణ ప్రత్యేకంగా బాగుంది.

కవయిత్రి సుభద్రాదేవి శ్రీదేవి కవితలను సాటికవయిత్రిగా విశ్లేషించినతీరు మనసుకి హత్తుకునేలా ఉంది. అలాగే శ్రీదేవి ఉపసంపాదకురాలిగా పని చేస్తున్న రోజులలో చేసిన విమర్శలూ, సమీక్షలూ కూడా ప్రతిభావంతంగా చేసేరంటారు సుభద్రాదేవి.

తెలుగు సాహిత్యచరిత్రలో చెప్పుకోదగ్గ రచయిత్రి డా. పి. శ్రీదేవి. స్త్రీల సాహిత్యచరిత్ర, కాల్పనికసాహిత్యచరిత్రలలో ఆసక్తి గలవారు తప్పక చదవవలసిన పుస్తకం.

ప్రచురణకి సంబంధించిన వివరాలు ఇదుగో.

డా. పి. శ్రీదేవి

కాలాతీతవ్యక్తులు నవల ఇక్కడ http://www.archive. org సౌజన్యంతో.

(అక్టోబరు 16, 2021)