మనలో మనమాట 26 – Rideవ్వకు సుమా!

ఇది ఒక ఊహాచిత్రం.
మనదేశంలో ఎవరూ car ride ఇవ్వరని విన్నాను. వాళ్ళు రైడెందుకివ్వరో చెప్పేముందు అమెరికాలో రైడివ్వడం ఎలా జరుగుతుందో చూదాం.

పొట్టి జవాబు – అమెరికాలో కార్లెక్కువా మనుషులు తక్కువా, మనదేశంలో మనుషులెక్కువా కార్లు తక్కువా. అక్కడ బహుశా రైడివ్వడం మొదలు పెడితే ఆ రథం ఇల్లు చేరడానికి మూడ్రోజులు పట్టొచ్చు.

పొడుగు సమాధానం – అదే ఇక్కడ కార్లెక్కువ. సాధారణంగా మేలుకున్న వేళలో కనీసం ముప్ఫై శాతం కార్లలోనే గడుస్తుంది. సాధారణంగా కారు లేనివాళ్ళు తక్కువ కనక కారున్నవారు లేనివారియందు ఉదారభావం కలిగి ఉంటారు. ఇందులో చాలా కిటికులున్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పలేను కానీ కొ్న్ని చెప్తాను. ఏమాత్రమైనా ముఖపరిచయం ఉన్నవారు కాలినడకన వెళ్తూ కనిపిస్తే, వాళ్ళు వ్యాయామంకోసమే నడుస్తున్నారని తెలిసినా, పద, నిన్నక్కడ దింపేస్తాను అనడం కేవలం పలకరింపు, హలో కులాసాయేనా లాగ. కాళ్ళమీ నడిస్తే వ్యాయామం కానీ కారుమీద వెళ్తే వ్యాయామం ఎలా అవుతుంది అంటే చెప్పడానికేం లేదు.

మరోరకం – అవసరమైనప్పుడు పిలిస్తే, అవతలివారికి వేరే పని లేకపోతే రైడు ఇవ్వం అనేవాళ్లకన్నా ఇస్తాం అనేవాళ్ళే ఎక్కువ కావచ్చు. అలాటప్పుడు అది పుచ్చుకున్నవారు gas money అంటూ నాలుగో పదో – ఎంత దూరం వెళ్తున్నాం అన్నదాన్నిబట్టి – సొమ్ము ఇవ్వ జూపుతారు. కొందరు పుచ్చుకుంటారు, కొందరు ఫరవాలేదులే, అవసరం లేదనేసి వెళ్ళిపోతారు. వీటన్నిటికీ అంతకంటే అంతరార్థాలు లేవు. ఏవో దురాలోచనలో దూరాలోచనలో మనసులో పెట్టుకు చేస్తున్నారు అనడం న్యాయం కాదు.

మరోరకం సాయం – hitchhiking. నేను అమెరికా వచ్చిన కొత్తలో వీధివార పిడికిలి బిగించి బొటనవేలు చూపుతూ నిలబడినవాళ్లని చూసి మంచినీళ్ళకోసం కాబోలు అనుకున్నాను. ఇప్పటివాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాచిన్నప్పుడు స్కూళ్ళలో దాహం అని చెప్పడానికి అది సంకేతం మరి. తరవాత తెలిసింది అటే వెళ్తున్న కారయితే కొంతదూరం అయినా కారులో ఎక్కించుకకు తీసుకెళ్ళమని అడగడం అని.
వీరు అంతకుముందు ఏమాత్రమూ పరిచయం లేనివారే కనక ఈ సాయం కొంత ప్రమాదంతో కూడుకున్నది. అంచేత అడిగినప్రతివాడినీ కారులో పోతున్న ప్రతివాడూ ఎక్కించేసుకోడానికి ఉత్సాహం చూపరు. రెండోది, కారెక్కేక కబుర్లు కూడా ఉండవు. వీలయినంత దూరం వెళ్ళేక, ఆ వ్యక్తిని దింపేసి తనదారిన తాను పోతాడు.
000

ఇంక మనదేశంలో ఈ రైడుప్రదానాలు ఎందుకు జరవంటే, చెప్పేను కదా మనకి కార్లు తక్కువ మనుషులెక్కువా అని. తిరణాలేమో అనిపించేలా జనసందోహం మనుషులు రోడ్డుమీద నడిచి పోతుంటే కారాపి, “రా బాబూ, లేక అమ్మా, నీక్కావలసినచోటికి తీసికెళ్ళి దింపుతాను,”అంటూ మొదలు పెడితే ఆ మనిషి ఇంటికి చేరడానికి మూడ్రోజులో వారంరోజులో పట్టొచ్చు.

2. తెలీనివాళ్లని ఎక్కించుకోడం ప్రమాదం అని కావచ్చు. ఇది నాఊహ మాత్రమే. ప్రమాదో ధీమతామపి అన్నారు కదా. ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో చెప్పలేం.

3. తెలిసినవాళ్ళని పిలిచినప్పుడు, డ్రైవరు లేడు, కారు రిపేరులో ఉంది … ఇలా అనేక కారణాలు. ఒకసారి నేను ఇండియా వచ్చినప్పుడు నాకు రైడు కాదు ఆవిడే నన్ను చూడ్డానికి వస్తానని మొదట చెప్పి, ఆ తరవాత పన్నెండు సార్లు చెప్పింది తమకి రెండు కార్లున్నాయని, కానీ ఒక్కటీ తనకి ఆ సమయంలో అందుబాటులో లేదనీ. నాకు నవ్వెక్కడొచ్చిందంటే, కారు పంపిస్తాను, మీరు రండి అన్నప్పుడు. నాకు పంపగల కారులో ఆవిడే రావచ్చు కదా. అసలు విషయం నేను ఆవిడకథ అనువాదం చెయ్యాలని. ఆ సంగతి తెలిసేక నాకు ఆవిడని కలుసుకునే ఉద్దేశం చచ్చిపోయింది.

4. మరో సందర్బం అంతో ఇంతో తెలిసిన మొహం కనబడి రైడిస్తాను, రమ్మని పిలిచినప్పుడు. ఎందుకండీ మీకు శ్రమ అంటూ మొహమాటపడుతూనే కారెక్కుతారు అనుకోండి. ఇంటిదాకా వచ్చేక, లోపలికి పిలుస్తాడు ఆ కారువారిని కాపీ తాగి పోదురు గాని అని. ఎంత వద్దన్నా వినిపించుకోడు. సరే కాఫీయే కదా అని చోదకుడుగారు లోపలికెళ్తారు.

అప్పటికే ఆయనకి అరగంట ఆలస్యం అయిపోయింది. లేచి బయల్దేరబోతుంటే, కాస్త మానాన్నగారిని అటే వెళ్ళాలి, వారిని తీసుకెళ్తారా అని మర్యాదగానే అడుగుతుంది యజమానురాలు. ఆయనకి ఊరు కొత్త, టాక్సీ ఎక్కడానికి సందేహం అని కూడా చెప్తుంది.

సరే అని వారిని కారెక్కించుకుంటారు చోదకుడు గారు. ఆ తరవాత –

ఏ ఊరు బాబూ, ఏం చేస్తున్నావు, పెళ్ళయిందా, అమ్మాయి కూడా చదువుకుందా, ఉద్యోగం చేస్తోందా?
– చేస్తోందంటే, ఇద్దరూ చదువులూ, ఉద్యోగాలూ, ఏంటో … మాఅమ్మ గడపదాటి ఎరగదు ప్రతి శనివారం ఆంజనేయస్వామిగుడికి తప్ప …

– చేయడం లేదంటే, ఎందుకు చెయ్యడం లేదు. ఈరోజుల్లో ఇద్దరూ చెరో నాలుగు రాళ్లు తెచ్చుకుంటేనే, వయసు మళ్లేవేళకి నాలుగు రాళ్ళు వెనకేసుకోగలుగుతారు.

– లేదండీ, చదువుకోలేదావిడ.

– మరి కాలక్షేపం ఎలా? పోనీ ముఖపుస్తకంలో ఖాతా తెరిపించేయ్.

– చెప్పేను కదండీ. ఇంగ్లీషు రాదు.

– అబ్బే ఇంగ్లీషు రానఖ్ఖర్లేదు.

– తెలుగులో టైపు చెయ్యడం కష్టం కదండీ.

– అయ్యో అఖ్ఖర్లేదు. ఎబీసీడీలొస్తే చాలు. తెలుగుమాటలే టైపు చేసుకుంటూ పోవడమే.

– ఏమో లెండి. దానికో పద్ధతి ఉంది కదా.

– అయ్యో రామా. అదేం లేదిప్పుడు. ఎవరికెలా తోస్తే అలా కొట్టుకుంటూ పోవడమే. ఒకావిడుంది. తెలుగులోనే రాయి రాయంటూ రాసి రంపాన పెడుతుంది. ఆవిడజోలికి మాత్రం వెళ్ళొద్దు. ఇంకెక్కడయినా ఫరవాలేదు. … ఇలా క్షణం వదలకుండా సంభాషణ సాగిపోతుంది.
000
అలాగే, మరో బాధ కారెక్కేక సంగీతం కానీ సెల్ కానీ. ఎక్కినవారి అభిరుచులూ, ఎక్కించుకున్నవారి అభిరుచులూ ఉత్తర దక్షిణధృవాలవొచ్చు. అయిదో పదో నిముషాలప్రయాణం అయితే ఎలాగోలా సర్దుకుపోవచ్చు కానీ గంటా గంటన్నరయితే తంటా.

నేను మాడిసన్లో ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన ఒక అలవాటు కారులో కర్ణాటకసంగీతం టేపులు నాలుగేసుకుని చుట్టుపట్ల పల్లెదార్లంట తిరగడం. ఇప్పుడు ఆ దార్లు లేవు. నాకారులో ఆసలు ఆ టేపులు వాడే వసతి కూడా లేదు.

ఇంతకీ ఆరోజుల్లో ఓమారు నాకు తెలిసినవారికారులో గంటన్నర ప్రయాణం చేయవలసివచ్చింది. కారెక్కీ ఎక్కకముందే భజనపాటలు పెట్టేరు, అదీ పక్కనించి పోతున్నకారులోవాళ్లు కూడా అదిరిపడేంత భయంకరంగా. నేను చెయ్యగలిగిందేమీ లేదు కదా. నా పూర్వజన్మ సంచితార్థమిది, అనుభవించకతప్పదు అనుకోడం తప్ప. కారెక్కితే ఏదో ఒక హోరు తప్పదు అన్నది ఒక్కటే వాస్తవం.
000

అచ్చంగా ఇవే మాటలు కాకపోవచ్చు కానీ కబుర్లు ఖాయం. ఎందుకొచ్చిన గోల అని రైడు ఇవ్వడానికి ఉత్సాహం చూపకపోవచ్చు అనుకుంటున్నాను.

సూక్ష్మంగా ఒక్క మాటలో నేను చెప్పదలుచుకున్నది అమెరికాలో రైడంటే రైడే. మనకి అదొక సాంఘిక ఘటన లేక దైవయోగము. బహుశా పెళ్ళినిర్ణయాలు కూడా అయిపోతాయేమో అలా మొదలయి.
మళ్ళీ చెప్పలేదనకండి. నిజంగా ఇండియాలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. ఇది హాస్యముకొరకు రాయబడినది.
000

(అక్టోబరు 18, 2016)