బుచ్చిబాబు చివరకు మిగిలేది

బుచ్చిబాబుగారి చివరకు మిగిలేది (పునరావలోకనం)

తెలుగు నవలాచరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వతస్థానంగలదిగా గుర్తించిన నవల బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది. అయితే గత 10-15 సంవత్సరాలలోనూ పాఠకులలోనూ, విమర్శనాధోరణులలోనూ గణనీయమైన మార్పులు వచ్చేయి. ఆమార్పు దృష్ట్యా కొన్ని ప్రసిద్ధనవలలు పునరావలోకనం చేయాలన్న నాసంకల్పం ఈవ్యాసానికి నాంది. మరొక కారణం, నావెబ్‌సైటు, తూలిక డాట్ నెట్‌లో లబ్ధ ప్రతిష్ఠులయిన తెలుగు రచయితలని ఆంగ్లపాఠకులకి పరిచయం చేయడం.

చివరకు మిగిలేది సమగ్రమైన తొలి మనోవైజ్ఞానికనవలగా విశేషమైన మన్ననలు పొందినది. ముందు రచయిత ఉపోద్ఘాతంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని ఇక్కడ చెప్పవలసివుంది.

1. ప్రతీరచయితకీ తన ఆంతరంగికాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే రచయితకి సంతృప్తి కలుగుతుంది. … దానికొక మూల్యం, సామాజిక ప్రయోజనం ఏర్పడుతుంది.

2, పాఠకులకు జీవితంపై ఒక దృక్పథాన్ని కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈరచన సాగింది.

3. తల్లి చేసిన అపచారం నీడలా అతన్ని వెంటాడి, సంఘవిమర్శద్వారా, జీవితాన్ని కలుషితం చేసింది. ఈదౌర్జన్నాన్ని ఎదుర్కొడంలో అతను కొన్ని విలువల్ని సాధిస్తాడు. ఆవిలువలతో ఈనవలకి నిమిత్తం వుంది అంటారు రచయిత తన తొలిపలుకులో.

4. రచయితకి జీవితంపై వున్న జిజ్ఞాసనీ, సమగ్రంగా నిజాయితీతో అనుభవించగలిగేటట్లుగా చిత్రితమైనవా లేదా అన్నదే పాఠకునికి కావలసింది.

5. బెర్ట్‌రండ్ రాసిన “A Freeman’s Worship” అన్న వ్యాసం తననీ, జీవితంపై తనకు గల దృక్పథాన్ని మార్చివేసింది. అయితే తాను ఈనవల రాస్తున్నప్పుడు రసెల్ కానీ ఆవ్యాసం గానీ తన దృష్టిలో లేదని పాఠకులు గమనించాలన్నారు.

ప్రచురణకర్తలు (ఎమెస్కో, 1970) పరిచయంవాక్యంలో పెద్దల తప్పిదాలు పిన్నల జీవితాలు వికసించకుండా ఎలా పాడుచేసేది సవిస్తరంగా తెలుపుతుందని వివరించారు.

ఈనవలకి ఖ్యాతి నార్జించిపెట్టిన విశేషాలు రెండు – ఒకటి శైలి (సైకో ఎనాలిటికల్ అప్రోచ్). రెండోదిరచయితకి జీవితంగురించిన అభిప్రాయాల సిద్దాంతీకరణ.

చివరకు మిగిలేది రచన 1943లో మొదలుపెట్టారుట రచయిత. 1946లో మొదలయి 16 మాసాలపాటు నవోదయ పత్రికలో సీరియల్ గా ప్రచురింపబడింది. పిలకా గణపతిశాస్త్రి, ఆచంట శారదాదేవివంటి మేధావుల మన్ననలందుకుంది. 1952లో దేశి కవితామండలి వారు తొలిసారిగా పుస్తకరూపంలో ప్రచురించారు. తిరిగి ఎమెస్కోవారు 1970లో రెండుసంపుటాలుగా ప్రచురించారు.

శైలివిషయంలో 40వ దశకంలో తెలుగుదేశంలో ప్రాచుర్యం గడించుకున్న తెలుగు రొమాంటికి కవితాఛాయలు (కృష్ణశాస్త్రి, శివశంకర శాస్త్రివంటి వారివి) కనిపిస్తాయి దయానిధివాదనల్లో. ఇతివృత్తంవిషయంలో నేలవిడిచి సాము చేస్తున్నట్టు అనిపిస్తుంది.

ఈనవనలో ప్రధానాంశాలు – మొదటిది తల్లిదండ్రుల నైతిక ప్రవర్తన. దయానిధికి తనతల్లిగురించి లోకంలో వున్న అపవాదాలమూలాన తన జీవితం నాశనమయిపోయిందని నమ్మకం. రెండోది భిన్నసమాజాల్లో — సర్కారు, రాయలసీమవాసుల మధ్య– వ్యక్తమయే పరస్పర ద్వేషం వ్యక్తులమీద కూడా వుంటుంది. ఒక మనిషి ప్రేమ పొందలేకపోవడానికి కారణం సమాజం, సమాజంలో నిరోధకశక్తులు అంటారు బుచ్చిబాబు. ఈరెంటికీ అనుబంధంగా ప్రేమ అలౌకికం, మహోన్నతం అన్న ధ్వని కూడా వుంది.

కథంతా దయానిధి అనబడే ఒక తాత్త్వికునికోణంలోనే నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు. తనజీవితంలో తారసపడిన ప్రతివ్యక్తినీ మానసికవిశ్లేషణ చేసుకుంటూ పోతాడు ఆద్యంతం. అతనిజీవితంలో ప్రాముఖ్యత వహించిన వ్యక్తులు – అతనితల్లీ, కోమలీ, అమృతం, సుశీలా, తరవాత కొంతవరకూ ఇందిరా, నాగమణీ, కాత్యాయినీ.

దయానిధికి తల్లి అంటే అమితగౌరవం. ఆవిడ విగ్రహం చేయించి ప్రతిష్ఠిస్తాడు. కాని తల్లి తన దుర్నడతతో తనకి అపచారం చేసిందన్నవిషయం మరోపక్క అతన్ని బాధిస్తూంటుంది. రచయిత తొలిపలుకులో ఆతల్లి అపచారానికి సంబంధించిన సంఘటనలు అనవసరమని వదిలివేయడం జరిగింది అన్నారు. సంఘటనలు అవసరమవునా కాదా అన్న వాదన అటుంచి, జిజ్ఞాసువు అయిన దయానిధిలో ఆమె దుష్ప్రవర్తనకి వెనక వున్న కారణాలు ఏమిటి అనిగానీ, ఆమెని అర్థం చేసుకోవాలన్న తపన గానీ, వాటిని అధిగమించి తాను సముపార్జించిన జ్ఞానంద్వారా తన జీవితాన్ని చక్కదిద్దుకుందాం అన్న ఆవేశం కనిపించవు. లోకంతో పాటే తనూ చెప్పుడుమాటలు విని ఓనిర్ధారణకి వచ్చేస్తాడు అంతటి జిజ్ఞాసువూను. ఇదొక మనస్తత్త్వం అనుకుని సరిపుచ్చుకోవాలి పాఠకుడు. తను అబద్ధాలాడ్డానికి కారణం స్త్రీయే (సం. 1. పు. 73). తనబతుకు నరకప్రాయం కావడానికి కారణం తల్లి అవినీతి (సం.1 పు. 142). తనజీవితానికి తను బాధ్యుడు కాడు అన్నధోరణి కనిపిస్తుంది కథ పొడుగునా ఈ మనోవిశ్లేషకుడిలో.

అమృతంలో తల్లిపోలికలు చూసుకుంటూ ఆమెకి దగ్గరవుతాడు. ఆమె పెళ్లి అయినతరవాత ఆమెతో అనుభవం కారణంగా అమృతానికీ అతనితల్లికీ సామ్యం మరింతగా ధృవపడింది. అమృతం తనకు తానై వచ్చింది. ఇద్దరూ తాత్కాలికమైన ఉద్రేకానికి లోనై కోరిక తీర్చుకున్నారు. దయానిధిని తప్పుపట్టడానికి లేదేమో కానీ వారిద్దరిచర్య మూలంగా అమృతం కూడా తనతల్లి చేసిన నేరమే చేసింది, అందులో తనకి పాలుంది. తను పడుతున్న దురవస్థే ఆమెకూతురికి కూడా పట్టవచ్చునన్న స్పృహ అతడికి లేదు. అంతేకాక, అతనిధ్యాసంతా అమృతం కన్న కూతురు తనదవునా కాదా అన్న మీమాంసమీదే (సం.1. పు.182-83). వాళ్లింటికి వెళ్తాడు కాని ఎదురుపడి అడగలేడు. ఈప్రవర్తన అతని నిజాయితీని పాఠకులు శంకించడానికి ఆస్కారం అవుతుంది. అమృతానికి ఆరోనెల అని తెలిసినప్పుడు ఏనెలో ఎలా తెలుస్తుంది (సం. 1. పు.106) అని డాక్టరయిన దయానిధి సందేహం వెలిబుచ్చడం నవ్వు తెప్పిస్తుంది.

తల్లి తరవాత అతన్ని విశేషంగా ఆకట్టుకున్నది కోమలి. కోమలి దయానిధిదృష్టిలో స్త్రీ కాదు (సం.1 పు.139). పచ్చగఢ్డీ, ఆకాశంలాగ ప్రకృతిలో భాగం. అంచేత ఆమె రాత్రి నూతికాడ దీపం పెడతాను రా అంటే, ఆమాటపుచ్చుకు వెళ్తాడు కానీ ఆమెమీద చెయ్యయినా వెయ్యకుండా వెనుదిరిగి పోతాడు. కోమలి అతని దృష్టిలో తాకితే రేకులు రాలిపోయే పువ్వు. తాను ఆపువ్వుని అపవిత్రం చెయ్యలేడు.  ఆమెకి కావలిసిన రొక్కం మాత్రం తలగడకింద పెట్టి వెళ్లిపోతాడు.

తాను ఆమెని వాంఛించాడు కాని ప్రేమించలేదు. వాంఛ దైహికం, ప్రేమ మానసికం. వాంఛలో స్వార్థం వుంది. ప్రేమలో త్యాగం వుంది. కోమలి తనని ప్రేమిస్తోంది. ఇవి దయానిధిమనోవిశ్లేషణలో కొన్ని అభిప్రాయాలు. మొత్తం నవల చదవడం అయినతరవాత కోమలి అమాయకురాలని నమ్మడం కష్టం. నిజానికి అది ప్రాగ్మాటికి అప్రోచ్ అనిపించింది, జాణతనం. తనకు గల వెసులుబాటు బేరీజు వేసుకుని జీవితాన్ని దిద్దుకున్న లౌక్యం అదీ.

కోమలి పచ్చగడ్డీ, పువ్వుల్లాటిది అంటాడు. బాగానే వుంది. కాని ఈస్కెచ్‌లో భౌతికమైన ఒంపుసొంపులు కూడా చేర్చడంతో దయానిధి జిజ్ఞాస కేవలం వ్యక్తిత్వానికి సంబంధించినది కాదనిపిస్తుంది. ఒక్క కోమలివిషయంలోనే కాదు, ఎక్కడ ఏ స్త్రీప్రసక్తి వచ్చినా (తల్లి తప్ప) అతని మనోవైజ్ఞానిక విశ్లేషణ ఒకచోటా శారీరకమైన “కళ్లు” మరొకచోటా వుంటాయి. అతను చేసిన అంగవర్ణనలూ, వెలిబుచ్చే అభిప్రాయాలద్వారా మనకి ఆపాత్రలగురించి కంటే దయానిధి మనస్తత్త్వం ప్రస్ఫుటం చేయటమే రచయిత అభిప్రాయం అయితే ఆయన కృతకృత్యులయేరనే చెప్పాలి.

సుశీల అతనికి మరదలు వరసే కాని ఆమెతండ్రి ఆమెని దయానిధికిచ్చి పెళ్లి చెయ్యడానికి అంగీకరించడు. కారణం దయానిధితల్లి నీతిమాలినతనం. తండ్రి మాటప్రకారం ఇందిరమెళ్లో తాళి కడతాడు. ఇది దయానిధి వ్యక్తిత్వంలో గొప్ప లోపం. అతని మనోవిశ్లేషణ అతనికి సదసద్వివేచనా, కార్యశీలతా నేర్పలేదు. ఏటివొడ్డున కూచుని ఈతమీద ఉపన్యాసాలిచ్చినట్టు ఎదటివారి ప్రవర్తనలమీదా వ్యాఖ్యానాలు చేసుకుంటూ పోవడమే అతనకి వచ్చినవిద్య.

తనచుట్టూ వున్న అమ్మాయిలందరూ తనకోసం తపించిపోతున్నారనీ, తనపై సదా ఉచ్చులు పన్నుతున్నారనీ మురిసిపోతూ రోజులు గడుపుకుంటాడే తప్ప తననమ్మకాలని పరీక్షకి పెట్టి వాటిలో సత్యమెంతో తెలుసుకోవాలనే సత్యాన్వేషణ కనిపించదు ఈతాత్వికుడిలో. అతని అంచనా ప్రకారం, కోమలి ప్రకృతిలో భాగం. సుశీల బస్తీలో నవనాగరీకంలో భాగం. అమృతం తల్లిలాగే నేలబారు మనిషి, వంటింటి కుందేలు. వీళ్లందరూ తనని వేటాడుతూ తనకి శాంతి లేకుండా చేస్తున్నారు. అసలు సృష్టిలోనే వుందది. ఆడవాళ్లు మగవాళ్లని వేటాడి వినోదిస్తారు (సం.1. పు. 28).

సుశీలా అమృతం పెళ్లి చేసుకుని కాపురాలు చేసుకున్నారు. కోమలి తనకి దయానిధివల్ల సుఖంలేదని తెలుసుకుని, ఓజమీందారుతో వెళ్లిపోయి, అతనిదగ్గర చావుదెబ్బలు పడలేక మళ్లీ దయానిధి దగ్గరికి వచ్చేసింది. కారణం దయానిధి అనుకున్నట్టు స్వార్థరహితమైన ప్రేమేనా అంటే సందేహమే. నాకు మటుకు దయానిధి ఏంచెయ్యలేడు కనక అతనివల్ల తనకి బాధలుండవు కనక అనిపించింది. అది అమాయకత్వం కావచ్చు, అమాయకురాలిలా నటించి పబ్బం గడుపుకోడం కావచ్చు కాని దయానిధికి మాత్రం ఈధోరణి ఆలోచనలే రాకపోవడం ఆశ్చర్యం.

రాజకీయాలు కారణంగా మామగారు కార్యం చెయ్యనివ్వరు. ఇందిర కాపురానికి రాదు. అప్పుడు కూడా దయానిధి పూనుకుని క్రియాశీలిగా చేసిన ఘనకార్యం ఏమీ లేదు. చదువుకున్నవాడు, బాధ్యతలనెరిగినవాడుగా మనకి అభివ్యక్తం కాడు. ఇందిరే తెగించి నన్ను మీయింటికి తీసుకుపో అని అడిగినప్పుడు కూడా వుదాసీనుడుగానే వుండిపోతాడు.

చదువు ముగించుకుని, రాయలసీమలో ప్రాక్టీసు మొదలుపెడతాడు కాని. అక్కడ కూడా తల్లిమీదున్న అపవాదులమూలంగానూ, అతనిక్కూడా ఇతరవ్యసనాలున్నాయన్న అపవాదులమూలంగానూ, మనశ్శాంతి లేదు. వైద్యుడుగా పేరు తెచ్చుకున్నట్టు కనిపించదు. అయాచితంగా దొరికిన వజ్రం అమ్ముకుని గొప్పవాడవుతాడు.

బుచ్చిబాబుగారే శలవిచ్చినట్టు, మతం, మూఢవిశ్వాసాలమాట వదిలేద్దాం. జీవితం అంటే కష్టం, సుఖం, మంచీ, చెడూ, బాధలూ, కన్నీళ్లూ, అనేక అనుభవాలమిశ్రమం కదా. ఆదృష్టితో చూస్తే జీవితాన్ని నిజంగా అనుభవించినవాళ్లు కోమలీ, సుశీలా, అమృతమే. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్ని వారికి తెలిసినపద్ధతిలో దిద్దుకుని జీవించారు.

దయానిధి వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే పాఠకులసానుభూతికోసం ఆరాటపడుతున్నవాడిలా కనిపిస్తాడు.అతని మనోవిశ్లేషణంతా తనలోపాలన్నిటికీ కారణం ఎవరా అని వెతకడంతోనూ, ఆలోపాలని ఎవరినెత్తిన రుద్దుదామా అన్న తాపత్రయంతోనూ సరిపోతుంది.  అనేక ప్రముఖుల రచనలు చదివి అతను సముపార్జించిన విద్య అంతా ఈ స్కేప్‌గోట్లని కనిపెట్టడానికే పనికొచ్చింది. చాదస్తంగా ఎదటివారి ప్రతిచర్యా, ప్రతివాక్యం సాగదీసి సిద్ధాంతీకరించడం, వీలయినంతవరకూ పెద్దలసూక్తులు ఉదహరించడం మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇలాటివారిని నిత్యజీవితంలో అయితే బోళా మనుషులంటాం. తనవి అని చెప్పుకోతగ్గ అభిప్రాయాలు లేకపోతే ఇలా కోట్ చేసుకుంటూ పోతారేమోనని నాఅనుమానం. 

దయానిధి పిరికివాడు, రా.వి. .శాస్త్రిగారి సుబ్బయ్యలా (అల్పజీవి), కుటుంబరావుగారి సీతప్పలా (భయం?). ఎటొచ్చి సుబ్బయ్య, సీతప్పల భయం నిత్యజీవితంలో వాళ్ల ప్రవర్తనలో మనకి గోచరమవుతుంది. కాని దయానిధి సైద్ధాంతికుడు. అతని బతుకు కేవలం తనదైన ఒక కాల్పనిక జగత్తులో ఓలలాడుతూ వుంటుంది ఎల్లవేళలా. మనకి విదితమయేది అతని ఆలోచనలు మాత్రమే. అతని భౌతికజీవితంలో క్రియ నాస్తి. తిరణాలలో జనసందోహంలో జనంతోపాటు కొట్టుకుపోయే సగటుమనిషి అతను.

నవల మొత్తం మనోవిశ్లేషణ – ఒక తాత్త్వికచింతనగా సాగినందునేమో సూక్తిముక్తావళిలాగానో సుభాషణ రత్నావళిలాగానో అనిపించింది నాకు. నిజంగా జరిగినకథ కంటే దాన్నిగురించిన అతని ఆలోచనలూ, సిద్ధాంతీకరణ పుష్కలంగా వున్నాయి. (ఈవిషయం బుచ్చిబాబు కూడా తొలిపలుకులో ప్రస్తావించారు ప్రతివారికీ వుండే బలహీనత లేదా లక్షణం అని).

జీవితం పుట్టినక్షణంనుండీ ఆమరణాంతం సాగే ప్రయాణం. మరణంతోనే జీవితానికి ముగింపు. ఈనవల జీవితానికి అర్థంలేదు చివరకి మిగిలేది ఏమీ లేదన్న దయానిధిసిద్దాంతంతో ముగుస్తుందే తప్ప అతని మరణంతో కాదు. అతను ఇంకా జీవించి వుండగానే. ఇంక ఏమీ లేదు అనుకోడం నిరాశావాదం. నిజానికి అతను జీవితంలో అనుభవించింది కూడా ఏమీలేదు. చివరకు మిగిలేది జ్ఞాపకాలే అంటారు రచయిత. మరి దయానిధికి మిగిలిన జ్ఞాపకాలేమై ఉంటాయి?

ఇక్కడ లత రాసిన మరొక నవల, మిగిలిందేమిటి, గురించి బుచ్చిబాబు వెలిబుచ్చిన అభిప్రాయాలు సూక్ష్మంగా ప్రస్తావించడం అవసరం. చివరకుమిగిలేది వచ్చిన రెండు దశాబ్దాలతరవాత మిగిలిందేమిటి నవల వెలువడింది. ఆ నవలపై వ్యాఖ్యానిస్తూ బుచ్చిబాబు లతకి రాసిన వుత్తరంలో అభిప్రాయాలు చూడండి.

1. కొన్ని భాగాలు స్కిప్ చేస్తూ పూర్తి చేసారు. తనకు ఉత్సాహమూ, ఆశ్చర్యమూ, కొంత శారీరకమైన sensuous అనుభూతి కలగడమూ జరిగాయి.

2. నవలలో ఆయనకి అభ్యంతరకరంగా తోచినవి- ప్రధానపాత్ర, వేశ్యవనిత అయిన విద్య తనతల్లి కులస్త్రీకన్న పవిత్రమూర్తి అన్నది అనవసరం అని. కథకి ఆమె పవిత్రత ముఖ్యం కాదు, ఆమె (విద్య) అట్లాంటి ఆమెకి పుట్టి, ఒక నైతికదృక్పథం అలవర్చుకున్నది ముఖ్యం అనీ. అంచేత ఆవాక్యం falsetto note అనీ అన్నారు. ఆదృష్టితో చూస్తే దయానిధి అబ్సెషన్- తనతల్లిని గురించిన అపవాదులు – మరింత పేలవంగా తోస్తాయి.

ఇది ఇరవైయేళ్ల తరవాత కనక బుచ్చిబాబు తన అభిప్రాయాలు మార్చుకున్నారనుకోవాలా? లేక దయానిధి ఒక పాత్ర, విద్య మరొక పాత్ర అని సరిపెట్టుకోవాలా?

3. లత నవలలో ప్రేమగురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు కాని నాకు అది అర్థం కాలేదు. అంచేత ఆప్రేమ జోలికి పోను. కాని, అదే పేరాలో మొత్తంనవల ఉత్తమపురుషలో కాక మధ్యమ పురుషలో రాస్తే హుందాతనం, సమన్వయం చేకూరేదన్న అభిప్రాయం మాత్రం కాస్త అయోమయంగా అనిపించింది. (మధ్యమపురుషలో రాయడం ఎలా సాధ్యం నాటకం అయితే తప్ప?). “హాస్పిటల్‌లో విద్య చేసిన “దురంతం” (రాజాతో) మరొకరు చెప్పివుంటే, పదును తగ్గి వుండేది. సభ్యత హెచ్చి వుండేది. జీవితంలోలాగే సాహిత్యంలో కాస్తంత అసభ్యత, అశ్లీలత అవసరమనుకునేవారిలో నేనొకణ్ణి. కాని మన సంఘం అంతదూరం వెళ్లడానికి చాలాకాలం పడుతుంది” అంటారాయన. (ఆంజనేయశర్మ. సాహితీలత. పు. 86). నిజానికి విద్యా, రాజాల “దురంతం”కి (బుచ్చిబాబు భాషలో) దయానిధీ, అమృతంల అనుభవానికి(సం.2 పు. 90) మధ్య గల తేడా ఏమిటో నాకు తెలీడంలేదు. రెండు సంఘటనలలోనూ ఒకే వస్తువు. ఒకస్త్రీ, ఒకపురుషుడూ, వారి నిషిద్ధ సమాగమం. ఇద్దరు రచయితలూ ఒకే భాష వాడారు. మరి బుచ్చిబాబు ఎందుకు పని గట్టుకుని ఆసందర్భం ఎత్తి చూపినట్టు? బహుశా ఇలాటి సందర్భాలలోనేమో ఆడరచనలూ మగరచనలూ అంటూ కథలకి లింగబేధం కల్పిస్తున్నారన్న వాదనకి బలం చేకూరేది.

చివరకుమిగిలేది ప్రధమపురుషలో సాగినా, ప్రధానపాత్ర ఆంతరంగిక చిత్రణ కావడంచేత ఉత్తమపురుషలో సాగినట్టే వుంటుంది చదువరికి. ఉత్తమపురుషలో కథ చెప్పినప్పుడు కొన్ని వసతులుండే మాట నిజమే. కాని ఈరెండు నవలల్లో వస్తువు పరిశీలించినప్పుడు,  రచయితలు ఆవస్తువుని చిత్రించిన తీరు గమనించినప్పుడు, ఈగ్రామరు అనవసరం అనిపించింది నాకు.

సూక్ష్మంగా చెప్పాలంటే బుచ్చిబాబు రచయితగా చివరకు మిగిలేదిలో సాధించినదానికీ, పాఠకుడిగా తనవుత్తరంలో వెలిబుచ్చిన అభిప్రాయాలకీ సమన్వయం కుదరడంలేదు.

సాహిత్యప్రయోజనంలో ముఖ్యభాగం పాఠకుని ఆలోచింపచేయడం అని బుచ్చిబాబు అన్నారు. నవల చదవడం ముగించిన తరవాత ఈనవలలో సందేశం ఏమిటి అని చాలా ఆలోచించవలసివచ్చింది. మగవారి మనోభావాలు కేవలం ఇంత సంకుచితంగా తమపరిధిలోనే వుంటాయనా? మగవారిలో కనీసం దయానిధిలా ఆలోచించేవారు వుండడానికి అవకాశం వుందనా? ఇలా జీవితం విశ్లేషిస్తూ కూచుంటే జీవితం నిజంగా ఆనుభవించడం గానీ, జీవితంలో సాధించేది గానీ ఏమీ వుండదనా?

ఈనవలకి ప్రయోగాత్మకమయిన ఒక సాహితీప్రక్రియగా తెలుగుసాహిత్యంలో సుస్థిరమయిన స్థానం వుండొచ్చు. కాని ప్రయోగం దాని ఫలితం తెలుసుకునేవరకే. ఆతరవాత మళ్లీ మళ్లీ అదే ప్రయోగం చెయ్యం. అలా కాక మనసుకు హత్తుకోగల రచన, మనసుని రంజింపజేయగల రచన అయితే మళ్లీ మళ్లీ చదువుతాం. ఈనవల నేను తొలిసారి యాభై ఏళ్లకిందట చదివేను, అప్పట్లో అందరూ చదువుతున్నారనో, కాకపోతే ఎవరో చదవమన్నారనో. ఇప్పుడు మళ్లీ ఈవ్యాసంకోసం చదివేను. మళ్లీ చదువుతానా అంటే ఏమో మరో యాబై ఏళ్లు పోయేక చూడాలి. (అప్పటికి నాకు 120 కాబోలు!).

చివరకు మిగిలేది ఇక్కడ చదవొచ్చు.

ఉపయుక్త రచనలు.

ఆంజనేయశర్మ, ఘట్టి. సాహితీలత. శ్రీవాణీ ప్రచురణాలయం, 1962.

బుచ్చిబాబు.  చివరకు మిగిలేది. ఎమెస్కో బుక్స్. 2 సం. 1970.

నన్ను మార్చి పుస్తకం. 1953. పునర్ముద్రణ.

లత. అంతరంగచిత్రం. వంశీ ప్రచురణలు, 1963.

—  మిగిలిందేమిటి. జయంతి పబ్లికేషన్స్, 1971.  

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “బుచ్చిబాబు చివరకు మిగిలేది”

  1. ‘ చివరకు మిగిలేది ‘ నవల మీద వచ్చిన అభిప్రాయాలలో ఇంత స్పష్టంగా సూటిగా ఉన్నదాన్ని చూడలేదు నేను. ఈ వ్యాసం రాసి చాలాకాలమైనప్పటికీ నా స్పందనని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చాలా సెన్సిబుల్ గా చెప్పారు మీరు, నమస్కారాలు మాలతి గారూ.

    మెచ్చుకోండి

  2. నేను ఈ నవల చదవలేదు. మీ వ్యాసం చదివాక (ఇంతకు ముందూ చదివాను కానీ అప్పట్లో ఆలోచించలేదు) “ఇలా జీవితం విశ్లేషిస్తూ కూచుంటే జీవితం నిజంగా ఆనుభవించడం గానీ, జీవితంలో సాధించేది గానీ ఏమీ వుండదనా? ” ఇదే రచయిత చెప్పదల్చుకున్నాడు అనుకుంటే అర్థవంతంగా అనిపిస్తుందేమో అనిపించింది. నేను ఈ నవల చదవలేదు. నవల చదివితే ఏమనిపిస్తుందో మరి. Ofcourse లత గారి నవల మీద విమర్శలు రచయిత నిజాయితీ గురించి ఆలోచింపచేసేలా ఉన్నాయి. నేను ఆమె రచనా చదవలేదు. రచన నిజాయితీగా (inspite of the author) ఉండవచ్చుననిపిస్తుంటుంది కొన్ని సార్లు. అంటే రచయిత చెప్పవలసినది చెప్పేస్తాడు రచన ద్వారా. కానీ అతని భాష్యమే అందుకు తగ్గట్టు ఉండకపోవచ్చు. ఏమో మొత్తానికి మీ వ్యాసం ఈ రెండూ నవలలూ చదవాలి అనిపించేలా చేస్తోంది. ఐతే అంతకన్నా ముందు చదవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.
    నేను ఈ మధ్య చాలా ఆలోచిస్తున్నాను. నాకు ఎలాంటి కథలు నచ్చుతాయి అని. ఎందుకంటే ఎందరో మెచ్చుకున్న ఎన్నో కథలు (కథకుల కథనాలు) నాకు నచ్చలేదు. అప్పుడు వాళ్ళు ఎందుకు మెచ్చుకుని ఉండవచ్చు అని ఆలోచిస్తుంటే కొన్ని కారణాలు కనిపించసాగాయి. కానీ అలా విశ్లేషించుకుంటే కాని మంచి కథ అనిపించకపోవడం, మంచి కథ చదివిన తృప్తి కలగపోవడం నా లోపమా లేక రచయిత ఇంకొంచెం బాగా చెప్పి ఉండవచ్చా అన్న సందిగ్ధం నుంచి బయట పడడానికి చదివినప్పుడు తృప్తినిచ్చిన కథలు కొన్ని మళ్ళీ చదివి వీలైతే వాటిని గురించి వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను. చూడాలి.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s