డాలరుకో గుప్పెడు రూకలు

ఎన్నారయ్యొస్తన్నడెన్నారయ్యొస్తన్నడంటూ ఒకటే హడావుడి. ఊరంతా గుప్పుమంది. కార్చిచ్చులా కమ్ముకొచ్చింది ఇరుగుపొరుగలు ఏడామాడల దూరం. ఎన్నారయ్యొస్తన్నాడంట.

ఇరవయ్యేళ్ళనాడు దేశంవెల్లిన కుర్రకుంక ఎంతో ఎత్తు ఎదిగిపోయి ఇరుచేతులా సంపాదించేసి ఘనకార్యాలు సాధించేసి ఈనాడు యూయస్సమ్మతో కాఫీరంగు కూతురితో, సీమ టపాకాయలాటి కుమారుడితో.

చుట్టపుచూపుగా తల్లిదండ్రుల్నీ, తాతముత్తాతల్నీ, మేనమావల్నీ, బావమరుదుల్నీ గోళీకాయలాడుకున్న నేస్తాల్నీ, ఎరిగినవాళ్ళనీ, ఎరగనివాళ్ళనీ, పాతచుట్టరికాలు తిరగదీయడానికీ, కొత్త స్నేహాలు కలుపుకోడానికీ ఎన్నారయ్య వొస్తన్నాడంట!

చిన్నప్పుడెప్పుడో తిరణాల్లో తప్పిపోయిన బాలుడు తిరిగొచ్చినంత సంబహం. గోడలకి రంగులేయించేరు. గుమ్మాలకి తోరణాలు కట్టించేరు. పడగ్గదిలో సరికొత్త బాతురూం, నట్టింట టెలిఫోనూ, కిటికీలకి పరదాలూ, ఫ్రిజిలో బ్రెడ్డూ, జామూ, బాటిల్డు వాటరూ … ఎంత చేసినా ఏదో తక్కువైనట్టు రవంత అసంతతృప్తి!

ఏం కావాలేంకావాలని ఎన్నిమార్లడిగినా, ఎన్ని విధాల చెప్పినా వారు చెప్పినది వీరి తలకెక్కదు. వీరు చెప్పినది వారికయోమయం, అగమ్యగోచరం.

మొత్తమ్మీద ఆరోజు రానే వచ్చింది. ఎన్నారయ్యగారు వేంచేశారు. మహాత్సాహంతో భార్యాబిడ్డలతో ధగధగ మెరుస్తున్న శాంసనైటు సూటుకేసులతో. పిల్లలు మొహాలు వేలాడేశారు కానీ యూయస్సమ్మ మాత్రం ఓపిగ్గా సుతారంగా పెదాల చిర్నవ్వు పులుముకుని పరువు నిలబెట్టుకుంది.

ఇడ్లీలు బ్రేక్‌ఫాస్ట్. పిల్లలు సాంబారు తినలేకపోయేరు కానీ కొబ్బరి పచ్చడితో ఎలాగో అయిందనిపించేరు.

పెద్దావిడ నొచ్చుకుంది. బ్రెడ్డుంది తినమంది. పోనీ పళ్ళు తినకూడదా అంది మరేదేనా చెయ్యనా అని అడిగింది.

“ఫరవాలేదమ్మా. కారాలు తింటారు కానీ పొద్దున్నే స్పైసీ ఫుడ్డు తినలేరు,” అంటూ ఎన్నారయ్య సర్ది చెప్పేడు. “వాళ్ళంతే. ఏఁవీ తినరు. అక్కడయినా ఇంతే,” అన్నాడు.

భార్య అవునంటూ తలాడించింది, సందర్భానుసారం సంభాషణసారం గ్రహించి.

కూతురు అమెరికాలో సూ, ఇండియాలో సుసీ.

“సుసి లేదు, మసి లేదు. నేను మాత్రం చక్కగా సుశీలమ్మా అని పిలుచుకుంటా,” అన్నారు బామ్మగారు.

“అయాం నో అమ్మా,” అంది ఆ మాత్రం తెలుగు తెలిసిన కూతురు.

“చెప్పేను కదా ఇదో నాటకం అని. సుశీలమ్మ నీ రోల్ అనుకో,” అని తండ్రి ఇంగ్లీషులో అనునయించేడు.

గత ఆర్నెల్లుగా వాళ్ళకెన్ని విధాల చెప్పొచ్చో అన్న విధాలా బోధించేడు. ఆఖరికి “మనం ఓ చిన్న నాటకం ఆడుతున్నాం అనుకో”మన్నాడు. “మనం పాత్రధారులం. స్క్రిప్టు మీ సొంతం. ఇక్కడ మీరేం చేసినా చెప్పినా ఈ నాలుగు రోజులే. ఆ తరవాత వాళ్ళదారి వాళ్ళదీ మనదారి మనదీను. మనఁవే అనుకుంటున్నాఁవో వాళ్ళకి తెలీదు. వాళ్ళేం అనుకుంటున్నారో మనకి అఖ్ఖర్లేదూ, లెక్క లేదూ కూడాను,” అన్నాడు.

ఇంత ఉపన్యాసమూ బుగ్గయిపోయింది. పిల్లలు మొహాలెత్తలేదు. బుంగమూతి చెదర్లేదు.

అదయింతరవాత ఊరు చూడ్డానికెళ్దాం అని పిల్లలు సరదా పడ్డారు. కానీ గుమ్మం ముందు పోగయిన జనాల్ని చూసేసరికి నీరు గారిపోయేరు. “నేను చెప్పేను కదా. వీళ్ళకి మనం కొత్త. వీళ్ళెప్పుడూ తెల్లవారిని చూసి ఉండలేదు మరి,” అంటూ వాళ్ళని బలవంతాన ఈడ్చుకెళ్ళేడు వీధిలోకి. తీరా రోడ్డెక్కింతరవాత “నేను వీళ్ళకి ఊరు చూపిస్తున్నానా, వీళ్ళని ఊరివారికి చూపిస్తున్నానా?” అన్న అనుమానం రాకపోలేదాయనకి. ముక్కుతూ మూలుగుతూ నాలుగు వీధులూ తిరిగొచ్చేరు.

“మా స్కూలు చూపిద్దాం నాన్నా,” అన్నాడు చంద్రుడు. ఎన్నారయ్య తమ్ముడికొడుకు.

సరేనని పదండంటే పదండంటూ వీధిన పడేసరికి పన్నెండయింది.

నాలుగ్గోడలమధ్య ఓ తాటాకుల తడక, రెండు క్లాసులన్నట్టు సూచిస్తూ. ఓ నల్లబల్ల అవసరాన్నిబట్టి గదులు మారుతూ.

సీమబాబుగా చెలువొందుతున్న సీమ టపాకాయ చుట్టూ చూసి “స్కూలేదీ” అనడిగేడు. “Where are the toys?”

యూయస్సమ్మ అస్పష్టంగా సౌంజ్ఞ చేసింది అటు చూడమన్నట్టు.

పిల్లలు చెట్టుమీద కోతి కొమ్మచ్చి, చెట్టుకింద కబడ్డీ ఆడుకుంటూ కనిపించేరు.

నింటెండోలూ, వర్చువల్ రియాలిటీలతో పెరిగిన పిల్లలకి అర్థం కానిది, “What do thise children do for fun?”

చంద్రుడికి ఆ ప్రశ్న అర్థం కాలేదు. “ఏంటి నాన్నా?” అని తండ్రినడిగేడు. బియే చదివి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరుగా పని చేస్తున్న తండ్రికి కూడా అర్థం కాడంలేదు ఈ అమెరికా పిల్లల ఆంగ్లభాష. “ఏదోలే ఆళ్ళగోడు,” అని చప్పరించేశాడు.

మర్నాడు పట్నం ప్రయాణం పెట్టుకున్నారు. షాపింగ్! బజారనగానే ప్రాణం లేచొచ్చింది పిల్లలకీ పెద్దలకీ కూడా. కానీ అక్కడా అయోమయమే. ఇండియాలో షాపులవాళ్ళు అమెరికను జనాల్ని ఎంతగా మోసం చేస్తారో విని విని తల వాచిపోయింది వాళ్ళకి. అంచేత వాళ్ళు చాలా జాగ్రత్తగా చెయ్యదలుచుకున్నారు షాపింగు.

“ఈ బొమ్మెంత?”

“720 రూపాయలు.”

“330 ఇస్తానంతే.”

“తమకి తెలీందేవుందండీ. 700 ఇయ్యండి పండుగపూట”

“350. అంతే.”

“మరి మాఁవెల బతకాలి మీరే సెప్పండి సార్,”

“మరో కొట్లో చూద్దాం పదండి.”

560 రూపాయలకి ఖరారయింది బేరం.

కనిపించిన ప్రతదీ ఇదెంత అదెంత అంటూ కావల్సిందీ అక్కర్లేనిదీ ఒకటే గొడవ సీమబాబు. అతనకదో ఆటగా ఉంది.

మంచి గంధపుచెక్కతో చేసిన ఏనుగు బొమ్మొకటి ఎంతో అందంగా కనిపించిదతనికి. “ఎంత?” అని అడిగేడు.

“రెండువేల రెండు వందలు” అన్నాడు షాపువాడు.

“అంటే ఎన్ని డాలర్లు?” అని అడిగేడు మళ్ళీ.

“ఎంతయితే నీకెందుకు. నేను కొంటున్నాను కదా. కావలిస్తే తీసుకో,” అన్నాడు ఎన్నారయ్య.

“నేనెంత ఖర్చు పెడుతున్నానో నాకు తెలియఖ్ఖర్లేదా?” అంటూ మొరాయించేడు ఎలవెన్సుకి అలవాటయిన కుర్రాడు.

“బోలెడు డబ్బు తగలేసి ప్రవేటు స్కూలికి పంపిస్తున్నాను. చెప్పు ఎన్ని డాలర్లో?” అన్నాడు కొడుకు తెలివితేటలూ తనభాగ్యమూ తెలివిడి చేస్తూ.

యూయస్సమ్మకి కొడుకుపరువు నిలబెట్టవలసిన అవుసరం తెల్లమవగా, “నీ ఆర్గనైజరేదీ?” అనడిగింది ఇంగ్లీషులో.

సీమబాబుకి తన తెలివితేటలు ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. గొప్పగా జేబులోంచి ఆర్గనైజరు తీసి డాలరుకెన్ని రూపాయలని అడిగేడు.

“46”

సీమబాబు “కీ”లన్నీ నొక్కి లెక్క తేల్చేలోపున “47.8” అన్నాడు చంద్రుడు చటుక్కున.

సీమబాబు డిసపాయింటుమెంటుని కప్పుపుచ్చడానికి వాణ్ణి మరోపక్కకి లాక్కెళ్ళింది యూయస్సమ్మ.

పిల్లలు చెయ్యేసిన ప్రతి వస్తువూ వెయ్యీ, రెండువేలూను. చంద్రుడు అమ్మో అమ్మో అంటుంటే సీమ ట.కా. కూడా అమ్మో అమ్మో అంటూ వంత పాడేడు. తనకొచ్చిన తొలి తెలుగు పదం!

సగానికి సగం తగ్గించి బేరాలాడసాగేరు. వెయ్యి రూపాయలవస్తువు ఆరువందలకి ఖరారు చేసుకుని తాము మోసపోలేదని పరమానందపడిపోయేరు.

ఓ కొట్లో నాలుగు చొక్కాలు తీసుకుని డబ్బిస్తుంటే కొట్టువాడు ఓ తువాలు పడేశాడు సంచిలో కొసరుగా. అందరూ ఆనందపడిపోయేరు కానీ సూ‌కి అది మాహా అవమానంగా తోచింది. ఆ కొట్టువాడు తమ అమాయకత్వానికి నవ్వుకుంటున్నాడో, జాలి పడుతున్నాడో.

ఆరోజు బేరాలకి చిరాకు పడింది పదమూడేళ్ళ సూ అనబడే సూసన్ మాత్రమే. ఆ పిల్లదృష్టిలో 20 డాలర్లవస్తువు పన్నెండు డాలర్లకి కొన్నట్టు లెక్క. ఎందుకింత ఆరాటం?

స్టేషనులో కూలీలతో 40 రూపాయలకీ 30 రూపాయలకీ బేరం ఆడుతున్నప్పుడు కూడా ఆ పిల్లకి మహా అన్యాయంగా తోచింది. పట్టుమని ఓ డాలరు కూడా కాదు. ఎందుకంత బాధ? వాళ్ళనోటికాడ కూడు తీసేస్తున్నట్టు నొచ్చుకుందా అమ్మాయి.

మొత్తమ్మీద ఇండియా ప్రయాణం అయిందనిపించుకుని ఆవురావురంటూ తమ ఇల్లు చేరి హమ్మయ్య అనుకున్నంతసేపు పట్టలేదు. గుండెలు పగిలే దుర్వార్త మోసుకొచ్చేరు పొరిగింటివారు.

ప్రయాణానికి ముందు సీమబాబు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల హంటర్ని పొరుగువారికి ఒప్పజెప్పేరు రెండువారాలపాటు చూసుకోమని. పొరిగింటి మేరీయాన్ సూసన్న ఒకే వయసువాళ్ళు. మేరీయాన్ హంటర్ని ప్రాణపదంగా చూసుకుంటానని మాటిచ్చింది.

మాట నిలబెట్టుకుంది కూడా ఒకవిధంగా చూస్తే.

ఎన్నారయ్య కుటుంబం తిరిగొచ్చే ముందు రోజు, మేరీయాన్ హంటర్ని వాక్కి తీసికెళ్ళింది. రోడ్డు దాటుతుంటే, నలుగురు కుర్రాళ్ళు స్పోర్ట్స్ కారేసుకుని, తప్ప తాగి, ఒళ్ళు మరిచి, ఆ దారిన పోతున్న ఈ రెండు జీవాలమీదకీ పెట్టేశారు. ఘోరం జరిగిపోయింది క్షణాలమీద. రెండు కుటుంబాలకీ ఒక్కలాటి బాధే. ఏం చేసినా తీరని క్షోభ.

కూతురిగురించి వారూ కుక్కపిల్లగురించి వీరూ వాపోతూ రోజులూ వారాలూ గడుపుతున్నారు.

ఎన్నారయ్య మరో కుక్కపిల్లని తెస్తానన్నాడు కానీ సీంబాబు ఒప్పుకోలేదు. అదెప్పటికీ హంటరవదు పొమ్మన్నాడు.

నిదానంమీద సినిమాలకీ, షికార్లకీ తిప్పీ నింటెండోలూ గట్రా కొనిపెట్టీ ఆ పిల్లాడిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు కుటుంబంలో అందరూ.

000

కొడుకు కొత్తగా విడుదలయిన సీడీలు కావాలంటే తండ్రీ కొడుకూ మ్యూజిక్ స్టోరులో జొరబడ్డారు. సూసన్ తల్లితో మార్షల్ ఫీల్డ్ వేపు దారి తీసింది. స్ప్రింగ్ డిజైన్లు చూడ్డానికి.

షాపులో అడుగెట్టగానే ఆ అమ్మాయి కళ్ళబడింది ఎదురుగా రాక్ మీద వేలాడేసిన షాల్.

“మామ్” అంటూ తల్లిని కేకేసింది. అది అచ్చు ఇండియాలో తాము కొన్నలాటిదే. అక్కడ షాపువాడు ఆరొందలయాభై చెప్తే, నాలుగొందల ఇరవై రూపాయలకి ఒప్పించి తృప్తి పడ్డారు. అదే షాల్ ఇక్కడ నూటయాభై డాలర్లు! అంటే ఎన్ని రూపాయలో? దీన్ని దోపిడి అని ఎందుకనరో?

ఆ తరవాత సినిమా చూసి, చైనీస్ రెస్టారెంటులో భోంచేసి ఇంటికొచ్చేరు.

దాదాపు 250 డాలర్లు ఖర్చయిందాపూట.

“అంటే ఎన్ని రూపాయలు?” అనడిగింది సూ.

“అదేం ప్రశ్న?” అన్నాడు తండ్రి.

“మనం ఇక్కడ డాలర్లలో సంపాదిస్తాం. డాలర్లలో ఖర్చు పెడతాం,” అంది తల్లి విశ్వరహస్యం బోధిస్తున్నట్టు.

“యూ డమ్మీ,” అన్నాడు సీంబాబు.

తనప్రశ్నలో అంతరార్థం వారెవరికీ అర్థం కాలేదన్న సంగతి ఆ పిల్లకి మాత్రమే అర్థం అయింది.

000

(పత్రిక 2001లో తొలిసారి, తరవాత

రచన మాసపత్రికలోనూ, ఇంకా ఇతర పత్రికలలోనూ ప్రచురితం.)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “డాలరుకో గుప్పెడు రూకలు”

  1. ఆకుకూరల వాళ్ళతో బేరం చేసే వాళ్ళందరూ గుర్తొచ్చారు….మాల్ లో మాత్రం వంద వస్తువును వెయ్యికి కొంటారు ఆకుకూరలు పండ్లు అమ్ముకునే వాళ్ళతో రూపాయి అర్థరూపాయి కూడా బేరం చేస్తారు….

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.