నే రాసిందీ మీరు చూసిందీ ఒకటేనా, ఒకటే కావాలా?

అమెరికన్ రచయిత్రి, Flannery O’Connor, I write to learn what I know అన్నారు. అంటే తనకి తనే తనకు గల జ్ఞానాన్ని పరీక్షకి పెట్టుకుంటున్నారనుకుంటాను. 

నా డాలరుకో గుప్పెడు రూకలుమీద రాధికగారి వ్యాఖ్య చూసినతరవాత నాకూ అలాటి జిజ్ఞాసే కలిగింది.  రాధికగారి వ్యాఖ్య ఎత్తి చూపిన కోణం నాకు తట్టలేదు నేను ఆకథ రాసినప్పుడు పిల్లల మనస్తత్త్వం ఆవిష్కరించాలనుకోలేదు. కొంతకాలం మనం పుట్టినవూరికి దూరం అయింతరవాత మనదృక్కోణాలలోనే మార్పు వస్తుందని, మనమే మనవాళ్లని నమ్మలేకపోతున్నాం అనీను.  (మీరెవరితాలూకు కథలో సర్దార్జీ ఉదంతం కూడా ఇలాటిదే. నిజంగా జరిగింది కూడాను!)

పై వ్యాఖ్యానం చదివినప్పుడు నాకు మరో విషయం గుర్తొచ్చింది. నేను నాలుగేళ్లకిందట ఒక ప్రముఖ రచయిత్రిగారి కథ అనువాదం చేస్తే, నేను ఆకథని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు ఆమె. మనం అనుకున్నది ఒకటీ అయిందొకటీ అయినప్పుడు అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందన్న సామెత వాడతాం. కాని ఎల్లవేళలా కోతి కాదేమో, మరో మంచి అయ్యవారే తయారవుతారేమో.🙂

మీరు రచయితలు. మీరేమంటారు మరి?

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “నే రాసిందీ మీరు చూసిందీ ఒకటేనా, ఒకటే కావాలా?”

 1. మేడమ్ గారూ. ఒక రచయిత ఒక సంపూర్ణమైన రచన చేయడానికి తాత్వికుడుగా, కవిగా, మనోవిశ్లేషకుడిగా, సర్వం ఎన్ని విధాల పరిణతి కలిగివుంటే అంత సమర్థంగా రచన చేయగలడు. మీరు సూచించిన కొన్ని లోపాలు వంటివి రచయిత తనకి తెలీకుండానే విస్మరించివుండవచ్చునేమో గానీ చివరకి మిగిలేది రచన పద పదాన కళాత్మకతను, సృజనాత్మకతను నింపుకున్న రచన. గొప్ప రచయితలు కొందరు పుంఖాను పుంఖాలుగా రచించి సాధించలేని ఘనత బుచ్చిబాబు గారు ఒక్క ‘చివరికి మిగిలేది’ రచన ద్వారా సాధించగలిగారు. అయినా బుచ్చిబాబు గారు ఒక రచయిత. సిద్ధాంత కర్త కాదు. ఆ రచనలో ఏమీ లేదనుకుంటే ఈనాడు మనం దాన్ని గురించి చర్చించుకునే అవసరం వుండేది కాదనుకుంటా. తెలుగు వాజ్ఞ్మయంలో ‘చివరకి మిగిలేద’నేది లేకపోతే బుచ్చిబాబు గారు ‘నన్ను గురించి కథ రాయవూ’ కథలో అన్నట్టు. తెలుగు వాజ్ఞ్మయంలో ఒక పవిత్రమైన శూన్యత ఏర్పడివుండేది. అయనే అన్నారు రచన మొత్తం చేసిన పిదప దాన్ని చదివినప్పుడు తనకే రుచించలేదని. అలాగే పీఠిక లోనూ రాశారు. ఇందులో దయానిధి నేర్చుకున్న పాఠం రచయిత నిర్వచనాలుగా భావించవద్దునని. ఏమైనా బుచ్చిబాబు గారు జీవితం చివరలో విశ్వసించిన తత్వం గురించీ. ఆయన చివరకి మిగిలేది లో జీవితానికి అర్ధం ఏమీ లేదని ఒక ఖాళీ కవరు ద్వారా చెప్పించిన వైనం గురించీ తీరిగ్గా మీతో మళ్ళీ వివరంగా చర్చిస్తాను. ఏదైనా ప్రపంచాన్ని, సృష్టి తత్వాన్ని బాగా ఎరిగే ఆ రచన చేశారని నా భావన. చివరగా నా బ్లాగు చిరునామా అడిగారు. చూడండి. http://abhinayani.blogspot.com ప్రస్తుతానికి వుంటాను.

  మెచ్చుకోండి

 2. విజయకుమార్ గారూ,

  మీకథలు ఎక్కడ వున్నాయి. లింక్ ఇవ్వగలరా?.

  స్వార్థం అనడం నాపొరపాటే. మీరన్నట్టు తృప్తి పొందడం కూడా నిజమే.
  బుచ్చిబాబుగారి నవలమీద నావ్యాఖ్యనం మీకు నచ్చినందుకు సంతోషం. మీవివరణలో స్త్రీలకి తెలీనివిషయాలు చర్చించారు. అంతకుముందు ఎవరూ రాయలేదా, చలం, మల్లాది రామకృష్ణశాస్త్రి, చాలామందే రాసారు కదండీ దాదాపు అన్ని కోణాల్లోనూ.
  ఆపైన మరికొంచెం వివరణగా —
  మనోవిశ్లేషణ సైన్సు – మేధకి సంబంధించినది. సౌందర్యోపాసన అనుభూతి మనసుకి సంబంధించినది. మరి సిద్దాంతీకరణలో అనుభూతికి తావుందా? వుందనే అనుకుందాం, అది మానవనైజం అని చూపించడమే రచయిత వుద్దేశం అయితే. ఒకొకప్పుడు, ఈమనోవిశ్లేషణ శృతి మించి, కథానాయకుడిని క్రియాశూన్యుడిగా చేస్తుందని కూడా రచయిత అభిప్రాయమా?
  మరొక సందేహం – బుచ్చిబాబు పీఠికలో జీవితరహస్యం తెలుసుకోడానికి మానవుడు చేసే ప్రయత్నమే ఏగ్రంథానికైనా పునాది అనీ, జీవితంపై (పాఠకుడికి) ఒక దృక్పథం కలగజేయాలనే వుద్దేశంతోనే ఈరచన సాగిందనీ అన్నారు. మీకు ఇది సమర్థనీయంగా వుందా?
  మరొక చిన్న సవరణ. అమృతంకూతురి జీవితం ఏమవుతుందన్న ఆలోచన దయానిధికి ఎందుకు తోచలేదు అని మాత్రమే నాప్రశ్న. నిజంగా ఆఅమ్మాయి జీవతం ఎలా వుండునో కథలో లేదు.

  మెచ్చుకోండి

 3. కృతజ్ఞతలు మాలతి గారూ. ఇక్కడ స్వార్ధం అంటే నా ఉద్దేశ్యం యిదొక రకం మంచి స్వార్ధం అనుకోండి. అంటే రచయిత తన రచనలో సంతృప్తి చెందితే ఎవరికీ నష్టం లేదు గదా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక దాత ఏదైనా దానం చేసినప్పుడు “అమ్మయ్య ఈరోజు నేను యింతమందికి దానం చేయగలిగేను” అనే సంతృప్తిని చెందుతాడు. అదీ ఒక రకమైన అహం సంతృప్తే. అలెగ్జాండర్ కి ‘విశ్వ విజేత’ కావడం సంతృప్తికరం అనుకుంటే వీళ్ళకిది సంతృప్తికరం. నేనైతే కథలు చాలా కష్టించి రాస్తాను. ప్రతి కథలోనూ అది సరసమైన కథ అయినా సరే ఒక సందేశం యిమిడ్చి పెడతాను. అలాగే సంతృప్తి చెందుతాను కూడా. అవి బహుమతి పొందినప్పుడు నా కష్టానికి గుర్తింపు లభించినందుకు మరింత ఆనందిస్తాను. ఇక మీ చివరకి మిగిలేది నవలపై వ్యాసం గురించి. నాకు బుచ్చిబాబు గారి గురించి క్షుణ్ణంగా తెలుసుననే భావిస్తాను. అయితే అవి ఆయన వ్యక్తిగత విషయాలు గావు. మీ వ్యాసం నుంచి నేను నేర్చుకున్నది పెద్ద విషయమే వుంది. దయానిధి అలా తల్లి అపచారం వల్ల ఎదురైన దుష్పరిణామాల గురించి బాధపడ్తూ కూర్చోక, వాటిని ప్రతిఘటిస్తూనే సమర్థవంతమైన, ఆదర్శవంతమైన జీవితం గడపవచ్చు గదా. ఆలాగే అమృతంతో కలిసి తప్పు చేసి ఆమెనీ తన తల్లిలాగే తయారుచేయడం. తర్వాత అమృతం బిడ్డ దయానిధికి మల్లే మళ్ళీ లోకం నుండి చెడుగును స్వీకరించాల్సి రావడం. ఇవి నిజంగానే నాకు స్ఫురించలేదు. ఎటొచ్చీ, మీకు (స్తీలకి) తెలీని విషయాలు ‘చివరకు మిగిలేది’ లో కొన్ని వున్నాయి. అవి బుచ్చిబాబు స్త్రీని అంగాంగ వర్ణణలు చేయడం అనేది. అందరు పురుషుల్లోనూ స్త్రీ శరీరం పట్ల కలిగే అనుభూతుల్ని అయన ధైర్యంగా, సమర్ధవంతంగానే లిఖించి గలిగారని నేను భావిస్తాను. పైగా ఆయన సౌందర్య ఆరాథకుడు, భావకుడు. రాయాలంటే చాలా వున్నది. మళ్ళీ తీరిగ్గా చర్చిస్తాను. ఈ వ్యాఖ్య మీ వ్యాసం చదివినప్పుడే రాద్దామనుకున్నాను. కానీ నేను చదివిన బ్లాగులో (అది మీ బ్లాగు కాదు. ఎవరో మీ వ్యాసం ప్రజంట్ చేశారు) వ్యాఖ్య రాసే సదుపాయం లేదు. అందువల్ల యిప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఏమైనా చక్కటి వ్యాసం అందించిన మీకు మరోసారి కృతజ్ఞతలు. ఉంటాను.

  మెచ్చుకోండి

 4. విజయకుమార్ గారు, మీ విశ్లేషణ సమర్థనీయమే. నేను కేవలం ఆఒక్క వాక్యమే ఎక్కడో చూసాను కాని పూర్వాపరాలు తెలీవు. అంచేత ఆవిడ అభిప్రాయం ఏమిటో చెప్పలేను.
  సహృదయులయిన రచయితలకి వినయం కూడా వుంటుందనుకుంటాను. మీరన్నట్టు నాకేం తెలుసో తెలుసుకోడానికి రాసేది డైరీ కావచ్చు. పదిముందు పెడితే, పంచుకోడానికేనన్నది స్రష్టం. అంటే డైలాగ్ అనుకోవాలి. అంతకుమించి స్వార్థం వుందా అన్నది కొందరికి వర్తిస్తుందేమో.
  ఈవిషయమే బుచ్చిబాబు రచనని కిటికితో పోలుస్తూ ప్రతి ఒక్క రచయితా ఒక్కొక్క కిటికీ తెరుస్తాడు. అందరూ తలో చెయ్యీ వేసినప్పుడే సంపూర్ణమైన అవగాహనకి ఆస్కారం అన్నారు.

  మెచ్చుకోండి

 5. “అమెరికన్ రచయిత్రి I write to learn what I know అన్నారు. అంటే తనకి తనే తనకు గల జ్ఞానాన్ని పరీక్షకి పెట్టుకుంటున్నారనుకుంటాను” ఈ మాట సరైనదేగానీ కొంత అస్పష్టత వుందనిపిస్తోంది. “నాకేం తెలుసు అనేది తెలుసుకోడానికి నేను రచనలు చేస్తాను” అనడం కంటే “నాకు తెలిసింది ప్రపంచానికి తెలియబరుస్తున్నాను అంటే వ్యక్తం చేస్తున్నాను” అనడం ఒక విధం. “నాకు తెలిసింది ప్రపంచానికి రాయడం అనే ప్రక్రియ ద్వారా సరిగ్గా వ్యక్త పరచగలనా?” అలాగే “నన్ను నేను అభివ్యక్తం చేసుకోగలనా?” నన్ను నేను అభివ్యక్తం చేసుకోవడం అంటే “నేను చేసిన రచనలలోని భావ ప్రకటన, నిర్ధుష్టత నన్ను, లేదా నాలోని అహాన్ని సంతృప్తి పరచగలిగిందా?” అన్నది యింకో విధం. ఇటువంటిదే సాధారణంగా రచయితల దృక్పథం అయివుంటుందని నేను భావిస్తాను. ఏమంటారు?

  మెచ్చుకోండి

 6. నేను మీ కధలో ఆ ఎన్నారయ్యి పాత్రలో నన్ను నేను చూసుకున్నాని ఇంతకు ముందు వ్యాఖ్యలోనే రాసాను.కధ చదువుతూ వున్నంత సేపూ నాకు నేను చేసిన పనులే కనపడ్డాయి.ఇక్కడ డాలర్ల మీద డాలర్లు ఖర్చు చేస్తూ ఇండియాలో పది రూపాయలకి,ఒక్కోసారి రెండు రూపాయలకి కూడా గీసి గీసి బేరాలాడిన రోజులున్నాయి. కధంతా నా గురించే రాస్తున్నారా అనుకుంటూ చదువుతూ వుండడం వల్ల కధ చివరిలో ఆ అమ్మాయి చేత చెప్పించినమాటలు నాకు బాగా తగిలాయి.ఇన్నాళ్ళూ ఇది నేను ఎందుకు ఆలోచించలేదని అనుకుంటూ ఆ అమ్మాయి మాటలు మా అబ్బాయి చెప్పుంటే నేను నిజం గా అర్ధం చేసుకుని వుండేదానినా అనుకుని ఆలోచిస్తూ ఆ జాబు రాసాను.ఇదే నా కోణం.అంతకన్నా ఏమీ లేదండి.

  మెచ్చుకోండి

 7. మీరు రచయిత్రి కాకపోవటమేమిటండీ, లలితగారూ, మీవ్యాసం కూడా చదివాను. చక్కగా మీ అభిప్రాయాలు చెప్పారు.

  పోతే, అపార్థాలు మనం కావాలని తెచ్చిపెట్టుకోం కదండీ. అవి వచ్చినప్పుడు ఏంచెయ్యడమా అని. అంతే. నిజానికి రాధికగారి వ్యాఖ్యానంవల్ల మీరన్నట్టు నాకు కొత్త కోణం గోచరమయింది. అందుకు నాధన్యవాదాలు ఈవిధంగా తెలియపరుచుకున్నాను.
  అంతే.

  మెచ్చుకోండి

 8. మనం చెప్పేది ఎదుటి వారికి వెంటనే అర్థమైపోతే, సరిగ్గా మనం చెప్పదల్చుకుందే అర్థం అయితే ఇక అపార్థాలెందుకొస్తాయండీ?
  అంతే కాదు మీరు చెప్పినట్లు ఒక్కో సారి మనం ఇవ్వదల్చుకున్న దానికంటే మెరుగైన సందేశమే వినే / చదివే వారికి అందవచ్చు.
  ఆ ఆంగ్ల రచయిత్రి ఉద్దేశ్యమే నాదీను. నేను రచయిత్రిని అని కాదు. నేను బ్లాగే ఉద్దేశం అది అని. నా ఆలోచనలలో ఏమున్నదో అవి అక్షరరూపంలో ప్రత్యక్షమయ్యాక, వాటికి స్పందించిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక నాకు ఇంకొంచెం స్పష్టంగా అర్థం అవుతుంది అని నా ఆశ. అందువల్ల చదివే వారికీ, వారి ఆలోచనలు ఇంకొంత స్పష్టం అవ్వచ్చు. రాయడం అనేది ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ అని నా నమ్మకం.
  ఈ విషయానికి కాస్త దగ్గరలో నేను రాశాను అనుకుంటున్న టపా:
  http://onamaalu.wordpress.com/2007/11/28/%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81/

  మీ అభిప్రాయం తెలుపగలరు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s