అత్యంత సన్నిహితులు

వారంరోజులుగా రాళ్ళు పేల్చినఎండ తగ్గుముఖం పట్టినట్టుంది. రాత్రి కుండపోతగా కురిసిన వాన తగ్గి తుంపర్లు మాత్రం పడుతున్నాయి సన్నగా.

ఆస్పత్రిపక్కమీద పడుకుని సుమిత్ర కిటికీలోంచి చూస్తూ ఆలోచిస్తోంది. మామూలుగా అయితే నాలుగున్నర మైళ్ళు నడిచేసును ఇలాటిసమయాల్లో, కాలికి కట్టూ, మెళ్ళో పట్టెడా, పక్కఎముకల్లో పోట్లూ లేకపోతే. కదిలినప్పుడల్లా ప్రాణం జివ్వున లాగేస్తోంది. ఒళ్ళంతా పచ్చి పుండు. అలాగే నెమ్మదిగా రవంత ఓపిక తెచ్చుకుని పక్కకి తిరిగింది కిటికీదిశగా.

000

సుమిత్ర అమెరికా వచ్చి ఏడాదిన్నర అయింది. పోస్ట్ డాక్‌గా వచ్చింది. రాగానే వాళ్ళ ప్రొఫెసరు ఆనతిమీద మరో పోస్టుడాకు ఆవిడకి ఇల్లు చూపించడానికి తీసుకెళ్ళేడు తనకారు తీసుకుని. మొదట యూనివర్సిటీకి దగ్గరయితే బాగుండుననుకుంది కానీ అక్కడ స్టూడెంటుబాబులగదులు ఎలా ఉంటాయో చూసేసరికి కడుపులో దేవినట్టయింది. అమెరికాలాటి గొప్పదేశంలో ఇళ్ళు ఇంత ఛండాలంగా ఉండగలవని ఎవరేనా చెప్తే ఏదో కుళ్ళుబుద్ధితో అలా అంటున్నారని అనుకునివుండును. కానీ తను కళ్ళారా చూసి, కళ్ళు తిరిగి, పదండి అంటూ అక్కణ్ణుంచి గబగబా బయటికి వచ్చేసింది ఇల్లు చూపుతున్న అమెరినబ్బాయితో సహా.

యూనివర్సిటీకి దగ్గరయితే గదులు దరిద్రంగా ఉంటాయని తెలిసినతరవాత కొంచెం దూరంలో మరో వాటా చూపించేడతను. అది బాగానే ఉంది అద్దె కొంచెం ఎక్కువే అయినా. బస్సు గుమ్మందగ్గర ఆగుతుంది కనక కారుండాలన్న బాధ లేదు. కారున్నా పార్కింగుబాధ తప్పదు కదా. ఇదే నయం. ఇలా చాలా కారణాలు చూపించి ఆ వాటాలో ప్రవేశపెట్టేసేడు అతను సుమిత్రని.

సుమిత్ర ఆసాయంత్రమే బయల్దేరింది కూరా నారా, పాలూ పళ్ళూ తెచ్చుకోడానికి. బస్సెక్కబోతూంటే పొరుగాయన కనబడి, “కాస్త దూరమే అయినా ఉడ్మన్సులో కూరలూ పళ్లూ తాజాగానూ చవగ్గానూ ఉంటాయని,” చెప్పేడు. ఆయనకీ కారు లేదు. తాను బస్సులో వెళ్ళి టాక్సీలో వస్తానని చెప్పేడు. కావలిస్తే మీరు కూడా నాటాక్సీలో రావచ్చనీ, ఖర్చు పంచుకుందాం అనీ చెప్పేడు. సుమిత్రకి అది బాగానే ఉందనిపించింది. అలా కంతకాలం సాగింది.

త్వరలోనే అది సుఖదాయకం, శాంతిదాయకం కాకుండా పోయింది. పొరుగాయన “ఇదుగో, ఈ పక్కనే,” “ఒక్కనిముషం,” “మరొక్క వస్తువు మరొక్కదుకాణంలో,” ్ంటూ కూరలదుకాణంనుంచి మరో చోటికీ, మరోపనికీ తిరగడం, ఇద్దరికీ అనుకూలమయిన సమయాలు కుదరకపోవడం – ఇలా ఏవేవో ఆటంకాలు రావడం మొదలయింది. అలాటిరోజుల్లోనే సుమిత్రకి కారోటి కొనుక్కుంటే పోదూ అనిపించింది. ఆమధ్య అమెరికా సందర్శించిన ఓ తెలుగురచయిత్రి అమెరికాలో కారులు కారుచౌక అని చదవడం గుర్తొచ్చింది సందర్భోచితంగా. అయిదువందలడాలర్లు పారేస్తే బంగారంలాటి కారొస్తుంది, అమెరికాలో కారులేనివారిని కానం అంటూ రాసిందావిడ.

అఫ్కోర్స్ కారులేనివారు అమెరికాలో చాలామందే ఉందురు అని సుమిత్రకి అచిరకాలంలోనే తెలిసిపోయింది కానీ కారులు కారుచౌక కావని అంత తొందరగా తెలీలేదు. అదుగో, అలాటి సందిగ్ధావస్థలో ఉండగానే సుమిత్రకి శ్యామల తటస్థపడింది ఓ సాయంత్రం షికారుకెళ్ళినప్పుడు. శ్యామల తనపిల్లల్నిద్దర్నీ, పొరుగింటి పిల్లాడినీ పార్కుకి తీసుకెళ్తోంది.

“అట్ల దౌడు తీయకురా.”

తేటతెలుగుపలుకు విని ఉలిక్కిపడి అటు చూసింది సుమిత్ర.

సుమిత్ర తనవేపు చూడ్డం శ్యామల చూసింది. చూసి చిరునవ్వు నవ్వింది.

సుమిత్ర ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, “మీరు తెలుగువాళ్ళా?” అంది.

అమెరికాకి వచ్చినకొత్తలో చాలామందికి అలాగే ఉంటుంది. తెలుగుమాట వినిపిస్తే ఉలికిపడతారు. ప్రాణం లేచొస్తుంది. అలా అయిన వారిపరిచయం అలతికాలంలోనే నువ్వంటే నువ్వనుకునేవరకూ వచ్చేసింది. అది సుమిత్ర ఓ కారు కొనేస్తే పోదూ అనుకుంటున్నసమయం కూడాను.

శ్యామల స్వయంగా కారు నడపదు. వాళ్ళకి కారు లేదు. ఎప్పుడేనా కొనుక్కోక తప్పదు కదా అని కారులమీద చాలా రిసెర్చి చేసి పెట్టుకుందావిడ భర్త సురేష్ ఆఫీసుకెళ్ళిపోయేక, పెద్దపిల్లాడిని స్కూల్లో వదిలేసొచ్చేసేక, చిన్నదాన్ని నిద్ర పుచ్చే రోజూ కంప్యూటరులోనూ దినపత్రికలలోనూ చూసి సమాచారం తీసి పెట్టుకుంది.

శ్యామల సుమిత్రకి చెప్పిందేమిటంటే అయిదు వందలకి వచ్చే కారులు మనం నడిపేలా ఉండవు. మనం నడపలేం వాటిని. మనకి నమ్మినబంటు హనుమంతునివంటి కారు కావాలి. కంటికి నదరుగా కాకపోయినా చూడగానే అదిరిపడేలా ఉండరాదు. మైలేజి తక్కువుండాలి. మైళ్ళు ఎక్కువివ్వాలి. …

ఆ తరవాత ఓ వారాంతం శ్యామలే మళ్ళీ పిలిచింది, “పద. ఊరికే చూసొద్దాం. చూడగానే కొనేయాలనేం రూలు లేదు కదా,” అంది. సుమిత్ర కూడా అదొక కాలక్షేపంగానూ ఉంటుంది, విజ్ఞానదాయకంగానూ ఉంటుందిని సరే, పదమంది.

అలా సుమిత్ర కారు కొనడం అయిపోయింది. కారు కొన్నతరవాత సుమిత్రే శ్యామలని పిలుస్తూ వచ్చింది బజారుకీ, పార్టీలకీ, సినిమాలకీ వెళ్ళినప్పుడల్లా.

000

రోజులెప్పుడూ ఒక్కలాగే ఉండవు అన్న సుజనవాక్కుని నిరూపించడానికేనేమో అన్నట్టు శ్యామలావాళ్ళూ ఇల్లు మారేరు. అదీ ఊరికి ఉత్తరంగా ఆరు మైళ్ళదూరం వెళ్ళిపోయేరు మంచి వాటా ఎక్కువ వసతులతో తక్కువ అద్దెకి దొరికిందని.

సుమిత్రకి కారుంది కనక తనే తరుచూ వాళ్ళింటికెళ్ళడం ఆనవాయితీ అయిపోయింది. ఆవిషయంలో సుమిత్ర ఏమీ బాధ పడలేదు కూడాను. రెండోసారి సుమిత్ర వాళ్ళింటికెళ్ళినప్పుడు మాటలసందర్భంలో శ్యామల అంది, “అన్నీ బాగానే ఉన్నాయి కానీ బజారుపనే ఇబ్బంది అయిపోతోంది. మరీ దూరం అయిపోయింది.”

సుమిత్ర, “నిజమే. ఎలాగా వచ్చేను కదా, పద. కనీసం ఈవారం కావలసినవి తీసుకొచ్చువుగుందువు గాని,

” అంది.

శ్యామల ఒప్పుకోలేదు, “బజారు దాదాపు మీయింటిదగ్గర. అక్కణ్ణించి ఇక్కడికొచ్చి, మళ్ళీ అంతదూరం వెళ్ళి, మళ్ళీ ఇక్కడికొచ్చి నన్ను దింపి మళ్ళీ మీయింటికెళ్ళడం అంటే నీకారు మాటెలా ఉన్నా రోడ్డు అరిగిపోతుంది,” అంది నవ్వుతూ.

సుమిత్ర ఊరుకోలేదు. “ఫరవాలేదులే. పాలవాడుకలా వారం వారం హాజరవుతాననడం లేదు కదా. వచ్చినప్పుడు చేస్తాను. నేన్రానప్పుడు నీతిప్పలు నీకెలాగా తప్పవు,” అంటూ బలవంతం చేసింది.

ఆవిధంగా వారిద్దరిమధ్య రాతకోతలు లేని ఓ ఒప్పందం కుదిరిపోయింది. కానీ శ్యామలకి మొహమాటంగానే ఉంటోంది. అవునూ, కాదూ, ఫరవాలేదూ అంటూ జరుపుకొస్తున్నారు. బజారుకో, పేరంటానికో సుమిత్ర తనని తీసుకెళ్లినప్పుడల్లా కనీసం గాస్ మనీ అయినా తీసుకోమని శ్యామల అడుగుతూనే ఉంది. ఈదేశంలో అది మామూలే, అందులో తప్పు లేదని కూడా చెప్తూ వస్తోంది. ఆఖరికి అవిడని సంతోషపెట్టడానికి సుమిత్ర ఒకటి, రెండుసార్లు ఓ రెండు డాలర్లు పుచ్చుకుంది.

000

రోజులెప్పుడూ ఒక్కలాగే ఉండవు అనుకోడానికి ఆస్కారమిస్తూ రెండోసారి మరో చిన్న వ్యధ సంభవించింది. ఊరిపొలిమేరల్లో కొత్తగా ఇల్లు కట్టుకున్న రాధాస్వామినాయుడుగారి భార్య సీతాలక్ష్మిగారు ఊళ్ళో ఉన్న తెలుగువారినందర్నీ పిలిచేరు గృహప్రవేశానికీ, సత్యనారాయణవ్రతానికీను. సుమిత్రని పిలిచి, ఆమాటా ఈమాటా మాటాడి, “మీరు శ్యామలగారిని తీసుకురాగలరా?” అనడిగేరు.

“అలాగేనండీ. దాన్దేముంది. అలాగే పిలుచుకొస్తాను,” అంది సుమిత్ర.

ఆరోజు కుదర్లేదు కానీ మర్నాడు శ్యామలని పిలిచి, సీతాలక్ష్మిగారింటికి వస్తున్నావా అనడిగి, “అయిదుగంటలకి రానా?” అనడిగింది. ట్రాఫిక్ టైం కదా, దూరం కదా అని. అలాగే అంది శ్యామల. అనుకున్నట్టుగానే సుమిత్ర వచ్చింది. శ్యామలా, పిల్లలూ కారెక్కేరు. సురేష్ ఊళ్ళో లేడుట.

సీతాలక్ష్మిగారింట్లో అందరూ గలగల హలోహలోలు చెప్పుకుంటుండగా, ఒకావిడ, “కాంతిమతిగారు వచ్చినట్టు లేదే,” అంది.

ఆ పక్కనున్నావిడ, “రాలేదు. ఆమె డ్రైవు చెయ్యరు కదా. వాళ్లాయన ఊర్ల లేరంట,” అని వివరించింది.

“మీరెట్ల వచ్చినారు? మీరు గూడ డ్రైవు చెయ్యరు గద,” అనడిగింది మొదటావిడ శ్యామలవేపు తిరిగి.

“సుమిత్రతో వచ్చేను.”

“మంచామెనే మీకు దోస్తు దొరికినది. నేనయితే అసలు పోడమే మానుకుందు,” అని, అక్కడితో వదిలిపెట్టకుండా సుమిత్రవేపు తిరిగి మెచ్చుకోలుగా, “మీకు నిండ ధైర్యం హైవేమీన కూడ డ్రైవు చేస్తురు. నేనయితే డ్రైవు చేస్తును గానీ పిల్లగాండ్ల స్కూలూ, పాపింగూ – అంతే. ఆపైన ఏడకి పోవాలనినా రెడ్డిగారే,” అంది. మళ్ళీ శ్యామలతో, “మీరు మాయింటికి ఎప్పుడూ రానేలేదు. పైవారం రండిమీ. సుమిత్రగారూ, మీరున్ను రండిమీ ఆమెను తోడుకొని,” అంది తనమంచితనం తెలుపుకుంటూ.

శ్యామలకి ఏం చెప్పాలో తోచలేదు. తెల్లబోయి చూస్తూ ఊరుకుంది. సుమిత్ర చూద్దాంలెండి అనేసి, లేచి కిటికీదగ్గరికెళ్ళి బయటికి చూస్తూ, “మీమందారచెట్టు బాగా పూస్తోందండీ,” అంది సీతాలక్ష్మిగారితో.

“ఆ, ఈరోజు ఎండ బాగుంది కదా అని బయట పెట్టేను. కాస్త చల్లబడితే మళ్లీ ఇంట్లోకి తెచ్చేసుకోవాలి. నాకు మొక్కలంటే ప్రాణం. అసలందుకే పెద్ద పెరడుండేలా చూసుకున్నా ఇల్లు కట్టించేప్పుడే..”

“అవునండి. ఈదేశంలో మొక్కలూ, కుక్కలే కదా జనాలకి తోడు,” అన్నారు మరెవరో.

కబుర్లు మలుపు తిరిగినందుకు సుమిత్రా, శ్యామలా కూడా హమ్మయ్య అనుకున్నారు స్వగతంలో.

ఆరోజు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు శ్యామల అట్టే మాటాడలేదు. సుమిత్రకి కూడా ఏం మాటాడాలో తోచడం లేదు.

శ్యామలనీ, పిల్లల్నీ వాళ్ళింటిదగ్గర వదిలిపెట్టి, “రేపు పిలుస్తాలే,” అన్చెప్పి సుమిత్ర ఇంటికి వెళ్లిపోయింది.

వాళ్ళిద్దరిమనసుల్లోనూ వారూ వీరూ చేసిన అనవసర ప్రసంగంతాలూకు నీడలు సన్నగా పరుచుకుంటున్నాయి అసురసుంధ్యవేళ చీకట్లలా. శ్యామల ఏమనుకుంటోందో అని సుమిత్రా, సుమిత్ర ఏమనుకుంటోందో అని శ్యామలా మధన పడుతున్నారు.

ఇదమిత్థంగా చెప్పలేని తెరల్లేచేయి వారిద్దరిమధ్యా.

000

సుమిత్ర ఎమర్జెన్సీగదిలో మంచంమీద పడుకుని ఉంది కళ్ళు మూస్తూ, తెరుస్తూ. తన ఇక్కడకి ఎలా వచ్చిందో, ఎందుకిక్కడ ఉందో, చుట్టూ ఉన్నవాళ్ళెవరో, వాళ్ళేం అడుగుతున్నారో స్పష్టంగా తెలీడం లేదు.

ఏవో ప్రశ్నలు ఒకరితరవాత ఒకరు … తెలీడం లేదు.

ఇంతలో తలుపుదగ్గర అలిగిడి అయి అటు తిరగబోయింది కానీ మెడకున్న పట్టెడ తిరగనివ్వలేదు. జివ్వుమంది మెడ.

“కదలకు,” ఎవరో హెచ్చరించేరు.

శ్యామల నిదానంగా అడుగులో అడుగులేసుకుంటూ వచ్చి, పక్కన నిలబడి, “ఎలా ఉంది?” అనడిగింది.

“హుమ్. బాగానే ఉన్నాను,” అంది సుమిత్ర నీరసంగా.

ఇద్దరికీ కొంచెంసేపు మాట తోచలేదు. శ్యామల నర్సుని అడిగింది వివరాలు.

ఆ అమ్మాయి డాక్టరుతో మాటాడమంది.

శ్యామల సరేనని, సుమిత్రచేతిని సున్నితంగా తనచేతిలోకి తీసుకుని, “రెస్టు తీసుకో. డాక్టరుతో మాటాడి వస్తాను,” అని చెప్పి బయటికి వెళ్ళింది.

సుమిత్ర సరేనన్నట్టు కనురెప్పలాడించింది.

అరగంట తరవాత శ్యామల తిరిగొచ్చి చెప్పింది, “డాక్టరు ఫర్వాలేదన్నారు. ఈ రాత్రికి ఇక్కడ ఉండమన్నారు. రేపు ఇంటికెళ్ళిపోవచ్చునేమో అన్నారు.”

మరో అరగంట కూర్చుని, “పడుకో, రేపు వస్తాను,” అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు పన్నెండు గంటలకి వచ్చింది. డాక్టరుతో మాటాడిందిట, ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చునని చెప్పేరుట. నాలుగు రోజులు బెడ్ రెస్టు కావాలని కూడా చెప్పేరని చెప్తూ, క్లాజట్లోంచి బట్టలు తీసి సుమిత్రకి అందించింది. రిలీజ్ కాయితాలమీద సంతకాలూ, రిలీజ్ పాఠాలు అయేక, సుమిత్ర ప్రతి పేషంటులాగే నాకు రెండు చక్రాలకుర్చీ వద్దని కాస్త    గొడవ చేసి, అది హాస్పిటల్ రూల్సని చెప్పించుకుని, దాన్లో కూచుంది.

బయటికి వచ్చేక, “నువ్వు ఇక్కడుండు. కారు తీసుకొస్తాను,“ అని, వెళ్ళి పది నిముషాల్లో వచ్చింది కారు తీసుకుని. సంచీ ట్రంకులో పడేసి, ముందుసీటు తలుపు తీసి, సుమిత్రకి చెయ్యందించి, కూర్చున్నతరవాత సీటుబెల్టు పెట్టి, అటు తిరిగొచ్చి డ్రైవరుసీటులో కూర్చుంది.

సుమిత్ర కారు బయల్దేరేక, నిన్నట్నుంచీ తనని వేధిస్తున్న, తాను అడగాలనుకుంటున్న ప్రశ్న అడిగింది, మరింక ఉండబట్టలేక, “నీకెలా తెలిసింది?”

“వాళ్ళ రికార్డులో అత్యంతసన్నిహితులు [next of kin] పేరు ఉంటుంది కదా. ఎప్పుడో నువ్వొచ్చినకొత్తలో ఇచ్చింది. అది చూసి వాళ్ళు నన్ను పిలిచేరు. ఒక్కదానివి మీఇంట్లో ఎలా ఉంటావు. మాయింటికెళ్దాం,” అంది శ్యామల నిష్కల్మషంగా. సుమిత్ర కాదనలేదు.

ఇద్దరిమనసులూ తేలిక పడ్డాయి. ఆస్పత్రినించి వేరుగా తమయింటికే తీసుకెళ్ళింది శ్యామల సుమిత్రని. సుమిత్ర కారు దిగుతుంటే ఆంటీ అంటూ పిల్లలు పరుగెత్తుకొచ్చి ఒక్క ఉదుటున మీద పడబోయేరు. సురేష్ వాళ్ళని పట్టుకుని ఆపి, “జాగ్రత్త, నెమ్మదిగా దిగండి,” అంటూ ఆప్యాయంగా ఆహ్వానించేడు.

000

(ఆగస్టు 2007. సిలికానాంధ్ర వారి సుజనరంజని ప్రత్యేకసంచికలో ప్రచురితం.)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s