అసహజం

తను “చదువుకున్నది”. తను చదువుతోంది. తన నడతలో, నడకలో, మాటలో, నీటులో తను “చదువుకున్నది”. మనిషికీ మృగానికీ – చదువుకున్నవాళ్లకీ చదువుకోనివాళ్లకీ మధ్య గల తేడా తనలో స్పష్టంగా ప్రతిబింబోస్తోందని తన అభిప్రాయం.

తనకి అనేక అభిప్రాయాలు వున్నాయి. సర్వమానవసౌభ్రాతృత్వంమీద నమ్మకం వుంది. జీవితం అంటే నిర్దుష్టమైన నిర్వచనం వుంది. తను మాట తూలదు. ఎవరైనా మాట తూలితే సహిస్తుంది. మనిషికి మేధస్సుంది కనక అసందర్భంగా, అసంబద్ధంగా అప్రాకృతంగా మాటాడవలసిన అవుసరం లేదు అని తన అభిప్రాయం.

సాన పట్టనిదే వజ్రమైనా ప్రకాశించదు కనక, పందిరి లేనిదే లతలు ననలుతొడగవు కనక, బంగారప్పళ్లెరానికైనా గోడచేరుపు అవుసరం కనక, ప్రతిమనిషీ మనిషి కావడానికి ప్రాథమికవిద్య అవసరం. అందుకనే విద్యలేని పనిపిల్ల అమాయకంగా మాటాడినప్పుడు తనకి జాలి వేస్తుంది. దానికి తార్కికంగా మాటాడడం నేర్పాలని తను పాటుపడింది కాని ఆ యత్నం ఫలవంతం కాలేదు. దానికి కారణం సామాజికవ్యవస్థలో రావలసిన మార్పు ఇంకో రెండు తరాలదాకా రాదు అని తెలిసిపోయింది తనకి. అంచేత తను ఆ పనిపిల్లకి అక్షరజ్ఞానం కలిగించే ఉద్దేశానికి ఉద్వాసన చెప్పింది. కాని ఆ పనిమనిషి ఎంత పనికిరాని మనిషో తెలియజెప్పవలసిన రోజు వచ్చింది ఓ రోజున. తను స్వచ్ఛమైన తెలుగులో “తూర్పోళ్ల యాస”తో సహా చెప్పినా ఆ పిల్ల అర్థం చేసుకోలేదని ఋజవు చేసుకునేదినం ఆసన్నమయింది.

ఆ ఫలాన ారోజున కాలేజీలో ఒక సభ జరగబోతోంది. అన్నిసభల్లా రెండు పూలకుండీలూ, ఒక టేబులు క్లాతూ, మూడు పూలమాలలూ ఉంటే తప్ప జరగని సభ అది. కాలేజి కార్యనిర్వాహకవర్గం అదృష్టవశాత్తు లేక స్వశక్తిసామర్థ్యాలవల్ల అన్నీ సేకరించగలిగారు కానీ పూలకుండీలు దొరకలేదు. ఆరెండు అమూల్యమైన వస్తువులకొరకూ విశాలమైన ఆ మహా పట్టణంలో వెతుక్కుంటూ తిరిగే టైము లేదు కనక, అన్నిటికంటె దగ్గరలో అందుబాటులో తన ఇంటిలోనే లభ్యం కనక తన ఇంటికి జాయింట్ సెక్రటరీ దాసు వచ్చేడు.

తను కూడా ఆ సభకి హాజరు అయి సభని జయప్రదం గావిస్తే బాగుంటుందని కూడా సూచించేడతను. అంత మర్యాదగానూ అసమ్మతిని తెలియజేసింది తను. నిజానికి తనకి మనసులో రావాలనే వుంది కానీ వొంట్లో బాగులేదు. చాలా విచారించదగ్గవిషయం. పూలకుండీలు మాత్రం సంతోషపూర్వకంగా ఆ సభకి అప్పివ్వగలదు. కాని తనదగ్గరున్నవి ఇత్తడివి. చింతపండుతో తోమి, బ్రాసోతో పాలిష్ పెడితే తప్ప అవి రాణించవు. తనపూలకుండీలకి పూర్తిగా న్యాయం చేకూర్చడం విషయంలో సహజంగా సంపూర్ణాంగీకారం తెలిపాడు ఆ జాయింట్ సెక్రటరీ. పదినిముషాల కాలాన్ని వెచ్చించడానికి అతడు సిద్ధమే.

అంతసేపు అతను నించోడం తన మర్యాదకే భంగం అని అప్పుడే తోచింది. చాలా బలవంతం చేస్తే తప్ప అతను కూచోడానికి సమ్మతించలేదు. అతను చాలా మర్యాదస్తుడిలా కనిపించాడు తనకి. ఒక కప్పు కాఫీ ఇస్తే బాగుంటుందని కూడా తట్టింది. అక్కడ మొదలయింది చిక్కంతా.

కాఫీ పెట్టడానికి ఇంట్లో పాలు నిండుకున్నాయి. తను అంత తొందరపడి ఆ సదుద్దేశాన్ని అతనితో చెప్పకపోతే, ఆ మానవుడు వద్దు వద్దని ఎంత మొత్తుకుంటున్నా, తను వినకుండా, నో, నో, యూ మస్ట్ టేకంటూ అనకపోతే తనీ చిక్కులో ఇరుక్కోకపోను. కాని జరిగివుండవలసినదాన్నిగురించి వగచి ఏం ప్రయోజనం? పెరటిదారిన అతిదగ్గరగా వున్న అయ్యరుహోటేలుకి పనిపిల్లని పంపడం తప్ప చేయగలిగిందేముంది?

పనిమనిషి కాఫీతో వచ్చేవరకూ అతన్ని ఊరికే కూచోపెట్టడం బాగుండదు కనక సంభాషణకి ఉపక్రమించింది. దాసుకి మనసు సంభాషణమీద కాక కాలేజీలో సభాంతరాళమందు ఇంకను జరగవలసిన పనులమీదున్న కారణాన తనొక్కతే మాటలాడుతున్నందున అయిదు నిముషాల్లోనే అన్ని సబ్జెక్టులూ సర్వే అయిపోయేయి. లోపల్నుంచి కాఫీ మటుకు రాలేదు.

తనే మళ్లీ ప్రస్తావన మొదలెట్టింది. “మనుషుల్లో ఎంతటి చిత్రమైనవాళ్లు ఉంటారో. మాసర్వంటు మెయిడుకి వున్న మొండితనమూ, తలతిక్కా, కృత్రిమనాగరికతా, కుతర్కమూ చూస్తే భూమండలం అంతా వెతికినా మళ్లీ దానిలాటిది దొరుకుతుందనుకోను. ఏదైనా చెప్తే అర్థం చేసుకో నిరాకరిస్తుందంతే. ఆ మనిషి తత్త్వం ఆలోచించండి. సరిగ్గా ప్రతిరోజూ నేను పొద్దున్నే చదువుకోడానికి కూర్చున్నక్షణానే స్నానానికి నీళ్లు సిద్ధం చేస్తుంది. సాయంత్రంనేళ సరీగ్గా నా బాటనీ రికార్డులు ముందేసుక్కూర్చునేవేళకి చీపురు పట్టుకు తయారవుతుంది ఊడుస్తానంటూ. సవాలక్షసార్లు చెప్పాను ఎవరైనా వచ్చినప్పుడు చీపురుకట్టొకచేతా మాసిన అట్ట మరోచేతా పట్టుకు తయారవొద్దని. కాని ఆ అవతారంలో దర్శనమివ్వడం సరదాయేమో దానికి …”

దాసు ఏదైనా అనకపోతే బాగుండుదన్నట్టు, “బహుశా చుట్టాలొచ్చేవేళా, మీగది శభ్రపరిచేవేళా అనుకోకుండానే ఏకమవుతామో,” అన్నాడు.

తన ఊహకి ఆ పాయింటు అందలేదు. “వచ్చినచుట్టాలు వెళ్లేవరకూ ఆగలేదూ?”
“దానికి ఇంట్లో మరేఁ పని ఉండదా?” అన్న ప్రశ్న తట్టింది కాని దాసు ప్రశ్నించలేదు.
“ఏదైనా చిన్నపని దానిచేత చేయించాలంటే ఎక్‌స్ట్రా ఇచ్చుకోవాలి.”
దాసు మరొకసారి నిందితురాలిని బలపరిచే ప్రయత్నం చేయకుండా ఉండలేకపోయాడు. “డబ్బుకి చాలా ఇబ్బంది పడుతోందేమో.”
“ఓహ్, నాన్సెన్స్” అనేసి నాలుక్కరుచుకుంది తను.
దాసు వీధిగుమ్మంవేపూ, గోడగడియారంవేపూ మార్చి మార్చి చూశాడు. మీటింగు అయిదు గంటలకి మొదలు పెట్టాలి నిర్ణీతసమయం ప్రకారం.
గోడమీద గడియారం అయిదుగంటలు కొట్టింది.

తనకి హఠాత్తుగా తట్టింది ఒక క్లాస్‌మేట్‌తో మాటాడడానికి “మా పనిమిషి” అనే విషయం ఏమంత మెచ్చతగ్గవిషయం కాదని. సిగ్గుతో మొహం కందిపోయింది.

“అమ్మగారూ” అంటూ లోపల్నించి కీచుగొంతు వినిపించింది. ఆ స్వరానికి ఇద్దరూ -వేరు వేరు కారణాలకే అయినా – తృళ్లిపడ్డారు. తను లేచి ఆ పనిపిల్ల అలా అసహ్యంగా అరిచినందుకు బుద్ది చెప్పడానికీ, కాఫీ తేవడానికీ లోపలికి వెళ్లింది. ఆపిల్ల ప్లాస్క్ అందిస్తూ,, తడబడుతూ, వగరుస్తూ చెప్పింది – దగ్గర్లో వున్న మూడు హోటళ్లకీ ఆ శుభదినాన శలవనీ, నాలుగో అతిదగ్గర హోటలు వూరికి రెండోచివర వుందనీ. దానికి వున్న ఒక్కగుండెతోనూ అమ్మగారి ఆజ్ఞకి విరుద్ధంగా రిక్తహస్తాలతో రావడం అసాధ్యం.

తను దాని కంఠస్వరవిషయంలో ఒకటి రెండు మాటలు అని, రెండుకప్పులలో కాఫీతో డ్రాయింగురూములోకి వచ్చింది. మందహాసం చేస్తూ ఆలస్యానికి క్షమిస్తారనుకుంటానంది.

దాసు మొహమ్మీద పెచ్చులూడిన పాతగోడలాటి నవ్వొకటి విరిసి మాయమయింది. ఒక్కగుక్కలో కప్పు కాఫీ నోట్లో పోసుకుని, ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పి రేస్‌లో రన్నర్‌లా గుమ్మం దాటేడు.

ఆ తరవాతిక్షణంలో చిన్నరకం దొమ్మీ అయినట్టు అయి, “ఆహ్”, “ఇదేమిటి”, “నువ్వు” “నువ్వు” వంటి రకరకాల శబ్దాలన్నీ కలిసికట్టుగా వినిపించేయి. తను కళ్లు గట్టిగా మూసుకుంది. రెండు చేతులూ రెండు చెవుల్నీ పరిరక్షించాయి. ఒక్క నిముషంసేపు అలా నిలబడిపోయింది స్థాణువై. తనచెవుల్ని తను నమ్మగలిగితే, “నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు” అని అడుగుతున్న మనిషి తన దాసి.

“నువ్విక్కడ పని చేస్తున్నావా?” అని అడుగుతున్న మనిషి జాయింట్ సెక్రటరీ దాసు.

మూడో నిముషంలో తను గుమ్మందగ్గిరికి వచ్చేవేళకి కిందపడిన పనిమనిషిని లేవదీసే ప్రయత్నంలో వున్నాడు దాసు. “అది” పగిలినగాజు పెంకులు ఏరే ప్రయత్నంలో వుంది. దాసు కూడా గాజుపెంకులు ఏరుతున్నాడు వంగి.

“హే భగవాన్, అరెరె మీకెందుకు శ్రమ. అది తీస్తుందిలెండి. నేచెప్పలేదూ దాని పొగరు. మీకు తెలుసులా ఉంది ఈమనిషిని.”

దాసు గాజుపెంకులు అన్నీ తీసేసినట్టు పూర్తిగా నమ్మకం కుదిరాక, మెల్లిగా తలెత్తి, “తెలుసు. అది నాచెల్లెలు” అన్నాడు.

తను గతుక్కుమంది. కాలేజీలో సర్వసాధారణంగా తన క్లాసుమేట్సు ఎందుకు అతనిచేత బెంచీలు మోయిస్తారో, సార్థకనామధేయుడని ఎందుకు అవహేళన చేస్తారో ఇప్పుడు పూర్తిగా అర్థమయింది.

మర్నాడు ఆ అమ్మాయి పనిలోకి రాలేదు. తను ఎదురు చూసినట్టు జీతండబ్బులకోసమూ రాలేదు. ఆ సాయంత్రం దాసు మామూలుగా పూలకుండీలు ఇచ్చేయడానికి వస్తే కూచోమని చెప్పడానికి తను నేర్చుకున్న విద్యలన్నీ, తన నాగరికత అంతా, సంస్కృతి అంతా, తన మేనర్స్ అన్నీ కలిసి తనచేత ఒక్క పలుకు కూడా పలికించలేకపోయాయి. అతని చెల్లెలికివ్వవలసిన రెండురూపాయలూ అతనికి ఇవ్వాలో ఇవ్వకూడదో తను నేర్చుకున్న సభ్యత చెప్పలేదు.

దాసు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు.

తరవాత దాసు కాలేజీలో కనిపించినప్పుడు మీరు అనలేకపోయింది. నువ్వు అనే ధైర్యం లేకపోయింది.
కథ అసహజంగా ఆగిపోయింది.

000

గమనిక:
(1953 ప్రాంతాల్లో విశాఖపట్నంలో మండా సూర్యనారాయణగారు (మసూనా) విశ్వవీణ అని ఓ చిన్న పత్రిక ప్రారంభించారు. అది అట్టే కాలం సాగలేదనుకుంటా. కాని అప్పుడే కొత్తగా రాయడం మొదలుపెట్టిన నన్ను ఓ కథ కావాలని అడగడమే ఒక ఘనతగా భావించి రాసిన కథ ఇది. ఆనాటి ఒక నాగరీకమనస్తత్త్వం చిత్రించడానికి చేసిన ప్రయత్నం. ఈనాటి పాఠకులు ఏమనుకుంటారో అనుకుంటున్నా ఇప్పుడు.)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “అసహజం”

 1. మాలతిగారూ,
  మనుషుల నాగరికతలో మార్పులు పైపై విషయాలకు సంబంధించినవి సాధారణంగా. అవి కొట్టొచ్చినట్లు కనబడినా అంతా డాంబికమే తరచుగా. గబగబా వచ్చి మీదబడే ఆ మార్పుల్లో జనం వంటికి పట్టించుకొనేవే కాని వంటబట్టించుకొనేవి చాలా తక్కువ. ఐతే, మనుషుల మనస్సుల లోతుల్లో మార్పులు మౌలికవిషయాలకు సంబధించినవి. అవి అంత తొందరగా రావు. అవి మెల్లగా స్థిరంగా వస్తాయి. ఓ యేభై యేళ్ళలో మరీ పెద్దగా ఇలాంటి విషయాల్లో మార్పు ఉండకపోతే ఆశ్చర్యం లేదు. మార్పులు ఉంటాయి. వాటిలో కొన్ని నేను స్వానుభవంతో ఎఱుగుదును కూడా.

  మెచ్చుకోండి

 2. ఈ కథ 50 ఏళ్ళ కిందటి కథ అంటే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికీ ఇలాంటి మనుషులని చూస్తూనే ఉన్నాను. ఈ నాటి నాగరిక మనస్తత్వం కూడా ఇదే 😦

  మెచ్చుకోండి

 3. స్కూలుబట్టలు మార్చుకోమనడంలో మాత్రం పాతతరం వారి ఆంతర్యం శుభ్రతే తప్ప కులవివక్షత మరోరకపు వ్యత్యాసం ఆధిపత్యభావం కోణం కాదని నా అభిప్రాయం. క్లాసులో అందరూ కలిసి దగ్గర దగ్గరగా కూర్చుంటారు, స్కూలు మైదానంలో ఆడుకుంటారు, వీధుల్లో ఆడుకుంటారు, దుమ్ములో తిరుగుతారు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ బట్టలు విప్పేయడం, స్నానం చేయడం అనేది ఆరోగ్యకరం – పిల్లలకే కాక ఇంటిల్లపాదీకీ, ఇంటి లోపల శుభ్రత దృష్ట్యా. అందుకే పెద్దలు అలా చెయ్యమనేవారని నా నమ్మకం. కాకపోతే పిల్లలకి అంత విశదీకరించి చెప్పడం చాలా కుటుంబాల్లో జరిగేది కాదేమో (ఆ తరం వారు చెప్పే చాలా విషయాలకి భయాన్నో పాపభీతినో పుణ్యాన్నో ప్రాతిపదికగా చేసి చెప్పేవారు కదా). పాత కాలంలో వంట చెయ్యడానికి మడి కట్టుకోవడం వెనక కూడా శుభ్రతే కారణమని నేను అనుకుంటాను.

  మెచ్చుకోండి

 4. అవును. మాఇంట్లో కూడా స్కూలు బట్టలు మార్చుకోడం ఉండేది. మీరన్నమాట నిజమే. మనస్తత్వాలలో అట్టే మార్పు లేదు. ఈమధ్య పనిమనుషులగురించి ముఖపుస్తకంలో టపాలు చూసేక, ఈ కత మళ్ళీ ప్రచురించాలనిపించింది. చాలామంది తమ బాధలే చెప్పుకుంటున్నారు, మీరు గమనించేరో లేదో కానీ.

  మెచ్చుకోండి

 5. నాకు తెలిసి1980 వరుకు ఇలాంటి చిత్రమైన అవస్థలే ఉండేవి తరవాత చాలా మార్పులే వచ్చాయి. చిన్నపుడు స్కూల్ యూనిఫామ్ మార్చుకుంటే కాని భోజనం పెట్టేవాళ్ళు కారు మాఇంట్లో…బయట పిల్లలతో ఆడుకుని వస్తే వాళ్ళందరినీ తాకి ఆడుకున్నందుకు స్నానం చేయమని చెప్పేవాళ్ళు..వాళ్ళు ఎందుకు తక్కువో మనం ఎందుకు ఎక్కువో తెలిసేది కాదు.రెండు గ్లాసుల పద్దతి కూడా చూసాను..పాటింపుల్లో మార్పులు వచ్చినా అసమానతలు ఇంకా మన మనసులలో ఉన్నాయనే అంటాను…మీ కధ చాలామంది ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన విధంగా ఉంది ఈరోజుకీ…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.