చివురుకొమ్మ చేవ

“మామీ,” అంటూ పరిగెట్టుకుంటూ వచ్చింది కింజల్క స్కూలినించి

“అబ్భ ఎందుకలా మీద పడతావు,” అని విసుక్కుని మళ్ళీ చిన్నబోయిన ఆమొహం చూసి, “దా” అంటూ దగ్గరకి తీసుకుంది శారద.

అవును మరి. దానికెలా తెలుస్తుంది తన మనోవేదన! తను మాత్రం ఎలా చెప్పగలదు

“నీకోసం వేశాను చూడు,” అంటూ స్కూల్లో వేసిన బొమ్మ చూపించింది.

“అబ్బో, చాలా బాగుంది. ఫ్రిజ్ మీద పెడతాను,” అంది శారద కింజూని గుండెలకి హత్తుకుని.

కింజల్క మొహం విరిసిన దిరిసెనపూవులా విప్పారింది.

పిల్లలకేముంది బావుందన్న ఒక్క మాట చాలు. ఏ వస్తువాహనాలూ ఇవ్వలేని ఆనందానికి ఆ ఒక్కమాటా చాలు.

“మీ అమ్మ టెలిగ్రాం ఇచ్చారు,” అంటూ మురారి లోపలికి వచ్చేడు.

“టెలిగ్రామా?”

ఇద్దరికీ వింతే ఉరుము లేని పిడుగులా.

“నెలాఖరికి వస్తున్నారుట.”

శారద మాటాడలేదు.

“రావొద్దని చెప్పు.”

“ఆఁ?” అంది శారద తెల్లబోతూ.

“అది కాదు …” అతను మాట పూర్తి కాలేదు.

శారధ అందుకుంది, “పదేళ్ళయింది. ఇల్లు రాదారి బంగళా. వారాలబ్బాయిల్లా మీ స్నేహితులు. మూడో విస్తరి వెయ్యని శనివారం లేదు. ఈనాటికి నావంక మనిషి, అందునా మా అమ్మ వస్తానంటే రావొద్దని రాయనా?”

“మీ అమ్మగారని కాదు. ఈపరిస్థితుల్లో ఆవిడకి మాత్రం ఏం బాగుంటుందని?”

“అమ్మమ్మ వస్తోందిట,” అంది శారద పాపతో.

“నిజింగ. ఎప్పుడు?” అంది ఉత్సాహంగా కింజు. అమ్మమ్మతో గడిపిన రోజులు తక్కువే అయినా ఆవిడ వచ్చే పోయేవారిద్వారా పంపే కానుకలమూలంగా సుపరిచితమే.

“ఏం? నువ్విస్తావా, నేనివ్వనా టెలిగ్రాం?” అన్నాడతను రొక్కిస్తూ.

“ఇవ్వను” అంది శారద కింజల్కమొహంలోకి చూస్తూ. ఆ పిల్లమొహం వన్నె తరిగింది. ఓ క్షణం ఊరుకుని “కింజు వేసింది,” అంది బొమ్మ చూపుతూ.

“చాలా బాగుంది. నువ్వు గొప్ప ఆర్టిస్టువి అవుతావు. మావంశంలోనే ఉంది కళ. మా పినతాతగారి బావమరిది గొప్ప కళాకారుడు,” అన్నాడు మురారి మురిసిపోతూ.

“నీకు రేపు వేస్తాను డాడీ,” అంది కింజల్క తనకి పక్షపాతం లేదని తండ్రికి తెలిసేట్టు.

“ఫ్రిజ్ మీద పెడతాను కదా. అది అందరికీను.” అంది శారద.

“దా. బజారుకెళ్దాం.”

ఇప్పుడెందుకంటే పుట్టింరోజు వస్తోంది కదా అన్నాడు.

“ఇప్పుడే కాదు యూ సిల్లీ,” అంది కింజల్క కళ్ళు చిట్లించి.

“నాకూ తెలుసులే. మరి అప్పుడు నేను ఊళ్ళో ఉండనేమోనని.”

శారద నిట్టూర్చి అక్కడినించి లేచిపోయింది.

000

అమ్మ అనుకున్న రోజుకి వచ్చింది. శారదే ఎయిర్పోర్టుకి వెళ్ళి తీసుకొచ్చింది.

తలుపు తీస్తూనే అముమ అంటూ కాళ్ళ చుట్టేసింది కింజల్క.

అమ్మమొహంలో దీప్తి. అలాటి క్షణంకోసం ఆవిడ ఎన్నివేలమైళ్ళయినా పయనించగలదేమో!

“ఇలా చిక్కిపోయేవేమిటే? ఏం పెడుతోంది మీ అమ్మ నీకు?” అందావిడ ఆప్యాయంగా పిల్లదాని చెంపలు నిమురుతూ.

కింజల్క కిలకిలా నవ్వింది, “ఐ టోల్యూ.”

అమ్మ దానిగడ్డం పుచ్చుకుని, “ఇదుగో ఈ కీసరబాసర బాస నాకు తెలీదు. నాతో చక్కగా తెలుగులోనే మాటాడాలి తెలిసిందా?” అంది.

“ఓకే” అంది పాప భుజాలు కుదిపి.

శారద నవ్వుతూ, “మనవాళ్ళు అస్తమానం చిక్కిపోయేవు చిక్కిపోయేవు అంటారని నవ్వు దానికి,” అని వివరణ ఇచ్చి, పద బాత్రూం చూపిస్తాను అంది లోపలికి నడుస్తూ.

అమ్మ స్నానం చేసి వచ్చేసరికి శారద కాఫీ సిద్ధం చేసింది.

అమ్మ కాఫీ తాగి, పెట్టె తెరిచి, చీరా, పంచెలచాపూ, పిల్లకి పట్టు పరికిణీ, గాజులూ గొలుసులూ ఒక్కొక్కటే తీస్తుంటే పిల్లదాని మోమున ఉత్తుంగతరంగాలు … శారద ఎదలో పోట్లు. ..

“ఇప్పుడివన్నీ ఎందుకమ్మా?” అంది నొప్పిని అణుచుకుంటూ.

మురారి చిటపటలాడుతూ లేచి వెళ్ళిపోయేడు

అమ్మ మాటాడలేదు.

000

అమ్మ వచ్చిందగ్గర్నుంచీ కింజల్క ఆటలూ, పాటలూ, తిండీ, తిప్పలూ అన్నీ ఆవిడే చూసుకుంటోంది.

ముందుగదిలో శారద కూచుని పేపరు చూస్తోంది.

అమ్మ పిల్లకి పాట నేర్పుతోంది.

చిట్టీ చిలకమ్మా! అమ్మ కొట్టిందా?

తోటకెళ్ళేవా? పండు తెచ్చేవా?

గూట్లో పెట్టేవా? గుటుక్కు మింగేవా?

కింజల్కకి పాట బాగా నచ్చింది. త్వరగానే నోటికొచ్చేసింది. మరికొంత తన కవిత్వం కూడా జోడించి ఇల్లంతా తిరుగుతూ పాడుతోంది.

చిట్టీ చిల్కమా కింజల్కమా అంటూ పాడుతుంటే అమ్మ దాన్ని సరిదిద్దబోయింది అది కాదే అంటూ …

“నాకిదే బాంది. మామీ …” అంది కింజల్క బుంగమూతి పెట్టి.

“దానితో వాదించి నువ్వు గెలవలేవులే,” అంది శారద గోల పెడుతున్న ఫోను తీసుకుని.

అట్నుంచి ఫోనులో రేవతిగారు శనివారం భోజనానికి రమ్మని పెలిచారు. “అమ్మగారు వచ్చేరుట కదా. ప్రయాణం సుఖంగానే జరిగిందా?” అంటూ కుశలప్రశ్నలేసి ఆవిణ్ణి కూడా తీసుకు రమ్మని మరీ మరీ చెప్పేరావిడ.

రాత్రి భోజనాలదగ్గర ఆ మాట చెప్తే, “నాకు పనుంది, మీరెళ్ళండి,” అన్నాడు మురారి.

“రా డాడీ. బాంతుంది. యూ లైక్ విస్నూ అంకుల్ టూ” అంది కింజల్క.

అతను అసలే అంతంత మాత్రం. అమ్మ వచ్చిందగ్గరినించీ మరీ అధ్వాన్నం అయిపోయింది.

దోబూచులాడతున్నట్టు తప్పించుకు తిరుగుతున్నాడు.

“నువ్వు చెప్పు,” అంది కింజల్క తల్లితో.

“రాకూడదూ? పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో వస్తారు.”

“పనుందంటుంటే … మరోసారి చూస్తాలే.”

శారద లేస్తూ, “నీబట్టలియ్యి. వాషర్లో పడేస్తాను,” అంది.

కింజల్క చిట్టీ చిల్కమా, కింజల్కమా అంటూ పాడుకోసాగింది.

“అమ్మ కొట్టిందా?” అంది అమ్మమ్మ చరణం అందిస్తూ.

“మామీ నో కొత్తూతూ” అంది కింజూ.

“మీ అమ్మ కాదే.. పాట అదీ,”

శారద నవ్వుకుంటూ జేబులు తడుముతుంటే కింజు జేబులో సిగరెట్ పెట్టె చేతికి తగిలింది. తెల్లబోతూ పైకి లాగింది దాన్ని.

“నాది కాదు,” అందా పిల్ల అతి మామూలుగా.

మరి నీజేబులోకి ఎలా వచ్చిందంటే మాటాడదు.

“గట్టిగా ఎనిమిదేళ్ళు లేవు. ఇప్పట్నించీ ఇవేం పోకళ్ళే?” అంది అమ్మ కళ్ళింత చేసుకుని.

“నువ్వూరుకో అమ్మా. నేను మాటాడతున్నాను కదా.”

“బాగానే ఉంది పెంపకం.”

“ఏమిటయింది?” అంటూ ప్రవేశించేడు మురారి.

అవాల్సినంత రభసా అయింది. సిగరెట్లు నీజేబులోకి ఎలా వచ్చేయి అంటూ ఎంత అరిచినా కింజల్క చెప్పలేదు.

మురారి శారదమీద విరుచుకు పడ్డాడు. “పిల్ల ఆలనా పాలనా చూసుకోనక్కర్లేదా? తల్లి కాకపోతే పిల్లకి బుద్ధులు ఎవరు నేర్పుతారు? ఇవాళ సిగరెట్లూ, రేపు రౌడీ వేషాలూ వేస్తుంటే నీకేం పట్టనట్టు చూస్తూ ఊరుకుంటావా? …”

“అవును. సద్భుద్ధులొస్తే  మీ వంశలక్షణం. తప్పులయితే తల్లి పెంపకమూను,” అంది శారద ఎవరితో అంటోందో తెలీకుండా.

“స్టాపిట్ డాడీ. మామీ ఏం చెయ్యలేదులే.” అందాఖరికి ఆ పసిది అరుస్తూ శారద కాళ్ళు చుట్టేసి.

“అయితే చెప్పు. అవి నీకెలా వచ్చేయి?” అన్నాడు మురారి ఇంకా పైస్థాయిలో.

మరోక్లాసులో కుర్రాడు ఇచ్చేడుట దాచమని. వాళ్ళమ్మ చూస్తే కొడుతుందిట.

“మాబాగుంది. మీ అమ్మయితే ముద్దెట్టుకుంటుందేమిటి?” అంది అమ్మ. ఆవిడకి ఇదంతా అయోమయంగా ఉంది.

“నువ్వూరుకో అమ్మా,” అంది శారద నీరసంగా.

ఈవాదనలు ఇప్పట్లో అయేలా లేవని కింజల్కని రెక్క పుచ్చుకు పక్కగదిలోకి లాక్కుపోయింది అమ్మమ్మ.

ఆరాత్రి పిల్లని పక్కలో వేసుకుని పడుకుంది శారద. ఏం అడగాలో, ఎలా అడగాలో తెలీడం లేదు. ఈదేశంలో టాక్, టాకంటారు కానీ తను అలా పెరగలేదు. ఈ టాకులేమిటో, ఎలా సాగించాలో తనకి తెలీడం లేదు. మురారికి ఆ దృష్టి ఉన్నట్టు కూడా లేదు.

“నామీద నీకు కోపం వచ్చిందా?” అంది శారద ఆఖరికి నెమ్మదిగా.

“లేదు మామీ” అంది పాప.

“పోనీ ఇంకెవరితోనైనా మాటాడతావా?” అంది మళ్ళీ గుండెలు చిక్క బట్టుకుని.

“మాటాడొచ్చా?” కింజల్క ఇంచుమించు ఎగిరిపడిట్టు అడిగింది.

శారదకి కమ్చీతో ఛెళ్ళున కొట్టినట్టయింది.

“ఏమీతో మాటాడతావా?” అంది శారద ఆలోచిస్తూ. ఏమీకీ కింజూకి వారి జీవితకాలం స్నేహం.

“ఉహుఁ” కింజు తల అడ్డంగా ఊపింది.

“ఏం? నీకూ ఏమీకి చిన్నప్పట్నుంచీ స్నేహం కదా.”

“వాళ్ళమ్మ అస్తమానం నువ్వెల్పోతావంటుంది.”

శారద గబుక్కున పిల్లదాన్ని గుండెల్లో పొదువుకుంది. తొలిసారిగా దుఃఖం ఉప్పెనగా పొంగుకొచ్చింది. సాటి పిల్లలు అల్లరి చేస్తారనుకుందే గానీ తల్లులు కూడా అనుకోలేదు. తనెంతసేపూ తనబాధ గురించే ఆలోచిస్తోంది గానీ పాపం పిల్లది ఎంత తపన పడతోందో, దానిమనసెంత గాయపడిందో, దాని ఆలోచనలేమిటో … తనకే కాదు ఎవరికీ తోచినట్టు లేదు. అందరూ తనకి సలహాలు చెప్పేవారే కానీ అదెలా ఉందని అడిగినవాళ్ళు లేరు. అడుగుతారు ఎలా ఉందని. కానీ నిజంగా ఎవరికీ తెలీదు ఆ పిల్ల మనసులో ఘోష ఏమిటో!

“సారీ మామీ” అంది కింజూ.

“ఎందుకూ సారీ?” అని, మరో అరగంట కబుర్లు చెప్పి పడుకోమని పంపేసింది.

మర్నాడు శారద చీకటితోనే లేచి కాఫీ పెడుతూంటే అమ్మ వచ్చింది “రాత్రి నీదగ్గరయినా సరిగా పడుకుందా?” అంటూ.

“ఏమిటీ? ఎవరిమాట?”

అర్థరాత్రి లేచి అమ్మదగ్గర పడుకుంటానని చెప్పి వచ్చేసిందిట అమ్మమ్మపక్కలోనించి. కానీ అమ్మదగ్గరికి పోలేదు. ఇద్దరూ ఒక్క ఉదుటున గదులన్నీ కలియతిరిగేరు. మురారి కూడా గాభరా పడిపోతూ ఏమయిందే మయిందంటూ లేచేడు. ముగ్గురూ మళ్ళీ నాలుగ్గదులూ తిరిగేరు. మంచాలకిందా, క్లాజెట్లలోనూ, కాదు కాదనుకుంటూనే ఇరుగిళ్ళా పొరుగిళ్ళా కూడా వాకబు చేశారు. పోలీసులకి రిపోర్టిస్తే ఏమవుతుందన్న మీమాంసలో ఉండగానే ఫోనొచ్చింది.

జానెట్ అవతలిపక్కనించి పిలిచి “అమ్మగారికెలా ఉంది? ఇవాళ కూడా కింజుని నాదగ్గరే ఉంచుకోనా?” అని అడగడానికి పిలిచింది ఆవిడ.

జానెట్‌కీ వీళ్ళకీ ప్రాణస్నేహం చాలాకాలంగా. వాళ్ళిల్లు కాలిబాటన ఇళ్ళమధ్యనించి వెళ్తే అయిదు నిముషాలు, కార్లో వెళ్తే పది నిముషాలు పడుతుంది.

శారద పిల్ల క్షేమంగా ఉందని ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పి, “నేనే వస్తున్నాన”ని అటు జానెట్‌కి చెప్పి, గబగబ బయల్దేరింది శారద పిల్లని తీసుకురావడానికి.

అర్థరాత్రి అమ్మదగ్గర పడుకుంటానన్న కింజల్క లేచి చేతికందిన చొక్కా వేసుకుని తలుపు తీసుకుని తిన్నగా జానెట్ ఇంటికెళ్ళి తలుపు తట్టిందిట. అమ్మమ్మని హఠాత్తుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని, తనని ఇక్కడ దింపేశారనీ చెప్పిందిట.

ఇంటికి రాగానే మురారి కేకలేశాడు ఇల్లదిరిపోయేలా. తండ్రికి రావాల్సినంత కోపం వచ్చిందతడికి. ఊరుకున్న కొద్దీ మితి మీరిపోతోందన్నాడు. అర్థరాత్రి ఇల్లు వదిలి పోడానికెన్ని గుండెలు అన్నాడు. … సిగరెట్లు, .. అబద్ధాలూ … ఇల్లు వదిలి పారిపోడాలు .. తల్లి ఆమాత్రం చూసుకోనఖ్ఖర్లేదా … అన్నాడు.

“మీరిద్దరూ మీ తిప్పలేవో మీరు పడండి. నేను పిల్లని ఇండియా తీసుకుపోతాను,” అంది అమ్మ.

“నేనెకడ్కీ వెల్లను,” అంది కింజల్క మూతి ముడుచుకుని.

“అసలెందుకు అలా పారిపోయేవు? అది ముందు చెప్పు,” అన్నాడు మురారి.

“నేనేం పారిపోలేదు. జానెట్ ఇంటికెల్లాను.”

మురారి ఒక క్షణం మాటాడలేదు గుక్క తిప్పుకోడానికన్నట్టు. తరవాత అడిగేడు, “చెప్పకుండా ఎందుకెళ్ళేవు?”

“నాయిష్టం.”

“నీ యిష్టం కాదు. ఈ ఇంట్లో నేనూ అమ్మా చెప్పినట్టు వినాలి. తెలిసిందా?”

“ఎందుకు వినాలి?”

“ఎందుకంటే నేను నీ డాడీని కనక. గాటిట్?” అని శారదతో, “రేపట్నుంచీ ఆ స్కూలికి పంపకు. ప్రైవేటు స్కూల్లో చేర్పిద్దాం. దారికొస్తుంది.”

“నేనేం అడిగేనా నాకు ఈ మామీ డాడీ కావాలని? ఐ హేట్యూ.”

శారద చటుక్కున పిల్లని ఎత్తుకుని పడగ్గదిలోకి తీసుకుపోయింది.

అమ్మ లేని పని కల్పించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది.

మురారి తన ఆఫీసుగదిలోకి నిష్క్రమించేడు.

00

శారద ఆరోజంతా ఆలోచిస్తూనే ఉంది. Choices – ఈదేశంలో గొప్ప బజ్ వర్డ్ అదీ. పెళ్ళీ, విడాకులూ కూడా తమ అభిష్టానుసారమే … ఎవరేం చేసినా తాము ఛూజ్ చేసుకునే … పిల్లలు మాత్రం పెద్దలో కోర్టువారో నిర్ణయించినదాన్ని బట్టి ఎక్కడో పడతారు ఫుట్బాల్ తన్నినిట్టే.

పిల్ల బాగానే అడిగింది. ఎప్పుడు ఏ బిఢ్డ కావాలో నిర్ణయించుకుని కనగల ఈరోజుల్లో ఆ బిడ్డ అభీష్టాలు ఎవరడిగేరు? నిజంగా పసివాళ్ళకి వాళ్ళ ఛాయిస్‌కి వదిలేస్తే ఎంతమంది ఈ కుళ్ళులోకి రావడానికి ఇష్టపడతారు? ఈ హింస, అక్రమాలూ, స్వార్థం ఎవరు కోరి నెత్తికెత్తుకుంటారు?

000

శనివారం రేవతిగారింటికి వెళ్ళబోయేముందు కింజల్క, శారద కూడా మరోసారి అడిగేరు కానీ మురారి పని నెపంమీద ఇంట్లోనే ఉండిపోయేడు.

శారద తల్లినీ కూతుర్నీ తీసుకుని బయల్దేరింది.

దాదాపు ముఫ్ఫైమంది ఉంటారు ఆరోజు వచ్చినవాళ్ళు. పేరుకి తెలుగువారే అయినా తెలుగూ, హిందీ, తమిళం, ఇంగ్లీషూ కలగలపుగా కలిసిన ఒక సంకరభాషలో సంభాషణలు సాగుతున్నాయి పంచపళ్ళ కషాయంలా, ఉగాది పచ్చడిలా ఇంది అక్కడి వాతావరణం. అమ్మకి కొంతలో కొంత ఇంగ్లీషు అర్థం అవుతుంది కానీ ఈ వాగ్ధోరణి మాత్రం మహ గందరగోళంగా ఉంది.

రేవతిగారి మామగారు క్రిష్ణయ్యగారు ఇక్కడే ఉంటున్నారు. ఆయన భార్య పోయినతరవాత కొడుకు విష్ణు రారమ్మని తీసుకొచ్చేశాడు అమెరికాకి.

“ఎలా ఉంటున్నారండీ ఈ అడవిలో? వచ్చి వారం రోజులయింది. ఆకసాన తలకిందులుగా వేలాడే చాతకపక్షిలా కడగొట్టుకుపోతోంది ప్రాణం. మనవాళ్ళు ఇక్కడ ఏం చూస్తున్నారో నాకర్థం కాలేదు,” అంది అమ్మ.

క్రిష్ణయ్యగారు చిరునవ్వుతో “ఆవరణ తల్లీ. ఏదయినా మనం మల్చుకోడంలోనే ఉంది. హృదంతరాళ కానగల వారిని ఈ బాహ్య ఆధరువులు అంతగా బాధింపవు” అన్నారు.

“అవున్లెండి,” అంది అమ్మ. ఆయన మళ్ళీ “ఇటు రండమ్మా ఒకసారి,” అని నాలుగో పడగ్గదివేపు నడిచేరు. శారదా, అమ్మా ఆయన్ని అనుసరించేరు.

ఆ చిన్నగది ముగ్గులతో, పసుపూ కుంకుమలతో పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది. గదంతా కాయితప్పూలూ, ప్లాస్టిక్ అలంకరణలే అయినా ఎంచేతో ఎబ్బెట్టుగా అనిపించలేదు. తూర్పుదిక్కున గోడవారగా ప్రత్యేకంగా చేయించిన దారు మండపంలో అమర్చిన శ్యామలాదేవి విగ్రహం పీతాంబరంతో నానా విధాభరణాలతో కన్నులపండువుగా ఉంది.

క్రిష్ణయ్యగారు మౌనంగా ఊదొత్తి వెలిగించి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు.

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం …

ఆయన తన్మయత్వంతో మధురాతిమధురంగా గళమెత్తి దండకం చదవసాగేరు..

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ …

శారదతనువు పులకరించింది. అమ్మ కనులు చెమ్మగిల్లేయి.

సాగరారబ్ధ సంగీత సంభ్రమాలోల ..

ఎప్పుడొచ్చిందో కింజల్క వచ్చి శారదకి ఆనుకుని తదేకంగా చూస్తోంది.

పక్కగదిలో రణగొణ ధ్వనులు కూడా మందరస్థాయికి దిగేయి.

క్రిష్ణయ్యగారు దండకం పూర్తి చేసి మరొక్క క్షణం మనసులోనే ధ్యానించుకుని, ఎండు ద్రాక్షపళ్ళు ప్రసాదం పంచిపెట్టేరు. కింజల్క రెండు చేతులా దోసిలి పట్టి, ప్రసాదం పుచ్చుకుని తల్లివేపు చూసింది. శారధ చిన్నగా కనుసౌంజ్ఞ చేసింది మెచ్చుకోలుగా. కింజల్క ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది.

క్రిష్ణయ్యగారు ఆ పిల్ల చెంపమీద చిటిక వేసి, “ఆదేవి కూడా నీలాగే మహా సౌందర్యవతి” అన్నారు.

“నాకు తెలుసు,” అంది కింజల్క చిలిపికనులతో.

శారద నవ్వి “మాకు వినయంపాలు కొంచెం తక్కువలెండి,” అంది.

క్రిష్ణయ్యగారు నవ్వలేదు. గంభీరంగా తల పంకించి, “ఉండాలమ్మా ఆత్మవిశ్వాసం. అదే మనుగడకి మూలాధారం,” అన్నారు.

మరో అరగంట ఆ కబురూ ఈ కబురూ చెప్పి బయల్దేరుతుంటే కాలేజీ కుర్రాడు రాఘవ “నేను కూడా మీతో రావచ్చాండీ, వచ్చేటప్పుడు విష్ణుగారే రైడిచ్చేరు.” అన్నాడు. అతనిగది ఆదారిలోనేట.

శారద “తప్పకుండానూ, రండి. ఎక్కండి,” అంది వెనక తలుపు తీస్తూ, రాఘవ కింజల్క పక్కన కూర్చున్నాడు

“ఏమిటో మనం మనవాళ్ళూను. ఇక్కడ వీళ్ళు స్వర్గానికి నిచ్చెనలేస్తూంటే మనం ఇంకా రాళ్ళకీ రప్పలకీ చెట్లకీ పుట్టలకీ పూజలు చేస్తున్నాం. నీటిలో ములిగిపోతూ గరికపోచలు పట్టుకున్నట్టు. వీళ్ళు మేధాసంపత్తితో టెక్నాలజీ డెవలప్ చేస్తుంటే మనం మంత్రాలకి చింతకాయలు రాల్తాయని భజనలు చేస్తున్నాం. ఆయనే చూడండి. మహా మేధావిలా ఉన్నారు చూస్తే. రేషనల్ థింకింగ్ మాత్రం లేదు.”

“పోన్లే బాబూ. ఎవరివెర్రి వారికానందం..”

“అది కాదండీ. మనం సైంటిఫిగ్గా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటాం? మనవాళ్ళకి తెలివితేటలు లేవనడం లేదు నేను. క్రిష్ణయ్యగారికి అద్భుతమైన కంఠం ఉంది. ఒప్పుకుంటాను. కచేరీలు చేసుకోమనండి. అంతేగానీ దేవి సాక్షాత్కరించడం ఏమిటి? ది మాన్ ఈజి డెల్యూడెడ్.”.

“నో, హీ ఈజ్ నాట్.”

రాఘవ ఉలికిపడి కింజల్కవేపు చూశాడు.

శారద అద్దంలోంచి ఓ క్షణం ఇద్దరిమొహాలూ చూసి అమ్మవేపు చూసింది. ఆవిడ వదనం నిశ్చలంగా ఉంది.

“నేను చూశాను. చాలా బూటిఫిల్.” అంది కింజల్క మళ్ళీ.

రాఘవ ఏమనుకున్నాడో మరి మాటాడలేదు. అతన్ని అతనిగదిదగ్గర దింపేసి ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది.

హాల్లో మురారి స్నేహితులతో పేకాడుతున్నాడు.

“డాడీ, పనుందన్నావు?” అంది కింజల్క.

“ఇంతసేపూ పని చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడే వచ్చారు వీళ్ళు. మీరు తొరగా వచ్చేశారేం?”

“అమ్మకి అలవాటు లేదు కదా. నిద్ర ఆచుకోలేదని వచ్చేశాం,” అని చెప్పి శారద లేపలికి వెళ్ళిపోయింది. తనచిరాకు అమ్మముందు చూపలేక.

బట్టలు మార్చుకుని మంచినీళ్ళకోసం వంటింటిలోకి వెళ్ళబోతుంటే అమ్మమాటలు వినిపించి, గుమ్మందగ్గర ఆగిపోయింది. “నాతో ఇండియా వచ్చేస్తావా? అక్కడ తాతగారూ, మామయ్యలూ, రాంబాబూ, చిన్నక్కా, అందరూ ఉన్నారు. చక్కగా బోలెడు పాటలూ కథలూ నేర్చుకుందువు గానీ.”

“నేను రాను అమ్మమ్మా. పరవాలేదులే. మామీ, డాడీ నీడ్ మీ. ఆ లిటిల్ గర్ల్ కేర్ చేస్తుందిలే.”

శారద గుండె గొంతుకలో కొట్లాడింది. పరిపూర్ణ యౌవనవతి స్తుతి శ్యామలాదండకం. కింజల్కకి ఆవిడ లిటిల్ గర్ల్‌గా స్ఫురించడం శారదకి వింతగా అనిపించలేదు.

“మామీ, డాడీ నీడ్ మీ,” అన్నమాట మాత్రం రాత్రంతా తలుచుకుంటూనే ఉంది.

000                                                                                                                 

 (ఇ-పత్రిక లో ఫిబ్రవరి 2002లో తొలిసారి ప్రచురితం)

2002లో ఇ-పత్రిక, ఆంధ్రజ్యోతి, తరవాత తెలుగునాడిలో ప్రచురితమైన ఈకథలో చిన్నపిల్లలు మనమనుకున్నంత అమాయకులు కారని ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. నావయసువాళ్లు అంతచిన్నపిల్లకి అంతపెద్దమాటలేమిటి అన్నారు కాని ఈరోజుల్లో పిల్లలచురుకుదనం చాలామంది చూడగలరనే నానమ్మకం.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.