తృష్ణ

ఆ రోజు తపాల్ తెచ్చి స్టాంపు వేసి ట్రేలో పెట్టి వేళ్ళిపోయేడు బాలయ్య

తెలుగు లెక్చరరు కమల ఎదురుగా కుర్చీలో ఉన్నారు. ఏవో పుస్తకాలు మాలైబ్రరీలోంచి తీసి ఇవ్వమని అడగడానికి వచ్చేరావిడ.

బాలయ్య తెచ్చిన ఉత్తరాలు చూస్తున్నాను నేను.

“మీకు వీడెక్కడు దొరికేడు?” అందావిడ బాలయ్య వెళ్ళినవేపు చూస్తూ.

“ఏం?” అన్నాన్నేను యదాలాపంగా.

బాలయ్య ఇక్కడ చేరి నెల రోజులవుతోంది. నేను గమనించినంతవరకూ అతనిపనిలో నాకు లోపం కనిపించలేదు.

“మీకు పని చేస్తున్నాడా?”అని మరో ప్రశ్న జోడించారావిడ మొదటిదానికి.

నేను జవాబివ్వలేదు. కొందరు మొదట్లో పని చేస్తారు. తరవాత బద్ధకిస్తారు. కొందరు ఒకరికి పలుకుతారు. మరొకరిమీద తిరగబడతారు. ఆ ఆ ముఖవిశేషాలో ఏమో మరి. మళ్ళీ ఆవిడే అన్నారు, “వీడికి పన్నెండేళ్ళొచ్చేవరకూ మాఇంట్లోనే ఉండేవాడు.”

“మరి ఇప్పుడెందుకు లేడూ?” ఏదో ఒహటి అడగాలన్నట్టు అడిగేను.

“పొగరెక్కువైతే మేమే పొమ్మన్నాం.”

బాలయ్య మళ్ళీ ఏవో కాయితాలు తెచ్చేడు. రెండు కప్పులు కాఫీ తెమ్మని అతనికి డబ్బులిచ్చి కమలని స్టాక్ రూంకి తీసుకెళ్ళేను.

కమల పుస్తకాలు వెతుక్కోడం కన్నా బాలయ్యగురించి వివరించడంలోనే ఎక్కువ ఉత్సాహం చూపింది. వాళ్ళింట్లో చేరినప్పుడు వాడికి ఎనిమిదేళ్ళుట. చాలా చురుగ్గా ఉండేవాడుట అప్పట్లో. నోట్లో మాట నోట్లో ఉండగానే చేతిలో పని అందుకునేవాడుట. నాలుగేళ్ళతరవాత వాడిలో మార్పు కనిపించింది. పనిదొంగ అయేడు. పొద్దున్న ఏడున్నర అయేసరికి ఎటో మాయమయిపోయేవాడు. పదకొండు వరకూ కనిపిస్తూ, మాయమవుతూ, పని చేసినట్టూ కాకుండా చేయనట్టూ కాకుండా తిరుగుతూ ఉండేవాడు. మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నించీ ఎనిమిదివరకూ అందే. ఎక్కడికి వెళ్ళేవంటే చెప్పడు. పనివేళ ఇంట్లో కనిపించకపోతే ఎలా అంటే మాటాడడు. మర్నాడు మళ్ళీ మామూలే. అయిపుండడు.

“ఆటలాడుకునే వయసే కానీ బాధ్యతలు మోసేవయసు కాదు కదా. చల్లనివేళల ఏ బిళ్ళా కర్రో ఆడుకుని మధ్యలో మీపనులు చేసుకునేవాడు కాబోలు,” అన్నాను.

“వాడికసలు పనంటే ఒళ్ళొంగదు,” అంది కమల. వందగజాలదూరంలో ఉన్న కాలేజీకి చేతిలో గొడుగూ, పక్కన తండ్రీ, వెనకాల పుస్తకాలు పుచ్చుకు నడిచే నౌకరూ మొదలుగా గల రాజలాంఛనాలతో “రవి తేజములు” కాకపోయినా పాండ్సుతో మెరిసిపోయే మొహంతో వెడలనడిచే కమల కాక మరెవరు యోగ్యులు ఏ నౌకరు మనస్తత్వం ఏదో నిర్ణయించడానికి.

“మాకు సాయం ఉంటాడని పెట్టుకుంటే మేమే వాడికి చేసి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే పొమ్మన్నాం,” అందావిడ.

పుస్తకాలు తీసుకుని మేం ఇద్దరం నాగదికి వచ్చేసరికి బాలయ్య కాఫీ రెండు కప్పుల్లో పోసి ఉంచేడు.

కమల ఎంచుకున్న పుస్తకాలు అతనికిచ్చేను నాపేరుమీద ఇస్యూ చేయించి తెమ్మని.

కమల కాఫీకీ పుస్తకాలకీ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది.

నాకు బాలయ్యప్రవర్తన కంటే ఆలోచించవలసిన ముఖ్యమైన విషయాలుండడంచేత ఆతన్నిగురించి ఆలోచించలేదు. కానీ అతను నాగదికి వచ్చినప్పుడల్లా ఓ కన్ను వేసి ఉంచకుండా ఉండలేకపోయేను అదేదో అసంకల్ప ప్రతీకార చర్యలాగ. అప్పుడప్పుడు వాళ్ళ సెక్షనుకి వెళ్ళి ఏం చేస్తున్నాడో కూడా చూస్తున్నాను. ఓరోజు ఏదో పుస్తకం చదువుతూ కనిపించేడు.

“నిన్నక్కడ వేసుకున్నది పుస్తకాలు చదవడానికి కాదు,” అన్నాను కఠినంగా.

“సారీ మేడమ్,” అన్నాడు బాలయ్య తలొంచుకుని.

నేను కొంచెం సౌమ్యంగా చెప్పి ఉండవలసింది. ఆ తరవాత చాలామార్లు అతనిసెక్షనుకి వెళ్ళేను కానీ బాలయ్యని పుస్తకం చదువుతూ ఎప్పుడూ చూడలేదు.

ఇంతలో కొత్త గ్రాంట్లు రావడంతో పనెక్కువయి, బాలయ్య చదువుతున్నాడో పాడుతున్నాడో పరిశీలించే అవకాశం నాకు లేకపోయింది మరో రెండునెలలవరకూ.

000

“బాలయ్య సరిగ్గా పని చెయ్యడంలేదు మేడమ్,” అని సెక్షను హెడ్డు నేరారోపణ చేసేడొక రోజున.

“ఏమయింది?” అన్నాను.

“సెక్షనులో నిద్ర పోతున్నాడు. లేపి అదేం అనడిగితే, రెండో ఆట సినిమాకెళ్లేను, నిద్రొచ్చింది, అంటాడు.”

బాలయ్యని నాదగ్గరికి పంపమని చెప్పి అతన్ని పంపించేశాను.

బాలయ్య వచ్చేడు

“సెక్షనులో నిద్రపోతున్నమాట నిజమేనా?” సూటిగా ప్రశ్నించేను.

“ఒక్కసారి ఇలా తూలేనండీ,” అన్నాడు వినయంగా.

“నువ్వు ఎలా తూలేవని నేను అడగడంలేదు. నువ్వు వరసగా మూడాటలు చూసినా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ లైబ్రరీ సమయంలో లైబ్రరీ పనే చెయ్యాలి,” అన్నాను.

“నేను సినిమాకి వెల్లలేదండీ,” అన్నాడు బాలయ్య.

నాకు రవంత చిరాకు కలిగింది. “నాకదంతా అనవసరం. మరోమారు ఇలా పని ఎగ్గొట్టినట్టు తెలిస్తే నేను చర్య తీసుకోవలసి ఉంటుంది. వెళ్ళి పని చూసుకో,” అని చెప్పి పంపేశాను.

బాలయ్య మాటాడకుండా వెళ్ళిపోయేడు. అతను నిజంగా సినిమాకి వెళ్ళలేదేమో అనిపించింది నాకు. సెక్షను హేడ్ మాత్రం అతనిమీద అప్పుడప్పుడు చాడీలు చెప్తూనే ఉన్నాడు. నేను పిలిచి కసురుతూనే ఉన్నాను. నాదగ్గర మాత్రం మాటాడ్డు. తనదగ్గర పొగరుగా జవాబులు చెప్తున్నాడంటాడు హెడ్డు.

“నువ్వు మీ హెడ్డుకి పొగరుగా జవాబులు చెప్తున్నావుట, ఎందుచేత?” అని నేనెలా అడగను?

బాలయ్య తీవ్రమైన తలనొప్పి అని శలవు పెట్టేడు ఓ రోజు.

“అది అబద్ధం మేడం. ఇవాళ కొత్త సినిమా వచ్చింది ఊళ్లోకి,” అన్నాడు హెడ్.

“చూడండి మిస్టర్ రామారావ్, నిత్యశంకితుడు దుఃఖభాజనుడని మనకి హితోపదేశం చెబుతూంది,” అన్నాను.

“సర్లెండి మేడం,” అనేసి అను వెళ్ళిపోయేడు.

ఆసాయంత్రం బజారులో సినిమా హాలుదగ్గర రూపాయి టికెట్టు క్యూలో చివర నిలబడిన బాలయ్యని చూశాను. నన్ను చూసి మొహం అటు తిప్పుకున్నాడు.

నాకు బాలయ్యమీద నమ్మకం తగ్గింది.

000

మెడికల్ కాలేజీలో వార్డెను డాక్టర్ గోపాల్ ఒకరోజు నాతో మాటాడ్డానికి వచ్చి బాలయ్యని చూసి, “వీడొక దొంగ,” అన్నారు.

“ఇంకొంచెం వివరంగా చెప్పండి,” అన్నాన్నేను. వస్తుతత్వం ఒకటే అయినా సూదికీ దబ్బనానికీ ఒకే పేరు పెట్టలేం కదా.

“ఇక్కడేమీ పోలేదా?” అని ప్రశ్నించేరాయన.

“నాకు తెలిసినంతవరకూ లేదు.”

“పనెలా చేస్తున్నాడు?”

ఈ శల్యపరీక్ష నాకు నచ్చలేదు. నిజానికి అతి స్వల్పమయిన విషయాలు వదిలేస్తే, బాలయ్యలో ఎంచదగ్గ దోషాలు నాకేమీ కనిపించలేదు. చెప్పినపని చెయ్యనని గానీ, అది తనపని కాదని గానీ ఎప్పుడూ అదిరిపడలేదు. ఎవరైనా ఏఁవైనా చిన్న చిన్న పన్లు చెప్తే చిల్లర డబ్బులకి చేయి చాచిన జాడ కూడా లేదు.

“ఇంతకీ మీకెలా తెలుసు వీడిని?” అని నేనే అడిగేను.

బాలయ్య మా ఆఫీసుకి రాకముంది వాళ్ళ హాస్టల్లో పని చేశాట్ట. కూరలు తరగడం, వడ్డించడం వంటి పనులకి కుదిరేడట కానీ కొద్ది రోజుల్లోనే దొంగతనం చేస్తున్నట్టు ముందు అనుమానం కలిగి, తరవాత ప్రత్యక్షసాక్ష్యాలతో ఋజువై ఉద్యోగంనుండి తొలగింపబడ్డాడు. బాలయ్య బియ్యం దొంగతనం చేసినట్టు చూశాం అని చెప్పినవాళ్ళని ఆయన కళ్ళారా చూశారట!

బాలయ్య ఆ బియ్యం ఏంచేసి ఉండేవాడో, అంతకుముందు ఏఁవేఁ దొంగతనాలు చేశాడో, అవేం చేశాడో తెలీలేదు. నేను మాత్రం ఈవిషంయ ప్రిన్స్‌పాలుగారితో ప్రస్తావించి అతడిని లైబ్రరీనుండి మరో డిపార్టుమెంటుకి మార్పించాలనుకున్నాను.

ప్రిన్సుపాలుగారు ఒప్పుకోలేదు. “లైబ్రరీలో బియ్యం లేవు కదండీ,” అన్నారాయన.

వాడు పుస్తకాలు దొంగిలించదలుచుకుంటే మరొక డిపార్టుమెంటులో ఉంటే మాత్రం చెయ్యడా అని వితర్కించేరు. అంతేగాక దొంగకి బాధ్యత ఒప్పజెప్పడంలో గొప్ప స్వారస్యం ఉందని నాకు బుద్ధి చెప్పేరు. నాకు విసుగేసి ఊరుకున్నాను. బాలయ్యని ఓ కంట కనిపెట్టి ఉండమని హెడ్డుకి మాత్రం చెప్పలేదు. మార్చి నారూందగ్గర వేసుకున్నాను.

నేను ఏం చెప్పినా బాలయ్య వెంటనే చేసేసేవాడు. ఒకొకమారు నాకు ఆశ్చర్యం వేసేది అతడు సాధించగల ఘనకార్యాలు చూస్తే. ఊళ్ళో ఒక్క చుక్కయినా కిరసనాయిలు దొరకడంలేదని పెద్ద డాక్టరూ, సబ్ జడ్జీ తమకున్న పరపతి అంతా వినియోగించి తంటాలు పడుతున్న రోజుల్లో బాలయ్య ఫుల్ టిన్ను తెచ్చి మా ఇంట్లో పెట్టేడు. పంచదార, బియ్యం, రైలు రిజర్వేషను, తాలూకా ఆఫీసులో పెర్మిట్లు – ఏవైనా సరే నిముషాలమీద సాధించుకొచ్చేవాడు. కానీ నాదగ్గర ఏపుస్తకంకోసమో వచ్చే పుర ప్రముఖులద్వారా నేను విన్నవి మాత్రం ఏమంత ఆనందదాయకాలు కావు.

“పనంటే నిర్లక్ష్యం వాడికి,” అన్నారొకరు.

“దొంగవెధవ,” అని సర్టిఫై చేశారు మరొకరు.

“ఒంటి పక్షి. సత్రభోజనం, మఠానిద్రాను. డబ్బువిషయం జాగ్రత్త,” అని వేరొకరు హెచ్చరించేరు.

“చాలా వినయంగా ఉంటాడు,” అని నేనంటే, “కారణము లేక నూకలు చల్లబడవు కదా,” అంటూ పాతకథ జ్ఞప్తికి తెచ్చేరు.

ఒకటి మాత్రం నిజం బాలయ్య నాదగ్గరెప్పుడూ ప్రతిఫలం ఆశించలేదు సరి కదా నేనివ్వబోయినా పుచ్చుకోలేదు.

000

ఎండాకాలం శలవులు ప్రారంభమయేయి. పిల్లలంతా ఇళ్ళకి వెళ్ళిపోయేరు. నేను కాలేజీకి వచ్చి రెండేళ్ళవుతోంది. ఇంతవరకూ stock verification చేయలేదు. ఇప్పుడు చెయ్యమని స్టాఫుకి చెప్పి దానికి కావలసిన ఏర్పాట్లు చేసి మాఊరికి వెళ్లేను పదిహేను రోజులు శలవు పెట్టి.

తిరిగొచ్చేసరికి బాలయ్య suspension లో ఉన్నాడని తెలిసింది.

“ఎందుకూ?” అన్నాను తెల్లబోయి.

వెరిఫికేషను పూర్తయింది. ఇరవైఅయిదు పుస్తకాలు కనిపించడంలేదుట. నేను వచ్చి, రిపోర్టు ఇచ్చేవరకూ బాలయ్యని ఆఫీసుకి రావద్దని ప్రిన్సుపాలుగారు ఆదేశించేరుట.

నేను తిరిగొచ్చేక బాలయ్య నాకు ఆఫీసులోగానీ ఇంటిదగ్గర గానీ కనిపించలేదు. ఒకళ్ళిద్దరు ప్యూన్లని పిలిచి బాలయ్య ఎక్కడున్నాడో చూసి తీసుకురమ్మన చెప్పేను. వాళ్ళు తెలీదన్నారు. ఈమధ్యెక్కడా వాళ్ళకి కూడా కనిపించడంలేదుట.

బాలయ్య ఇరవై అయిదు పుస్తకాలు దొంగలించేడంటే నేను నమ్మలేకపోయేను. కానీ అతడే కనిపించకుండా పోయినప్పుడు నేనేం చెయ్యగలను?

నా విధిప్రకారం పోయేయనుకున్న పుస్తకాలలిస్టు తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా వెతికించేను. పది పుస్తకాలు కనుక్కోగలిగేం. అవి గాక ప్రిన్సుపాలుగారూ, కాలేజీ కరెస్పాండెంటూ, కమిటీ మెంబర్లూ, ‘ఫలానా పుస్తకం మాకు పంపండం’టూ చిన్న కాయితపుముక్కమీద గిలికి తీసుకుపోయిన అనామతు లెక్కల్లో మరో ఎనిమిది తేలేయి. అందులో నాలుగేళ్ళగా వాళ్ళదగ్గిరే ఉండిపోయినవి ఉన్నాయి. అవన్నీ తేలేసరికి మరో రెండు వారాలు గడిచిపోయేయి.

బాలయ్య మాత్రం అయిపులేడు. విధి లేక నా రిపోర్టు రాసి ప్రిన్సుపాలుగారి సముఖానికి సమర్పించుకున్నాను. ఏడు పుస్తకాలజాడ లేదు. కాలేజీ కమిటీవారు బాలయ్యమీద పోలీసురిపోర్టు ఇవ్వడానికి నిర్ణయించేరని తెలిసినప్పుడు నా గుండె కలుక్కుమంది. ఆ కమిటీపో లైబ్రరీపుస్తకాలు తీసుకని సంవత్సరాలతరబడి తిరిగి ఇవ్వనివాళ్లున్నారు. నేనూ బాలయ్యా చేరకముందు stock verification చేసి ఎన్నేళ్ళయిందో తెలీదు. కానీ ఇటువంటి ఆలోచనావిధానం అదికార్ల ఆరోగ్యానికి మంచిది కాదు.

000

పోలీసురిపోర్టు ఇచ్చేరు. పోలీసులు బాలయ్య నివసించే పాక తేలిగ్గానే కనుక్కున్నారు. అది ఊరికి ఆరుమైళ్ళదూరంలో ఉన్న చిన్న పల్లెలో ఒక మారుమూల ఉంది. సబిన్సిపెక్టరు నన్నూ, ప్రిన్సిపాలునీ అక్కడికి తీసుకెళ్ళేరు మావస్తువులు గుర్తించడానికి.

వాకిలిదగ్గర చేరవేసివున్న తడిక ఒక్కతోపుకి పడిపోయింది. ఆ చుట్టుగుడిసెలో కనిపించిన వస్తువులు చాలా తక్కువ. వదులుగా కట్టిన తాటిమీద ఓ పాతలుంగీ, ఒక చొక్కా, పాంటూ వేలాడుతున్నాయి. ఒక మూల వారగా ఒక మట్టికూజా, జర్మన్ సిల్వరు గ్లాసూ ఉన్నాయి. తలుపుకి ఓపక్క వారగా కొన్ని పుస్తకాలూ, ఒక కిరసనాయిలు దీపం, ఒక కలం, నోటు పుస్తకం ఉన్నాయి.

“ఆ పుస్తకాలు తీసి చూడండి,” అన్నాడు యస్.ఐ.

నాకెందుకో గొంతులో చేదుగా ఉంది. యస్సై ప్రిన్సిపాలుగారికి వివరిస్తున్నాడు తన సర్వీసులో “ఇలాటి” వ్యాపారాలు చేసేవారిని ఎంతమందిని చూశాడో, తాను వాళ్ళని ఎలా కనిపెట్టేడో …

నేను ఒకొక పుస్తకం తీసి చూస్తున్నాను. War and peace, crime and punishment, కృష్ణపక్షం, గోన గన్నారెడ్డి, అల్లో నేరేడు, కృష్ణాతీరం … బాలయ్య ఈ పుస్తకాలు ఎలా సేకరించినా అన్నీ మంచివే చేసినందుకు, అతని అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేకపోయేను. నాకు స్వాంతన కలిగించిన మరోవిషయం అవేవీ మా లైబ్రరీవి కాకపోవడం. వాటిపక్కనున్న నోటు పుస్తకం తీసి చూసేను. అందలు తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ రాసి ఉన్నాయి వివిధ గ్రంథాల్లోంచి తీసి రాసుకున్న సుభాషితాలు.

అయిదురేకుల దీపకళిక నార్పజూచెదరెవరు?

తారకానవ తైలబిందువులార నిచ్చునె

బ్రతుకుదివ్వెను?

వ్రాత వ్రాసెడు హస్తమ్ము వ్రాసి

కదలి వ్రాయుచును పోవుచుండ

ఆ వ్రాతలోని పంక్తి సగమైన

మరి రద్దు పరచలేవు

కన్నె ఎవరో చనిపోయి

మన్ను కాగ

పూచినది సుమ్ము

ఆ మల్లెపూవు సొగసు!

అవి చూస్తున్నకొద్దీ నాకు సంభ్రమం కలగసాగింది. బాలయ్య ఇంతటి సాహితీపరుడా? ఇవి బాలయ్యవేనా?

“యస్ మేడమ్,” అన్నాడు యస్సై నన్నుద్దేశించి.

“ఆఁఠ అంటూ ఆ నోటుపుస్తకం అక్కడే వదిలేసి మరో పుస్తకం తీసేను. అది వేయిపడగలు. లోపలి పేజీ తీసేను. కళ్లు చెదరినట్టయింది. మాకాలేజీ స్టాంపు ఉంది దానిమీద. దాన్ని అరువుగా తెచ్చిన జాడలు లేవు. కొంత భాగం చదివిగుర్తుగా ఒక చిన్న కాయితపుముక్క ఉంది ఒకచోట.

“ఇదొక్కటే మా లైబ్రరీది,” అన్నాను అక్కడినుండీ లేస్తూ.

ఏది జరగకుండా ఉంటే బాగుండును అనుకున్నానో అదే జరిగింది. నామనసు చికాకుగా ఉంది. ఆ చుట్టుపక్కల  ఎక్కడో పందిని కొట్టి చంపుతున్నారు కాబోలు అది హృదయవిదారకంగా అరుస్తోంది.

“ఈ పరిసరాలు నేను భరించలేను. త్వరగా ఇక్కడ్నుంచి పోదాం పదండి,” అన్నాను ప్రన్సిపాలుగారితో.

000

ఇంటికొచ్చిన తరవాత రెండు మూడు రోజులవరకూ ఏపనీ చెయ్యలేకపోయేను. ఆలోచిస్తున్నకొద్దీ నాకు మరొక విషయం తట్టసాగింది. ఒకటి రెండు సార్లు నేను కావాలనుకున్న పుస్తకాలు షెల్ఫులోనూ లేవు, లోనులోనూ లేవు. అప్పుడు ఎంత వెతికినా దొరకనివి ఆ తరవాత కనిపించేవి. అవి మళ్ళీ ఎలా వచ్చేయంటే ఏవో అందీ పొందని సమాధానాలే కానీ నమ్మదగ్గవేవీ రాలేదు. ఆ పుస్తకాల్లోని వాక్యాలు బాలయ్య నోటుపుస్తకంలో కనిపించేయి. ఇంకా విచిత్రం పోయేయనుకున్న జాబితాలో వేయి పడగలు లేదు.

ఎంత తల బద్దలు కొట్టుకున్నా నాకు ఒకే ఒక్కటే వివరణ కనిపిస్తోంది – బాలయ్య పుస్తకాలు దొంగతనంగా తీసుకెళ్ళి చదివి మళ్ళీ షెల్ఫులో పెట్టేస్తూ ఉండాలి. నమ్మదగ్గ కథలా లేదు. కాగా బాలయ్య అంతటి చదువరీ, సంస్కారీనా అని మరో ప్రశ్న.

000

బాలయ్య పోలీసులకి దొరకలేదు. కాలేజీ కమిటీవారు బాలయ్యే అన్ని పుస్తకాలూ దొంగలించినట్టు నిర్ణయించి, అతడికి ఆనెలలో ఇవ్వవలసిన జీతం పట్టుకునేట్టు, ఉద్యోగంలోంచి బర్తరఫ్ చేసినట్టు ఉత్తరువు జారీ చేసేరు.

అతనిదగ్గరున్న పుస్తకాలూ, రాసుకున్న సుభాషితాలూ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు అనిపించేది తగిన అవకాశం, సవ్యమైన గురువూ ఉంటే బాలయ్య ఎంత పండితుడై ఉండేవాడోనని.

000

బాలయ్య చరిత్రలో కలిసిపోయేడనే అనుకున్నాను మూడేళ్ళనాడు మద్రాసులో మూర్ మార్కెట్లో మామూలుగా దొరకని కొన్ని పాత పుస్తకాలకోసం వెతుకుతున్న నాకు బాలయ్య కనిపించేవరకూ.

అతనే నన్ను ముందుగా గుర్తు పట్టి, ఇంగ్లీషూ తెలుగూ కానీ ఒక మధ్యస్త పద్ధతిలో ఒక చెయ్యి సగం ఎత్తి, “నమస్తే మేడమ్,” అన్నాడు.

ఏనాడో తప్పిపోయిన తమ్ముడు తిరిగొచ్చినంత సంతోషం కలిగింది నాకు. లిప్తపాటు ఏం మాటాడ్డానికీ తోచలేదు.

“బాగున్నావా?” అన్నాను.

“బాగున్నానండీ,” అన్నాడు బాలయ్య కూడా పొంగిపోతూ. అల్లంత దూరంలో ఉన్న సెంకండ్ హాండ్ పుస్తకాలషాపు చూపించేడు తనదేనంటూ.

నాసంతోషం చప్పబడిపోయింది. ఆనాడు సబిన్స్పెక్టరు అన్నమాట జ్ఞాపకం వచ్చింది.

“రండి మేడమ్. నా షాపు చూడండి,” అంటూ ఉత్సాహంగా పిలుస్తున్నాడు బాలయ్య

నేను ఆలోచిస్తూ అతన్ని అనుసరించేను. షాపులో ఒకొక పుస్తకం తీసి చూస్తున్నాను. చాలా మంచి పుస్తకాలున్నాయి. ధర అడిగితే, అతను నవ్వి, “తీసుకోండి మేడం,”అన్నాడు.

ఆఖరికి వెయ్యకూడదనుకున్న ప్రశ్న వెయ్యలేకుండా ఉండలేకపోయేను. “నీకు ఈ పుస్తకాలు ఎలా వస్తాయి?”

బాలయ్య మళ్ళీ నవ్వేడు, “దొంగతనం చేసి తెచ్చినవి కావండీ,”

ఛెళ్ళున నామొహమ్మీద కొట్టినట్టయింది. “అది కాదోయ్,” అంటూ ఏదో చెప్పబోయేను.

“క్షమించండి మేడమ్. అక్కడ కాలేజీలో జరిగినసంగతులన్నీ నాకు తెలుసు. మీరందరూ అనుకుంటున్నట్టు నేను ఆ ఏడు పుస్తకాలూ దొంగతనం చెయ్యలేదు. ఒక్క ‘వేయి పడగలు’ మాత్రం – అది కూడా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రహస్యంగా లైబ్రరీనుంచి తెచ్చుకున్నాను కానీ దొంగతనం చెయ్యలేదు. మిగతా పుస్తకాలూ అంతే. చదివి లైబ్రరీలో పెట్టేసేవాడిని. ఎందుకంటే మా నాలుగోతరగతి ఉద్యోగులకి గత్యంతరం లేదు కనక. నాకు చిన్నప్పటునించీ చదవాలని కాంక్ష. కమలమ్మగారింట్లో పని చేస్తున్నరోజుల్లో మాఊరికి కొత్తగా బ్రాంచి లైబ్రరీ వచ్చింది. ఆవిడ చెప్పేరు కదా నేను ఉదయం, సాయంత్రం కనిపించేవాడిని కానని. లైబ్రరీకి వెళ్ళేవాణ్ణి. పనంతా చేసే అయినా ఇంట్లో కనిపించకపోడమే నేరంగా వాళ్ళు నామీద అరిచేవాళ్ళు. ఆతరవాత చాలా ఉద్యోగాలు చేసేననుకోండి. మెడికల్ కాలేజీలో మాత్రం నేనే మానేశాను. లైబ్రరీలో ఉద్యోగం అయితే పుస్తకాలు చదువుకోవచు అనుకుని …” బాలయ్య ఆగేడు.

“నేను అది సాగనివ్వలేదు,” అన్నాను అందిస్తూ.

బాలయ్య సిగ్గుపడ్డాడు, “మీరన్నమాట నిజమే కదండీ. నన్ను జీతం ఇచ్చి పెట్టుకున్నది నేను చదువుకోడానికి కాదు కదా. చదువుకుని ఇచ్చేస్తాను అని వేరేవారిని అడిగితే వాళ్లు ‘నువ్వా, ఇదా, చదువుతావా’ అంటారు.”

బాలయ్య వాచ్యం నేను గమనించేను. అతడితపన నాకు అర్థమవుతోంది.

అందుకని అన్నమాట బాలయ్య ఈ పద్ధతి కనిపెట్టేడు. అది కూడా అట్టే రోజులు సాగలేదు. మరోదారి లేక, మద్రాసు వచ్చేసి, కష్టపడి ఒక సెకండ్ హాండ్ దుకాణంలో మొదట బోయ్‌గా చేరి క్రమంగా భాగస్థుడయి ఆఖరికి సొంత దుకాణం పెట్టుకునే స్థితికి వచ్చేడు, నాకు చాలా సంతోషమయింది.

“పోన్లే. ఇప్పుడు హాయిగా ఎన్నయినా చదువుకోవచ్చు. నిన్ననేవాళ్ళెవరూ లేరు,” అన్నాను బయల్దేరడానికి లేస్తూ.

బాలయ్య నవ్వేడు. “అదేనండీ తమాషా. ఇప్పుడు పుస్తకాలు నాకు అమ్ముకునే సరుకు మాత్రమే. మిఠాయి దుకాణంవాడిలా చుట్టూ పరుచుకు కూచుంటానంతే. చదివే తీరిక లేదు,”

                                        000

(అబ్బూరి రామకృష్ణారావుగారు ఆంధ్రా యూనివర్సిటీలో లైబ్రేరియనుగా కొంతకాలం పని చేశారు. నేను 1961లో లైబ్రరీ సైన్సు డిప్లొమా కోర్సు చెయ్యడానికి ఆయన్ని కలిసేను. ఆయన లైబ్రేరియనుల సాహిత్యసేవగురించి చమత్కారంగా అన్నమాటే ఈకథకి ముగింపులో వాడుకున్నాను. వారికి ధన్యవాదాలు.

ఈకథ ఆంధ్రజ్యోతి 10 ఏప్రిల్ 1970 సాధారణ నామ సంవత్సరం ఉగాది పోటీలో ప్రత్యేకబహుమతి పొందింది.

హిందీలోకి అనువాదం యలమంచిలి లక్ష్మీబాయి. ప్రచురణ ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ మే, 1972)

 

1970లనాటి ఈకథ నేను తిరపతిలో వున్నప్పుడు రాసింది. ఈకథలో బాలయ్యలా చాలామందికి నాలుగోతరగతి వుద్యోగులలో చదవాలన్న ఆసక్తి వున్నా, మనవ్యవస్థ ప్రోత్సహించదు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.