అప్పగింతలు కవిత

అమ్మాయిని ఏవూరిచ్చారు, చిలకలపల్లేనా?

లేదమ్మా, సిలికాన్ వాలీలో పడేశాం.

ఇరుకుగదులూ, మురికివాడలసొద తప్పుతుందని.

అక్కడ చలెక్కువ, ఖర్చులు తక్కువ

ఆదాయాలెక్కువ

సుఖశాంతులకి మరి కొదవేలేదు

అల్లుడు బ్రెయిన్ సర్జనవుతాడో

రగ్ డాక్టరవుతాడో ఇంకా తెలీదు

కాని అక్కడ సుఖాలు మాత్రం ఎనలేనివి

అందుకే చిట్టితల్లికి బోధ చేసేను

ఎంచక్కా నలగని దుస్తులు

చెరగని క్రాపులు

అలుపులేని పనులతో

కాలం కరిగిపోతుంది

రోజుకి ఇరవైనాలుగ్గంటలు చాలవు అనుభవించడానికి.

వాషర్లూ, డ్రైయర్లూ,

ఏక్ మినిట్ వంటకాలూ, టీవీ డిన్నర్లూ

ఆపైన హోటళ్లూ, సినిమాలూ, డీవిడీలూ

వారంవారం పార్టీలూ

అబ్బే, అక్కడ నువ్వు వండక్కర్లేదు

అంతా కేటరింగే.

అంతకన్నా ఏకన్నెపిల్ల మాత్రం

ఏం కోరుకుంటుంది?

అత్తాఆడబడుచుల పోరుండదు హాయిగా

అతనొక్కడే చాలు అందరిపెట్టు లాటి మాటలనకు

నొచ్చుకోగలడు.

అల్లుడు చదువుకున్నవాడే

మంచీ చెడ్డా మాటాడుతూఊఊఊఊ

వుంటాడు పొద్దస్తమానం ఆపకుండా.

అతిథులు వచ్చినప్పుడు

గరిట పుచ్చుకు నిలబడతాడు

విద్యుత్ పొయ్యిముందు విలాసంగా

కేవలం నీపరువు నిలబెట్టడానికే.

చూడచక్కని సుందరదృశ్యమది

అమర్చినదానిలో అత్తగారు వేలు పెట్టినట్టులాటి

సామెతలు వాడకు

పాపం అతడిమనసు బాధపడుతుంది.

ప్లేను దిగ్గానే కారు కొనిచ్చేస్తాడు.

హాయిగా తిరగొచ్చు

అతడిని ఆఫీసులోనూ

పిల్లల్ని స్కూళ్లల్లోనూ

దిగిడిచేసింతరవాత.

అలా తిరుగుతున్నప్పుడే

ఇంటిక్కావాల్సిన కూరా, కాయా

ఉప్పూ పప్పూ

తెచ్చేసుకోవచ్చు.

చూడవచ్చిన చుట్టాల్నీ పక్కాల్నీ

బజార్లంట తిప్పొచ్చు.

అలా తిరగడానికి

ఓపిక లేదంటూ నస పెట్టకు

తప్పు తల్లీ, మరియాద గాదు.

 

మునిమాపువేళ

ముఖాన రవంత చిర్నవ్వు మేకప్పేసుకుని

కనిపిస్తే చాలు, పరమానందపడిపోతాడు

సంసారం సాఫీగా

తార్రోడ్డుమీద కాడిలాక్కులా తూగిపోగలదు.

 

అవున్నిజమే,

మనూళ్లలోకి మల్లే

పుట్టింటికి పోతానంటూ

బస్సెక్కి వచ్చీడానికి

ఆర్టీసీ బస్సో హౌరా ఎక్స్‌ప్రెసో అందుబాటులో వుండదు

మనవాళ్లుంటారు కానీ

మనసిచ్చి మాటాడుకునే వసతుండదు.

 

అంతమాత్రాన

నువ్వు బాధపడుట తగదు సుమా

కావలిస్తే అర్థరాత్రి నిద్ర పట్టనప్పుడు

లేచి కూచుని కథలో కవితలో రాసుకో

అభ్యంతరము చెప్పడు నీనాథుడు.

నీరచనల ఆశోకవృక్షానికి దోహదక్రియ

సలుపగల ధీరోదాత్త నాయకుడతడు.

మనసాహిత్యచరిత్రనిండా చచ్చినన్ని

సాక్ష్యాలున్నాయి ఈవాదన ఋజు చేయడానికి.

ఆనక చూపుతా అవుసరమయితే.

 

లే, తల్లీ,

మానుకో నీమనోయాది

తుడుచుకో కన్నీరు

ముడుచుకో విరులు

ఎగిరిపో వియత్పథాన

వేయికనులతో వేచియున్న

ఆ పరమపురుషుని సన్నిధికి.

000

(ఈమాట.కామ్ ప్రచురితం. తెలుగుపీపుల్.కామ్ లో పునర్ముద్రణ.)

5 thoughts on “అప్పగింతలు కవిత

 1. @ కల్పన, సరే. సుస్వాగతం. మళ్లీ ఎప్పట్లా మన చర్చలు మొదలెడదాం.
  @ SSRao గారూ, ధన్యవాదాలు. కొందరు ఇవి కవితలేమిటి అన్నారు. అంచేత మీకు నాబాధ అర్థం అయిందంటే సంతోషంగా ఉంది.
  @ కొత్తపాళీ, :))

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ !
  మొదట అన్నీ చదివాక మీ కవితలకు విడివిడిగా వ్యాఖ్యలు రాద్దామనుకున్నా ! కానీ చివరలో అనిపించింది. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం రాయించిన రాతలకు వ్యాఖ్యానం అనవసరం అని. బాగున్నాయి అనేది చిన్నమాట.

  మెచ్చుకోండి

 3. మాలతి గారు, బాగా చురకలంటించారు ఈ కవితలు. అన్నీ అక్షరసత్యాలే.
  జన జీవన స్రవంతి లో కలుస్తున్నాను. కాబట్టి మళ్ళీ మీ పాత పోస్ట్ లు ఒక్కొక్కటి నెమ్మదిగా చదివే ప్రయత్నం చేస్తాను.
  కల్పన

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.