ఊసుపోక – కాఫీ రంగూ రుచీ

ఈమధ్య అమెరికాలో ప్యాచిలఘోష ఎక్కువయిపోయింది. సిగరెట్లు మానేయడానికో ప్యాచీ, పడుకున్నప్పుడు గురక రాకుండా ఓప్యాచీ, పడుకున్నప్పుడే మరేదో రాకుండా మరో ప్యాచీ .. ఇలా నానా రకాలూనూ. కాఫీ మానేయడానికింకా ఏప్యాచీ కనిపెట్టినట్టు లేదు. కాని నాకు మాత్రం ఆ అదృష్టం మరోలా ప్రాప్తించింది.

నాక్కాఫీ యిష్టం. అంటే ఒట్టి ఇష్టం కాదు. పొద్దున్న లేస్తూనే మూడు కప్పుల కాఫీ పడకపోతే కాలకృత్యాలమాట ఒదిలేయండి అసలు తెల్లారినట్టే కాదు నాలెక్కలో. అమెరికాలో రెండేళ్లవాసం, ఒక ఇండియా ట్రిప్పూ సరిపోయాయి నాకాఫీ యావ మాఫీ చెయ్యడానికి.

అసలు మొదలెక్కడంటే, నేను ఓఏడాదిపాటు ఢిల్లీలో చదువ్వెలగబెట్టేను. అక్కడ వున్న ఏడాదిపాటూ ఆ పంజాబీసబ్జీల్లో వాళ్లు గుప్పించే పసుపూ, ధనియాలపొడీ భరించలేక, భోజనం మానేసి, ఎస్ప్రెసో కాఫీలూ గులాబ్‌జాములమీదే బతికేను.

కాఫీలో పాలూ, జాముల్లో పంచదారా హెచ్చయి. సన్నగా ఊచలా వున్న నేను చక్కగా పూరాగా గాలి పోసుకున్న గుమ్మటంలా తయారయేనని మాఅమ్మ మురిసిపోయిందనుకోండి. అది వేరే కథ.

అసలు కాఫీకి పెట్టింది పేరు మద్రాసీలది. కాని దాన్ని అరణం తెచ్చుకు దేశం నలుగడలా ప్రచారంలోకి తెచ్చిన ఘనత తెలుగువారిదే. మద్రాసు తెలుగువారిదే అంటూ ఎంత మొత్తుకున్నా మనకి దక్కలేదు. ఇప్పుడంటే తెలుగుకవులూ, గాయకులూ, నర్తకులూ హైదరాబాదులో తిష్ఠ వేసేరు కానీ మన రచయితలు చాలామంది, పోయినవారు పోగా మిగిలినవారు, ఇంకా ఇప్పటికీ మద్రాసులోనే మఠం వేసుక్కూచోలేదూ. ఎందుకనుకున్నారు? మద్రాసు మనదే కనక. ఐ మీన్ స్పిరిచ్యువల్లీ! మన స్పిరిటంతా ఇంకా అక్కడే వుంది. కాఫీ అందులో ముఖ్యభాగం. ఊరు దక్కించుకోలేకపోయాం కానీ కాఫీనీళ్లు హక్కుభుక్తం చేసేసుకున్నాం.

నాచిన్నప్పుడు తెల్లారగట్ల నాలుగ్గంటలకి లేచి, పాలవాడు గేదెనీ, చేటపెయ్యనీ తోలుకొస్తే, గుమ్మంలో నిలబడి పాలు పితికించుని గిన్నెలో పోయించుకొచ్చి అమ్మకిస్తే, అమ్మ పాలూ నీళ్లూ కలిపి ఇగరగాచి ముందు రాత్రి ఫిల్టరులో పెట్టి వుంచిన చిక్కని కషాయంలాటి డికాక్షను కలిపి స్టీలుగ్లాసులో పోసి అందించిన, పొగలు గక్కుతున్న కాఫీ తలుచుకుంటే నాకిప్పటికీ నాలుకమీద ఆరుచి తగులుతుంది.

ఇప్పుడా పాలూ లేవు, ఆకాఫీ లేదు. అమెరికా రాగానే తెలిసింది ఇక్కడ కాఫీఫిల్టరులు వుండవు కాఫీ మేకరులే కానీ. కాఫీపొడి కూడా మనదేశంలోలా ఘమఘమలాడుతూ వుండదు.. మొదట్లో టీవీలోనూ, పేపరులోనూ కనిపించి ప్రతి ప్రకటనా చూడ్డం, ఇది బావుంటుంది కాబోలనుకుని ఆవురావురంటూ కొనుక్కురావడం, తీరా ముందుసారి కొన్న పొడి కంటె ఇదేం పొడిచేయలేదని ఆలస్యంగా గ్రహించడం, ఇన్ని డాలర్లోసి (అంటే అంతకు ముప్ఫై రెట్లు రూ.లు పోసి) కొన్నాం కదా అని పారేయలేకా, మింగలేకా కొట్టుకుచావడం, ఆపైన ఖర్చులు చూసుకుంటే నేను కొంటున్న కూరా, నారా, ఉప్పూ, పప్పూ కన్నా కాఫీకి తగలేస్తున్న డబ్బే ఎక్కువ అని తెలుసుకోడం జరిగింది.

ఇక్కడికి రాగానే ఎదురయే మరో ప్రశ్న కాఫీ బ్లాకా వైటా అన్నది. కాఫీ కాఫీరంగే కదా అనడక్కండి అమాయకంగా. ఎవరింటికైనా వెళ్తే, చల్లని క్రీము (పాలే) ఇస్తారు. హోటల్లో అయితే వైటెనరు అని ఓపొట్లం ఇస్తారు పాలకి బదులు. ఆపొడి కలుపుకుంటే కాఫీ వైటవదు. చూడ్డానికి బ్రౌనుగానూ, నోట బెడితే తుమ్మజిగురులా అంటుకొస్తూనూ చిరాగ్గా వుంటుంది. కాఫీమీద మమకారం నశించడానికి ఇది ప్రథమపాదం.

రెండోదశ నేను ఇండియా వెళ్లినప్పుడు. అడుగెట్టిన ప్రతి ఇంటా బ్రూయే. అది నాకు మహ గొప్ప హాచ్చెర్యమ్. ఇంట్లో ఎవరూ మామూలు కాఫీ పెట్టుకోరేం అన్నాను రహస్యంగా మాఅన్నయ్యతో.

మాఅన్నయ్య చిదానందుడిలా చిరునవ్వు నవ్వి, నా అమాయకత్వానికి జాలిపడి, మామూలు కాఫీ మామూలు కాఫీయే. నువ్వు అమెరికానుండి వచ్చేవని నీకు స్పెషల్‌గా బ్రూ కలిపి ఇస్తున్నారు. ఈనాడు అదే స్టేటస్‌ చిహ్నం‌అన్నాడు. ఆవిధంగా తాజాగా అమెరికానుండి దిగడిన నాకు నవనాగరీకం తాలూకు సూక్ష్మాలు కూడా అవగతమయేయి ఆరోజు. ఆతరవాత తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నవేళ, మాఅన్నయ్య పండుగపూట వచ్చేవు. నీకు నచ్చినచీర తీసుకో‌అన్నాడు.

చీరేం చేసుకోను, ఏడాదికోమారు కడితే ఘనం. ఓచిన్న ఫిల్టరు కొనియ్యి. రోజూ నీపేరు చెప్పుకు మంచి కాఫీ తాగుతానుఅన్నాను.

పక్కనే వున్న మాచెల్లి రహస్యంగా నాచెవిలో అదేం కోరికే పిచ్చిమొహమా! చీరఖరీదులో ఫిల్టరువెల ఏమూల,అంది.

మాఅన్నయ్య నవ్వి, సరేలే, చీరమీద ఫిల్టరు పెట్టి తాంబూలం ఇచ్చుకుంటా‌అన్నాడు.

తీరా నేను బయల్దేరేవేళ, మాచెల్లి మళ్లీ పక్కన చేరి, నువ్వు చీరెలు కట్టుకోనంటున్నావు కదా, అది పట్టుకెళ్లి ఏంచేస్తావుఅంది. సరే, చీరె వదిలేసి, కాఫీ ఫిల్టరు ఆప్యాయంగా ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాను. తెచ్చేనే కానీ, ఇక్కడ హొమొజినైజుడు పాలూ, అదీ ఫారంలోంచి ఫ్రీజరులోకి వచ్చేసరికే వారం రోజులు ,,, గట్టిగా నిజం చెప్పడానికి మనసొప్పదు కానీ అవి నిలవపాలే. మనగేదెపాల రుచి రమ్మన్నారాదు. ఆకాఫీ రుచి రాదు. ఇప్పటికి కాఫీ వైరాగ్యం రెండోదశకి వచ్చేసాను.

మూడోదశలో చెప్పుకోదగ్గది మాడైరెక్టరుగారి చేతిచలవ. ఆయనని ఓరోజు భోజనానికి పిలిచి, బుద్ధి గడ్డి తిని, మాకాఫీ వేరుఅన్నాను.

మీరెలా చేస్తారు?అని అడిగారాయన సహజంగానే.

ఇక్కడ మీరు ఒక సంగతి గమనించాలి. అమెరికనులు శిష్టావశిష్టులు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ తూకాలూ, కొలతలతో వివరించాలి. అరిటిపండు వొలిచి చేత బెడితే, ఏపక్కనించి కొరకాలని అడుగుతారు, మన మడీ ఆచారాల్లాగే ఇదీను. నీళ్లు కాచి ఫిల్టరులో పోయండి అంటే చాలదు.

మాడైరెక్టరుగారికి కాఫీ చేయు క్రమం చెప్పడం అవస్థ చూడండి..

ఒక క్వార్ట్ గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి కాయాలి

ఎంతసేపు?

నీళ్లు మరిగేవరకూ.

అంటే ఎంతసేపు?

నేను ఆలోచించాను. మామూలుగా నేను నీళ్లు పొయ్యిమీద పెట్టి, నా ఈమెయిలు చూసుకుంటాను, మెయిలు మూట విప్పడానికి మూడు నిముషాలు పడుతుంది. ఇలా లెక్కలు గట్టి, నాలుగు నిముషాలుఅన్నాను.

టెంపరేచర్ ఎంత వుండాలి?

హైలో పెట్టండి. మీడియంలో పెడితే మరో రెండు నిముషాలు పడుతుంది.

ఇదీ ధోరణి. మీకు చెప్పక్కర్లేదు కదా ఈ ప్రొసీజరంతా. ఆపూటంతా నాకాఫీ రెసెపీతోనే కాలక్షేపం అయిపోయింది.

ఆతరవాత మరో నాలుగు నెలలకి ఆయన ఇండియా వెళ్తున్నానన్నారు. ఆనవాయితీ ప్రకారం నేనూ ఏదో సలహా చెప్పాలికదా. అందరిలాగా తాజ్ మహల్ చూడండి, మామల్లపురం చూడండి అంటూ కొట్టినపిండే కొట్టడం ఎందుకని, వెరైటీకోసం, మద్రాసులో ఉడిపీహోటల్లో కాఫీ సేవించడం గొప్ప అనుభవం. అక్కడ సర్వరు చిన్నస్టీలు గిన్నే గ్లాసూ మధ్య కప్పు కాఫీ గజం పొడుగు సాగదియ్యడం మీరు చూసి తీరాలిఅని చెప్పేను.

ఆయన తిరిగొచ్చింతరవాత చెప్పేరు, ఇప్పుడు అన్ని హోటళ్లలోనూ చైనా కప్పులే. నాహోస్టుని బతిమాలి రెండురోజులు ఊరంతా తిరగ్గా, మూడోరోజు మీరు చెప్పిన స్టీలు గిన్నె, గ్లాసుతో కాఫీలిచ్చే అయ్యరు హోటలు కనిపించింది. గొప్ప ఆర్టు. వరసగా మూడు రోజులు వెళ్లి పన్నెండు కప్పులు ఆర్డరు చేసి అబ్జర్వు చేసేను.

నన్ను కాఫీకి పిలిచారు ఆ ఆదివారం, తాను కూడా అలా స్టీలుగిన్నెలో గజం పొడుగు సాగదీసి కాఫీ నాకు సర్వ్ చెయ్యడానకి ముచ్చట పడుతూ. ఎలా కాదంటాను. సరే వస్తానన్నాను. అయన మరోసారి నన్నడిగి రెసెపీ జాగ్రత్తగా రాసుకున్నారు. నేనను మళ్లీ వివరాలు ఊహించుకుంటూ, నీళ్లు కాచడం దగ్గర్నించీ చెప్పేను శ్రాద్ధకర్మలా.

ఆదివారం మధ్యాన్నం టీవేళకి వెళ్లేను. (ఇచ్చేది కాఫీయే అయినా సమయం టీవేళే.)

మా డైరెక్టరు బల్లమీద పొందిగ్గా కాఫీ, బిస్కెట్లూ అమర్చారు. ఆతరవాత తాను కొనుక్కొచ్చిన స్టీలుగిన్నెలూ, గ్లాసులూ తెచ్చి, కాఫీ గిన్నెలో పోసి అచ్చంగా అయ్యరుహోటలులో సర్వరులాగే గజంపొడుగు సాగదీసారు.

నేను ఆశ్చర్యపోయాను ఆయన నేర్పుకి. ఆమాటే అన్నాను ఆయనతో.

ఆయన గంభీరంగా చాలా సాధన చేసేనుఅన్నారు, దిగులుగా కార్పెట్‌వేపు చూస్తూ. కార్పెట్‌మీద కాఫీమరకలు, నేను చిన్నప్పుడు వేసిన ఇండియా మాప్‌లా.

ఆయన నాముందుంచిన కాఫీ తెల్లగా వుంది మాపాపకిచ్చే కాఫీలా. మరీ మల్లెపూవులా కాకపోయినా, నీర్గావి పంచెలా అనుకోండి. మర్యాదగా నవ్వుతూ గ్లాసు నోటబెట్టాను. పంచదార పానకం!

ఎలావుంది అన్నారు ఆయన ఆతురతగా నామొహంలో కళలు పరికిస్తూ, పరీక్షాఫలితాలకోసం ఎదురు చూస్తున్న తొమ్మిదోక్లాసు కుర్రాడిలా. .

షుగరెక్కువయినట్టుందిఅన్నాను తలొంచుకుని కళ్లనీళ్లు దాచుకుంటూ.

మీరు చెప్పిన కొలతలే వేసేను మరి.

ఆఖరికి తేలిందేమిటంటే, ఆయన రాసుకోడంలోనో, రాసింది చూసుకోడంలోనో గల్లంతయి, నీళ్లూ, పంచదారా కొలతలు మారిపోయాయి.

అదే నాజీవితంలో కాఫీగురించి ప్రస్తావించడం. మళ్లీ ఎవరిదగ్గరా, ఎప్పుడూ మాకాఫీ వేరు అన్న పాపాన పోలేదు.

(జనవరి 2004. )

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “ఊసుపోక – కాఫీ రంగూ రుచీ”

 1. మూడేళ్ళ తరువాత మళ్ళీ మొదలెట్టా.
  మీకు అమెరికా వెళ్ళి మోజు తగ్గిందంటున్నారు. నాకు జర్మనీ వచ్చి రెండు వారాలు కాకుండానే, బ్లాక్ కాఫీ అడిక్షన్ పట్టుకుంది!

  అంటే, బహుశా, నాకిక్కడ చలిగా అనిపించి , ఇతరత్రా సేవించే అలవాటు లేదు కనుక, కాఫీ అడిక్ట్ అవుతున్నా కాబోలు!! పాలు కావాలా అంటే కూడా వద్దు అనేస్తున్నా చాలా సార్లు! 🙂

  మెచ్చుకోండి

 2. వికటకవిగారూ,
  మీకు నచ్చినందుకు సంతోషం. పోతే, ఫాంట్సువిషయం – మీసలహా బాగుంది. నిజమే. నాకు కూడా పీడియఫ్.తో బాధలు ఇంతింత అనరాదు.
  కాకపోతే నాపాతకథలన్నీ విండేస్ మీ.లో శ్రీ ఫాంటులో టైపు చేసినవి. పీడీయఫ్.లో పెడితే తప్ప పాఠకులు చడవలేకపోయినరోజుల్లో చేశాను.
  ఇప్పుడు విండోస్ ఎక్స్ పీ.లో అవి అసలు ఓపెన్ అవడమే లేదు. శ్రీఫాంటుతో తంటాలు పడలేక అలా వదిలేశాను. ఇప్పుడు గౌతమీతో చేస్తున్నవి మాత్రం అలాగే పెట్టగలను.

  మాలతి

  మెచ్చుకోండి

 3. మరో మాట. మీరు పీ.డి.ఎఫ్ బదులు నేరుగా టైపు చేయగలిగితే ఇంకొందరు చూడగలుగుతారు. అసలు ఆ పీ.డి.ఎఫ్ డౌన్లోడ్ చేసి చదివితే తప్ప నేరుగా చదవలేకపోయాను.

  మెచ్చుకోండి

 4. బాగా చెప్పారండీ. ఏళ్ళనాటి నా కాఫీ యావ ఇక్కడి కాఫీ దెబ్బకి కొన్నాళ్ళల్లోనే చచ్చిపోయింది. కానీ, ఎలాగో ఓ రెండేళ్ళు శ్రమపడి స్టార్ బక్స్ తో నెట్టుకొచ్చా.

  ఆ తర్వాత ఓ మూడేళ్ళ క్రితం మాకు తెలిసిన ఓ డాక్టరు, బాబూ ఏ కాఫీ అయినా తాగు కానీ స్టార్ బక్స్ మాత్రం తాగకు, కాఫీన్ చాలా ఎక్కువ అని భయపెట్టాడు. “భయపెట్టువాడు వైద్యుడు” అనుకుంటూ, ఆ రోజునుంచి మళ్ళీ కాఫీ ఊసెత్తితే ఒట్టు.

  ఈ మాట ఎనభయ్యో పడిలో ఉన్న మా అమ్మమ్మకి చెబితే, ఉక్కులా వున్న వాళ్ళ దేహాన్ని చూపించి, “వాళ్ళలానే చెబుతార్లే”, ఎన్నేళ్ళనుంచీ తాగట్లేదు, అని ఓ నవ్వు నవ్వారు.

  మెచ్చుకోండి

 5. ఇంతమంది స్పందిస్తారని నేననుకోలేదు. సంతోషం.

  థాంక్సు వసుంధరగారూ. నిజంగా మానేయలేదులెండి. కథలో అలా రాసేనంతే. స్టార్ బక్స్ చూడలేదు కాని మావూళ్లో స్టీప్ అండ్ బ్రూ అని వుంది. వాళ్ల గింజలు కొనుక్కుని, పొడి కొట్టుకుని కాలం గడుపుకుంటున్నాను. :))

  మెచ్చుకోండి

 6. మాలతి గారు,
  మీ కాఫీ వ్యాసం చదివాను. చాలా బాగుంది. యాధృచ్చికంగా నేను కూడా కాఫీ మీద ఆ మధ్య ఒక వ్యాసం రాసాను. వీలైతే ఇక్కడ చదవండి. నాకు కూడా కాఫీ అంటే ప్రాణం కనుక అచ్చం నా అనుభవాల లాగానే ఉన్నాయి మీ అనుభవాలు కూడా. కానీ చివర్లో మీరు కాఫీ పూర్తిగా మానేసారని చదవగానే నేను కాఫీ మానేసినంతగా (శివ శివా) బాధపడ్డాను. కాఫీ ప్రియురాలిగా ఒక సలహా. నేను స్టార్ బక్స్ ది “ఇథియోపియా సిడామో” కానీ “కెన్యా” కానీ గ్రైండు చేయించుకుని కాఫీ మేకరు లో తాగుతాను. ఆ రెండూ బావుంటాయి. సేఫ్ వే లో “ఆఫ్రికా కిటాము” అనే స్టార్ బక్స్ బ్రాండు దొరుకుతుంది అది కూడా చాలా బాగుంటుంది.

  వసుంధర.

  మెచ్చుకోండి

 7. మాలతి గారు,

  మీ కాఫీ వ్యాసం చదివాను. చాలా బాగుంది. యాధృచ్చికంగా నేను కూడా కాఫీ మీద ఆ మధ్య ఒక వ్యాసం రాసాను. వీలైతే ఇక్కడ చదవండి. నాకు కూడా కాఫీ అంటే ప్రాణం కనుక అచ్చం నా అనుభవాల లాగానే ఉన్నాయి మీ అనుభవాలు కూడా. కానీ చివర్లో మీరు కాఫీ పూర్తిగా మానేసారని చదవగానే నేను కాఫీ మానేసినంతగా (శివ శివా) బాధపడ్డాను. కాఫీ ప్రియురాలిగా ఒక సలహా. నేను స్టార్ బక్స్ ది “ఇథియోపియా సిడామో” కానీ “కెన్యా” కానీ గ్రైండు చేయించుకుని కాఫీ మేకరు లో తాగుతాను. ఆ రెండూ బావుంటాయి. సేఫ్ వే లో “ఆఫ్రికా కిటాము” అనే స్టార్ బక్స్ బ్రాండు దొరుకుతుంది అది కూడా చాలా బాగుంటుంది.

  వసుంధర.

  మెచ్చుకోండి

 8. మాలతి గారు,
  మీ కాఫీ వ్యాసం చదివాను. చాలా బాగుంది. యాధృచ్చికంగా నేను కూడా కాఫీ మీద ఆ మధ్య ఒక వ్యాసం రాసాను. వీలైతే ఇక్కడ vasundhararam.wordpress.com చదవండి. నాకు కూడా కాఫీ అంటే ప్రాణం కనుక అచ్చం నా అనుభవాల లాగానే ఉన్నాయి మీ అనుభవాలు కూడా. కానీ చివర్లో మీరు కాఫీ పూర్తిగా మానేసారని చదవగానే నేను కాఫీ మానేసినంతగా (శివ శివా) బాధపడ్డాను. కాఫీ ప్రియురాలిగా ఒక సలహా. నేను స్టార్ బక్స్ ది “ఇథియోపియా సిడామో” కానీ “కెన్యా” కానీ గ్రైండు చేయించుకుని కాఫీ మేకరు లో తాగుతాను. ఆ రెండూ బావుంటాయి. సేఫ్ వే లో “ఆఫ్రికా కిటాము” అనే స్టార్ బక్స్ బ్రాండు దొరుకుతుంది అది కూడా చాలా బాగుంటుంది.

  వసుంధర.

  మెచ్చుకోండి

 9. :)) Enjoyed reading it…
  బైట ఎవరింటికి వెళ్ళినా నాకూ ఇలా వెరైటీ అనుభవాలే ఎదురౌతూ ఉంటాయి..వాళ్ళ తాలూకా కాఫీల గురించి. ఫిల్టర్ కాఫీ రాక్స్ అసలు! 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.