ధర్మకాటా
ఆకలేస్తే అన్నం తిను
చలేస్తే దుప్పటీ కప్పుకోమంటూ
నోటిలెక్కల్లా
బహుతేలిక
ఈనాటి నాగరీకప్రపంచంలో
ప్రతిసమస్యకీ
సిద్ధంగా జవాబు
కంటికానని
అనుభవాలు
పరమాణుల్లా
కోటానుకోట్లు
అణువణువూ
గతానుగతికంగా
ప్రపంచాన్ని పాలిస్తోంది
చట్టాలని సృష్టిస్తోంది
నిజానికి
అంతరాంతరాల్లోంచి
పుట్టుకొచ్చే వణుక్కి
దుప్పట్లెక్కడా దొరకవు
అకాడమీలందిచ్చే
ధర్మనిర్ణయాలు
సామాన్యులకి
సాంత్వన కూర్చవు
వారి తీర్పులు
వీరి బతుకుల
మూసపోసిన అచ్చుల్లా
అమరవు.
(మాలతి, 10-24-1997)
One thought on “ధర్మకాటా”