తల్లీ నిన్ను దలంచి

గౌరీపతి అమెరికాలో దిగేనాటికి ముగ్గురు పిల్లలూ, నాలుగుపదులమీద నాలుగేళ్లవయసూను. అప్పటికి అతనికి ఇంగ్లీషుభాషమీద గొప్ప అధికారం వున్నా తెలుగంటే అంతకి మించిన అభిమానం. అతనికి తగ్గట్టే అర్థాంగి సావిత్రి కూడా దొరికింది. అవిడకి నూనెవంకాయా, మిరపకాయ బజ్జీలూ, పులిహోరా, కొత్తిమీరకారంలాంటి వంటకాలే చేతనవును.

వంటా, పిల్లలూ తనబాధ్యత అని గట్టిగా నమ్మిన సాధ్వి. వీటన్నటిమూలానా అతనికి అమెరికాలో వున్నా అచ్చం దేశంలోనే మనలోగిళ్ల ఉన్నట్టే ఉండడంచేత వారిసంసారం విరగబూసిన మందారంలా కన్నులపండువగా కళకళ్లాడుతోంది.

అతనలా జన్మభూమిమీది మమకారాలు మనసులో మననం చేసుకుంటున్నదినాలలోనే విశాఖపట్నంలో ఉన్న మిత్రుడు భగవంతం చాట్లోకొచ్చి (చేట కాదండీ, చాటు) సతాయించేడు ఓమారు రాకూడదా ఆంటూ. ఇద్దరూ ఓపావుగంటసేపు ఘర్షణ పడ్డాక, “ఏదైనా సభ ఏర్పాటు చెయ్యి, వస్తాను,” అన్నాడు గౌరీపతి.

“దానికేంవుంది. భాషాఘోష దిక్కుల పిక్కటిల్లుతోందిక్కడ. ఆరిపోతున్న తెలుగుభాషకి ఊపిరి పోసి నిలబెట్టాలని మహ ఆరాటపడిపోతున్నాం మేంఅందరం. మాకంటే అమెరికాలో వున్న మీరే ఎక్కువ భాషాపోషకులని కూడా ఇక్కడ ఓ అభిప్రాయం వుంది. నువ్వు రా. నీ అమెరికను కనులతో మనదేశం చూసి, నీఅనుభవాలు కూడా చర్చకి పెట్టొచ్చు,” అన్నాడతను.

సరేనన్నాడు గౌరీపతి.

దరిమిలా భగవంతం హుషారుగా విశాఖపట్నం, వాల్తేరు, విజయవాడ, రాజమండ్రీ, మరియు రాజధానిలోనూ ఉన్న అనేకానేక పెద్దలని కలుసుకుని, అవుననిపించుకుని, తగినసంభారాలు కూర్చుకునేసరికి మరో రెండేళ్లు గడిచిపోయేయి.

అలా మొత్తం ఎనిమిదేళ్లతరవాత గౌరీపతి మాతృదేశానికి ప్రయాణమయేడు. కొడుకు శ్రీను, పెద్దమ్మాయి కవిత అప్పటికి టీనేజరులు. యూరపయితే వస్తాం కానీ ఇండియాలో ఏముంది దోమలూ, దోపిడీ తప్ప అన్నారు వాళ్లిద్దరూ. వాళ్లనొదిలేసి, నేనెలా వస్తాను అంది సావిత్రి, పిల్లలతో వాదించలేక, సావిత్రికి సమాధానం లేక, గౌరీపతి ఒక్కడే  బయల్దేరేడు బంధుజనులకోసం కొన్న విదేశీవస్తుసంచయంతోపాటు కొన్ని పాతజ్ఞాపకాలు మూట కట్టుకుని.

బొంబాయిలో ప్లేను దిగి, రైలెక్కి, హైదరాబాదులో దిగగానే తొలిషాకు తిన్నాడు అతను. ఎనిమిదేళ్లలో దేశం ఇంతగా మారిపోగలదని ఎవరైనా అతనితో అనివుంటే అతను నమ్మి వుండేవాడు కాడు. హైదరాబాదు రాజధాని కదా అంతేలే అని సరిపెట్టుకుని, కోణార్క ఎక్కి విశాఖపట్నంలో దిగి బస్సెక్కి సీతమ్మధార చేరుకున్నాడు.

అక్కడా అంతే. కిరసనాయిలు దీపాలకి బదులు కరెంటులైటులొచ్చాయి. గుమ్మాలకి పసుపూకుంకుమలస్థానాన వార్నీషులు వేసుకుంటున్నారు మిద్దెఇళ్లవాళ్లు.  గౌరీపతి మనసు చిన్నబుచ్చుకుంది.

విశాఖపట్నంలో పెద్దపెట్టున అంతర్జాతీయ తెలుగుభాషోద్ధరణసభ ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో వున్న రాజుగారూ, రెడ్డిగారూ, నాయుడుగారూ, చౌదరిగారే కాక మద్రాసునుండి చెట్టిగారూ, బెంగుళూరునించి మూర్తిగారూ, సింహళనించి అళహసింగరి, కొల్‌కొటానించి రాయ్‌, ఇంగ్లండునుండి విష్‌, అమెరికానించి గౌరీపతీ, పంటు, మరియు జర్మనీనించి చెంగళ్ కూడా వచ్చేరు. అలాగే ఇంకా చాలాదేశాల్లో పాతుకుపోయిన తెలుగుభాషాభిమానులు చాలామంది ఆమహాసభల్లో పాల్గొనడానికి విచ్చేశారు.

“మిస్ ఆషీమాని కూడా కార్యవర్గంలో చేర్చుకుందాం,” అన్నారు నాయుడుగారు. ఆషీమా అసలుపేరు ఆచింత పొన్నులక్ష్మీప్రసూనాకుమారి. ఆపేరు ఆధునికంగా లేదనీ, అసలు చాలామంది పలకనేలేరనీ, బెంగాలీపేర్లకి గిరాకీ అనీ – ఇలా చాలాకారణాలు చెప్పుకుని, ఆవిడ తనపేరు ఆషీమాగా మార్చేసుకుంది. గొప్పసంఘసంస్కర్తగా ఇప్పుడిప్పుడే ప్రజలనోట పడుతోంది.

“ఆమెందుకండీ ఫెమినిజమూ గట్రా అంటూ గోల్లేపుతుంది,” అన్నాడు చౌదరి.

“ఆ, లేదులెండి. మనమాటినే మడిసే. అదీగాక మనగ్గూడా గౌరవఁవే. మల్ల ఆడాళ్లని వేరెట్టేశాం అనీడానికెవరికీ ఔకాసం వుండదు,” అన్నాడు చెట్టి.

చెంగళ్ కూడా మంచిపాయింటే అంటూ వత్తాసు పలికేడు. వారిసంస్థ డెమొక్రటిక్ ప్రిన్సిపుల్లమీద ఏర్పాటయింది కనుక అది సబబే. వేరెట్టడాలు వారికి పట్టవు. కులతత్త్వాలంటే మహమంట వారికి. “ముక్కోటిఆంధ్రులు ఒక్కజెండానీడ … చేయెత్తి జైకొట్టు తెలుగోడా …” అంటూ పాడుకుంటున్నవారూ, పాడుకోగలవారూనూ అందరూ. అందుచేత స్త్రీలకి ప్రాతినిధ్యం ఇవ్వవలసిన అగత్యం గుర్తింపబడిపోయింది అట్టే శ్రమ లేకుండా.

కార్యక్రమాలు ఘనంగానే ఏర్పాటు చేశారు. రెండురోజుల్లో పన్నెండు పేనలులకి నిర్ణయం అయింది.

మిస్. ఆషీమా స్త్రీలకి ప్రత్యేకంగా ఒక పేనలు పెట్టాలనీ, మిగతా అన్ని పేనలలోనూ ఒక స్త్రీ తప్పకుండా ఉండాలనీ ప్రతిపాదించింది. ఆవెంటనే మరోప్రశ్న ఉదయించింది.

“అన్ని పేనలులలోనూ పెట్టేంతమంది ఆడవారు మనకెక్కడున్నారండీ?”

“అసలే వాళ్లబుర్రలు చిన్నవి.”

ఆమాటకి ఆషీమా ఉరిమిచూసింది, “అంటే మీఅభిప్రాయం?”

“అది నేనన్నమాట కాదండీ. ఆమధ్య ఎవరో హార్వర్డు ప్రొఫెసరు అన్నారని మరెవరో అన్నారు. నేను హాస్యానికి అన్నాను, అంతే,” అన్నాడు చెంగళ్ నవ్వుతూ. ఆతరవాత చుట్టూ చూశారు. ఎవరూ నవ్వలేదు.

“ఇంతకీ మీ పేనల్సులో స్త్రీలకి ప్రాతినిధ్యం ఇస్తారా? ఇవ్వరా?”

“మీరే చెప్పండి ఏపేనలులో ఎవరిని పెడితే బాగుంటుందో?”

ఆషీమాకి గొప్పచిక్కొచ్చి పడింది. ఎవరిపేరు చెప్పినా ఏదో వంక …

“ఆవిడని కిందటేడు పిలిచాం కదా.”

మరొకపేరు చెప్తే …

“అంతకుముందు పిలిస్తే, వాళ్లాయనకి కూడా ఎయిర్ ఫేర్సు కావాలందామె. ఎక్కడ తెస్తాం అంత డబ్బు?”

మరొకపేరు  …

“అబ్బే, ఆవిడకి మాటాడ్డం చేతకాదు.”

మరొకావిడ అయితే …

“నో, నో. ఆవిడకి మనవర్కుమీద గవురం లేదు,”

.మరో ..

“వాటెబౌట్ .ఫలానా ..?”

“ఆమెమాట ఎత్తకండి మహాప్రభో! ‘ఫలానామె’ని పిలిస్తే ‘ఫలానాయన’తో తగువు. కొరివితో తలగోక్కున్నట్టే.”

ఆషీమాకి ఆయాసమొచ్చింది కానీ అందరిచేతా అవుననిపించగల స్త్రీలపేర్లు రెండుకి మించి తగల్లేదు. సరే, ఆయిద్దరిని రెండు పేనలులో పెట్టడానికి ఒప్పందం అయింది.

సభలు అత్యంతసంరంభంతో ప్రారంభమయేయి. రాజధానినించి విద్యశాఖామంత్రి వచ్చేరు. ఉద్యోగవిరమణానంతరం ఊటీలో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగు ఆస్థానకవి ముఖ్య అతిథి. ఆయన విద్యాశాఖామంత్రితో సరిసమానంగా రాజలాంఛనాలతో విమానాలమీద వేంచేశారు. మిగిలిన వక్తలు వారి వారి తాహతులనిబట్టీ, వీలునిబట్టీ తగువాహనాలలో దిగారు.

మొదటిరోజు అసలు తెలుంగులెవరూ, తెలుంగు అననేమి, తెలుంగువారి సాంప్రదాయాలు ఎవ్విధమున నెలకొన్నాయి వంటి అనేకవిషయాలమీద ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. “ఈరోజు మనం చాలా కొత్తవిషయాలు తెలుసుకున్నాం” అనుకుని ప్రజలు ఆనందించేరు.

రెండోరోజు అకస్మాత్తుగా అవాంతరం వచ్చిపడింది. ఆనాడు సభకి అధ్యక్షత వహించవలసిన పద్మశ్రీ సంపూర్ణాఘోష్ భగవంతానికి అర్థరాత్రి ఫోను చేసి అనారోగ్యం కారణంగా తాను సభకి హాజరు కాలేనని తెలియజేశారు. తనఇంట్లో ఫోను వున్నందుకు అతను విచారించింది బహుశా ఆ ఒక్కరోజేనేమో. ఆతరవాత కొంతసేపు అధ్యక్షులవారిని పిలవనా వద్దా అని తనలో తనే తర్జనభర్జన చేసుకుని, “నువ్వే ఏదో ఓదారి చూడు” అని ఆయన అంటారని తనకి తనే సమాధానం చెప్పుకుని, ఆదారి కనుక్కుని, ఓ దానయ్యని దొరకపుచ్చుకుని, కార్యవర్గం పరువు నిలబెట్టేడు. తెల్లారేక, అధ్యక్షులవారికి తెలియజేశాడు వివరాలు. ఆయన అతనికార్యదక్షతని మెచ్చుకున్నారు.

మొత్తంమీద వక్తలూ, సభాపతీ సభామండలం అలంకరించేసరికి పది దాటింది. సభికులు వాచీలు చూసుకుంటూ మొదలెట్టు-తండ్రీ-మొహాలు పెట్టేరు. ప్రకటించిన సభాపతి కారణాంతరావల్ల రాలేకపోయారని చెప్పి, స్వల్పవ్యవధిలోనే అయినా అధ్యక్షత వహించడానికి అంగీకరించినందుకు దానయ్యగారికి పుష్కలంగా కృతజ్ఞతలు చెప్పి కార్యక్రమం ప్రారంభించేరు.

దానయ్య లేచి సభాసదులకు నమస్కరించి, “ఇప్పుడు రాయ్‌గారు మాటాడతారు” అని చెప్పి కూర్చున్నాడు.

రాయ్‌గారు లేచి, తెలుగుభాషగొప్పతనంగురించి చక్కగా వివరించేరు.

“కన్నడప్రభువు శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు. సార్వభౌములు నన్నయ్యని భారతం తెనిగించమని నియమించడమే కాక తాను స్వయంగా అముక్తమాల్యద అను ప్రబంధాన్ని తేటతెలుగులో రచించారు. ఎందుకంటే తెలుగు ద్రాక్షాపాకమువలె మృదుమధురముగా ఉండును కనుక. ఆతరవాత పద్మరాజుగారు తమ తెలుగుకథలని తామే ఇంగ్లీషులోనికి అనువదించి న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచకథలపోటీలో బహుమతులు పొంది, తెలుగుసాహిత్యానికి అంతర్జాతీయఖ్యాతిని గడించి పెట్టేరు. అంటే తెలుగుసాహిత్యం ఘనత తెలుస్తోంది కదా …”

రాయ్‌గారిఉపన్యాసం అంతా ఇక్కడ రాయడం అయేపని కాదు కానీ ఇదేధోరణిలో సాగింది ముప్పావుగంటసేపు.

ఆతరవాత సింహళనించి వచ్చిన అళహసింగరి తాము విదేశాల్లో వుంటూ తెలుగుభాషని ఎలా పోషించుకువస్తున్నారో చెప్పేరు. ఆయన ఉంటున్నఊరిలో ఓ పదితెలుగుకుటుంబాలు వున్నాయిట. నెలకొకసారి కలుస్తారుట. తెలుగులో మాటాడుకోడం, చదువుకోడం, చేస్తారుట. అదికాక, ప్రతిఆదివారం ఉదయం ఆరుగంటలకి ఆకాశవాణిలో గంటన్నరసేపు తెలుగు కార్యక్రమం నడుపుతారుట. అందులో ఒక్క ఆంగ్లపదం మచ్చుకయినా వుండదుట.

“ఆకార్యక్రమంలో మీరు ఒక్క ఆంగ్లపదమయిన ఎత్తి చూపగలిగిన, పదివేలరూప్యములు ఇత్తునని ఇదే నాసవాలు. తెలుగభాషయందు అభిమానముతో ఇక్కడ చేరిన మీరందరును సాక్ష్యము. నాహస్తవాహకవాక్‌శ్రవణయంత్రసంఖ్య కూడ మీకు ఇవ్వగలను. మీరందరూ తెలుగు మాయమయిపోతున్నదనీ, తెలుగుభాషని తిరిగి పునరుద్ధరించవలెనని అంటున్నారు. మీకు నిజముగా తెలుగుభాషయందు అభిమానము ఉండిన, ముందు మీరు ఇప్పుడు మాటాడుచున్న సంకరభాషను, ముప్పాది ఆంగ్లపదములతో కూడిన తెలుగును వదిలిపెట్టుట మొదలుపెట్టవలెను,” అని చెప్పి ముగించేరు.

కార్యకర్తలు మొహమొహాలు చూసుకున్నారు. ఇంతవరకూ తాము “అట్టి సంకరభాషలోనే మాటాడుచుంటిమి” అని అప్పుడే తట్టింది వారికి. ఏంచేయగలరు ఎవరు మాత్రం? రోటిలో తల దూర్చేశారు కద. “సంజయ, ఏమని చెప్పుదు”చందమయింది కార్యకర్తలఅవస్థ. భాషవిషయంలో అళహసింగరిగారి పొజిషను ముందు కనుక్కుని వుంటే బాగుండును అని విచారించేరు కొంచెంసేపు.

దానయ్య మళ్లీ లేచి, తనభాషణలో ఆంగ్లపదాలు దొరలకుండా జాగ్రత్తపడుతూ, ఆతరువాతివక్త చెట్టిగారని ముచ్చటగా మూడంటే మూడుమాటల్లో పరిచయం చేసి మాట దక్కించుకున్నాడు. ఆక్షణంలో అతడి మనసు పొంగిపోయింది తాను ఆనాటిసభలో వక్త కానందుకు.

చెట్టిగారు కూడా మాటలకి రవంత తడుముకుంటున్నట్టే కనిపించేరు. కానీ అంతలోనే తాను చర్చించవలసినవిషయం గుర్తొచ్చింది. “అసలు తెలుగు ఆంగ్లపదాలను అంకించుకుని హక్కభుక్తం చేసేసుకోడానికి ముక్యకారనం మన సాంకేతికపురోభివుర్ది. ఈనాటి సాంకేతికపదాలు మనతెలుగులో లేనందున మనం ఇంగ్లీషు వాడుతున్నాం. ఒకవేళ మనం తెలుగుపదాలు సమకూర్చుకున్నా అవి అంతర్జాతీయంగా ఎవరికీ అర్తం కావు కావున మనం ఇంగ్లీషుపదములే వాడవలె. ఉదార్నకి వర్డ్ రెండువేల్ తీసుకోండి. బనాయించండి (సేవ్), మల్ల బనాయించండి (సేవ్ యాస్), అంటే తెలంగాణాలో తెలుస్తదేమో కానీ తెలుగుదేసంలోనే వేరే ప్రాంతాల గంద్రగోళంగ వుంటది. అంచేత, వుప్పుడు మనం నన్నయ్య, తిక్కనలనాటి తెలుగుమాటలతో పబ్బం గడుపుకోలేం. భాష సజీవం. అంటే పెరుగుతా వుంటది అనే కద. అసలు ప్రపంచంలో ఏభాష మాత్తరం మార్పు లేకండ వుండిపోయింది గనక? ఛాసరునాటి ఇంగ్లీషు ఇప్పుడు లేదు అని అందరికీ తెలుసు కద. అంతెందుకు, ఈనాటి ఇంగ్లీషులో మనతెలుగుమాటలు ఎన్ని చేరేయో చూడండి. బాడ్ కర్మ, కరీ, మసాలా, నిర్వానా  … అంటి మాటలెన్నో ఆంగ్లంలో మామూలయిపోయినాయి కద. మామూల్ కూడా ఇంగ్లీషుమాటే …”

ఆయన వుపన్యాసం వింటుంటే, గౌరీపతికి దిగులు ముంచుకొచ్చింది. తనకి అర్థంకాలేదు కాబోలనుకుని భగవంతంవేపు చూశాడు. అతను వంచిన తలెత్తకుండా నోట్సు రాసేసుకుంటున్నాడు పొట్టిచేత్తో (షార్టుహేండు).

ఆతరువాతి వక్త పంట్. అతను పుట్టుకతోనే నాయకుడు. కండబలంతోపాటు లోకరీతి కూడా బుడిబుడినడకలనాడే ఒంట పట్టించుకున్న ఘనుడు. రెండోయేట తప్పటడుగులేస్తూ ఇల్లంతా తిరుగుతూంటే, పొరుగిళ్ల ఐదారేళ్లపిల్లలు అతనివెంట నడుస్తుంటే చూసి తల్లిదండ్రులు మనవాడికి నాయకుడయేలక్షణాలున్నాయని కనిపెట్టేశారు. అయిదోతరగతి అయేసరికే ఇరుగుపొరుగువారందరిచేతా హౌరా అనిపించుకున్న ప్రబుద్ధుడు. ఆనాటినుంచి ఈనాటివరకూ ఇతరులని తాను నడిపించడమే కానీ తాను మరొకరివెనక నడవలేదు.

అంచేత ఈరోజు సభ అతనికి ఇరకాటంగా వుంది. అసలు తనని మొదటివక్తగా పెట్టనందుకు కొంత నొచ్చుకున్నాడు. తాను చెప్పదలుచుకున్న ఘనాపాఠీపాయింట్లన్నీ ఈ వక్తలందరూ చెప్పేశారు. ఇప్పుడు తాను చెప్పగల కొత్తవిషయాలు ఏమున్నాయి? సరే, చూద్దాం అనుకుని, తను కూడా తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలదగ్గరే మొదలెట్టి, మనభాష ఘనత ప్రస్తావించి, “పొగడరా నీతల్లిభూమి భారతిని” అని ఓచరణం పాడి, తెలుగుభాషని పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతనుగూర్చి ప్రసంగించి, “మనం ఇప్పుడొక విస్తృతమయిన ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆప్రణాళికతయారీలో ప్రపంచీకరణం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి,” అని సభికులవేపు చూశారు.

సభికులు అలసి, సొలిసి, దివాలామొహాల్తో వుసూరుమంటూ చూస్తున్నారు. ఎవరిమొహంలోనూ ఉత్సాహం అన్నది మచ్చుకైనా కనిపించడంలేదు. లాభంలేదు. ఏదైనా పదునైన అస్త్రం ప్రయోగించాల్సినసమయం ఆసన్నమయింది అనిపించింది వక్తకి. ఘనతకెక్కిన మహామహులందరూ తలపుకొచ్చేరు. తేటతెనుగున రాయమన్న రాయలవారినుండీ వ్యావహారికం ఉపయోగించమన్న రామ్మూర్తిగారివరకూ, ఆతరవాత ఆధునికకవిత్వానికి మార్గదర్శకుడు శ్రీశ్రీ  … అవునవును.. శ్రీశ్రీగారు రావిశాస్త్రిగారికి ఏమని శలవిచ్చేరూ?  తెలుగులో బాగా రాయాలంటే ఇంగ్లీషు చదువుకోవాలి అని. శహభాష్, …

పంట్‌గారు ఓక్షణం ఆగి శ్రోతలని కలియజూసి, మళ్లీ పుంజుకున్నారు, “మన ప్రపంచీకరణకి అనుగుణంగా తెలుగుండాలి. తెలుగుని ఇంగ్లీషుతో కమ్మింగిల్ చేసి, పాఠ్యపుస్తకాలు తయారు చేసుకోవాలి. మనం తెలుగు నేర్చుకోడానికిముందు ఇంగ్లీషుభాషని క్షుణ్ణంగా అభ్యసించాలి.”

ఈ చివరివాక్యంతో అంతవరకూ దిక్కులు చూస్తున్న సభికులు, ముఖ్యంగా ఇంగ్లీషుమీడియంస్కూళ్లలో చదువుకున్న యువకులు ఉలిక్కిపడి, అప్రమత్తులయి, నిటారుగా కూర్చున్నారు, ఎవరో వెన్నుమీద ఛళ్లున చరిచినట్టు. “వాటె బ్రిలియంటయిడియా!” అన్నారు ముక్తముఖాలతో.

పంటుగారికి కావలిసింది కూడా అదే. సభికులదృష్టిని ఆకట్టుకోడం. ఆతరవాత వారికి అర్థమయేలా విడమరిచి వివరించడం. అదేకదా మంచి వక్తలక్షణం మరి. అంచేత ఇంగ్లీషుభాష అభ్యసించవలసిన ఆవశ్యకతగురించి ఇలా వివరించేరు, “ఇందాకా చెట్టిగారు చెప్పినట్టు సాంకేతికపదజాలంమీద అధికారం రావాలంటే మనకి ఇంగ్లీషుభాషాపరిజ్ఞానం అవసరం. అసలు మనదేశచరిత్ర చూడండి. ఇంగ్లీషువాడు మనమీద అధికారం ఎలా సాధించాడు? వాడికి ఇంగ్లీషు కరతలామలకం కనక. ఇప్పుడు మనం మళ్లీ ఇంగ్లీషువారిమీద ఆధిపత్యం ఎలా సాధించగలం? వాడిభాష నేర్చుకుని వాడిభాషలోనే వాడిని జయించడంద్వారా. వుమన్ అండ్ చిల్డ్రన్‌కి వాళ్లభాషలోనే బోధపరిచినట్టుగానే, ఇంగ్లీషువాణ్ణి ఇంగ్లీషులోనే జయించాలి. చెట్టిగారు చెప్పింది ఎంతయినా సబబుగా వుంది. ఇంగ్లీషు నేర్చుకుంటే మనకి వారి భావనాసరళి బోధపడుతుంది. ఇంగ్లీషువ్యాకరణం, పదవిన్నాణం, వాక్యనిర్మాణం, క్షుణ్ణంగా తెలుసుకుంటేనే ఎన్నో ఘనకార్యాలు సాధించగలం. అందుకు మనం విదేశాల్లో తెలుగుపిల్లలకి ఇంగ్లీషుస్కూళ్లు పెట్టాలి. ఆస్కూళ్లలో పాఠాలు చెప్పడానికి తెలుగుదేశంలో ఇంగ్లీషుబడిలో తెలుగు నేర్చుకున్నవారిని పిలిపించాలి. అందుకు కావలసిననిధులు ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలి …” అని ముగించేరు.

ఆతరవాత, సభాపతి తనకి చేతనయినంత సంక్షిప్తంగా ఆనాటి వక్తలఉపన్యాసాలు సమీక్షించి చేతులు దులుపుకున్నారు.

ఆరాత్రి ప్లినరీసెషను. ఆ రెండురోజులూ సభల్లో జరిగినచర్చలూ, వచ్చినప్రతిపాదనలూ సంగ్రహించి, రకరకాల ప్రతిపాదనలు చేసేరు. అళహసింగరిగారిఉపన్యాసం విన్నతరవాత వారిందరికీ ఒకవిషయం తేటతెల్లమయింది. అయనలాగా ఇంగ్లీషుపదాలు వాడకుండా తెలుగు మాటాడ్డం ఎవరికీ సాధ్యం కాదు. కాలేదు. పైగా, గట్టిగా ఆలోచిస్తే కనిపిస్తున్నది ఆయన కూడా వారానికి గంటన్నరసేపు మాత్రమే అలా మాటాడగలుగుతున్నారు. తదితర సమయాల్లో తప్పనిసరిగా ఇంగ్లీషు వాడుతూనే వున్నారు. అందుచేత బేషరతుగా తెలుగు నేర్చుకోడానికి ఇంగ్లీషు ముఖ్యం అని అందరూ అంగీకరించేశారు. సభ్యులు పంట్‌గారి ప్రతిపాదనలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

అవిః

  • పిల్లలకి తెలుగుకంటె ముందు ఇంగ్లీషు నేర్పాలి.
  • అన్నిస్కూళ్లలోనూ దానికి తగ్గట్టు బోధనావిధానం మార్చమని ప్రభుత్వంవారికి వినతిపత్రం సమర్పించుకోవాలి.
  • కోర్సులూ, టెక్స్టుబుక్కులూ తదనుగుణంగా తయారు చేయాలి.
  • సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ, పత్రికలలోనూ కూడా కనీసం ఎనభైశాతం ఇంగ్లీషు వాడాలి.
  • ఇళ్లలో తప్పనిసరిగా ఇంగ్లీషే మాటాడాలి.
  • అమెరికాకి వచ్చే, ఇంగ్లీషురాని అమ్మమ్మలూ, నాన్నమ్మలనించీ పిల్లలు తెలుగు నేర్చుకుంటారు కనక వాళ్లకి ప్రయాణానికిముందు విధిగా ఇంగ్లీషుభాష నేర్పే ఏర్పాటు చేయాలి. లేకపోతే వీసాలు ఇవ్వరాదు.
  • విదేశాల్లో తెలుగుపిల్లలకోసం ఇంగ్లీషుపాఠశాలలు పెట్టాలి. అందుకు నిదులు సేకరించాలి.
  • విదేశాల్లో తెలుగువారికోసం పెట్టిన ఇంగ్లీషుపాఠశాలలోపాఠాలు నేర్పడానికి తెలుగుదేశంనించి పంతుళ్లని పిలిపించాలి. వారికి మాత్రమే మనసంస్కృతి, మనభాష, మనఇంగ్లీషు తెలుస్తుంది కనక.
  • బ్రౌణ్యనిఘంటువు తిరగరాయాలి బాతు, ఫుడ్డూ, హాండూ- వంటి పదాలు అచ్చతెలుగు పదాలుగా గుర్తించి,, చేరుస్తూ.
  • కృష్ణమూర్తిగారు తెలుగువ్యాకరణం తిరగరాయాలి, వాడుకలో వున్న ఇంగ్లీషుపదాలకి తగినట్టు విభక్తిప్రత్యయాలు (చాట్లో, కూల్గా, వెబ్యందు), సర్వనామాలకి తగిన క్రియావాచకాలు (బాత్ చేయు), (మెసేజెట్టు), ఆంగ్రీ అవు, కాల్చేయు, సిక్కవు  వంటివాటిని సోదోహరణంగా నిరూపిస్తూ.

భగవంతం జాగ్రత్తగా ప్రతిపాదనలన్నీ రాసుకున్నాడు తు, చ. తప్పకుండా.

ఆరాత్రి భగవంతం గౌరీపతిని అడిగాడు సభలమీద నీఅభిప్రాయం ఏమిటని.

గౌరీపతికి చాలా అసంతృప్తిగా వుంది కానీ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీలేదు.

ముప్ఫైఅయిదేళ్లక్రితం తాతగారు అన్నమాట జ్ఞాపకం వచ్చింది.

ఆరోజుల్లో నాన్నగారు తనని సెయింటాంథోనీస్కూల్లో వేయడం తాతగారికి నచ్చలేదు.

“ఈరోజుల్లో ఇంగ్లీషుభాషకున్న గౌరవం తెలుక్కి లేదు. ఇంగ్లీషు రాకపోతే ఉద్యోగాలు రావు. అడుక్కుతినాలి” అన్నది నాన్నగారి వాదన.

“సరే, బతుకుతెరువుకోసం ఇంగ్లీషు చదువు. జాతిపరువు నిలబెట్టడానికి తెలుగు నేర్చుకో,” అంటారు తాతగారు. ఆతరవాత, పెద్దబాలశిక్ష గౌరీపతిముందు పడేసి, “మొదలెట్టు. తల్లీ నిన్నుఁ దలంచి …” అన్నారాయన హుంకరించినంతపని చేస్తూ.

ఆనాటి ఆదృశ్యం అతనిమనసులో చెరగనిముద్ర వేసింది. భగవంతంవేపు తిరిగి, “నీకు జ్ఞాపకం వుందా ఆపద్యం? తల్లీ, నిన్ను దలంచి పుస్తకమున్ చేతన్ బూనితి .. ఎంత కొట్టుకున్నా ఆతరవాతిపాదాలు గుర్తు రావడంలేదు,” అన్నాడు, మనసు విలవిల్లాడుతుంటే.

“నాకూ జ్ఞాపకం రావడంలేదు,” అన్నాడు భగవంతం నిట్టూర్చి.

(30 జూన్ 2009.)

ఈనాటి రెండు కథలు (టపాలు) గురించి ఒకమాట. నేను ఈరెండు కథలు రాసినప్పుడున్న అభిప్రాయాలు కేవలం పాక్షికమని గత రెండు నెలలోనూ నాకు స్పష్టమయింది. అందరిలాగే నేనూ తెలుగు సమసిపోతోందనీ, ఈనాటి యువత తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నారనీ అనుకున్నపుడు రాసిన కధలివి. కాని కొన్ని బ్లాగులు చూసాక, ఎంతోచక్కని తెలుగు రాయగల, తెలుగంటే అభిమానంగల తెలుగువాళ్లు చాలామంది వున్నారని అర్థం అయింది. మీఅభిప్రాయాలు రాసినప్పుడు నాదృష్టిలో వచ్చిన ఈమార్పుని గమనించవలసిందిగా నాకోరిక.

ప్రకటనలు

రచయిత మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s