పలుకు వజ్రపుతునక

రాము పుట్టినరోజు. ఉమ పిల్లాడికి చక్కగా తలంటి పోసి, కొత్తబట్టలు తొడిగి, తీపి తినిపించి, వెళ్లి ఆడుకో అంది.

రాము కదల్లేదు.

వాళ్లు అమెరికా వచ్చి ఆరునెలలయింది. విజయ్‌కి మిల్వాకీలో సాఫ్టువేరు ఇంజినీరుగా ఓ పెద్దకంపెనీలో ఉద్యోగం వచ్చింది. వాళ్లఆఫీసరే ఒక పెద్ద ఎపార్ట్‌మెంట్ కాంప్లెక్సు చూపించి, ఆప్రాంతం పిల్లలకి క్షేమం అనీ, అన్నివిధాలా సౌకర్యం

అనీ చెప్పేడు. వర్తులాకారంలో ఎనిమిది బిల్డింగులున్నాయి ఆకాంప్లెక్లులో. విజయ్‌కీ, ఉమకీ కూడా బాగానే వుందనిపించింది. బిల్డింగులమధ్య ఆటస్థలంలో పిల్లలు ఆడుకోవచ్చు కనక సురక్షితంగా వుంటారు అనుకున్నారిద్దరూను.

ఉమకి హైస్కూలు చదువు అవగానే  పెళ్లి చేసేరు. తీరిచిదిద్దినట్టున్న కన్నూ ముక్కూ తీరు చూసి కోరి చేసుకున్నారు అత్తవారు. సాంప్రదాయకమైన కుటుంబంలో పెరగడంచేతా, చిన్నతనంలోనే అత్తారింటికి వచ్చేయడంచేతా ఉమ అణుకువగా మెలుగుతూ అందరిచేతా అవుననిపించుకుంటూ జరుపుకొచ్చింది దేశంలో వున్నన్నాళ్లూను. అంతేకాక, పుట్టింటా, అత్తింటా కూడా కలకల్లాడుతూ ఇంటినిండా జనమే ఏవేళ చూసినా. అటు పుట్టింట నలుగురు తోబుట్టువులూ, ఇటు అత్తారింట ఆరుగురు – అందరిమధ్యా, ఇంగా ఇరుగుపొరుగులమధ్యా మెసలడంచేత ఏకాంతం అంటే ఏమిటో తెలీకుండా పెరిగింది. రాము పుట్టేవేళకి చిన్నాడబడుచుకి పదకొండేళ్లు. వాళ్లు అమెరికా వచ్చేవరకూ వాడిని ఒక్కక్షణం వదిలేదు కాదా అమ్మాయి.

ఆలాటిది ఇప్పుడు ఇక్కడ రెండుగదుల్లో నాలుగ్గోడలమధ్య షోకయినపంజరంలో పక్షిలా వుంది బతుకు. తనకే ఊపిరాడ్డంలేదు. ఇహ రాముమాట చెప్పాలా? “చిన్నత్తని తీసుకొచ్చేసుకుందాం” అంటాడు అస్తమానం, తల్లిఒళ్లో వాలిపోయి.

“చిన్నత్తని ఇక్కడికి తెచ్చేసుకుందాం,” అన్నాడు రాము. పుట్టినరోజుపూటా వాడికోరిక అది.

“అలాగేలే. తరవాత చూద్దాం. చాలాదూరం కదా. ఇప్పటికి వెళ్లి జానీతో ఆడుకో” అంది ఉమ నెమ్మదిగా.

రాము మాటాడలేదు. ఉన్నచోటునించి కదల్లేదు. అవును మరి. జానీ వాళ్లూ ఇంగ్లీషులో మాటాడతారు. రాముకి ఒకటి, రెండు పొడిముక్కలు పట్టుబడ్డాయి కానీ అవి చాలవు వాళ్లతో మాటాడడానికి.

“పోనీ, పద. సుభానుతో ఆడుకుందువుగానీ,” అంది ఉమ మళ్లీ వాడిని కదల్చడానికి ప్రయత్నిస్తూ.

సుభాను హిందీ మాటాడతాడు. రాముకి అది కాస్త మెరుగు. అయిష్టంగానే బయటికి నడిచేడు.

ఉమ ఆలోచిస్తూ కూచుండిపోయింది, ఈచిక్కు విడేదెప్పుడో అనుకుంటూ.

ఇంతలో ఫోను మోగింది. ఉలికిపడి, లేచి, ఫోను తీసి “హలో” అంది.

“హై” అంది షామియానా అవతల్నించి. ఆవిడ రెసిడెంటు మేనేజరు. అద్దెలు వసూలు చెయ్యడం, ఏవాటాలోనయినా ఫానో, స్టవ్వో పాటయిపోతే పనివాళ్లని పిలిపించి మరామత్తులు చేయించడం ఆవిడఉద్యోగం.

“హై” అంది ఉమ మళ్లీ, ఇంకేం అనాలో తెలీక. ఆవిడపిలుపుకి కారణం తెలీడంలేదు. తాను అద్దె బాకీ లేదు. తమయింట్లో మరమ్మత్తులేవీ లేవు.

షామియానా చెప్పింది, రాము ఒక్కడూ బయట తిరుగుతుంటే చూసిందిట. అలా పిల్లల్ని ఒక్కరినీ బయట, ఆలనా పాలనా లేకుండా వదిలేయరాదని చెప్పడానికి పిలిచింది.

“వాడు కాశ్మీరావాళ్లఇంటికి వెళ్లేడు,” అంది ఉమ.

“లేదు. ఇక్కడ మాయింటిదగ్గర ఒక్కడూ వున్నాడు,” అంది షామియానా.

ఉమ “సరే, నేను వెళ్లి చూస్తాను” అని ఆవిడకి చెప్పి, ఫోను పెట్టేసి, బయల్దేరింది కొడుకుకోసం.

రాము తమ పక్కబిల్డింగుకి కాస్త అవతల గొంతుక్కూర్చుని గడ్డిపూలు చూస్తున్నాడు.

ఉమప్రాణం చివుక్కుమంది. వాడిదగ్గరికి వెళ్లి, నెమ్మదిగా, “ఇక్కడ కూర్చున్నావేం? సుభానుయింటికి వెళ్లలేదా?” అనడిగింది.

వెళ్లేడుట. అక్కడ పిల్లలిద్దరూ దెబ్బలాడుకున్నారు. “నేన్నీతో ఆడను, ఫో” అనేసి రాము వచ్చేశాడు.

“మరి తిన్నగా ఇంటికి వచ్చేయాలి కానీ ఇక్కడ కూర్చోడం ఏమిటి?”

”ఇంటికి తిన్నగానే వస్తున్నాను. ఇదుకో ఈపువ్వులు చూడు. కోసుకోనా?”

ఉమకి చిన్నగా నవ్వొచ్చింది. సరే పద అంటూ ఇంటికి తీసుకొచ్చింది.

తల బద్దలయిపోతోంది. కాఫీ పెట్టుకుందాం అని ఫ్రిజ్‌లో చూస్తే పాలు లేవు. పొద్దున్న విజయ్‌తో చెప్పింది. అతను రాత్రి వచ్చేటప్పుడు తెస్తానని చెప్పేడు. కానీ అతను ఏరోజూ తొమ్మిదిలోపున రాలేదు ఇంటికి.

ఒక్కక్షణం ఆలోచించి, “పోనీ, నేనే వెళ్లి తెచ్చేసుకుంటే పోలే” అనుకుంది. ఇంటివెనకనించి అడ్డదారంట వీధిచివరనున్న స్టోరుకి వెళ్తే పావుగంట కూడా పట్టదు.

రాము బయట పిల్లలతో సైకిలు తొక్కుకుంటున్నాడు. కాని మేనేజరుమాట గుర్తుకొచ్చింది. ఇప్పటికే ఆవిడ నాలుగుమార్లు హెచ్చరించింది. తనకి అది మహ చిరాగ్గా వుంటోంది. తను ఇంట్లో వున్నప్పుడు కూడా “అన్‌సూపర్వైజుడు” అంటూ ఒకటే సొద. అయిదేళ్లపిల్లాడు ఉరుకులూ పరుగులే కానీ తల్లికొంగు పట్టుకుకూర్చుంటాడా? అయినా ఎంతమంది పిల్లలు బయట ఆడుకోడంలేదు? వాళ్లతల్లులేరీ? వాళ్లని ఈ మేనేజరు మహాతల్లి ఇలాగే సతాయిస్తోందా? ఉమకి ఇదంతా గందరగోళంగా వుంది. ఎవరిని ఏమని అడగాలో తెలీడంలేదు. ఆవిడతో ఎందుకొచ్చినపేచీలే అనుకుని, రాముని పిలిచింది స్టోరుకి వెళ్దాం రమ్మని.

“నేను రాను” అన్నాడు వాడు.

“కాండీబారు కొనిపెడతా, రా.”

“నేన్రాను. నువ్వే తీసుకురా.”

ఉమకి అసలే తలనొప్పిగా వుందేమో, వాడితో వాదించే ఓపికలేక, సరే పదినిముషాల్లో వచ్చేస్తాను కదా అనుకుంటూ గబగబా అడుగులేయసాగింది.

తిరిగొచ్చి, పాలూ నీళ్లూ కలిపి కఫ్పులో పోసి మైక్రోవేవులో పెట్టబోతుంటే మళ్లీ ఫోను.

“హలో.”

“ఇందాకా రాముని చూశాను. నువ్వెక్కడున్నావని అడిగితే తెలీదన్నాడు,” అంది షామియానా.

ఈవిడకి మరీ అంత క్షణాలమీద ఈవార్త ఎలా తెలిసిందో అర్థం కాలేదు. “వాడికి తెలుసు. నేను చెప్పే వెళ్లేను,” అంది ఉమ నీరసంగా.

“ఏమో మరి. వాడు తెలీదన్నాడు.”

ఉమ మరోసారి ఏవో జవాబులు చెప్పుకుని, ఫోను పెట్టేసింది. రాము ఆట ముగించి ఇంటికొచ్చేడు. ఉమ వాడిని దగ్గరికి పిలిచి, “నీతో ఎవరైనా మాటాడేరా?” అనడిగింది.

“హాఁ” అన్నాడు వాడు బుజాలు ఎగరేసి. టీవీ పెట్టుకుంటూ. వాడికి ఆప్రశ్న అనవసరంగా తోచింది. ఆచుట్టుపక్కల చాలామంది తల్లులకి రాము అంటే ముచ్చట. తల్లినుండి పుణికిపుచ్చుకున్న విశాలమయిన కళ్లూ, పాలబుగ్గలూ, బొద్దుగా ముద్దొస్తూ వుంటాడు. ఆంచే దారినపోయే ఆడవాళ్లు ఆగి వాడినోమారు పలకరించి, కదాచితుగా ఓ చాక్లెటు చేతిలో పెడుతుంటారు. అంచేత ఎవరైనా మాటాడేరా అంటే మాటాడేరనే అంటాడు. తల్లిప్రశ్నలో అంతరార్థం తెలుసుకునేవయసు కాదుకదా వాడిది. ఉమకి కూడా వాడిని గుచ్చిగుచ్చి అడగాలనిపించలేదు.

ఉమకి రాను రాను మేనేజరువరస మహాసంకటంగా వుంటోంది. అక్కడికీ విజయ్‌తో చెప్పింది. తన ఖర్మకాలి, ఆ చెప్పినసందర్భంలో మాత్రం తనదే తప్పు. వాడిని ఒక్కణ్ణీ వదిలేసి బజారుకెందుకెళ్లేవూ అంటూ అతను తననే కేకలేశాడు. పైగా ఈదేశంలో ఆచారాలు, పద్ధతులు వేరు. మనజాగ్రత్తలో మనం ఉండాలి అంటూ సుద్దులు బోధించేడు.

ఉమ “అది కాదు. నాపిల్లాడిమంచిచెడ్డలు నాకు తెలీవా? నేను అంత నిర్లక్ష్యం చేస్తున్నానా?” అంటూ ఎంత మొత్తుకున్నా వినేనాథుడు లేకపోయాడు.

రాము మధ్యాహ్నం కిండర్‌గార్టెన్‌నించి వచ్చి టీవీలో కార్టూనులు చూస్తున్నాడు.

ఉమ మాసినబట్టలు సంచీలో వేసుకుని పక్కబిల్డింగులో లాండ్రీ చేసుకోడానికి వెళ్లింది. వాళ్లవరసలో మూడు బిల్డింగులమధ్య వున్నబిల్డింగులో వాషర్లూ, డ్రయర్లూ వున్నాయి. రాముకి గట్టిగా చెప్పింది ఫోను తియ్యొద్దనీ, తలుపు తియ్యొద్దనీ,

బట్టలు వాషింగ్‌మెషీనులో పడేసి, రాగానే రాముని అడిగింది ఎవరైనా వచ్చేరా అని.

లేదన్నాడు వాడు.

ఉమకి తనమీద తనకే చిరాకేసింది. తనెందుకు వీళ్లకి భయపడ్డం? తల్లిగా తనబాధ్యతేమిటో తనకి తెలీదా? వీళ్లెవరు తనకి పాఠాలు చెప్పడానికి? ఆవిడ అలా ఆలోచనల్లో వుండగానే, తలుపు తట్టినచప్పుడు అయింది. వచ్చే అంటూ లేచి, తలుపు తీసి చూస్తే, ఎదురుగా మేనేజరు నిలబడి వుంది.

తనని చూస్తూనే, “ఓ, నువ్వు ఇంట్లో లేవనుకున్నాను,” అంది మేనేజరు ఒకడుగు వెనక్కేసి.

“ఎందుకనుకున్నావు లేనని?” ఉమ విస్తుపోయింది.

“కాటరీనా చెప్పింది. ఆవిడ వచ్చి, మీఅమ్మ ఏదీ అని అడిగితే, రాము తెలీదన్నాడుట.”

ఉమకి ఒళ్లు భగ్గున మండింది. “కాటరీనా ఎవరు?”

“ఎదురుబిల్డింగులో వుంటుంది. నువ్వు చూసే వుంటావు. తెల్లగా, పొడుగ్గా వుంటుంది. ఆవిడే.”

“ఆవిడకేంపని ఇక్కడికి రావడానికి?”

“ఏమో, నాకేంతెలుసు? నీస్నేహితురాలనుకున్నాను. రాముని ఒంటరిగా వదిలేసి వెళ్లకు. ఆవిడ కనక సరిపోయింది. ఏదొంగో అయితే ఏంకాను? నీక్కావలిస్తే, మనబిల్డింగులోనే బేబీసిట్టర్లున్నారు,” అనేసి గబగబా వెళ్లిపోయింది మేనేజరు ఉమ జవాబు చెప్పేలోపున. అసలు తను జవాబు చెప్పేస్థితిలో లేదు.

మర్నాడు ఉమ రాముని కిండర్‌గార్టెన్‌లో వదిలేసి, బస్టాండులో నిలబడింది లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోడానికి.

నిన్నటిసంఘటన ఇంకా ఎదలో ముల్లై బాధిస్తూనే వుంది. ఎంత దులుపుకుతిరుగుదాం అనుకున్నా తనవల్ల కావడంలేదు.

“హలో” అన్న మాట వినిపించి అటు తిరిగి చూస్తే పాలా చిరునవ్వుతో కనిపించింది, ఆవిడభర్త కూడా విజయ్ పనిచేసే కంపెనీలోనే పని చేస్తాడు.

ఉమకి క్షణకాలం పట్టింది ఆవిడని గుర్తు పట్టడానికి. హలో అంది ఆలోచిస్తూనే. వాళ్లు వచ్చినకొత్తలో ఎప్పుడో ఒకసారి కంపెనీపిక్నిక్‌లో కలిశారు. పాలా ఒకసారి ఇండియా వెళ్లిందిట. అంచేత ఆవిడకి ఇండియా అన్నా ఇండియనులన్నా మాచెడ్డ అభిమానం.

“బావున్నావా?” అంది పాలా.

“బాగానే వున్నాను,” అంది ఉమ నిరామయంగా.

పాలాకి నమ్మకం కుదరలేదు. ఉమమొహంలోకి తేరి చూస్తూ, “ఆర్యూ ఓకే?” అనడిగింది కంసర్న్‌తో.

ఉమ లోలోపల ఉడికిపోతోందేమో. “నో, ఐయాం నాటోకే.” అంది

వాళ్లెక్కవలసిన బస్సొచ్చింది. ఉమ ఎక్కేవరకూ ఆగి, పాలా కూడా ఎక్కి తనపక్కనే కూర్చుంది. ఉమ ఎందుకో మనసులో మథనపడుతోంది అన్నది స్పష్టమే. ఏవిధంగానేనా ఆమెని ఓదార్చాలని వుంది పాలాకి. తనని తొలిసారిగా పిక్నిక్‌లో చూసినప్పుడే మంచి ఆభిప్రాయం ఏర్పడిపోయింది ఆవిడకి.

“ఏమయింది?” అనడిగింది చనువుగా.

ఆఒక్కమాటతో ఇంతవరకూ ఆచిపట్టుకున్న బాధంతా వెల్లువలా పెల్లుబికింది, “మనరెసిడెంటు మేనేజరు. ఆవిడకి నేనంటే ఏదో కక్షలా వుంది,” అంది చిరాగ్గా.

“ఏమంటుంది?”

“నేనేదో పిల్లాడిని గాలికొదిలేసి ఊరంట బలాదూర్ తిరుగుతున్నట్టు ఒకటే నస. అయిదేళ్ల పిల్లాడు ఆ వున్న ఒక్కగదిలోనూ నామొహం చూస్తూ ఎంతసేపు కూర్చోగలడు మీరే చెప్పండి. బయట ఆడుకుంటుంటే సూపర్విజను లేదంటూ ఒకటే పోరు ఆవిడ. నాకిక్కడ అత్తా ఆడబిడ్డలూ లేని సరదా తీరిపోతోంది,” అంది ఉమ విసురుగా.

“ఏంటీ?” పాలాకి అర్థం కాలేదు.

ఉమకి నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుతూ, “వాడు పదిమంది మధ్య పెరిగాడు. మాది పెద్దకుటుంబం. ఇరవైనాలుగ్గంటలూ వాడెక్కడున్నాడో అనుకుంటూ నేనొక్కదాన్నే ఆరాటపడాల్సిన అవుసరం వుండేది కాదు మాకక్కడ. బావమరుదులపిల్లలూ, మా అన్నదమ్ములపిల్లలే కాక, ఇరుగూ పొరుగూ కూడా ఇంట్లో పిల్లల్లాగే మసుల్తారు రోజంతా. ఎవరెక్కడుంటే అక్కడే తినేస్తారు. మాకు పట్టింపుల్లేవు. ఇక్కడికొచ్చేక, ఒక్కసారి పరిస్థితి మారిపోవడంతో నాకే అయోమయంగా వుంది. పసివాడికెలా వుంటుందో ఊహించుకోండి. నాపిల్లవాడి మంచిచెడ్డలు నాకు తెలీవా? ఈవిడ చెప్పేదేమిటి?”

పాలాకి తెలుగుదేశం, ఉమ్మడికుటుంబాలగురించి కొంతవరకూ తెలుసు. ఆవిడ ఆంధ్రదేశంలో ఆరునెలలు ఉండి చాలా విషయాలే గమనించింది.

“ఆవిడతో మాటాడి చూడరాదూ?” అంది సలహాగా.

“ఏం చెప్పను? చెప్పినా వినేట్టు కనిపించడంలేదు. ఎంతసేపూ ఏవో ఇక్కడిరూల్సే మాటాడుతుంది. నిన్నటికి నిన్న లాండ్రీ చేసుకోడానికి పక్కబిల్డింగుకి వెళ్లాను. రాము ఇంట్లో టీవీ చూస్తున్నాడు. తను వచ్చి చూసిందిట. మీఅమ్మ ఏదీ అంటే వాడు జవాబు చెప్పలేదుట. లాండ్రీకీ, బాత్రూంకి వెళ్లడానికీ కూడా నాకు ఈవిడఅనుమతి కావాలాయేం?”

“అది హెరాస్మంట్,” అంది పాలా.

ఉమకి ఆమాట కఠినంగా వినిపించింది. “హెరాస్మెంటు అని కాదుగానీ…” అంది మాట సాగదీస్తూ. ఆవిడ తనమీద పడి కొట్టడం, తిట్టడం చెయ్యలేదు కదా.

కాని ఇక్కడ  కొట్టడం, తిట్టడంలో వున్ననాజూకుతనం ఈఅమ్మాయికి ఇంకా అర్థంకాలేదు అనుకుంది పాలా ఉమని అనునయంగా చూస్తూ, ఎందుకంటే, ఈదేశంలో “నువ్వు చవటవి” అనరీదేశంలో. “వేరొకరు మిమ్మల్ని చవటగా గుర్తించడానికి అవకాశం వుంది” అంటారు డొంకతిరుగుడుగా.

ఉమ రెండునిముషాలు ఊరుకుని, మళ్లీ మొదలెట్టింది, “నాలుగురోజులకిందట నాస్నేహితురాలు మీనాని పిలిచి, రాము ఒక్కడూ ఎక్కడయినా కనిపిస్తే తనకి చెప్పమని చెప్పిందిట మనమేనేజరు. అది చాలనట్టు ఆకాటరీనా ఒక్కర్తీ.”

“కాటరీనా ఎవరు?”

“మాఎదురుబిల్డింగులో వుందిట. ఎప్పుడేనా కనిపిస్తుంది. ఇద్దరుపిల్లల్ని బేబీసిట్ చేస్తుంది.”

“ఆవిడేమంటుంది?”

“ఇదే సోది. రాము వాళ్లింటికి వెళ్లేడుట. మీఅమ్మ ఏంచేస్తోందంటే తెలీదన్నాడుట. ఆఅడగడంసొంపు చూడండి. ఎక్కడుందంటే ఇంట్లో వుందంటాడు. ఏంచేస్తోందంటే ఏమో అంటాడు కదా.”

ఆవిడ మరో బేబీసిటింగ్‌‌కోసం చూస్తోందేమో అనుకుంది పాలా. “అది హెరాస్మెంటే,” అంది.

బస్సు ఆగింది. పాలా లేస్తూ, “నాస్టాపు ఇదే. టేక్ కేర్. ఆరెసిడెంటుమేనేజరుతో మాటాడు” అంది, ఉమభుజంమీద నెమ్మదిగా తట్టి.

ఉమ ఆలోచనలో పడింది. అన్నయ్యకాలేజీలో విద్యార్థులు ఒకరినొకరు ఏడిపించుకునేవారు. ఒకొక్కప్పుడు దురంతాలకి కూడా దిగేవారు. తనకి తెలిసినంతవరకూ అదీ హెరాస్మెంటు. కానీ ఇక్కడ హెరాస్మెంటు ఒక సాంఘికన్యాయానికి సంబంధించినవిషయంలా వుంది. పాలా మాటలు విన్నతరవాత. ఇంతకుముందు ఒకసారి మీనా కూడా అదే అంది. ఆవిడ ఈదేశం వచ్చి ఎనిమిదేళ్లయింది. స్థానిక నుడికారం ఆవిడకి బాగానే పట్టుబడింది. “I don’t know why but she is on your case. I’d give her a piece of my mind, if I were you,” అంది కనుబొమలు ముడిచి.

ఉమ ఇంటికి వచ్చిందే కానీ మనసు మనసులో లేదు. ఇదేదో తాడో పేడో తేల్చుకునేవరకూ తనకి మనశ్శాంతి లేదు. ఆమేనేజరు మహాతల్లికి “ఎ పీసాఫ్ మైండి”చ్చుకుంటే తప్ప దారిలోకి వచ్చేలా లేదు. ఉమ విసురుగా లేచి, రాముని మీనావాళ్లింట్లో వదిలేసి, తిన్నగా షామియానాదగ్గరికి వెళ్లింది. ఆవిడ చిప్పులు నవుల్తూ,, ఏవో కాయితాలు చూసుకుంటోంది. ఉమని చూసి, హాయ్ అంది చిరునవ్వుతో.

“నేన్నీతో మాటాడాలి,”

“నేనిప్పుడు పనిలో వున్నాను. రేపు మాటాడుకుందాం.”

“ఇప్పుడే మాటాడాలి”

“ఏవిషయం?”

“రామువిషయమే. నువ్వు వాడితో మాటాడొద్దు. వాడిని నానాప్రశ్నలు వెయ్యడానికి వీల్లేదు. నీకేమయినా అడగాలనుంటే నన్నడుగు. అంతేగానీ వాడికి నీడొంకతిరుగుడు ప్రశ్నలన్నీ అర్థంచేసుకునే వయసులేదు. వాడికేం తెలుస్తుంది?”

చివరిప్రశ్నతో షామియానా ఉలికిపడింది, “ఏంటి నువ్వంటున్నది?”

“మాఅబ్బాయికి ఇంగ్లీషు బాగా రాదు. అందుచేత వాడినేమీ అడగొద్దు అంటున్నాను. నీవరస చూస్తుంటే హెరాస్మంట్‌లా వుంది,”

షామియానా ఒక్క ఉదుటున ఎగిరిపడి, కుర్చీలో నిటారుగా కూర్చుని, “ఓహ్, నో, నో. హెరాస్మెంటేమిటి, అదేంలేదు. నేను నీమంచికోసమే చెప్తున్నాను. నీకు ఈదేశం కొత్తకదా. ఇక్కడిరూల్సు నీకు తెలీవని చెప్పేనంతే. Good Samaritan law లేదూ. అలాటిదే,” అంది గబగబా.

ఆవిడమొహం కళలు తప్పడం ఉమ స్పష్టంగా చూసింది కానీ ఆ “లా” ఏమిటో తెలీదు. అలా అని వదిలేయడానికి ఇది సమయం కాదు. “వాట్ లా? సరే. పద. పోలీసుస్టేషనుకి వెళ్లి అదేదో తేల్చేసుకుందాం. తగువు తీరిపోతుంది,” అంది ఉమ దబాయింపుగా.

“నో, నో. పోలీసులమాటెందుకూ ఇప్పుడు? ఇందులో హెరాస్మెంటు ఏమీ లేదు.”

“ఏమో మరి. నాప్రాణానికి హెరాస్మెంటులాగే వుంది,” అంది ఉమ హుందాగా వెనుదిరిగి.

రాత్రి విజయ్ రాగానే చెప్పాలనుకుంది కానీ అతను చాలా ఆలస్యంగా వచ్చేడు.

మర్నాడు ఉదయం విజయ్ లేచి, ఆఫీసుకి వెళ్లడానికి తలుపు తీశాడు. తలుపుమీద ఒకకాయితం కనిపించింది ఉమపేరుతో. ఇదేమిటో అనుకుంటూ తీసి తనకిచ్చేడు.

తను విప్పి చూస్తూ షామియానా అంది.

“ఏమంటుంది?”

ఉమ అతనికి చదివి వినిపించింది.

డియర్ ఉమా,

నిన్ను బాధపెట్టడం నావుద్దేశం కాదు. ఇది కేవలం ఒక మిసండర్‌స్టాండింగ్. నువ్వు పొరపాటు అర్థం చేసుకున్నావు. అసలు నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు మారూలులు తెలియచెప్పాలని చాలా తాపత్రయపడ్డాను. గుడ్ సమరిటన్‌లాటిదే ఇది కూడా. దయచేసి, జరిగిందంతా మరిచిపోవలసిందిగా కోరుతున్నాను,

  • షామియానా.

విజయ్‌కి అర్థం కాలేదు. “అసలేమయింది?” అన్నాడు మళ్లీ మొదటికొస్తూ.

ముందురోజు జరిగినభాగోతం అతనికి వినిపించింది.

“గుడ్ సమరిటన్ లా ఏమిటి?”

“ఏమో, ఓనిముషం ఆగితే అదీ చెప్తాను,” అంది ఉమ చిరనవ్వుతో కంప్యూటరుముందు కూర్చుని.

రెండునిముషాల్లో అది కూడా అర్థమయింది. ఆ గుడ్ సమరిటాన్ లా తనకి వర్తించదసలు. అది డాక్టర్లు విపత్కరపరిస్థితుల్లో ఇచ్చిన ట్రీట్‌మెంటు సరిగ్గా చెయ్యలేదంటూ ఆ పేషంటు ఆడాక్టరుని కోర్టుకి ఈడ్చడానికి వీలులేకుండా చేసిన చట్టం అది. షామియానా తనఅజ్ఞానాన్ని మరొకసారి వాడుకోడానికి ప్రయత్నించింది. స్థానికవిషయపరిజ్ఞానానికున్న బలం ఇదీ అనుకుంది ఉమ.

అయితే, షామియానా తనమీద ఎందుకలా నల్లేరుమీద బండిలా విరుచుకుపడుతోంది అన్నసంగతి అర్థం కాలేదు. కాటరీనాకి మరొక బేబీసిటింగ్ కుదర్చడానికా? కేవలం వాగాడంబరంతో తన ఆధిక్యం ప్రదర్శించుకోడానికా? తను కూడా మరోదేశంనించి వచ్చిందే కనుక ఎవరిమీదో తీర్చుకోలేనికక్ష తనమీద తీర్చుకుంటోందా? – ఎక్కడో తంతే ఏవో రాలినట్టు!

ఇలాటి మనస్తత్త్వాలకి ఏదో పేరు పెట్టి వివరణలివ్వగల మహాపండితులు కూడా ఎక్కడో వుండేవుంటారు.

తనకి మాత్రం షామియానాలాటివారిని “లైనులో పెట్టగల”నాలుగు ముక్కలు నేర్చుకోవలసినఅవుసరం అర్జెంటుగా కనిపిస్తోంది.

చిన్నప్పుడు అమ్మ తన్నిగురించి అంటూండేది, “నోట్లో నాలుకలేదు. ఎలా బతుకుతుందో” అని. అవసరాన్నిబట్టి నాలుక అదే మొలుస్తుంది అనుకుంది తృప్తిగా నవ్వుకుంటూ.

(జనవరి 2005)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s