గుడ్డిగవ్వ

చెరువ్వొడ్డున ఇసకలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్న ముత్యం కళ్ళు తళుక్కుమన్నాయి. ఎదుట గజందూరంలో సమాధినిష్ఠలో ఉన్నట్టో సన్ బేదింగ్ చేస్తున్నట్టో కనిపిస్తున్న గవ్వని చూడగానే. రెండు నెలవంకల నడుమ సాగిలపడిన జెర్రిపోతులాటి సన్నని నల్లని నెర కనిపిస్తూ అతనికన్నునాకట్టుకుంది చిన్నదే అయినా. చుట్టూ పరుచుకున్న ఇసకరేణువులు ఎండకి మెరుస్తూ ఓ వింత శోభని వెచ్చిపెట్టేయి ఆ గవ్వకి. ముత్యం చూస్తూ నిలబడిపోయేడు కొంతసేపు. అక్డే వదిలేస్తే మరో పసివాడి మనసుని ఉల్లాసపరుచునేమో …

ముత్యం వంగి దాన్ని చేతిలోకి తీసుకుని ఎత్తి పట్టుకుని కళ్ళు చిట్లించి చూసేడు. అడుగున ఆవగింజంత కన్నంలోంచి ఇసకరేణువులు పొడగట్టేయి అతడికంటికి. అది అలా చేత్తో పుచ్చుకునే మరో పదడుగులు వేసేడు. మరుక్షణంలో అతడికి దానిమీద ఎక్కళ్ళేని విసుగూ వచ్చింది. ఒంట్లో బలాన్నంతా కూడగట్టుకుని వీలయినంత మేర నీటిలోకి విసిరి కొట్టేడు. అతను వాళ్ళపల్లెలో ఉన్నప్పుడు అలా చేసేవాడు. గులకరాళ్ళని ఏటవాలుగా ఒంగి ఒడుపుగా నీటిలోకి విసిరేవాడు. ఓమోస్తరు పలకలు దేరిన రాయి అయితే నీటిమీద రెండు కప్పగంతులేసి ములిగిపోతుంది. కానీ ఈరోజు ముత్యం విసిరిన గుడ్డిగవ్వకి చిల్లుండడంవల్ల బుడుంగుమని పడ్డచోటనే ములిగిపోయింది.

000

లోపల వనజ వంటింట్లో కూరలూ, గిన్నెలూ, పప్పులూ, ఉప్పులూ కౌంటరుమీద అమర్చుతోంది. మరోగంటలో స్నేహబృందం దిగుతుంది. గిరిబాబుకి ఇంటరులో ఇంగ్లీషుపాఠాలు చెప్పిన శేఖరం వాళ్ళ అమ్మా, నాన్నలకి దేశం చూపించడానికి కార్లో బయల్దేరేడు. దూరప్రయాణాలకి ప్లేనెక్కినా, శేఖరం వీలయినంతవరకూ కారులో తిరగడానికే ఎక్కువ ఇష్టపడతాడు దారిలో అవసరం అయినప్పుడు ఆగొచ్చని. అంచేత ఓంప్రథమంగా తల్లిదండ్రులని తీసుకుని దగ్గర ఊళ్ళు చూపించడానికి కారులో బయల్దేరేడు.

మధ్యాహ్నం పన్నెండయింది. గిరికి ఆఫీసు అట్టే దూరం కాదు. రోజూ కాకపోయినా అవసరం అయినప్పుడు లంచికి రాగల దూరమే. ఇవాళ స్నేహితులు వస్తున్నారు కనక అతను కూడ లంచివేళకి ఇంటికొచ్చేడు. అతను తలుపుదగ్గరకి వచ్చే సమయానికే శేఖరం కారు ఇంటిముందు ఆగింది. గిరి నవ్వుతూ రెండడుగులు అటేసే నిలుచున్నాడు వాళ్ళందరూ కారు దిగేవరకూ.

శేఖరం కారాపి, దిగి తల్లిదండ్రులకి తలుపు తీసి పట్టుకుని, ఆ తరవాత ట్రంకు తీసేడు సూట్‌కేసులు తీయబోతుంటే గిరి దగ్గరికి వచ్చేడు. మప్పితంగా పెద్దలకి నమస్కారాలు చెప్పి, “మీరు పదండి, నేను తెస్తాను సామాను,” అంటూ శేఖరానికి అడ్డు పడ్డాడు. అంటే నిజంగా అతనే తెస్తాడని కాదు. కళ్ళతోనే ముత్యానికి సౌంజ్ఞ చేసేడు కళ్ళతోనే.

శేఖరం మొహమాటపడుతూనే చేతిలో పెట్టెలు వదిలేసి గిరిని అనుసరించేడు. ఆ వెనక సోమయ్యగారూ, కోటమ్మగారూ నెమ్మదిగా నడిచేరు అటూ ఇటూ ఉన్న పూలమొక్కలు చూస్తూ. తలుపుదగ్గర వనజా, బాబీ నిలబడ్డారు స్వాగతం చెపుతూ.

ముత్యం కారుదగ్గరికి వెళ్ళి మొత్తం మూడు రెళ్ళు ఆరు పెట్టెలూ ఒకొకటే లోపలికి తీసుకొచ్చి రెండో అంతస్థులో అతిథులగదిలో పెట్టేడు. తరవాత వంటింట్లోకి వెళ్ళి కాఫీలు తెచ్చేడు అందరికీ.

గిరి ఇబ్బందిగా చూస్తూ, “కూచో, నీ కాఫీ ఏదీ?”అన్నాడు కానీ ముత్యం కూచోలేదు. పనుందన్నట్టు తలతో అటు చూపి వెళ్ళిపోయేడు లోపలికి.

కోటమ్మ సాయం చేయనా అంటూ వంటగదిలోకెళ్ళింది కానీ అక్కడ ఆవిడకి చేసేదేం కనిపించలేదు.

ముత్యం కరివేపాకు రెమ్మలు వనజకిచ్చి, అక్కడే నిలబడ్డాడు. ఆవిడ నాలుగు వంకాయలు, కూరలు తరుక్కునే కత్తీ అతనిముందు పడేసింది. అతను తలొంచుకుని వంకాయలు తరగసాగేడు.

కోటమ్మ వాళ్ళిద్దర్నీ చూస్తూ గతం తలబోసుకోసాగింది, “ఏమిటో కాలం. చూస్తే నాలుగుతరాలు గడిచిపోయినట్టుంది. నిన్నా, మొన్నా ఇంటినిండా గలగల్లాడుతో పదిమందిమి ఆడవాళ్లం తిరిగేవాళ్ళం ఎప్పుడు చూసినా. ఒకరికొకరు పనులు పురమాయించుకోటాలు లేవు. ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరికీ చేతినిండా పనే. ఏ రోజు చూసినా ఇల్లు సత్తరవులా ఉండేది వచ్చేవాళ్లూ పోయేవాళ్లతో. మాతాత అసలు సహపంక్తిన రెండోవిస్తరి లేకుండా అన్నానికి కూచునేవాడే కాదు.”

వనజ నవ్వుతూ వింటోంది. ఇండియానించి వచ్చినవాళ్ళకి రెండే విషయాలుంటాయి మాటాడ్డానికి. అయితే ఇక్కడున్న సౌఖ్యాలూ లేకపోతే అక్కడ ఆరిపోతున్న సంప్రదాయాలూను.

ముత్యం తరిగినకూర ముక్కలు మరోసారి నీళ్ళతో కడిగి, వదినగారికిచ్చి, సింకులో పడేసిన గిన్నెలు కడగడం మొదలుపెట్టేడు. ముత్యం వచ్చి ఏడాదయింది. ఈ ఏడాదిలోనూ ఇలాటి కథలు ొన్ని వందలసార్లు విన్నాడు. నలుగురు చేరినప్పుడల్లా ఇవే కబుర్లు.

ముందుగదిలో శేఖరంతండ్రి సోమయ్య అటూ ఇటూ చూసి లేవబోతుంటే, గిరి గమనించి, “ఏం కావాలండీ?” అనడిగేడు.

“ఏంలేదు బాబూ, కొంచెం మంచినీళ్ళు … నేను తెచ్చుకుంటాలే,” అన్నారు సోమయ్య.

“మీరు కూచోండి, నే తెస్తా,” అని ముత్యాన్ని కేకేశాడతను.

ముత్యం మంచినీళ్ళు తెచ్చి ఆటనకి అందిచ్చి లోపలికెళ్ళిపోయేడు. గిన్నెలు కడగడం అయిపోయనతరవాత బాబీ పక్కన కూచున్నాడు. బాబీ లెక్కలు చేసుకుంటున్నాడు. తనకి తెలీనివి ముత్యాన్ని అడుగుతున్నాడు.

“పిల్లాడిచదువులో కూడా సాయం చేస్తున్నాడే. మంచి అబ్బాయినే సంపాయించారు. ఈరోజుల్లో మనూర్ల అసలు ఒళ్ళొంచి పని చేసే పాలేర్లు కనిపించట్లేదసలు,”అంది కోటమ్మ.

వనజ ఉలిక్కిపడి, “అయ్యయ్యో పాలేరు కాదండీ. మా మరిది. రెండేళ్ళక్రితం జబ్బు పడ్డాడు, గొంతు పూడుకుపోయింది. ఇక్కడ ఆపరేషమను చేయించడానికి తీసుకొచ్చేం,” అంది గబగబా.

కోటమ్మ వదిలిపెట్టలేదు. “మరి ఆపరేషను అయిందా?”

వనజకి మహా సంకటం అయిపోయింది ఏ వంకా చుట్టం కాని ఈవిడకి తను సమాధానం చెప్పుకోవలసిరావడం!

“ఏదీ ఎప్పటికప్పుడు అలానే అయిపోతోందండీ. ఆదిని డాక్టర్లతో సంప్రదింపులూ, పరీక్షలతోనే ఆర్నెల్లు అయిపోయింది. ఇంతలో మా చెల్లెలిపెళ్ళి వచ్చిపడింది. కట్నం కాదు ఖర్చులకంటూ పెళ్ళికొడుకువాళ్ళు పట్టు పడుతున్నారని మానాన్న ఉత్తరాలమీద ఉత్తరాలు గుప్పించేరు. మాదగ్గర లేదంటే నిష్ఠూరం. అదయేసరికి ఇంటిరిపేర్లు. ఏటిఒడ్డున ప్రశాంతంగా ఉంటుందని ఈ ఇల్లు కొన్నాం. గట్టిగా నాలుగు వానలు పడేసరికి నీళ్ళు ఇంట్లోకొచ్చేస్తున్నాయి. పునాదులు కూరుకపోతున్నాయి. ఈ వేసవిలోనైనా అవుతందేమో చూడాలి,” అంది వనజ గుక్క తిప్పుకోకుండా.

కోటమ్మకి నేననడిగింది అది కాదు అనాలనిపించలేదు. మాటాడక ఊరుకొంది. చాలామంది అంతే. మనం ఒకటడిగితే వారొకటి చెబుతారు. వారికారణాలు వారికుంటాయి అలా చెప్పడానికి మరి.

పక్కగదిలో గిరిబాబు మాటలు వినిపిస్తున్నాయి, “ఏమిటో మాస్టారూ, ఇక్కడ ఇన్ని కబుర్లు చెబుతారు కానీ నిజంగా మనిషికి కాదు వీళ్ళు విలువనిచ్చేది. Time is money అంటారు గానీ వాళ్ళటైముకే ఎక్కువ విలువ. మనం ఎంత చేసినా ఇంకా ఇంకా చేయించుకోవాలనే చూస్తారు. మీరు విన్నారో లేదో కానీ మనం రెండింతలు పని చేస్తే వాళ్ళు తమవారికి ఇచ్చేదాన్నో సగం చేత బెడతారు. అది కూడా అక్కడికేదో మననుద్ధరిస్తున్నట్టు పోజు పెడుతూ.”

“విలువలు వేరూ, బజారుధరలు వేరూను,” అన్నారు సోమయ్యగారు నవ్వుతూ. అవును మరి. అవతలిమనిషి ఎదటివాడి సామర్థ్యం కాదు చూసేది. ఆ సామర్థ్యం తనకెంత ఉపయోగపడుతుంది అన్నదాన్ని బట్టే విలువ కట్టడం. ఎవరిమటుకు వారికి వాళ్ళ ధనంమాత్రమే ఘనంగా కనిపిస్తుంది కానీ తాను ఎదటివాడి శ్రమకి వినులు కడుతున్నాననుకోడి.

వనజ వచ్చింద భోజనాలకి లేవండంటూ.

ముత్యం బల్లమీద కంచాలూ, గ్లాసులూ అమర్చేడు. ఎనిమిదిమందికి సరిపోయే బల్ల. అందరూ కూర్చున్నారు. బాబీపక్కన ముత్యం కూర్చున్నాడు.

గిరి మళ్ళీ మొదలు పెట్టేడు, “మనవాళ్ళందరూ మేం ఇక్కడ బోలెడు డాలర్లు సంపాదించేస్తున్నాం అనుకుంటారు కానీ ఎంత కష్టపడితే వస్తాయవి. మనవాళ్ళన్నట్టు అవేం చెట్టున కాయవు కదా. అసలు చదువు పూర్తయేసరేకే ఆస్తులు హరించుకుపోయేయి. ఎలాగో అయిందనిపించేం కానీ ఉద్యోగంలో చేరేక తెలిసింది నిజంగా కాయకష్టానికున్న విలువ. రోజుకి ణుప్ఫై గంటలు గిలగిల్లాడినా ఎప్పుడు ఏ కష్టమరు ఏ కష్టాల్లో ఇరికిస్తాడోనన్న బెదురే. ఏ కంపెనీ ఎప్పుడు మూతపడుతుందో, ఎప్పుడేం పుట్టి ములుగుతుందో అనుకుంటూ అనుక్షణమూ బెంగే. ఇవాళున్న ఉజ్జోగం రేపుంటుందన్న భరోసా లేదు. ఇంత కష్టపడి సంపాదించిన సంపాదనమీద ఇంటిల్లిపాదీ ఆశలు పెట్టుకుంటారు కదా. ఈమధ్య మాస్నేహితుడొకడు – మా ఆఫీసులోనే ఉంటాడు – దాదాపు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. తమ్ముళ్ళ చదువులూ, చెల్లెళ్ళకి చదువుల్తోపాటు పెళ్ళిళ్ళూ, – వీటితో ఆరిపోతున్నానని. పైగా వాళ్ళ మేనమామ ఎప్పుడో వాళ్ళమ్మ పెళ్ళికి పదివేలు అప్పు చేశాట్ట అది ఇప్పటికీ దెప్పుతూనే ఉంటాట్ట. ‘ఎన్నిమార్లు తీర్చేనో చెప్పలేను ఆ పదివేలూను. ఆయనో నేనో హరీమనేవరకూ తీరేలా లేదది’ అన్నాడు,” అంటూ నవ్వేడు గిరి. ఎంచేతో గానీ పొరుగువాడిబాధలంత చక్కని సబ్జెక్టు దొరకదు కాలక్షేపం కబుర్లకి.

“టైము చూసుకో,” అంది వనజ హెచ్చరికగా.

అతను గతుక్కుమని వాచీ చూసుకుని, గబగబ నాలుగు మెతుకులు కతికి, “సాయంత్రం మాటాడుకుందాం. మీరు పడుకోండి కొంచెంసేపు,” అని చెప్పేసి వెళ్ళిపోయేడు.

సాయంత్రం గిరి కొంచెం ఆలస్యంగా వచ్చేడు. హాల్లో కూచుని తెలుగుసినిమా ఏదో చూస్తున్నారందరూను. హాయ్ అన్నాడు బాబీ తండ్రిని చూడగానే. వనజా, శేఖరమూ గిరిమొహం చూసి గతుక్కుమన్నారు. అతనిమొహం పాలిపోయి ఉంది. ఆర్నెల్లనుండీ అన్నం తిననివాడిలా నీరసపడిపోయేడు.

“ఏంవయింది? ఒంట్లో బాగులేదా?” అంది వనజ లేచి దగ్గరికి వస్తూ.

గిరి ఏమీ లేదన్నట్టు సైగ చేసి లోపలికెళ్ళిపోయేడు. వనజ అతన్ననుసరించింది. ఓపావుగంట తరవాత ఇద్దరూ హాల్లోకి వచ్చి సంగతి చెప్పేరు. ఆనాటితో అతని ఉద్యోగం సరి.

“ఐయాం సో సారీ,” అన్నాడు శేఖరం. సోమయ్యగారు అయ్యో అన్నారు.

గిరి నెమ్మదిగా వివరాలు చెప్పేడు. మేనేజ్మెంటు కొంగ్రత్తపద్ధతుల్లో కంపెనీ పునరుద్ధరించదలుచుకున్నార్ట. గిరిస్థానంలో అప్పుడే యేల్ నించి దిగివచ్చిన యువకుడిని వేసుకున్నారు. గిరిని పొమ్మనలేదు కానీ అతనికి చూపిన మరో స్థానం మాత్రం అతని సామర్థ్యానికి తగినది కాదు. “కాదు, కాదు, అలా అనుకోకు. ఇందులో కూడా నువ్వు పైకి రావడానికి బోలెడు అవకాశాలున్నాయి,” అన్నాడు మేనేజరు. గిరి ఉడికిపోతూ ఇల్లు చేరుకున్నాడు. వారం రోజులు వ్యవధి ఇచ్చేరు అతనికి తన జవాబు చెప్పడానికి.

“నిన్న మనం అనుకున్నాం ఈమాటే కదండీ. మీరు చెప్పండి మాష్టారూ. ఒక మనిషి శక్తి సామర్థ్యాలకి విలువ ఎలా కడతారు ఎవరైనా?” అతని గొంతులో నిన్నటి ఔద్ధత్యం కనిపించడంలేదిప్పుడు మచ్చుకైనా.

శేఖరం చాలాసేపు మాటాడలేదు. తరవాత నెమ్మదిగా, “ఎవరి కొలమానాలు వారివి గిరీ. నీకున్న సామర్థ్యానికీ వాళ్ళకి కావలసిన సామర్థ్యాలకీ పొందిక లేకపోవచ్చు కదా. వాళ్ళు చూసేదల్లా ఎంత చవగ్గా వాళ్ళపని అయిపోతుందనే. నీదృష్టిలో నీ డాలరుకున్న విలువే వారి దృష్టిలో వారిడాలరుకుంటుంది. ఆ రెండు దృక్కోణాల్లోనూ తేడా నీకు తెలిసే ఉంటుంది.”

లేదు. తనకి ఆ రెండు దృక్కోణాల్లోనూ తేడా కనిపించడంలేదు. అది అతని దృష్టిలోపం అనడానిక్కూడా లేదు. క్లాసులోనూ పుస్తకాల్లోనూ విశ్లేషించే తేడా కాదది. మాష్టారు చూడకుండా గిరి పళ్ళు కొరుక్కున్నాడు.

పరిస్థితులు గమనించి శేఖరం వాళ్లూ తెల్లూర్తూనే ప్రయాణం కట్టేరు.

“అదేంటండీ రెండు రోజులుంటాం అన్నారు కదా. ఉండండి. ఫరవాలేదు. ఆమాత్రం పెట్టలేకపోం,” అన్నారు గిరీ, వనజా నొచ్చుకుంటూ.

“మీరు పెట్టలేరనీ కాదు గిరీ. వెదరు బావుంది. అమ్మా, నాన్నా పెద్దవాళ్ళు కదా. అట్టే ఆయాసపడలేరు. ఇప్పుడు బయల్దేరితే మధ్యాన్నానికల్లా ట్విన్ సిటీస్ చేరుకుంటాం. మళ్ళీ వస్తాంలే,” అని శేఖరం సర్ది చెప్పేడు.

“బ్రేక్‌ఫాస్టు తిని వెళ్ళండి,” అంది వనజ.

“నాకేం పాలుపోడంలేదు మాష్టారూ, మీసలహా ఏమిటి?” అనడిగేడు గిరి సోమయ్యగారిని. ఆయన మాష్టారు కాకపోయినా పెద్దవాడు కనక తత్తుల్యుడే మరి.

సోమయ్య నెమ్మదిగా తన అభిప్రాయం వివరించేరు, “గిరీ, ఆ రెండో ఉద్యోగంలో చేర్తావో లేదో నాకు తెలీదు. కానీ నాకు అర్థం కానిది చెప్తాను. ఇక్కడికొచ్చేక లేదా ఈకాలంలోనే అనుకో ఎంతసేపూ తానెంత రాబట్టుకోగలనన్న యావే కనిపిస్తోంది ఎవర్ని చూసినా. ఈ తగ్గింపు ధరలూ, ఉచితంగా ఇచ్చే వస్తువులూ చూడు. కారు కొంటే సైకిలు ఉచితం, నువ్వు సైకిలు కావాలని కారు కొనవు. కారు కొంటే వచ్చే సైకిలుధర కారుధరలో ఇమిడి ఉంటుందని నీబుద్ధికి తెలుసు, అయినా సరే, కారుతో పాటు సైకిలు తెచ్చుకుని మహదానందం పొందుతావు. అలా ఉచితంగా చ్చిన వాటితో మావాడింట్లో ఓ గది నిండిపోయింది. పూర్వం మా తాత ఒక కొబ్బరికాయ కొంటే మరో కొబ్బరికాయ కొసరడిగేవాట్ట. ఆ మాట చెప్పి మాఅమ్మ నవ్వుతూండేది. నిన్న అందుకే అన్నాను విలువలు వేరూ, బజారుధరలు వేరూనని. ఉదాహరణకి నువ్వు నీ రెస్యూమెలో నీకు కర్ణాటకసంగీతం వచ్చుననీ అంచేత నీ కాతాదార్లతో కర్ణపేయంగా మాటాడి ఒప్పించగలననీ రాస్తావనుకో. అది నీ మేనేజరుకి నచ్చితే సరే. లేకపోతే నాకు కావలసింది నీ business acumen కానీ నీసంగీతం కాదయ్యా అని కొట్టిపారేస్తాడు. అంటే నీ విద్యలో తనకి పనికొచ్చేదానికి మాత్రమే విలువ కట్టేడతను. నీ అవసరాన్నిబట్టీ నీ ఓపికని బట్టీ నువ్వు నీ ధర కట్టుకున్నావు. ఇంతకీ నీ ప్రశ్న – ఈసంగతి అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోరు ఎంచేత?”

గిరికి ఆయనమాటలు అర్థం కాలేదు. తను అడిగిందేమిటి, ఆయన చెబుతున్నదేమిటి?

ముత్యం సామాను తెచ్చి కారులో పెట్టేడు. సోమయ్యగారికేం అనిపించిందో ముత్యందగ్గరకొచ్చి అతనిభుజం తట్టి, చేయందుకుని ఓ నోటు ఆ చేతిలో పెట్టేరు.

ముత్యం వద్దంటూ తలూపేడు కానీ ఆయన తనచేత్తో అతనిగుప్పిడి మూసి వెళ్ళి కార్లో కూచున్నారు. కారు కదిలేక గిరీ, వనజా లోపలికెళ్ళిపోయేరు.

ముత్యం అక్కడే నిల్చున్నాడు స్థబ్ధుడై. అతని గుప్పిట్లో నోటు నలుగుతోంది. మనసు నలికిలపాములా మెలికలు తిరుగుతోంది. అమ్మమాటలు జ్ఞాపకం వచ్చేయి, “గుప్పిడి మూసినంతసేపే గారడీ,”

బాబీ పక్కన నిల్చుని “ఏంటది నీచేతిలో? చూపించు, చూపించు,” అంటున్నాడు చెయ్యి లాగుతూ.

ముత్యం ఓ క్షణం వాడివేపు చూసి, తన ముష్టి చూసుకున్నాడు. తనున్న పరిస్థితుల్లో దానివిలువెంత?

“చూపించు,” బాబీ వదలకుండా చెయ్యి లాగుతున్నాడు.

ముత్యం వేళ్ళు సడలి సుతారంగా కలువరేకుల్లా విచ్చుకున్నాయి. ఓ పిల్లగాలొచ్చి అతని చేతిలోని కాయితం నొల్లుకుపోయింది. నిన్నటి గవ్వే నయం, కాస్త ఊపు కావలసివచ్చింది విసరడానికి.

ఆ గుడ్డి గవ్వపాటి చెయ్యలేదీ పచ్చ కాయితం!

000

(చికాగో తెలుగు వెలుగు, ప్రత్యేకసంచిక, ఆటా 2004, లో ప్రచురించబడింది.)

 

 

 

.

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.