పాతవాచీ

(ఎన్నెమ్మ కతలు -1)

ఆమధ్య ఓ స్నేహితురాలు చెప్పింది వాళ్ల తాతగారివాచీ టూనింగుకి తీసికెళ్తే ఆకొట్టువాడు అదిరిపడ్డాట్ట, ఇక్ష్వాకులనాటి చేతిగడియారం మీకెక్కడ దొరికిందండీ అంటూ. నిజమే పాతకాలపు వాచీలు ఇప్పటికీ పనిచేసేవి వున్నాయి. నాదగ్గిరో వాచీ వుంది 1968లో

నూటయాభై విచ్చురూపాయాలిచ్చి మనదేశంలోనే కొన్నది. అప్పటికి ఈడిజిటలులూ అవీ లేవు కదా. అనాటి సాంప్రదాయాలప్రకారం పొద్దున్నేలేచి కాఫీతాగుతూ, రేడియోలో పన్యాల రంగనాథరావు వార్తలు వింటూ, వాచీకి కీ ఇచ్చుకోడం ఓఆనవాయితీ.
నేను నిజంగా పాతకాలపు మనిషిని అమెరికా వచ్చేక పదేళ్లవరకూ మోనోరికార్డరుతో సంగీతంవింటూ రికార్డు సృష్టించిన అర్భకురాలిని. అంచేత వాచీసంగతి కూడా అంతే.
మీకు తెలుసో తెలీదో అమెరికాలో వందేళ్లున్న కొంపలని హిస్టారికల్ లాండ్‌మార్కులంటారు. అంటే అలా ముద్ర వేయించుకున్న ఇంటిని ఆయింటివారు తదనుగుణంగా పరిరక్షించుకుంటూ వుండాలన్నమాట. అలాగే నావాచీ వాచీకాలమానంలో ఆస్థాయి చేరుకోవాలని నాఅభిలాష.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఇక్కడ టైమెక్స్‌వారి జింగిలొకటి వుంది. అదేమిటంటే takes a licking and keeps on ticking అని. అంటే చికగ్గొట్టినా చకచక నడుకుపోతూంటుందని. నేను అమెరికాలో కొన్న – నాస్తోమతుకి తగినస్థాయిలో అని గమనించాలి- వాచీలేవీ ఇలా కలకాలం నిలవలేదు. అంచేత నేను ఇండియానించి తెచ్చుకున్న అణాపరకవాచీయే వాడుతూ వచ్చాను.

ఇలా వుండగా ఓకరోజు, నేలమీద కుప్పలు కుప్పలుగా మంచు పేరుకున్న రోజున బయటికి వెళ్తూ వాచీకి కీ ఇవ్వబోతూంటే అది కాస్తా చేతిలోంచి జారి మంచులో కూరుకుపోయింది. దానికోసం మంచులో కెలుకూతూంటే దొరికినవి – మాఅమ్మాయి పారేసుకున్నానని చెప్పిన క్రేయానులు, మూడు పెన్నీలు, మరెవరో పారేసుకున్న తాళాలూను. ఇలా చాలావస్తువులు సేకరించబడ్డాయి ఆరోజు నాచేత కాని నా వాచీ మాత్రం దొరకలేదు. బహుశా నేను మంచు కెలుకుతున్నకొద్దీ ఆవాచీ ఇంకా ఇంకా లోతుకు దిగడిపోయివుంటుందేమో. వుసూరుమనుకుని, కారెక్కి పనికి పోయాను.

ఆతరవాత మూడునెలలకి శిశిరం వెనకబడి, సూర్యనారాయణమూర్తి కరుణించి, ప్రభవించి మంచుని కరిగించి తనపరువు నిలబెట్టుకున్న శుభసమయంలో నావాచీ దొరికింది. ఎక్కడంటే పడ్డచోటే వుంది. నేను అమందానందకందళితహృదయారవిందాన్ని ఆచిపట్టుకుని వాచీకి కీ ఇచ్చాను. అది టిక్ టిక్ మనడం మొదలెట్టింది. ఇది కథకోసం రాసిన ముగింపు కాదు. నిజంగానే మూడునెలలపాటు మంచుపాతరలో నిశ్చలసమాధిలో మునివరునివలె ముడుచుకుపడుకున్నవాచీ వళ్లు విరుచుకు కళ్లు తెరుకుచు నాకు కాలమానం తెలియజేసింది.

ఏంచెప్పమంటారు? నేను క్లాసుకి వెళ్లడం ఆరున్నర నిముషాలు ఆలస్యం అయింది. విద్యార్థులు మీరు ఆలస్యంగా వస్తానని మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని నాకు బుద్ధి గరిపేరు.

(ఫిబ్రవరి 14, 2008)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “పాతవాచీ”

 1. నా వాచీ – ఆరో తరగతి లో కొన్నది – ఇంకా వాడుతూ ఉంటే, ఆ మధ్యే అప్పటి స్నేహితురాలు గుడ్లు తేలేసింది, అవాక్కై. మరి, ఇరవైల్లో ఉన్న నాకే అలాంటి అనుభవం ఉంటే, అంత పాగ వాచీ పెట్టుకున్న మీకు ఉండవూ? 🙂

  ఆ వాచీ సెల్లు వేయించడానికి ఇండియా వదిలే ముందు వెళ్టే – ఈ వాచీ కి సెల్లు దొరకదు. ఇప్పుడెవరూ వాడ్డం లేదు..అని మళ్ళీ అన్నాడు షాపు వాడు (అదివరలో అంటే, వెదికి వెదికి ఇంకో షాపులో వేయించా లెండి)

  మెచ్చుకోండి

 2. బావుంది. నాకు పల్ప్ ఫిక్షన్ సినిమాలో బౄస్ విల్లిస్ వాళ్ళ నాన్న బంగారపు వాచీ కథ గుర్తొచ్చింది 🙂
  మాలతి గారూ, నా కాల్సికల్ పోట్రీ బ్లాగు చూసి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినందుకు సంతోషం. ఆ ప్రయత్నం చాతనైనంత వరకూ కొనసాగిస్తాను. మీ తూలిక గూడు నాకు పరిచయమే. ఆధునిక రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యటం .. దీన్ని గురించి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఇది వేదిక కాదు. మీకు ఆసక్తి ఉంటే మనం వేరేగా మాత్లాడుకుందాం. kottapali at gmail dot com
  కి ఒక ఉత్తరమ్ముక్క రాయండి, విశదంగా మాట్లాడుకోవచ్చు.

  మెచ్చుకోండి

 3. nice piece.even i have a watch that was purchased in 1947 by my grandfather in second-hand and gifted it to my father.it is still working well.iam learning to type in telugu,hopefully my next response will be in telugu.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s