ఊసుపోక – మిరపకాయబజ్జీలు

(ఎన్నెమ్మ కతలు 2)

చలి ..చలి … మంచు బ్లిజర్డూ ముంచుకొచ్చి ముంచేస్తోందీరోజు ఇక్కడ. వీధిలోకెళ్లడం గగనం. వేడివేడిగా కారంగారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుని సోఫాలో ముడుకు పడుకుని టీవీ చూసుకోవాలనిపిస్తోంది.

నేను చిన్నప్పటినుంచే కారాలూ మిరియాలూ నూరుతూ పుట్టలేదు. అసలు నేను సగటుకారం కూడా తినలేనని మాఅమ్మ నాకోసం కూర వేరే తీసిపెట్టేది. అలాటిది అమెరికా వచ్చేక కారం అలవాటయింది. నేనే చేసుకున్నాను.

ముఖ్యకారణం డోనట్లు. అవి చూడ్డానికి గారెల్లా కనిపించి మురిపించి నన్ను మోసం చేసేయి. మొదటిసారి తెలీక తిన్నాను. రెండోసారి ఆశ చావక తిన్నాను. ఆతరవాత మరి నాతరం కాలేదు. మొత్తంమీద ఏంకొనబోయినా తియ్యగానో చప్పగానో వుంటాయి తప్ప మరోరుచి నాలుక్కి తగలదనిపించింది. ఏమెక్సికనో, పీచావో అయితే తప్ప. చాలాకాలం నేను ఎవరేనా భోజనానికి పిలిస్తే, ఇంట్లో తినేసి వెళ్లడమో, తిరిగొచ్చాక ఆవకాయేసుకుని తినడమో చేసేదాన్ని. ఆతరవాత చచ్చినజిహ్వని లేపడానికి కాస్త కారం తగిలితే బాగుండుననిపించి కూరల్లో ఓ చిన్నమిరపకాయ తగిలించేను. ఆతరవాత రెండూ, రెండున్నరా, … అలా పెంచుకుంటూ వచ్చి ఆఖరికి నసాళం అంటే వరకూ వచ్చింది.

అపైనా రిసెర్చి మొదలెట్టాను ఏమిరపకాయకి హీటిండెక్సు ఏస్థాయిలో వుంటుందని. … నాకు గుర్తున్నంతవరకూ మనూళ్లో మిరపకాయలు రెండేరకాలు, పచ్చిమిరపకాయలూ, సీమమిరపకాయలూను. ఇక్కడ మనుషుల్లాగే దేశదేశాల పెప్పరులుకుప్పలుతిప్పలుగా ఎదురై మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఫ్రెంచి కయన్ కాస్త మెరుగు, మనగుంటూరు మిరపకాయలసాటి అనుకోండి. సెరానో కూడా అంతే. హీటిండెక్సులో పదివేలనించి ఇరవైమూడు వేలవరకూ వుంటుందిట స్కవిల్ కొలతల్లో. హబానో కాస్త నయం 280 వేలవరకూ వుంటుంది. గిన్నెస్ బుక్కాఫ్ రికార్డులకెక్కిన ఘనత హబానో పెపరుదేనట. మరి ఇంకో రకం షొల్తొపెన్ కూడా నోట్లో చిచ్చు పెడుతుంది.

హాట్ బనానా పెప్పరయితే అట్టే కారం వుండదనుకున్నాను కానీ ఓసారి నోరు మండిపోయింది అదే తట్టలోనుంచి ఏరుకొచ్చినా. అంచేత దానివరస నాకు తెలీదు. ఆనహెమ్ అసలు కారమే వుండదు పసరువాసన. పప్రికా అయితే మరీను ఆకారపుష్టి. జానెడు పొడవుంటుంది కాని ఆమిరపకాయ కొరికినా ఒకటే ఇంత పచ్చగఢ్డి నమిలినా ఒకటే. స్కవిల్ కొలతల్లో 500 నుండీ 2500 వరకూంట.

ఇంతకీ నేను ఇంత పరిశోధన చెయ్యడానికి మరో కారణం వుంది. తెలుగుదేశంలో నాస్నేహితురాలితో ఏదోసందర్భంలో మిరపకాయ బజ్జీలు చేసానన్నాను. దాంతో ఆఅమ్మాయి మిరపకాయబజ్జీలు చేసిపెడతానంటే అమెరికా వస్తానంది. చేస్తానన్నాను కానీ ఇంతదూరం ఆవురావురామంటూ వచ్చినపిల్లకి నచ్చినట్టు చెయ్యలేనేమోనన్న బెంగ పట్టుకుంది. దాంతో, ఏమిరపకాయలు బజ్జీలకు తగినవి అంటూ మొదలెట్టానన్నమాట. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పచారీకొట్లో లేబులులెప్పుడూ మారవు కాని ఒక్కోపూట ఒక్కో రకంగా వుంటోంది హీటిండెక్సు మాత్రం. ఇక్కడ షాపుల్లో ఒక్కోప్పుడు రుచులు చూడనిస్తారు కదా అని కొరికిచూద్దాం అనుకున్నాను కానీ నాకే బాగోలేక చెయ్యలేదు. ప్రతిసారీ ఇంటికి తెచ్చి చూసుకుని ఇది కాదు, ఇదు కాదు అంటూ నేతివాదం ప్రాక్టీసు చేసాను. ఎలాగో మొత్తంమీద నాస్నేహితురాలు వచ్చినప్పుడు రెండురకాలు తెచ్చాను హబీనో మరియూ సెరానో. హబీనో నసాళానికంటింది. పొలోమని కేకేసి, కుండెడు నీళ్లూ, గరిటెడూ పెరుగూ, పుచ్చుకుని, తరవాత నెయ్యీ అన్నం కాస్త తిని తేరుకుంది.

నేను నెమ్మదిగా “నువ్వు కారం తింటావనుకుని ఆమిరపకాయలు తెచ్చాను. ఇదయితే అంత కారంలేదు” అంటూ నాకోసం పక్కన పెట్టుకున్న సెరానో మిరపకాయలు ఇచ్చాను. నాకు తెనాలి రామలింగడిపిల్లికథ జ్ఞాపకం వచ్చింది.

ఈనాటి అప్పుడేటు. కారం పరాకాష్ట పొందినరోజుల్లో మొదటి ముద్ద నోట పెట్టుకున్నతరవాత జిహ్వ మాడి మసి అయిపోయి, ఆతరవాత ఏంతింటున్నానో తెలియనిస్థితికి వచ్చేను. అందులో కూడా కొన్ని అందాలు కనిపించేయి. నాలుక ఆహాటుకూరలతో కాలిపోయాక తరవాత ఏంతిన్నా రుచి తెలీదు కనక రకరకాలవంటలు చెయ్యవలసిన అవుసరంలేదు. అంచేత మధ్యాన్నం లంచీ, రాత్రి సప్పరూ, మర్నాడు లంచీ, .. ఇలా ఒకే డిష్షు తినే గతికొచ్చాను కొన్నాళ్లు. ఆవరస బావులేదని, కారం తగ్గించుకుంటూ వచ్చి ప్రస్తుతం రీజనబుల్లెవలు కొచ్చేను. … అనే అనుకుంటున్నాను.

(ఇంతే సంగతులు, ఫిబ్రవరి 2008).

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

21 thoughts on “ఊసుపోక – మిరపకాయబజ్జీలు”

 1. భలే ఉందండి మిరపకాయ బజ్జి తతంగం. నాకు బెంగళూర్ లో ఇదే అనుభవం…చూడటానికి ఎర్రగా ఉంటాయి సాంబార్, చిరుతిండ్లు అవీ…తింటే తియ్యగా అదో రకంగా ఉండేవి. కారం కోసం తపించిపొయి.. కొన్ని సార్లు నేనే వొండేసుకొనే వాడిని ఇంత కారం వేసుకొని 😀

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. ఘాటైన టపా. నేను కనీస మాత్రం ఘాటు తిని చదవాలని, మీ పుణ్యమా అని మసాలదోసే చేసుకుని తిని చదివా 😀
  ఎంత methodical గా పరిశోధన చేశారు. భలేగా ఉంది. లక్నో మిరపకాయలు కూడా ఆంధ్రా మిరపకాయలoత uniformity పాటించవు. మనకి గ్రేడింగ్లు కూడా ఉండావాయే. కాకుంటే కూరగాయల సేకరణ, కొనుగోలు కొండకచో మిరపకాయ బజ్జీల్లాంటి పనులు ఇంటాయన పరిధిలో కాబట్టి నాకీ తిప్పలు తప్పినట్టే. కొన్నిసార్లు ఘాటైన బజ్జీలు, కొన్నిసార్లు బజ్జీలు అనుకొని తినాల్సిన బజ్జీలు జీవితం నడుస్తోంది. మా ఊరెళ్లినప్పుడు బాలయ్య బజ్జీలు తింటేనే అసలు మిరపకాయ బజ్జీలు తిన్నట్టు. మీకు కూడా నేను ఫొటోలు పంపించి పగ తీర్చుకుంటాను 😁

  మెచ్చుకోండి

 3. అమ్మో! చదువుతుంటేనే కళ్ళంట ముక్కులంట నీళ్ళొచ్చాయి. అయితే చాలా రకాల మిరపకాయలు, హాట్ ఇండెక్స్, స్కవిల్ స్కేలు లాంటి కొత్తపదాలు నేర్చుకున్నా. చాలా బాగుందండి మీ మిపకాయ బజ్జీల ప్రహసనం.

  మెచ్చుకోండి

 4. “జానెడు పొడవుంటుంది కాని ఆమిరపకాయ కొరికినా ఒకటే ఇంత పచ్చగఢ్డి నమిలినా ఒకటే.”
  – How True!!

  అన్నట్లు, ఈ హీట్ ఇండెక్సులు ఏమిటండీ !:))

  మెచ్చుకోండి

 5. జ్యోతి గారూ, లేదండీ. అస్త్ర్రసన్యాసం చేసేసాను.
  రాధిక గారూ, నాకు తంటాలు మనవాళ్లతో కన్నా అమెరికనులని పిలిచినప్పుడు. మాకు కారం ఇష్టం అంటారు తీరా ఓమిరకాయ కనుచూపుదూరంలో కనిపిస్తే ఎగిరిగెంతేస్తారు. 🙂 ఆడాన్సు చాలా నాజూగ్గా వుంటుంది, అది మరో కథ …

  మెచ్చుకోండి

 6. మేము కారాలు బాగా తింటాము.కానీ ఎవరినయినా భోజనానికి పిలిచినప్పుడు మాత్రం చాలా తక్కువ వేస్తాను.అయినా సరే వచ్చినోళ్ళందరూ కళ్ళనీళ్ళెట్టుకుని వెళతారు.మాకేమో ఆ వంటలు గొంతుదిగవు.తిన్నాకా మిగిలిన కూరల్లో మళ్ళా కారం కలుపుని ఉడికించి తింటాము. మీలా నాకూ ఏ మిరపకాయ ఏ ఘాటులో వుంటుందో తెలియదు.అందుకే ఎవరయినా వచ్చినప్పుడు సాధారణం గా కారాన్నే వాడతాను.

  మెచ్చుకోండి

 7. వరూధినిగారూ,
  ఏమిటో ఏదో ఊసుపోకకి పురాణంసీతలా పేరు పెట్టాలనిపించింది. కళ్లుమూసుకు కీలు కొడితే ఎన్ యం తగిలేయి. ఎన్నెమ్మ అని పెడదాం అనుకున్నాను కాని ఫెషనబల్ గా లేదని పెట్టలేదు. :).

  ప్రవీణ్ గారూ మీరు రావాలే కాని నీ అదుర్సు ఆర్ బెదుర్సు. మీకేం కావాలేమిటి ఇంతకీ ..

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s