విధీ, హతవిధీ!

మాకాండోలో రిపేరొచ్చిందని మామానేజరుని పిలిచేవరకూ నాకువిధి వైపరీత్యాలగురించిన ఆలోచనలు రాలేదు.
వంటింట్లో కొళాయి చుక్కలు చుక్కలుగా కారుతుంటే మామానేజరుకి ఫోను చేశాను. నాకసలు ఫోనులో మాటాడ్డం సరిపడదు. నామాట వాళ్లకర్థం కాదు, వాళ్లమాట నాకర్థం కాదు పెళ్లిమంత్రాల్లాగే. మమ అనమన్నప్పుడల్లా మమ అనేసి వూరుకోడమే.
రెండు రోజులు ఎదురు చూశాను మానేజరు వెంటనే వచ్చేసి, నవ్వుమొహంతో నాకొళాయి బాగుచేసేసి, నన్నానందపరిచేసి వెళ్తాడని. వారంరోజులయింది. ఎక్కడా అతగాడి జాడ లేదు. తెగించి మళ్లీ పిలిచాను. నాలుగు రోజులయింది. మళ్లీ ప్రయత్నంచేను. ఎంత గింజుకున్నా ఆజవాబులమసీనే కాని మనిషిగొంతు వినే యోగం లేకపోయింది.
దాంతో, మా అసోసియేషను ప్రసిడెంటుకి ఫోను చేశాను. ఆయన, “కాల్ ద మానేజర్” అన్నారు. మానేజర్ని కాల్చేశాననీ, తిరుగుజవాబు లేదని మనవిచేసుకున్నాను ఓపినంత మర్యాదగా.
సెక్రటరీకి చెప్పుకోమన్నారు.
సెక్రటరీని పిలిస్తే, మళ్లీ మషీను ఎదురుచుక్క!
మరో వారంరోజులయేయి ఈ ప్రదక్షిణాల్తో.
నా ఓపిక చచ్చిపోతూంది. నెలకి ఎనిమిదివందలు విచ్చు డాలర్లుచ్చుకుంటున్నాడు మాకాంప్లెక్సు మొత్తమ్మీద. కనీసం ఫోనులో జవాబైనా చెప్పడేం ఆమేనేజరుడు అని.
మళ్లీ ఫోన్చేసి, ఇరవైనాలుగ్గంటలలోగా అతను నాకు జవాబు ఇవ్వకపోతే, మాలాయరుతో చెప్పిస్తనని మెసేజి పెట్టేను.
ఆసాయంత్రం నాఫోను మోగింది. మామేనేజరు.
చెప్పేను నా అవస్థ. కాండోలో రిపేర్లు నా బాధ్యతే అన్నాడు.
“ఆసంగతి నాకు తెలుసు. కాని ఎవర్ని పిలవాలో నాకు తెలీదు. నీకు తెలుసేమోనని అడుగుతున్నాను.”
“మా బ్రదరు చేస్తాడు కాని, నేను వాడిపేరిస్తే అది conflict of interest అవుతుంది.”
నాకేం చెప్పాలో తోచలేదు.
“నీకు తెలిసినవాళ్లు ఇంకెవరూ లేరా?”
“లేరు,” అని ఫోను పెట్టేశాడు, మరోమాటకి అవకాశం లేకుండా.
నేను మా రియాల్టర్ మాటలు గుడ్డిగా నమ్మేనో, సరిగ్గా అర్థం చేసుకోలేదో ఇప్పుడూ చెప్పడం కష్టం.
నేను కాండో కొన్నప్పుడు, జెన్నీ, అదే మా రియాల్టరు, “నువ్వేం కష్టపడక్కర్లేదు, గడ్డి కొయ్యక్కర్లేదు, మంచెత్తిపోసుకోనక్కర్లేదు, పైకప్పూ, నీళ్ల హీటరూ పన్చేస్తాయో లేదో అంటూ తెల్లారిలేచింది మొదలూ కటకటలాడనక్కర్లేదు … అంటూ ఊకదంపుడుగా నేను పట్టించుకోనక్కర్లేనివి ఆవిడ పనస చదువుతూంటే పొంగిపోయాను కాని నేను పట్టించుకోవాల్సినవేమిటో కానుకోలేదు. అదే నాకొంప ముంచింది. చెప్పిందిలెండి చివర్న కాండోలోపలిభాగంలో మాత్రం ఏవేనా రిపేర్లొస్తే నీదే బాధ్యతని. కాని ఆవెంటనే అప్పటి ఓనరుడు ఇల్లు మాంఛి కండిషన్లో ఉంచేడనీ, బోలెడు ఖర్చు చేసి పకడ్బందీగా వాసయోగ్యం చేశాడనీ కూడా చెప్పడంతో బోల్తా పడిపోయాను.
కొంతకాలం బాగానే సాగింది. నేను ఒహో నా కాండో జీవితమూ అంటూ పాడుకోడం సాగించేను. అడిగినవాళ్లకీ, అడగనివాళ్లకీ కాండో సౌకర్యాలు వల్లె వేస్తూ వచ్చాను కూడా, వంటగదిలో కొళాయి కారడం మొదలయేవరకూ.
మొదట్లో ఉండీ ఉడిగీ పడుతూ వచ్చేయి ఒకటీ, రెండూ చుక్కలు. నేనే కొళాయి సరిగ్గా కట్టేయలేదేమోననుకుని గట్టిగా మొట్టితే ఆగిపోయాయి ఓరోజు. మరోరోజు కొళాయికొమ్ముచ్చుకు మరోవేపుకి తిప్పుతే రోగం కుదిరిపోయింది. అంతేగాని ఏకధారగా కురియలేదెప్పుడూ మన కథానాయికల్లా.
రానురాను టుప్పుటుప్పు డప్పులచప్పుడు చెప్పులో రాయిలా బాధించసాగింది. అది నాకొక్కదానికే కాదని తెలిసేసమయం కూడా వచ్చింది దరిమిలా. కిందికాండోలో వున్న శాండి ఓరోజొచ్చి తలుపు తట్టింది.
తలుపు తీసి ఏమిటయిందన్నాను అయోమయంగా.
ఆవిడ కాస్త భారీమనిషి. రూల్సువిషయంలో నిక్కచ్చిమనిషని మా బిల్డింగులో అందరూ చెప్పుకుంటారు.
“మీ కొళాయి కారుతున్నట్టుంది,” అంది అమెరికనింగ్లీషులో.
నాకు తెలీదూ? “అవును. రిపేరు చేయిద్దామనుకుంటున్నాను,” అన్నాను, దబాయింపుగా.
“ప్లమరుని పిలిచావా?”
“మధ్యాన్నం పిలుస్తాను.”
“ఎవర్ని పిలుస్తావు?”
“తెలీదు. చూస్తున్నాను. ”
“కాల్ పైప్ డాక్టర్ .”
నాకు నవ్వొచ్చింది. ఈమధ్య అందరూ డాక్టర్లే. పైప్ డాక్టర్, రగ్ డాక్టర్, … అంటూ ఈడాక్టరేటులు ఎవరికి వారే పట్ట ప్రదానాలు చేసేసుకుంటున్నారు. డాక్టర్లెవరూ ప్లాస్టక్ ఫిక్సర్-అప్పర్‌, బ్రెయిన్ రిపేరర్‌లాంటి టైటిల్సు వాడుతున్నట్టు లేదింకా!
“సరే,” అన్నాను శాండీతో.
“నెంబరుందా?”
“యల్లోపేజీలు చూస్తాను.”
“4502253. రాసుకో,” అథార్టీగా చెప్పి, తాను మూడో షిఫ్టు పనిచేస్తాననీ, అంచేత నిద్ర లేకపోతే కష్టం అనీ, నా కొళాయి కారుతుంటే తనకి నిద్రాభంగం అనీ ఓ చిన్న వుపన్యాసం యిచ్చి, నేను వెంటనే ఆసంగతేదో చూస్తానని మాట పుచ్చుకుని గాని కదిలింది కాదు ఆ మహాతల్లి. చెప్పొద్దూ, నాక్కళ్లనీళ్ల పర్యంతం అయిందంటే నమ్మండి. అయినా వీళ్లు మరీను ఒక్కపిసరు కూడా ఓర్చుకోలేరు. లాన్‌మోవర్లో చెయ్యిపెట్టేసి, వేలు తెగిపోతే, రక్తం ఓడుకుంటూ, రెండోచేత్తో డ్రైవు చేసుకుంటూ ఆస్పత్రికి వెళ్లేను నేను. అదే ఇక్కడ మరొకరైతే ఆంబులెన్సుని పిలిచేస్తారు బోలెడు ఖర్చూ, వాడంతా నానాగొడవా చేస్తూను. …
ఆవిడటు తిరగ్గానే ఆవిడిచ్చిన నెంబరు పారేశాను. పనిగట్టుకు ఇచ్చింది కనక నాకు ఆనెంబరు పిలవాలనిపించలేదు. నూకలు వూరక చల్లబడవుగదా.
ఆసాయంత్రం టెలిఫోను డైరెక్టరీ ముందేసుక్కూచున్నాను. ఒకాయనకి నాతెలుగుయాసతో కూడిన ఇంగ్లీషు అర్థంకాలేదు. నాపేరు గుణించేసరికి టఠాలు గుణించినంత పనయింది. మరొకడు మూడు వారాలవరకూ తీరదన్నాడు. మరొకటి ఆన్సరింగు మెషీను. నాపేరూ, నెంబరూ, పిలిచినకారణం, టైమూ వగైరా వివరాలిస్తే తమకి వీలయినంత వెంటనే మారుబలుకుతామనీ. నాకేం నమ్మకం లేదు అన్ని వివరాలు ఆమెషిను ఆకళించుకోగలదని. మా పొరుగు శాండీ ఇచ్చిన నెంబరు తీశాను చెత్తబుట్టలోంచి, ఏంచేస్తాం వాసుదేవుడికే తప్పలేదు, మానవమాత్రులం మనంవెంత? నా పూర్వజన్మ సుకృతం లేదా నా “గుడ్ కర్మా” కావచ్చు ఆ పైపుడాక్టరే ఫోనందుకున్నాడు. ఆపూట మరెవరో కాన్సిల్ చేశారనీ, అంచేత వెంటనే రాగలననీ అన్నాడు.
“ఛార్జీలెంతవుతాయి?” అనడిగేను, గుండెలు చిక్కబట్టుకుని.
“రావడానికి నలభై, అసలు బాధేమిటో కనుక్కోడానికి అరనై, ఆపైన అది కుదర్చడానికి గంటకి యాభై, … ”
ఏంచెప్పను, సరే రమ్మన్నాను. గంటలతరబడి ఆపైపులన్నీ వూడదీసి, ఇల్లంతా నానాకంగాళీ చేసి, ఏమీలేదని చెప్పి రెండువందలడాలర్లు ఛార్జీ చేసినా నేం చెయ్యగలిగిందేం లేదు.
వంటింట్లో డాక్టరుగారు ఆపరేషను చేస్తుండగానే వుత్తరాలొచ్చాయి. అమ్మ రాసింది, రాములు పోయాడని. నాగుండె కలుక్కుమంది.
రాములంటే నాచిన్ననాటి డ్రైవరు. అప్పటికింకా ఈరోజుల్లోలా విధులూ, బాధ్యతలూ స్పష్చంగా నిర్ణయం కాని రోజులు. డ్రైవరంటే కేవలం డ్రైవు చేసేవాడూ, తోటవాడంటే కేవలం తోటపన్చేసేవాడూ అని నిర్ధారణ కానిరోజులు.
రాములు మాయింట్లో డ్రైవరుగా చేరేనాటికి, నాకు నాలుగేళ్లుంటాయేమో. మానాన్నగారు కాంపుకెళ్తే, మాఅమ్మ అతన్ని మాయంట్లో పడుకోమనేది. నన్ను బీచికీ, సినిమాలకీ అతన్నిచ్చి పంపేది. రాములెప్పుడూ, అది తనపని కాదని రొకాయించలేదు.
ఆతరవాత, పోలమ్మతో పెళ్లయింది అతనికి.
ఓరోజు అలవాటు ప్రకారం, అమ్మ “చిన్నమ్మ సినిమా అంటోంది. రాములూ సాయంత్రం కాస్త పెందరాళే వచ్చీ” అంది.
రాములు తలొంచుకు నిలబడ్డాడు.
“ఏం, మాటాడవేం?”
రాములు నసిగేడు. అమ్మకి అర్థం కాలేదు. ఏమిటీ అని మళ్లీ అడిగింది.
“అదే అమ్మగారూ, పోలి ఇంటికాడ ఒక్కత్తీ వుంటానికి బయపడతాది.”
“అయ్యో, అవును మరి. ఒక్కదాన్నీ ఒదిలీకు. దాన్ని కూడా తీసుకురా. సుబ్బులుతో చెప్తాను, సినిమానించి ఒచ్చేక, ఇద్దరూ అన్నంతినేసి పొండి. లేకపోతే, ఆవెనకగది ఖాళీగానే వుంది కదా. అక్కడ పడుకుని తెల్లారేక పోదురుగాని.”
అలా రాములూ, పోలమ్మా మాయింటివాళ్లకిందే లెక్క అయిపోయారు. ఆరోజులలాటివి.
రాములు గవర్నమెంటు వుద్యోగం వచ్చిందని, మాయింట్లో పని మానేస్తానని చెప్పినరోజు నేనెంత గొడవ చేశాననీ. అతను వెళ్లడానికి వీల్లేదని ఒకటే ఏడుపు. అతనూ, ఆమ్మా కూడా అప్పుడప్పుడు వచ్చి నన్ను సినిమాలకీ, బీచికీ తీసుకెళ్తాడనీ పదే పదే హామీలిచ్చినా నేనొదిల్తేనా! ఆఖరికి విసుగేసి, అమ్మ “అతన్తో వెళ్లిపో” అంది అమ్మ. నేను సరేనంటూ, గబగబా వెళ్లి, రెండు పరికిణీలూ, జాకట్లు తెచ్చుకుని తయారయిపోయాను. అమ్మ నవ్వితే, రాములు తలొంచుకు స్థంభంచాటుకి తప్పుకున్నాడు. అప్పట్లో అతను కూడా నవ్వుతున్నాడనే అనుకున్నాను కాని ఇప్పుడాలోచిస్తే, తను కూడా బాధపడి వుంటాడనిపిస్తోంది. మాయిద్దరిమధ్య అనుబంధం అలాటిది.
వుత్తరం మరోమారు చదువుకున్నాను. రాముల్తోపాటే ఆరోజులు కూడా పోయాయి.
“డన్” అన్నాడు, ప్లమరు పనిపూర్తి చేసి.
అతను బిల్లందిస్తుంటే నాక్కళ్లు తిరిగేయి. ఎందుకని అడక్కండి.

000

(ఎపీవీక్లీ.కామ్.లో ప్రచురింపబడింది. మా.ని. ఫిబ్రవరి 2006)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.