ఊసుపోక -కాలు విరిగిన కలదు సుఖము

(ఎన్నెంకతలు 4)

కాలు కాదులెండి. యతి కుదిరిందని షోకులు పోయేను :). నిజంగా విరిగింది చెయ్యి. కుడిచేయి. తన్మూలంగా నాకు పట్టుబడ్డ కొత్త సుళువులే ఈకత. సర్జరీ అయి ఇంటికి వచ్చాక, ఎడంచేత్తో నేనేం చెయ్యగలనో ఏంచెయ్యలేనో అంచనా వేసుకోడం నా మొదటి వ్యాపకం అయింది.

ఓరోజంతా ఆస్పత్రినీళ్లతో ప్రాణం విసిగి, మొట్టమొదట కావల్సివచ్చింది ఓకప్పు చిక్కటి కాఫీ. గబగబ వున్న ఏకైక చేత్తోనే ఎస్ప్రెసో కాఫీమేకరు తీసి నీళ్లుపోసి, పొడి వెయ్యబోతూంటే తళుక్కున వెలిగింది బల్బు. ఎస్ప్రెసోమేకరు ఇప్పుడు వాడేనంటే, దాన్ని కడుక్కోడానికి ఆరెండు చిప్పలూ విడదీయలేనని. సరే. అది పక్కన పెట్టేసి, మన ఇండియా కాఫీఫిల్టరు తీసాను. ఎందుకేనా మంచిదని నీళ్లు పొయ్యకముందే ప్రాక్టీసు చేయబోయేను. అదీ అంతే. డిటో. సరి, ఈపూటకి కాఫీయోగం లేదు కాబోలు అని బాధ పడిపోతూంటే మా అమ్మాయి పిలిచింది ఫోనులో.

ముందురోజే ప్రసారం చేసేనులెండి మాఅమ్మాయికీ, అమ్మాయిలాటి అమ్మాయికీను. మాఅమ్మాయి ఎలా జరిగిందని అడిగి, నేను రానా అని ప్రశ్నించి, డాక్టరుతో లాంగ్ డిస్టంసులో ′మాఅమ్మని జాగ్రత్తని అని చెప్పి, జాగ్రత్తగా చూడకపోతే తనకి జవాబు చెప్పుకోవలసివుంటుంద′ని మర్యాదగా చెప్పి తనకర్తవ్యం నెరవేర్చుకుని నాముచ్చట తీర్చింది. ఏతల్లికి మాత్రం అంతకంటె ఏంకావాలి. … పోతే మాఅమ్మాయిలాటి అమ్మాయి ′చూసుకు నడవక్కర్లేదుటండీ′ అంది సన్నగా. ′చూసుకునే నడిచేను′ అన్నాను. ′చూసుకు నడిస్తే ఎందుకు పడతారు అంది మళ్లీ. ఎందుకు, ఎలా ఎక్కడ పడాలో నేను ప్లాను వేసుకుని పడలేదనీ, పడవేయబడ్డానినీ, అందులో నాసంకల్పం ఏమీ లేదని′ చెప్పాను, ′సరేలెండి, ఇహమీదట జాగ్రత్తగా వుండండి′ అనేసి చాటు మూసేసింది. ఇంతసేపూ నేనూ చెప్పిన హరికథ అంతా విని.

ఇంతలో, మాఅమ్మాయి పిలిచి, మావూళ్లోనే వున్న తనస్నేహితురాలు నాకు ఏంకావాలన్నా సాయం చేస్తుందనీ, పిలవమనీ ఫోన్నెంబరిచ్చింది. ఇది నాతొలి సుఖం. ఇంతవరకూ నేను అందరినీ నాకారులో తిప్పేను కాని మరొకరికారు ఎప్పుడూ ఎక్కలేదు. సరేనని ఆఅమ్మాయిని పిలిచి ఆసాయంత్రం తనతో బజారుకెళ్లి అర్జంటుగా బ్రూ కొనుక్కున్నాను. (నా కాఫీ, రంగూ రుచీ కథ చదివినవారు ఇక్కడ నామెటామార్ఫసిస్ గ్రహించగలరు). ఆపూట నాకు బ్రూ ఎంతో బావుంటుందనిపించింది. ఎనలేని కొత్త రుచులు అనుభవంలోకొచ్చేయి.
ఆతరవాత ఆచిట్టితల్లి తాను ఆఫీసుపనిమీద వేరే వెళ్తున్నాననీ, నాకేమైనా అవసరమయితే పదిరోజులతరవాత పిలవమనీ చెప్పి వెళ్లిపోయింది.
ఆసాయంత్రమే నాకు ఆ అవసరం వచ్చేసింది. తినడానికి ఫ్రిజిలో ఏంకనిపించలేదు. తప్పనిసరిగా ఎవరో ఒకర్ని పిలిచి నన్ను బజారుకి తీసుకెళ్లమని అడుక్కోవలసిన అగత్యం ఏర్పడింది. కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడే ఆషాపులోనే నానూ, ఛొలేలాటివి తెచ్చుకోలేకపోయారా అని విజ్ఞులకు తోచకమాలదు. ఏంచెప్పను. తెచ్చుకోలేకపోయాను. నాకప్పుట్లో తోచలేదు. ఇంట్లో ఏవో వున్నాయనుకున్నాను. ఏదో చేసుకోవచ్చనుకున్నాను … ఇంకా ఏంవనుకున్నానో చెప్పలేను. ….

సరే కూచుని స్నేహితులనీ, పరిచయస్తులనీ, అయినవాళ్లనీ, కానివాళ్లనీ, కాబోయిమానేసినవాళ్లనీ .. ఒక్కొక్కరినే తలుచుకోడం మొదలెట్టాను. ఎవరిని పిలవను? ఎవరిని పిలిస్తే నాకు బాగుంటుంది? ఎవరిని పిలిస్తే వాళ్లకి బాగుండదు … .. ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. నేను అట్టే ఫ్రెండ్లీపర్సనుని కాను. నాకు సోషలైజింగుపాలు తక్కువ. నాలెక్కలో కొందరు నన్నుగురించి నేను చెప్పనిచ్చగించని ప్రశ్నలు అడుగుతారు. కొందరు నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పరు. కొందరు ఒకటడిగితే మరొకటి చెప్తారు … ఇలా ఏదో ఓవంక చెప్పి అందర్నీ తప్పుకు తిరుగుతాను.

అలాటి వారిలో పొన్నమ్మాళ్ ఒకరు. ఆపద్రక్షకుడికి ఫీమేల్ వెర్షను ఆవిడ. ఎవరికి ఎప్పుడు ఎక్కడ కావాలంటే అప్పుడు అక్కడ ప్రత్యక్షమయి, ఏది కావాలనుకుంటే అది సమకూర్చగల పరమయోగి. నాప్రాణానికి మాత్రం డైట్ ప్లాన్. ఆవిడని తలుచుకుంటే ఆపూట నాకు అన్నం దిగదు. దానికి వేరే వ్యక్తిగతకారణాలున్నాయి కానీ అవి ఇక్కడ చెప్పదగదు.

నేను ఇక్కడికి వచ్చినకొత్తలో షాపింగ్ మాలులో కనిపించి, తెళుంగళా అనడిగి, అక్కడిక్కడికే ప్రాణస్నేహితురాలయిపోయింది. నేను నేస్తంకట్టే శాఖలో అట్టే నిష్ణాతురాలిని కాకున్నా ఆవిడచొరవమూలంగా మాపరిచయం అంచెలంచెలుగా పెరిగిపోయింది అచిరకాలంలోనే. ప్రతిరోజూ పిలిచి ఓపావుగంట వూళ్లోవారి విశేషాలన్నీ తెలుగూ తమిళం కలగాపులగంగా మాటాడుతూ నాకు చేరేసేది. ఆవిధంగా మావూళ్లో భారతీయులందరి సంగతులు ఎప్పటికప్పుడు తెలుస్తూండేవి. అది నాకేమంత ఆనందదాయకం కాకపోయినా ఏదోలే ఆవిడధోరణి ఆవిడది అనుకుంటూ వచ్చేను.

ఇంతకీ మావూళ్లో నాకు తెలిసినవాళ్లందరినీ ఇలా రైటాఫ్ చేసేసి, ఏంచెయ్యనా అని ఆలోచిస్తుంటే ఫోనుకాలోచ్చింది సదరు పొన్నమ్మాళ్ నుండి. నన్ను ఆస్పత్రిలో చూసినవాళ్లెవరో చెప్పారట. కటకటా, అనుకుంటూ రమ్మన్నాను. నాఅవుసరం కదా. వెంటనే ఆవిడ ఆఘమేఘాలమీద వేంచేసి నాకు కావలసినవీ, అక్కర్లేనివీ అన్ని పనులూ చేసిపెట్టింది. ఆవిడ వెళ్లేవేళకి పాపం, మంచిదే, నేనే ఏదో అనుకుంటాను కానీ అని అనిపించింపించుకునే (అంటే బలవంతంగా, నాఇష్టాఇష్టాలతో ప్రమేయంలేకుండా) స్థితిలోవున్నాను.

వాళ్లింట పనిచేసే మెయిడ్‌ని కూడా పంపించింది. ఆమెయిడొచ్చి మాయిల్లు చూసి నవ్వింది. ఎందుకంటే నాయిల్లు రెండంటే రెండే గదులు, అది అయ్యవారినట్టిల్లులా బోసిగా వుంటుంది నా వస్తుచయం లిస్టు రాస్తే అరపేజికి మించదు. అంచేత గంటలో క్లీనింగు పూర్తి చేసేసి, ఇంకేం చెయ్యను అని అడిగింది మాయలాంతరు రాక్షసుఢిలా. మళ్లీ రమ్మని చెప్పడానికి నాకే నోరు రాలేదు. అందుమూలంగా నాపనులు నేను ఎంతవరకూ చేసుకోగలనో పరీక్షించుకునే సుదినం ఆసన్నమయింది. ఫరవాలేదు. అదీ బాగానే వుంది.

వీధిలోకి వెళ్లడానికి వీల్లేదు కనక ఇంట్లో చెయ్యగలపనులతో కాలక్షేపం చెయ్యడం మొదలెట్టాను. మామూలుగా టీనీళ్లు మైక్రోవేవ్‌లో కాచుకుని ఓటీసంచీ పడేస్తే అయిపోయేది ఇప్పుడు దాదపు అరగంట పడుతోంది. ఆపైన మళ్లీ ఆటీకప్పు కడుక్కోడం మరో అరగంట. ఇలా చిన్న చిన్నపనులకే నాకాలం సరితోంది. ఆవిధంగా నాకు ఇంట్లోంచి కదలలేకపోవడంచేత బోరుకొడుతోంది ఆన్న బాధ లేదు.
ఒక్కచేత్తో అన్నిపనులు చేసేసుకుంటుంటే, అసలు మనిషికి రెండు చేతులు ఎందుకు చెప్మా అని కూడా అనిపించకపోలేదు.

కాస్టు వున్నన్నాళ్లు తెలీలేదు కాని, అది తీసేసింతరవాత, నొప్పి తెలుస్తోంది. వేడి వేడి కాఫీ తాగుతూ, చెయ్యి కాపు పెట్టుకోడం మొదలుపెట్టాను. కాఫీకప్పు, లంచికంచం ఒకొక్కటే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటుంటే కూడా సుఖంగా వుంది, దానివల్ల సుఖం – కడుక్కోవలసిన గిన్నెలు సింకులో పోగుపడి యూనియన్ వర్కరులా పోరు పెట్టవు. పైగా, కొళాయినీళ్లు కూడా వెచ్చగా చేతికి కాపడం పెట్టినట్టు సుఖంగా వుంటోంది. కాని ఒకచిన్న ప్రతిబంధకం – ఆ కాఫీలూ, టీలూ ఎక్కువయి, రాత్రి నిద్ర పట్టకపోవడంతో బండి మళ్లించవలసిన అగత్యం ఏర్పడింది.
అమెరికాలో ఎడంచేత్తో రాసేవాళ్లు ఎక్కువ, అదేలెండి కంప్యూటరో, సెల్లో వాడనప్పుడు. తల ఓరవంచి ఎడంచెయ్యి కుండపట్టుకున్నట్టు ఎత్తి గోళాకారంలో పట్టుకుని, కలం ఘంటంలా పట్టుకుని వాళ్లు రాస్తుంటే నాకు తమాషాగా వుండేది. అదేం బ్రహ్మవిద్యా అనుకుని నేను కొన్నాళ్లు ప్రాక్టీసు చేస్తూ వుండేదాన్ని సరదాకి.. (మీరు కనిపెట్టేసినట్టున్నారు ). అదిప్పుడు పనికొచ్చింది.
ఇన్ని మాటలెందుకు. తప్పటడుగులతో నడక నేర్చుకున్ననాటి ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి అనుకోండి.. అప్పటికంటె ఇప్పుడు కాస్త ఐక్యూ పెరుగుటచేత ఉత్సాహం కూడా పైస్థాయిలోనే వుంది.

పరిశుభ్రతగురించిన ఆలోచనలు కూడా అధికమయాయి — దులిపిన దుమ్మే దులపడం, కడిగిన గిన్నే కడగడం … వున్నరెండు మొక్కలఆకులూ–ఒక్కొక్క ఆకూ తుడుచుకుంటూ రెండుగంటలసేపు గడిపేను. చదువుదాం అని పుస్తకం తీసాను కాని మూడుపేజీలు తిప్పేసరికి చెయ్యి నొప్పి. కథమీద దృష్టి నిలవడంలేదు. బల్లమీద పుస్తకం పెట్టబోతూంటే జిలుగువస్త్రంలా పల్చగా పరుచుకున్న ధూళీ, ధూసరం …. మళ్లీ లేచి వెళ్లి, డస్టరు తెచ్చి డస్టు చేసి, డస్టరు క్లాజటులో పెట్టి వచ్చి కూర్చున్నాను. దుప్పటి కప్పుకుకూచోబోతుంటే తలవెంట్రుక కనిపించింది దానిమీద. దాన్ని తీసి లేచి వెళ్లి చెత్తబుట్టలో పడేసి వచ్చి కూచున్నాను. కార్పట్‌మీద నిన్నటి పొటెటోచిప్ తునక. అది జాగ్రత్తగా తీసి ….
ఈలెక్కన మరి వారాంతం వేరే క్లీనింగంటూ పెట్టుకోనక్కరలేదు. ఎంతసుఖమెంత సుఖమూ …

మరో రెండు వారాలు గడిచేయి. ఓరోజు ఆదమరిచి పంచదారడబ్బా తీసాను. తీయగలిగాను. నొప్పి తెలీలేదు. ఆశ్చర్యమ్.
నిన్నటివరకూ కాఫీడబ్బా మూత తియ్యలేకపోయాను. ఈరోజు సునాయాసంగా అయిపోయింది.
నిన్నటివరకూపాలసీసా పట్టలేకపోయాను. ఈరోజు కొండ వేలనెత్తినట్టు ఎత్తేశాను అదీను.
నిన్న కుర్చీ జరపలేకపోయాను . ఈరోజూ ….
ఇలా నేను చేయగలిగినపనులు రోజుకి రోజూ పేట్రేగిపోతున్నాయి.. వెండికొండనందుకున్నట్టు మురిసిపోతున్నాను,

ఎనిమిది వారాలయింది. సింకులో పొద్దుటి కాఫీకప్పూ, మధ్యాన్నం లంచికంచం అలాగే వున్నాయి. ఇప్పుడు కడగనా, ఏకంగా రాత్రి అన్నం కూడా తిన్నతరవాత ఒకేసారి కడుక్కోనా అని ఆలోచిస్తున్నా …
ఫోను రింగ్‌టోనులు పాడుతోంది. దానివేపే చూస్తూ కూచున్నాను కదలకుండా.. మెసేజిలోకి వెళ్లింది..
“హలో, మాలది.”
ఎలా వున్నానని అడగడానికీ, ఏమైనా కావాలా అని అడగడానికీ పిలుస్తోంది పొన్నమ్మాళ్..
నేను ఫోనెత్తలేదు. ఎత్తడానికి చెయ్యి రావడంలేదు. మనసు ఇప్పుడొద్దులెద్దూ అంటూ మొరాయిస్తోంది.

(nm. మార్చి 2008)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “ఊసుపోక -కాలు విరిగిన కలదు సుఖము”

 1. @ కావ్య, – బాగున్నాయి అనకూడదు కష్టాల్ని కాబట్టి – హా. సరే. మీకాలు నొప్పి త్వరలోనే తగ్గుతుందని ఆశిస్తున్నా. చెయ్యికంటే కాలు కోలుకోడం ఆలస్యం అనుకుంటా కాలికి పనెక్కువ కనక. మీరు నాటపా చూసినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. అమ్మ .. ఇన్ని రోజులు మీ బ్లాగు చూడలేకపోయాను ..
  మొన్న స్పురిత గారి పోస్ట్ చూసాక .. ఇప్పుడే చూస్తున్నాను 🙂
  మీ చెయ్యి గురించి రాస్తే నాకు నా కాలు గుర్తు వచ్చింది .. నాకు రేసేంట్ గా కాలు విరిగి .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ..
  నడవడానికి స్త్రేచేస్ యూస్ చెయ్యాల్సి వచ్చింది .. 🙂 … అప్పుడే అన్నింటి విలువ తెలుస్తుంది .. హహ 🙂 బాగున్నాయి అనకూడదు కష్టాల్ని కాబట్టి .. నేనేమి అనను 🙂

  మెచ్చుకోండి

 3. @ సౌమ్య, నాటపాలన్నీ చదివి మంచి వ్యాఖ్యానాలు చేసినందుకు విడిగా సమాధానాలు ఇచ్చినా, సభాముఖంగా (టపాముఖంగా అనాలేమో) కూడా ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. “సర్జరీ అయి ఇంటికి వచ్చాక, ఎడంచేత్తో నేనేం చెయ్యగలనో ఏంచెయ్యలేనో అంచనా వేసుకోడం నా మొదటి వ్యాపకం అయింది.”
  – ఈ వాక్యం రెండు సార్లొచ్చిందే… ఎవరూ ప్రస్తావించినట్లు లేరు?

  మెచ్చుకోండి

 5. వైదేహీ,
  నేను రాయలేనివి చాలా వుంటాయండీ. నాకు తగిలినప్పుడే రాయాలనిపిస్తుంది. ఈమధ్య కొత్తపాళీగారిచ్చిన ఎక్సర్ సైజు బాగుందంటే మీరు రాయకూడదా అన్నారాయన. మీకు చెప్పినమాటే ఆయనకీ చెప్పాను నేనలా దత్తాంశాలు తీసుకురాయలేనని. 🙂
  ఆయన నవ్వేరు చిన్నప్పటి జామెంట్రీ క్లాసు గుర్తుకొచ్చిందనీ ..

  మెచ్చుకోండి

 6. మొత్తానికి మీ చెయ్యి ప్రహసనం నవ్వు తెప్పించినా ఫ్రాక్చర్ అయ్యి మీరు పడ్డ ఇబ్బంది తలచుకుని కొద్దిగా మనస్సు చివుక్కుమనిపించింది. పూర్తి గా తగ్గి పోయిందని ఆశిస్తున్నాను.
  మీ లాంటి విరివిగా రాసే రచయితలకి బహుశా రాయటానికి ప్రేరణ కలిగించని విషయాలు ఉండవంటే అతిశయోక్తి కాదేమో!

  వైదేహి

  మెచ్చుకోండి

 7. మొదటగా మీకు జరిగిన (నిజం గా జరిగిందనే అనుకుంటున్నాను) దానికి చింతిస్తున్నాను.. కాని, ఆ కష్టం లో నే హాస్యాన్ని జోడించి మీరు వ్రాసిన విధానాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను. చూడబోతే మీరు మళ్ళీ నార్మల్ అయినట్టు (అంటే, మీకు అక్కర్లేని ఆ రెండో చెయ్యి కూడా ఫుల్ టైం పని చేస్తున్న పరిస్థితి లో కి వచ్చినట్టు) గా తోస్తోంది. పొన్నమ్మాళ్ గారిని వదలకండి.. A Friend in Need.. అన్నారు కదా మరి!!. :).

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.