ఆనందో బ్రహ్మా

ఇండియా వెళ్తే, మనవాళ్లతో కన్నా రైళ్లలో గడిపేకాలం ఎక్కువ. ఆమూలొకరూ, ఈమూలోకరూ వుండి, రా, రా, అంటూ ఆప్యాయంగా పిలిచేస్తూంటారు. పదివేలమైళ్లదూరంలో వున్నమనకి కావాల్సింది అదే కనక కాదనలేం.

ఆపైన ఉండే కులదేవతలమాట సరేసరి.

నేను దక్షిణాది తిరుగుళ్లు ముగించుకని తూర్పు జైత్రయాత్రకి బయల్దేరేను జీటీలో. ఈస్లీపరుకోచీలు పడ్డాక ప్రయాణం బాగానే ఉంటోంది.

. బెర్తుమీద తువాలు పరుచుకుని ఒళ్లో ఇండియాటుడే పడేసుకుని కాళ్లు ముడుచుక్కూచుని కిటికీలోంచి చూస్తున్నాను.

హఠాత్తుగా నామోకాలిమీద ఏదో తగిలినట్టయి, ఇటు తిరిగేను. నామీదకి వాలి నామొహంలోకి ఓచిన్నపాప చూస్తోంది కౌతుకంతో. అయిదారేళ్లుంటాయేమో.

నేను చిన్నగా నవ్వేను,

“నాపేరు సినీమాతార,” అంది కళ్లు తిప్పుతూ.

“ఆఁహా,” అన్నాను.

ఆపిల్లవెనకున్న పిల్లాడు, రెండేళ్లుంటాయేమో, సీటుమీదికెక్కడానికి నానాతంటాలూ పడుతున్నాడు. నేను చేతులు పుచ్చుకు పైకి లాగేను. సీటెక్కగానే నాఒళ్లోకి వచ్చేశాడు పిల్లాడు. ఇద్దరూ నామొహంలోకి చూస్తూ కబుర్లు మొదలుపెట్టేరు. వాళ్లమాటలు నాకట్టే అర్థం కాకపోయినా హావభావాలు చూసి ఆనందిస్తున్నాను.

“అయ్యయ్యో” అంటూ అవతలిసీటులో కూచుని పుస్తకం చదువుకుంటున్నతల్లి గబగబా వచ్చింది. అంతవరకూ చూడలేదేమో మరి.

“ఏఁవనుకోకండి. పిల్లలకి బొత్తిగా కొత్తా పాతా లేదు,”అంది క్షమాపణలు చెప్పుకుంటూ.

“ఫరవాలేదులెండి. పిల్లలంతే మరి,” అన్నాన్నేను.

ఆవిడ నామొహంలోకి పరీక్షగా చూస్తూ, “యూయస్‌మొహాలు  ఇట్టే పట్టేస్తారు మాపిల్లలు వేటకుక్కల్లా,” అంది.

ఆఉపమానానికి నవ్వొచ్చింది నాకు. పిల్లలకంత చొరవెలా వచ్చిందో కూడా విశదమైంది.

పిల్లాడిని నాఒడిలోనుండి తీసుకోబోతే వాడు మరీ బల్లిలా అంటుకుపోయేడు నాఎదన.

ఆతల్లిమొహంలో కించిదరుణిమ. తను కూడా నాకెదురుగా కూచుంటూ, నెమ్మదిగా మాట కలిపింది, “మాఅమ్మదగ్గర చేరిక,” అని, ఓక్షణం ఆగి, “మీకు కొంచెం మాఅమ్మ పోలికలున్నాయి.”

ఆవిడ పోయి ఆరునెలలయిందిట. పిల్లాడు అమ్మమ్మకోసం బెంగ పెట్టుకున్నాడు. చెల్లెలిపెళ్లికి వెళ్తోంది. ఆ అమ్మాయి తనచేతికింద పని చేస్తున్న అబ్బాయిని చేసుకుంటానని రెండేళ్లుగా పట్టు పట్టుక్కూచుంది. ఇంట్లోవాళ్లు ఇంతకాలం ఒప్పుకోలేదు. ఇప్పుడు తల్లి పోవడంతో, హడావుడిగా లగ్నం పెట్టేశారు. ఏడాదిలోపున కన్యాదానం చేస్తే ఆతల్లికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని.

మళ్లీ పిల్లాడిని అందుకోబోయింది. “ఫరవాలేదులెండి,” అన్నాను బాబు వెన్ను నిమురుతూ.

“మాఅమ్మపేరు కరుణ” అంది తార.

“తమ్ముడిపేరేమిటి,” అన్నాను మాట కలుపుతూ.

“వాడి అసలుపేరు చాలా పె … ద్ద …పేరు. కాని మేం శాంబాబు అంటాం,” అని, నామీదికి వొంగి, రహస్యం చెబుతున్నట్టు, “నేను చీంబాబు అంటాను,” అంది.

నేను చిన్నగా నవ్వి తలాడించాను అర్థం అయిందన్నట్టు.

“వాగుడుకాయ. మీరు పొమ్మనాలి కానీ దానికై అది ఆపడం జరగదు,” అంది కరుణ.

తార నాచేతిలో ఇండియా టుడే చూపిస్తూ, “డాడీ,” అంది.

నాకు తికమకయింది. నేను కరుణవేపు చూశాను. ఆబొమ్మలో వ్యక్తికి తండ్రిపోలికలున్నాయేమో, నాకు వాళ్లమ్మపోలికలున్నట్టు అని. కరుణకి నాఅనుమానం అర్థమయింది. “లేదులెండి. వాళ్లనాన్నే,” అంది నవ్వి.

బొమ్మ మళ్లీ చూశాను. ఆజానుబాహుడూ, ఆయతోరస్కుడూ, రావిశాస్త్రిగారు మందులభీముడిగురించి చెప్పినట్టు ఆరుగురు ఆడవాళ్లు హాయిగా నిద్రపోవచ్చు ఆఛాతిమీద.  ఆపైన సహృదయుడూ, సంస్కారీ, … ఎటెసెటరా .. అని చెబుతోంది అతనిగురించి రాసినవ్యాసం!

“మీకు తెలీదా?” అనడిగింది కరుణ.

“తెలీదు” అన్నాను.

మళ్లీ తనే అందుకుంది, “ఓ, తెలీదూ? అమెరికాలో ఆయన్ని తెలీనివాళ్లు వుంటారనుకోలేదు.”

“మీ తిరుగుప్రయాణం ఎప్పుడు?” అనడిగేను మాట మారుస్తూ.

“ఎక్కడికి?”

“అదే అమెరికాకి?”

“నేనూ, పిల్లలూ ఇక్కడే వుంటాం,” అంది మామూలుగా, “డిస్టెంటు రిలేషన్షిప్పులు మీఅమెరికాలో మామూలే కదా.”

రాష్ట్రాలు దాటిన సంబంధాలు విన్నాను కానీ సముద్రాలు దాటిన సంసారం చూడ్డం నాకు ఇదే మొదలు. ఆముగ్గుర్నీ మళ్లీ పరీక్షగా చూసేను. పట్టుమని ముప్ఫయ్యేళ్లుంటాయో ఉండవో! ఆయనక్కడ పొడసుత్తితో లోకం మరమ్మత్ చేస్తుంటే ఈవిడిక్కడ ఇద్దరు పిల్లలతో, ఓ చిన్నస్కూల్లో పంతులమ్మగా జీవనం సాగిస్తూంది.

నిదానంగా, తనలోతాను మాటాడుకుంటున్నట్టు చెప్పసాగింది, “పొరపాటు పడకండి. మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఏడాదికోమారు తప్పకుండా వస్తారు. లేకపోతే పిల్లలు మరీ నాన్న అంటే గోడమీద బొమ్మ కాబోలు అనుకునే ప్రమాదం వుంది కదా. వచ్చినప్పుడల్లా  వారంరోజులు తప్పకుండా పిల్లలతో గడుపుతారు. ప్రతినెలా తప్పకుండా కావలసినంత, నిజానికి కావలసినదానికంటే ఎక్కువే పంపిస్తారు …”

“నయమే,” అన్నాను అంతకన్నా ఏమనడానికీ తోచక.

కరుణ లేచివెళ్లి బుట్టలోంచి రెండు బత్తాయిపళ్లు తీసుకొచ్చింది. ఒకటి నాచేతిలో పెట్టి, రెండోది ఒలిచి, పిల్లలకి తొనలు పెడుతూ, మళ్లీ కొనసాగించింది, “మొదట్లో నాకర్థం కాలేదు. అంతా అయోమయం. నాలుగునెలలు తిరిగేసరికి తెలిసింది ఆయన జీవనసరళి. ఆదేశంలో అడుగెట్టగానే మనవాళ్లెవరెవరు ఎక్కడెక్కడున్నారో కనుక్కున్నారు. వాళ్ం చేస్తున్నారో కనుక్కున్నారు. వాళ్ల యిష్టాయిష్టాలేమిటో, వారి అవసరాలేమిటో, అంతస్థులేమిటో, ఆంతర్యాలేమిటో .. ఒకటేమిటి … అడక్కండి, మొత్తం యూయస్‌లో తెలుగువారి తెరగులెల్ల మావారికి కరతలామలకం.”

నామొహంకేసి చూసి నవ్వింది, “హాఁ, హాఁ, నిజంగా కాదండీ. ఆయన పడే అవస్థలూ, చేసే ఆర్భాటాలూ చూస్తే అలా అనిపిస్తుంది ఎవరికైనా. పొద్దు పొడిచింది మొదలు అర్థరాత్రివరకూ ఫోనుమీదో, కారుమీదో, బారుల్లోనో, సమావేశాల్లోనో సరిపోతుంది వారికి. త్రివిక్రముడి అష్టబాహువుల్లా సెల్ఫోనూ, వాల్ఫోనూ, కాల్ ఫార్వర్డూ, కాల్ వెయిటింగూ, కాలరైడీ, బీపరూ, పేజరూ, … ఇంకా ఏఁవొచ్చాయో ఈమధ్యకాలంలో మరి.”

నాకు గందరగోళంగా అనిపించింది ఆఅమ్మాయిధోరణి. నిజం చెబుతూందా, నన్నూ, నా (అమెరికా)జాతినీ హేళన చేస్తూందా?

“మీరసలు అమెరికా వెళ్లలేదా?” అనడిగేను. ఆవిడ మమ్మల్నలా వెక్కిరించడం నాకు నచ్చలేదు.

“అయ్యో, వెళ్లకపోతే ఎలా? ఆబోరు దక్కునా? కులంలోంచి వెలి కాదూ? వెళ్లేను. ఆరునెలలున్నాను. ఒల్లమాలినసుఖాలు. కళ్లు తిరగేయి. మొహం మొత్తింది,”

“ఓపలేక వచ్చేసేరేమిటి?”

“లేదండీ. సుఖాలు వద్దనేవారెవరు? సుఖంగా ఉన్నంతసేపు బాగానే వుంటుంది.”

కరుణ ఆగిపోయింది ఏదో ఆలోచిస్తున్నట్టు. నేనూ నిశ్శబ్దంగా చూస్తున్నాను గతసంచిక తరువాయి కోసం.

కరుణ అనంతాల్లోకి దృష్టి సారించి, తనకథ సాగించింది. అప్పటికింకా శాంబాబు పుట్టలేదు. తార ఒక్కతే సంతానం. ఆనందు తనవుద్యోగంతోనూ, తదితరవ్యాపకాలతోనూ తలమునకలై తిరుగుతూంటే, కరుణ ఇంటినీ, పిల్లనీ, వచ్చేపోయేవారినీ, చూసుకుంటూ కాలం గడుపుకుంటూండగా, …

ఒకనాడు …

అలవాటుగా మధ్యాహ్నంవేళ పాపని తోపుడుబండిలో వేసుకుని షికారుకి వెళ్లింది పార్కువేపు. పార్కులో ఉయ్యాలలూ, కొయ్యగుర్రాలూ అవీ వున్నాయి. ఆచుట్టుపక్కలున్న మరో నాలుగైదు యిళ్లల్లో వున్నతల్లులు తమపిల్లల్ని కూడా అక్కడికి తీసుకొస్తారు తరుచూ. ఆకబురూ ఈకబురూ చెప్పుకుంటారు. మనపల్లెల్లో నీలాటిరేవుదగ్గరో వీధివసారాలోనో ఉన్నట్టుంటుంది. అవే కబుర్లు టీవీలో అయితే మల్టీమిలియన్ డాలర్ బిజినెస్. ఆరోజూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లల్ని ఉయ్యాల్లో కూచోబెట్టి ఊపుతూ. అంతలో ధన్‌మని ఏదో చప్పుడు. .. మొదట ఫ్లాట్ టైర్ కాబోలనుకుని అటు చూశారు అందరూ. … ధన్ …

ఢామ్ .. ఢామ్… ఒక్క వుదుటున పిల్లనందుకుని .. ఉరుకులూ పరుగులూ .. హుటాహుటీ … ఏమైంది .. అమ్మో … రక్తం .. అయ్యో చిందరవందర .. ఎగిరిపడుతున్నవి అవేమిటి … తొడతొక్కిడి … పరుగో పరుగు .. పద .. పద .. గో .. గో .. రన్ రన్ .. ఏడుపులు, పెడబొబ్బలు .. అయ్యో .. ఎవరది అక్కడ లుమ్మచుట్టుకు .. రామా ..

ఎవరు, ఎందుకిలా .. గంగవెర్రులెత్తినట్టు … నలుగురు కుర్రాళ్లు … పేల్చేస్తున్నారు తుపాకులతో ఏకారణం లేకుండా .. విరగబడి నవ్వుతూ … మారణహోమం … దక్షయజ్ఞం .. నల్దిక్కులా .. ఏదీ సరిగ్గా కంటికానడం లేదు …

కరుణ ఇంటికెలా వచ్చి పడిందో తలుపెలా తీసిందో మెదడుకి అందడంలేదు. .. భగవంతుడా! ఎక్కడున్నావు? ఏవండీ! ఆనందూ! ఎక్కడున్నారు? మనపిల్ల! ఏరీ … అమ్మా .. నాన్నా .. అన్నయ్యా,  చిన్నప్పటి సుందరీ, పక్కింటి రమణ, ఎక్కడున్నారర్రా మీరంతా .. ఇంతబతుకూ ఇందుకా?

గడగడ ఒణికిపోతూ ఓమూలకి నక్కి కూచుంది కరుణ పాపని గుండెల పొదువుకుని.

ఎంతసేపో! .. ఆఖరికి, కొన్నియుగాలతరవాత ఆనందు వచ్చేడు. కారురేడియోలో విన్నాడుట విషయం. ఆవేళప్పుడు కరుణ పాపని తీసుకుని పార్కుకి వెళ్తుందని అతనికి తెలుసు. అంచేత హడావుడిగా ఇంటికొచ్చేడు.

“హమ్మయ్య, మీరిద్దరూ బాగానే వున్నారు కదా. ఎంత భయపడిపోయేనో తెలుసా?” అన్నాడు.

కరుణ అయోమయంగా అతడిని చూసింది.

“నీకేం అవలేదు కదా. పాపకేం దెబ్బలు తగల్లేదు కదా. అయినా ట్రౌమా వుంటుంది. సైకియాట్రిస్టుతో అపాయింటుమెంటు తీసుకో. నేను వెళ్లాలి. అంగోలాలో ఆర్తులకోసం నిధులు వసూలు చేస్తున్నాం. మధ్యలో వచ్చేశాను. నేనక్కడ లేకపోతే ఆరునెలలుగా పడ్డపాటు గాలిక్కొట్టుకుపోతుంది,” పాఠం ఒప్పచెప్పినట్టు గబగబా నాలుగుముక్కలు వల్లించేసి, వెళ్లిపోయాడతను.

కరుణకి ఆక్షణంలో తెలివొచ్చింది. సకలసౌకర్యాలూ, అష్టయిశ్వర్యాలతో తులతూగే యీసంపన్నదేశంలో తమకి తక్కువయిందేమిటో అర్థమయింది అప్పుడు.

“నేనిక్కడ వుండలేను. పదండి. ఇండియా పోదాం,” అంది కరుణ ఆనందుతో.

కొంతకాలం వాదోపవాదాలయింతరవాత, “సరే, నువ్వు ముందెళ్లు. నేను ఇక్కడ పనులు ముగించుకుని, మరో వుద్యోగం అక్కడ చూసుకుని వస్తాను,” అన్నాడతను.

తాను నెగ్గలేనని తెలుసుకుని ఆవిడ వచ్చేసింది. అయిదేళ్లయింది. అతనింకా అమెరికాలో తనపనులు ముగించుకోడంలోనే వున్నాడు ….

“ఇంట్లో మిమ్మల్నీ పాపనీ పట్టించుకోకుండా అంగోలాలో సంతానానికి సేవా?” అన్నాను, నాచిరాకును దాచుకుంటూ.

“మీరింకా పెరటిదోవనే వున్నారాంటీ.  వీళ్లకేదో హృదయం వుందనీ, దానితో వాళ్లు సదసద్వివేచన చేస్తారనీ మీఆశ,” అంది కరుణ నాఅమాయకత్వానికి జాలిపడుతున్నట్టు.

“అంతేనంటావా?” అన్నాను.

“హయ్యో రామా! ఆయనే వుంటే … అని ఏదో సామెత చెప్పినట్టు .. కొందరికి హృదయం వుండాల్సినచోట వొట్టి డొల్లండీ. వారికి కావల్సిందల్లా ఆడంబరం. అంతే.”

“అందరూ అంతేనంటావా?”

“అందరూ అననులెండి. ఉంటారు నూటికో కోటికో ఒకరు నిస్వార్థపరులు. చాలామందిది మాత్రం బుట్టబొమ్మల అట్టహాసమే. నిజం చెప్పాలంటే వీరికి అభిమానాలూ, ఆత్మీయతలూ నాలుకచివరనుంటాయి. తియ్యగా మాటాడతారు. ఆతీపికి చుట్టూ చేరేచీమలూ, భజనసంఘాలూ, ..అదుగో అలాటి ఆర్భాటాలూను.” అంది నాచేతిలో పత్రికని కొనకళ్ల చూస్తూ.

అమాయకంగా కనిపించినా ఘటికురాలే అనిపించింది, “అయితే అలాటివాళ్లు పెళ్లెందుకు చేసుకుంటారూ?” అన్నాను ఏం చెప్తుందోనని.

“అదొక లాంఛనం అనుకోండి. కుస్తీపట్లకిముందు కరచాలనం చేసుకున్నట్టే. కుటుంబం కూడా శ్రీవారిముద్రలాటిదే.  … కుటుంబరావుగారనుకుంటా అన్నట్టు జ్ఞాపకం – స్త్రీజాతిని ఉద్దరించడానికి సిద్ధాంతరీత్యా ఆసక్తిగలవారిలో కూడా కొందరికి స్త్రీలపట్ల నిరసన వుండవచ్చు అని.[1] ముఖ్యంగా ఇంట్లో ఆడవారిపట్ల అది నూటికి నూరుపాళ్లూ నిజం. ఆడ గొంతులపట్ల ఆసక్తి ముదిరితే ఈడ గొంతులు వినిపించవు. ఈ సంఘసేవకులంతా అటు లోకంలో ఆడవాళ్లందర్నీ ఉద్దరించేకార్యక్రమంలో పడి అదే సమయంలో తమ సొంతకొంపలు గుణ్ణం అయిపోతున్నాయని గ్రహించుకోరు.”

ఆఅమ్మాయి చతురతకి అబ్బురపడకతప్పలేదు నేను.

“గోదావరి వస్తూంది. వంతెనమీద బండి పోతూంటే నండూరివారు చెప్పినట్టు గుండె గొంతుకలోన కొట్లాడతాది. ఎన్నసారులు చూసినా తనివితీరదు. ఆనందు గోదావరిలో దిగమంటాడు. మీరు చెప్పండి గోదావరిలో దిగనా? రాజమండ్రిలో దిగనా?” అంది నావేపు చిలిపిగా చూస్తూ. కళ్లలో చమకులు, అధరాల దరహాసం. నవ్వేవారిని చూసి నవ్వుతోందా? నేనే నాపైత్యం ముదిరి వెర్రిఆలోచనలు చేస్తున్నానా? కాకమ్మకథలు అల్లుకుంటున్నానా?

“యూ స్టుపిడ్.”

ఇద్దరం ఒకేసారి ఉలికిపడి అటు తిరిగిచూశాం. ఎదటిబెర్తుమీద ఆవిడని మేం ఇంతవరకూ గమనించనేలేదు. ఆవిడ మాత్రం మామాటలు వింటోంది అని ఇప్పుడే అర్థమయింది మాకిద్దరికీను.

“అతనలా అక్కడ నాటకాలాడుతూంటే నువ్విక్కడిలా నోరు మూసుక్కూచున్నావా?” అంది ఆవిడే మళ్లీ.

“ఏమిటి మీరనేది?” కరుణ అయోమయంగా ఆవిడవేపు చూసింది.

“నిన్నూ పిల్లలనీ ఇక్కడ గాలికొదిలేసి అతనక్కడ జల్సాలు చేస్తూంటే నువ్వెలా వూరుకున్నావూ అని. నేనయితే అతగాణ్ణి కోర్టుకీడ్చి ముప్పతిప్పలూ పెట్టి మూడు చెరువులనీళ్లు తాగించేదాన్ని,”

కరుణ మాటాడలేదు. ఆమనసులోమథనమేమిటో పోల్చుకోడం కష్టం.

నేను ఆఎదటిమనిషివేపు ఆసక్తిగా చూస్తున్నాను. నలభై పైనే ఉండొచ్చు, కట్టిన కంచిపట్టుచీరా, నిలువెల్లా వజ్రవైఢూర్యాలూ ఆమె ఐశ్వర్యాన్ని చాటుతున్నాయి. కనకమహలక్ష్మిలా సుఖాసీనురాలై తన ఔన్నత్యాన్ని చాటుకుంటోంది.

“నీలాటి మెతకమనుషులుండబట్టే మొగాళ్లఆటలు చెల్లుతున్నాయి. అతనేం చేస్తున్నాడన్నావూ? సాఫ్టువేరు ఇంజినీరా? ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?”

“మీకు తెలుసా?”

“నాకేమిటీ, ఎవరినడిగినా చెబుతారు. ఖచ్చితంగా కాకపోయినా ఉజ్జాయింపుగా చెప్పగలను,”

“నేను ఖచ్చితంగానే చెప్పగలను,” అంది కరుణ సీదాగా.

“ఇంకేంమరి. నాకు తెలిసిన లాయరొకాయన వున్నారు. పిలిచి మాటాడు. రాస్కెల్ని అంత తేలిగ్గా వదలకు. అతనిసంపాదనలో నీకెంత హక్కుందో తెలుసా?”

మేం ఇద్దరం తెల్లబోయాం. పెద్దయుద్ధానికే సిద్ధమవుతోందావిడ. కరుణకి అదేమంత రుచికరంగా లేదన్నది తేటతెల్లమే!

“మాకు డబ్బుకేం కొదవలేదండీ. బాగానే పంపిస్తారు,” అంది కరుణ.

కనకమహలక్ష్మి వదిలిపెట్టేట్టు లేదు. “సొల్లుకబుర్లు కట్టిపెట్టు. నువ్వు అమెరికాలోనే వుంటే అయేఖర్చులో అర్థభాగం కూడా నీకు ముట్టడంలేదు తెలుసా. అక్కడిసౌకర్యాలు ఇక్కడేవీ? హుమ్. డబ్బిస్తున్నాడు ఉంపుడుకత్తెకి ఇచ్చినట్టు.”

తృళ్లిపడ్డాను. నాగుండెలు దడదడ కొట్టుకున్నాయి.

ఆదమరిచి రాయి విసిరింది మూర్ఖురాలు!

తగలరానిచోట తగిలింది ఆచిన్నదానికి.

నాప్రాణం చివుక్కుమంది.

కరుణ మౌనంగా లేచి, చీరెకుచ్చిళ్లు సరిచేసుకోసాగింది.

ఎదటిసీటులో ఆడమనిషి అంతటితో పోనివ్వలేదు. “కన్నబిడ్డల్ని దిక్కుమాలినవాళ్లలా వదిలేసి, వూరివారిని సాకుతూంటే చూస్తూ వూరుకుంది పిచ్చిమొహం.”

కరుణ చివ్వున తలెత్తి చురుగ్గా చూసింది ఆవిడవేపు. “నేనుండగా నాపిల్లలు దిక్కుమాలినవాళ్లెలా అవుతారు?”

ఆమహాఇల్లాలు ఏం అనుకుందో మరి మాటాడలేదు.

“స్టేషనొస్తోంది. సామాను దింపుకోవాలి,” అంది కరుణ నాఒడిలోనించి బాబుని తీసుకునేప్రయత్నం మరోసారి చేస్తూ, “దా. మామయ్య వస్తాడు.”
మామయ్యపేరు వినగానే శాంబాబు తల్లిచేతుల్లోకి ఇట్టే మారిపోయాడు గూడు చేరిన గువ్వపిట్టలా.

“స్టేషనుకెవరైనా వస్తారా?” అనడిగేను. నాకు ఎలాగైనా మళ్లీ మాట కలపాలని తహతహగా వుంది. సామాను అట్టే లేకపోయినా పిల్లలతో దిగాలికదా.

“మాఅన్నయ్య వస్తాడండీ,” అంది ఉత్సాహంగా కరుణ కూడా అదే అవకాశంకోసం చూస్తున్నట్టు.

రాజమండ్రిలో రైలాగింది. అన్నగారు వీళ్లకోసం ఎదురుచూస్తున్నాడు. ముందు పిల్లల్ని అందించి, తరవాత సామాను అందించి, తనూ దిగింది, వెళ్లొస్తానని నాకు చెప్పి.

ప్లాట్‌ఫారంమీద నాలుగడుగులు వేసి, గిరుక్కున వెనుదిరిగి, నాకిటికీదగ్గరకొచ్చి, “మీరడగలేదేం?” అంది.

“ఏమని?”

“నాకూ ఉంచుకున్నమనిషికీ తేడా ఏమిటని?”

ఛెళ్లున కొరడాతో కొట్టినట్టు తృళ్లిపడ్డాను. రైలు కదుల్తోంది. “నీతత్త్వాన్నిబట్టీ, నీసంస్కారాన్నిబట్టీ నీకూ నీపిల్లలకీ తగిననిర్ణయం నువ్వు తీసుకున్నావు. ఆవిడసంస్కారానికి తగ్గట్టు ఆవిడ మాటాడింది. ఒడ్డున కూచుని ఈతమీద ఉపన్యాసాలు ఇవ్వడమంత తేలిక మరోటి లేదు,” అన్నాను.

“ప్రయాణం బాగానే జరిగిందా? కుంకలిద్దరూ వేపుకుతినలేదు కదా,” అంటూ కుశలప్రశ్నలేస్తున్న ఆఅన్నగారినీ, ఆకుటుంబాన్నీ కనిపించినంతమేరా చూశాను, కిటికీవూచలకి నుదురు కొట్టుకుంటుంటే.

మొత్తమ్మీద దేశాటన ముగించుకుని కొంప చేరుకున్నాను మూడువారాలతరవాత. ఇంటికొచ్చేసరికి ఆన్సరింగ్ మెషీనుమీద పదిహేను మెసేజీలున్నాయి. అందులో నాలుగు సురేఖనుంచే. ముందు ఇంట్లో పనులు చూసుకుని, పిలుద్దాం అనుకుంటుండగానే, మళ్లీ ఫోను మోగింది. మళ్లీ సురేఖే!

“బావున్నావా?” అన్నాను యదాలాపంగా.

“బాగానే వున్నానండీ,” అంది నీరసంగా. అందులో బాగానే ఉన్నధ్వని లేదు.

“నిజం చెప్పు. మళ్లీ ఏమైనా గొడవలు జరిగేయా?” అన్నాను నాపెద్దరికం నిలబెట్టుకుంటూ.

“మీరెప్పుడొస్తారాంటీ,” అంది దాదాపు ఏడుపుగొంతుతో.

కొంపలు ములిగినట్టేవుంది. ఏంచెప్పను? తెల్లారితే ఆఫీసు. ఉన్న శలవంతా ఇండియా ప్రయాణానికి అయిపోయింది.

“నాలుగురోజులు ఓపిక పట్టు. శనివారం తప్పకుండా వస్తాను” అన్నాను.

“సరేనండీ.”

“మునుపోసారి ఎవరో బ్రహ్మంగారు వస్తూ ఉండేవారన్నావు. ఆయన రావడం లేదేమిటి ఇప్పుడు?”

“ఈమధ్య ఆయన కూడా రావడం తగ్గించేశారు. నాలుగుసార్లు పిలిస్తే ఒకసారి కనిపిస్తారండీ మొక్కుబడి తీర్చుకున్నట్టు. ఆయన ఎదురుగా వున్నంతసేపూ ఈయన కుదురుగానే వుంటారు. అయినా తాటిచెట్టు ఎక్కేవాణ్ణి ఎంతకని ఎగసన తోస్తాంలెండి.”

అనుకున్నట్టుగానే శనివారం పొద్దున్నే లేచి బయల్దేరేను. కారులో వెళ్తే నాలుగ్గంటలు, విమానం అయితే రెండువందలడాలర్లు. అంచేత నాకు కారులో వెళ్లడమే తేలిక. అక్కడికి చేరేవేళకి వీరన్న కూడా ఇంట్లోనే వున్నాడు.

సురేఖా, వీరన్నా ఇద్దరుపిల్లల్తో ఈదేశం వచ్చి ఏడాదవుతోంది. రాగానే అందరు తెలుగువారిలాగే, మనవాళ్లగురించి వాకబు చేస్తుంటే గాలివాటుగా నేను తగిలేను. మామధ్య పెద్ద చుట్టరికమేమీలేదు. వంశక్రమం తిరగతోడితే, ఏ బీరకాయపీచు సంబంధమో దొరుకునేమో. నేనంతగా పట్టించుకోలేదు. పుట్టినరోజులకీ, పండుగలకీ పబ్బాలకీ పిలుస్తూంటుంది. ఆ అమ్మాయి పిలిచినప్పుడు వెళ్లి నాలుగు మంచిమాటలుచెప్పి కాలక్షేపం చేసి వచ్చేస్తుంటానంతే.

వచ్చి నాలుగునెలలు తిరక్కముందే కలతలు ప్రారంభమయేయి. ఇంతా చేస్తే పెద్ద తగువులేమీ కాదు. వడ్లగింజలో బియ్యపుగింజ. దేశం కానీ దేశం. తెలుగు తప్ప మరోభాష రాదు సురేఖకి. పెద్దకుటుంబంలో మసలినపడచు. బిక్కుబిక్కుమంటూ రోజంతా ఇంట్లో ఒక్కత్తీ కూచోడం విసుగు. వీధిలోకెళ్లడానికి భయం. వీరన్న ఏమంత అభ్యుదయభావాలు కలవాడు కాడు.

“ఇంట్లో ఊరికే కూచుంటే నాకేమీ తోచడంలేదు. డ్రైవింగ్ నేర్చుకుంటాను,” అంది సురేఖ.

“ఎందుకూ? నేను తీసుకెళ్తున్నాను కదా ఎక్కడికి కావలిస్తే అక్కడికి. బోలెడు ఇన్సూరెన్సు. అదో ఖర్చు ఎందుకూ? దండగ,” అన్నాడతను. ఇల్లూ, పిల్లలూ, ఇంట్లో టీవీ, ఎడతెగకుండా వచ్చే పోయే అతగాడి స్నేహబృందం – ఇన్ని వుండగా ఆడదానికి తోచకపోవడం ఏమిటి అని అతనికి ఆశ్చర్యం.

“సిగపూవు వాడకుండా, కడుపులో చల్ల కదలకుండా, ఇంట్లో కూచోమంటే నీక్కష్టంగా వుందా? నేనైతే రాజెవరికొడుకన్నంత ధీమాగా కూచుంటాను. వీధిలోకెళ్లి అడ్డమైనవాళ్లకీ ఒంగి ఒంగి సలాములు కొట్టుకుంటూ ప్రతిక్షణం ఉంటుందో ఊడుతుందో తెలీని ఉద్యోగంకోసం వెంపర్లాడుతూ గడుపుకోడం ఎందుకోసం? నీకోసం, నీపిల్లలకోసం కాదూ? బుద్ధి గడ్డితిని మీభారం నెత్తినేసుకున్నట్టున్నాను,” అన్నాడోసారి విసుక్కుంటూ. ఆపైన, అంతగా తోచకపోతే పక్కింటిపిల్లల్ని బేబీసిట్ చెయ్యమన్నాడు. కాలక్షేపంగానూ వుంటుంది, నాలుగురాళ్లు కళ్ల చూస్తాం అని కూడా చెప్పేడు. అదీ కాకపోతే మరో పాపనో బాబునో మనమే కందాం అన్నాడు ముచ్చట పడిపోతూ.

సురేఖ మరి మాటాడలేదు.

ఆరోజుల్లోనే బ్రహ్మంగారితో పరిచయమయింది. కొత్తలో నెలకోమారుతో మొదలయి, క్రమంగా వారానికోమారు, నాలుగురోజులకోమారు … ఇంచుమించు రోజూ కనిపించడం, వీళ్లింట్లోనే భోజనాలూ అయిపోయింది అనతికాలంలోనే. అదే సమయంలో వీరన్నకి ఉద్యోగం పోవడం, మరొకటి దొరక్క మనశ్శాంతి లోపించడం, దాంతో ఇల్లాలిమీదా, పిల్లలమీదా కసుర్లూ, విసుర్లూ – వీటన్నిటిమధ్యా బ్రహ్మంగారి రాక ఒక వరమే అయింది ఆదంపతులకి. వీరన్న బయట ఉద్యోగంకోసం పడేఅవస్థలు సురేఖకీ, సురేఖఅశాంతికి కారణాలు వీరన్నకీ వివరంగా బోధిస్తూ, సమయానికి తగుమాటలాడుతూ వారికాపురం నిలబెట్టి ఒకసత్కార్యం సాధించేరు బ్రహ్మంగారు. వారిద్దరికీ ఆయన తల్లీ, తండ్రీ, గురువూ, దైవం, హితుడూ, సఖుడూ కూడా అయిపోయారు.

ఏదో మాటలసందర్భంలో సురేఖ నాకీసంగతులన్నీ చెప్పినప్పుడు నాకెందుకో చిత్రంగా అనిపించింది.

“ఆయనకేం ఇల్లూ, వాకిలీ, పెళ్లాం, పిల్లలూ లేరేమిటి?” అన్నాను.

“ఉన్నార్ట,” అంది సురేఖ. ఎక్క డ? అని తనూ అడగలేదు, నేనూ అడగలేదు!

సురేఖతో కొంచెసేపు మాటాడి, పిల్లలు గోలచేస్తున్నారని మాల్‌కి బయల్దేరేం. అక్కడ తిరుగుతుండగా, పిల్లలు, “బామా అంకుల్” అంటూ అరిచేరు. నేనూ, సురేఖా అటుతిరిగి చూసేం.

పిల్లలిద్దరూ ఆయనకాళ్ల చుట్టేశారు. వాళ్లకి ఆయనదగ్గిర బాగా చనువున్నట్టే కనిపించింది. ఆయన మాత్రం అంతగా ఆనందించినట్టు కనిపించలేదు.

“ఏమిటి అంకుల్! మీరసలు కనిపించడమే లేదు. మాకేం బాగులేదు,” అంది సురేఖ.

“లేదమ్మా. ఈమధ్య పనులతో తీరడంలేతు. వస్తాను. వీరన్న బావున్నాడా? ఉద్యోగం దొరికిందా?” అని, పక్కనున్న అమ్మాయివేపు తిరిగి, “మనవాళ్లే. నీతరవాత, అంతటి ఆప్తురాలనుకో సురేఖ,” అన్నారాయన.

నాకెందుకో ఈసంభాషణ అంతా తెచ్చిపెట్టుకున్నట్టుగా అనిపించసాగింది. బ్రహ్మంగారు కూడా ఎప్పుడెప్పుడా అని దిక్కులు చూస్తున్నారు.

సురేఖ అది గమనించిందేమో, “వీలయినప్పుడు రండోమారు,” అని ఆయనతోనూ, “పోదామా” అని నాతోనూ ఒకేవాక్యంలో స్వస్తి చెప్పేసింది ఆసంభాషణకి, ఇంక భరించలేనట్టు.

దారిపొడుగునా ముభావంగానే వుంది. ఇంటికి చేరగానే ఫ్రిజ్‌లో వున్నవి మైక్రొవేవ్‌లో వెచ్చబెట్టుకుని భోజనాలు అయిందనిపించేం. పిల్లలు వాళ్ల గదుల్లోకి వెళ్లిపోయినతరవాత, “ఇప్పుడు చెప్పు,” అన్నాను సురేఖతో.

“ఏం చెప్పను?”

“ఏదో ఆలోచిస్తున్నట్టు వున్నావు. ఏమిటదనీ?”

“ఏం లేదాంటీ. బ్రహ్మంగారిమాటే ఆలోచిస్తున్నాను.”

“అదే, ఏమిటని?”

“అదే .. ఇందాకా మాల్లో – ‘నీతరవాత నీఅంతటి ఆప్తురాలు’ అన్నారే .. అది”

నేను నవ్వేశాను. “ఈర్ష్యా?” అంటూ.

సురేఖ నవ్వలేదు. “అదికాదండీ. మేం ఆయన్ని కలుసుకున్న తొలిరోజుల్లో సరీగ్గా ఇలాటిసంఘటనే జరిగింది. అప్పట్లో ఆయనప్రక్కన వున్నది నేనూ,” అంది సాలోచనగా.

సురేఖ ఆలోచిస్తున్నది ఎవరు ఆయనకి ఎక్కువ అని కాదు. బ్రహ్మంగారితత్త్త్వంగురించి అన్నమాట.

మరో పదినిముషాలు ఆమాటా ఈమాటా చెప్పి తనగదికి వెళ్లిపోయింది, పడుకోండి అంటూ.

నేను మాత్రం ఆబ్రహ్మంగారితత్త్వంగురించే ఆలోచిస్తూ వుండిపోయాను చాలాసేపు.

కొందరు ప్రతివారితోనూ ఆప్యాయంగానే, ప్రాణం పెట్టినట్టే మాటాడతారు, నిజంగా ప్రాణం పెడతారా అంటే ఏమో! ఒకరితరవాత ఒకరిని – కష్టాల్లో వున్నవారిని ఆదుకోడమే పరమావధిగా – క్రెడిట్‌కార్డుమీద బతికినట్టు రోజులు గడుపుకుంటారు. అలా ఆదుకుంటూ పోవడంలో కొన్ని సదుపాయాలున్నాయి. మోకాటిలోతునీటిలో ఈతలాగ భవబంధాలు బలంగా చుట్టుకోవు వారిని. అలాటి బంధనాలు ఏర్పడేసూచనలు కనిపించగానే విదిలించుకు లేచిపోతారు వారు. అది ఒకవిధమైన పిరికితనం కావచ్చు. పొరుగిళ్ల సరదాగా కాలక్షేపం చేస్తూ తిరిగే నిక్షేపరాయుళ్లని ఎవరినయినా చూడండి. అక్కడ వారు చూపే హుషారు అంతా ఇంతా కాదు. …

హుషారనగానే గుర్తుకొచ్చింది ఇండియాలో ఆనందుసంగతి. ఆ ఆనందే ఈ బ్రహ్మం కాదు కదా?! కావచ్చు.

కరుణ చెప్పినకథకీ సురేఖ చెప్పినకథకీ చాలా సామ్యం వుంది. ఆపత్రికలో బొమ్మ నేనంతగా పట్టి చూడలేదు కానీ వాళ్లు ఏపాతబొమ్మో ప్రచురించి వుండవచ్చు. జె.బి. ఆనంద్ అని చూసినట్టు గుర్తు.

ప్రాణి కోరేది సుఖమూ, శాంతీ .. వాటికోసమే నానాతాపత్రయాలూను. ఓపక్క తనసుఖంకోసం ఆరాటం, మరోపక్క పక్కవాడిఅండకోసం తపన. రెండూ ముఖ్యమే. మరి ఈరెంటికీ చుక్కెదురైతే?

వ్యవస్థ ఏర్పడినప్పుడే నియమాలూ ఏర్పడ్డాయి. పొరుగువాడు సుఖంగా ఉంటేనే మనకీ సుఖం అన్న నీతి కావచ్చు. మతంపేరుతో పరలోకసుఖాలు ఎర చూపినా, ప్రజాస్వామ్యంపేరుతో ఇహలోకసుఖాలు అందించినా ఆంతర్యం ఒకటే. ఆమతమూ, ఈప్రజాస్వామ్యమూ చేసినకట్టడికీ సొంతసుఖాలకీ పొంతన కుదరకపోతే అడ్డదారులూ, చుట్టుదారులే శరణ్యం. ఎలా చూసినా తనసుఖంకోసమే నానా అవస్థలూ అనిపిస్తోంది …

అక్కడ కరుణా, ఇక్కడ సురేఖా, వీరన్నా, ఆనందూ, బ్రహ్మంగారూ లేక బ్రహ్మానందం – వీరందరిలో ఎవరు ఎవరికి ఆలంబన అంటే ఆపరబ్రహ్మమే చెప్పాలి.

ఆహా! ఆనందో బ్రహ్మా!

(ఏప్రిల్ 2003. తొలిసారిగా వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది.)


[1] కొడవటిగంటి కుటుంబరావు. స్త్రీనిరసనపట్ల వ్యాఖ్య. ఆంధ్రజ్యోతి వారపత్రిక. లోకాభిప్రాయం. 28 జనవరి 1977 పుట 2.

డయాస్ఫొరా కథ

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఆనందో బ్రహ్మా”

 1. రాధిక గారూ,
  నిజానకి మీటపా నాకు ధైర్యాన్నిచ్చింది. ఈకథ రాయడంలో నేను అనుకున్న ధ్యేయం సాధించానన్నమాట. Thanks for writing.
  నావుద్దేశం మీరు సరిగ్గానే చదివారు (ఇక్కడ ఏ క్రియాపదం వాడాలో తెలీడంలేదు).
  ప్రతిపాత్రచేత వారికోణంనుండే మాటాడించడానికి ప్రయత్నించాను.
  సురేఖవిషయంలో సాయం కాదు, స్నేహంగురించిన తపన. ఆయనని చాలా ఆప్తుడు అనుకుని, ఆస్నేహం శాశ్వతం అని ఆమె ఆశించింది. కాని ఆనందు మీరన్నట్టు అవసరం అయినవారికి అవసరం అయినప్పుడు సాయం చేసేసి, వెళ్లిపోతాడు. ఆతేడా చూపించాను. అంతే. అందులో ఎవరి తప్పు అన్న ప్రశ్న నేను వేసుకోలేదు.

  మెచ్చుకోండి

 2. నా చిన్న బుర్రకి అర్ధం కాలేదు.ఈ కధలో కనక మహాలక్ష్మి లా వున్న ఆ పెద్దావిడ చెప్పిన దానిలో తప్పేముంది?అలా అని కరుణ బ్రతుకులో కూడా తప్పు కనపడట్లేదు.పంతులమ్మగా తన బ్రతుకు తాను గొప్పగా బ్రతుకుతుంది.అలాగే బ్రహ్మం గారు అన్న మాటల గురించి సురేఖ ఎందుకు అంత బాధ పడుతుంది?ఆనందులా చెడ్డవాడే కావచ్చు.కానీ వీళ్ళ సంసారాన్ని ఒడ్డుకు చేర్చ్చడంలో ఎంతో పెద్దరికం గా వ్యవహరించాడుగా.ఆయన వల్ల తనేమీ నష్టపోలేదు కదా?ఎవరయినా ఎంతకాలం సాయపడతారు?
  చాలా ప్రశ్నలు వేసానుకదా.మీ పాత్రలని తప్పుగా అర్ధం చేసుకుని వుంటే క్షమించండి.మీ కధలో ఏ లోపమూ లేదు.వుంటే అది నా అవగాహనా లోపమే.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s