ఊసుపోక – నసాంకేతికాలు

(ఎన్నెం కతలు – 3)

హెచ్చరిక – ఘనసాంకేతికనిపుణులకు ఈ అసాకేంతికాలూ, నసాంకేతికాలు నచ్చవు. ఇది కేవలం నాలాటి అసాంకేతికేయులతోనూ (బొత్తిగా సాంకేతికపరిజ్ఞానం లేనివారు), నసాంకేతికేయులతోనూ (ఏదో తెలుసుకోవాలన్న తహతహతో నస పెట్టే మధ్యస్థ సాంకేతికేయులు) కలబోసుకు ఇకిలించుకోడానికి మాత్రమే.

ఈతరతమతరగతులని ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే – బుద్ధిగా కాలేజీకెళ్లి చక్కగా చదువుకుని సాంకేతికనిపుణులుగా చెలగుతున్నవారు ఘనసాంకేతికనిపుణులు. వీరు నిరంతరం ప్రోగ్రాములు రాయడమో, పాతవి తిరగరాయడమో చేస్తూ సకలజనులకు వెలుగు చూపుతారు. (అందువల్ల నాలాటివారికి కాస్త ఇబ్బందే కాని అది తరవాత చెప్తాను) రెండోతరగతి – కీబోర్డుమీద చెయ్యేస్తే అరిగిపోతుందో విరిగిపోతుందోనని బెదిరపోయేవాళ్లు అసాంకేతికేయులు. అవును, తల్లీ, బాబూ, ఇలాటివారు 21వ శతాబ్దంలో అమెరికాలోనే వున్నారు. ఇహ మూడో తరగతి – నసాంతికేయులు కొంచెం తెలిసీ, అట్టే తెలీకా, కీబోర్డుని గెలవలేకా వదిలిపెట్టలేకా త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడేవాళ్లు. కొన్నివిషయాల్లో అసాంకేతికేయులకి చాలా తెలిసినదానిలా కనిపిస్తూనూ, సాంకేతికేయులకి అదేమిటీ ఇదేమిటీ అంటూ నసపెట్టే నసాంకేతికేయులుగానూ కనిపించే జాతి. నేను ఈకోవలో చేరుతాను. (ఎసైడు – ఒక్కొక్కప్పుడు మావూళ్లో అసాకేంతికేయులకి ప్రాథమికపాఠాలు నేర్పుతుంటాను. ఆకారణంగా కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న తాపత్రయం.)

అసలు మాయింట్లో అందరూ లెక్కలవాళ్లే. ఇంటరులో లెక్కలగ్రూపు తీస్కోపోతే లెక్కలోకి రామని లెక్క మాఇయింట్లో. నేను మాత్రం కాదు కూడదని సాహిత్యంలోకి దిగేను. సాహిత్యం చదివి ఏంచేస్తావంటే పాఠాలు చెప్పుకుంటానన్నాను. ఇంగ్లీషులో ఓసామెతుంది. చెయ్యలేనివారు చెప్పడానికి సిద్ధమవుతారని. (those who can’t do, teach). అలాటి ఉన్నతాశయంతో సాహిత్యంలో పడ్డాను. కానీ నాది ఇంజినీరింగు బుర్ర అని నాకు నేనే చాలా చిన్నతనంలోనే కనిపెట్టేసుకున్నాను.
మాయింట్లో నాఇంజినీరింగు హార్డ్‌వేరుతోనే మొదలయింది. ఇంట్లో రేడియోలూ, ట్రాన్సిస్టార్లూ మాత్రం వీలయినప్పుడల్లా ఓ స్క్రూడ్రైవరు పుచ్చుకుని కనిపించిన స్క్రూ నల్లా వూడతీసి మళ్లీ సమీకరించేస్తూండేదాన్ని. అలా ఏకీలుకాకీలు వూడదీసి కూర్చిబెట్టింతరవాత సహజంగానే పొరపాట్లొస్తాయి. సరిగ్గా పనిచెయ్యదు. అప్పుడు రేడియో అయితే ఓమొట్టికాయ వెయ్యడమో, బల్ల కుదపడమో చేస్తాను. ట్రాన్నిస్టారయితే రెండుచేతులతోనూ పుచ్చుకుని గలగల్లాడించడమో ఎగరేసి పట్టుకోడమో చేస్తాను. ఒక్కోప్పుడు పని చేస్తాయి, … చెయ్యవు. .
ఆతరవాత కంప్యూటర్లు – నామొదటి కంప్యూటరు 8084 ప్రాసెసర్. అంటే కంప్యూటర్లకాలమానంలో పాతరాతియుగం అన్నమాట.
ఆరోజుల్లోనే నా సాఫ్టువేరు చదువు మొదలయింది. పైన చెప్పినరీతిలోనే. ప్రతి కీకొట్టి ఏమవుతుందో చూడ్డం అన్నమాట. నాకసలు పుస్తకాలు చదివి తెలుసుకోడం అన్నది ఆదినుండీ అట్టే పట్టుబడలేదు (ఇదీ అసలు కారణం నేను ఇంజినీరింగులో చేరకపోవడానికి).
దానికి యూజర్స్ మాన్యూల్లు కూడా కొంత సాయం చేసాయి. వైరు గోడనున్న ప్లగ్గుకి తగిలించేవా, కంప్యూటరు స్విచ్చి ఆన్చేశావా.. అంటూ సృష్టిప్రారంభందగ్గర మొదలు పెడితాయవి. అంచేత, మామూలుగా పుస్తకం పుచ్చుకున్నా నాలుగు పేజీలు దాటేసి, చూస్తాను నాకు కావలసిన అంశం వుందేమోనని.
సాఫ్టువేరు విద్యలో నాతొలియత్నం ఈమెయిలు సెటప్ చెయ్యడం. తీరా నాక్కావలసిన విషయానికొచ్చేసరికి, నీకు పనికొచ్చే బాడ్రేటు ఎంచుకో అని వచ్చింది. (ఆరోజుల్లో 28 బీపీయస్తో మొదలయిందని ఎంతమందికి తెలుసు మరియు గుర్తుంది?) నాకేది పనికొస్తుందో తెలిస్తే ఈమాన్యూలెందుకు అనుకుని, ఆపుస్తకం పక్కన పారేసి, ఒక్కొక్క కీయే కొట్టడం మొదలెట్టాను. అన్నీ పనిచేస్తున్నట్టే వున్నాయి. కాని మళ్లీ ఏదీ పనిచేసినట్టు లేదు. అలా కుస్తీలు పడుతూ కొయ్యగుర్రంలా ముందుకీ వెనక్కీ వూగుతూ వున్నచోటే వుంటూ రెండుగంటలసేపు గడిపి, ఆతరవాత మొత్తం మూసేసి, వెళ్లిపోయాను.
కాని నేనలా వూరుకోలేను అట్టేసేపు. అటూ ఇటూ తిరిగొచ్చి, మళ్లీ మొదలెపెట్టాను సాఫ్టువేరు ఇన్‌స్టాలు చేయడం. ఈసారి కస్టమ్ (ఫర్ ఎడ్వాన్సుడు యూసర్స్) అన్నది ఎంచుకున్నాను, చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి. (నువ్వు ఎడ్వాన్సుడు కాదు కదా అని ఎవరైనా రొకాయిస్తారేమోనని). ఆకస్టములో ఏదీ మార్చకుండా వున్నదున్నట్టుంచి, పద, పదమంటూ నడిపించుకు పోయాను మొదటివరస. మళ్లీ వెనక్కొచ్చీ ఒకొక సెట్టింగూ మార్చుకుంటూ పోయేను. …ఇలా చేస్తుంటే ఒక్కోసారి మనకి పనికొచ్చేది సరిగ్గా తగులుతుంది. ఒక్కొక్కప్పుడు మొత్తం సిస్టమంతా పొలోమంటూ కూలిపోతుంది పేకమేడలా. సాహసమువలన సమకూరు పనులు ధరలోన అని అనిపించదప్పుడు. (అంటే నేను అలా చెయ్యడం మానేశానని అపార్థం చేసుకోకండి).
మొత్తంమీద ఇలా నేను సాఫ్టువేరు రహస్యాలు చాలానే గ్రహించేను. కొండొకచో నాదుష్టబుద్ధిని కంప్యూటర్లు అప్రీషియేటు చెయ్యలేవని తెలుసుకోడం కూడా ఈచదువులో భాగమే.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, శనివారం,, సోంవారం, పోలేరమావాస్యా, వైకుంఠేకాదశీ ,.. వుపోషాలుండడం తేలికేనేమో కాని కీబోర్ఢుమీద చెయ్యెయ్యకుండా దినము గడవదు నాకు – అర్జనుడికి శ్రీకృష్ణునివలె సచివుడూ, గురువూ, దైవమూ, బంధువూ, ఇహమూ, పరమూను.
ఇంకా ఈకీకారణ్యంలో వెలుగురేఖ – నా పూర్వజన్మ సంచితార్థం, ఈలోహ మరియు ప్లాస్టిక్ సంచయం,మూలంగా నాకు ఆప్తులయిన నిజమనుషులు కూడా వున్నారు. దేశ, కాల, పరిస్థితులనీ, జాతి, కుల, మత, వయో వివక్షతలనీ అధిగమించిన కంప్యూటరుని కాదనడం ఎవరితరం, సాంకేతికంగా ఎంత నాస్తికులయితే మాత్రం?

000

మీకింకా నవ్వు రాలేదూ? సరే, యాంత్రికాలమీద నా సొద కూడా ఆలకించండి, ఇదుగో లింకు

(మార్చి 2008)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఊసుపోక – నసాంకేతికాలు”

 1. కొత్తపాళీ, సౌమ్య, ప్రవీణ్, చదువరి గారూ..
  ఓపిగ్గా చదివి, సహృదయతతో స్పందించిన మీఅందరికీ నా ధన్యవాదాలు.
  చదువరి గారూ, మీకు తెలుసుకద పూర్వకాలంలో కవులు కోపంవస్తే పద్యాలు రాసేసేవారు అవతలివారిమీద. ఇప్పుడు ప్రోగ్రామరులు ఉగ్రులై మరో ప్రోగ్రాము రాసేగలరు నామీద … :). అయినా ప్రయత్నిస్తాలెండి…

  మెచ్చుకోండి

 2. గొప్పగా రాసారు. “సృష్టిప్రారంభం దగ్గర నుండి”, “కొయ్యగుర్రంలా” – ఇలాంటి ఉపమానాలు రాయటంలో మీకు సాటిలేదు. అన్నట్టు ఈ సాంకేతికుల వలన మనబోటి నసాంకేతికులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి మీరు రాయబోయే టపా కోసం ఎదురు చూస్తాను.

  మెచ్చుకోండి

 3. “దేశ, కాల, పరిస్థితులనీ, జాతి, కుల, మత, వయో వివక్షతలనీ అధిగమించిన కంప్యూటరుని కాదనడం ఎవరితరం, సాంకేతికంగా ఎంత నాస్తికులయితే మాత్రం?”
  -True!
  “ఈలోహ మరియు ప్లాస్టిక్ సంచయం,మూలంగా నాకు ఆప్తులయిన నిజమనుషులు కూడా వున్నారు.”
  -Double True!
  “కీబోర్ఢుమీద చెయ్యెయ్యకుండా దినము గడవదు నాక”
  -Triple True!

  :)) భలే ఉందండీ… I thoroughly enjoyed reading this…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s