నవ్వరాదు

“కమలిని సీరియస్. స్టార్ట్ ఇమిడియట్లీ.”

నాచేతిలో గులాబీరంగు కాయితం రెపరెపలాడుతోంది.

“నవ్వుతావేమిటే?” అంది అమ్మ విసుగ్గా.

ఈమారు గట్టిగానే నవ్వేశాను. “కమలిని సీరియస్సేమిటమ్మా శ్రీరాముడి మళ్ళీపెళ్ళిలాగ. అది సీరయస్ అయితే నేను నవ్వాల్సిందే మరి,” అన్నాను.

000

“ఎందుకే ఏదో ములిగిపోతున్నట్టు, విశ్వసంసారం చేసి అలసిపోయి ముసలి ముత్తైదువులాగ మొహం పెట్టుకుని కూచుంటావు ఎప్పుడూను. నన్ను చూసయినా నిండుగా నవ్వడం నేర్చుకోవే,” అంటూ హాయిగా నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ లోకంసర్కస్‌లో కామెడీ క్వీన్‌లా చరించే కమలిని సీరియస్ అంటే నాకు నమ్మాలనిపించలేదు.

000

నేను ఫోర్తుఫారంలో ఉండగా నాన్నగారికి గుంటూరు బదిలీ అయింది. మా ఇంట్లో క్రమశిక్షణవల్లనయితేనేమి, స్కూల్లో ఆలస్యంగా చేరడంవల్ల కలిగిన ఇబ్బందులవల్లనయితేనేమి నేను ఎవరితోనూ కలవక, ఇంట్లో వంచినతల క్లాసులోనూ, క్లాసులో బయల్దేరితే ఇంట్లోనూగా ఉండేదాన్ని. క్లాసులో మేం మొత్తం పన్నెండుమందిమి ఆడపిల్లలం ఉన్నా, ఇరవై ఆరుగురు మొగపిల్లలున్నా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేది కమలిని ఒక్కత్తే! చాలామటుకు ఆడపిల్లలు తన స్నేహంకోసం తనచుట్టూ చేరడం గమనించేనేమో నేను మరీ దూరంగా తిరగడం మొదలుపెట్టేను.

నేను చేరినమర్నాడే ఒక లేడీ టీచరు స్కూల్లో చేరింది. ఆవిడ మాక్లాసుకి రాగానే ప్లాట్‌ఫారంమీదకి ఎక్కబోతూ హైహీల్సు అంచునపడ్డంతో జారి వెనక్కి పడింది. క్లాసంతా నవ్వినా, అందరిలోనూ బాగా తెలిసింది కమలిని నవ్వే. అందులోనూ చిత్రమేమిటంటే టీచరు తమాషాగా మొగ్గ వేసి ఏం జరిగిందో గమనించేలోపున తనసీట్లో ఉంది.

కమలిని చప్పట్లు కొట్టి, “శభాష్ మేడం! ఏ సర్కసులోనూ ఇంత అద్భుతమైన ఫీటు చూపించి ఉండరు. బస్తీ మే సవాల్,” అంది గలగలా నవ్వుతూ.

మేం అందరం ఏం జరుగుతుందోనని భయంభయంగా చూస్తున్నాం. టీచరు మాత్రం కమలినివేపు తీక్షణంగా చూసి ఎటెండెన్సు తీసుకోడం మొదలెట్టేరు. వెంటనే పాఠం మొదలుపెట్టకుండా, వెనకటి పాఠాల్లో ప్రశ్నలు వేస్తానని కమలినిని నిలబెట్టింది.

తేలిగ్గా ఉండే ప్రశ్నలు, కఠినమైనవి, చిక్కు ప్రశ్నలూ – ఆపైన చెప్పనిపాఠాల్లోనూ అడిగింది. కమలిని కొన్నింటికి జవాబులు చెప్పింది, కొన్నింటికి చెప్పలేదు. అంతసేపూ నవ్వుతూనే ఉంది. టీచరి “టేక్ యువర్ సీట్” అన్నప్పుడు – ఆవిడకి కలిగింది కోపమో, హర్షమో మాకు అప్పట్లో తెలీనేలేదు. ఆరోజు సాయంత్రం నేను పుస్తకాలు పట్టుకుని ముందు వెళ్ళిపోతుంటే, వెనకనించి కమలిని వచ్చి ఆపింది.

“ఛూడు, మాయిల్లు కూడా అటువేపే. నాతో రా. దగ్గిరతోవ చూపిస్తాను,” అంది.

నాకు ఆ పిల్ల పద్ధతి నచ్చలేదు. “అక్కర్లేదు. నువ్వెళ్ళు,” అన్నాను చిరాగ్గా.

“సరే, నేనూ మెయిన్ రోడ్డుమీంచే వస్తాలే, పద,” అంది.

దార్లో అడిగేను, “క్లాసులో ఎందుకలా నవ్వుతావు? టీచర్లేం అనుకుంటారు?”

“నవ్వితే ఊపిరితిత్తులు బాగుపడతాయి. ఊపిరితిత్తులు బాగుంటే ఆరోగ్యం తెలుసా?” అంది గంభీరంగా మొహం పెట్టి. ఆ గాంభీర్యం అంతా వేళాకోళం అని తెలుస్తూనే ఉంది.

నేను మాటాడలేదు.

కమలిని ఫక్కున నవ్వేసింది.

“ఇప్పుడెందుకు నవ్వొచ్చిందీ?” అన్నాను.

“అదే. నేను నవ్వితే నీకెందుకంత ?”

ఏం సమాధానం చెప్పను?

దారిపొడుగునా అల్లరి చేస్తూనే ఉంది. మంచి విసురుగా వస్తున్న సైకిలుకి ఎదురుగా వెళ్ళింది. నేను బెదిరిపోయి రెక్క పుచ్చుకు పక్కకి లాగితే మళ్ళీ అదే నవ్వు.

“ఎందుకంత భయం? అతను నన్ను తప్పుకుంటాడని నాకు ముందే తెలుసు. ఎందుకో తెలుసా? అతను మా మేనత్తకొడుకే.”

కమలిని నిజం చెబుతూందో కట్టుకథే చెబుతోందో నాకర్థం కాలేదు. నేను మౌనంగా తలొంచుకుని కొనకళ్ళ తనముఖం పరీక్షగా చూసేను. ఓ మొస్తరు కోలమొహం, ఎత్తుగా ఉన్న చెంపలమీద కనీ కనిపించని చిన్నగుంట ఎల్లవేళలా తిష్ఠ వేసుకుని ఉండేట్టుంది. కళ్ళూ, ముక్కూ విడివిడిగా చూస్తే అందం అనిపించకపోయినా సదా ఉండే ఆ హాసరేఖలమూలంగా మంచి కళ వచ్చింది ఆ ముఖానికి.

క్రమంగా మేం ఇద్దరం విడదీయరాని స్నేహం పెంచుకున్నాం. ఆకారవిశేషాల్లో కూడా కొంచెం పోలికలుండడాన్నేమో కొత్తవాళ్ళు మమ్మల్ని ఓ తల్లిపిల్లలు అనుకునేవారు. మొహం వాచేలా చీవాట్లేస్తే అమాయకంగా నవ్వేసే కమలిని అంటే టీచర్లకి కూడా అభిమానంగానే ఉండేది. ముఖ్యంగా తన షార్ప్ విట్ అందర్నీ ఆకర్షించిందనుకుంటాను. తన చుట్టూ చేరే పిల్లలగుంపుని చిరాగ్గా విదిలించుకు నేను దూరంగా వెళ్ళి కూచుంటే, తనొచ్చి నాపక్కన కూర్చునేదు.

“అంత గుంపు నేను భరించలేను. నీపటాలాన్నంతటినీ వెంటబెట్టుకువచ్చి నామీదెందుకు దండెత్తుతావు?” అంటాన్నేను.

“ఏం చేస్తాం. వాళ్ళు నావెంటా, నేను నీవెంటా, నువ్వు మరొకరివెంటా బడడం అనేది ఒక విషవలయం. సృష్ట్యాదినించీ వస్తున్న సినిమాకథ. అంత కారం ఒంటికి మంచిది వినవు. ఇదుగో, ఇలా కోపం తెచ్చుకుంటావు,” అంటూ విరగబడి నవ్వుతుంది.

నేను పుస్తకం తీసుకుని కూచుంటాను. నాపుస్తకం లాగేస్తుంది. కలం దాచేస్తుంది. పెన్సిలుతో రాసుకుంటుంటే చేతిమీద కొడుతుంది. నేనేమీ అనలేను.

యస్సెల్సీ అయిపోయేవరకూ ఇద్దరం ఒకటిగా తిరిగేం. తను అతిగా నవ్వడం, నేను అతి సీరియస్‌గా పైకి భిన్నంగా కనిపించినా, అంతర్గతమైన ఒక భావతతి మమ్మల్ని ప్రాణమిత్రులుగా చేసిందనుకుంటాను. అందుకే యస్సెల్సీ అయిపోయిన తరవాత కాలేజీలో చేరడానికి దాన్ని అడక్కుండానే రెండు అప్లికేషనుఫారాలు తెప్పించేను.

అవి పట్టుకుని సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళేను. “నువ్వే చెప్పు ఏగ్రూపు తీసుకుందామో,” అని అడిగేను.

“ధీంతో ఏరోప్లేను చెయ్యనా?” అంది ఒక ఫారం తీసుకుని.

“అదేమిటి? నువ్వు కాలేజీలో చేరవూ?” నిర్ఘాంతపోయేను.

“అదేమిటి? నువ్వు కాలేజీలో చేర్తావా?” అంది నన్ను అనుకరిస్తూ.

నాలా ఒకతరంగంగా లేచిన, స్పష్టంగా చెప్పలేని ఒక భావం అణిగిపోయిన తరవాత అడిగేను, నాకిన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదని.

దానిచేతిలో పచ్చని ఫారం ఈలికలువాలికలై విమానంగా మారిపోతోంది. అది నాబాధ గమనించనట్టు, “పేపర్లో వేయించేనే పధ్నాలుగో తారీకు హిందూ చూళ్ళేదూ? రెండో పేజీ, ఆరోకాలం మీదినించి కిందకి వరసగా మూడో పేరా.”

“ఏగ్రూపు తీసుకుందాం అని నేనడగితే పనస చదువుతావేం?”

“హెచ్. యస్. సి. డబుల్.”

“అదేమిటి?” నాకు చెప్పలేనంత కోపం వస్తోంది.

“నువ్వు అలా చిరాగ్గా మొహం పెడితే అస్సలు బావుండవని చాలామార్లు చెప్పేను. హెచ్చంటే హౌస్‌హోల్డూ, హస్బెండూ, యస్సంటే సొసైటీ, సెల్ఫు సర్విసూ, సి అంటే చిల్డ్రనూ, కుకింగూ. అంచేత అది డబుల్. బావులే?”

“బావులేకేం,” అని కూడా అనలేకపోయేను.

“నువ్వు యంబీ చదివి, టీబీ స్పషలైజు చేసి, ఆ వార్డులో పని చేస్తే, అసలు టీబీ అనేది లేకుండా పోతుంది,” సైన్సు టీచరు అన్నప్పుడు “నిజం మేడం,” అన్న కమలిని ఏదీ? “నువ్వు లా చదివి ప్రాక్టీసు పెడితే మీ పోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చేస్తాయి,” అని మానాన్నగారు అంటే, “మానాన్నగారు కూడా అదే అంటారండీ,” అన్న కమలిని? భవిష్యత్తులో తానేదో పెద్దచదువులు చదివి ఊడబొడిచేస్తానని కమలిని ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి కమలిని రేపటిగురించి, నిన్నటిగురించి మాట్లాడగా విన్నవాళ్ళు లేరు. కానీ ప్రతిక్లాసులోనూ మంచి మార్కులు తెచ్చుకుంటూ, అందరు టీచర్ల అభిమానానికి పాత్రురాలయిన కమలని ఇలా అర్థంతరంగా చదువు ఆపేస్తుందనుకోలేకపోయేను. కమలిని లేకుండా కాలేజీకి వెళ్ళడం నేను ఊహించుకోలేకపోయేను. అందుకే ఆ వెంటనే ఇంటికొచ్చేసి మంచంమీద పడుకుని ఏడ్చేస్తే కానీ మనసు స్తిమితపడలేదు.

“ఏమైందే?” అని అడిగిన అమ్మకి జవాబు మాతర్ం చెప్పలేకపోయేను.

మరునాడు నాన్నగారు “అప్లికేషను ఫారాలేవీ?” అని అడిగితే, “నేను కాలేజీలో చేరను,” అన్నాను జవాబుగా.

“ఏం?” అన్నారు నాన్నగారు ఆశ్చర్యంగా.

నేను మాటాడలేదు. అమ్మని అడిగినట్టున్నారు. అమ్మ తనకేమీ తెలీదనీ, ముందురోజు కమలినిదగ్గరికి ఫారాలు తీసుకెళ్ళేననీ చెబుతోంది.

ఆ సాయంత్రం నేను కమలినియింటికి వెళ్తే, “ఏమే, పిచ్చిమొహమా! చదివించండి మొర్రో అంటూ నెత్తీ నోరూ కొట్టుకు ఏడ్చే ఆడపిల్లలు ఆంధ్రదేశం నిండా కోకొల్లలు. మీనాన్నగారు చదివిస్తానంటే నువ్వు చదవనంటున్నావుట. ఏగాలి సోకిందే తల్లీ?” అంది కమలిని.

“నీగాలే,” అన్నాను సగం వేళాకోళంగానూ, సగం నిజంగానూ.

“బావుంది మీవరస. రేప్పొద్దున్న పెళ్ళయితే కూడా ఇద్దరూ ఒక్కణ్ణే కట్టుకునేట్టు ఉందే,” వాళ్ళమ్మ మా మాటలు విన్నారు కాబోలు సూటిగా విసిరేరు.

కమలిని గలగలా నవ్వుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. కొంచెంసేపు ఊరుకుని, “అయితే నీకు పెళ్ళా?” అని అడిగేను.

“చెప్పలే .. హిందూ రెండో పేజీ ఆరో కాలం …”

“ప్చ్. ఏమీటలా పనస చదువుతున్నావు?”

“అది మేట్రిమోనియల్ కాలం. అందులో మూడో ప్రకటన నాకోసమే పడిందని నాన్నగారూ, నీకోసం పడిందని నేనూ వాదించుకుంటున్నాం. దానిమీద మానాన్నగారు గెలుస్తారని మా అమ్మా, నేను గెలుస్తానని నువ్వు పందెం కాస్తున్నారుట.”

“నువ్వెప్పుడూ ఇంతే. ఏదీ సరిగ్గా చెప్పవు.”

“ఈ గుర్రప్పందేలకి జడ్జి ఆ పెళ్ళికొడుకు రేపు వస్తున్నాడు.” ఈవార్త దాన్లో ఎలాటి భావాలను రేపిందో నాకర్థం కాలేదు. అడిగి ప్రయోజనం కూడా లేదు.

అతను వచ్చి వెళ్ళిపోయింతరవాత నేను వెళ్ళి, “ఏమైందే?” అనడిగితే అది విరగబడి నవ్వేసింది, “కుర్రాడిజాతకం బావుంది,” అంటూ.

“బావుంటే ఇంకే మరి,” అన్నాను.

“లక్కీ ఫెలో. తప్పించుకుపోయేడు.”

“నీమెప్పుదల మండినట్టే ఉంది,” అంటున్నారు వాళ్ళమ్మ వెనకనించి.

000

కాలేజీలో చేరనన్న నేను బి.ఎ., యం.ఎ., మరొక యం.ఎ. కూడా చదవడం అయిపోయింది.

కమలినిని చూడ్డానికి పెళ్ళికొడుకులు వస్తున్నారు, పోతున్నారు. ఏఒక్కటీ స్థిరపడలేదు చెప్పుకోదగినంత పెద్ద కారణం ఏమీ కనిపించకపోయినా. కమలిని మాత్రం విచారించినట్టు కనిపించలేదు. చదువూ, సంస్కారం, సంగీతం, సాహిత్యం – ఏ వ్యాపకమూ లేని కమలిని, ఆరేళ్ళనాడు ఎలా చూశానో అలాగే నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న కమలినిని చూసి అనుకున్నాను వరసగా వారంరోజులు శలవులొస్తే ఏం చెయ్యాలేం చెయ్యాలని కొట్టుకుపోయే యువతకి అది ఓ చక్కని జవాబు అని. నిజానికి ఈ ఆరేళ్ళలో అది తల్చుకు ఏడవాల్సింది చాలా ఉంది. తల్లి పరమపదించింది. తండ్రి ఒకవిధంగా సన్యాసం స్వీకరించి, సంసారబాధ్యతల్ని కొడుక్కీ, కోడలికీ అప్పగించేశారు.

“కమలిని ఉంది కనక సరిపోతోంది కానీ ఇట్టు పిల్లల్నీ అటు వంటా, పనీ నాతరమా,” అంటూ అవ్యాజానురాగం ఒలకబోస్తుంది వదినగారు.

“ఏం చూసుకునే అలా మురిసిపోతున్నావు?” అని అడిగే గుండె నాకు లేకపోయింది.

నిర్లిప్తంగా ఉండిపోయిన నన్ను చూసి, “నువ్వింకా ఎదగలేదే సరస్వతీ! చిన్నప్పుడు లోకం చూసి బెదిరిపోయి దిగులు పడ్డావనుకున్నాను. ఇప్పటికీ నీకర్థం కాలేదు మనం ఏడ్చినా నవ్వినా ఒకటేనని. చూడు, పొద్దున్నే అయిదుగంటలకి లేస్తానా, కాఫీనీళ్ళు పడేసి, పిల్లలందరికీ స్నానాలు చేయించి, ముస్తాబు చేసేసరికి తొమ్మిదవుతుంది. మూడేళ్ళకి పైబడిన బ్యాచంతా స్కూళ్ళకి పోతారు. మూడేళ్ళలోపువాళ్ళు ఒక బ్యాచి – ముగ్గురున్నారులే – పాపం మావదినే వాళ్ళని పట్టుక్కూచుంటుంది. నేను స్నానం చేసి వంట మొదలు పెట్టేసరికి పదిన్నర అవుతుంది. మధ్యాహ్నం ఒక అరగంటసేపు నిద్రపోతాను చూసుకో, ఏనుగులచేత తొక్కించినా లేవను. అసలు నన్నెవరూ డస్టర్బు చెయ్యరు కూడాను. చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో.”

విన్లేక, “మళ్ళీ వస్తాన్లేవే,” అంటూ లేచేను. కమలిని నాచెయ్యి పట్టుకుని, “సరసూ, ఆరుమాట్లు ఓడిపోయిన అలెగ్జాండరులా మొహం పెట్టుకు ఇంటికి వెళ్తే, మీఅమ్మగారు నీకేదో మత్తుమందు పెట్టేశాననుకుని నామీద యుద్ధం ప్రకటించగలరు. ఒక్కమాటు బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కురా. కొంచెం కాఫీ ఇస్తాను. తాగి వెళ్దువు గాని. దీనికి కాఫీ ఇచ్చే అధికారం ఎక్కడిది అనుకుంటావేమో. ఆ పోర్టుఫోలియో అంతా నాదేలే. పైగా అన్నయ్యా, వదినా టెంపరరీగా టూరుకెళ్ళేరు.”

“ఎక్కడికి?”

“మాటినీలే. జవాబులు చెప్పలేక ఛస్తున్నాను, పద, పద.”

వారం రోజులతరవాత నేను ఉద్యోగంకోసం ఢిల్లీ వెళ్ళేను. పేరుకి ఊరు పెద్దదే అయినా ఆదాయం అంకెల్లో ఘనంగానే కనిపించినా, గుంటూరు తరుచూ రావడానికి తగినంత సొమ్మ కాకపోవడంచేతా, ఉద్యోగంలో ఇబ్బందులవల్లా, దానిపెళ్ళికి దూరంనించే దీవించి ఊరుకోవలసివచ్చింది. నేను బాధ పడుతూ రాసిన పదిపేజీల ఉత్తరానికి అది ఒక్కముక్కలో సమాధానం ఇచ్చింది, “పది పైసలు ఓవర్బేరింగు తగిలింది. సంపాదించుకునేవాళ్ళకి దరిద్రం ఎక్కువ కాబోలు,” అని. ఆ రాత్రి కమలిని కలలో నవ్వుతూ కనిపించింది. దానికష్టాలు గట్టెక్కేయి అనుకున్నాను. తనకు తానై అది ఒక్కరోజూ కష్టం అనుకోకపోయినా …

000

నాలుగేళ్ళతరవాత గుంటూరు వెళ్ళి, వెతుక్కుని కమలినివాళ్ళింటికి వెళ్ళేను. వాళ్ళవదినగారు ముందు నన్ను గుర్తించలేదు. గోత్రనామాలు మనవి చేసుకున్నాక కమలిని ఆదివారం వస్తుందని చెప్పేరు.

ఎదురు చూసిన ఆదివారం రాగానే, ఎగిరిపడుతున్న గుండెల్తో, ఆనాటి కమలినికోసం పరుగెట్టుకెళ్ళిన నేను అరుగుమీద నిలబడిన కమలినిని చూసి ఆరడగులదూరంలో నిర్ఘాంతపోయి నిల్చుండిపోయేను. నిన్న మొన్నటివరకూ అఖండజ్యోతిలా వెలిగిన ఆమొహం వన్నె తరిగింది. మనిషి బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తోంది.

“రా, రా. నీకోసమే చూస్తున్నాను. మొన్న వచ్చి వెళ్ళేవుట కదా. అలా చిక్కిపోయేవేమిటి? సొంతసంపాదన కదూ, ఖర్చయిపోతుందేమోననా? దాస్తున్నావా?” ఈమాటలు మునుపటి కమలినివి కావు. ఆ నవ్వులో మునుపటిజీవం లేదు.

తను పరిచిన చాపమీద కూర్చుంటూ అన్నాను, “నువ్వేం వెక్కిరించక్కర్లేదు. నేను బాగానే ఒళ్ళు చేసేనని నాకు తెలుసు.”

“నీకోపం మాత్రం తగ్గలేదు కదా,” అంది నవ్వి.

“పోన్లే. ఏమిటి విశేషాలు చెప్పు,”

“ఏముంది. ఆరోనెల.” మళ్ళీ నవ్వింది. కావాలని తెచ్చిపెట్టుకున్నట్టుంది. చావుదెబ్బ తినబోతున్నానని తెలిసి, గుండెబలం సంతరించుకున్న లేడిపిల్లనవ్వులా ఉంది అది. ఓ గంటసేపు కూచున్నాను. కమలిని అంతసేపూ ఏదో వాగుతూనే ఉంది. కాని అది స్వేచ్ఛగా లేదు. అందులో ప్రయత్నం కనిపిస్తోంది. అది అలిసిపోయినట్టు కనిపిస్తుంటే అడిగేను, “నువ్వేం అనుకోనూ అంటే ఒకటి అడుగుతాను.”

“అడగవే సరసూ. అడుగు. నేనేం అనుకుంటానే పిచ్చిమొహమా! నేనేదో అనుకుంటానని నువ్వు అనుకుంటున్నందుకు అనుకోవాల్సివస్తోంది గానీ. అడుగు.”

ఒక్క క్షణం దానిమొహంలోకి నిశితంగా చూసి ప్రశ్నించేను, “నీ సంసారం ఎలా ఉంది?”

క్షణంలో సగంసేపు దానిమొహంలో విషాదం కనిపించినట్టు అనిపించింది. నాజీవితంలో దానిమొహంలో విషాదం ప్రతిఫలించినట్టు గమనించింది ఆ ఒక్కక్షణమే!!

“నాసంసారానికేం? దివ్యం. నిజం, సరసూ. రసవత్తరంగా ఉంది. మనుషుల్ని స్టడీ చెయ్యడానికి నాకింతటి అవకాశం దొరుకుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. మామిడిపళ్ళు తింటారనీ, బియ్యం అన్నం వండుకుంటారనీ తెలీనిజాతి ఉందని ఆ ఊరికి వెళ్ళింతరవాతే తెలిసింది నాకు. వరన్నం తింటే నజ్జు చేస్తుందిట. మామిడిపండు తింటే జబ్బు చేస్తుందిట. దానిమీద ఎంతైనా రిసెర్చి చెయ్యొచ్చు కదూ …” కమలిని నవ్వుతూనే ఉంది. “మా మొదటివాడు పుట్టినప్పుడు – ఆశ్చర్యపోకు – ఇది నాలుగోఛాన్సు – ముందువాళ్ళు ఇద్దరూ పుట్టి చచ్చిపోయేరు. మూడోవాడు అంతదాకా కూడా రాలేదు. మొదటివాడు – ఏడాదిన్నర వెధవ – మూసినకన్ను తెరవకుండా మంచంలో పడి కొట్టుకుంటుంటే, వాడిగొంతుకలో ఇన్న మందునీళ్ళు పోయించకుండా, శొంఠికషాయం, సున్నపుపట్టెడలు వేసి వాడు చస్తే నేను గుండెలు బాదుకుని ఏడవలేదని నన్ను వెర్రిదానికింద జమ కట్టేరు. అందుకే రెండోవాణ్ణి నేనే చంపేశాను.”

“కమలీ!!”

కమలిని నవ్వింది. ఈమారెందుకో నాకు పూర్వపునవ్వు కనిపించింది. “భయపడకు, సరస్వతీ, ఊరికే అన్నాను. కుర్రాడు మాత్రం పనసపండులా పుట్టేడు. బతికుంటే ఇప్పుడు రెండోయేడన్నమాట కానీ బతికిలేడు.”

“నేను వెళ్ళొస్తాను, కమలినీ!”

“ఉంటావా కొన్నాళ్ళు?”

“నెలరోజులు శలవు పెట్టి వచ్చేను. మధ్యలో ఒకమారు విశాఖపట్నం వెళ్ళాలి. అన్నయ్యా, వదినా రమ్మని రాస్తున్నారు,” అనేసి వచ్చేసేను. దార్లో అనుకున్నాను, “కమలినీ, నువ్వొక అద్భుతమైన వ్యక్తివి. నిన్ను అనుకరించడానికీ, సానుభూతి చూపించడానికీ కూడా నేను అంత ఎత్తుకి ఎదగలేను,” అని.

000

విశాఖపట్నం వెళ్ళినవారంరోజులకి టెలిగ్రాం వచ్చింది. “స్టార్ట్ ఇమిడియట్లీ,” అని వాళ్ళనాన్నగారు ఇచ్చేరు. కమలినే ఇవ్వమందిట.

నేను చూసేసరికి మంచానికి బల్లిలా అంటుకుపోయి ఉంది. ఒక్క పజిరోజుల్లో మనిషి చిక్కి శల్యమయిపోవచ్చునని నాకు అంతవరకూ తెలీదు. మంచెందండెంమీద కూచుని పుల్లలా ఉన్న దానిచేతిని నాచేతిలోకి తీసుకుంటుంటే దుఃఖం ఆపుకోలేకపోయేను.

“ఎందుకేడుస్తావు? నువ్వు కూడా వాళ్ళలాగే ఏడుస్తావనా నిన్ని ప్రత్యేకం పిలిపించింది. లోకంలో ఏడ్చేవాళ్ళూ, ఏడవడానికి కారణాలూ బోలెడు. అసలు నిన్నెందుకు పిలిపించేనో తెలుసా? ఇప్పుడు యమధర్మరాజు వస్తాడు కదా. డాక్టరు కాదులే.”

దానినోరు మూయడానికి నేను చేసిన యత్నాలేమీ ఫలించలేదు.

“యమధర్మరాజు వస్తే ఎలాగ పోల్చుకోడమా అని. యన్టీ రామారావులాగ ఉంటాడా, యస్వీ రంగారావులాగ ఉంటాడా చెప్పు. ఎవరు పడితే వాళ్ళవెనక పడి పోలేను చూడూ …”

దానినవ్వు భయంకరంగా వినిపించింది.

“అలా నవ్వుకు కమలీ,” అన్నాను.

“నువ్వు కూడా నవ్వరాదనే అంటావా?” – దౌ టూ బ్రూట్ అన్న సీజరు ద్వనించేడు ఆ స్వరంలో.

“అది కాదు కమలీ. నువ్వు తప్పకుండా కోలుకుంటావు. నువ్వు చావుగురించి మాటాడి నన్ను భయపెట్టేయకు,” అన్నాను కడుపులో బాధ నరాలు తోడేస్తుంటే.

“నువ్వు కూడా – చిన్నప్పట్నుంచీ నన్ను తెలిసిన నువ్వు కూడా నవ్వరాదు అనే అంటావు కదూ,” కమలిని గోడవేపుకి మొహం తిప్పుకుంది.

“ఇటు చూడు కమలీ, అలా అనను కమలీ, ఇటు చూడవూ,” అని నేను ఎంత ఏడ్చినా కమలిని మళ్ళీ చూడలేదు.

నవ్వు ఆరోగ్యమని అందర్నీ నవ్విస్తూ, తాను నవ్వుతూ పాతికేళ్ళకే నూరేళ్ళు నింపుకుని వెళ్ళిపోయిన కమలిని ఎవరూ నవ్వించలేదు. దాని ఛాన్సు వచ్చేసరికి ‘నవ్వరాదు’ అని ఆంక్ష పెట్టినవాళ్ళే కానీ దాన్ని నవ్వించేవాళ్ళు లేకపోయేరు. …

అందుకే నేను నవ్వలేను.

000

ఈ కథకి కల్పనా రెంటాలగారి విశ్లేషణ ఇక్కడ చూడవచ్చు.

(1968 జయశ్రీ సంక్రాంతి ప్రత్యేక సంచిక లో ప్రచురితం.)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “నవ్వరాదు”

 1. లలితగారూ,
  “నువ్వు ఇంతలా నవ్వుతున్నావు, ఏ బాధను దాచి పెట్టడానికి?” అని.
  ఓ – నిజమే. బాధలని దాచిపెట్టడానికి ఎన్ని వనరులో. ఎంచక్కా నవ్వుతోంది అనుకునేస్తాం కాని ఆవెనక ఎన్ని అగాథాలో అడగడం మాట వదిలెయ్యండి, అసలు చాలామందికి తోచదు కూడాను.
  ఏమైనా మంచి కోటిచ్చారు, థాంక్స్.

  వైదేహీ,

  జోకని తెలిసిపోయింది కద. అయినా, తలపులు మార్చుకోగలం కానీ కాలెండరు మార్చలేం కద. ఆలోచనలు బుర్రలో పుడతాయి. నేను … లో పుట్టాను. 🙂

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,
  అదేమంత పెద్ద పొరపాటండీ? నేను మళ్ళీ కూడలిలో నా వ్యాఖ్య చూసేంతవరకూ గమనించలేదు కూడ.

  అర సున్నాలూ గట్రా హిందీలో ఎక్కువ అవసరం అవుతుంటుంది. అది ఎలా టైపు చెయ్యాలో ప్రతి సారీ మర్చిపోతుంటాను, చూడడానికి బద్ధకిస్తుంటాను.
  ఇంతకీ ఆ పాట అర్థం,
  “నువ్వు ఇంతలా నవ్వుతున్నావు, ఏ బాధను దాచి పెట్టడానికి?” అని.

  మెచ్చుకోండి

 3. లలిత గారూ,
  గొప్ప పొరపాటు జరిగింది. మీటపా చూసాను. తప్పుకీ కొట్టడంతో మళ్లీ కనిపించలేదు. అంచేత మళ్లీ ఇలా పెట్టేను. నిజంగానే చాలా బాధపడుతున్నాను.
  ఏమైనా మీహిందీ స్పెల్లింగులగురించి నేను బాద పడడంలేదు. నాకు హిందీ తెలిస్తే కద..
  మీరు రాసిన ఆటేగ్రీఫులో రాసినవాక్యం చాలా బావుంది. చిరునవ్వులు చిందించడం, కొంటెచూపులు విసిరడంలో సౌందర్యం వేరు కద.
  మాలతి.

  మెచ్చుకోండి

 4. Lalithag,

  “తుం ఇత్నా క్యోన్ ముస్కురా రహీ హో?
  క్యా గం హై జిస్కో ఛుపా రహీ హో?”
  ఆ పాట గుర్తుకు వస్తోంది.
  (pardon my hindi spellings.)

  నేను చదువుకునేటప్పుడు ఒకమ్మాయి బాగా గట్టిగా నవ్వుతూ ఉండేది.
  ఆ అమ్మాయి కొద్దిగా క్లిష్టమైన పరిస్థితులలో పెరిగిందని తెలుసు అప్పట్లో నాకు.
  తనకి ఆటోగ్రాఫులో నేను “నువ్వు చిరునవ్వులు చిందించ గలగాలి” అని రాశాను, కొంచెం సందేహిస్తూనే. తను, తన దగ్గరి స్నేహితురాళ్ళూ అర్థం చేసుకున్నారు.

  మెచ్చుకోండి

 5. @నిషిగంధ,
  నవ్వుల వెనక గుండెల్లోతుల్లో దాగిన విషాదం. చెయిదాటిపోయినతరవాత కానీ తెలీదు. ఒకొక్కప్పుడు ఎప్పటికీ తెలీదు. ఇలాటి కథలు అదే మరొకసారి గుర్తు చేస్తాయనుకుంటాను. సారీ.
  మాలతి

  మెచ్చుకోండి

 6. మీ కధ చదివాకా చాలాసేపటి వరకు ఈ లోకంలోకి రాలేకపోయాను.. పదో తరగతి వరకు నాతో చదువుకున్న మా ‘రమ ‘ ని గుర్తుచేశారు.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది.. ఏది మాట్లాడినా జోక్ లానే అనిపించి తెగ నవ్వేవాళ్ళం.. తను స్కూల్ కి రాని రోజున అస్సలు ఏమీ తోచేది కాదు.. కాలేజీలు వేరయ్యి కలవడం తగ్గిపోయిన రోజుల్లో తెలిసింది తను ఆత్మహత్య చేసుకుందని.. కారణాలు ఏమైనా నాకనిపించింది, తన నవ్వు బాధని అధిగమించలేకపోయిందని!!

  ఇంత మంచి కధని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. గుండె బరువెక్కిపోయిందండి.ఏమున్నా లేకపోయినా మనిషికి స్వేచ్చ వున్నంతకాలం ఆనందం వుంటుందేమో?
  నేను చదివిన[ఇప్పటివరకు చాలా తక్కువే చదివాననుకోండి]కధల్లో నాకు చాలా నచ్చిన వాటిలో ఇదొకటి.చాలా చాలా థాంక్స్.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.