ఊసుపోక – ఏపేరెట్టి పిలిచినా …

(ఎన్నెమ్మ కతలు 6)

రోజు విరజిమ్మునవే పరిమళములు అన్నాడు ఇంగ్లీషుకవి. కాని పేరులు వేరులయినప్పుడు రాగల తికమకలు ఆయన గుర్తించినట్టులేదు.
నాలుగురోజులకిందట సాటిబ్లాగరులలో ఒకరు
పొరపాటున నాపేరు రవంత సవరిస్తేనూ మరొకరు అది గమనిస్తేనూ, నాకు కొన్ని పాత సంగతులూ, మరికొన్ని కొత్త ఆలోచనలూ తగిలేయి.

అందులో మొదటిది అమెరికాలో అడుగెట్టగానే తెల్లవారినాలుకలమీద మాఅమ్మా నాన్నగారు బారసాలనాడు పెట్టినపేరు పొందగల రూపాంతరాలు – మానికా, మెలనీ, మేరీ, మలాతీ, మరతీ, మెలథై — ఇలా నాపేరుని నానావిధాలా పచ్చడి చేస్తూంటే నేను అన్నివిధాలుగానూ వారికి సరైన ఉచ్చారణ చెప్పడానికి తంటాలు పడ్డాను. నువ్వు బోలెడు కారం తింటావు కనక నీకు నాలుక తిరుగుతుంది అందొకావిడ ఆఖరికి. ఇంగ్లీషులో పేర్లు చూడండి – మెలనీ, డోరతీ, మెరీనా, — ద్విత్వాక్షరాలు లేనిపేర్లు బోలెడు. ఉచ్చారణరీత్యా వాటిలో నాపేరుకీ వాటికీ పెద్ద తేడా కనిపించదు. అయినా నాపేరేదో అవాచ్యం అన్నట్టు చూస్తారు వీళ్లు.

ఇహ పోతే. ఇతరత్రా కలిగిన అనుభవాలు. అమెరికనులకి నాపేరు చెప్పుకోడానికి అక్షరాలా టాఠాలు గుణించాలి.. మొదట మన తెలుగుపేర్లు వినగానే వాళ్లు అయోమయంలో పడతారు అసలు అర్థం అయిందో లేదో, చెప్పొచ్చో చెప్పకూడదో నిర్ణయించుకోలేక. ఆతరవాత స్పెల్లింగడుగుతారు.
ఈభాగం అమెరికాలో వున్నవారికి అనుభవమే కనక, దాటెయ్యొచ్చు.
మాలతి అని చెప్తాను కదా. మానికా? అంటారు. కాదంటాను. ఎలా స్పెల్చేస్తావు అని అడుగుతారు మర్యాదాగానే.
నాగుణించడం వరసః
నేను m as in mother అంటూ మొదలెడతాను.
a as in adam
l as in love
as in adam
t as in tom
h…
ఇక్కడ తొలితంటా మొదలవుతుంది. మనం హెచ్ అంటాం, వీళ్లు ఎచ్ అంటారు. పైగా ఈగుణింతాలు అలవాటు లేకపోవడంచేత కూడా నాకు ఎచ్ తరవాత ఏం చెప్పాలో చప్పున తట్టదు.
నేను ఆగడం చూసి అవతలిమనిషి ఎదురుగా వుంటే, అర్థం అయిపోయిందంటారు. ఫోనులో అయితే, నేన్చప్తానంటూ మొదలెడతారు.
m as in mother
o as in opal
n as in nancy

నేను, నో, నో, నో, నో … అంటూ అడ్డుపడతాను. ఏమయి వుంటుందంటే, నేను మాలతికి గుణింతాలు చెబుతుంటే, ఆవిడకి మొదట వినిపించిన మానికాయే గుర్తుండి వుంటుంది. నామాట వినరో, వినిపించలేదో, వినిపించుకోరో …
అదే లాజిక్కుతో మాలతి అని ఎదురుగా వున్నప్పుడు గుణింతాలన్నీ అయేక, ఐ గాటిట్ అని, ఓకే మాలథై అంటారు. ఇంకా కావలిస్తే ఓకాయితమ్మీద తనమాటకనుగుణంగా malathai అని రాసుకుంటారు.
నేను యూయస్కొచ్చిన కొత్తలో మాలతీరావు గా చలామణీ అయేను. (కనీసం అవడానికి ప్రయత్నించేను). ఆరోజుల్లోనే ఓవెబ్‌ పత్రికకి ″నేనోకథ రాసేను, వేసుకుంటారా″ అని రాసేను. తిరుగుటపాలో ″నువ్వెప్పుడయినా కథలు రాసేవా?″ అన్న ప్రశ్న వచ్చింది.
అప్పుడు నేను చాలా వినయవిధేయతలతో, ″రాసి వున్నాననీ, అప్పట్లో నాపేరు నిడదవోలు మాలతి″ అని చెప్పుకున్నాను.
వెంటనే, ″అయ్యొయ్యో మిమ్మల్ని తెలియకపోవటమేమిటి, …″ అంటూ అమితోత్సాహం చూపించారు ఆయన. అప్పుడు తెలిసింది నాపేరులోనున్న పవరు నాకు.
ఇక్కడ మరో ప్రశ్నకి కూడా జవాబిచ్చేస్తాను. ప్రముఖసాహితీ వేత్త, పండితులూ, సాహిత్యచరిత్రకారులూ అయిన నిడదవోలు వెంకటరావుగారు నాకు ఏమవుతారన్నది. ఈసందర్భంలో నేను విన్న ఒకచిన్నకథ – నేను కథలు రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఆయన్ని ఎవరో అడిగారట, ″ఎవరండీ ఈమాలతి, మీ అమ్మాయా?″ అని. ఆయన, ″ఆఁ, మాఅమ్మాయే″ అన్నారట. ఇది చాలాకాలంతరవాత మరెవరో చెప్పారు నాకు. నన్నెవరూ ఆరోజుల్లో అడగలేదు కాని ఇప్పుడు అడుగుతున్నారు. ఇదుగో నాజవాబు — ఆయనా, మానాన్నగారూ అన్నదమ్ములపిల్లలు. ఆయన్ని కలుసుకునే భాగ్యం కలగలేదు నాకు.

ఇంతకీ, ఆవెబ్‌పత్రికవారు అలా అన్నతరవాత, తెలుగులో ప్రచురించేవి మాలతి నిడదవోలు, అనీ ఇంగ్లీషులో ప్రచురించేవి మాలతీరావు అనీ రాస్తూ వచ్చేను. అలావుండగా, కొండొకరోజున ఒక ఇంగ్లీషుసైటులో నాకథ ఒకటి పడింది. ఆవెంటనే మరో మైలొచ్చింది, ″ఈకథ రాసింది నేను కాదు. నాపేరు ఎవరో వాడేసుకుంటున్నారు. ఇంకమీద ఈపేరుమీద వచ్చినకథలు చదవకండి″ అంటూ.

నాకు కళ్లు తిరిగేయి. ఎవరో మరో మాలతీరావుట, మద్రాసులో వుంటున్న, కాబోయే మహానటిట. నాకథ చదివి ఎవరో ఆపిల్లకి అభినందనలు చెప్పినట్టున్నారు. దానికి జవాబు అది. మీకిప్పుడు తికమకగా వుందా? నేనూ సరిగ్గా అలాటి అయోమయంలో పడిపోయాను. తాను రాయలేదని చెప్పడం ఒకదారి. ఇంకెప్పుడు ఈవిడరాసినవి చదవకండి అంటూ హోల్ మొత్తం పేరుని వెలేయడానికి ఎన్ని గుండెలుండాలి? ఆమాటే ఆసైటువారిని అడిగాను. దానికి వారు జవాబుగా అది సమంజసం కాదని ఒప్పేసుకుని, ఆపిల్ల సభ్యత్వం మాపు చేసేసినట్టు నాకు తెలియజేసారు.

ఎందుకొచ్చిన బాధ అని అప్పట్నుంచీ ఇంగ్లీషులో కూడా మాలతి నిడదవోలు అనే రాయడం మొదలుపెట్టేను. మాలతి అని పలకలేనివాళ్లు నిడదవోలు పలకగలరా అని అడగకండి. ఇప్పుడు నేను ఏదేనా ఫారం నింపితే, అవతలివారు ఆకాయితం అందుకుని, తేరిపారచూస్తున్న సుందరదృశ్యం చూడవలసిందే గాని చెప్పనలవి గాదు.

ఇంకా చెప్పుకోవలసినవిః ″నాపేరు మాలతి, నేను కథలు రాస్తాను″ అనగానే,
″అయ్యో మీరు తెలీకపోవడం ఏమిటి. మీప్రమదావనం కాగితాలు చింపి, పుస్తకంగా కుట్టి, అందమైన అట్టవేసి, ఇప్పటికీ చదువుకుంటుంటాను.″ (నేనుః ఆమాలతిని కాదండీ, ఆవిడ మాలతీచందూర్,).
″అమెరికా మాలతి పేరుతో మీరు రాస్తున్న ఆధ్యాత్మిక వ్యాసాలు … ప్రముఖ పత్రికలో ఎంత బావున్నాయో మాటల్లో చెప్పలేను″ (మళ్లీ, నేనుః ఆమాలతిని కాదండీ.)
″మీకు కేంద్ర సాహిత్య ఎకాడమీ బహుమతి వచ్చిందని ఇప్పుడే చూశాను. నామనఃపూర్వక అభినందనలు అందుకోండి″ (నేనుః ఆ మాలతీరావుని కానండీ).
ఇలా పేరుమూలంగా వచ్చే పాటులు చాలా వున్నాయి కనక మాలతి అనగా నేను మాత్రమే అనుకోలేను, మరియు విప్రపతిపత్తి కూడా సత్యమేనని ఒప్పుకుతీరాలి. (కాన్వర్స్ ఈజ్ ట్రూ). అంటే ఏపేరెట్టి పిలిచినా నేను నేనే.

చివరిమాటగా, రాజేంద్రగారూ, మీపొరపాటు సమర్థనీయమే మాలతి, లలితలలో శబ్దమైత్రి వుంది కనక.
కావలిస్తే ఈమెలికమాట, మాలలితమ్మ, లలితమ్మ, మాలతమ్మ.. ఒక్కగుక్కలో రెండుసార్లు చెప్పండి చూద్దాం. :)).

(మార్చి 2008)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

17 thoughts on “ఊసుపోక – ఏపేరెట్టి పిలిచినా …”

 1. మీయంత్రం సైటు చూసాను. మీరు తెలుగులో రాయడం మొదలైనవి.
  ఇక్కడ ఇంగ్లీషులో జోకులు కావాలని అడగడం – ఇదే ఓజోకులా వుంది.

  మెచ్చుకోండి

 2. లలిత గారూ అప్పుడే శుభవార్తలు చెప్పే ఉద్దేశ్యం లేదండి:)
  మాలతి గారూ మిమ్మల్ని త్వరగా కలుసుకోవాలని నాకు చాలా ఆత్రం గా వుందండి.కానీ కాలం[ఎండాకాలం] కలసి రావట్లేదు 🙂

  మెచ్చుకోండి

 3. @RSG, నాతెలివేంలేదండీ, తె.వికిపీడియావారిని చూసి తెచ్చుకున్నాను. :))
  @రాధిక, లలితగారూ, మీరు మరోకథ రాసేశారు మీపేరుమీద. బావుంది. పేరులతీరుతెన్నులు. :))
  రాధికా, మరి మావూరు ఎప్పుడొస్తున్నారు నాపేరు కూడా మాలతే అని చెప్పుకోగల సదవకాశం నాకెప్పుడొస్తుంది? :))

  మెచ్చుకోండి

 4. తెతూలిక అంటే తెలుగు-తూలికా మేడమ్??? దీని అర్థంకోసం డిక్షనరీ అంతా వెతికాను. మీ ఎన్-తూలికని చూసినతర్వాత వెలిగింది బల్బు 🙂

  మెచ్చుకోండి

 5. మాలతి గారు,
  ఎంత నవ్వుకున్నానో ఈ టపా చదివి.

  ఎప్పుడూ నాకు అందరి పేర్లకూ పలకడం అలవాటైపోయింది. అందుకే పొరపాటున నా పేరుతో ఇంకొకరిని పిలిస్తే ఏమనాలో తోచలే:-)
  నేను ఆఖరు దాన్ని కావడంతో ముందు మా అక్కల పేర్లన్నీ పిలిచి నా పేరు గుర్తు చేసుకునే వారు మా నాన్నా, మా పెద్దన్నయ్యానూ. ఇక పెళ్ళిళ్ళయ్యాక మా వదిన పేరు ముందు వచ్చాక నా పేరు వస్తుంది మా అన్నయ్యలందరికీ.
  ఆఖరికీ రోజూ నాతో గంట సేపు మాట్లాడే నా స్నేహితురాలు కూడా ఒక్క రోజు వాళ్ళ కజిన్ తోటి మాట్లాడేసరికి మళ్ళీ నా పేరు అలవాటు చేసుకోవడానికి టైము తీసుకుంటుంది.
  నా పేరును వంకరలు తిప్పితే నాకిష్టముండేది కాదు. అప్పుడు మా అక్క నన్నేడిపించేది. పెళ్ళి కానంత వరకూ అన్నపూర్ణ అనే అమ్మాయికి పూర్ణం అని పిలిస్తే ఇష్టం ఉండేది కాదట. పెళ్ళయ్యాక భర్త అలా పిలిస్తే పొంగిపోయేదిట.
  మా చిన్న వాడి పేరు అభిరాం అయితే ఇక్కడ అందరూ అబ్రహాం అని పిలుస్తారు.
  పరీక్షిత్ అన్న పేరులో చివరి నాలుగు అక్షరాలతో పిలిచి ఆటపట్టించే వారట ఒక అబ్బాయిని.
  అందుకని నా స్నేహితురాలు వాళ్ళాయనతో పలికించి అప్పుడు తన పిల్లల పేర్లు నిర్ణయించుకుంది. ఆయన తెలుగు వారే అయినా ఇక్కడ పెరిగిన వారు, అందుకని.

  మెచ్చుకోండి

 6. ఇంత సరళమయిన పేరుని కూడా అలా ఖూనీ చేసేస్తున్నారా?మావారి పేరు శీనివాస భీమేశ్వర రామకృష్ణ.అన్ని చోట్లా పద్యంలాగా పూర్తి పేరు చెప్పేసరికి,వాళ్ళు తప్పుగా చదివేసరికి,మావారు మళ్ళా సరిదిద్దేసరికి తెల్లారిపోతూ వుంటుంది.
  సాహితీ ప్రపంచంలో ఇంతమంది మాలతులు వున్నారా?అయితే మా అమ్మాయికి మాలతి అని పేరు పెడతాను:)

  మెచ్చుకోండి

 7. మాలతి గారు,

  ఆనందోబ్రహ్మ కథ చదివాక అదే అనుకున్నాను. ఎందుకంటే మీరు నాకిచ్చిన డిటిపి ప్రింట్ లో లేని కొత్త అంశాలు ఆనందో బ్రహ్మలో ఉన్నాయి. కానీ కథ చదివాక గొంతులో ఏదో అడ్డం పడిన (బాధతో) ఫీలింగ్ వచ్చింది. రస సిద్ధి పక్కన దీన్ని కూడా పెట్టేసుకుంటున్నా మరి! మిమ్మల్ని యాహూ లో కలుస్తాను.

  మెచ్చుకోండి

 8. సౌమ్య, చదువరి, విజయకుమార్, సుజాత, మీకు నా కృతజ్ఞతలు మాపంచలోకి వచ్చినందుకు.
  పొద్దు వారు నావునికిని గుర్తించినందుకు కూడా ఎంతో సంతోషంగా వుంది.
  @ చదువరి, విజయకుమార్ – మీరు ఇద్దరు కలిసి కథ పూర్తి చేసారు, బాగుంది. నాపంచలోకి రావడమే చాలు, మీరు నాజాగా వాడేసుకున్నారనుకోలేదండీ.

  సుజాతా, చాలాకాలానికి పునర్దర్శనం. బాగా గుర్తున్నారు. మీతో చర్చలతో తరవాతే, సంఘసంస్కర్తభార్య కథని ఆనందో బ్రహ్మా అన్న పేరుతో ప్రచురించాను వార్తలో. చదివేరేమో. వీలయితే విశేషాలు రాయండి thulikan@yahoo.com.కి వేరుగా నేరుగా.

  మెచ్చుకోండి

 9. చదువరి గారూ,

  చిన్న సవరణ. మీరు చెప్పింది జోకు కాదు. కథ. చదువుకోని వారికీ, పసిపిల్లలకీ పెద్దగా తేడా ఏమీ ఉందడదని చెప్పడానికి ఒక రచయిత చెప్పిన కథ యిది. మీలాగే ఇది నేనూ చదివడం జరిగింది.

  అప్పన్న యజమాని తన ఇద్దరు ఆడపిల్లల్నీ అప్పన్నకి అప్పగించి “వీళ్ళని ముందు నువ్వు స్కూలు దగ్గరకి తీసుకువెళ్లు. నేను తర్వాత వచ్చి వీళ్ళని స్కూల్లో అడ్మిట్ చేస్తానం”టాడు. అప్పున్న అలాగే పిల్లలిద్దర్నీ స్కూలుకి తీసుకువెళ్తాడు. అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళ పేర్లడుగుతాడు. మీరన్నట్టే ఆ చిన్న పిల్లలిద్దరూ తమ పేర్లు “అప్పన్న” అనే చెబుతారు. ప్రిన్సిపాల్ ఆ యిద్దరు పిల్లలూ ఒకే విధంగా చెప్పడం చూసి వాళ్ళ పేర్లేంటని అప్పన్నని అడుగుతాడు. అప్పన్న చదువుకోలేదు గదా. కనుక, వాడికి నోరు తిరగదు. వాడు ఆ పిల్లల పేర్లు “అప్పన్న” అనే చెబుతాడు. అదేమీ అర్థంగాని ప్రిన్సిపాల్ అప్పన్నని “అసలు నీ పేరేంట”ని అడుగుతాడు. అప్పన్న మళ్ళీ, “అప్పన్న”నే చెబుతాడు. ప్రిన్సిపాల్ ఆశ్చర్యపడి బుర్రగోక్కుంటుండగా ఆ పిల్లల తండ్రి వచ్చి తన పిల్లలిద్దరి పేర్లూ అపర్ణ, అర్పణ అనీ, పనివాడి పేరు నిజంగానే అప్పన్నఅనీ, వాడు చదూకోకపోవడం వల్ల వాడూ పసిపిల్లలలాంటి వాడేననీ వివరించి ప్రిన్సిపాల్ సందేహం తీరుస్తాడు. అదీ కథ.

  మాలతిగారూ క్షమించాలి. ఈ కథ చెప్పడానికి మీ బ్లాగు వాడుకున్నందుకు.

  మెచ్చుకోండి

 10. మాలతి గారు, నమస్తే!

  నేను కూడా మిమ్మల్ని ‘నిడదవోలు మాలతి ‘ గానే గుర్తుంచు కుంటాను . ఇంకా గట్టిగా చెప్పాలంటే నాకిష్టమైన ‘రస సిద్ధి ‘, ‘నిజానికీ ఫెమినిజానికీ మధ్యా, ‘సంఘ సంస్కర్త భార్య ‘ కథల రచయిత్రిగా గుర్తించడానికి ఇష్టపడతాను. గుర్తు పట్టారనుకుంటాను.

  మెచ్చుకోండి

 11. అపర్ణ, అర్పణ, అప్పన్న అనే మూడు పేర్లపైనున్న చిన్నప్పుడు నే చదివిన జోకొకటి గుర్తుకొస్తోంది. ఇదివరలో నా బ్లాగులో రాసాను. జోకు నా బుర్రలో ఇంకినట్టుంది. మాటిమాటికీ గుర్తుకొస్తూంటుంది… అసందర్భంగా కూడా. పేర్ల విషయం వచ్చింది కాబట్టి సందర్భం కుదరకపోయినా రాస్తున్నా.. (దయచేసి భరించండి)

  అప్పన్న తన యజమాని గారి పిల్లల్ని కొత్తగా బళ్ళో చేర్పించటానికి తీసుకెళ్ళాడు. పంతులుగారు
  “నీపేరేంటమ్మా” అని అడిగితే ఆ పిల్లలిద్దరూ అప్పన్న అని చెప్పారు.. పాపం నోరు తిరక్క! ఆయనకి అర్థం కాక అప్పన్నను “ఏంటయ్యా వీళ్ళ పేర్లేంటి” అని అడిగాడు.. అప్పన్నకు నాలుక మందం కదా.. వాడు కూడా “అప్పన్నండి” అని చెప్పాడు. పంతులుగారు “ఏంటో గోల.. సరే నీపేరేంటి?” అని అడిగాడు. అప్పుడు అప్పన్న.. “అప్పన్నండి” అని చెప్పాడు!

  మెచ్చుకోండి

 12. రాజేంద్రగారూ
  క్షమించండి. మిమ్మల్ని నొప్పించడం కాదు నాఉద్దేశం.
  ఇది నామీదా, నాపేరుమీదా నేనే వేసుకునే జోకు.

  @సిరిసిరిమువ్వగారూ,
  థాంక్స్.

  మెచ్చుకోండి

 13. మీకు వినిపించలేదుగాని లెంపలేసుకున్నా…
  మీకు కనిపించలేదు గానీ.. గుంజీళ్ళు కూడా తీశా
  మాలతమ్మా చూసారా ఈ సారి సరిగ్గా పిలిచాను

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s