పాఠకులకీ రచయితలకీ మధ్య గల అవినాభావసంబంధం

ఈరోజుల్లో వస్తున్న విమర్సలూ అభిప్రాయాలమీద నా అభిప్రాయం ఏమిటని నిన్న ఓస్నేహితురాలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వ్యాసం. ఇది 2005లో రాసినది. ఇప్పటికీ అట్టే తేడా ఉన్నట్టు లేదు.

————

1950, 60 దశకాలలో నేను చదివిన పాఠకులఅభిప్రాయాలతో ఇప్పుడు పాఠకులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలతో పోల్చి చూసినప్పుడు నాకు కలిగిన అభిప్రాయాలే ఈవ్యాసంలో సారాంశం.

సామాన్యపాఠకులు కథ చదివినప్పుడు తమఅనుభవాలు ఆధారంగా స్పందించి వెలిబుచ్చే అభిప్రాయాలు ఈనాటికథని ఎలా తీర్చిదిద్దుతాయి అన్నది నన్ను వేధిస్తున్నసమస్య. ఆదృష్టితో నేను గమనించిన కొన్ని విషయాలు ఇక్కడ మీముందుంచుతున్నాను.

స్వాతంత్ర్యానంతరం, పత్రికలసంఖ్యతోపాటు పాఠకులసంఖ్య కనివినిఎరగనంత విస్తృతంగా పెరిగింది. పాఠకుల విద్యాస్థాయి పెరిగింది. కథలో, కథనంలోలాగానే పాఠకులలో, వారి దృక్పథాలలో, వారు స్పందించే విధానంలో అనేక మార్పులు వచ్చేయి. భిన్నకోణాలూ, భిన్నరీతులూ వ్యక్తమయినట్టే, పాఠకులదృష్టిలో కూడా పరిణామాత్మకమయిన మార్పులు కనిపిస్తున్నాయి. పాఠకులు కథని ఎలా విశ్లేషిస్తున్నారు, తమకి ఎలా అన్వయించుకుంటున్నారు, రచయితనుండీ, రచననుండీ ఏమిటి ఆశిస్తున్నారు అన్న అంశాలను పరిశీలించి క్రోడికరించగా తేలిన అంశాలు ఇవి.

తమఅభిప్రాయాలను వెలిబుచ్చే పాఠకులని స్థూలంగా మూడువర్గాలుగా విభజించవచ్చు. 1. ఒక కథ చదివి తమఅనుభవాలపరిమితిలో తక్షణమే స్పందించేవారు. 2. కథలో లీనమైపోయి, కథలోని ఒకపాత్రనో, ఒక సన్నివేశాన్నో, సంఘర్షణనో తమకి అన్వయించుకుని, తదనుగుణంగా స్పందించేవారు. 3. వర్ణన, వాస్తవికత, భాషలకి సంబంధించి కథని శల్యపరీక్ష చేసేవారు.

వీరిలో మొదటివర్గం పాఠకులు కథ స్థాలీపులాకన్యాయంగా అక్కడక్కడ చదివేసి, కథలో ముఖ్యమయిన అంశాన్ని సూచనప్రాయంగా గ్రహించేస్తారు. అలా కప్పదాటుగా చదవడంలో కొన్ని విషయాలు తెలిసో తెలియకో గమనించకపోవడం జరుగుతుంది. వారు వెలిబుచ్చే అభిప్రాయాల్లో అది కనిపించిపోతుంది. వారికి తమఅభిప్రాయం వెలిబుచ్చడమే ఆకథ సాధించినవిజయంగా భావించుకోవచ్చు ఆ కథకుడు.

ఇలాటి అభిప్రాయాలలో ఒకొకప్పుడు దూషణ, భూషణ, తిరస్కారాలు రవంత మితిమీరి ఉన్నా ఆశ్చర్యంలేదు. ఇక్కడే మనం మరోమాట కూడా చెప్పుకోవాలి. వ్యక్తిగత విమర్శ మనకి కొత్త కాదు. వెనక అల్లసాని పెద్దన “అమవసినిశి” అని వాడినందుకు, తెనాలి రామకృష్ణుడు

ఎమి దిని సెపితివి కపితము

బెమ పడి వెరి పుచ్చకయ దిని సెపితివొ

ఉమెతః దిని సెపితివొ

అమవసనిశి యనుచు అలసని పెదన

అంటూ, ఒత్తులూ, దీర్ఘాలూ తీసేసి హేళన చేశాడు. ఈమధ్యనే నాయని కృష్ణకుమారిగారి వ్యాసం ఒకటి కనిపించింది. వీరేశలింగంగారూ, కొక్కొండ వెంకటరత్నంపంతులుగారూ ఒకరినొకరు తమతమ పత్రికలలో హేళన చేసుకోడంగురించి కృష్ణకుమారిగారు “వారిలాటి మహానుభావులకే చెల్లింది” అంటారు అన్యాపదేశంగా అదేమంత అభిలషణీయం కాదని తెలియజేస్తూ (యుగపురుషుఢు వీరేశలింగం.)

మనకి హాస్యంపాలు ఎక్కువ. మన వ్యవస్థలో బావామరుదులూ, వదినామరదళ్లే కాక భార్యాభర్తలు కూడా వేళాకోళాలాడుకుంటారు. పాశ్చాత్యదేశాలలో అభ్యంతరకరమయిన హాస్యాలు మనకి నిత్యోత్సవాలు. ఈనాడు ఎన్నారైలలో కూడా అలాటి చనువు ఏర్పడింది. (ప్రస్తుతం బ్లాగులలో కూడా కొంతవరకూ కనిపిస్తోంది.) ఇది మరొకరకం కుటుంబవ్యవస్థ అనుకోవచ్చు. వీరు కథనీ, కథకుడినీ వదిలేసి, స్వకీయమయిన హాస్యాలలోకి దిగిపోవడం కూడా చూస్తున్నాం. నామటుకు నాకు ఇటువంటి అభిప్రాయాలని రచయితలు సీరియస్‌గా తీసుకోరనే అనిపిస్తుంది.

రెండోరకం పాఠకులు, కథలో లీనమయిపోయి, కథలో తామొక పాత్ర అయినట్టు వ్యాఖ్యానాలు చేస్తారు. “ఫలానా పాత్ర అలా అనకుండా ఇలా అని ఉండవలసింది, అలా చెయ్యకుండా ఇలా చేసి ఉండవలసింది, ఇలా జరిగిఉంటే బాగుండును” వంటి అభిప్రాయాలు ప్రకటించడంలో ఆంతర్యం ఇదే – కథలో లీనమయిపోయి, అది కథ అని మరిచిపోవడం. ఆ పాఠకుడు తనవైన అనుభవాలు ఆధారంగా చేసే వ్యాఖ్యలవి.

మరోలా చెప్పాలంటే, కథకుడు కథని పాఠకులముందు పడవేయడం నీటిలో రాయి విసరడంలాటిది. ఆరాయి తాకిడికి లేచే చిరుతరగలవంటివే పాఠకుడిలో కలిగే స్పందనలు. అంటే, పాఠకుడిలో కలిగే స్పందనలకి రచయిత జవాబుదారీ కాడు. ఎలాటి స్పందనలు రాగలవో రచయిత ఊహించలేడు. ఆ పాఠకుడు, తనఅనుభవాలూ, పరిస్థితులపరిధిలో తన అభిప్రాయాలు వెలిబుచ్చినప్పుడు, అవి రచయిత ఆశయానికి భిన్నంగా ఉంటే, ఆపాఠకుడు మరొకకథకి నాంది పలుకుతున్నాడు అన్నమాట. పాఠకుడు ఎప్పుడయితే, “ఇలా కాదు, అలా జరిగిఉండాలి” అంటాడో, అప్పుడే మరోకథ తయారవడం మొదలవుతుంది. మొదటికథకి సంబంధించినంతవరకూ, ఆకథ సాధించింది అదే. పాఠకుడిలో అలాటి ఆలోచనలు రేకెత్తించడం. ఏడు చేపలకథలో “చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?” అని అడిగితేనే కదా కథ ముందుకు సాగేది. చేపని అడిగేదేమిటి, తీసి ఎండ ఉన్నచోట పడేస్తే సరిపోతుంది అనుకుంటే, మరింక కథ లేదు!

మూడోరకం పాఠకులు ఇంకొంచెం ముందుకి వెళ్లి, కథని శల్యపరీక్ష చేస్తారు. కథలో భాష, శైలీ, పాత్రచిత్రణా, వాస్తవికత వంటి అంశాలవిశ్లేషణ చేస్తారు. ఒకొకప్పుడు తాము చదివిన పాశ్చాత్యరచయితలతో పోల్చుకునో, వారివిమర్శలని ఆధారం చేసుకునో వ్యాఖ్యానాలు చేస్తారు.

ప్రతి పాఠకుడూ తప్పనిసరిగా ఈమూడు వర్గాల్లో ఏదో ఒక కోవకి చెందివుంటాడని నేను అనడంలేదు. సుమారుగా ఇలాటి విభజనకి ఆస్కారం ఉంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం. పాఠకులందరూ పత్రికాముఖంగా తమఅభిప్రాయాలు వెలిబుచ్చరు కదా. అంచేత, వారి స్పందనలేమిటో మనకి తెలిసే అవకాశంలేదు.

నా చిన్నప్పుడు, అంటే 50, 60 దశకాల్లో కథలు చాలామటుకు కాలక్షేపమే అయినా, కథలో ఒక పాత్రతోనో సంఘటనతోనో తమ అనుభవాలు పోల్చుకుని, ఆకథని “తమకథ”గా మలుచుకోడం, ఆకథలో సంఘర్షణలకి తమ బాధలని అన్వయించుకుని, పరిష్కారాలు వెతుక్కోడం జరిగింది.

కె. వసుంధరాదేవి “తెలుగుకథ తీరుతెన్నులు” అన్నవ్యాసంలో ఒకసంఘటనగురించి రాసేరు. ఆవిడ ఒక క్షయరోగిగురించి కథ రాశారు. ప్రధానపాత్ర క్షయరోగి. కొంతకాలం ఆ జబ్బుతో బాధ పడి చివరకి చనిపోతాడు.

ఆ కథ చదివిన ఒక పాఠకుడు ఆమెని కలుసుకుని, తాను క్షయరోగి ప్రధానపాత్రగా మూడు కథలు చదివేననీ, మూడు కథల్లోనూ ప్రధానపాత్ర చనిపోతాడు అని చెప్పి, క్షయ రోగులందరూ చనిపోతారా, వారికి బతికే అవకాశం లేదా అని అడిగేడుట. అతని కూడా క్షయ ఉంది. వసుంధరాదేవి రచయితలందరితరుఫునా అతనికి క్షమాపణలు చెప్పుకున్నాననీ, మళ్లీ జన్మలో చావుని పరిష్కారంగా రాయకూడదని నిశ్చయించుకున్నాననీ, అయినా ఆపాఠకుడిప్రశ్న తనని వేధిస్తూనే ఉందనీ రాశారు.

ఈ కథ ఇక్కడ ఉదహరించడానికి కారణం ఆనాడు పాఠకులకి కథలంటేనూ, రచయితలంటేనూ ఉన్న నమ్మకం ఎత్తిచూపడానికే. అనూచానంగా మనం జ్ఞానానికి ఇస్తున్న గౌరవం అదీ. రచయితకి ఏదో తెలుసని నమ్మి, ఆయన రాసినకథలో తాను కొత్తగా తెలుకోగలిగినది ఏదో ఉందన్నఆశతో కథ చదివేడు పాఠకుడు. అది గురుశిష్యసంబంధం. ఈనాడు ఈ సంబంధంలో మార్పు వచ్చింది. ఆనాడు ఎదటివారిమాట స్వీకరించడం నీతి అయితే, ఈనాడు ప్రశ్నించడం నీతి. ఈమార్పే ఈనాటి పాఠకులలో చూస్తున్నాం.

ఈనాడు పాఠకులఅభిప్రాయాలు చూస్తే, వారిని విశేషంగా ఆకర్షిస్తున్నవి వస్తువు, సంఘర్షణ, పరిష్కారం. ఆపైన కొంతవరకూ భాష. వాటికి అనుబంధంగా వాస్తవికత, ప్రయోజనంగురించిన ప్రశ్నలు తలెత్తుతాయి.

కథకి ముఖ్యమయిన ప్రయోజనం ఒక దృక్కోణాన్ని జనబాహుళ్యానికి అందించడమని దాదాపు అందరం గుర్తించాం. లేదా ఎవరూ గమనించని, గమనించినా పట్టించుకోని కోణం కావచ్చు. సామాజికప్రయోజనం అంచే సమాజంలో లోపాలు గర్హించేదీ, పరిష్కారాలను సూచించేదీ అని చెప్పుకున్నాం. నిజానికి ఈ వివరణే ప్రమాణం అయిపోయినట్టు కనిపిస్తోంది ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్న, బహుమతులు పొందుతున్న, విమర్శకులమన్ననలు పొందుతున్న కథలు చూస్తుంటే. ఇది కూడా విమర్శకుల, పాఠకులదృష్టిలో వచ్చిన మార్పుకి చిహ్నమే.

వస్తువుకి ఈనాటి పాఠకులు ఇస్తున్న ప్రాధాన్యతకి మంచి ఉదాహరణ ఈమధ్య ఆంధ్రజ్యోతిలో (ఆంధ్రజ్యోతి ఆదివారం జనవరి 16, 2005) వచ్చిన “కడలూరు వెళ్లాలి ఒక నీలిమకోసం” అన్న కథ చూడండి. సునామీ భీభత్సానికి సమస్త ప్రపంచం స్పందించింది నీ, నా అన్న వివక్షత లేకుండా. ఆ కథలో విశేషం వస్తువు. రచయిత దాన్ని మానవసంబంధిగా మలచడం. చాలామంది పాఠకులు ఆభాగానికే ఎక్కువగా స్పందించారు. అయితే, కథలో ఒక సన్నివేశం – ప్రాధానపాత్ర ఫోన్ చెయ్యాలనుకున్న సందర్భం స్పష్టంగా లేదు. ఎవరికి, ఏమని ఫోన్ చెయ్యాలనుకున్నాడు, చేశాడా, లేదా అన్న వివరాలు లేవు. ఇది పాఠకులెవరినీ బాధించినట్టు కూడా లేదు ప్రచురించబడిన అభిప్రాయాలు చూసినప్పుడు.

కథావస్తువు, సంఘర్షణ: 1970 దశకంలో తెలుగుకథలో సాంఘికప్రయోజనం ప్రధానాంశంగా విశేషాదరణ పొందింది. నాచర్చకి నేను 1950దశకానికి పూర్వపుకథలు మూడు తీసుకుంటున్నాను. కారణం ఆనాటి పాఠకులు అడగనిప్రశ్నలు విశదం చెయ్యడంలో సౌలభ్యం.

ఏది వాస్తవికత, ఏది వాస్తవికత కాదు అన్నప్రశ్నకి ఉదాహరణగా ఈకథ చూద్దాం. ఒకాయన సానివాడల తిరుగుతుంటాడు. ఆయనని దారిలో పెట్టాలనుకుంటుంది భార్య. ఒకరోజు ఆయన అలవాటు ప్రకారం వీధి పచార్లు ముగించుకుని ఇంటికి వస్తాడు. అమ్మగారేరీ అని పనివాడిని అడుగుతాడు. అమ్మగారు పుట్టింటికి వెళ్లిపోయారని చెబుతాడతను. దాంతో ఆయన కంగారు పడిపోయి, బుద్ధి తెచ్చేసుకుంటాడు. పాఠకులు గ్రహించే ఉంటారు. ఇది గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ. ఇది తెలుగులో తొలికథగా, అంటే మంచికథకి ఉండవలసిన లక్షణాలు ఉన్నకథగా గుర్తింపబడింది.

ఇదే కథని ఈరోజుల్లో నాలాటి రచయితే రాస్తే, ఈనాటి పాఠకులు సంఘర్షణకి తగినబలం ముగింపులో లేదు అంటారు. దానిమీద అనేకప్రశ్నలు లేవదీయొచ్చు. భార్య పుట్టింటికి పోతే స్త్రీలోలుడయిన మగాడికి అంత త్వరగా బుద్ధి వచ్చేస్తుందా? నిజానికి అతగాడికి భార్య ఎదురుగా లేకపోతే మరింత ఆటవిడుపు కదా అని అడుగుతాడు ఈనాటి పాఠకుడు.

ఆ తరవాత వచ్చిన కథల్లో కుటుంబరావుగారి కథ, ఆడజన్మ చూదాం. ఇందులో లక్ష్మి ప్రధానపాత్ర. ఆమె తండ్రి పోతే, ఆతని అన్నగారు లక్ష్మినీ, తల్లినీ చేరదీసి, ఆఅమ్మాయిని రెండోపెళ్లి ముసలాయనకిచ్చి చేతులు దులుపుకుంటాడు. ఆ ముసలాయనకి అనుమానం లక్ష్మి సవతికొడుకుతో సంబంధం పెట్టుకుందేమోనని. ఆ బాధలమధ్య లక్ష్మి ఒక కూతురిని కంటుంది. ఆకూతురు పెరిగి పెద్దదయిన తరవాత ఎవరితోనో లేచిపోవడం, గర్భవతి అయి తిరిగిరావడం – ఇంతే కథ. ముప్ఫై ఏళ్లు నిండని లక్ష్మికి మూడుతరాల బాధలు అనుభవమయేయి. ఆపైన ఇంకా ఏం జరగనున్నదో అనుకుంటుంది ఏడుస్తూ – అని రచయిత కథకి ఇచ్చిన ముగింపు.

ఈకథలో పరిష్కారం లేదు. ఆరోజుల్లో ఒక దిక్కుమాలిన ఆడదాని సాంఘికదుస్థితిని చిత్రించడం మాత్రమే జరిగింది. నిజానికి ఈకథ చదువుతున్నప్పుడు నాకు అదొక కథలా అనిపించలేదు. మాటవరసకి పాత్రలకి పేర్లు పెట్టి ఒక సాంఘికసమస్యని వివరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఇద్దరు స్త్రీలు ఎట్టి సాహసానికీ పాల్పడరు. సాహసించి పారిపోయిన చిన్నది మోసపోయి మళ్లీ ఇల్లు చేరుతుంది.

ఇదే కథ ఈనాడు ఒక పత్రికలో కనిపిస్తే, ఈ నాటిపాఠకులు వేసే ప్రశ్నలు మనం సుళువుగానే ఊహించుకోవచ్చు – లక్ష్మి ఎందుకు తిరగబడలేదూ? తనకి సవతికొడుకుతో సంబంధం లేదని ఎందుకు ఋజువు చెయ్యలేదూ? కనీసం అలా చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదూ? సాహసించి పారిపోయిన చిన్నది అయినా సుఖపడినట్టు రచయిత ఎందుకు చిత్రించలేదూ? ఆకాలంలో ఈకథ పాఠకులలో సామాజికస్పృహ కలిగించడానికి మాత్రమే అని జవాబు చెప్పుకోవాలిసివస్తుంది. అంటే సంఘంలో జరుగుతున్న అత్యాచారాలు చూసీ చూడనట్టు దాటుకు పోయేవారికి హెచ్చరికగా మరొకసారి ఎత్తి చూపి, జనసామాన్యంలో ఆలోచనలు రేకెత్తించడానికే అని. అంతే కాక దారిద్ర్యానికీ వైతికవిలువలకీ మధ్య గల అనుబంధం కూడా తెలియచేస్తుంది ఈకథ.

కనుపర్తి వరలక్ష్మమ్మగారి కుటీరలక్ష్మి ఇంచుమించు అదే పరిస్థితిలో ఉన్న మరొకస్త్రీ ప్రవృత్తినీ, మరొక దృక్కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆకథలో ప్రధానపాత్ర రామలక్ష్మి కలిమిలేములు అనుభవించి, భర్త చనిపోయిన తరవాత, కేవలం మనోబలంతో జీవితంతో పోరాడుతూ, పిల్లలని సాకుతూ ఉంటుంది. అయితే ఇందులో కూడా ఆమె సాధించిన ఘనవిజయమేమీ లేదు .పాఠకుడు కథ అయిపోయినతరవాత హమ్మయ్య సుఖపడింది అనుకుని ఆనందించే అవకాశంలేదు. చివరంటా ఆమెకి దినదినగండమే. కాని, ఇందులో నమ్మదగ్గ పరిష్కారం ఉంది. గుండెబలం గల ఆడది నాఖర్మ అంటూ చేతులు ముడుచుకు కూచోదు. కడవరకూ పోరు సలుపుతూనే ఉంటుంది. వరలక్ష్మమ్మ ఈకథలో వెల్లడి చేసిన మరొకవిషయం ఆరోజుల్లో తెలుగుదేశంలో కనీసం ఒక నియమితపరిధిలో స్త్రీలకి గల సామాజికస్ఫూర్తి. ఆరోజుల్లో ఐరోపా మహాసంగ్రామంమూలంగా సామాన్యులమనుగడ, కుటీరపరిశ్రమలమీద ఆధారపడినవారి జీవితాలు ఎంతగా అల్లకల్లోలం అయిపోయేయో వివరిస్తుంది ఈకథ. ఆనాటి తెలుగురచయిత్రులకి సాంఘికసరిస్థితులపట్ల గల అవగాహన, అది కథగా మలచగల నైపుణ్యం చూస్తాం ఈకథలో. అయితే ఇందులో రచయిత్రి చాదస్తంగా ఉపన్యాసాలు జొప్పించకపోవంచేత మంచికథగా గుర్తించారు ఆనాటి విమర్శకులు. అదే ఈనాడయితే, స్త్రీవాదరచనగానో, దళితవాద రచనగానో ముద్రపడి, అనేకచర్చలకి దారి తీసేది. అటువంటి విస్తృతమయిన చర్చ లేకపోతే, రచయిత్రికి సాంఘికపరమయిన అవగాహన లేదని కథని పక్కన పెట్టేస్తారు కూడా. నిజానికి అనేకమంది ప్రముఖ విమర్శకులు ఈ కథని తమచర్చల్లోకి తీసుకోలేదు.

అలాగే ఈనాటి పాఠకులు ప్రధానపాత్ర రామలక్ష్మి కొడుకులు పెరిగి పెద్దవారయారా, చదువుకున్నారా, లేదా, ఆతరవాత తల్లిని ఆదుకున్నారా లేదా వంటివి అడగవచ్చు. లక్ష్మి సుఖపడేరోజు వచ్చిందా లేదా? రాకపోతే, ఈకథ విషాదాంతం అనుకోవాలా? విషాదాంతం అయితే, ఎందుకు ఇలాటికథలు రాయడం అన్నప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. కానీ, ఆనాడు (ఇంకా కొందరు నాలాటి రచయితలు యీనాటికీను) కథ ఎంతవరకూ చెప్పాలన్న నిర్ణయం రచయితదిగానే భావించారు. ఇతివృత్తానికీ, కథ నడవడానికీ పనికొచ్చే సన్నివేశాలు, పాత్రలు ఎంచుకోడం మాత్రమే జరుగుతుంది. అంతకంటె ఎక్కువ వివరాలు ఎందుకు ఇవ్వలేదు అన్నప్రశ్న లేదు అప్పట్లో.

సూక్ష్మాతిసూక్ష్మవివరణలు, స్పష్టత, కవిస్వేచ్ఛ (poetic license). వివరాలు, స్పష్టత వంటి విషయాలలో ఈనాడు పాఠకులు చూపుతున్నశ్రద్ధ అపూర్వం. నాకు వస్తున్న ప్రశ్నలలో పదే పదే కనిపించేవి స్థల, కాలనిర్ణయాలూ, కదాచితుగా పాత్రలప్రవృత్తిమీద.

మొదట రచయితగా నాఅభిప్రాయం చెప్తాను. రచయితలూ, పాఠకులూ కూడా తమ అనుభవాలు, అవగాహన (perception) పరిధిలోనే రాయడం చదవడం, విశ్లేషించడం జరుగుతుందని మనందరికీ తెలుసు. బడిపంతులు కథలు పంతుళ్ల పిల్లలదృష్టిని ఆకట్టుకుంటే, సాఫ్టువేర్ ఇంజినీర్లకథలు సాఫ్టువేర్ ఇంజినీర్లకి బావుంటాయి స్థూలంగా. పోతే, రచయితకి సంబంధించినంతవరకూ ఏకథలోనైనా ప్రధానాంశం సాధారణంగా తాను గమనించిన ఒక సాంఘిక లేక మానసిక ప్రవృత్తి అయివుంటుంది. ఆ అంశానికి అనుగుణంగా పాత్రలూ, స్థల, కాలాలూ ఎంచుకుంటాడతను, అంటే తాను గమనించిన విషయాన్ని తనస్ఫూర్తికి ఆనినంతవరకూ తాను చెప్పదలుచుకున్న విషయానికి ఎంత అవసరమో అంతే ఎంచుకోడం జరుగుతుంది. స్థూలంగా, ఒక మానసికప్రవృత్తిని ఆవిష్కరించదలుచుకున్నప్పుడు, ఏ ఊళ్లో అన్న ప్రస్తావన అనవసరంగా తోచవచ్చు. ఒక సామూహికప్రవృత్తిని ఆవిష్కరిస్తున్నప్పుడు, సోమవారమా, శుక్రవారమా అన్నది అస్పష్టంగా వదిలేయవచ్చు. లేదా, పొరపాటునే, సోమవారం తరవాతిరోజు శుక్రవారం అని రాయొచ్చు. ఇది ఒకరకంగా సినిమాల్లో మొదటిసీనులో పసిబాలుడు మూడోసీనులో నవయువకుడిగా సాక్షాత్కరించడంలాటిదే. సినిమాలోలాగే కథ కూడా స్థల, కాలాల్లో చిన్న చిన్న కప్పదాట్లు వేయొచ్చు. ఇటువంటి లోపాలను పూర్వం పాఠకులు పట్టించుకోలేదు. ఆనాటికథల్లో నేను ఇలాటిపొరపాట్లు ఈమధ్యనే ఎక్కువగా గమనించేను (నాకథల్లో కూడా). కానీ ఇప్పుడు పాఠకులు, సోమవారానికీ శుక్రవారానికీ మధ్య మూడురోజులున్నాయి కదండీ అని ఎత్తి చూపుతున్నారు. అది తప్పని అనడంలేదు నేను. పాఠకులు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నారో చూపుతున్నాను. ఈ సూక్ష్మపరిశీలనమూలంగా రచయితలు వాస్తవికతవిషయంలో మరింత శ్రద్ధ చూపవలసిన అగత్యం ఏర్పడింది. ఇది ఒక కోణం.

స్థలమూ, కాలమూ లాగే వస్తువువిషయంలో వివరణలు కోరడం కూడా. కథని కథగా కాక, అందులో స్థలంగురించో, ఇతరవివరాలు తెలుసుకోడానికో చదువుతున్నట్టు కనిపిస్తుంది కొన్ని అభిప్రాయాలు చదువుతుంటే. కొందరు రచయితలు ఆ పాఠకులస్థాయికి ఎదిగి, సుదీర్ఘంగా విషయచర్చ చెయ్యడం కూడా కథల్లో కనిపిస్తోంది. ఒకకథలో ఒక జబ్బు ప్రసక్తి వస్తే, ఆ జబ్బు లక్షణాలూ, వాటికి వాడే మందులూ, మోతాదులూ, సత్ లేక దుష్ఫలితాలూ వంటివి రెండుపేజీలకి సాగదీసి చర్చించడం కొందరికి నచ్చుతుందేమో కానీ, నేను మటుకు అలా చేస్తే, చిన్నకథకి ఉండవలసిన క్లుప్తత దెబ్బతింటుందనే అనుకుంటాను, ఆకథలో అదే ప్రధానాంశం అయితే తప్ప. అలాగే డయాస్ఫొరా కథల్లో, అమెరికాకథల్లో, అమెరికాలో జీవనసరళిమీద విస్తృతంగా చర్చించడం. కథ అంటే కథే. అమెరికాకథలు చదివితే అమెరికాలో జీవనవిధానం కొంత తెలియొచ్చు కానీ అది జాగ్రఫీపాఠమో, సాంఘికచరిత్ర పాఠమో కాదు. కేవలం విషయసంగ్రహణకోసం ఎవరూ కూడా కథలమీద ఆధారపడకూడదు. కథలో వివరణ మోతాదు మించితే అది కథ అనిపించుకోదు.

కథారచయితకి స్వేచ్ఛ అవుసరం. అంటే అక్షరాలా ఉన్నదున్నట్టు, చూసింది చూసినట్టు కాక, కథ చిక్కగా నడపడానికి అనువుగా కల్పన చేసుకోవాలి. కథకి కేంద్రం కథాంశమే. ఇతరవివరాలు ప్రధానాంశాన్ని తినేయకూడదు. చిన్నకథకి క్లుప్తత ముఖ్యలక్షణాల్లో ఒకటి. ఇటు రచయిత స్వేచ్ఛ, అటు పాఠకుడిని ఆకట్టుకోడానికి తగినట్టు స్పష్టత, వాస్తవికత – వీటిమధ్య పొత్తు కూర్చగల మధ్యేమార్గం కావాలి. అభిప్రాయాలు వెలిబుచ్చే పాఠకులూ, ఆ అభిప్రాయాలని గౌరవించే రచయితలూ కూడా గమనించవలసినవిషయం ఇది.

అసలు పాఠకులదృష్టిలో ఈమార్పు – ప్రతిచిన్నవిషయం రచయిత వాచ్యం చెయ్యాలి అని కోరుకోడం అభిలషణీయమేనా? మరీ అంత చాదస్తంగా ప్రతి చిన్నవిషయం అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు వివరించుకుంటూ పోతే నిజంగా పాఠకుడికి తృప్తి కలుగుతుందా? అన్నది ఆలోచించవలసినవిషయం. ప్రసిద్ధవిమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య అభిప్రాయం చూడండి. రచయిత పాఠకులవూహకి ఏమీ వదిలిపెట్టకుండా, ప్రతి చిన్నవిషయం వివరించుకుంటూ పోతే, అది పాఠకుడి మేధస్సుని అవమానించినట్టే అంటారాయన. (“కథ చదవడం ఎలా?” తెలుగువెలుగు. టి.ఎ.జి.సి. వార్షికసంచిక, 2004). కానీ ఈనాడు వస్తున్న వ్యాఖ్యలు చూస్తే, కనీసం కొందరు వల్లంపాటివారి అభిప్రాయంతో ఏకీభవించినట్టు కనిపించదు.

నేను మాత్రం ఇది కథకీ వ్యాసానికీ మధ్యగల ఒక ముఖ్యమయిన వ్యత్యాసంగా గుర్తిస్తాను. పాఠకుడిలో ఆలోచనలూ, ఉత్కంఠ రేకెత్తించేగుణం కథకి అవసరం. ఋజువులూ, సాక్ష్యాలతో పాఠకుడిని నమ్మించవలసిన అవుసరం వ్యాసానికి ఉంది కానీ కథకి కాదు.

వర్ణనలవిషయంలో కూడా ఇటువంటి సందర్భమే తటస్థపడుతోంది ఈనాడు. కథకి తగిన వాతావరణానికీ, పాత్రచిత్రణకీ పాఠకుడిమనసులో రూపు కట్టడానికి కావలసిన వివరాలు లేక వర్ణనలు కథలో చొప్పించడం సహజం. మన ముందుతరాలవారి కథల్లో, ఉదాహరణకి మధురాంతకం రాజారాం, కాళీపట్నం రామారావుకథల్లో, ఇలా వాతావరణం కళ్లకి కట్టినట్టు వర్ణించడం చూస్తాం. కానీ, రాను రాను కథలో కేవలం వస్తువు లేక సందేశానికే ప్రాముఖ్యత పెరిగిపోవడంవల్లా, ఒకొకప్పుడు నిడివిమీద పత్రికల ఆంక్షలవల్లా ఈవివరాలు తగ్గిపోతున్నాయి. ఇక్కడే మరొక వైరుధ్యం. పెద్దకథలు చదవడానికి పాఠకులకి తీరికలేదు. చాలామంది గబగబా ముగిసిపోయేకథలమీదే ఆసక్తి చూపుతున్నారు. మరి వివరాలు కావాలంటే కథ పెంచకతప్పదు. అలా పెంచడంమూలంగా కొందరికి సంతృప్తి కలగొచ్చు మరికొందరికి విసుగ్గా కనిపించవచ్చు. ఎలా చూసినా ఎంత వివరంగా రాయాలి అన్నది కత్తిమీద సామే.

కథల్లో ఇలాటి లోపాలకి కొంతవరకూ మన మౌఖికసాహిత్యలక్షణాలు కావచ్చు. మనం వాటికి అలవాటు పడిఉండడం కావచ్చు. 60వ దశకం పాఠకుల, రచయితలమధ్యసంబంధం ఈ అలవాటుకి సంబంధించినదిగా కనిపిస్తుంది కథనరీతుల్లో. కథ ఎదురుగా ఉన్నవారికి చెప్పేటప్పుడు వారి ముఖకవళికలను బట్టి మార్పులూ, చేర్పులూ చేస్తూ వారి అవగాహనకి తోడ్పాటు అందిస్తాడు కథకుడు. కానీ కాగితంమీద రాస్తున్నప్పుడు ఆ వెసులుబాటు లేదు. రచయితకి తనపాఠకులు ఎదురుగా లేరన్న స్పృహ లేకపోవడం కూడా జరగొచ్చు, లేదా సాధ్యం కాదు. ఈనాడు పాఠకులు ప్రపంచవ్యాప్తం. వారి అభిరుచులూ, అవగాహనస్థాయీ అనంతం. ఇది వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది. ఒకరు చాలాబాగుందన్న కథనే మరొకరు గందరగోళంగా ఉంది అనడం చూస్తూనే ఉన్నాం కదా.

ఇన్ని పరిమితులమధ్య ఈనాటి రచయిత తనకు తానే కొన్ని పరిధులు నిర్మించుకుని, తనకి అర్థమయినరీతిలో పాఠకులఅభిరుచులని ఊహించుకుని రాస్తున్నాడు. అతని వర్ణనలూ, వివరణలూ ఆ పరిధిలోనే ఉంటాయి. కానీ ఇందులో ప్రమాదం ఏమిటంటే ఎప్పుడు ఆ పరిధులు మితి మీరుతాయో, ఎప్పుడు కథ సోదిగా మారిపోతుందో అన్నబాధ రచయితకి.

సాధారణంగా ఎప్పుడయితే పాఠకుడు “అలాటి సంఘటన జరిగివుండదు, అలాటి పాత్ర ఉండదు,” అంటాడో, అప్పుడే ఆ పాఠకుడు తనకి సుపరిచితమయిన ప్రపంచాన్ని అధిగమించి చూడడానికి ప్రయత్నం చెయ్యడం లేదు అనుకోవాలి. రచయిత అలాటి సంఘటనో, పాత్రో చూడడంచేతే రాసేడు అని పాఠకుడు అంగీకరించడంలేదు ఇక్కడ.

1960లో వచ్చిన “మారినవిలువలు” (ద్వివేదుల విశాలాక్షి) నవలలో చివర జానకి తల్లి, అన్నగారు, తదితరులజీవితాలు ఏమయిపోయేయో చెప్పలేదు కనక నవల అసంపూర్ణంగా ఉంది” అని ఒక పాఠకుడు రచయిత్రికి ఉత్తరం రాసేడుట. దానికి సమాధానంగా, విశాలాక్షిగారు “ఈనవల ఒక వ్యక్తికథ కాదు. ఇది ఒక కుటుంబచరిత్ర. ఎంతరాసినా అసమగ్రమే” అని జవాబిచ్చారు (మారినవిలువలు. ముందుమాట.)

నిజానికి ఈవివరణ అన్ని కథలకీ, నవలలకీ వర్తిస్తుంది. రచయిత తాను ఆవిష్కరించిన సందేశానికి తగినంతవరకే పాత్రలూ, సన్నివేశాలూ సమకూర్చుకోడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ చెప్తే, కథ పక్కదారి పట్టి, అసలు విషయం నీరసించిపోయే అవకాశం ఉంది. అలాగే అసాధారణసంఘటనలూ, సన్నివేశాలూ సృష్టించడం కూడా. ఒక మనిషి కోపంతో “తాడెత్తున లేచాడ“నో “తాట వొలిచేశాడ”నో అంటే నిజంగా అలా చేశాడని కాదు కదా. ఆవాక్యాల్లో వాస్తవికతలాటిదే కథల్లో వాస్తవికత కూడా.

మరొక ఉదాహరణ చూద్దాం. నానవల “చాతకపక్షులు“లో న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో తొలిసారిగా దిగిన కొత్తపెళ్లికూతురు కన్వేయర్ బెల్ట్‌మీద సాగిపోతున్న సూట్కేసు అందుకోబోతుంది ఆతురతగా. పక్కనున్న అమెరికన్ ఆ సూట్‌కేస్‌ని అందుకుని, తీసి ఆమెకి ఇస్తాడు.

దీనిమీద ఒక పాఠకుడి వ్యాఖ్య “కొత్తవ్యక్తి అమెరికన్ చేతిలోనుండి ఆమె తనపెట్టె ఎలా అందుకుంది?” అని.

అంటే ఆ అమెరికన్ పరపురుషుడనా? నాకు అర్థం కాలేదు. ఇదేదో నేను కనివిని ఎరగని సరికొత్త సంకర సంస్కృతిధోరణి అనుపించింది నాకు.

ఇదే సన్నివేశంమీద మరొక పాఠకుడు వెలిబుచ్చిన అభిప్రాయంలో అతడు కథలో ప్రధానాంశంమీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అతని వ్యాఖ్య “న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ చాలా హడావుడిగా ఉంటుంది. మనవారందరికీ వాళ్ల వాళ్ల పిల్లా మేకా చూసుకోడంతోనే సరిపోతుంది. మనదేశంలో అమెరినులగురించి ఉన్న అభిప్రాయం – వాళ్లు సొంతలాభం లేనిదే పొరుగువారికి సాయపడరన్నమాట – నూటికి నూరుపాళ్లూ నిజం కాదని చెప్పడానికీ, నవలలో దరిమిలా వచ్చే సంఘటనలకి సూచనప్రాయంగానూ కనిపిస్తోంది” అని. నేను ఈ సన్నివేశం సృష్టించినప్పుడు నాఆలోచన కూడా ఈ రెండోపాఠకుడు చెప్పిందే. మొదటిఅభిప్రాయంలో పాఠకుడు తన వ్యక్తిగత, తెలుగు సాంప్రదాయకవిలువలని కథలో పాత్రలకి ఆపాదించాడు.

కొంతకాలం క్రితం ఉపాధ్యాయులు సూర్యకుమారి రాసిన “అమ్మ పెళ్లి” కథమీద కూడా ఇలాటివ్యాఖ్యలే వచ్చేయని రచయిత్రి నాకు రాసేరు. ఈకథ నాకు నచ్చింది. కారణం మామూలుగా డయాస్ఫొరాకథల్లో అట్టే కనిపించని ఒక కోణం – మన ఎన్నారై కుటుంబాల్లో తల్లి, కూతుళ్లమధ్య సాంస్కృతికపరమైన విలువలగురించిన సంఘర్షణ. ఇది పశ్చిమదేశాల్లో ఉన్న తెలుగువారి పరస్పర విరుద్ధభావాలకి మచ్చుతునక. నిర్దుష్టత లోపించినందువల్ల కావచ్చు.

పాఠకుడు తనకి తాను ఆలోచించుకోడం మానేసి, వివరణలకోసే పూర్తిగా రచయితమీదే ఆధారపడితే ఆకథ కథగా రక్తి కట్టదనే నేను నమ్ముతాను. నాకు ఆలోచించుకోడానికి అవకాశం కల్పించే కథలే నాకు నచ్చుతాయి. కథ పాఠకుడిలో వాస్తవికతకి సంబంధించిన అల్పవిషయాలు కాక మౌలికంగా రచయిత ఆవిష్కరించిన అంశానికి సంబంధించిన ఆలోచనలు పాఠకుడిలో రేకెత్తించగలిగినప్పుడే అది మంచికథ అవుతుంది.

భాషవిషయం. కథనంలోనూ, విమర్శల్లోనూ కూడా కనివిని ఎరగని మార్పులొచ్చేయి. గత ఇరవై ఏళ్లలోనూ ఇంగ్లీషు తెలుగుని విపరీతంగా ఆక్రమించేసింది. డయాస్ఫొరాకథల్లోనూ, తెలుగుదేశంలో బస్తీలూ, ఆఫీసులూ నేపథ్యంగా గల కథల్లోనూ అయితే సగానికి సగం ఇంగ్లీషు మాటలే. వాటికి అనువాదాలంటే, డు, ము, వు, లు లాటి ధాతువులు మార్చి, ఇంగ్లీషులో రాసేయడమే.

మనకి వివిధ ప్రాంతాల, కులాల, వృత్తులకి సంబంధించిన పదాలగురించి కూడా చెప్పుకోవాలి. ఒకొక పదానికి ఆనేక రూపాలు ఉన్నాయి. 80వ దశకంలో వచ్చిన మాండలీకం కథలు, పాటకజనం మాటాడుకునే భాషలలో వస్తున్నకథలమూలంగా కేవలం స్థానికులకి మాత్రమే తెలిసిన వాడుకపదాలు వేలకొద్దీ కథల్లో చోటు చేసుకుంటున్నాయి. పాటకులకి భాషని గురించిన ఆలోచన ఉండడం ఎంతైనా హర్షించదగ్గవిషయం. కానీ వారు ఈబేధాలని కూడా గమనించాలి. నిజానికి నేను తెలుగులో రాస్తున్నప్పుడు కొంత శ్రమ పడవలసి వస్తోంది అమెరికాలో నేనున్నచోట తెలుగు వాడే అవకాశం లేనందున, భాష మర్చిపోతున్నాను. అలాగే ఏదో ఒక మాండలీకంలో రాసినకథ అర్థం చేసుకోడానికి కూడా అవస్థ పడాల్సివస్తోంది. నాతెలుగుని నిలబెట్టుకోవాలంటేనూ, విస్తృతపరుచుకోవాలంటేనూ అదొక్కటే మార్గం నాకు. మరి ఈనాటి పాఠకులకి ఆ ఓపిక లేదా? లేక, అసలాదృష్టి లేదా?

చివరిమాటగా, ఫెమినిజంగురించి ఒకమాట చెప్పి ముగిస్తాను. ఈమధ్య ఏకథలో ఒక స్త్రీపాత్ర ఏ అభిప్రాయం వెలిబుచ్చినా, అదుగో ఫెమినిజం, అనీ ఆరచయితని ఫెమినిస్ట్ అనీ ముద్ర వేసేయడం పరిపాటి అయిపోయింది. ఉదాహరణకి, ఒక కథలో భర్త “నాబార్య గిన్నెలు తీసి పెడుతుందిలెండి” అంటాడు. ఆమాటగురించి గీత “నేను చేస్తాను” అనడానికీ “మాఆవిడ చేస్తుందనడానికీ” మధ్యగల తేడాగురించిన విచారణలో పడుతుంది. మరి ఈవాక్యంమూలంగా మొత్తం కథ అంతా ఫెమినిస్ట్ కథ అయిపోతుందా? అదే ఆ భార్యే, “మాఆయన చేస్తాడులెండి” అంటే బాగుండునా? ఇది ఒక సందేహం. ఇప్పుడు మరోకథ, “గుడ్డిగవ్వ” (వార్త. జనవరి 9, 2005) చూడండి. అమెరికాల ఉన్న అన్నగారు గొంతు పూడుకుపోయినతమ్ముడిని ఆపరేషను చేయించడానికి అమెరికా తీసుకువస్తాడు. వాళ్లింటికి, స్నేహితులు వచ్చినప్పుడు, కారులోంచి సూట్‌కేసులు తీసుకురావాలి. “నేను తెస్తాలెండి” అంటాడు అన్నగారు, నిల్చున్నచోటునుండి కదలకుండా. తమ్ముడికి తీసుకురా అని చెప్పడు. తమ్ముడే వెళ్లి అందుకుంటాడు. ఈరెండు సన్నివేశాల్లోనూ రచయితగా నా అభిప్రాయం ఒకటే – ఒక మనిషి మరొకమనిషిని మరొకరిసేవకి ఉదారంగా పెట్టడం. అంతే. ఇందులో జండరు కన్నా ఎక్కువగా కనిపించేది ఎవరు ఎవరిని వాడుకోగలిగితే, ఎలా వాడుకోగలిగితే అలా వాడుకోడం. అదీ నేను చెప్పదలుచుకున్నది. ముఖ్యంగా ఈ ఆచారం మనఇళ్లలోనే కానీ అమెరికన్ సాంప్రదాయంలో లేదు. ఇక్కడ ఎన్నారై మనస్తత్త్వాలూ, మారుతున్న కుటుంబవిలువలవిషయంలో అయోమయం కనిపిస్తుంది.

మరొక విశేషం. వార్త తరవాత మరొక పత్రిక ఇది ప్రచురించుకున్నారు. వారు “నేను తెస్తాను” అన్న వాక్యాన్ని “ముత్యం (తమ్ముడు) తెస్తాడులెండి” అని మార్చేశారు, నన్ను అడక్కుండానే! అలా మార్చడంచేత కథలో భావం మారిపోయింది. ఒకరు మరొకరిని ఎంత నాజూగ్గా మరొకరిని సేవలోకి తోస్తారో చూపించదలుచుకున్న నాధ్యేయం మాయమయిపోయింది.

నాసందేహాలు – ఈ ఇజాలముద్ర వేయడంలో పాఠకులు తొందరపాటు చూపుతున్నారా? లేక, రచయితలే తాము ఆవిష్కరించదలుచుకున్నవిషయాన్ని స్పష్టం చేయలేకపోతున్నారా? అది అలా ఉంచి, అసలు ఈవాదాలకి అతీతంగా “కథకోసం కథ” (art for art’s sake) చదువుకోడం సాధ్యం కాదా? పోతన గానీ వేమన గానీ ఎవరిమెప్పుకోసమో, ఏ సాంఘికప్రయోజనం ఆశించో రాయలేదు కదా. కథారచయితలు, కనీసం కొందరు, కూడా అంతే అనుకోడానికి అవకాశం ఉందా? లేదా?

————-

(ఫిబ్రవరి, 2005)

(పొరపాట్లు సవరించి, నవంబరు 30, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s