నిజానికీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ

నిజానకీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ – రెండు కథలకీ ముందుమాట

చాలా పత్రికలూ సంకలనాలూ నన్నడక్కుండానే ప్రచురించుకున్న ప్రముఖకథ నిజానకీ ఫెమినిజానికీ మధ్య.
ఈకథమీద చాలా చర్చలు జరిగాయని విన్నాను. అంచేత అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా, ఈకథగురించి నామాట చెప్తాను మొదట.
నాకు వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేయి. అందులో చాలావరకూ తమజీవితంలోనూ తమఆప్తుల జీవితంలో సరిగ్గా ఇలాటి సంఘటనలు జరిగేయనీ, ఈకథ తమకి కాస్త ఓదార్పు కలిగించిందనీ వివరిస్తూ. ఏకథకి అయినా అదే ప్రయోజనం. సాధారణంగా కథకోసం వస్తువు గ్రహించినప్పుడు రచయిత సంఘటనని కొంత ఆసరాగా తీసుకుని కథ రాసినప్పుడు దానికి విశ్వజనీనత వచ్చేది అదే విధమైన అనుభవమో సంఘటనో ఇతరుల జీవితాల్లో కూడా జరిగినప్పుడు. రచయిత అనేకసంఘటనలని కూడదీసి ఒకకథ అల్లుతాడు. కథకీ ఆత్మకథకీ తేడా అదే.

ఈ కథమీద వచ్చిన చర్చలకి నా వివరణలు ఇవి-
1. నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథమీద చర్చలు చాలానే జరిగినా, నాదాకా వచ్చిందీ, నాకు సమాధానం చెప్పాలనిపించిందీ రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్య. ″… ఇలా సీత ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడిపి …″ అన్నది.
నేను ఈకథలో సీతని ఆత్మవిశ్వాసం గలవ్యక్తిగా చిత్రించడానికి ప్రయత్నించాను. (పత్రికలవారు నెత్తిన కొంగు వేసుకుని పెద్ద కన్నీటిబొట్టుతో సీతని చిత్రించేరు. అది కథని అర్థం చేసుకుని వేసిన బొమ్మగా నాకు అనిపించలేదు). పోతే ఆత్మవంచన అన్నది ఒక దుస్థితిలో వుండి, ″నేను సంతోషంగా వున్నాను, నాజీవితం పూలనావ″ అన్న భ్రమలో వున్నవ్యక్తి పట్ల ఉపయోగించవలసిన పదం. అంతేకానీ, సమస్య వుందని గుర్తించి, ఆ సమస్యకి మూలకారణం వెతుక్కుని, ఎదుటివ్యక్తిని ముఖాముఖి ఎదుర్కొని, నిలదీసి ప్రశ్నించి, తనకు తానుగా పరిష్కారంగా నిర్ణయం తీసుకున్న వ్యక్తిని గురించి అనలేరెవరూ. దాన్ని ″ఆత్మవంచన″ అనడం సమంజసం కాదు.

 1. దీనిలో ఫెమినిజం ఏముంది అన్నది. లేదు. ఇది ఫెమినిజం కథ కాదు. ఫెమినిజం పేరు చాటు చేసుకుని, అటు ఫెమినిజానికీ ఇటు నిజానికీ చెందని, కళ్లుమూసుకు పాలు తాగేపిల్లి తత్వం ఎత్తి చూపాను నేను ఈకథలో. అలాటివారిలో చిత్తశుద్ధి లోపించిందన్న వాదన ఇది. ఇంట్లో భార్యకొక నీతీ, ఊళ్లో ఆడవాళ్లకి మరో నీతీ అవలింబించే మగవారినీ, ఆ మగవారిప్రాపకంలోనే తమస్థాయిని పెంచుకోడానికి నానా స్వరూపాలూ ధరించేఆడవారినీతినీ ప్రశ్నిస్తున్న కథ ఇది. సంఘసంస్కర్తలమని గుండెలు బాదుకుంటున్నవారి చిత్తశుద్ధిని నిలవేసి ప్రశ్నిస్తున్న మేలుకొలుపుపాట ఇది.
  3. అటు ప్రవాసజీవితంలోని కొత్తవిలువలకి అలవాటు పడలేక, ఇటు పాతవిలువల్ని వదులుకోలేక ఆరాటపడిపోతున్న అస్తవ్యస్తపు జీవులు తెలిసీ తెలియకా పడే బాధలు. నిజానికీ ఫెమినిజానికీ మధ్య రాసింతరవాత, ఈవిషయం పూర్తిగా ఆవిష్కృతం కాలేదనిపించి, ఆతరవాత రాసిన కథ దేవీపూజ. కాలక్రమంలో వెనకే అయినా ముందు దేవీపూజ చదివితే, నిజానికీ ఫెమినిజానికీ కథ మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

ఈపరిస్థితులు కొంతవరకూ 80 దశకంనాటికి కొంత మారిపోయినట్టు కనిపించినా, ఇప్పటి యువతరం అమ్మాయిలు ఈ కథలు చదివి తమ అనుభవాలకి చాలా దగ్గరగా ఉన్నాయని నాకు తెలియజేస్తున్నారు. అందుకే రెండు కథలూ ఇక్కడ పెడుతున్నాను.

—————————————

దేవీ పూజ

సీతాపతి భార్యని రెస్టారెంటుకి తీసుకెళ్ళేడు పదహారో యానివర్సరీకి ఆనవాయితీ తప్పకుండా.

సీత చుట్టూ కూర్చున్నవాళ్ళని చూస్తోంది. ఒకో బల్లదగ్గరా ఇద్దరూ ముగ్గురూ కూర్చుని ఉన్నారు – వయసులో ఉన్న పిల్లా పిల్లాడూ, ఓ ముసలాయనా ముసలావిడా, ఓ తండ్రీ ఇద్దరు పిల్లలూ, మరో తల్లీ ఆరుగురు ఆడపిల్లలూ – పుట్టినరోజు పార్టీలా ఉంది. నెత్తిమీద కాయితపు కిరీటాలూ, చేతుల్లో గాలిబుడగలూ – గోలగోలగా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సినిమాలూ, డాన్సులూ, ఆటలూ, పాటలూ, చదువూ సంద్యా, అప్పూ ఆస్తీ, ఇల్లూ కారూ, మంచూ, చలీ, సౌతాఫ్రికా, నికరాగ్వా …కబుర్లలో దొర్లిపోతున్నాయి.

సీత భర్తమొహంలోకి చూసింది. అతనేదో ఆలోచిస్తున్నాడు. ఏమైఉంటుందో?

పెళ్ళయి పదహారేళ్ళయింది. మొదట ఏ రెండు మూడేళ్ళో … అంతే. ఆ తరవాత అతనిలోకం అతనిదీ, తనలోకం తనదీ.

“హౌ ఆర్యూ టుడే?” వైట్రెస్ వచ్చి చిరునవ్వుతో కుశలప్రశ్నలేసి, పేరు చెప్పుకుని, ఏం కావాలని అడిగింది ఎంతో ఆప్యాయంగా.

సీతాపతి తాము బాగున్నామని ఆ పిల్లకి చెప్పి, సీతని అడిగేడు. “ఏం కావాలి?”

“మీరే చెప్పండి.”

“నువ్వు చెప్పు. నీ యానివర్సరీ కదా!”

అతనికదో అలవాటు. ప్రతీదీ ఆవిడకోసమే అన్నట్టు మాటాడతాడు.

“ఏం, పెళ్ళి నాకే గానీ మీకు కాలేదేమిటి?”

సీతాపతి నవ్వేసి, వైట్రెస్‌ని అడిగేడు సలహా. Specialty of the day, specialty of the house, తనకిష్టమయినవి, కస్టమర్ల్స్ మెచ్చుకునేవీ ఓ పనస చదివిందా అమ్మాయి.

సీతాపతి ఏదో చెప్పి ఇద్దరికీ అదే తెమ్మన్నాడు.

తాగడానికేం కావాలని మళ్ళీ అడిగింది వైట్రెస్.

సీతాపతి తనకి వైను తెమ్మన్నాడు. సీత తనకేం వొద్దంది కానీ అతను వదల్లేదు. పిన్యా కొలాడా తెమ్మన్నాడు ఆవిడకి.

“ప్రతిసారీ కీష్ తీసుకుంటావు కదా. ఇవాళ అడగలేదేం?”

“ప్రతిసారీ అదే తింటున్నాను కదా. ఇవాళ మార్చి చూద్దాం అని.”

అతను మళ్ళీ ఆలోచన్లో పడ్డాడు.

సీత మళ్ళీ దిక్కులు చూడసాగింది.

నాలుగు రోజులక్రితం అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది తమ యానివర్సరీ సంగతి.

“ఏం కావాలో చెప్పు, కొనిపెడతాను,” అన్నాడు ముచ్చట పడిపోతూ.

అంచేత అతను తప్పకుండా ఏదో ఒకటి కొంటాడని గ్రహించింది సీత. అంచేత ఆవిడ కూడా అతనికేదో కొంది. ఈదేశం వచ్చేక దీపావళీ దసరా తెలీడంలేదు కానీ ఈ సంవత్సరీకాలు అలవాటయిపోయేయి.

ప్రతి ఏడూ ఏం కావాలని ఒకళ్లనొకళ్లు అడుక్కోడాలూ, నాకేం వద్దని ప్రొటెస్టులూ, ఆ తరవాత ఏదో ఒకటి తప్పకుండా కొనడం, ఒకరు కొన్నది రెండోవారికి తెలీకుండా దాచుకోడాలూ, మూసుకోడాలూ, రంగురంగుల కాయితప్పొట్లాలూ, పిల్లల్ని పొరుగిళ్ళకి తగిలేసి తాము ఏ ఫ్రెంచి రెస్టారెంటులోనో విందులారగించడం. …

సీతకి ఈ సరదాలు లేవు.

సీతాపతికి ఆవిడ అర్థం కాదు.

ఆవిడకి ఏవి సరదాలో అతనికి ఈ పదహారేళ్ళలోనూ అర్థం కాలేదు. అతను సీతని దేనికీ బలవంతం చెయ్యడు. అసలతను ఎప్పుడూ ఎవర్నీ దేనికోసమూ బలవంతం చెయ్యడు. కనీసం మొహమాట పెట్టడం కూడా చెయ్యడు.

సీతాపతికి భార్య అంటే మాచెడ్డ గౌరవం.

అతనికి మంచి స్నేహితులున్నారు. అతను వాళ్ళని కష్టాల్లో ఆదుకుంటాడు. వాళ్ల సుఖాలకి సంతోషిస్తాడు. వాళ్ళ తెలివితేటల్ని మెచ్చుకుంటాడు. వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కూడా మెచ్చుకుంటాడని సీత అభిప్రాయం. అది మూట్ పాయింట్. ఎవరైనా ఆడవాళ్ళని హేళన చేసినా, అవమానించినా సీతాపతి వాళ్ళని పట్టుకు తన్నలేదు కానీ తగువేసుకోకుండా వదల్లేదు. చాలామంది అతన్ని సార్థకనామధేయుడివోయ్ అని హేళన చేసేరు కూడాను. అప్పుడు కూడా అతను నొచ్చుకోలేదు. సీతలాటి భార్యని పొందడం తన అదృష్టం అన్నాడు.

“తనో మరో సుందరాంగినో కాక మొగాణ్ణి భార్యగా పొందుతావేమిటోయ్” అంటూ మళ్ళీ నవ్వేరు మిత్రులు. మూర్ఖులు అనుకుని ఊరుకున్నాడతను. అతనికి సీత అర్థం కావడం లేదు. ఆవిడకి ఏం కావాలో తెలిస్తేనే కదా తాను పూనుకుని సమకూర్చి పెట్టి ఆవిణ్ణి తృప్తి పరచి తాను ఆనందభరితుడయ్యేది.

వైట్రస్ ప్లేట్లూ, గ్లాసులూ బల్లమీద పొందిగ్గా అమర్చి, ఒక గ్లాసులో వైను పోసి, పీన్యాకొలాడా గ్లాసు సీతముందు పెట్టి, బ్రెడ్ రోల్సు పక్కన పెట్టి “ఇంకేమైనా కావాలా?” అని అడిగింది.

ఇంకేమీ అక్కర్లేదని ఆ పిల్లకి చెప్పి పంపేసి, అతను బ్రెడ్ ఓముక్క తుంచి తినడం మొదలెట్టాడు.

సీత ఒక్క క్షణం ప్లేటువంక చూసి తనూ ఓ ముక్క తీసుకుంది.

అతను గ్లాసు ఎత్తి పట్టుకుని “టు మెనీ హాపీ యియర్స్,” అన్నాడు.

సీత కూడా మెనీ హాపీ రిటర్న్స్ చెప్పింది.

“ఎలా ఉంది?”

“బాగుంది.”

“పళ్ళరసమే కదా. కొంచెం రమ్ కలుపుతారు. అంతే.”

“ఊఁ.”

సీత పక్కకి చూసింది. ఇందాకా కుర్రజంట కూర్చున్న చోట ఇప్పుడు ఇద్దరు నడివయసువారు ఉన్నారు.

ఆవిడ పెదవులమీద లీలగా చిరునవ్వు మెరిసింది.

“ఏమిటి?” భర్త ఆ చిర్నవ్వు గమనించి ప్రశ్నించేడు.

“ఏం లేదు. వాళ్ళని చూస్తుంటే మనం ఇక్కడ ఓ తరంసేపు కూర్చున్నామేమో అనిపిస్తోంది.”

పక్కబల్లదగ్గర కూర్చున్న దంపతులు శలవులకి ఎక్కడికెళ్ళాలా అని ప్లానులేసుకుంటున్నారు. ఫ్లోరిడా వెళ్దాం అంటుందావిడ. కొలరెడో వెళ్దాం అంటాడాయన. ఫ్లోరిడా వెళ్తే పిల్లల్ని చూడొచ్చు అంటుందావిడ. కొలరెడో వెళ్తే స్నేహితులని చూడొచ్చు అంటాడాయన. ఎవరి వాదనలు వారికి అప్రతిహతంగా ఉన్నాయి.

“తెలుగువాళ్ళని కలిసి చాలా రోజులయింది” అంది సీత.

“ఊఁ.” అన్నాడు సీతాపతి.

“వచ్చేవారం వాళ్ళని పిలవనా?”

“నేనూళ్ళో ఉండకపోవచ్చు.”

“… …”

“నేన్లేకపోతే ఏంలే. వాళ్ళందరూ నీస్నేహితులే కదా. నువ్వు పిలుచుకో.”

సీత మాటాడకుండా మరో ముక్క నోట్లో పెట్టుకుని భర్తవేపు చూసింది. ఈయనకి వైట్రెస్ మాటమీద చాలానే గురి ఉండి ఉండాలి. తనకి ముక్క గొంతు దిగడం లేదు. అతను పరమానందంగా ఆరగిస్తున్నాడు. అసలు ఏం తింటున్నాడో తెలిసే తింటున్నాడా?

వెనక కూచున్నవారి మాటలు వినిపిస్తున్నాయి.

“శుక్రవారం ఏం చేస్తున్నావు?”

“ఏం?”

సీత కాస్త పక్కకి తిరిగి కనుకొలుకుల్లోంచి వాళ్ళని చూసింది. 16, 17 ఏళ్ళ పిల్లలు.

“ఊరుచివర చిన్న రెస్టారెంటుంది. ఎవరూ ఉండరు,” బహుశా ఆ అమ్మాయి చిలిపిగా కళ్ళెగరేసి ఉంటుంది. కుర్రాడు కొంటెగా ఆపిల్లవేపు చూసుంటాడు. “నిజం. అక్కడ food బాగుంటుంది కూడా.”

“చూద్దాం.”

“తరవాత సినిమాకి వెళ్ళొచ్చు.”

“తరవాత చెప్తాను.”

“ఏడు గంటలకి కారు తీసుకురానా?”

“తరవాత చెప్తానంటున్నాను కదా.”

సీత అప్రయత్నంగానే ఓ నిట్టూర్పు విడిచింది.

“ఏమిటి?” అన్నాడు సీతాపతి.

“వెనక కూర్చున్నవాళ్ళ మాటలు.”

“ఏమిటిట?”

“ఏం లేదు. మనదేశంలో పెద్దవాళ్ళు పెళ్ళిసంబంధాలు మాటాడుకున్నట్టే ఇక్కడ పిల్లా, పిల్లాడూ ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి పడే తాపత్రయం.”

వైట్రెస్ మళ్ళీ ప్రత్యక్షమయింది. “ఎనీ డెసర్ట్?” అంటూ.

“చెప్పు” అన్నాడు సీతతో.

“నాకేం వొద్దు.”

“ఐస్క్రీం నీకు ఇష్టం కదా. తీసుకో.”

“సరే.”

ఇద్దరికీ ఆర్డరు చేసి సీతాపతి మళ్ళీ ఎటో చూస్తూ కూర్చున్నాడు.

Ha…ppy… bi…rth…day to… you…

రెస్టారెంటులో వాళ్ళందరూ ఉలికిపడి పాట వచ్చినదిక్కుగా చూశారు. పిల్లలందరూ పుట్టినరోజు పాపాయి చుట్టూ చేరి గొంతెత్తి పాడుతున్నారు. పాట అయిపోయేక ఆ పాపాయి కొవ్వొత్తులు ఊదేసింది ఒక్కగుక్కలో. అందరూ చప్పట్లు కొట్టేరు. సీత కూడా చిన్నగా చప్పట్లు కొట్టి ఇటు తిరిగింది.

సీతాపతి తన ధ్యాసలో తనున్నాడు.

సీతకి ఐస్క్రీం తినాలనిపించలేదు.

“ఏం?” అంటూ సీతాపతి అది కూడా తీసుకుని పూర్తి చేసేశాడు.

సీతకి ఎందుకో పార్వతి జ్ఞాపకం వచ్చింది. పార్వతిని తను అంతకుముందు ఎరగదు.

000

నాలుగేళ్ళ కిందట ఇండియా వెళ్ళబోతూ ఎయిర్పోర్టులో ఆగిపోవాల్సొచ్చింది. పొగమంచు కారణంగా విమానాలు ఆరోజు ఎగరలేదు. కారిడర్‌లో తెలుగుమొహం కనిపించగానే పార్వతిమొహం మతాబాలా వెలిగింది. ఎవర్నో రిసీవ్ చేసుకోడానికి వచ్చిందిట. ఆ ప్లేనూ రాలేదు. ఇద్దరూ మాటల్లోకి దిగారు. ప్లేను కాన్సిల్ చేసారు కనక సీతని వాళ్ళింటికి రమ్మంది పార్వతి ఆపూటకి.

సీత మొహమాట పడింది కానీ పార్వతి ఒప్పుకోలేదు. వాళ్ళిల్లు చాలా దగ్గరే అనీ ఇంట్లో ఎవరూ లేరనీ బతిమాలింది.

“మనం ఇక్కడ ఎక్కువగా మిస్సయేది ఈ పోచికోలు కబుర్లేనండీ. నేను చిన్న పల్లెటూళ్ళో పెరిగేను. వీధిగుమ్మంలోనో నీలాటిరేవులోనో నిలబడి ‘ఏం కూర’ అంటూ మనూళ్ళలోలా అడిగే తీరికా ఉండదు. అడగడానికి మనుషులూ ఉండరు.”

సీత అంతవరకూ గమనించలేదు. పార్వతికి ఐదో నెల. ఆవిడ భుజమ్మీద చెయ్యేసి “పదండి” అంది.

ఆ తరవాత కొన్నాళ్ళపాటు ఫోనులో మాటాడుకుంటూ ఉండేవారు కానీ ఈమధ్య అదీ తగ్గిపోయింది. ఓమాటు పిలిచి చూడాలి అనుకుంది సీత.

“అయిందా?”

“ఏమిటి?”

“చుట్టుపక్కల వాళ్ళమాటలు వినడం.”

“ఎదురుగా ఉన్నమనిషి మాటాడకపోతే అవే వినిపిస్తాయి మరి.”

“సరేలే. పద.”

ఇంటికొచ్చి తలుపు తీసేసరికి ఫోను గోల పెడుతోంది.

సీతాపతి ఒక్క ఉదుటున ఎగిరి ఫోనందుకున్నాడు కొంపలంటుకుపోతున్నట్టు. “హలో” అన్నాడు అరుస్తున్నట్టు.

హ్మ్. అయిపోయింది యానివర్సరీ అనుకుంది సీత ఓ నిట్టూర్పు విడిచి. టీవీ ఆన్ చేసి సోఫాలో కూలబడింది.

సీతాపతికి అవతల ఎవరో యానివర్సరీ శుభాకాంక్షలు చెప్పినట్టున్నారు. అతను ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అతను ఫోనులో మాటాడ్డం పూర్తి చేసి వచ్చేసరికి సీతకి ఒక సిట్‌కాం అయి రెండోది మొదలయింది.

“ఏమిటి చూస్తున్నావు?”

“ఏదో…”

“ఎందుకా చెత్త. కట్టెయ్.”

సీత ఏదో అనబోయింది కానీ ఫోను మళ్ళీ మోగింది. పిట్ట పోరూ పిట్ట పోరూ పిల్లి తీర్చింది. అతను మళ్ళీ తిరిగొచ్చేసరికి ఈ సిట్‌కాం కూడా అయిపోతుంది.

సీతకి అతనితీరు అర్థం కాదు. ఏదో ఒట్టు పెట్టుకున్నట్టు … తనతో తప్ప ఎవరితోనైనా సరే గంటలతరబడి మాటాడగలడు. ఎంచేతో అర్థం కాదు. తను ఎంత ప్రయత్నించినా ఉ, ఆ, ఏమిటి తో ముగించేసే ఈ మనిషి ఇంకెవరితోనైనా ఏకధాటిగా మూడు గంటలసేపు మాటాడగలడు – పిన్నల్తో, పెద్దల్తో, ఆడాళ్ళతో, మగాళ్ళతో, తెల్లవాళ్లతో, నల్లవాళ్లతో, పండితులతో, పామరులతో … అతనిదృష్టిలో తను మాత్రమే ఏకోవకి చెందనిదేమో! ఇంట్లో ఉన్నంతసేపూ ఆ ఫోనుకోసం తహతహ. “నన్ను ఏ టైములోనైనా సరే పిలవొచ్చునహో” అంటూ సకలజనులకీ దండోరా వేయించినట్టు. అంచేతేనేమో అందరూ అతన్ని వేళా పాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సమయాసమయాలు చూసుకోకుండా పిలిచి తమరు ధన్యులై ఈయన్ని ధన్యుణ్ణి చేస్తారు.

సీతకి విసుగేసి టీవీ ఆపేసి ఓ పుస్తకం తీసుకుని పడగ్గదిలోకి వెళ్ళిపోయింది. దాదాపు మరో గంట అయేక సీతాపతి గదిలోకి వచ్చేడు. “పుష్పం సమర్పయామి పత్రం సమర్పయామి” అన్నట్టుంది అతని వాలకం.

“ఏం? అప్పుడే మాటలయిపోయేయా?” అంది సీత రవంత కోపంతో.

“తానా కాన్ఫరెన్సులొస్తున్నాయి కదా. ఏవో సలహాలు అడగడానికి పిలుస్తారు. నేనేం చెయ్యను?” అన్నాడతను మంచంమీదికొరుగుతూ.

“ఏదో ఒకటి. తానా కాకపోతే మరో తానతందాన. లోకేశుడి సంగతెలా ఉన్నా తమరు లేకపోతే లోకాలాగిపోవడం ఖాయం.”

“పదిమందీ పూనుకుంటేనే కదా కార్యం సాగేది.”

000

ఫోను మోగడంతో మంచి నిద్రలో ఉన్న సీత ఉలికిపడి లేచింది.

సీతాపతి ఫోనందుకుని “ఉండండి. అవతలగదిలోంచి తీసుకుంటాను”అని లేచి వెళ్ళేడు. టైం చూస్తే రెండయింది. “ఎప్పుడు పిలిచినా ఫరవాలేదని ఈయన చెప్తే మాత్రం అవతలివాళ్ళకి ఉండొద్దా బుద్ధి” అనుకుంది సీత అటువేపుకి ఒత్తిగిలుతూ.

సీతాపతి ఫోనులో అట్టేసేపు మాటాడలేదు. కానీ అతను మళ్ళీ పక్కమీదకి వచ్చేసరికి పావు తక్కువ నాలుగయింది. సీతకి అప్పుడే చిన్న కునుకు పడుతోంది.

“ఎక్కడికెళ్ళేరు?” అంది అతను గదిలోకి రావడం చూసి.

“మెల్లిగా మాటాడు.”

“పక్కగదిలో కోమలగారున్నారు.”

సీత ఉలికిపడింది. “ఏమిటీ?”

“ఆవిడకీ భాస్కరంగారికీ కొన్నాళ్ళుగా పడ్డంలేదు.”

“అందుకని అర్థరాత్రి మీరెళ్ళి ఆవిణ్ణి మనింటికి తీసుకొచ్చేరా?” సీత నమ్మలేనట్టు చూసింది.

“పడుకో. రేపు ఏదో ఓటి ఆలోచిద్దాం.”

సీతకి ఒళ్ళు భగ్గున మండింది. “పడుకోక ఏం చేస్తాను? ఇప్పుడెళ్ళి ఆవిణ్ణి మనింటికి తీసుకురావాల్సినంత ప్రమాదం ఏం వచ్చిందో చెప్పండి ముందు,” అంది సీత నిప్పుల్చెరుగుతూ.

సీతాపతికి ఆపదలో ఉన్న ఆడవాళ్ళని ఆదుకోడం సరదాయే. కానీ దేనికైనా ఓ హద్దుండొద్దూ?

సీతాపతి మాత్రం చాలా శాంతంగా జవాబు చెప్పేడు, “ఆవేశపడకు. భాస్కరం వాళ్ళ ఆఫీసులో ఓ అమ్మాయితో తిరుగుతున్నాడుట. ఇప్పుడు ఆ అమ్మాయిని యింటికి తీసుకొచ్చేశాడుట పెళ్ళి చేసుకుంటానని.”

సీతకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. “నా మట్టిబుర్రకి తోచడంలేదు కానీ భాస్కరం మరో ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చేడని మీరు భాస్కరం పెళ్ళాన్ని అర్థరాత్రి మనింటికి తీసుకొచ్చేరా?”

“మరీ సిల్లీగా మాటాడకు. ఆ పరిస్థితి వేరూ, ఈ పరిస్థితి వేరూ. నీకామాత్రం తెలీదా?”

“నాకేం తెలుసో ఏం తెలీదో కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు నేనెవరికి ఫోను చెయ్యను మా ఆయన మరో ఆడదాన్ని కొంపకి తీసుకొచ్చేరని?”

“ఆ మాట నువ్వు నిజంగా నమ్మే అంటున్నావా? హాస్యానికంటున్నావా?” అన్నాడు సీతాపతి విపరీతంగా బాధ పడిపోతూ. అతడి సున్నిత హృదయం చాలా గాయపడిపోయింది. “నీకు అలాటి అనుమానమే ఉంటే చెప్పు. ఇప్పుడే ఆవిణ్ణి తీసుకెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి వచ్చేస్తాను” అని కూడా అన్నాడు.

సీత మాటాడలేదు. తను ఆమాట హాస్యానికనలేదు. అలాగని అనుమానమూ కాదు. తన భర్తకి ఊళ్ళో వాళ్ళబాధలంటే ఉన్న ఉత్సాహం చూస్తేనే తనకి అసహ్యంగా ఉంది. “ఇప్పుడేం చేస్తారు?”

“తెల్లారనీ. వాళ్ళన్నయ్య కెనడాలో ఉన్నాడు. రేపతన్తో మాటాడి ప్లేనెక్కించేస్తే మన బాధ్యత తీరిపోతుంది.”

సీతకి హఠాత్తుగా ఇదేదో తనకథ కాదన్న భావన ఏర్పడింది. ఏదో సినిమా చూస్తున్నట్టుంది. “అసలేమైంది?” అనడిగింది.

“వాడొట్టి వెధవ. ఈవిడకేం తక్కువనీ. అందం, చదువూ, తెలివితేటలూ…”

“మరి ఆయనగారి బాధేమిటిట?”

“అదే మరి … తిక్కమేళం. ఆ రెండో ఆవిడకి వీసా కావాలని. ఆ వీసాకోసం ఈవిణ్ణి వదిలేస్తానంటాడు.”

సీతకి ఏమనాలో తోచలేదు. దగ్గరికి జరిగిన భర్తని దూరంగా తోసేసి, అటు తిరిగి పడుకుంది. ఆవిడకి ఆత్మనా మనసంస్కృతిమీద బోలెడు నమ్మకం ఉంది. లతలాగ మన మగాళ్ళకి స్త్రీలంటే గౌరవమేననుకుంది కానీ రంగనాయకమ్మలాగ మొగాళ్ళు స్త్రీలని అణగదొక్కేస్తున్నారు అనుకోలేదు. భర్తకి ఆడవాళ్ళంటే బోలెడు సానుభూతి అని తెలుసు. నిజానికి పెళ్ళికి ముందు ప్రప్రథమంగా సీతాపతిలో తనకి నచ్చిన గుణం కూడా అదే – అతని మంచితనం!

సీతని పుట్టింట్లో తండ్రి గానీ, అన్నదమ్ములు గానీ “నువ్వాడదానివి” అంటూ ఎప్పుడూ దెప్పలేదు. చులకనగా చూడలేదు. పెళ్ళయేక భర్త కూడా ఎప్పుడూ “ఆడదానివి, ఓమూల పడుండు” అనలేదు. కానీ … ఈమధ్యే అతని ధోరణి అగమ్యగోచరంగా ఉంది. సాయం అనే మాటకి అర్థం ఏమిటో? అది ఎప్పుడు శృతి మించి రాగాన పడుతుందో? సహృదయతని కొలిచే మీటర్లెక్కడ దొరుకతాయో? తెల్లారేక తేల్చుకోవాలి తాడో పేడో అనుకుంటూ పడుకుంది.

000

తెల్లారేక తాడో పేడో తేల్చుకోలేకపోయింది సీత.

కనుచీకటితోనే లేచి, స్నానం చేసి, పూజ చేసుకుని, కాఫీ కప్పుతో బల్లదగ్గర కూచోబోతుంటే కోమల వచ్చింది గదిలోకి అడుగులో అడుగు వేసుకుంటూ. పీక్కు పోయిన కళ్లూ, పాలిపోయిన మొహమూ, నెత్తిమీద నీళ్ళకుండ …

సీతకి క్షణకాలం నోట మాట రాలేదు. మరుక్షణం తేరుకుని, “రా. కాఫీ తీసుకో,” అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్పు అందించింది.

“మీరు తాగండి,” అంది ఆ అమ్మాయి నీరసంగా.

“నేనూ తెచ్చుకుంటాను,” అంది సీత లేచి వంటింట్లోకి నడుస్తూ. ఆపిల్లని చూస్తూంటే పార్వతి జ్ఞాపకం వచ్చింది మళ్ళీ. ఉన్న ఊరూ, కన్నతల్లీ – సమస్తం వదిలేసుకుని పదివేల మైళ్ళదూరం వచ్చేసినతరవాత మన వాళ్ళందరికీ ఒక్కలాటి బాధే అనిపించిందా క్షణంలో.

మధ్యాన్నం కోమలని ప్లేనెక్కించి వచ్చింతరవాత సీతాపతి అతిమామూలుగా “కోపం చల్లారిందా?” అన్నాడు.

“మీకు నాకోపమే తెలిసింది కానీ నాబాధ తెలీలేదు.”

“ఏదో పాపం, ఆడపిల్ల బాధ పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోడం చెప్పూ. మాట సాయం చేసినంత మాత్రాన ములిగిపోయిందేమిటి,” అన్నాడతను సామరస్యం ఒలకబోస్తూ.

“నేనంటున్నది మీధోరణిగురించి. ఇవాళ పెద్ద విషయమే అయింది. కానీ ఆవిడ కాల్లో ముల్లు విరిగిందన్నా మీరిలాగే పరిగెడతారు కదా?” అంది సీత చిరాగ్గా.

“ఇక మీదట నిన్నడిగే చేస్తాలే ఏ పనైనా.”

సీతకి ఏం చెప్పాలో తోచలేదు. అస్త్రసన్యాసం చేసినవాడితో ఎలా యుద్ధం చెయ్యడం?

…      ….     ….

మరి తరవాతేం జరుగుతుంది?

ఏం జరుగుతుందంటే ..

సీతాపతి భార్యతో “పద, ఇవాళ బయట తిందాం,” అంటాడు.

ఇంతలో ఫోను మోగుతుంది …

000

(స్వాతి, నవంబరు 1987లో ప్రచురించబడింది.)

000

————————–

నిజానికీ ఫెమినిజానికీ మధ్య

“మీ బిగికౌగిలిలో నన్ను బంధించారు.”

సీతమొగుడు సీతాపతికి గాయత్రి రాసిన ఎనిమిది పేజీల ఉత్తరం పట్టుకుని సీత కూర్చుంది.

సీతకి గొంతులో వెగటుగా ఉంది. మొహం పాలిపోయింది.

గత నాలుగు వారాల్లో సీతాపతి ప్రవర్తన సీతకి కొత్తగా ఉంది. అతను హఠాత్తుగా ఇంటి పనుల్లో కల్పించుకోడం మొదలు పెట్టేడు. సామాన్లు సర్దుతున్నాడు. గిన్నెలు కడుగుతున్నాడు. ఉతికిన బట్టలు మడతలు పెడుతున్నాడు. పిల్లల్ని కారులో తిప్పడానికి సిధ్ధమవుతున్నాడు. ఎటొచ్చీ పిల్లలిద్దరూ ఎదిగిపోయేరు అప్పటికే. అంచేత “థాంక్స్ బట్ నో డాడీ” అనేసి సైకిళ్ళేసుకు వెళ్ళిపోతున్నారు.

సీత ఆ కాయితాలు విసిరేసింది చిరాగ్గా. ఇలాంటి ఉత్తరాలు చివరంటా చదవఖ్ఖర్లేదు. కానీ చూపులు అటూ ఇటూ తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి ఆ కాయితాలమీదే పడ్డాయి.

“23 ఏళ్ళ తరవాత ఆ ఒక్క రోజూ …”

“… కి వెళ్దాం అన్నారు మీరు.”

“4, 5, 6 తేదీల్లో రాసిన ఉత్తరాలు …”

“మీరు రహస్యపు ఉత్తరం ..”

“మా బాత్రూంలో మీరు మర్చిపోయిన వస్తువు …”

సీతకి ఒళ్ళు మండిపోతోంది. ఆ కాయితాలు కాళ్ళతో తొక్కిపారేయాలని ఉంది. కానీ కాళ్ళు రాలేదు. కాయితాలు సరస్వతి కదా! ఆ గాయత్రివిషయం దాచడానికేనా ఆయన అన్ని అవస్థలు పడుతున్నది? అతను హఠాత్తుగా ఇంటివిషయాల్లో ఎక్కడ లేని ఉత్సాహం చూపించడం మొదట కొంచెం ఆశ్చర్యం కలిగించినమాట నిజమే. కానీ తాను తన అలవాట్లు మార్చుకున్నట్టే ఆయన కూడా మార్చుకున్నారనుకుంది.   విజిటింగ్ ప్రొఫెసరుగా ఆర్నెల్లు ఇండియాలో ఉండి వచ్చిన సీతాపతి తనతో అంతకుముందు పదిహేడేళ్ళు కాపురం చేసిన సీతాపతి కాడు.

“మీరక్కడ చెప్పిన పాఠాలకన్నా నేర్చుకువచ్చిన పాఠాలే ఎక్కవలా ఉన్నాయే,” అని తను వేళాకోళం చేసింది కూడాను ఓ రోజు తను లేవకముందే లేచి కాఫీ పెట్టిన ఆయనతో.

“సరే. ఎప్పుడో ఒకప్పుడు మరి జ్ఞానోదయం కాకపోతుందా?” అన్నాడతను నవ్వి.

సీత కళ్ళు మళ్ళీ ఉత్తరంమీద వాలేయి. “మా బాత్రూంలో మరిచిపోయిన …” హుమ్. ఏముంటాయి కనక మొగాళ్ళకి ఊడదీసి పక్కన పెట్టడానికి ఏ వాచీయో గోచీయో కాక? గోచీ ఒదిలేసి వీధిలోకి వెళ్ళలేరు కదా. వాచీయే అయుండాలి. సీతాపతి తన వాచీ ఇండియాలో ఉండగా పాడయిపోయిందని చెప్పేడు.

ఒంగి కాయితాలన్నీ తీసింది. ఏమిటి చెయ్యడం? “ఇదుగో మీ ఉత్తరం” అంటూ ఆయనకి మామూలుగా అందించడమా? దాచడమా? పారెయ్యడమా? ఆలోచిస్తూ ఒక్కొక్క కాయితం ముప్ఫై ముక్కలు చేసింది. ఫరవాలేదు. ఈ ఒక్క ఉత్తరం ఆయన చూడకపోతే ములిగిపోయిందేమీ లేదు.

“పదిహేడేళ్ళనించీ బ్రేకు లేకుండా వంట చేస్తున్నావు. ఇవాళ నేను చేస్తాను, చెప్పు,” అంటూ హుషారుగా వంటింట్లోకి వచ్చిన సీతాపతి ఆవిడ అక్కడ లేకపోవడం చూసి కొంచెం తికమక పడ్డాడు.

రాణీ, బాబీ ఇంట్లో లేరు.

సీత పడగ్గదిలో ఉంది.

“ఏం పడుకున్నావు? ఒంట్లో బాగులేదా?” అంటూ నుదుటిమీద చెయ్యేశాడు.

“గాయత్రి ఎవరు?” అంది సీత ఆ చెయ్యి తోసేస్తూ.

“ఎప్పుడో చిన్నప్పటి స్నేహంలే, ఏం?” అన్నాడతను తేలిగ్గా.

“కావలించుకుని ముద్దు పెట్టుకునేంత స్నేహమా?”

“ముద్దెవరు పెట్టుకున్నారు?”

ఓ అరగంటసేపు వాదోపవాదాలు అయింతరవాత సీతే వదిలేసింది. అతనిమాటలు నమ్మి కాదు. మాటల్లో అతనితో గెలవలేక.

సీతాపతికి మాత్రం సంతృప్తిగానే ఉంది. తనేం తప్పు చెయ్యలేదు. గాయత్రి ఏదో తన బాధలు చెప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే మనసు ద్రవించి భజంమీద చెయ్యేశాడు ఓదార్పుగా. తను చిన్నప్పట్నుంచీ అంతే. ఎవరైనా బాధ పడుతుంటే చూడలేడు. ఓ మనిషి మరో మనిషిని కావలించుకున్నంత మాత్రాన ఏంవైపోయింది? తన ఏకపత్నీవ్రతానికి భంగం రాలేదు. ఆవిడ పాతివ్రత్యానికి భంగం రాలేదు. ఇందులో గొడవ చేయాల్సినంత ఏమీ కనిపించలేదతనికి.

“ఇంక రహస్యాలేం లేవు” అనే అనుకుది సీత. ఆ రాత్రి ఇండియానించి ఫోనొస్తే అతను మామూలుగా ఈమధ్య తనకి అన్నీ చెప్తున్నట్టే ఆ కాల్ సంగతి కూడా చెప్తాడనుకుంది. కానీ అతనా విషయమే ఎత్తలేదు. అంత కొంపలంటుకుపోయే విషయం కాకపోతే అర్థరాత్రి ఎందుకు ఫోను చేస్తారు అవతలివాళ్ళు?

మర్నాడు సీతాపతి మెయిల్ బాక్స్‌లోంచి ఉత్తరాలు తీసి, ఒకటి జేబులో పెట్టుకుని మిగిలినవి ఇంట్లోకి తీసుకొచ్చి సీతముందు పడేశాడు, “నువ్వు చూసేకే చూస్తాలే” అంటూ.

సీతకి ఒళ్ళు భగ్గున మండింది. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్న సామెత ఆడవాళ్ళపరంగానే ఎందుకంటారో ఆవిడకి అర్థం కాలేదు.

సీతాపతి ఆరోజు రెట్టించిన ఉత్సాహంతో గదులన్నీ వాక్యూం చేశాడు. ఏవో కారణాలు చెప్పి పిల్లలిద్దరికీ బహుమానాలు కొన్నాడు. సీతని సినిమాకి తీసుకెళ్ళేడు. సీత కూడా ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తోంది. కానీ కడుపులో బాధ అలాగే ఉంది.

రెండు రోజులతరవాత సీతాపతి ఏదో కాన్ఫరెన్సుకి ఫిలడెల్ఫియా వెళ్ళేడు. ఆరోజు మధ్యాహ్నం టెలిగ్రాం వచ్చింది, “పెద్దవాడు కాలేజీలో చేరేడు.” ఆ గాయత్రినించే. సీతకి మహా చిరాకేసింది. ఎవరి పిల్లాడో కాలేజీలో చేరితే ఈయనకెందుకు టెలిగ్రాం? లేక వాడు “ఎవరి పిల్లాడో” కాదా? సీతకి మళ్ళీ కడుపులో దేవినట్టయింది. తనభర్త తనదగ్గర ఏదో దాస్తున్నాడు. ఎందుకు ఈ దాపరికాలు? విషయం పూర్తిగా తెలిస్తే కానీ తోచదు. అతన్ని అర్థం చేసుకోడానికి గానీ, తన తృప్తికోసం గానీ ఇదేదో కొసకంటా తెలుసుకోవాలి. ఆయన్ని అడిగి లాభం లేదు. గత పదిహేను రోజుల్లోనూ ఏవో అందీ పొందని సమాధానాలు చెప్పి విషయం డొంకదారి పట్టిస్తున్నాడే కానీ తిన్నగా మాటాడ్డం లేదు.

మంచిగా, లాలనగా, దురుసుగా, పొగరుగా, కోపంగా తన నోరు మూయిస్తున్నాడే కానీ నిజం చెప్పడం లేదు. అక్కడకీ ఓసారి సూటిగానే చెప్పింది కూడాను. “నాకు మీమాటలు నమ్మకంగా లేవు. నాకు పైవాళ్ళతో మనవిషయాలు మాటాడడం అంటే అసహ్యం. అందుచేతే మిమ్మల్నే తిన్నగా అడుగుతున్నాను,” అని.

ఆరోజు కూడా సీతాపతి అతనికి అలవాటయిన మాటలే చెప్పేడు, “నాకు అబద్ధాలాడ్డం అసహ్యం” అన్నాడు. “నీకు నామీద అనుమానంగా ఉందంటే నాకు చాలా కష్టంగా ఉంద”న్నాడు. “నలుగురిలో నాపరువేం కావాల”న్నాడు. మట్టిగడ్డలన్నాడు.

సీత చివ్వున లేచింది. బేస్మెంటులో అతనిబల్లదగ్గిర చూసింది. అయిదు నిముషాలు కూడా పట్టలేదు. ఫైళ్ళమధ్య ఓ కట్ట ఉత్తరాలు. పుస్తకాలషెల్ఫులో ఇద్దరు ఆడవాళ్ళ ఫొటోలు. ఓ పక్కన చిన్న కాయితప్ముక్కమీద గిలిగిన టెలిఫోను నెంబర్లూ …

సీత ఉత్తరాలు పట్టుకుని కుర్చీలో కూలబడింది. అవన్నీ ఒకరూ ఇద్దరూ కాదు ముగ్గురు రాసినవి.

“మావారు ఊళ్ళో లేరు. కొత్త చీరె తీసి …”

“మీదగ్గరకొచ్చి ఉండిపోవాలనుంది.”

“మీరు మళ్ళీ వచ్చినప్పుడు నాదగ్గరే ఉండాలి.”

“ఒంటరితనం, దిగులూ…”

“పగలు మీ ఉత్తరాలకోసం, రాత్రి పోన్ కాలుకోసం.”

“విమర్శకచక్రవర్తిగారూ కాదు, అనుభూతి చక్రవర్తి …”

“మీ మెడచుట్టూ చేతులు వేయాలనుంది.”

“మీ చెవులు కొరకాలనుంది.”

సీత విసుగ్గా వాటిని బల్లమీదికి విసిరేసింది.

మళ్ళీ తీసి తారీఖులు చూసింది. కొన్ని ఇక్కడికి వచ్చినవి, కొన్ని ఆయన అక్కడుండగా అందుకున్నవి.

సీతబుర్రలో ఆలోచనలు కందిరీగల్లా గందరగోళంగా సుళ్ళు తిరుగుతున్నాయి. చిన్న నవ్వొచ్చింది. ఇక్కడ ఎంతోమంది ఇండియాలో ఆడవాళ్ళు అధోగతిలో ఉన్నారని తనతో వాదించేరు. మనవాళ్ళు సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించేరనడానికి ఈ ఉత్తరాలే సాక్ష్యం. కానీ ఆ స్వాతంత్ర్యంతో వాళ్ళేం చేస్తున్నారు?

ఈ ఉత్తరాలు చూస్తుంటే, ఈ ఫొటోలు చూస్తుంటే, అవి ఆయన దాచినతీరు చూస్తుంటే వాళ్ళమధ్య ఒట్టి స్నేహమే అనిపించడం లేదు. సీతాపతి చెప్పినట్టు ఒట్టి ఏడుపులూ, ఓదార్పులూ మాత్రమే అనిపించడంలేదు. … అనుభూతి చక్రవర్తిట! అనుభూతి ముందో? విమర్శ ముందో? అవిడ అనుభూతి ప్రసాదిస్తే ఈయన విమర్శ అనుగ్రహించేరా? ఫరవాలేదు. మరోసారి ఈయన ఇండియా వెళ్ళినప్పుడు “అనుభూతితో కూడిన విమర్శలకి సీతాపతిని సంప్రదించండి,” అని ప్రకటించుకోవచ్చు.

మళ్ళీ ఫొటోలు తీసి చూసింది. శోభాకుమారి అయి ఉంటుంది. చిన్నదే. ఈయనకి సకాలంలో పెళ్ళి అయి ఉంటే అంత కూతురుండేది.

సీతకి వెగటుగా ఉంది.

బాధగా ఉంది.

అసహ్యంగా ఉంది.

ఏదో చెయ్యాలని ఉంది.

కారు తీసుకెళ్ళి ఏక్సిడెంటు చెయ్యాలని ఉంది.

ఎవర్నయినా చంపెయ్యాలని ఉంది – తను, ఆయన, పిల్లలు, ఆ ఆడాళ్ళు – ఎవర్ని?

ఎదురు పడి వాళ్ళని నిలదీసి అడగాలనుంది.

కానీ .. ఏమని? ఏముంది అడగడానికి? ఏమని అడుగుతుంది?

అడిగితే తన భర్తనే అడగాలి. ఆయన్ని మాత్రం ఏమని అడగుతుంది? పెళ్ళయిన ఆడాళ్ళతో ఏమిటనా? పిల్లలతల్లులతో సరసాలేమిటనా? ఇద్దరు పిల్లలతల్లికి రెండో మొగుడుగా ఉండడంలో ఆనందం ఏమిటనా? … ప్చ్. అడగడానికేమీ లేదు.

సీత ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అసలు తనబాధ ఏమిటి? తనకే సరిగ్గా తెలీడం లేదు. మేజరు బార్బరాలోలాగ తాను చెక్కు చెదరని గండ్రశిలమీద నిలుచున్నాననుకుంది. క్షణంలో సగంసేపు పట్టలేదు కాళ్ళకింద రాయి కదిలి కొండచిలువలా జారిపోయింది!

సీతాపతికి కొన్ని విలువలు ఉన్నాయనీ, జాతిధర్మం, కులధర్మంలాటివి కాకపోయినా కనీసం కొంతలో కొంతయినా నీతి చూపిస్తాడనీ అనుకుంది. తన్ని బాధ పెడుతున్నది అదేలా ఉంది. అతను తనతో అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు అన్నది అర్థం కావడం లేదు. అందువల్ల అతను సాధిస్తున్నది ఏమిటి?

కారు గరాజులో పెట్టి సీతాపతి ఇంట్లోకి వచ్చేడు.

“ఆ ఉత్తరాలు చూసేను,” అంది సీత.

“ఏ ఉత్తరాలు?”

“మీ జనానా రాసినవి.”

“మళ్ళీనా? ఓమాటు చెప్పేను కదా.”

“ఉత్తరాలు చూస్తే మీరు చెప్పినట్టు లేవు.”

కథ మళ్ళీ మొదటికొచ్చింది.

“వాళ్ళు నాకోసం పడి కొట్టుకుంటున్నారు కానీ నేను వాళ్ళని పట్టించుకోడం లేదు కదా,” అన్నాడు. “ఇప్పుడేం ములిగిపోయింద”న్నాడు. “నువ్వనుకున్నంత ప్రమాదం ఏమీ జరగలేద”న్నాడు.

ఇంకా “ఏదో ఘోరమైన తప్పు జరిగి గాయత్రికి మతి చలించింద”నీ, తను మళ్ళీ ఆవిడకి ఆత్మవిశ్వాసం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాననీ చెప్పేడు. శోభ రచయిత్రి అనీ “తెలుగు రచయిత్రులు అలాగే రాస్తార”నీ అన్నాడు. “వాళ్ళు రాస్తే నేనేం చెయ్యను?” అన్నాడు. “అలా రాయొద్దని వాళ్ళకి రాస్తాలే” అన్నాడు.

సీతకి నమ్మకం కలగలేదు కానీ ఊరుకుంది.

“పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని పద అలా వెళ్ళొద్దాం,” అన్నాడు సీతాపతి.

“నేను రాను. పిల్లలొచ్చే వేళయింది,” అంది సీత విసుక్కుంటూ.

“మరేం ఫరవాలేదులే. వాళ్ళేం పాలు తాగే పసిపిల్లలు కారు కదా. వస్తే వాళ్ళే ఉంటారు.”

సీత మాటాడకుండా లేచి గదిలోంచి వెళ్ళిపోయింది.

000

బేస్మెంటులో సీతాపతి పని చేసుకుంటున్నాడు. పడగ్గదిలో సీతకి ఆలోచనలతో తల పగిలిపోయేలా ఉంది.

ఎందుకిలా జరిగింది? తనకి ఓపిక ఉన్నంతవరకూ సర్దుకుపోడానికే ప్రయత్నించింది. “నా” అన్నవాళ్ళు లేని ఈ దిక్కుమాలినదేశంలో తన బతుకు ఏమిటి? పొద్దున్న లేచింది మొదలు కాఫీలు పెట్టడం, బ్రేక్ ఫాస్టు, లంచి మూటలు కట్టడం, పిల్లల్ని స్కూళ్ళలో దిగబెట్టి తనపనికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళని తీసుకురాడం, బజారు పన్లు, అంట్లగిన్నెలు, మాసినబట్టలు, చలికాలంలో మంచు ఎత్తిపోసుకోడం, ఎండాకాలంలో గడ్డి కోసుకోడం, ఆకులేరుకోడం – ఒళ్ళలిసిపోయే పని కాకపోయినా రోజంతా ఈ పనులతోనే తెల్లారిపోతుంది. వీటన్నిటిమధ్యా ఓ క్షణం తీరిక దొరికితే ఊరికే కూచోవాలనుంటుంది కానీ ఓ ఉత్తరమ్ముక్కేనా రాసుకుందాం అనిపించదు. ప్రతి చిన్నపనికీ మిషన్లున్న ఈ సంపన్నదేశంలో ఓ కప్పు కాఫీ కావాలంటే తను పెట్టుకుంటే ఉంది లేకపోతే లేదు. వెధవది ఓ కప్పు కాఫీ పెట్టుకుంటే మూడు గిన్నెలు కడుక్కోవాలని కాఫీ మానేసినరోజులు చాలానే ఉన్నాయి. తనకి రెండు రోజులకోసారయినా మన కూరలు తినకపోతే అన్నం తిన్నట్టుండదు. పిల్లలిద్దరికీ మూడు పూటలా అమెరికా వంటలే. ఆయన ఒప్పుకోరు కానీ ఆయన ఇష్టాయిష్టాలు ఆయనకీ ఉన్నాయి.

వీటన్నిటిమధ్యా కుక్కకీ పనీ లేదు, తీరుబడీ లేదన్నట్టు ఉంది తనబతుకు. ఇవి చాలనట్టు సీతాపతి ఇంకే ఆచారాలూ పాటించకపోయినా అతిథిసేవలో ఏ పూర్వులకీ తీసిపోడు. తాను ఈవిషయంలో ఆయనకి “సహధర్మచారిణి”గా చరించడం లేదనా ఈ కక్ష?

అదేనా ఆయన పైవాళ్ళదగ్గరికి చేరడానికి కారణం? సీతకి ఎక్కళ్ళేని నీరసం వచ్చింది. చిన్ననవ్వు కూడా వచ్చింది. సీతాపతి గాయత్రిలో ఆత్మవిశ్వాసం కలిగించేడో లేదో కానీ తన ఆత్మవిశ్వాసం పాతాళాన్నంటింది. ఏడుపొచ్చినట్టుంది కానీ రావడంలేదు. ఎవరితోనేనా మాటాడాలనిపించింది. కానీ ఎవరితో? తను వాళ్ళబాధలు వింది కానీ తనబాధ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకోలేదు. అసలు ఎవరున్నారిక్కడ? ఒక్కొక్కళ్ళనే జ్ఞాపకం తెచ్చుకుంది. ఉహు. లాభం లేదు. జరిగేపని కాదు. మనూళ్ళలోలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింటికి పడితే వాళ్ళింటికి – మనవాళ్ళయినా సరే – వెళ్ళిపోడానికి వీల్లేదిక్కడ. “మాకు ప్లానులున్నాయం”టారు. “మాకు కంపెనీ వస్తుందం”టారు. “మేం మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదం”టారు. “నెక్స్‌టైం కొంచెం ముందు ఫోను చెయ్యండం”టారు.

పోనీ ఏదైనా సినిమాకి వెళ్తే? కూర్చున్నచోటునించి లేవాలని లేదు. టీవీ ఆన్ చేసింది. ఏదో డ్రామా. ఆఫ్ చెయ్యబోయి ఆగిపోయింది. కథలో ఏమవుతుందో చూడాలనిపించి. జీవితంలో సినిమాల్లోలాగ జరక్కపోయినా అదో ఓదార్పు! టీవీభార్య బాధలు మరిచిపోడానికి తాగడం మొదలెట్టింది. తను కూడా అలా చేస్తే? అందులో బాధ ఏమిటంటే బాధ మరిచిపోయేవరకూ తాగాలి. అంత తాగినతరవాత తనేం చేస్తోందో తనకే తెలీదు. తనకి కావలిసిన జవాబు దొరికిందో లేదో కూడా తెలీదు. పిల్లలు జడుసుకుంటారు. ఆయ్యవారిని చెయ్యబోయి కోతిని చేసినట్టు!

సీతకి పిచ్చెక్కిపోతోంది. ఏదో చెయ్యాలని ఉంది. కాని ఏం చెయ్యడమో తెలీడంలేదు. ఆఖరికి ఫోను తీసి కామాక్షిని పిలిచింది. ఆవిడ ఈదేశం వచ్చి పాతికేళ్ళయింది.

“హలో.”

“నేనేనండీ.”

“ఓ, సీతగారు. ఏమిటి విశేషాలు?”

“ఏం లేవండీ. ఏం కూర?”

అవతల్నించి చిన్న నవ్వు వినిపించింది. “గుత్తొంకాయ చేస్తున్నాను. వస్తారా భోజనానికి?”

“మీరేదో హాస్యానికంటున్నట్టుంది. నేను నిజంగానే వచ్చేయగలను.”

“లేదండీ నేను హాస్యానికనడంలేదు. నిజంగానే రండి.”

పది నిముషాల్లో వస్తున్నానని చెప్పి సీత ఫోను పెట్టేసింది.

000

“నేనాయింట్లో ఉండలేనండీ.”

కామాక్షి సీతవేపు నిదానంగా చూసి, “కాఫీ పెట్టనా?” అంది.

సీత సరేనన్నట్టు తలూపి, తన బాధా, అనుమానాలూ వీలయినంత క్లుప్తంగా వివరించింది.

“ఆయన్తో మాటాడలేకపోయావా?”

“మాటాడేను. ఎన్నిరకాలుగా చెప్పొచ్చో అన్ని రకాలుగానూ చెప్పి చూసాను. వేరే వాళ్ళతో మాటాడ్డం నాకిష్టం లేదనీ అందుకే ఆయన్నే తిన్నగా అడుగుతున్నాననీ కూడా చెప్పేను. ఏవో సోదికబుర్లు చెప్పేరు. అప్పటికి అప్పుడు సబబుగానే అనిపిస్తాయి కానీ రెండు రోజులు తిరిగేసరికి మరో ఉత్తరమో కాయితమో కనిపిస్తుంది ఆయనబుర్ర నిండా వాళ్ళగురించిన ఆలోచనలే అనుకోడానికి.”

కామాక్షికి ఏమనడానికీ తోచలేదు. ఆవిడకి తెలిసినంతవరకూ భార్యాభర్తలిద్దరూ మంచీ చెడ్డా తెలిసినవాళ్ళే మరి.

“నిజానికి ఆలోచిస్తుంటే ఇప్పుడనిపిస్తోంది ఆయన ఇవాళ ఓ సుబ్బమ్మతో పడుకున్నారా లేదా అన్నదానికంటే పదేళ్ళనించీ ఈయన వ్యాపకాలెప్పుడూ ఊరివాళ్ళతోనే కదా అని. ఎంతసేపూ వాళ్ళ కష్టాలూ, కన్నీళ్లూ, సమస్యలూ, ఆశలూ, అవసరాలూ, ఆరోగ్యాలూ, వాళ్ళపిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ – ఇదే ఆయన లోకం. ఇప్పుడు అబద్ధాలూ, కావలించుకోడాల్లోకి దిగింతరవాత నేను మాత్రం ఏవో విలువలు అనుకుంటూ కూచోడం దేనికనిపిస్తోంది. ఇప్పుడు ఈయనగారి స్త్రీజనోద్ధరణ పతాకదశకి చేరుకున్నట్టుంది,” అంది సీత.

“వీరేశలింగంగారిలాగా?” అంది కామాక్షి హాస్యానికి వాతావరణం తేలిక పరిచే యత్నం చేస్తూ.

“మరే,” అని సీత నవ్వి, “లేదులెండి. చిన్న తేడా ఉంది. వీరేశలింగంగారు విధవలకి పెళ్ళి చేసి ఉద్ధరిస్తే, ఈయన పెళ్ళయినవాళ్ళని పట్టుకుని, వాళ్ళ మొగుళ్ళని వెధవల్ని చేస్తున్నారు,” అంది.

ఈసారి కామాక్షికి నిజంగానే నవ్వొచ్చింది.

సీత మరో పావుగంట కూచుని, “వెళ్ళొస్తానండీ” అంటూ లేచింది.

ఎక్కువగా బాధ పడొద్దనీ, తొందర పడొద్దనీ మరీ మరీ చెప్పి పంపిందావిడ సీతని.

000

సీతకి మనసు కాస్త తేలిక పడ్డట్టనిపించినా బాధ అలాగే ఉంది. మనసు ఓరకంగా మొద్దు బారిపోయింది. ఇండియాలో ఆడవాళ్ళ పరిస్థితిగురించి చాలామాట్లే వాదనలు జరిగేయి. అమెరికన్లతోనే కాక సీతాపతితో కూడా చాలాసార్లు వాదించింది. అసలు తెలుగుదేశంలో ఆడవాళ్ళకి చాలామంది మొగవాళ్ళే సపోర్టిచ్చేరంది.

సీతాపతి ఒప్పుకోలేదు. “వీరేశలింగంగారు వయసులో ఉన్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. లేకపోతే వాళ్ళు మగాళ్లవెంట బడి కుటుంబాలని నాశనం చేస్తారనీ, ఆడవాళ్ళ చదువులు కూడా వాళ్ళని మంచి భార్యలుగా చెయ్యడానికేననీ వాదించేడు. చలం కూడా అంతేనన్నాడు. చలం చెప్పిన స్త్రీస్వాతంత్ర్యంలో మగాళ్ళకి ఆడవాళ్ళు సెక్స్ అందించడానికే కదా అన్నాడు. ఐరనీ ఎక్కడ అంటే ఈనాడు సీతాపతి చేస్తున్నది అదే ఆడవాళ్ళని తన సరదాలకి ఉపయోగించుకోడం!

“నామొగుడు నన్ను విలాసవస్తువుగా చూస్తున్నాడని మొత్తుకుంటున్న ఆడదాన్నీ నాకు మావారు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేరు అన్న ఆడదాన్నీ ఆయన సానుభూతి పేరుతోనో అనుభూతి పేరుతోనో సాహిత్యచర్చల పేరుతోనో పక్కలోకే చేర్చేరు!

సీతకి తల బద్దలు కొట్టుకోవాలనిపించింది.

మల్లయుద్ధంలో మరో రౌండు – ఇద్దరూ అరగంట వాదించుకుని పోతే ఫొమ్మనుకుని బేస్మెంటులోకొకరూ బెడ్రూంలోకొకరూ వెళ్ళిపోయేరు.

సీతకి భర్తమాటలు నమ్మాలని ఉంది. పదిహేడేళ్ళలో అతను ఎప్పుడూ మరీ అంత నీతిమాలినవాడిలా ప్రవర్తించలేదు. పైగా అతను కావాలనుకుంటే ఇక్కడ మాత్రం లేవా అవకాశాలు? ఎందుకు ఇన్నాళ్ళు ఆగడం? ఎందుకు ఎక్కడో ఇండియా వెళ్ళి వెయ్యడం వేషాలు? పైగా ఇదేం దాపరికం? నిజంగా వెధవపనులు చెయ్యదల్చుకుంటే ఇంత మరీ తనకి తెలిసేలాగా? ఏమనుకోడం? అతి తెలివా? తెలివిమాలినతనమా?

000

వారం రోజులు గడిచేయి. సీత ఏదో పుస్తకం కోసం బేస్మెంటులోకి వెళ్ళి చూస్తుంటే ఒక పుస్తకంలోంచి ఓ ఉత్తరం కింద పడింది. “ప్రియమైన గాయత్రికి …”

సీత తృళ్ళిపడింది. ఇది మూడోసారి ఇలా జరగడం. రాణి తొమ్మిదేళ్ళప్పుడు రాసిన రెండు వాక్యాలు గుర్తొచ్చేయి.

Believe me they say, trust me they say. Then, just when I am convinced, all of a sudden something goes wrong.

చిన్నపిల్లయినా ఎంత తెలివిగా రాసింది! లేకపోతే ఇదేమిటి? సరీ. .. ఘ్ఘా .. తనని తాను నమ్మించుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఉత్తరం…. దానితోపాటు మరో మూడు. సీతాపతి గాయత్రికి రాసింది, గాయత్రి సీతాపతికి రాసింది, సీతాపతి శోభకి రాసింది, శోభ సీతాపతికి రాసింది …

సీతకి కళ్ళు తిరుగుతున్నట్టయి పక్కనున్న కుర్చీలో కూలబడింది. ఆ నాలుగు ఉత్తరాలూ చూసిన ఎంతటి వెర్రిదానికైనా స్పష్టంగా సుస్ఫష్టంగా తెలుస్తుంది సీతాపతి ఇంతవరకూ చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లేనని.

“మిమ్మల్ని కౌగలించుకోవాలని ఉంది.”

“ముద్దు పెట్టుకోవాలని ఉంది.”

“మీతో ఖుజురహో చూడాలనుంది.”

“పుట్టుమచ్చలగురించి మీకు ఇంత ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా ఉంది.”

“ఇల్లు ఖాళీ అయింది. ఈసారి ఫరవాలేదు.”

“సైజు 34 బ్రాలు తెండి. బంగారం తెండి. నైలాన్ కోకలు తెండి.”

సీత అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొంచెంసేపు ఆగింది. మళ్ళీ చదవసాగింది. సీతని గుండెల్లో సూటిగా పొడిచింది తనభర్త శోభకి రాసిన ఉత్తరం. “నీకు నన్ను కావిలించుకోడానికి హక్కుంది. ముద్దు పెట్టుకోడానికి హక్కుంది….”

సీతకి ఊపిరాడనట్టుగా ఉంది. ఆ కాయితాలలాగే పట్టుకుని మెల్లిగా పైకొచ్చింది. సోఫాలో కూచుని బయట మంచు ఉప్పుపొడిలా కనిపిస్తోంది.

“కావిలించుకుని ముద్దు పెట్టుకోడానికి హక్కుంది.”

మరి తనకున్న హక్కులేమిటి? చలిలో మంచు ఎత్తి పోసుకోడమూ, ఎండల్లో లాను మో చేసుకోడమూ, బట్టలుతుక్కోడముూ, బజార్లు చేసుకోడమూనా?

ఒకసారి వాదన వచ్చినప్పుడు సీత చెప్పింది భర్తతో, “సరదాలకి వాళ్ళూ, సంసారానికీ సంఘంలో పరువుకీ నేనూ అంటే మాత్రం నేనీ ఇంట్లో ఉండన”ని.

సరిగ్గా ఇప్పుడదే జరిగింది. సీతకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది. అలా అనుకున్నతరవాత మనసు తేలిక పడింది. ఇన్నాళ్ళకి ఆకలి తెలిసింది. గబగబా వంట చెయ్యడం మొదలెట్టింది.

“నన్ను అర్థం చేసుకన్నదానివి నువ్వొక్కదానివే. …”

“ఈసారి ఎక్కువ రోజులుండడం పడదు.”

ఉత్తరాల్లో వాక్యాలు వేటకుక్కల్లా తరుముతున్నాయి.

హఠాత్తుగా సీతకి పెళ్ళయిన కొత్తలో తను ఆయనకి రాసిన ఉత్తరాలు జ్ఞాపకం వచ్చేయి. అవెక్కడున్నాయో తనకి తెలుసు. గబగబా వెళ్ళి తీసుకొచ్చి ఒక్కొక్కటే చూడసాగింది.

“కన్ను మూసి తెరిచేలోగా పెళ్ళయిపోయింది.”

“ఇక్కడ కూడా ఆకాశం నీలంగానూ వాతావరణం చల్లగానూ ఉంది.”

“తమరితో సప్తపాదాలు తొక్కి సాధించిన కొత్తహోదాతో …”

“ఏం కావాలని రాస్తే నువ్వొస్తే చాలని రాసిన ఉత్తరం ..”

“ఏదో రాయాలని ఉంది కానీ ఏం రాయాలో తెలీడం లేదు.”

“ఊరికి దూరంగా … solitude is sweet అని చెప్పగల స్నేహితునిపక్కన నడుస్తూ …”

“ప్రతి మనిషికీ ఎన్నో పొరలుంటాయి. మిర నన్ను మా ఆఫీసులో చూసిఉంటే …”

ఆవిడకి ఎక్కలేని నీరసం వచ్చింది. తొలిసారిగా కళ్ళలో నీళ్ళు చిప్పిల్లేయి. పదిహేడేళ్ళలో ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది?ఆయన తననెప్పుడూ కొట్టలేదు. తిట్టలేదు. తనేం చేసినా అడ్డు చెప్పలేదు. పైగా నీకేం కావలిస్తే అదే చెయ్యి అంటూనే ఉన్నారు. ఎటొచ్చీ తనకి తెలివొచ్చేసరికి తనకి ఏం కావలిస్తే అది చేసుకోడానికి ఆయన సరదాలూ, పనులూ, ఉద్యోగమూ అడ్డొస్తున్నాయని తెలిసేసరికి ఆరేళ్ళు గడిచిపోయేయి. సీతాపతి తనకిచ్చిన స్వాతంత్ర్యంలో బోలెడు బాధ్యతలున్నాయి – డబ్బు బాధ్యత, పిల్ల బాధ్యత, వచ్చే పోయే చుట్టాలబాధ్యత, ఇంటిబాధ్యత … “నువ్వే బాగా చేస్తావు” అంటూ అన్నీ తనమీద వదిలేసి నిష్పూచీగా స్నేహితులతో కాలక్షేపం చెయ్యడం అలవాటు చేసుకున్నాడు.

సీత ఆయన వాదనలు మరోసారి మననం చేసుకుంది. – పొద్దున్న ఏడున్నరకి ఇంట్లో బయల్దేరితే సాయంత్రం ఐదున్నరకి వస్తాడు. మధ్యలో ఉద్యోగం నిలబెట్టుకోడంకోసం, ప్రమోషన్లకోసం, తన విలువ ఋజువు చేసుకోడంకోసం, అడ్డమైన వాళ్ళనీ ఇరవైనాలుగ్గంటలూ హుషారు చేస్తుండాలి. ఇంత కష్టపడి ఇంటికి వస్తే పెళ్ళాం కాస్త చిర్నవ్వుతో కనిపించాలనుకోడమూ తప్పేనా? పిల్లలేరీ అనడిగితే తప్పా? ఫోన్ కాల్సొచ్చాయా అంటే ఎందుకంత కోపం? ఊళ్ళోవాళ్ళతో ఉన్నట్టు కట్టుకున్న పెళ్ళాంతో కూడా ఉండాలంటే పెళ్ళెందుకు చేసుకోడం? అమెరికా పెళ్ళాలు మొగుళ్ళకి బట్టలు కొంటారు. సీత తనకి కొనదు సి కదా బజారుకి వెళ్తే తను ఎంచిన బట్టలు బాగులేవంటుంది. తనకి చిన్నప్పటినుంచీ సృష్టిలో అందాలంటే పరవశం. ఆవిడేమో అందంగా ఉన్నావంటే విసుక్కుంటుంది…. ఇవీ సీతాపతి ఆలోచనలు.

సీత నిట్టూర్చింది. ఆయన అలా అనుకున్నందుకు కాదు తాను తప్పు పడుతున్నది. ఆయన ఆలోచనల్లో, కలల్లో తను రోజూ చేసే వెట్టి చాకిరీ లెక్కలోకి రాదు. అమెరికా పెళ్ళాల్లా తను ఉండలేదని దెప్పుతారు కానీ అమెరికామొగుళ్ళు చేసే పనుల్లో పదోవంతు కూడా పట్టించుకోరు. అసలాయన ఇద్దరు ముగ్గురితో వ్యవహారాలు నడుపుతున్నారంటేనే తెలుస్తోంది ఆయనగారి స్వప్నసుందరి ఒక్కమూసలోంచి వచ్చే అచ్చు కాదని!

మూడేళ్ళకిందట ఇలాటివాదనే వచ్చినప్పుడు “మీక్కావలసిన ఆడవాళ్ళు వేరే ఉంటారు చూసుకోండి” అని తనంటే, “వేరే ఆడవాళ్ళని నేను చూసుకుంటానని నువ్వు అనుకుంటే నీకు నాగురించి ఏమీ తెలీదన్నమాట” అన్నాడతను.

ఇది మూడేళ్లకిందటి మాట. ఇప్పుడు?

జీవితం ఇంతేనేమో. రోజులూ, నెలలూ గడిచిపోతాయి. మనుషుల తమకి తెలీకుండానే మారిపోతారు. ఆలోచనలూ, అభిప్రాయాలూ మారిపోతాయి.

గణగణగణ .. ఫైరారం మోతతో సీతకి తెలివొచ్చింది. వంటింట్లో కూర మాడి బొగ్గులై పొగలొచ్చి ఫైరలారం తగులుకుంది పొలోమంటూ.

సీత స్టౌ ఆఫ్ చేసి, పడగ్గదిలోకి వెళ్ళింది బట్టలు తీసుకోడానికి. వంగి సూట్‌కేస్ తియ్యబోతుంటే చీరపొరల్లో మంగళసూత్రాలూ చిన్న చప్పుడు చేశాయి – ఎద్దు మెళ్ళో గంటల్లా, అంతే మరి. సీతాపతి మారిపోయేడు. అతని విలువలు మారిపోయేయి. అతను ఇవాళ పెళ్ళికి కొత్త నిర్వచనం చెప్తున్నాడు. సీత మెళ్ళోంచి మంగళసూత్రాలు తీసి పెట్టెలో పడేసింది.

గరాజి తీసినచప్పుడయింది. అతను వచ్చేడు. ముందుగదిలో సీత కనిపించకపోవడంతో పడ్గదిలోకి వచ్చేడు.

“మళ్ళీ ఏమయింది?”

“నేను వేరే అపార్ట్‌మెంటుకి మారిపోతున్నాను,” అంది సీత పెట్టె సర్దుకుంటూ.

సీతాపతి నవ్వేడు. “మళ్లీ ఏమయింది?” అన్నాడు దగ్గరకొచ్చి ఆమె తలమీద చెయ్యి వెయ్యబోతూ.

సీత విదిలించుకుంది, “ఇంతవరకూ నెత్తిన చెయ్యి పెట్టింది చాలు,” అంటూ.

“అసలేమయిందంటుంటే …”

“మీముండల్లో ఓ ముండగా నేనుండనని మీకు ముందే చెప్పేను.”

సీతాపతి షాకు తిన్నట్టు చూశాడు, “వ్హాట్?”

సీత నిదానంగా సమాధానమిచ్చింది, చిలక్కి చెప్పినంత నిదానంగా, “ఇంతకుముందు నేనెప్పుడూ ఎవర్నీ అంతమాట అనలేదు. ఎంచేతో ఇవాళ నాకది సహజంగా వచ్చేసింది.”

సీతాపతి మళ్లీ నవ్వేడు, “హఠాత్తుగా వీర ఫెమినిస్టువయిపోయేమిటి?”

“లేదండీ. మీలాంటి మేధావులు బృహద్గ్రంథాలు చదివీ, రాసీ, మళ్ళీ మళ్ళీ అవే వల్లె వేసుకుంటూ కాలం గడుపుకు పోతుంటారు. మరోపక్క శోభలూ, గాయత్రులూ అనుభూతులూ సానుభూతులూ అంటూ ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటూంటారు. వాళ్ళు ఆర్తులు. మీరు ఆర్తత్రాణపరాయణులు. మీకు వాళ్ళూ, వాళ్ళకి మీరూ చాలా అవసరం. మీజాతికీ వాళ్ళ జాతికీ చెందని, నూటికి తొంభైతొమ్మిది మందిలో నేనొక మామూలు ఆడదాన్ని. నెమ్మదిగా సావకాశంగా నాటుబండిలా రోజులూ వారాలు గడుపుకుంటూ బతుకుతాన్నేను. మీరందరూ హడావుడిగా ప్రపంచాన్నంతా మీ చర్చలతో ఉద్ధరిస్తూండండి. మీదృష్టిలో నేను మనిషిని కాను. అంతమాత్రంచేత నాకు తరిగిపోయింది కూడా ఏమీ లేదు. తాబేలు తారే బతుకుతుంది. లేడి దూకే బతుకుతుంది అన్న సామెత విన్లేదూ?” అంది సీత నిర్వికారంగా.

000

(సెప్టెంబరు 9, 1987లో ఆంధ్రప్రభ వారపత్రికలో తొలిసారి ప్రచురితం. “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” కథలసంకలనం 2006లో BSR Foundation, Vizianagaram, ప్రచురించారు. ఇప్పుడు out of print. అనేక సంకలనాల్లోనూ, పత్రికలలోనూ ప్రచురించబడింది కూడా నాఅనుమతితో ప్రమేయంలేకుండానే)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “నిజానికీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ”

 1. … రంగనాయకమ్మ గారిని, మాలతి గారిని ఎందుకు విమర్శించాను అని ఇప్పుడు బాధ పడుతున్నాను.

  (మీ అభిప్రాయం అర్థం అయిందండీ. మిగతా విషయం అంతా ఇహ అనవసరం. – మాలతి)

  మెచ్చుకోండి

 2. రాధికా, నీ వివరణే సహజంగా వుంది నావివరణ కంటే.
  మహేష్ కుమార్ గారూ. ఏమో మరి, నిత్యజీవితంలో సామెతలు వాడతాం కదా అట్టే ఆలోచించకుండా. మీ వ్యాఖ్యానంలో మీవిమర్సనాదృష్టి తెలుస్తోంది. థాంక్స్.

  మెచ్చుకోండి

 3. సీత ఆలోచనని, సీతాపతి లేఖల్లోని వాక్యల్ని చేర్చి మీరి సృష్టించిన కథాశైలి కొత్తగా ఉంది. “తాబేలు తారే బతుకుతుంది, లేడి దూకే బతుకుతుంది” అన్న సామెత ఉదహరిస్తూ మీరు (సీత తరఫున) చేసిన ముక్తాయింపు, కొంచెం ‘statement’ అనిపించింది. కథ మొత్తం suggest చేసి, ఆఖరున “నిర్ణయించెయ్యడం” అవసరమంటారా? అదీ శోభ కు సీతాపతి రాసీ పోస్టు చెయ్యని(నిర్ణయానికి ట్రిగ్గర్ గా పనిచేసిన) ఉత్తరం ఆధారంగా.

  చాలా బాగా ఉన్నా, కొంత అసంతృప్తి ని కలిగించింది. బహుశా అదే ఈ కథ ఉద్దేశ్యం కావచ్చు.

  మెచ్చుకోండి

 4. @శంకర్,
  థాంక్స్. మీ ప్రశ్న – అదొకరకం నార్సిసిజం కావచ్చు. నేను కొందరు ఆలా తాము రాసిన వుత్తరాలకాపీలు దాచుకోడం చూశాను. కథ నడవడానికి పనికొచ్చింది కదా అని వాడుకున్నాను.

  మెచ్చుకోండి

 5. మీరు నవతరంగానికి రాసిన కామెంట్ పుణ్యమా అని మీ వెబ్‌సైట్ దర్శనభాగ్యం అయ్యింది. సరదాగా ఓ కధ చదువుదామని మొదలు పెట్టి ఇప్పటికే నలుగు చదివేసా ( ఇదే మొదటిసారి విజిట్ చెయ్యడం) . మరో రెండ్రోజులకి సరిపడా పదార్ధం దొరికింది.
  “వీరేశలింగంగారు విధవలకి పెళ్ళి చేసి ఉద్ధరిస్తే, ఈయన పెళ్ళైన వాళ్ళను పట్టుకొని వాళ్ళ మొగుళ్ళను వెధవల్ని చేస్తున్నారు” అన్న ప్రయోగం మీలోని చతురతను తెలియచేస్తే, “మనుషులు తమకి తెలీకుండానే మారిపోతారు” అన్నది జీవితసత్యాలను సింగిల్ లైన్‌లో చెప్పగలిగే చాకచక్యాన్ని తెలియచేసింది.

  చివరిగా చిన్న ప్రశ్న ..
  “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” లో సీతాపతి శోభకీ, గాయత్రికీ రాసిన ఉత్తరాలు వాళ్ళ దగ్గర ఉండకుండా సీతాపతి ఇంట్లోనే దొరకడంలో ఏమైనా ఆంతర్యం ఉందా?… నాకెందుకో ఎంత అలోచించినా ఈ విషయం బోధపడలేదు. ఒకవేళ సీతాపతి కావలనే సీతను ఆట పట్టించే ఉద్దేశ్యంతో ఇదంతా చేసాడనే భావం వచ్చేలా ఉంది. కాస్త విశదీకరించగలరు.

  మెచ్చుకోండి

 6. సుజాతా,

  ఫెమినిస్టులమని చెప్పుకుని తమ ‘స్వాతంత్రాన్ని ‘ సమర్థించుకునే వారికి పగిలిన సీసా పెంకుల్లా ఖస్సుమని గుండెల్లో దిగుతుంది. – నాకథ ప్రయోజనాన్ని అంతటినీ ఒక్క వాక్యంలో చెప్పేసారు. మీరు మాత్రం తక్కువవారా!

  మళ్లీ మరోకసారి మనవి చేసుకుంటున్నాను. మీవంటివారి అభిమానం నాకెంతో బలం. నా కథాసంకలనం, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, అన్న పేరుతోనే BSR Foundation, Vizianagaram, వారు ప్రచురించారు. (విశాలాంధ్రలో దొరుకుతుంది కూడాను). నేను పుస్తకానికి ఈపేరు పెట్టినందుకు ఒక పెద్ద ఫెమినిస్టు చిన్నబుచ్చుకున్నారుట. నేను డైటింగ్ చేయాల్సివస్తే తలుచుకుంటాను వీరిని. (మళ్లీ మా.మార్కు హాస్యరేఖ).

  మానవిలాటివి చదవడం నావల్ల కాదులెండి. నాది చాలా చిన్నబుర్ర.

  మెచ్చుకోండి

 7. మాలతి గారు,
  ఈ కథ నేను లెక్క లేనన్ని సార్లు చదివాను. అయినా ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది. ప్రతి సారీ సీత ఈ కథ నాకు ఎదురుగా కూచుని చెప్తున్నట్టుగానే ఉంటుంది. ప్రతి వాక్యం ఎంతో ఆలోచించి రాసినట్టూ ఉంటుంది, at the same time.. అలా ఒక ఒరవడిలో రాసుకుంటూ పోయినట్టూ ఉంటుంది. మీరెలా రాసారో నాకు తెలీదు.

  ప్రతి వాక్యం ఫెమినిస్టులమని చెప్పుకుని తమ ‘స్వాతంత్రాన్ని ‘ సమర్థించుకునే వారికి పగిలిన సీసా పెంకుల్లా ఖస్సుమని గుండెల్లో దిగుతుంది.

  ‘ఈ దిక్కు మాలిన దేశంలో ఒక కప్పు కాఫీ పెట్టుకుంటే ఉంది, లేకపోతే లేదు”

  ” మరి తన హక్కులేమిటి? చలికాలంలో మంచు ఎత్తిపోసుకోడమూ, ఎండాకాలంలో గడ్డి కోసుకోడమూనా?’

  “రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా? అనే మాట ఆడవాళ్ళ పరంగానే ఎందుకొచ్చిందో ఆవిడకర్థం కాలేదు”

  “అనుభూతితో కూడిన విమర్శలకు సీతాపతిని సంప్రదించండి” (ఇక్కడ మాలతి మార్కు హాస్య రేఖ)

  “మీ ముండల్లో ఒక ముండగా నేనుండను” ఇలా రాసుకుంటూ పోతే కథంతా తిరగ రాయాల్సిందే నేను.

  ఏమైనా నాకొక అసంత్రుప్తి మొదటినుంచీ ఉంది. మీకు రావాల్సినంత ఫేమూ, నేమూ రాలేదని! మీరు దశాబ్దాల తరబడి అమెరికాలో ఉండిపోవడమూ, మీ పాత కథలని మీరు సంకలంగా తీసుకురావడానికి ప్రయత్నించకపోవడమూ(అప్పుడే), మీ సాహిత్యాన్ని మార్కెట్ చేసుకోవడానికి(పోనీ ఇలా చెప్పనా…’ మీ సాహిత్యాన్ని నలుగుర్లోకీ తీసుకెళ్ళదానికి) ఇక్కడ మీరు ఏర్పాట్లు చేసుకోకపోవడమూ, మొదలైనవి కారణాలుగా నేననుకుంటున్నా!

  ఇదే కథను సదరు గాయత్రి, శోభ వగైరాల వైపు నుంచి చెప్పిన ఓల్గా నవల ‘ మానవి ‘. చదివారా మీరు? వారి ‘ప్రేమ ‘ను అర్థం చేసుకోవాలట సీతలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s