ఆరుద్ర కథలు సమీక్ష

ఆరుద్ర చిన్నకథలు – ఒక పరిశీలన

″సుబ్బారావున్నరగంటలసేపు″ – చూడగానే అచ్చుతప్పు కాబోలు అనిపించే ఈపదబంధం ఆరుద్రగారి కథలసంకలనంలో ″ఇందలి నీతిః చెడలేదు″ అన్నకథలోది.

సమగ్రాంధ్రసాహిత్యం, త్వమేవాహం, డిటెక్టివ్ నవలలూ, సినిమాపాటలూ, డైలాగులరచయితగా చాలామందికి గుర్తుండిపోయిన ఆరుద్ర చిన్నకధలు కూడా రాశారు. సాహిత్యంలో వివిధప్రక్రియలలో మాత్రమే కాదు, ఆయనకి జ్యోతిషం, గారడీ, నాట్యశాస్త్రంవంటి విద్యలతో కూడా పరిచయం వుంది.

1966లో ప్రచురింపబడిన ″ఆరుద్రకథలు″ చిన్నపుస్తకం. డెమీసైజు. 175 పేజీలు. 25 కథలున్నాయి. మూడు కథలు తప్పిస్తే, ప్రతికథా అయిదారు పేజీల్లో అయిపోతుంది. మొదలుపెట్టేం అనుకునేలోపున ముగిసిపోతుంది. కొన్ని అయితే మూడు పేజీలే. ఒకే ఒక సంఘటన చుట్టూ అల్లుకున్నకథలే ఎక్కువ. కొన్నికథల్లో ఓజీవితకాలం కథ వుంది. ఒక జీవితకాలాన్ని మూడు పేజీల్లో ముగించడానికి చాలా చాకచక్యం కావాలి. అది ఆరుద్రకి పుష్కలంగా వుంది. ఎక్కువభాగం మధ్యమపురుషలో పాఠకుడితో ఎదురుగా కూర్చుని మాటాడుతున్నట్టు చెప్పినవే.

ఆరుద్ర కథనం – కవితలు కానివ్వండి, కథలు కానివ్వండి సినీమాటలూ పాటలూ కానివ్వండి – చదువుతున్నంతసేపూ, వింటున్నంతసేపూ ఆరుద్రన్నరగంటలసేపు మనని తన్మయం చేస్తాయి. చివరకి ″నేను చెప్పదల్చుకున్నదేదో నేను చెప్పేశాను, మిగతాది మీరు ఆలోచించుకోండి″ అంటూ పాఠకులకి కథ ఒప్పచెప్పేస్తారు ఆరుద్ర.

స్థూలంగా కథావస్తువులు చాలా సాధారణవిషయాలు–పిల్లల ఆటపాటలు, వాళ్లప్రవృత్తులూ, మధ్యతరగతి యువత ప్రేమలూ, కాబోయి ఆగిపోయిన పెళ్లిళ్లూ (అన్నిట్లోనూ కటికనిజాలు), తల్లుల తాపత్రయాలూ, డబ్బు బాధలు, ఈతిబాధలూ, కటికదరిద్రంలాటివే. కాని వాటిని తీసుకుని మరొక జీవనసత్యాన్ని ఆవిష్కరిస్తాడు ప్రతిభగల రచయిత. ఆరుద్ర చేస్తారు అలా.

ఇ.యం. ఫార్స్టర్ కాబోలు అన్నాడు మొత్తంసాహిత్యంలో ఇతివృత్తాలన్నిటినీ ఓపుంజికి కుదించేయవచ్చని. స్థూలంగా చూస్తే – అయితే ఆడదీ కాపోతే డబ్బు – లోకంలో అన్నిబాధలకీ ఈరెండే మూలకారణం. ఇంకా కాస్త పరీక్షగా చూస్తే, ఒక మనిషి మరో మనిషిమీద తన ఆధిక్యం ప్రదర్శించుకోడానకి పడే అవస్థలు, అంతరాంతరాల ఏమూలో నక్కి నసపెడుతున్న అహంకారం (ఈగో) అనిపిస్తుంది. ఇది ప్రాతిపదికగా తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకోడానకి ద్రవ్యమో ఎదుట మరోమనిషో కావాలి. అక్కడ మొదలవుతుంది ఏకథయినా.

ఈసంకలనంలో పిల్లలమనస్తత్త్వాలని చిత్రించేవిః ″ఊష్ణమొస్తే బాగుణ్ణు″ మొదటిది. అలా ఓ చిన్నవాడు ఊష్ణమొస్తే బాగుణ్ణు అని కోరుకోడానికి కారణం అన్నకి ఊష్ణమొచ్చినప్పుడు జరిగిన ఉపచారాలు. చదివి చెమర్చని కళ్లుండవేమో అన్నంత సహజంగా చిత్రిస్తాడు పిల్లలమనస్తత్త్వాలని కథకుడు.

″పిల్లికూన″లో పిల్లిపిల్లకీ దాన్ని చేరదీసిన చిన్నవాడికీ మధ్య పెరిగిన అనుబంధం. పిల్లికూనమీద పిల్లవాడికి మమకారం ఏర్పడడంలో విశేషం లేదు. కాని ఆపిల్లికూనచేత సర్కస్ ఫీట్లు చేయించాలన్న కోరిక వాడికి ఎందుకు కలిగింది? ఎందుకంటే సాటి సావాసగాళ్లలో తన ప్రత్యేకత నిరూపించుకోడానికి. పారిపోయిన పిల్లికూనకోసం పిల్లాడు బాధపడతాడు కాని ఎందుకు పారిపోయిందో అర్థం కాదు ఆచిన్నబుర్రకి. పెద్దవాళ్లలో ఎంతమంది లేరు ఎదటిమనిషిని నొప్పిస్తున్నాం అని గ్రహించలేనివాళ్లు!

పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా ఆర్థకసంబంధమయిన భావజాలం ద్యోతకమవుతుంది సుళువుగానే. పెద్దలు కాల్చిపారేసినసిగరెట్టు పెట్టెలకి వెలకట్టి, తన ఆధిక్యతని చూపుకుంటాడో కుర్రాడు. వాడిమీద మిగిలిన పిల్లలు ధ్యజమెత్తుతారు ″ముప్ఫైలక్షల పందెం″ అన్నకథలో. .కథ సిగరెట్టుపెట్టెలఆట. అమెరికాలో బేస్‌బాల్ కార్డులవిలువలాటిదే ఆరోజుల్లో మనదేశంలో పిల్లలకి పెద్దలు కాల్చి పారేసిన ఖాళీ సిగరెట్‌ పెట్టెలు. వాటికి పిల్లలు ఆర్థికవిలువనాపాదించి తాండ్రబెత్తు (చిన్న చదరపు పలకరాయి) తో ఆడేఆట, ఆ ఆట ఆడుతున్నప్పుడు పిల్లలు ప్రదర్శించే తెలివితేటలు చూసితీరాలి. లేకపోతే ఆరుద్రకథలో చదివితీరాలి.

అలాగే ″భోగిపిడకలు″ కథలో పిల్లల ఆర్థికశాస్త్రం తమకి అనువైన రీతిలో వాడుకోడం కనిపిస్తుంది. చిన్నతనంలోనే పిల్లలకి ఆర్థికబాధ్యత తెలియజేయాలనుకున్న కథకుడు మర్చిపోయిన, అంతకంటె ముఖ్యమైన విషయం చివరలో మనకి ఆశ్చర్యం కలిగించదు. అవునుసుమా నిజమే అనిపిస్తుంది మనచేత.

″పిచ్చుకగూళ్లు″ మరో పిల్లలకథ. పలకపుల్లలదగ్గిరునించీ, దరగాకొండా, పిల్లలపాటలూ, ఆటలూ ఆరుద్ర ఈకథలో ఎంతచక్కగా పొదిగారంటే అయ్యో ఆలాటిరోజులు వుండేవి అని మర్చిపోయినందుకు నామీద నాకే జాలేసింది. ముఖ్యంగా విశాఖపట్నంరోజులు. ఆకాశపు చల్దికుండ, వెన్నెలతరవాణిలో ఉన్నదొక్కటే పిడచ అంటూ మళ్లీ పాడుకోవాలనిపించింది.

దారిద్ర్యంవల్ల తాను కోరిన సకుమారితో పెళ్లికాకపోవడానికీ డబ్బో, తనకంటె మరింత కలేజా వున్నమగవాడో కారణం. అబ్బాయీ, అమ్మాయీ, పెళ్లి, లేక పెళ్లికి దారితీయగల ప్రేమా, భగ్నప్రేమా – అనాదిగా వస్తున్న కథాంశాలే. అయితే ప్రతిసారి మరో కొత్తకోణం చూపుతారు రచయితలు. లేదా కొత్తభాషాప్రయోగాలు చేసి పాఠకుల మన్ననలందుకుంటారు. కదాచితుగా పాఠకులమేధకి మేత పెడతారు. వారిని ఛాలెంజి చేస్తారు. ఈరెండోకోవలోకి వస్తుంది ″చాపకింద నీరు″ అన్నకథ. వాచ్యం కాని వివరాలమూలాన చదువరిమెదడుకి పుష్కలంగా పని పెడుతుందీ కథ. రెండుసార్లు చదివినా చివర కథకుడు ఏం తేల్చి చెప్పాడో నాకు తెలీలేదు. అంచేత ఆకథ నాకు నచ్చలేదు అని చెప్పలేను కూడా. ఎందుకంటే కథ నడిచినతీరు నన్ను నడిపించింది.

″వూరు వూరుకొంది″లో నిరుద్యోగి కథానాయకుడు ″రోడ్డుపట్టేడు. … తాను తొడుక్కున్న నిరాశచొక్కా విప్పిపారేశాడు. … ఆచొక్కాజేబుల్లో వున్న ఆశా, ఆశయం రెంటీనీ మాత్రం తీసుకుని బయల్దేరాడు…″ ఇలాసాగుతుంది కథ. చివరకి అతడు జననమరణరిజిష్ట్రారు ఆఫీసులో తేల్తాడు.. రచయిత ఎత్తిచూపేది ఆయువకుడి నిరాశని కాదు, దానినధిగమించగలిగిన అతడి ఆత్మబలాన్ని.

అలాగే చిత్రమైన వాక్యాలతో కూర్చినకథ, ″మసాబు వెలుతురు″. ఈకథలో ″మీటనొక్కితే దీపం వెలుగుతుంది అన్న సంగతి మూడుగంటలకే గుర్తుంచుకొంటే ఇంత చీకటిగా ఉండకపోను అన్నసంగతి ఏడుగంటలకి తట్టింది రామారావుకి.″ వాక్యాలలో చమత్కారం ఒక్కటే కాదు మనకి సాక్షాత్కరించేది. అనుదినం, క్షణక్షణం ఎన్ని చిన్నవిషయాలు ఎంత అమాయకంగా మనకళ్లముందే వుండి కంటికి ఆనకుండా పోతాయో వెల్లడి చేస్తాయి.

″నిశానీలు″ పేరుకి తగ్గట్టుగానే కథంతా నిశానీల (వాచీ, జోళ్లూ, కళ్లజోడు) ద్వారా చెప్పించినా, ″వూరు వూరుకొంది″లోలాగ మరో మధ్యతరగతి యువకుడికథ. ″చేబదులుకోసం″ సంభాషణలలో చెప్పినకథ. ఇందులో విశేషం అదే. ప్రత్యేకించి సంఘటన అంటూ ఏమీ లేదు. పాత్రలని పాఠకులు ఊహించుకోవాలి సంభాషణలనిబట్టి అంతేకాని పాత్రచిత్రణపేరుతో అరపేజీ వర్ణనలుండవు. పాఠకులే సంభాషణలు చదువుతూ (మనసులో వింటూ) ఎవరు ఎవరో, సుమారుగా ఎలా వుంటారో గ్రహిస్తారు. గ్రహించగలరు. అది రచయిత సాధించిన విజయం.

″స్వర్గాదపి″లో కథానాయకుడు వూళ్లో జరుగుబాటు లేక, వూరు వదిలి వెళ్లిపోయి, మళ్లీ తిరిగివచ్చినప్పుడు గతాన్ని తలబోసుకున్న స్వగతమే కథ. తిరిగివచ్చింతరవాత తనని గుర్తించింది ఆనాటి జోన్ పాల్ ఒక్కతే. ఈకథ ఆరుద్రకథల్లో కాస్త వాసి తగ్గినకథ అనిపించింది నాకు. ముగింపు గ్రహించడానికి అట్టేసేపు పట్టకపోవడంచేతనేమో.

″తల్లి వూఁ అంది″ కథలో కథానాయకి వినా ఆంగ్లో ఇండియను అమ్మాయి. శరీరం అమ్ముకుని భుక్తి జరుపుకుంటున్న యువతి. చివర కథకుడు అంటాడు, ″నాకు ఈకథ చెప్పిందికి చాలా విచారం వేస్తున్నది… వినా బతుకుతున్నది. అందుకు తల్లి వూఁ అన్నది″ అంటారు. ఇంతటి నిరాడంబరమైనభాషలో అంతటి విషాదాన్ని నింపడం ఆరుద్రలాటి కొద్దిమందే చెయ్యగలరు. సహృదయుడయిన కథకుడు కథలో లీనమయిపోతాడు. ఆకథ రాస్తున్నంతసేపూ అతడికి ఆపాత్రలు నిజం, ఆసంఘటనలు నిజం. సాహిత్యంలో ఉదాత్తత అంటే ఇదే.

″ఇందలి నీతి: చెడలేదు″ అన్నకథలో సుబ్బారావుకోసం ఎదురుచూస్తున్న సీత వేదన ఎంతసేపు అంటే ″సుబ్బారావున్నరగంటలసేపు″. అది ఆరుద్రమార్కు వాక్యవిన్నాణం అని అర్థం కావడానికి అరపేజీ చదివితే చాలు. అయితే ఇది మాటలగారడీ కాదు. హాస్యకథ కాదు. సుబ్బారావుని నమ్మి తనని తాను అర్పించుకున్న సీతకి కాలమానం కొలమానం, ఆపైన ఆమె జీవనహేల అంతా ″సుబ్బారావు″లెక్కల్లోనే-గా మారిపోతుంది. సీత తనచుట్టూ సుబ్బారావుని అల్లుకుంది. ఆసుబ్బారావులో చిక్కుకున్నసీతకి సుబ్బారావుకి మించినలోకం లేదు. సీత సీతకి ఏం జవాబు చెప్పుకుందో, సీత సీతచేత ఏంచేయించిందో నేనిక్కడ చెప్పలేను. ″ఇకమీదట సుబ్బారావుకి సీతం పావుగంటలుండవు″ అంటాడు కథకుడు. ఇలాటి వాక్యాలలో కేవలం చమత్కారమే కాక ఒకతరహా మనస్తత్త్వం కూడా స్ఫురిస్తుంది.

నాకు సైకోఎనాలిసిస్ తెలీదు, ఏప్రముఖసైకో పుస్తకాలూ చదవలేదు కానీ నాకు తోచినది -ఒక పెద్దదెబ్బ తగిలినప్పుడు కలిగిన నొప్పిని తట్టుకోడానకి మనిషి తననుంచి తాను వేరు చేసుకుని, ఆనొప్పిననుభవిస్తున్న వ్యక్తి వేరే వున్నట్టూ, తాను ప్రేక్షకుడయినట్టూ ఒకవాతావరణం సృష్టించుకుంటాడు. అలాటి దృక్పథంతో ఈరెండు పాత్రలు చిత్రించబడినవేమోనని నేను అనుకుంటున్నాను.
పైకథ ప్రధమపురుషలో సాగితే, ″కడసారి″ అన్నకథ స్వగతంలో సాగుతుంది. రెంటిలోనూ న్యాయం, లేదా జరిగిన అన్యాయం ఒకటే. అయితే రెండుకథలు ఎందుకు రాసేరు అంటే రెండు కోణాల్లోంచి చూడమని చెప్పడానికి అని చెప్పుకోవలిసి వస్తుంది.

″స్వప్నవాస్తవదత్త″లో కూడా తాను కలగన్న చిన్నది తనకి కాకుండా పోయినవైనం. కథానాయకుడు సుబ్బారావుకి సీత ″ఇచ్చిన వాస్తవం″ ముగింపు. సుబ్బారావు పరివర్తన నిరాశలోంచి ఆశలోకి, నిరుత్సాహంలోనించి ఉత్సాహంలోకీ, దరిమిలా లోకంలోకి అడుగుపెట్టడం కథాంశం. బురదలోపడ్డ సుబ్బారావు ″బురదచొక్కాతోపాటు తన నిరాశనీ, నిస్పృహనీ విసిరిపారేసి″ హుషారుగా లోకంలోకి అడుగుపెడతాడు. అంతే కథ. చెప్పినతీరు మనల్ని మెప్పిస్తుంది.
ఈరెండు కథల్లోనూ, ″ఇందలినీతిః చెడలేదు″, ″స్వప్నవాస్తవదత్త″లోనూ పాత్ర పేర్లు ఒకటే అయినా రెండూ వేరు వేరు కథలు. రచయిత ఈపేర్లు వాడడానికి కారణం సగటుమనుషులజీవితాలన్నీ ఒక్కలాగే వుంటాయని చెప్పడానకేమో.

″దీవెన″ పెద్దకథ ఈసంకలనంలో. ఆరుద్ర పెళ్లిలో చదివేమంత్రాలూ, ఆపెళ్లిలో పెళ్లికొడుకు తనకొడుకే కానందుకు విచారిస్తున్న తల్లి వేదనా వివరిస్తూ–జోడుగుర్రాలస్వారీలా కథ సాగి ఆర్ద్రంగా ముగుస్తుంది. కథచివరలో తల్లి పరివర్తన అద్భుతంగా చిత్రించారు. నాకు బాగా నచ్చినకథల్లో ఇదొకటి.

చారిత్ర్యాకాంశంతో నేపథ్యంలో సాగినకథ ″రాజముద్రిక″. – .చోళ పాండ్యరాజుల మధ్య వివాదం, నాగమనాయనివారి తీర్పు.. వస్తువుకి తగ్గట్టే రచయిత భాష కనక ఇది చదువుతున్నప్పుడు మనం కూడా ప్రస్తుతం వదిలి గతంలోకి తొంగిచూస్తాం.
ఇందులో ముఖ్యపాత్రలు పాండ్య, చోళ, నాయకరాజులు, నాగమనాయనివారి (నాయకరాజు) సహాయంకోసం వచ్చిన పాండ్య, చోళరాజులని తనచమత్కారంతో గెలుచుకున్న కథ. అయితే నిజమైన చతురత నాగమనాయనివారిది కూడా కాదు. మరో చిన్నమలుపు.
అలాగే మరో పాతకాలం కథ ″పరిశిష్టం″. మరీ అంతవెనక్కి వెళ్లకపోయినా, ఇప్పుడు మనకి పాతకాలం కిందే లెక్క.. అందులో నట్టువరాలు, నాయకురాలూవంటి పాత్రలు – పెళ్లికిముందు పెళ్లికొడుక్కి నేర్పే పాఠాలు, తాతయ్యమురిపాలూ… సాంప్రదాయకరీతులకి నివాళి పడతాయి. అయితే ఆరుద్ర మరీ అంత సాంప్రదాయవాది కారు. అందుకేనేమో ముగింపు స్పష్టం చెయ్యలేదు. పూర్వసాంప్రదాయంలో పెళ్లికిముందూ పెళ్లిలోనూ నట్టువరాలికి ప్రాధాన్యం వుండేది. పెళ్లి అనుభవాల కిటుకులు తాతయ్యలు కుర్రకారుకి చెప్పేరోజులుండేవి (మల్లాది వారు గుర్తొస్తారు కొందరికైనా). వెనకటిసాంప్రదాయంలో., ఆసాంప్రదాయాలు తెలుసుకోడానికి ఈకథ ఉపకరిస్తుంది.

″చింతచిగురు″లో లేమి. మనసుని పట్టి వూపేసేకథ. ఎముకలగూడులా కొనవూపిరితో కొట్టుకులాడుతున్న జీవుడిని నిలుపుకోడానికి తిండి కావాలి. అది ఆఖరికి చింతచిగురయినా ఘనమే. రెండు అస్థిపంజరాలకథ. వాళ్ల అస్తిత్వం ఎంత నాస్తిత్వమో చెప్పడానికి ఆరుద్ర వాడిన క్రియాపదాలు చూడండి. ″ఆకలిరంగు చర్మాల్లో రెండెముకలగూళ్లు నిర్ఝనమైన మాడుతున్న రోడ్డుమీద వారంట తూలుతూ నడుస్తున్నాయి. … ఎముకలగూళ్లు ఎక్కడినుంచి ఎక్కడికి ఎందుకు ప్రయాణం చేస్తున్నాయో …″ కాకివాలితే, రాలిన చింతచొట్టతో ఎండిపోయిననోటికి కలిగిన వూరట ఎంత. అది కూడా తగినంత రాదు. మొగాడు మొహంతిరిగి పడితే సీసాలో నీళ్లతో అతనిమొహంమీద చల్లబోతే, వద్దని ఆఆడమనిషినే తాగమంటాడు. ఒకచిన్నకథతో ఎంతచిక్కని కథ అల్లొచ్చో చదివితే తెలుస్తుంది.

ప్రతి ఒక్కకథలోనూ ఆరుద్రమార్కు వాక్యాలు అడుగడుగునా ఎదురై పాఠకులదృష్టిని ఓకతాటిన నడిపిస్తాయి. నామటుకు నాకు ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఏకథ అయినా చదవాలనిపించినప్పుడే పూర్తిగా చదువుతాం. అలా అనిపించడానికి వాక్యనిర్మాణం అతిముఖ్యమైన సాధకం (లేక అనుపానం అనాలా?). సుబ్బారావున్నరగంటలసేపు- లాటి వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి.

″మానవత్వం″ కథలో సైనికుడు కక్కని చంపబోయేముందు తనలో కలిగిన మానసికాందోళనకి అక్షరరూపం. ఈకథకి రెండోవైపు అనిపించే కథ ″చాపకిందనీరు.″ నలభైయేళ్ల అప్పలస్వామి ″వెయ్యిన్నర గాలివానలు చూసిన బిళ్లబంట్రోతు.″ అతనికీ మెజిస్ట్రీట్ కామరాజుకీ మధ్య నడిచినకథలో కథకుడు స్పష్టంగా సూటిగా చెప్పనివి వున్నాయి. ఓకథ చదివి ఏంజరిగింది, ఏంజరిగివుంటుంది, కథకుడు ఏం చెప్పాలనుకున్నాడులాటి ప్రశ్నలు వేసుకోడం సరదాగల పాఠకులకి ఇది సవాలు.

ఈసంకలనంలో ఇక్కడ కథేముంది అనిపించేది ″నే చెప్పాగా!″ అన్నది. మనం నిత్యజీవితంలో వాడే వూతపదాలని వుపయోగించుకునే తీరు హాస్యంస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఆవిష్కరించారు రచయిత.

మంచికథలలక్షణం ఏమిటీ అంటే పాఠకులచేత చదివించేదిగా వుండాలీ, ఆలోచింపజేసేదిగా వుండాలీ అఁటారు.
కథ ″చదివింపజేయగలగడం″ అన్నది విస్తృతార్థంలో పాఠకుడు మనసుపెట్టి, కళ్లు పెట్టి ప్రమత్తతతో చదవితేనే జరుగుతుంది. ఉదాహరణకి శీర్షికలు చూడండి. ″ఇందలినీతిః చెడలేదు″. నేను మొదటిసారి కోలన్ గమనించలేదు. ఆకోలన్ తీసేస్తే వేరే అర్థం వస్తుంది కదా. అలాగే ″స్వప్నవాస్తవదత్త″ కూడా మొదటిసారి స్వప్నవాసవదత్త అనే చదివేను. వాసవకీ వాస్తవకీ ఎంత తేడా!

ఇక పోతే, ″ఆలోచింపజేయడం″ ఎలాటిది అన్న విషయంలో ఈనాడు అభిప్రాయబేధాలున్నాయి. వెనకటి రోజుల్లో ఆలోచింపజేయడం అంటే ఏమిటో ఈకథలు చదివితే తెలుస్తుంది. నేను వేరే వివరణ ఇవ్వక్కర్లేదు.
అందుకు భిన్నంగా, ఈరోజుల్లో ఆలోచింపజేయడం అంటే కథలో స్పష్టత, ప్రతిచిన్నవిషయాన్ని వివరించి చెప్పడం, వాచ్యం చెయ్యడం అని అనిపిస్తోంది. ఆదృష్టితో చూస్తే, ఈకథల్లో రచయిత స్పష్టం చెయ్యనివి, వాచ్యం చెయ్యనివి అనేకం కనిపిస్తాయి. ముగింపులో తాడో పేడో తేల్చయ్యరు ఆరుద్ర. ప్రతికథకీ రెడీమేడ్ పరిష్కారం ఇవ్వరు. ″నేను చెప్పగలిగింది, చెప్పదల్చుకున్నది చెప్పేను, ఇంక మీరు ఆలోచించుకోండి″ అని చెప్పకయే చెప్తారు.

అందుకే ″ఊష్ణమొస్తే బాగుణ్ణు″ లాటికథల్లో చావుని సూచనప్రాయంగానే వదిలివేయడం జరిగింది. (రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి ఇద్దరు పిల్లలు కథలో కూడా ఇంతే). కుర్రవాడు చనిపోయాడనో మరణించాడనో కాక, ఆసందర్భంలో ఇతరపాత్రలు ఆసంఘటనకి ఎలా స్పందించారో, ఆకష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారో చెప్పడంద్వారా మనకి విశదం చేస్తారు.

నేను చెప్పగలిగింది ఇఁతే. మీరు చదివి తెలుసుకోవాలి నిజమైన ఆరుద్రకథలలో సౌందర్యాలు.

(© మాలతి .ని. ఏప్రిల్ 2008.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఆరుద్ర కథలు సమీక్ష”

 1. మీఅభిమానానికి సంతోషం సుజాతా.
  ఈపుస్తకం ఇక్కడ యూనివర్సిటీ లైబ్రరీలో నాకు దొరికింది. రామలక్ష్మిగారు ఆరుద్ర సాహిత్యం ప్రచురిస్తున్నారని విన్నాను. ఆవిడని అడిగితే తెలుస్తుందేమో.
  చక్రపాణిగారి మీద వ్యాసం పంపండి వీలయితే. తప్పకుండా చదువుతాను. మీరు రాయబోయే వ్యాసంలో కూడా ప్రస్తావిస్తారు కదా.

  మెచ్చుకోండి

 2. ‘subbaaraavunnara ganTala sEpu’ ‘aakali rangu charmaallO rendemukala goollu..’ .! Elaa raayagalugutaarO kadaa anipinchindi.

  cheppavalasindantaa cheppesi , ‘nEnu raayagaligindinte’ anadam kUdaa oka chamatkaramE kadaa maalati gaaru!

  1966lO raasina book ante ippudekkada dorukuntundo?

  ee review oka saari aashaamaasheegaa chadivitE chaaladu. seeriyasgaa 2, 3 saarlu chadavaali. appuDu baagaa talakekkutundi aarudra kathallOni saundaryam.

  bye the way, chakrapaani gaaru maninchinapudu aayana gurinchi aarudra raasina vyasam okati dorikindi. meeku panikostundaa?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.