ఊసుపోక – నాదినము

(ఎన్నెమ్మ కతలు 8 )

రానున్న ఆదివారం అమ్మదినం. ఆశుభసందర్భంలో నాదినం ఎలావుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే కొత్తగా పరిచయం అయినవాళ్లు నన్ను సాధారణంగా అడిగే మూడో లేక నాలుగో ప్రశ్న “మీరేం చేస్తారండీ రోజంతా“ అని.
ఎందుకంటే మొదటి రెండో లేక మడో ప్రశ్నల్లో తెల్లమయే విషయాలు …

 • ఉజ్జోగంలేదు సజ్జోగం లేదు. సాకడానికి చిన్నా పొన్నా పిల్లల్లేరు. (సరయుని నావంతు సాకడం అయిపోయిందిలెండి), సోషలైజు చేయడానికి సావాసాల్లేవు, మరి పొద్దెలా పోతుందని, ఏంచేస్తున్నానా అని రోజులతరబడి ఆలోచించగా తేలినసంగతి ఇదీ. నాదినం దానంతట అదే గడుస్తుంది.
  మామూలుగా నిత్యనైమిత్తికాలు రోజుకి నాలుగో అయిదో వుంటాయి. లేస్తూనే ఓచిన్న జాబితా రాసుకుంటాను. రెండో మూడో అనుకున్నట్టు అవుతాయి. కానివి రేపటికి వాయిదా.
  అది కాక నాకు ముగ్గురు స్నేహితులున్నారు. నెలకోసారీ, మూడునెలలకోసారీ, ఆరునెలలకోసారీ పిలిచేవారు. (గమనికః సైటులద్వారా నీలితెరమీదకొచ్చి కబుర్లు చెప్పేవారు ఈలెక్కల్లోకి రారు)
  అందులో మూడో వర్గానికి చెందినావిడ పిలిచారు ఇందాకా. వారు దేశంలో కులపెద్దలు. అంటే కాస్త రాజసం గలవారు అంటే అపార్థం చేసుకోకండి. నేను సదుద్దేశంతోనే చెప్తున్నా. సాంప్రదాయకమయిన మర్యాదలూ, మన్ననలూ తెలిసినవారు అని.
 • నేను సాంప్రదాయకురాలినని ఆవిడ నమ్మకం.
 • నానిజస్వరూపం ఆవిడకి తెలీదని నానమ్మకం :p.
  ఆవిడకీ నాకూ మాటాడుకోడానికేం వుండవు కానీ సాంప్రదాయక మర్యాదలప్రకారం ఠంచనుగా ఆరునెలలకోమారు హలో చెప్పి హలో చెప్పడానికి పిలిచానని చెప్పుతుంటారు.
  “హలో“
  “హలో“
  ″ఏం చేస్తున్నారండి″ అన్నారావిడ.
  ″ఏంలేదండి. కంప్యుటరు పడుకుంది. ఏమైందా అని చూస్తున్నాను″ అన్నాన్నేను.
  ″అంతేనండీ ఈమెషీనులూ.. ఈరోజు మా ఫాక్స్ రింగవడంలేదు. పని చేస్తోంది కాని రింగవడంలేదు.″
  ″ఆహా, అలాగా.″
  ఆవిడ కొంచెం సందేహిస్తూ, ″చూస్తారా″.
  నేను, మర్యాదగానే, ″వద్దులెండి. నాకంప్యూటరుమీద ఏదో చేస్తాను కానీ …. వేరేవాళ్ల మెషీనులంటే ….″ అన్నాను.
  ″అవునులెండి. అదే మరి … చెప్పలేం కదా.″
  అలా సుమారుగా అదే అర్థం వచ్చేమాటలలో మరో పదినిముషాలు హలోలాడుకుని శలవు పుచ్చుకున్నాం ఈపూటకి.

టైము చూశాను. చూస్తుండగానే పదకొండవుతోంది. ఏదేనా తింటే బాగండు అనుకుంటుండగనే మళ్లీ ఫోను. నాఋణభారం తగ్గిస్తాం అంటూ. ఇదో బాధ. నాకు లేని ఋణాలు, అక్కరకు రాని వారంటీలూ, అవసరంలేని దూరాభారంఫోను సేవలూ  … నాకు అర్థం కాదు. నాకు లేనిఋణం వాళ్లెలా తగ్గించగలరు? మహ చిరాకేస్తుంది.

సరి. వంటగది ప్రవేశించేను. క్షణాలమీద అయిపోయే టిఫినులకిది సమయం కాదు. నాలుగు పచ్చిమిరపకాయలో గుప్పెడు కాకరకాయలో కసిక్ కసిక్‌మని నరికేస్తే మనశ్శాంతి. సుతారంగా కొత్తిమీర తరగడంనుంచి ఠప్పుమని కొబ్బరికాయ కొట్టడం వరకూ ఏరోజు ఏంచేస్తానన్నది ఆనాటి చిరాకుస్థాయిని బట్టి వుంటుంది. వేరు చెప్పనేల, బాగా చిరాకు పడ్డ రోజున మాంఛి టిఫిను! అది టెలిమార్కెటర్లు చేసే సంఘసేవ.
ఆ తరవాత …
లాప్టాప్ తీసి ఇందాక ఆపేసిన రిపేరు మళ్లీ మొదలెట్టాను. అది ఒకటే నస తెరుచుకోనని. ఏదో సిస్టమ్ ఫైలు కత్తిరించేసినట్టున్నాను నిన్న. టెక్ సపోర్టుని పిలవడమా, స్టోరుకి తీసుకెళ్లడమా అని ఆలోచించాను కొంచెంసేపు. వారంటీకి కాలదోషం పట్టింది కనక ఎలా చూసినా కాసిని డాలర్లు తగలెయ్యక తప్పదు..
కాని ముందు నేను చెయ్యగలిగిందేదో చూసేస్తే తరవాత వాళ్లకి అప్పజెప్పేయొచ్చు. చెడినకాపురం చెడనే చెడిందన్న సామెత నెమరేసుకుంటూ, సిస్టమ్ రెస్టోరుతో మొదలెట్టాను.
ఓపూటంతా కుస్తీ పడితే రెస్టోరయింది కాని “లాగాను‌“ అవనివ్వడానికి పేచీ.. తప్పదేమో దాన్ని పుట్టింటికి తోలీడం అనుకుంటూనే ఎప్పుడో మాడిపార్ట్‌మెంటువాళ్లిచ్చిన ఫ్రంటుపేజి గుర్తొచ్చింది. సరే పెట్టిచూద్దాం అని తీశాను. ఆసిడిలో మొత్తం ఓయస్ వున్నట్టుంది. అప్పుడే గద్దెనెక్కిన కుర్రబాసులా కొంత బెట్టు చేసి దారిలోకి వచ్చేసింది. హా.

దానికి ప్రాణం పోసేక, ఏప్రోగ్రాములున్నాయో, ఏవి మట్టి కరిచేయో చూడ్డం రెండో మెట్టు.
స్క్రాబుల్ ఎక్కించేను. మరి ఎక్కించిన తరవాత ఆడాలి కద. లేకపోతే మెవను (కంప్యూటరు ఈఆటకోసం తనకి తాను ఇచ్చుకున్న పేరు) నొచ్చుకోవచ్చు.
ఆడుతుంటే అది నన్ను మోసం చేస్తోంది అనిపించింది. ఆటలో నామాటలని అది ఛాలెంజి చేయొచ్చు కాని నేను దాన్ని ఛాలెంజి చేసే వసతి లేదు. ఆప్రోగ్రాం రాసినవారు నిఘంటువు దగ్గరపెట్టుకునే చేసారనే అనుకుందాం. కాని కొశ్చెను చేసే వసతి నాకు వుండాలా, అఖ్కర్లేదా‌? మాటవరసకి, నేను Jew అని పెడితే, కొట్టిపారేసింది. taj అని పెడితే ఒప్పుకుంది. రెండూ సర్వనామాలే కద. ఇది అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యసిద్ధాంతాలకి విరుద్ధం. … ప్చ్. ప్చ్.. అని కొంచెంసేపు అరుచుకుని ఆట ఎత్తిపెట్టేశాను. .

ఆతరవాత, మూవీమేకరు తీసి చూశాను. చూస్తుంటే ఆమధ్య వచ్చిన మెయిలొకటి గుర్తొచ్చింది. ఎవరో ఔత్సాహిక మూవీమేకరు, “‌నాకు మీకథలు చాలా ఇష్టం, ఓ ప్రేమకథ రాసివ్వండి. సినిమా తీద్దాం“ అని రాశాడు. నాకు నవ్వొచ్చింది. ఆయనగారు నిజంగా నాకథలు చదివుంటే, ప్రేమకథలు అడిగేవాడా, హాహాహా.
మరి నేను సినిమా తీస్తే ఎలా వుంటుందో.. …
మామూలుగా నేను రోజూ వాక్కళ్తాను. ఉజ్జోగాలున్నవారు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్లకీ, తదితరులు మాలులకీ చేరుకున్నాక, వీధులు అడవుల్లా ఉంటాయి. అప్పుడు నాకు నడవడం ఇష్టం.
రోజూ నడిచేదారే … నాలుగేసి నెలలకోమారు చెట్లు కొత్తరంగులు పులుముకుని వింతశోభలు వెదజల్లుతూ చూపరుల నలరిస్తుంటాయి.. నిన్న వచ్చింది ఈదారేనా అనిపిస్తుంది.
నిన్నటివరకూ అస్థిపంజరాల్లా వున్న కొమ్మలు కొత్తచివుళ్లు తొడుక్కుంటాయి. వర్ణించలేని వర్ణాలతో కనులపండువుగా చూడ ముచ్చటగా వున్నాయి.
అలవాటుప్రకారం బయల్దేరుతూ, కెమెరా, డిజిటల్ రికార్డరూ కూడా తీసుకుని చూస్తూ నడుస్తున్నాను.
పక్షులు తీవ్రంగా తారస్థాయిలో చర్చించుకుంటున్నాయి.. నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ
“గింజలు పిండుకు కారుల్లో పోసుకుంటున్నారు, చెట్లు కొట్టి కాయితాలూ, సంచులూ చేసుకుంటున్నారు. ,… మనంవిప్పుడు తీసుకోవాలిసిన చర్యలేమిటీ …” అనేమో… .
మన యువ కని బ్లాగరులనందరినీ తలుచుకున్నాను. వారిలో ఒక్కరయినా ఇప్పుడు ఇక్కడుంటే ఎంత మంచికవితలు వచ్చేవో అని కొంచెసేపు బాధ పడిపోయేను...

ఈ వ్యాపకాలమధ్య అంతర్జాలంలో ఈనాటి సాహిత్యావలోకనం చేస్తాను,
ఇంకా మధ్యలో, చాటుల్లోనూ ఈమేలుల్లోనూ నాబాత్‌చీత్ సమాంతర పట్టాలమీద సాఫీగా సాగిపోయే హౌరా ఎక్స్ ప్రెస్‌. సమాంతరాలు ఎందుకంటే వారికీ నాకూ వయసులో అభిరుచుల్లో చాలా ఏనాటికీ కలవని రైలుపట్టాలలాటివే కనక. నాకు ఇలాటి స్నేహాలే ఎక్కువ.
వీటన్నిటిమధ్యా రాయడమో, ఏంరాయనా అని ఆలోచించుకోడమో కూడా చేస్తుంటాను. అన్నట్టు టీవీకూడా సరదాగానే వుంటుంది.
హుమ్. టూమెనీ “మధ్య”లు … ఇన్ని మధ్యలమధ్య తోచదనుకునే తీరికేదీ!
గమనిక 2. మధ్యలో డి.యన్.డి రోజులు (do nothing days) కూడా వుంటాయి.

ఇంతటితో నాదినం సమాప్తం.
శ్రీశ్రీశ్రీ మంగళం మహత్.

(మా.ని. ఏప్రిల్ 2008. ).

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “ఊసుపోక – నాదినము”

 1. జిడ్డు కృష్ణమూర్తి గారి వ్యాహ్యాళి వర్ణనలు గుర్తుకు వచ్చాయి…మీ వీడియో చూస్తే..మీ దినము చాలా మంది దినాలకంటే బ్రంహాండం గా ఉంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. @సౌమ్య,
  @సుజాత
  @VS
  నెనరులు. సుజాతా, మిమ్మల్ని తలుచుకుంటున్నానులెండి రోజూ వాక్కెళ్లినప్పుడు. నేను ఆరుద్రవ్యాసం గురించి మీకు వేరే మెయిలు పంపేను, అందిందా. ఆయనమీద నాదగ్గర ఆయనమీద వున్నసమాచారం వెతుకుతుంటే ఆయన నాకు రాసిన రెండు వుత్తరాలు దొరికాయి పొద్దున్నే. పరమానందపడిపోయేను.

  మెచ్చుకోండి

 3. పక్షుల కిలకిలలతో మీ వీడియో చాలా బావుంది.ముఖ్యంగా రోడ్డంతా నాదేనన్న ధీమాతో నడిరోడ్డుమీద రాజసంగా వాలిన బుజ్జిగాడు చాలా క్యూట్ గా ఉన్నాడు.మీ వాకింగ్ ట్రాక్ కూడా బావుంది,చెట్లు,చేమలే కాక చెరువులు బాతులు కూడా !
  Very pleasant!!

  మెచ్చుకోండి

 4. ‘సుతారంగా కొత్తిమీర తరగడం నుంచి ఠప్పున కొబ్బరికాయ కొట్టడం వరకూ, ఏ రోజు ఏం చేస్తానన్నది ఆ నాటి చిరాకు స్థాయిని బట్టి ఉంటుంది.’ ఎంత బాగా చెప్పారు మాలతి గారూ!

  ఉరిమే మేఘాలతో సహా వీడియో చాలా బాగుంది. మీతో పాటు నడవాలనిపించింది.

  మెచ్చుకోండి

 5. ఓ. మరి నేనే కెమెరామెన్, డైరెక్టరు .. అన్నీ కదండీ. సపోర్టు క్రూ లేదు.
  ఏమోలెండి, ఎప్పుడో అదీ చేసెయొచ్చు.

  మెచ్చుకోండి

 6. మరి మీకవితకోసం ఎదురుచూస్తున్నా. అవును గాలి వాటంగా వున్నప్పుడు ఫరవాలేదు, ఎదురుగాలి అయితే కొంచెం కష్టమ్.. హీహీహీ.

  మెచ్చుకోండి

 7. మీ రోజుని చక్కగా సద్వినియోగపరచుకుంటూ కూడా అలా అంటారేమిటండి.ఈ వయసులో కూడా అన్ని చేస్తున్నారంటే చాలా గ్రేట్.ఆ వీడియో చూసాను.మీ నడిచే దారి చాలా ఆహ్లాదంగా వుంది.అప్పుడే నడక మొదలు పెట్టేసారా?ఇంకా గాలులు బలం గా వీస్తున్నాయి కదా.మీ వీడియోలో కూడా ఆ గాలి హోరు వినిపిస్తుంది.ఇంకొన్నాళ్ళు ఆగి వెళ్ళండి.
  కొత్తిమీర,కాకరకాయ,కొబ్బరికాయ…..ఆ వాక్యాలు తెగ నవ్వించాయండి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s