కథలఅత్తయ్యగారు

ముందుమాట
“నాకథలు చదివినవాళ్లు నన్ను ప్రేమకథలు రాయమని అడగరు” అన్నాను ఇంతకుముందు. కాని నిజానికి నాకథలు చదివింతరవాతే, వైదేహి (తెలుగుజ్యోతి, న్యూజెర్సీ) నన్ను పిలిచి, సర్వధారి ఉగాది ప్రత్యేకసంచికకి కథ రాసి ఇవ్వమని అడిగారు. నేను పైమాటే చెప్పాను. ఆవిడ “పోనీండి, ప్రేమ లేకపోవడంమీదే రాయండి” అన్నారు. ఆతరవాత, ప్రేమ చాలారకాలు కదా అని జోడించారు.
అప్పుడనిపించింది నాచిన్నతనంలో నాకు కథలు చెప్పిన ఈ కథలఅత్తయ్యగారికథ ఇంతవరకూ ఎవరికీ చెప్పనేలేదని. ఆవిడా, ఆవిడ చెప్పిన చిలకలకొలికి కథా నామనస్సులో చిరస్థాయిగా వున్నాయి ఈనాటికీను.. దానికి అక్షరరూపం ఇవ్వడానికి కారణమయిన వైదేహీ శశిధర్‌కీ, తెలుగుజ్యోతి, న్యూజెర్సీ, వారికీ కృతజ్ఞతలతో ఇక్కడ మళ్లీ పెడుతున్నాను.
ఇది తెలుగుజ్యోతి ఉగాది సంచిక 2008, లో తొలిసారి ప్రచురింపబడింది.

కథల అత్తయ్యగారు

000

“ఎవరూ .. అమ్మాయీ …”
“ నేనేనండీ అత్తయ్యగారూ.”
“దా కూచో, ఇప్పడే అనుకుంటున్నా, ఇంకా రాలేదేమా అని.”
“ఈరోజు స్కూల్లో కొంచెం ఆలస్యంవయిందండీ. సత్యంమాస్టారు అన్ని లెక్కలు పూర్తి చేసి వెళ్లమన్నారు.”
“కూచో. ఇవాళ ఏంకూర చెయ్యనా అని చూస్తున్నా,” అంటూ అత్తయ్యగారు మూలనున్న పీట నాముందుకి తోసారు.. అత్తయ్యగారు మడి కట్టుకు వంట చేస్తారు, నేను పొరపాటున తగుల్తానేమోనని ఆమె అనుకుంటారని నాకు తెలుసు. అంచేత పీట గోడవారకి జరుపుకుని ఒదిగి కూచున్నా.
“అరిటికాయ వేపుడు చెయ్యండి. మామయ్యగారికిష్టం కదా” అన్నా.
“అల్లం పచ్చిమిరపకాయా నూరి పెడతా. అల్లం పేగు శుద్ధి చేస్తుంది” అన్నారు అత్తయ్యగారు, కూరలబుట్టలోంచి రెండు అరిటికాయలూ, కత్తిపీటా ముందేసుకుని కూర్చుంటూ.
నేను చూస్తూ కూచున్నాను. ”కథ చెప్పండి అత్తయ్యగారూ” అన్నాను కొంచెంసేపు ఆగి.
“ఏంకథ చెప్పను?”
“చిలకలకొలికి చిన్నదానా కథ పూర్తి చెయ్యలేదు కదండీ నిన్న.”
“ఎంతవరకూ చెప్పానూ. …” అన్నారు అలవాటుగా దీర్ఘాలు తీస్తూ.
“అదేనండి, పెద్దరాణికి ఒకమ్మాయి పుట్టింది. కాని చిన్నరాణికి అది ఇష్టంలేదు. అంచేత ఆపాపని పుట్టినవెంటనే దాసీదానికి ఇచ్చి, పారేయమని చెప్పింది. తరవాత, పెద్దరాణితో ‘నీకు కప్పపిల్ల పుట్టింది’ అని చెప్పింది. పెద్దరాణి ‘అయ్యో ఇది నాకర్మ’ అనుకుని ఏడుస్తూ వూరుకుందిట. తరవాత చిన్నరాణికి కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఇలా కొంతకాలం సాగింది. పెద్దరాణికూతురు దాసీదానింటిలోనూ, చిన్నరాణికూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారు. చిన్నరాణి పెద్దమ్మాయిచేత దాసీపనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ వుంటుందిట. చిన్నమ్మాయికేమో, అదే ఆవిడ సొంతకూతురికి అది అస్సలు బాగుండదు..”
అత్తయ్యగారు “నీకు బాగా గుర్తుంటుంది,” అంటూ నవ్వి, కూర తాలింపుకోసం పొయ్యిమీద బాణలి పెట్టి, రెండు గరిటెలు నూనె పోసి, నూనె బాగా కాగినాక ఆవాలూ, మిరపకాయలూ వేశారు. మిరపకాయలఘాటు గదంతా గుప్పుమని కమ్ముకుంది. ఆఘాటుకి నేను ఉక్కిరిబిక్కిరయిపోయాను. దగ్గొచ్చేసింది ఒక్కుమ్మడిగా.
“పొమ్మనలేక పొగబెట్టినట్లు” అన్నారు అత్తయ్యగారు నవ్వుతూ.
నేను ఆమెవంక చూస్తూ కూర్చున్నాను. “అఁటే ఏమిటి” అని అడగాలనుంది కానీ అడగలేదు, చిలకలకొలికి కథ ఆగిపోతుందని. ఆపొగకథ రేపు అడుగుతాను.
అత్తయ్యగారిని చూస్తుంటే ఎంతో బావుంటుంది నాకు. పొట్టిగా, కాస్త లావుగా, కళకళల్లాడుతూ చందమామలాటి పచ్చనిముఖంమీద చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తారు ఆమె. అట్టే నగలేమీ పెట్టుకోకపోయినా ఏమీ తక్కువయినట్టు కనిపించరు. అందుకే రోజూ వాళ్లింటికి వెళ్లటం నాకిష్టం.
“అఁ అప్పుడూ … అచిన్నమ్మాయికి చానా కష్టం అయింది గదా.”
“అవును పాపం. మరి ఆఅమ్మాయి వాళ్లమ్మకి చెప్పలేదా ఇదేం బాగులేదని?”
“వాళ్లమ్మంటే అఅమ్మాయికి భయం. అట్టా చెప్పితే, ఆమెకి కోపం వచ్చి కొడుతుందేమోనని చెప్పలేదు. ఆతరవాత ఒక ఉపాయం ఆలోచించింది”
నేను నిటారుగా కూచున్నాను ఊపిరి బిగబట్టి. .
“ఒకరోజు, ఆచిన్నమ్మాయి బొమ్మలతో అమ్మాట ఆడుకుంటోందిట, ఎంచక్కా అమ్మమాదిరి తను కూడా మడి కట్టుకుని, వంట చేసి, ఆబొమ్మకి తిను, తిను అంటూ తినబెట్టిందిట. కాని ఆబొమ్మేమో తినలేదు. అప్పుడు ఆఅమ్మాయేమో నాబొమ్మ బువ్వ తినటంలేదూ అంటూ ఏడవటం మొదలెట్టిందిట.
వాళ్లమ్మ అది చూసి, ‘చిలకలకొలికీ, చినదానా, బొమ్మలు బువ్వలు తిందురటే’ అందిట నవ్వుతూ.
అప్పుడేమో ఆఅమ్మాయి, ‘మాయలదానా, మహిమలదానా, మనుషులు కప్పల కందురటే’ అందిట చమత్కారంగా.
అప్పుడు చిన్నరాణి తను చేసిన తప్పు తెలుసుకుని, పెద్దరాణీకి నిజం చెప్పి, పెద్దమ్మాయిని పిలుచుకొని వచ్చి, ప్రేమగా చూసుకోసాగిందిట.” అంటూ ముగించేరు అత్తయ్యగారు.
నామనసు కుదుటపడింది. హమ్మయ్య. మంచిఅమ్మాయికి కష్టాలు పోయేయి. చిన్నమ్మాయి తనతెలివితేటలతో తనతల్లి పాడుబుద్ధిని మార్చేసి, మంచిదాన్ని చేసేసింది. కొంచెంసేపు నేనేమీ మాటలాడలేదు. తరవాత నెమ్మదిగా అడిగా, “పొగ పెట్టటం ఏమిటిండీ అత్తయ్యగారూ,” అని, ఇందాకటిమాట గుర్తొచ్చి.
“చీకటి పడుతోంది. మీఅమ్మగారు ఎదురుచూస్తూంటారు. రేపు చెపుతాలే.” అని నన్ను ఇంటికి పంపేశారు ఆరోజుకి.
000
అప్పుట్లో మేం గుంటూరుదగ్గర మంగళగిరిలో వుంటూ వుండేవాళ్లం. ఇది నాకు బాగా గుర్తుండిపోయిన, అలనాటి తొలికథ, ఇంకా మర్రిచెట్టు తొర్రలో ప్రాణాలు దాచుకున్న రాక్షసులూ, ఏడుమల్లెపూవులఎత్తు రాకుమార్తెల కథలూ రోజూ చెప్పిన అ అత్తయ్యగారిపేరు రామడుగు లలితాంబగారు. మామయ్యగారిపేరు నరసింహంగారు. వారింటి తలుపులు సదా నాకోసం తెరిచివుండేవి. అత్తయ్యగారు నాకోసం ఎదురుచూస్తూ వుండేవారు రోజూ.
నిజంగా ఆవిడకీ మాకూ ఏచుట్టరికమూ లేదు కాని ఆరోజులు అలాటివి. పెద్దలని వరసపెట్టి పిలవడం, లేని చుట్టరికాలు కలుపుకుని ఆప్యాయతలు పెంచుకోడం సర్వసాధారణం. అంటే మాఅత్తయ్యగారు కూడా అందరితో పాటే అనికాదు. ఆవిడకి ఆవిడే సాటి నామటుకు నాకు మరో అత్తయ్యగారు లేరు.
మానాన్నగారిఉద్యోగరీత్యా మేం కొత్తగా మంగళగిరిలో స్థిరపడినరోజులు అవి. నేను చింతకింది కనకయ్యగారి హైస్కూలులో ఫస్టుఫారంలో చేరాను. స్కూలినించి నడిచి ఇంటికి వస్తుంటే, దారిలో, మాయింటికి మలుపు తిరిగేముందువీధిలో రెండిళ్లకి ఇవతల అత్తయ్యగారిల్లు వస్తుంది. అరుగుమీద మామయ్యగారు వాలుకుర్చీలో కూర్చుని, పేపరు చదువుకుంటుంటే, అత్తయ్యగారు స్థంభానికానుకుని కూర్చుని, అప్పుడే కోసిన కనకాంబరాలూ, మరువం, మల్లెలూ మాల కడుతూ, ఏ ఊర్మిళాదేవి నిద్రో పాట పాడుకుంటూ కనిపించేవారు. మాయింట్లో మాఅమ్మవేపూ, నాన్నగారివేపూ కూడా పెద్దలు అప్పటికే తరించిపోయారు. పైగా అటూ ఇటూ కూడా మా అమ్మా, నాన్నగారే తొలిసంతానం. అంచేత నాకు అందరు పిల్లల్లా చెప్పుకోడానికి అమ్మమ్మలూ, తాతగార్లూ, లేరేమో, ఈదంపతులని చూస్తుంటే ఏదో చెప్పలేని తమకం తగిలేది మనసులో నాకు.
నేను వారినిద్దరినీ పరీక్షగా చూస్తున్నానని నాకు తెలీలేదు ఆమె ఒకరోజు తలెత్తి నావేపు చూసి నవ్వేవరకూ. నేను సిగ్గుపడి పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చేసేను. మరునాడు ఆమె దా అంటూ పిలిచారు. నేను జంకుతూనే దగ్గరికి వెళ్లాను.
నేను బాగా దగ్గరగా వచ్చినతరవాత, ఆమె చిరునవ్వుతో, నారెండుబుజాలు పట్టుకుని, నన్ను వెనక్కి తిప్పి, నాజడలో చిన్నపాయ తీసి, చేతిలో వున్న కదంబమాల ముడిచి తురిమారు. మళ్లీ తనవేపు తిప్పుకుని, “నీపేరేమిటి?” అని అడిగారు.
“మాలతి అండీ,” అన్నాను నెమ్మదిగా.
“ఎంచక్కా వున్నావు బాలాత్రిపురసుందరిలా,” అన్నారామె.
నాకు చెప్పలేనంత సిగ్గూ, సంతోషమూ ముంచుకొచ్చేయి. నేను మాటాడకుండా ఒక్క వురుకున ఇంటికి చేరుకున్నా.
“ఆపువ్వులెక్కడివి?” అంది అమ్మ.
“పక్కవీధిలో వుండే అత్తయ్యగారు పెట్టేరు,” అన్నాను.
అమ్మ తిడుతుందేమో అనుకున్నాను కానీ, తేలిగ్గానే పోనిచ్చేసింది, “తిన్నగా ఇంటికి రాకుండా ఆపెత్తనాలేమిటి” అనేసి, తనపనిలో పడిపోయింది.
వరసగా నాలుగురోజులు ఇలా జరిగింది. అయిదో రోజు, అత్తయ్యగారు, నాతలలో పువ్వులు పెట్టబోతూ, “ఇదేం జడ ఒగ్గులొగ్గులుగా” అన్నారు.
“మాఅమ్మ బయటుందండీ. అంచేత నేనే వేసుకున్నా,” అన్నాను.
“ఇంటికెళ్లి, మీఅమ్మతో చెప్పిరా. కుదుమట్టసంగా దువ్వి మళ్లా జడ వేసి చెండు తురుముతా,” అన్నారామె.
నేను సరేనండీ అని పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మకి చెప్పాను.
“ఆవిడకి మరేం పనిలేదూ నీకు జడలేస్తూ కూచోడానికి. ఇప్పుడేం వద్దు,” అంది అమ్మ.
“అత్తయ్యగారే వేస్తానన్నారు,,” అన్నాను నేను రొకాయిస్తూ.
“ఆవిడేదో మర్యాదకి అనివుంటారు. వద్దని చెప్తున్నానా,” అంటూ కసురుకుంది అమ్మ.
నేను గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ పెరట్లోకి వెళ్లిపోయాను. నాకు కోపం వస్తే పెరట్లో జామచెట్టెక్కి కూచుంటా. అమ్మ మంచికళనుంటే, వచ్చి, మంచిమాటలాడి లోపలికి తీసుకెళ్తుంది. లేకపోతే, అదే వస్తుంది అని వూరుకుంటుంది. ఇప్పుడు తను కూడా ఇంట్లోకి వెళ్లదు కనక, రెండోవరసే జరిగింది. నేను రెండు జామకాయలు తిని ఇంట్లోకి వచ్చేసాను మంచినీళ్లకోసం.

మర్నాడు స్కూలినుండి వస్తుంటే, అత్తయ్యగారు చూసి, నన్ను ఆపి, ఆడిగారు, నిన్న రాలేదేం అని.
“ఆవిడకి మరేం పనిలేదూ నీకు జడలేస్తూ కూచోడానికి అందండీ మా అమ్మ,” అని చెప్పాను, నాదేం తప్పులేదని చెప్పడానికి.
అత్తయ్యగారు నవ్వి, “ఫరవాలేదు, అత్తయ్యగారే వేస్తానన్నారూ, మీ అమ్మ స్నానం అయేవరకూ, రోజూ ఉదయమే రా, జడ వేస్తాను అని అత్తయ్యగారు చెప్పారని మీఅమ్మకి చెప్పు” అన్నారు.
నేను సంతోషంగా ఇంటికి వెళ్లి, మాఅమ్మతో “ఫరవాలేదు, అత్తయ్యగారే వేస్తానన్నారూ, మీ అమ్మ స్నానం అయేవరకూ, రోజూ ఉదయమే రా, జడ వేస్తాను అని అత్తయ్యగారు చెప్పారని మీఅమ్మకి చెప్పు” అని చెప్పమంది అని చెప్పాను. అలా మొదలయింది మా అనుబంధం. అసలు చాలారోజులవరకూ మాఅమ్మా అత్తయ్యగారూ కలుసుకోనేలేదు. నేనే అత్తయ్యగారిలా చెప్పమన్నారని అమ్మతోనూ, అమ్మ ఇలా అందని అత్తయ్యగారితోనూ రాయబారాలు నడుపుతూ వచ్చేను. ఆరోజుల్లోనే అత్తయ్యగారు నాకు శ్రీకృష్ణరాయబారం కథ చెప్పారు జడవేస్తూ.
అలా నాకు జడ వేస్తూ కథలు చెప్పడం మొదలయింది. తరవాత, సాయంకాలాలు, స్కూలినించి ఇంటికొచ్చి, కాఫీ తాగి, “అత్తయ్యగారింటికెళ్తున్నా” అని అమ్మకి చెప్పి వాళ్లింటికి వెళ్లేదాన్ని.
అమ్మ “రోజూ ఎందుకు . ఆవిడ పనులు అవిడని చేసుకోనీకుండా కాళ్లకడ్డంపడుతూ,” అంది ఓరోజు.
అత్తయ్యగారే రమ్మన్నారని నేను పట్టుబట్టి వెళ్లాను. రోజూ ఎందుకు? అవిడని పని చేసుకోనీకుండా కాళ్లకడ్డంపడుతూ అంటోందండీ మాఅమ్మఅని కూడా చెప్పాను అత్తయ్యగారికి.
“నువ్వు నాకాళ్లకడ్డం పట్టంలేదని చెప్పు మీఅమ్మగారికి,” అన్నారు అత్తయ్యగారు ఎప్పటిలాగే నవ్వుతూ.
నేను మళ్లీ ఆమాట మోసుకొచ్చి మాఅమ్మకి చేరేసేను. మాఅమ్మ కూడా నవ్వుతూ, “ఆవిడకి ఆడపిల్లల్లేని ముచ్చట తీరిపోతున్నట్టుంది,” అంది.
అత్తయ్యగారికి ఒక కొడుకు. ఆఅబ్బాయి బెంగుళూరులో చదువుకుంటూ వుండేవాడు. అంచేత వాళ్లింట్లో నేను వాళ్ల అమ్మాయిలాగే మసలుతూంటేదాన్ని.
నాజీవితంలో నాకు తారసపడిన ఎంతోమందిని మరిచిపోయాను..ఎన్నో సంఘటనలు మర్చిపోయాను. ఉపాయాలతో, వాదనలతో బుద్ధులు మార్చేయగలమని నమ్మేరోజులు పోయేయి. నిజజీవితంలో నాఅనుభవంలో ఎవరూ “సరేనండీ, మీరు చెప్పారుకనక మారిపోతాను” అంటూ మంచివాళ్లయిపోయినవాళ్లు నాకు తటస్థపడలేదు. నేను రాసే కథలన్నీ సుఖాంతాలు కావు. కానీ, ఇప్పటికీ కథల్లో మంచివాళ్లబాధలు తొలిగిపోతేనూ, దుష్టులు శిష్టులు అయిపోతేనూ అదోరకం మనశ్శాంతి.
ఆరుదశాబ్దాల పూర్వం ప్రతిరోజూ, స్కూలయింతరవాత చల్లని సాయంకాలాలు, నాయీడు పిల్లలందరూ వీధుల్లో ఆడుకుంటుంటే, అత్తయ్యగారి వంటింటిలో కూర్చుని నేను విన్నకథలూ, ఆకథలు చెప్తూ నన్ను అలరించిన అత్తయ్యగారూ పదిలంగా సుస్థిరంగా నామనోఫలకంపై నిలిచివున్నారు ఈనాటికీను, జననాంతర సౌహృదాని అంటే ఇలాటివే అనిపిస్తుంది నాకు.

000

(జనవరి 2008)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

19 thoughts on “కథలఅత్తయ్యగారు”

 1. మాలతి గారూ..
  పొద్దు వారి పుణ్యమా అని ఇంత చక్కటి కథ చదివే అవకాశం కలిగింది 🙂
  ఎంత బావుందండీ మీ అత్తగారి జ్ఞాపకం..! నేనయితే మీ పదాలతో పాటుగా.. మీ బాల్యానికి ప్రయాణం చేసి వచ్చాను.
  చాలా హృద్యంగా.. మనసుకి హత్తుకొనేలా ఉంది. మీ ఈ కథ చదివిన స్ఫూర్తితో.. నా జ్ఞాపకాలకి కూడా ఎప్పుడో అక్షర రూపం కలిగించడానికి ప్రయత్నిస్తాను 😉

  మెచ్చుకోండి

 2. “అయితే మీరిలా కధలు రాయడానికి ఒక రకం గా వారు కారణమన్న మాట.”

  రాధిక గారూ, ఎంత మాత్రమూ కాదండీ.:)

  మాలతి గారిని ఈ కధ వ్రాయమని అడిగినమాట వాస్తవం. అంతవరకే నా పాత్ర. ఈ కధ కానీ,ఇతర కధలు గానీ మాలతి గారు పూర్తిగా ఆవిడ స్వయంస్ఫూర్తి తోటే వ్రాసారు.

  అయితే, ఆవిడ తో మా తెలుగు జ్యోతికి మరిన్ని కధలు వ్రాయించే ప్రణాళిక ,ప్రయత్నం జరుగుతున్నదని మాత్రం ఒప్పుకుని తీరాలి.:)

  వైదేహి శశిధర్

  మెచ్చుకోండి

 3. @ స్వాతీ, థాంక్స్. నిజమేలెండి. కాలం మారిపోతూంటే నాలాటివాళ్లే ఇలాటివి తల్చుకుంటారు
  @ రాధిక, కావచ్చు. 🙂
  @ వైదేహీ, వేరే ఏముంది చెప్పడానికి. :p.

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ,

  మీ టపా ఇప్పుడే చూసాను.ఈ కధ గురించి,ప్రేమ కధల గురించి,ప్రేమ రాహిత్యం గురించి,బహుధా విభిన్నమైన ప్రేమ స్వరూపం గురించి మీతో మాట్లాడటం/చర్చించడం మళ్ళీ జ్ఞాపకం చేసారు.

  ఇంత చక్కటి కధను అడిగిన వెంటనే ,నా మాట మన్నించి రాసిచ్చినందుకు మీకు మరలా కృతజ్ఞతలు/ధన్యవాదాలు ,సభాముఖంగా.(బ్లాగ్ముఖంగా అనాలేమో:)

  నాకు చాలా నచ్చిన కధ ఇది.చాలావరకు,మన రక్త సంబంధీకులతోనూ,జీవిత సహచరులు/భాగస్వాములతోనూ,ప్రాణస్నేహితులతోనూ మనకున్న అనుబంధాన్ని గురించి వ్యక్తీకరించటం సాధారణం.అయితే ఇవేమీ కాకపోయినా వాళ్ళ సహృదయత,స్నేహం ద్వారా మనకు సంతోషాన్ని,ఆహ్లాదాన్ని కలిగించే పరిచయస్తులు,ఇరుగు ,పొరుగు వ్యక్తులకు మనందరి జీవితాల్లో ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పకనే చెప్పిన కధ.

  సభాముఖంగా(బ్లాగ్ముఖంగా) నా ప్రస్తావన తెచ్చిన మీ సహృదయత కు,అభిమానానికి కృతజ్ఞతలు.

  వైదేహి శశిధర్

  మెచ్చుకోండి

 5. @Kameswara Rao
  చాలా సంతోషం. నేను కాళిదాసు చదివేనని చెప్పుకోడం ఇప్పుడు సిగ్గుచేటు. అంతా మర్చిపోయాను. దయచేసి కాస్త అర్థం కూడా చెప్పి పుణ్యం కట్టుకోండీ.

  @కొత్తపాళీ
  లేదులెండి. మీరు కథలబడి పెట్టి నారామేష్టారు అనిపించుకున్నారు. మీరు పొడిగిస్తే బాగుంటుంది. నేనెందుకు ఎగస్పార్టీ బడి పెట్టినట్టు కనిపించడం.

  అయినా ఈనాకథకి వచ్చినస్పందనకి పొంగిపోతున్నాను అని మాత్రం నిశ్చింతగా ఒప్పేసుకుంటాను.
  వైదేహీ, I owe you!
  m

  మెచ్చుకోండి

 6. ఈ “జననాంతర సౌహృదాని” పదబంధానికి ఆద్యుడు కవి కాళిదాసు. అద్భుతమైన ఆ శ్లోకం:

  రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్యశబ్దాన్
  పర్యుత్సుకీ భవతి యత్సుఖితోపి జంతుః
  తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం
  భావ స్థిరాణి జననాంతర సౌహృదాని.

  మెచ్చుకోండి

 7. Beautiful.

  మధ్యలో నా పేరు నంచుకోవడం యెందుకూ? ఆ ఎసైన్మెంటేదో మీరే ఇవ్వొచ్చు.
  మీ ఈ రచన చదువుతూంటే నేపథ్యంలో వేణువు మీద సింధుభైరవి రాగాలాపన .. జస్ట్ పర్ఫెక్ట్ 🙂

  మెచ్చుకోండి

 8. @నిషిగంధ గారూ, మీరు మీ సామ్రాజ్యంమామ్మగారిమీద కవిత రాయాలి.
  మీస్పందన నాకు సంతోషంగా వుంది.

  @థాంక్స్ చదువరిగారూ. పద్యం బాగుంది. లింకు కూడా చూస్తాను.

  మెచ్చుకోండి

 9. ఆ పద్యమిదండి..
  ఎందరు సత్కవుల్ మరియు నెందరు పండితు లీతడొక్కడే
  ఎందరికైన అందడని ఎంచెననామిక సార్థకంబుగా
  సుందర దృశ్యముల్ భ్రమర చుంబిత మాధురులొల్కు శబ్దముల్
  విందులు సేయువానికి కవీ, జననాంతర సౌహృదంబులై

  సాగరఘోష పద్యాలన్నిటినీ సుజనరంజనిలో నెల నెలా పెడుతూ ఉన్నారండి. ఈ లింకు చూడండి:
  http://sujanaranjani.siliconandhra.org/may2008/saagaraghosha.php

  మెచ్చుకోండి

 10. కధలత్తయ్య గారితొ మీ అనుబంధాన్ని చదువుతుంటే నాకు మా సందులోనే ఉండే సామ్రాజ్యం మామ్మ గుర్తొచ్చారు.. ఆవిడ మా అమ్మ కంటే ఐదారు సంవత్సరాలే పెద్దవారైనా ఎందుకో మామ్మగారనే పిలిచేదాన్ని.. మా అమ్మే అప్పుడప్పుడు తిట్టేది ఆ పిలుపేంటని.. రోజూ స్కూల్ నించి ఇంటికెళ్ళేప్పుడు అరుగు మీద కూర్చుని ‘పాఠాలన్నీ సరిగ్గా విన్నావా’ అనడిగేవారు.. ఒక్కోరోజు చేతిలో బాక్స్ పట్టుకుని కనిపించేవారు.. నన్ను చూడగానే ‘ఇదిగో స్వీట్ చేశాను, నీకిష్టంగా!’ అని ఇచ్చేవారు.
  మాలతిగారు, మీ జ్ఞాపకాలతో మళ్ళీ ఆవిడని గుర్తు చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 11. @సిరిసిరిమువ్వ గారూ – శ్రీపాదవారి కథ శీర్షక అది. చిన్నప్పుడు చదివినా ఆవాక్యం అలా మనసులో ముద్ర పడిపోయింది. ఇక్కడ వాడుకునేముందు తాడేపల్లివారిని అడిగినతరవాత నాకథలో వాడుకున్నాను. మీకు నచ్చినందుకు సంతోషం.
  @ సౌమ్య, థాంక్స్
  @ సుజాత, అవునండీ. మీక్కూడా తెలుసు కదా ఇక్కడ అమెరికాలో పిల్లలని ఎవరితోనూ మాటాడొద్దని ఎన్ని కట్టుదిట్టాలో. నాకు బాధగా వుంటుంది. ఈసందర్భంలో మరో ఉపకథ. నేను వాక్కెళ్లేదారిలో ఓచిన్నఅమ్మాయి, 6or 7, నన్ను ఆపి చిన్నపుస్తకంలో నాపేరు రాయమంది. నాకు ఆశ్చర్యంవేసి, ఏమిటి, స్కూల్ ప్రాజక్టా అని ఆడిగాను. లేదు, వూరికే అంది. సరే, నవ్వుకుంటూ నాపేరు రాసేను. తలెత్తి చూస్తే వాళ్ల అమ్మ గుమ్మందగ్గర వెనుదిరిగి లోపలికి వెళ్లిపోతూ కనిపించింది. అమెరికనులే. నాకు మాత్రం ఈసంఘటన చాలా తలుచుకుంటే సంతోషంగానే వుంటుంది.
  పిల్లలమీద మనం వేసే ముద్రలు జీవితకాలం వుండిపోతాయి. నిజమే.

  @చదువరి గారూ, నిజమేనండి. నాక్కూడా ఇలాటివి చాలా ఇష్టం. మౌఖికసాహిత్యం. నిజంగా సంస్కతీ, సాంప్రదాయాలూ తెలిసేది ఇలాటికథలవల్లే కదా. మీరు చెప్పినపాట నెట్లో ఎక్కడయినా దొరుకుతుందా.
  కొత్తపాళీ ఈవిషయంమీద మీఅందరిచేతా కథలు రాయిస్తే బాగుండు.

  అందరికీ నెనరులు.

  మెచ్చుకోండి

 12. మాలతి గారూ, మీ జ్ఞాపకాలు బాగున్నాయి. కథలకంటే నాకిలాంటి జ్ఞాపకాలే నచ్చుతాయి.
  @సిరిసిరిమువ్వ: “… విందులు సేయువానికి కవీ! జననాంతర సౌహృదంబుగన్” అంటూ సాగరఘోషలో గరికపాటి నరసింహారావు గారు రాసి, పాడారు. ఆయన పద్యగానం మనోహరం, మనోమోహకం – మాలతిగారి జ్ఞాపకాల లాగే!

  మెచ్చుకోండి

 13. మీ జ్ఞాపకాల్ని ఇలా మాతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని పదాలు భలే చక్కగా వాడతారు మీరు, ఉదాహరణకి-జననాంతర సౌహృదాని.

  “జననాంతర సౌహృదాని”- దీని గురించి ఎవరి బ్లాగులోనో చర్చ జరిగినట్లు గుర్తు.

  మెచ్చుకోండి

 14. Marvellous ! గొంతులో అడ్డం పడిన … తీయని బాధ! అంత కన్న ఏమి చెప్పలేను. నాకు అయిదో తరగతి లో పరిచయం అయి… ఆరో తరగతి లో చనిపోయిన ఒక స్నేహితురాలు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి నా హృదయానికి అంత దగ్గరగా వచ్చిందని ఆమె చనిపోయాక గానీ తెలియలేదు. పోయాక గానీ అమె పట్ల నేను ఎంత స్నేహంగా, ప్రేమగా ఉండాల్సిందో అని స్ప్రుహ రాలేదు. కానీ ఆమె జ్ఞాపకాలూ అస్పష్ట మైనవి అయినా.. మధురమే! ఆమె నాకొక విలువైన జ్ఞాపకమే! నన్ను ప్రత్యేకంగా ఎవరైనా మొదటి సారి చూసారూ అంటే.. తనే! అదీ ప్రేమే కదా.. మీ అత్తయ్యగారి ప్రేమ కూడా మీ జ్ఞాపకాల్లో ఎంత చక్కగా ఒదిగిపోయి.. హృదయం లో నాటుకుంది కదూ. అందుకే పిల్లలతో మనం జాగ్రత్త గా.. కరుణగా ఉండాలేమో! మన మీద వాళ్ళ impressions ఒక జీవిత కాలం ఉండిపోతాయి.

  మెచ్చుకోండి

 15. అలాంటి అత్తయ్య గార్లెవరూ ఇప్పటి పిల్లలకు లేరండీ! ఒకవేళ నేనే కథల అత్తయ్యగా మారదామనుకుంటే పిల్లల్ని ఎవరూ స్కూలవగానే ఇతర్ల ఇళ్లకు పంపరు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s