జీవాతువు

 

“అరుంధతి వెళ్ళిపోయింది.”

“పోయిందా?” అన్నాను తుళ్ళిపడి.

నాగమణి వెకిలిగా నవ్వింది. “హుమ్. వెళ్ళిపోయింది,” అంది.

ఎందుకు వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది?

నాగమణిని అడిగి లాభంలేదు. నాగమణి సరైన జవాబు చెప్పదు సరి కదా పైపెచ్చు అవాకులూ చెవాకులూ పేల్తుంది. నేను అడగను. కానీ నాగమణి ఊరుకోదు.

“అత్తాకోడళ్ళు పేచీ పడ్డార్ట.”

000

ఐదేళ్ళపాటు అత్తింటివారిని అడ్డాల్లో బిడ్డల్ని సాకినట్టు సాకిన అరుంధతి ఎక్కడికి ఎలా ఎందుకు వెళ్ళిపోయిందో నాకర్థం కాలేదు. ఒక నిర్దుష్టమైన సంస్కారాన్ని అలవరుచుకుని ఆచరణలో పెట్టి నలుగురిచేతా శభాషనిపించుకున్న అరుంధతి చవకబారు హోటల్లో సర్వరులా అత్తగారితో పేచీ పెడి వెళ్ళిపోయిందంటే … ఆమాట నాకర్థం కాలేదు.

“ఏమైనా బరువు మోస్తున్నట్టు నటించడం, కొమ్మెత్తేవేళకి భుజం తప్పించడం హుమ్ అదీ ఒక నేర్పే,” అంది నాగమణి.

నాగమణికి మహాభారతం చూపించి “ఏమిటిది?” అనడిగితే ఎర్రట్ట బౌండు బుక్కు అని చెప్పగలదు. కుడిచేతి రెండు వేళ్ళూ ఎడంచేతి రెండు వేళ్ళూ చూపించి “ఎన్ని?” అంటే “రెండు రెళ్ళు” అంటుంది. కాకపోతే “నీ రెండు చేతులకీ నాలుగు వేళ్ళున్నాయా?” అనడుగుతుంది. నాగులకి చెవుల్లేవని జనవాక్యం. నాగమణికి చెవులూ, బుర్రా కూడా లేవు.

గబ గబ నాపని ముగించుకుని వెయిటింగురూంకి వెళ్ళిపోయేను.

000

అరుంధతితో నాకు పరిచయం రెండేళ్ళకిందట అనుకుంటాను. ఒక గది అద్దెకి తీసుకుని చదువుకుంటూండేదాన్ని.

ఆవేళ ఆదివారం. ఎండ నిప్పులు చెరుగుతూంది. క్లాసుకి సంబంధించిన పుస్తకం ఒకటి పుచ్చుకుని మంచం, పక్కా అన్నీ ఏర్పాటు చేసుకుని పడుకున్నాను చదువుకుందాం అన్న సదభిప్రాయంతోనే. నిద్ర కాకపోయినా ఎండపొడకి కళ్ళు మూసుకుపోతున్నాయి నా ప్రమేయం లేకుండానే. ఇంటివారికోడలు పాపని పిలవడం వినిపిస్తూంది దూరంగా పారా హుషార్ అన్నట్టు.

“పాప మీఇంట్లో ఉందాండీ?” అంటూ చేరవేసిన తలుపు ఓరవొంపుగా తోసుకు తొంగిచూస్తూ ప్రశ్నించింది.

“లేదండీ,” అన్నాను మత్తుగా, మంచంమీంచి లేవకుండానే.

“ఇంతట్లోకే ఎక్కడికి వెళ్ళిపోయిందో,” అన్న మాటలు నేపథ్యంలో లీలగా వినిపించి అంతమైపోయేయి.

మళ్ళీ “పాపా, … పాపా …” అంటూ మూడో నాలుగో ప్రసారాలూ ఆవిడ ఇంకెవరితోనో ఏదో అన్నట్టు ఇంకో కొత్త స్వరమూ ..

“క్షమించండి. పాప మీగదిలోకి రావడం నేను చూసేను.”

తుళ్ళిపడి లేస్తూ, “ఫరవాలేదులేండి, రండి,” అన్నాను.

అరక్షణంసేపు – నిద్ర తూలగొడుతూంది. గుమ్మంలో నిలబడిన వ్యక్తి నిద్రమత్తు తేలగొడుతూంది. లేత ఊదారంగు వాయిల్ చీరా, మంకెనపువ్వురంగు జాకట్టూ, మొహంలో స్నిగ్ధఛాయలూ .. ఎక్కడ చూసేనో? చూసేననుకుంటున్నానో?

“మంచి నిద్ర చెడగొట్టినట్టున్నాను,” ఆ స్వరంలో క్షమాపణలు ధ్వనించేయి.

“ఆఁ, లేదండీ,” అని లోపలికి రమ్మని, “పాప లోపలికి రాడం నేను చూడలేదండీ,” అన్నాను మొదటి ప్రశ్నకి సమాధానంగా. అంటూ మంచం దిగి చుట్టూ చూసేను.

“భయపడఖ్ఖర్లేదని మీరు చెప్పండి,” అందావిడ నామంచంకిందకి సౌంజ్ఞ చేసి చూపిస్తూ.

అటు చూసేను. మంచంకిందనించి కవటాకుల్లాటి చిన్నిపాదాలు రెండు దర్శనమిచ్చిందాకా నాకు బోధపడలేదు ఆవిడమాటలు. నవ్వుతూ ఆ రెండు పాదాలూ పుచ్చుకు మెల్లిగా లాగేను. నావెనక ఎవరున్నారో పాప చూడలేదు.

“స్, స్. ప్రైవేటు మేష్టరు,” అంది పాప లక్కపిడతలాటి నోటిమీద మావిడిచివుళ్ళలాటి వేళ్ళు కదిలిస్తూ.

“ఏమిటీ?”

“ప్రైవేటు చెపుతుందిట,” క్లాక్ టవరుమీంచి దూకుతుందిట అన్నంత బెదురుతో.

“నాక్కూడానా?”

పాప నావేపు అయోమయంగా చూసింది.

“చదువుకోకపోతే ఎలా?” అంది పాపతల్లి కఠినంగా.

“ప్రైవేటు నాకు చెప్పండి. పాపకఖ్ఖర్లేదు,” అన్నాను పాపవేపూ ఆ ప్రైవేటు మేష్టరువేపూ చూస్తూ. తీరా అనేసింతరవాత ఎందుకలా అన్నానా అనిపించింది.

“నేను ప్రైవేటు చెప్పను,” అందావిడ. అసలు ఉన్న “మిస్ఛిఫ్” అంతా ఆ పదంలోనే ఉంది. అది ఆవిడ గ్రహించింది.

“చెప్తావు,” అంది పాప పొడిచేసేలా చూస్తూ.

“చెప్తారు,” అనాలి అంది పాపతల్లి పాపతలమీద ఓ చిన్న మొట్టికాయ వేసి.

పాప బుంగమూతి పెట్టుకు నిలబడింది.

గురుత్వం వహించను వచ్చిన ఆ మానవురాలు “వస్తానండీ” అంది వెనుదిరగబోతూ.

“సర్లెండి. తరవాత చూద్దాం,” అంది పాపతల్లి.

ఆవిడ నాదగ్గర కూడా శలవు తీసుకుని వెళ్ళిపోయింది.

“అంటీ ముట్టనట్టు అలా దూరంగా నిలబడితే ఇవాళ కాదు రేపైనా దీన్నెలా దారికి తీసుకొస్తుంది? పాఠాలెలా చెప్తుంది?” అంది పాపతల్లి చేతులూ కళ్ళూ తిప్పుతూ.

“ఆవిడే చెప్తుంది, పాపే వింటుందిలెండి,” అన్నాను.

మర్నాడు నేను కాలేజీనించి వచ్చేసరికి ఎదురుగుండా సోఫాలో పాపా, వాళ్ళ ప్రైవేటు మేష్టరూ కనిపించేరు ముందుగదిలో. ఆవిడ నన్ను చూసి మందహాసం చేసింది. అంతే.

ఆవిడపేరూ, వివరాలూ కనుక్కోడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. కానీ పాప మటుకు ఆవిడంటే ఊః ఇదయిపోయేది. ప్రైవేటు మొదలు పెట్టి మూణ్ణెల్లయినా అయిందో లేదో పాపవాళ్ళ నాన్నకి బదిలీ అయిపోయింది. అరుంధతి అదే పాప ప్రైవేటు మేష్టరు చాలా విచారించింది.

ఆ తరవాత పదిహేను రోజులనాడు హఠాత్తుగా మళ్ళీ అరుంధతి ప్రత్యక్షమయేసరికి ఆశ్చర్యపోయేను.

“పాప బాగా అలవాటయిపోయందండీ. సాయంత్రాలు ఏమీ తోచడంలేదు,” అంది గుమ్మంలో నిలబడి.

“నిజమేనండీ. రండి,” అన్నాను లోపలికి ఆహ్వానిస్తూ.

రెండు, మూడు రోజుల్లో పాప పుట్టినరోజు వస్తోందిట. నాకు తెలీనే తెలీదు. ఎడ్రెస్ ఇస్తే తను ఎంబ్రాయిడరీ చేసిన గౌను పాపకి పంపిస్తుందిట.

గౌను చూపించింది నాకు. మంచి పనివాడితనం ఉంది అందులో ఏదో మొక్కుబడికోసం చేసినట్టు కాక. ఒకవేళ ఆ కమనీయ కళాఖండం వెనక ఏదైనా కన్నీటిగాథ దాగిఉందేమో – అనుంగు చెల్లి, అలవాటైన అన్నకూతురూ … ఇంకెవరైనా … నా ఆలోచనకి నాకే చిరాకేసింది.

“పంపించండి,” అన్నాను గౌను తిరిగి ఇచ్చేస్తూ. అప్పుడడిగేను అరుంధతిని, “మీరేం చేస్తున్నార”ని.

ఇంటర్మీడియట్ పాసయి సెకండరీ గ్రేడ్ ట్రైనింగయిందిట. ఉద్యోగంకోసం చూస్తోంది. “నేను బి.యే.కి కడతానండీ,” అంది నాపుస్తకాలు ఒకొకటే తీసి చూస్తూ.

“మంచిదే. అయం ముహూర్తో సుముహూర్తోస్తు.”

“మీరు నాకు సాయం చేస్తారా?”

“సాయమా?”

“ఏం?”

“ఏం ఏమిటండీ? నాదే ముప్ఫైతొమ్మిది పర్సెంటు నాలెడ్జి. పరీక్ష గట్టెక్కుతుందో చెట్టెక్కుతుందో అని నేన్చూస్తున్నాను. నేను మీకు చెయ్యగల సాయం నోరు మూసుక్కూచోడమే.”

“నేను హాస్యానికనడంలేదు. మీ చదువు అయిపోగానే మీ నోట్సు మరెవరికీ ఇవ్వకండి,” అంది సీరియస్‌గా.

“ఇచ్చినా పుచ్చుకునేవాళ్ళు తరవాత తిట్టుకుంటారు. అంతకంటే ముందుమాట నాచదువు అయిపోవాలంటే యూనివర్సిటీవాళ్ళు బి.ఎ. ఎత్తేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎత్తేసి కొందరి చదువులు పూర్తి చేసేసినట్టుగానే.”

అరుంధతి నవ్వుతూ “భలేవారండీ మీరు,” అనేసి వెళ్ళిపోయింది. పైచదువులు చదివించనూ లేక, పెళ్ళీ చెయ్యలేక తల్లిదండ్రులు ట్రైనింగుకి పంపించేరు కాబోలు అనుకున్నాను. పెద్ద కుటుంబం కాబోలు. అదే నిజమైతే ఇంకా బి.ఎ.కి కట్టి, బి.ఇడికి కట్టి … ఎప్పుడు అవుతాయి ఇవన్నీ. వెనకవాళ్ళని ఉద్ధరించేదెప్పుడు? మనిషి కూడా ఖర్చుదారులా కనిపిస్తోంది.

అరుంధతి విషయంలో నేను ఒక నిర్ణయానికి రాకుండానే తెల్లారిపోయింది. పుస్తకాలవిషయంలో మాత్రం ఒక నిర్ణయానికొచ్చేను. చేతిలో డబ్బు చీరెలమీద పెట్టి, పుస్తకాలు ఎరువు అడిగేవాళ్ళంటే నాకు భయం. అలాటి అప్పులు ఇచ్చినవాళ్ళకే కానీ పుచ్చుకున్నవాళ్ళకి జ్ఞాపకం ఉండవు.

అరుంధతి బి.ఎ. చదివే ఉద్దేశం ఇనప్పెట్టెలో పెట్టి, మునిసిపల్ గర్ల్స్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచరుగా చేరిందని తెలిసినప్పుడు మాత్రం మనసులో ఏమూలో కలుక్కుమంది.

“అందరిలాగే మీరు ఆశ్చర్యపోతున్నారా?” అంది ఓరోజు స్కూలికి నడిచివెళ్ళే వెళ్ళేవిషయమై.

“ఆశ్చర్యం కాదు కానీ ..,” అన్నాను నసుగుతూ.

“మా నాన్నగారు బరంపురంనించీ కాకినాడ నడిచి వెళ్ళేరంటే నేను నమ్మేను. నేను ఇక్కడ్నించి స్కూలికి నడిచి వెళ్తున్నానంటే ఆశ్చర్యపోయేవాళ్ళూ, ముక్కున వేలేసుకునేవాళ్ళూ, మూర్ఛ పోయేవాళ్ళూనూ,” అంది తను.

తను చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు. బస్సుకోసం పడిగాపులు పడే టైములో, బస్సులో చోటుకోసం పడే యాతనలో, కాలేజీ అప్ లో బస్సు చేసే రొదతో అనుభవించే బాధలో నూరోవంతు ఉండదు నడిచివెళ్ళడంలో. అయినా అదేమిటో నడక అనగానే ఏమిటోగా ఉంటుంది.

“ఏమోలెద్దురూ. ఎవరేం అనుకున్నా నాకు మాత్రం నడవడమే హాయిగా ఉంది.”

నిజమేనేమో. పొద్దున్న తొమ్మిదిగంటలకి చేసిన భోజనం, పగలల్లా క్లాసులూ, మళ్ళీ దాదాపు మూడు మైళ్ళు నడిచిన అరుంధతి వసి వాడలేదంటే తనకి హాయిగా ఉండే ఉండాలి.

“వస్తానండీ,” అంది లేచి నలబడి.

“కూచుందురూ, వెళ్ళొచ్చు. తొందరేమిటి?” అన్నాను చేయి పుచ్చుకు ఆపడానికి ప్రయత్నస్తూ.

“లేదండీ. ఆరున్నర అయేసరికి మా అత్తగారికి ఫలహారం అయిపోవాలి.”

“అత్తగారా!?” అనేసి చప్పున నాలుక్కరుచుకున్నాను. అప్పటివరకూ తన మెడవేపు పరీక్షగా చూడలేదు నేను.

నామొహంలో ఏమిటి తనకి నవ్వు తెప్పించిందో చెప్పలేను కానీ, “ఒకళ్ళు కాదు, ఇద్దరూ,” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది అరుంధతి.

000

అరుంధతి వెళ్ళిపోయింది. అరుంధతిని పెళ్ళి చేసుకున్న ఆ పురుషపుంగవుడు రెండు యమ్మే డిగ్రీలూ, ఒక లా డిగ్రీ తెచ్చుకున్న బృహస్పతి. అతనికి కన్నతల్లి కాక మరొక పెంపుడుతల్లి, ఇతగాడిని పెంచుకున్న తల్లి, ఉంది. కన్నతల్లికి ఈ బుద్ధిమంతుడు కాక ఇద్దరు కూతుళ్లూ, ఇద్దరు మొగపిల్లలూ ఉన్నారు. అరుంధతి పెళ్ళినాటికి ఇంటర్మీడియట్ పాసయింది. పెళ్ళయిన మూడోనెలనించీ అతను ఒకటే గొడవ “నువ్వు ట్రైనింగ్ చెయ్యకూడదా?” అంటూ.

“ఆమాటల్లో ఆంతర్యం నాకు అప్పట్లో తెలీనేలేదు,” అంది అరుంధతి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.

అరుంధతి ట్రైనింగయిన వారంనాడు తననీ ఇద్దరు తల్లులసంపదనీ భరించవలసిన మగాడు పరారీ!

అరుంధతి నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది.

“జరిగినసంగతేమిటో నీకు తెలీకుండా ఉంటుందా? నిజం చెప్పు,” అని ఆవిడనే నిలవేసేరు అత్తగారూ, ఆడబడుచూను. పెంపుడుతల్లి కూడా ఆమాటే అంది.

ఆ పరిస్థితుల్లో తాను చేయగలిగిందేమీ లేదు. పోనీ పోదాం అంటే అరుంధతికి పుట్టిల్లంటూ ఏమీ లేదు. తల్లి లేదు. తండ్రికి ఇవన్నీ అనవసరమైన అనుబంధాలుగా తోచేయి. పినతల్లీ, పినతండ్రీ అరుంధతికి కన్నెచెర విడిపించి చేతులు కడుక్కున్నారు. ఇహ ఏదో ఉద్యోగం చేసి వచ్చిన నాలుగురాళ్ళతోనూ అత్తా, ఆడబడుచులమధ్య కాలం గడుపుకోడమే మిగిలింది.

“నలుగురు పిల్లలకి ప్రైవేట్లు చెబుదాం అనుకుంటున్నాను,” అని అరుంధతి అన్నప్పుడు నాకేమనాలో తెలీలేదు. ఈ ఆరునెలల్లోనూ తోటకూర కాడలా వాడిపోయింది. అవ్యాక్తానందంతో మెరిసే కళ్లు ఆర్ద్రంగా తిరిగేయి. స్నిగ్ధసౌరభాలను వెదజల్లే పెదవులు పుచ్చిన చిక్కుడుకాయలా ముడుచుకుపోయాయి.

“సాయంత్రం వేళల్లోనూ, మధ్యాహ్నం ఒంటిగంటా రెండుగంటలమధ్యా వీలుంటుంది,” అంది తనే మళ్ళీ.

రూపాయి, రూపాయికీ రక్తపుబొట్టు రాలుస్తున్నది. మొదటికే మోసం రావచ్చు అనుకున్నా నాలో నేను. “ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. మీరు పడుకుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరెవ్వరూ లెఖ్ఖకి చాలామందే ఉన్నా,” అన్నాను.

“అలా ఆలోచిస్తే అందరం పడుకోవాల్సొస్తుంది అనతికాలంలోనే,” అంది అరుంధతి నవ్వుతూ. ఆ నవ్వులో మునపటి జీవం లేదు.

అవును. తను తెచ్చే నెలసరి ఆదాయం బియ్యపుబస్తాకి సరిపోతుంది. “మధ్యతరగతి బడ్జెట్, ఒక కుటుంబంలో ఒక భర్తా, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం,” అంటూ వేసే ఊహాలోకపు బడ్జెట్ కుదరదిక్కడ. ఆ ఇంట్లో ఖచ్చితంగా నలుగురు పెద్దవాళ్ళూ, ముప్పొద్దులా మూడు కంచాలు చెల్లించే ఇద్దరు పిల్లలూ ఉన్నారు. అందరికీ అన్నీ కావాలి. అసలత్తగారికి పొద్దున్నే ఫలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కాఫీ కావాలి. పెంపుడత్తగారికి తొమ్మిదికల్లా భోజనం, మధ్యాహ్నం టీ, రాత్రి చపాతీలు కావాలి. పెద్దాడబడుచు నియమనిష్ఠతలో తనపాట్లు తనే పడుతుంది. చిన్నాబడుచు స్కూలికెళ్తుంది కాలక్షేపానికి. మొగపిల్లలిద్దరిదీ – చద్దన్నం తింటాను, వేడన్నం తింటాను, మామగారితో మళ్ళీ తింటాను అన్న తంతు.

“వీళ్ళందరితో ఎలా నెగ్గుకొస్తున్నారు?” అని నేనంటే,

“పోనిద్దురూ. ఎలా ఉన్నా రోజు గడిచిపోతుంది కదా,” అంది అరుంధతి తేలిగ్గా.

ఎలా ఉన్నా రోజులు గడిచిపోతాయా?

ఆ తరవాత నెలా, నెలాపదిహేనురోజులపాటు అరుంధతి కనిపించలేదు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయన్న హడావుడిలో నేనూ అంతగా పట్టించుకోలేదు తన విషయం.

000

చలేస్తోందని కిటికీ తలుపులూ, వీధి తలుపూ బంధించేసుకుని కూర్చున్నా. 1868 కన్వెన్షనూ, సూయజ్ కైసిసూ, … ఏమిటో వెధవ గొడవలు. ఒకడు ఒక తెలివితక్కువ పని చెయ్యడం, మరొకడు మరొక తెలివైన పని చెయ్యడం, తన్నుకోడం, కొట్టుకోడం, వాటికి కారణాలేమిటీ అంటూ ఈ లెక్చరర్లు మమ్మల్ని చంపుకుతినడం …

ఎవరో తలుపు తట్టినట్టనిపించి, ఖేడివ్ ఇస్మయిల్‌ని అప్పుల్లో వదిలేసి లేచి తలుపు తీసేను.

అరుంధతి!

“ఇంత రాత్రప్పుడు … ఇలా ..” అన్నాను ఆశ్చర్యపోతూ. అప్పుడు టైము ఐదు నిముషాలు తక్కువ తొమ్మిది.

“ఒక యాభై రూపాయలుంటే సర్దగలరేమోనని వచ్చేను,” అంది సూటిగా చూస్తూ.

ఆమాట నాకు అర్థం కావడానికి ఐదు నిముషాలు పట్టింది. “పెట్టెలో బట్టలు సర్దుకోడమే రాదు నాకు,” అన్నాను నవ్వుతూ.

“నేనూ అదే అనుకున్నాను,” అంది తను చప్పున.

ఇంతవరకూ అక్కడ సీరియస్నేస్ లేదనే అనుకుంటున్నాన్నేను. “ఎక్కడినించి వస్తున్నారు? ఏమిటి కథ?” అన్నాను.

తను మహిళామండలి సెక్రటరీగారింట్లో ఇద్దరు పిల్లలకి ట్యూషను చెప్పి వస్తూందిట. రోజూ పొద్దున్నే ఇద్దరు పిల్లలు ఏడునించి ఎనిమిదివరకూ ఇంటికొచ్చి పాఠాలు చెప్పించుకు పోతారు. వాళ్ళకి పాఠాలు చెప్తూ వంట చేసుకుంటుంది. తొమ్మిదిన్నర ప్రాంతాల్లో ఓపినంతమటుకు ఫలహారాలవాళ్ళకి ఫలహారాలూ, భోజనాలవాళ్ళకి భోజనాలూ సిద్ధపరచి, తనూ రెండు మెతుకులు కతికి స్కూలికి వెళ్తుంది. మధ్యాహ్నానికి ఇంటినించే ప్లాస్కులో కాఫీ తీసుకెళ్తుంది. మళ్లీ సాయంత్రం ఓ గంటసేపు మహిళలకి జాకట్లు కత్తిరింపులు నేర్పుతుంది. ఇంటికెళ్ళి వంటా వార్పూ చూసుకోడం, మళ్ళీ ఏడున్నరకి ఇంటినించీ ఎనిమిదిన్నరవరకూ సెకండు ఫారం చదివే ఇద్దరు పిల్లలకి ట్యూషను. ఇవి రెండూ కమిషనరు అనుమతి తీసుకు చెప్తున్నవి. పొద్దున్న చెప్తున్నవి రహస్యం.

అరుంధతి ఆ ఇంట్లో ఏ స్వర్గసుఖాలు చవి చూస్తోందో? “ఎందుకింత తాపత్రయం మీకు?” అనడిగేను. నూరేళ్ళజీవితం ముఫ్ఫై యేళ్ళలో ముగించుకుంటే ఒరిగేదేమిటి? ఎవర్ని మెప్పించడానికి?

“ప్చ్,” అంది. మళ్ళీ నావేపు ఒక చూపు చూసి, “చూద్దాం,” అంది. ఆ చూపు ఎలాటిదో చెప్పలేక “ఒక చూపు” అన్నాను.

“మా చిన్నాడబడుచు పుట్టినరోజు వచ్చే శుక్రవారంనాడు. చీరెలూ, సారెలూ తక్కువయితే వీల్లేదు నాలుగు వేళ్ళూ నోట్లోకి పోకపోయినా,” అంది అరుంధతి వెలితిగా నవ్వి.

“ఏం మాటలండీ,” అన్నాను. అంతకన్నా ఏమనను? పరీక్ష ఫీజుకని దాచిన మొత్తంలోంచి ఐదు పదులు తీసి అరుంధతి చేతిలో పెడుతుంటే తన వదనం కృతజ్ఞతతో జ్వాజ్యల్యమానమయింది. చూడనట్టు నటించేను.

“ఈ డబ్బు నేను మీకు తిరిగి ఇవ్వలేకపోతేనో?” అంది సహం బాధగా, సగం వేళాకోళంగా.

“శిక్ష పడుతుంది.”

“ఏమిటా శిక్ష?”

“ఏముందీ… మీ ప్రియబంధువులతో ఎడబాటూ, ఈగదిలో కారాగారమూను.”

“మంచివారు కదూ. ఆమాట ముందే చెప్తే మరో పాతిక పుచ్చుకుందును.”

“ముందు మీరు అప్పు తీర్చనని ప్రకటించాలి కదా,” అన్న నామాటలు గాల్లో కలిసిపోయేయి.

000

అరుంధతి చిన్నాడబడుచు పుట్టినరోజు వేడుక ఎంత ఘనంగా జరుగుతుందో ఊహించుకుంటూ ఆ రాత్రంతా గడిపేను. మర్నాడు అరుంధతి కొత్త చీరె తెచ్చి చూపిస్తుందనీ, లేకపోతే పుట్టినరోజు మహోత్సవం చూడ్డానికి నన్ను పిలుస్తుందనీ అనుకున్న నాఆశలు వమ్ము అయేయి. ఎలా చూసినా ఈపని సమర్థనీయంగా లేదు. ఒకవేళ తనకి ఒంట్లో బాగులేదేమో! ఆదివారం వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాను.

000

శనివారం పొద్దున్న నాగమణి చెప్పిన వార్త ఇదీ – ఆరుంధతి వెళ్ళిపోయింది – కర్పూరం హరించిపోయినట్టు.

నేనిచ్చిన యాభై రూపాయలు జ్ఞాపకం వచ్చేయి. వెంటనే అలాటి ఆలోచన వచ్చినందుకు నన్ను నేనే చీవాట్లు వేసుకున్నాను. అయితే అరుంధతి ఎందుకు వెళ్ళిపోయినట్టు?

సాయంత్రం కిటికీదగ్గర కూచుని సన్నజాజి పూలు మాల కట్టుకుంటుంటే మగపిల్లలిద్దరూ కనిపించేరు. పిలిచేను ఒకమారు ఇటు రమ్మని. పెద్దవాడు ఒకడుగు ముందుకి వేసేడు. చిన్నవాడు అన్నగారి చెయ్యి పుచ్చుకు వెనక్కి లాగేడు.

గూట్లోంచి బిస్కెట్ పొట్లాం తీసి, “ఇదుగో, మీ వదిన ఇవ్వమంది,” అన్నాను.

ఇద్దరికళ్ళూ ఆశగా మెరిసేయి. ఇందుకే అమాయకత్వం చూస్తే నాకు జాలేస్తుంది. ఆ పిల్లలిద్దరూ అంగుళం, సెంటిమీటరు చొప్పున జరుగుతూ నాకు గజం దూరం వచ్చేసరికి అరగంట పట్టింది.

“మీవదిన ఎప్పుడు వస్తుంది?”

“ఇంక రాదు.”

“ఎందుకు వెళ్ళిపోయిందీ?”

“ఏమో.”

అంతకంటే ఏమీ తెలుసుకోలేకపోయేను.

కానీ ఇలాటివిషయాలు దాచినా దాగవు.

“అబ్బో అదెక్కడ? రాత్రీ పొగలూ ఆ తిరగడాలూ అదీను … అప్పుడే అనుకున్నాను,” అన్నారొకరు.

“బావుంది. ఛస్తుందేమిటి మరి. మంచిపనే చేసింది,” అన్నారు మరొకరు.

నలుగురూ నానారకాల వ్యాఖ్యానాలూ చేసేరు.

ఆఖరికి తేలిందిది –

సాధారణంగా ఆఇంట్లో అరుంధతిమాట సాగదు. అసలు నిజం చెప్పాలంటే ఏ ఒక్కరిమాటా సాగదు. అలా తలో పెద్దా దండనాయకుడే అంటే అరుంధతికి నచ్చదు. అయినా చేసేదేం లేదని ఊరుకుంటూ వచ్చింది “ఎలా ఉన్నా గడిచిపోతుంది” అన్న నమ్మకంతో. కానీ రోజులు అంత తేలిగ్గా సాగలేదు. స్కూలికి వెళ్తున్న చిన్నమ్మాయి ఇంట్లో చెప్పకుండా సినిమాలకెళ్ళడం మొదలెట్టింది. ఇంట్లో డబ్బు మాయమవుతోంది.

ఆ సంగతి అరుంధతి గ్రహించి నీతులు బోధించబోయింది. దాంతో ఆ పిల్లకి ఒళ్ళు మండింది.

“నాయిష్టం. నీకెందుకూ?” అంది ఆ అమ్మాయి.

అరుంధతి నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది.

“దానివిషయంలో నువ్వెందుకు జోక్యం కలగజేసుకోడం?” అంది అత్తగారు సమరసభావంతో.

“అయినా ఈరోజుల్లో ఎవరంతటివాళ్ళు వాళ్ళు. పిల్లని తల్లి అంటేనే పడదు. పనిమనిషివంటిది మాట అంటే తోముతున్న గిన్నె అక్కడే పారేసి పోతుంది. అలాటిది కాన్డబ్బు ఇస్తున్నానని స్వవిషయాల్లో జోక్యం చేసుకుంటే వినేదెవరు?” అంది పెంపుడు అత్తగారు.

“చిన్నదాన్ని. కోపం వద్దు వదినా. రోజులలా ఉన్నాయి. ప్రతి మనిషికీ తనమీద తన తెలివితేటలమీద ఉన్న నమ్మకం మితి మీరిపోయింది. ఇతరుల అనుభవాలనించీ నేర్చుకుందాం అన్న ఆలోచన ఉన్నవాడు వెర్రివాడు. అది అడిగిన రెండువేలూ తెచ్చి ఇచ్చీ. అవి అయిపోగానే దానికే బుద్ధి వస్తుంది. అక్కడికది చవకే కదూ,” అంది దైవ చింతనలో మునిగిన పెద్దావిడ.

రోజులలా ఉంటే తనెందుకు ఇలా ఉండాలో అరుంధతికి అర్థం కాలేదు. “నా డబ్బు పనికొచ్చి నామాట పనికిరాకపోతే నేనిక్కడ ఉండడం అనవసరం,” అంది అరుంధతి.

అరుంధతి వెళ్ళిపోయింది.

000

రెండేళ్ళనాడు ఇరవై పోస్టుముద్రలతో ఒక కవరు వచ్చింది నాకు. ఆ ముద్రలమధ్యనించి ఆ ఎడ్రెసు రాసిన కలం పోల్చుకోడం కష్టమే అయింది నాకు. అది అరుంధతిది.

“జరిగిన సంగతి మీరు వినే ఉంటారు. నేను చేసింది సరైనదవునో? కాదో? ఆ క్షణంలో ఆవేశంతో అక్కణ్ణుంచీ వచ్చేసేను. ఒక చిత్రమైన సంఘటనవల్ల ‘మా ఆయన’ని కలుసుకున్నాను. దైవోపహతురాలిని. పులుదోముపుల్లకోసం వేపచెట్టెక్కితే సంజీవకరణి దొరికిందన్న ఆశ ఆశగానే మిగిలిపోయింది, మాలతీ! ఇద్దరు పిల్లల్నీ నాచేతిలో పెట్టి ఆయన పోయేరు. పెంచుతున్నాను వీళ్ళని.”

వీళ్ళింక పెరిగి పెద్దవాళ్ళయి తనని ఉద్ధరిస్తారని అరుంధతి ఆశ పడుతోందని నేననుకోను. అప్రయత్నంగా ఎక్కడో చదివిన పద్యం జ్ఞాపకం వచ్చింది.

“నీచేతను, నాచేతను, వరమడిగిన కుంతిచేతను, వాసవుచేతను, ధరచేతను, భార్గవుచేతను” – ఆరుగురిచేత వంచింపబడ్డాడు మహారథి కర్ణుడు. అయితే ఏం? ఆఖరిక్షణంవరకూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు.

అరుంధతి జీవిస్తూనే ఉంది.

000

(ఆంధ్ర సచిత్ర వారపత్రిక, 11 జనవరి 1961లో ప్రచురితం.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “జీవాతువు”

 1. @పద్మ, చాలాసంతోషం అండీ మీకథ నచ్చినందుకు. మీకు ధన్యవాదాలు చెప్పాననే అనుకున్నాను. మరో వ్యాఖ్య చూసేవరకూ. చూడలేదు. క్షమించగలరు. – మాలతి.
  @లలిత, జీవితాన్ని కాచి వడబోసేనని ఇప్పటికీ అనుకోలేనండీ. కానీ, మీకు ఆభావం కలిగించగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. – మాలతి

  మెచ్చుకోండి

 2. ఎంతమంది అన్నా ఒప్పుకోబుద్ధి అయ్యేది కాదు, మీరు జీవితాన్ని కాచి వడబోసి రాశారు కథలు అంటే.
  మీరు కల్పించిన కథని, కథలో మీరు దూరకుండా చెప్పినట్లనిపించేది.
  అలవోకగా వ్యక్తపరిచినట్లనిపించేది. ఈ మాటలు in a good sense అంటున్నాను.
  ఈ కథ చదివి మాత్రం, ఇందులోనూ మీరేమీ కథలో దూరినట్లనిపించి కాదు కానీ, ఎందుకో మీరు బాగా involve అయినట్లూ, చెప్పాలనిపించి చెప్పిన కథలా అనిపించింది.
  పాత్ర బలమైనదే ఐనా, కొన్ని వేరే కథలలో లాగా ముగింపు మరీ విషాదం కాక పోయినా, చివరి దాకా చదివాక దాదాపు కంటతడి పెట్టించిన కథ, ముఖ్యంగా మీ కథలలో, ఇది ఒకటే ఇంతవరకూ.

  మెచ్చుకోండి

 3. ఆపకుండా ఏకబిగిన చదివించారండీ. నాకెందుకో మా ఇంట్లో చిన్నప్పుడు చదివిన వనితలో కథలు గుర్తొచ్చాయి. వనిత మొట్టమొదటి భాగం నించి ఉన్నాయి మా ఇంట్లో. తోచనప్పుడల్లా తీసి చదివేదాన్ని. ఆ తరం కథలంటే నాకు చాలా ఇష్టం. ఆ కథలు ఎక్కడినుంచో అన్నట్టు ఉండేవి కాదు. జీవితాలని స్పృశిస్తూ ఉండేవి. అంతర్లీనంగా నీతి బోధిస్తూ చాలా బావుండేవి. మళ్ళీ ఆ కాలం కథ చదివాననిపించింది. థాంక్స్ అండి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s