ఊసుపోక – అప్పులూ ఆప్తులూ

 హలో అంటే ఐదూ,హలో కులాసా అంటే పదీ, .. అఋణ, కఋణ .. లాటి వాక్య మరియు పదవిన్నాణంతో ముళ్లపూడి వెంకటరమణగారు ఋణాలనందలహరి అనబడే ఋణవేదం రాసి తెలుగుపాఠకలోకాన్ని శాశ్వతంగా తమకి ఋణగ్రస్తుల్ని చేసేసుకున్నారు.

 మరింక ఆ అప్పులగురించి మనం రాయలేం. ఆఋయోజనాలదూరంనుండి కూడా ఆయనవేపు కన్నెత్తి చూడలేం.

 డబ్బుమాట వచ్చింది కనక చెప్తున్నా. సుమతీశతకం రాసినాయన అప్పిచ్చువాడు, వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు ఏరును చొప్పడిన వూరులోనే వుండమన్నాడు. కానీ అమెరికాలో అలా మనం అప్పిచ్చేవాళ్లని వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు.

 అమెరికాలో కూడా వెంకటరమణగారు చెప్పినట్టే హలో కులాసేయేనా (How’re you today?) అనే మొదలు పెడతారు. కానీ ఆతరవాత మాత్రం పద్ధతిలో తేడా వుంది. ఋణదాతలు వాళ్లకి వాళ్లే మనని వెతుక్కుంటూ వచ్చి, ఉచ్చుకోండి, ఉచ్చుకోండంటూ అమ్మా, బాబూ అంటూ బతిమాలి, అవసరమయితే కాళ్లో గడ్డమో పట్టుకుని, మరీ అప్పులిచ్చేసి కానలేని ఉచ్చులు తగిలించేస్తారు.. మనం ముచ్చటపడి పుచ్చేసుకుంటాం.

 ప్రారంభదశలో రెండువేలు లిమిటు పెడతారు. మనం ఆతీరం చేరకముందే, అయ్యో మొహమాట పడకండి, మీ అప్పు పరిమితి ఐదువేలకి పెంచేస్తాం అంటారు ఎంతో పెద్దమనసుతో వెనకటిరోజుల్లో చూడండి భోజనాలదగ్గర ఒక్కటేస్తాను బాబూ”, “మరో రెండు వేస్తానమ్మాఅంటూ వడ్డించేసేవారు అలాగన్నమాట. అలా ఇచ్చేవాళ్లు అమితోత్సాహంతో ఇచ్చేస్తుంటే మనం అబ్భ మనస్థాయి ఎంత వేగంగా పెరిగిపోతోందో అనుకుంటూ ఉప్పొంగిపోతాం.

 ఆతరవాత దాతలు వడ్డీలకి వడ్డీలు కడతారు. అట్టి శుభసమయంలో మనకి ఏఋణగుణద్వనులూ వినిపించవు. … ఇంకా కొంతకాలం అయేక, కొంపలు ములిగేసమయం ఆసన్నంఅయేక చెప్తారు చల్లగా మీకొంప ముంచేస్తున్నామోచ్ అని. సూక్ష్మంగా ఇదీ అమెరికాలో అతిముఖ్యమైన ఆర్థికసూత్రం.

 ఇంతకీ నేను ఇక్కడ చెప్పేది డబ్బప్పు కాదు. ఐడియాలఅప్పు మాత్రమే. కిట్టనివాళ్లు గ్రంథచౌర్యం అంటారనుకోండి. ఆళ్లకేం తెలుసు మన కల్చరు.. నిన్ననే విన్నాను ఏదో నాకథ ఒకటి ఏదో సంకలనంలో వచ్చిందని. అంటే ఆ సంకలనకర్త ఉచితంగా నాపేరుకి ప్రమో” ఇస్తున్నాట్టే కద. అంచేత వారికి నేనెంతో ఋణపడి వున్నాను అన్నమాటే కద. (అసందర్భంగానే అయినా చెప్పుతున్నా బ్లాగురులందరూ తమ తమ కీబోర్డులలో ఋ ఎక్కడుందో వెతుక్కుని సహృదయంతో వాడుకోవాలి. ఇది మనతెలుగుదనం.)

 ఇంతకీ నేను చెప్పబోయేది (హమ్మయ్య అప్పటికొచ్చింది అసలిసయానికి అనకండి మరి.) నా ఐడియాదాతలకి నేను అప్పు చెల్లుపెట్టుకోడంగురించే. మీగూట్లో మీరు ముడుచుక్కూచుంటే మరి కథలెక్కడినించి వస్తాయి అన్నప్రశ్నకి కూడా ఇదే జవాబు.

 నేను కుప్పలు తిప్పలుగా రాయడంలేదు, బరువైన, హృదయవిదారకమైన, మహోదగ్రభీకరమైన సాంఘికప్రయెజనం గల, ప్రజలని పట్టి వూపేసే కథలు అసలే రావు నాకు. పోతే నేను రాయగలిగినన్ని కతలు రాయడానికి నాకు వున్న సాఢేతీన్ నెట్‌చెలులు సరిపోతారు. .. పోతున్నారు.   

 మాటవరసకి చూడండి, వైదేహి సూచించకపోతే కథలఅత్తయ్యగారు కనిపించేవారు కాదు. సౌమ్య అడక్కపోతే టెల్గూ టాకు మాటేలేదు. కొత్తపాళీ కోరకపోతే దీపాలార్పుదినము రూపు దిద్దుకొనకపోను. ఇందులో ప్రశాంతిచెయ్యి కూడా వుందని తెలిసి మరింత హుషారొచ్చింది. ఇవి విరివిగా హిట్లందుకున్న సుబ్లాగులు. అంచేత వీరికి నేను అప్పున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా యీ అప్పు ఎలా తీర్చుకోవడం అన్నదానిమీదే.

 నిజానికి నా జీవననేదాంతంలో ముఖ్యభాగం అప్పు తీసుకోరాదు. అప్పెట్టుకోడం అంటే కొంపకి నిప్పెట్టుకోడమే.

అంచేత తీవ్రంగా ఆలోచించేను ఈఅప్పులు తీర్చేసుకునే మార్గాలు. కొన్ని ఐడియాలొచ్చాయి. ఆ వెంటనే నాలో ఋణ, గుణ (, +) ధ్వనులు  చెలరేగేయి. ఇదుగో మీముందు పెట్టేస్తున్నాను. నాకు దాపరికాలు లేవు..

 1. ఐడియాప్రదాతని సహరచయితని చెయ్యడం సంగీతకచేరిల్లో వంతపాటగాళ్లలాగా. ఇందులో

గుణధ్వని.  చిన్నవాళ్లు, వర్థమాన రచయితలు, వారిని ప్రాత్సహించి నాఔదార్యం లేక హృదయవైశాల్యం (అట్టే లేదులెండి) ప్రకటించుకున్నట్టుంటుంది.

ఋణధ్వని. వారికే ఎక్కువ నష్టం. ఎందుకంటే. నాహ్యూమరు సకల సజ్జన, నెట్‌జ‌న మనోభిరామం కాదు. అయినా సాధారణంగా నాజోలికెవరూ రారు అండర్లయింగు ప్రేమచేత, జాలిచేత, సౌజన్యముచేత, సాదరముగా, భయభక్తులతో, వినయమువలన, చిరాకు పడి, ఇంకా పరాకు కారణంగా, . (నిజం చెప్పొద్దూ, మన సంస్కృతిలో ఇది నాకు చాలా నచ్చిన విషయం.

నేను ఈవర్థమాన రచయితని (లబ్ధప్రతిష్ఠలు మన్నింతురుగాక) సహరచయితని చేస్తే, వారు పాఠకుల నిరసనలకి ఈజీ టార్గెటు అయిపోయే ప్రమాదం వుంది. నాకు పడాల్సిన అక్షింతలు వాళ్లకి పడతాయి. (పైకి రావలసినవాళ్లని, వస్తున్నవాళ్లని కిందకి దిగలాగడం పంచమహాపాతకాల్లో ఒకటిట.)

 2. మనఇళ్లలో చచ్చి నీకడుపున పుడతాం అనడం మామూలు.. ప్చ్. ఇందులో

– గుణ నాకేం తోచడంలేదు. :p.

ఋణ లాంగ్ టైం ప్రాజెక్ట్. కాలదోషం పట్టిపోయే ప్రమాదం వుంది. పైగా ఎరేంజి చెయ్యడం కూడా చిక్కే.. ఇంతమందికి అప్పులున్నాను కదా, ఏయింట ముందు పుట్టడం? ఎంతకాలం ఆయింట తిష్ఠ వెయ్యడం? అసలు ఇది అప్పు తీర్చుకోడం ఎలా అవుతుంది  ఏవ్యాసానికి ఎన్నిరోజులో ఎలా టాలీ చెయ్యడం?

 పైగా పైలోకంలో అకౌంటింగు ఎలా వుందో. అక్కడ ఖాతాలు సరిగ్గా జమ కాకపోతే (మన యాంత్రికలెక్కలు ఎవరెరుగరు కనక) నేను అనవసరంగా ఏ అప్పూ లేనివారి కడుపున పుట్టేనంటే మళ్లీ అంతకంత ఆలస్యం. అంతే కాదు. అసలు ఇప్పుడు నేను ఎవరికి అప్పు తీరుస్తున్నానో నాకు తెలీడం లేదు. పైజన్మలో పాతప్పులు తీరుస్తున్నానో కొత్తవి కూర్చుకుంటున్నానో ఎలా తెలుస్తుంది? ఇవన్నీ అసలు సదరు దాతలకి గుర్తుంటాయన్న హామీ ఏదీ. టూమెనీ క్రొశ్నలు.

 3. మడతపేచీ. తరుచూ వూసులాడుకుంటున్నప్పుడు వారికి ఏవో ఐడియాలు ఇచ్చేను. 

గుణః నేను ఐడియాలు ఇచ్చేను. పనికొచ్చేవే ఇచ్చేను. నువ్వు వాడుకోపోతే నాతప్పేం లేదు. ఐడియాకి ఐడియా చెల్లు.  (ఇవ్వలేదా? ఇచ్చేననుకున్నానే, ఇచ్చేవుంటాను, సరే, ఆదివారం సాయంత్రం ఆరుగంటలకి కనిపించు. ఓగుప్పెడు గుమ్మరించేస్తాను. …. )

ఋణ ఇచ్చిన ఐడియాలు చెత్తగా వున్నాయి. పనికి రాలేదు. అవి వాడుకోడం నన్ను పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు. (ఈవిధంగా స్నేహాలకి ఎసరు కాగల ప్రమాదం వుంది.)

4. ఏంతెలీనట్టు నటించడం

గుణ నాఅంత మంచిది మరి లేదు భువిలో అనిపించుకోడానికి గొప్ప సదవకాశం. ఎవరైనా పని గట్టుకుని, తవ్వి తీసి, ఇది ఫలానావారి ఐడియా అని చెప్పేవరకూ జరుపుకుపోడానికి అత్యుత్తమ సాధనం. తరవాత, అయ్యో అలాగా, నేను చూణ్ణేలేదు స్మీ … అంటూ దబాయించడానికి వీలు.

ఋణ ఇది హీనం, హీనాతిహీనం, ఇంకా చెప్పాలంటే చెప్పలేనంత హీనం.

5. నారచన అంకితమిచ్చి దాతని కృతిభర్తని చెయ్యడం.

గుణ ఐడియారూపంలో కన్యాశుల్కం పుచ్చుకోడం జరిగిపోయింది కనక వేరే లావాదేవీలు లేవు. చెల్లు పెట్టేసినట్టే.

ఋణ ఏమీలేవు.

 ఉపసంహారం. నేను మొదటిసారి ఊసుపోక రాసినప్పుడు ఊసు పోకే మొదలుపెట్టేను, రెండో మూడో రాసేక, పాఠకులు చాలా వుత్సాహంగా చదువుతున్నారని తెలిసేక, కాస్త బెదురులాటిది కలిగింది దీన్ని పొడిగించడం ఎలాగా అని.

దరిమిలా అర్థమయిపోయింది నా నెట్చెలుల ఐడియాలు నేను వాడేసుకుంటున్నానని.

 అంచేత పైన చెప్పిన పంచరూళ్ల ప్రణాళికలో అత్యుత్తమంగానూ, ఆచరణీయంగానూ కనిపించిన ఐదో సూత్రమే ఎంచుకుని ఈ ప్రణాళికకి అంకురార్పణ చేస్తున్నాను.

ఒకటి కంటే ఎక్కువ ఐడియాలిచ్చిన ఆప్తురాలివి,  సౌమ్యా, నీకు ఈ ఊసుపోక నెంబరు 12 ఆప్యాయంగా అంకితం … చేస్తున్నాను.

 అప్పులుండరాదు అన్నరూలు ప్రకారం, పైన చెప్పిన, మిగిలిన ఐడియాదాతలకి కూడా సమయానుకూలంగా ఈ ఊసుపోకలు అంకితం చేస్తాను. 

 ఫలశృతిః  ఇంకా ఎవరైనా కూడా కన్యాశుల్కంగా ఐడియాలిచ్చి కృతిభర్తలు కావచ్చును. మీ ఐడియా తీసుకుని నేను రాసింతరవాత మాత్రం పిల్లికళ్లూ, పొట్టిజడా అంటూ వంకలు పెట్టడానికి వీల్లేదు. అలా వంకలు పెట్టమని హామీ జతపరచవలెను. 

 

 

( జూన్ 9. 2008.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “ఊసుపోక – అప్పులూ ఆప్తులూ”

 1. హాహాహా,
  సరే, సౌమ్యా, సిరిసిరి మువ్వా, – ఇద్దరూ చెరో ఐడియా సమర్పించుకోండి నావ్యాపారకిటుకు చెప్పేస్తాను. :p

  మెచ్చుకోండి

 2. @సిరిసిరిమువ్వ గారు: అలా చెప్పేస్తే ఎలాగండీ..కిటుకులూ వగైరా… మాలతి గారికి మీరు కాంపిటీషన్ వచ్చేయరూ?? 😉 వ్యాపార రహస్యాలంటారే… అలాంటివేమో…. హీహీ.

  మెచ్చుకోండి

 3. రాధిక రెండు 🙂 కి సంతోషం.
  సుజాతా, అదేమిటి ఇంతకుమున్ను పదకొండున్ను చూడలేదా. చూడలేదనుకుని మీకు రెండు ఐడియాలు ఫైను :p

  మెచ్చుకోండి

 4. అయ్య బాబోయ్! మీరు ఇంత సరదా గా కూడా రాస్తారా ? చాలా బావుంది. నేనూ, కాస్త మీకు రుణ పడి పోదామనుకుంటున్నాను మరి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s