జ్ఞాపకచిహ్నం

“కెమెరా తెచ్చేను సార్,” అంటూ ఆఘమేఘాలమీద వచ్చి వాలేడు మురళి గదిలోకి. మురళి ఎప్పుడూ ఇంతే. ఆర్భాటంగా తప్ప ప్రవేశించడు. మొదట అసలు సెట్టింగు చెప్తాను.

అది జనవరి నెల. అదొక పర్ణశాల. అసలు ఇంటివారు మేడ వేసే ఉద్దేశంతో డాబామీద గోడలు లేపి, ఆపైన పెంకులేద్దామా, రేకులేద్దామా అని ఆలోచిస్తుంటే, నేనూ, నాలాటి మరో ఇద్దరూ కలిసి, “గది కావాలండీ,’’ అని అడిగేం. మేం అడిగిన అలుసు చూసుకునో, నిజంగా డబ్బు లేదో, వచ్చినంతమటుకు రాబడదామనో, “ముగ్గురూ మూడు నెలల అద్దె ముందుగానే ఇస్తే, ఆపైన తాటాకులేయించి ఇస్తాను,” అన్నాడు ఇంటాయన, అది కూడా చాలా ఇన్ల్‌ఫ్లూయన్సు ఉపయోగించిన తరవాత. మేం ఒప్పుకున్నాం.

మాలో స్వామి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతూ, వాళ్ళ హాస్టల్లో ఉంటూ వార్డెన్‌తో తగువేసుకు బయటికి వచ్చేసినవాడు. తన పుస్తకాలూ, చదువూ తప్ప మరో ధ్యాస ఉన్నట్టు కనిపించని ఆ కుర్రాడికి వార్డెన్‌తో ఎలాటి తగువొచ్చి ఉంటుందో ఊహించడం కష్టం. చలం వెటరినరీ విద్యార్థి. అప్పుడే చేరేడు. అతడికి బెరుకు. ఇంక నేను మొదటి రెండు టెర్ములూ స్ట్రైకులూ, శలవులూ పోగా వెరసి రెండు నెలలు కూడా కాలేదు మామగారితమ్ముడుగారి ఇంట్లో అతి కష్టంమీద గడిపి మూడో టెర్ములో చదువుకోవాల్సింది చాలా ఉంటుందని గ్రహించినవాడనై, వేరే గదిలో ఉంటే మేలని ఎంచి చినమామగారి చెరలోంచి బయటపడినవాడిని. ఉన్నవాళ్లలో పెద్దవాణ్ణి, టీచరుగా ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవాణ్ణి కావడంచేత మిగిలినవాళ్లు నన్ను మాష్టారూ అంటూ గౌరవించేవాళ్లు.

మేం అక్కడ చేరిన పదిహేను రోజులకి కాబోలు మురళి వచ్చేడు గది కావాలంటూ.

స్వామి, “మనకే చాల్డంలేదు కదు సార్,” అన్నాడు.

చలం, “మీరు కొంచెం ఆలోచించాలి. అతను కూడా మీలాగే హాస్టల్నించి వాకౌటు చేసినవాడు. మీకే సానుభూతి లేకపోతే ఎలాగ?” అన్నాడు.

మురళి హాస్టలునించి ఎందుకు వచ్చేశాడో చెప్పలేదు. ఏదో ఫిషీ అనుకున్నాను. పావుగంట తర్జనభర్జనలయింతరవాత మురళిని చేర్చుకోడానికి అంగీకరించేం. మరొక గంట అయినతరవాత అతను ఓ పాతకాలపు రేకు పెట్టెతో, ఒకే ఒక జంబుఖానాతో మాగదిలో ప్రవేశించేడు. మాదగ్గిర ఉన్నవి హంసతూలికాతల్పాలూ, గాడ్రెజ్ బీరువాలూ కాకపోయినా మురళి సరంజామా చూసినప్పుడు మాత్రం ముగ్గురమూ గతుక్కుమన్నాం. అతను నైట్ కాలేజీ విద్యార్థి. పగలు సేఠ్ కమల్ దాస్ వెండి బంగారు నగలషాపులో లెక్కలు రాస్తాట్ట. పగలు, ఉద్యోగం, రాత్రి కాలేజీ మూలంగా సామాన్యంగా అతనిఉనికి మాకు తెలియజేసేవి ఆ రేకు పెట్టే, జంబుఖానాగానే భాసించేయి చాలాకాలం.

మాముగ్గురిలో ఎవళ్ళం అల్లరిమేళం కాదు. అంచేతే మేమూ అన్యులూ కూడా మాగదిని ఆశ్రమంగానే వ్యవహరించేవాళ్లం. మురళి ఉన్నప్పుడు మాత్రం కొంచెం చలనం కనిపించేది ఆ ప్రాంతాల్లో.

“నాయనలారా! జీవితంలో సగం భాగం నిద్రకే పోతుంది. ఆ మిగిలిన సగంలో ముప్పాతిక ఆహారవ్యవహారాలకి పోతుంది. ఆ మిగిలిన అరాపరక భాగంలో కాస్త కళ్లు తెరిచి చుట్టూ ఉన్న ప్రపంచం చూడండి. పక్షుల్లా ఎగరలేకపోయినా ఎగుర్తున్న పక్షుల్ని చూసి ఆనందించవచ్చు కదా,” అంటూ సద్బోధలు చేస్తూ నవ్వించేవాడు.

000

“రండి, రండి. ఫొటోలు తీస్తాను,” అంటూ మాముగ్గుర్నీ లేపేడు ఆరోజు పొద్దున్నే.

ఎంత గడ్డిపరక అయినా అల్లుడని పీట వేస్తే ఎగిరిపడ్డట్టు, ఏ మనిషికయినా ఫొటో అనగానే కొంచెం చలనం కలుగుతుందనుకుంటాను. చలం మొదట్లో కొంత గునిసినా త్వరగానే తెమిలేడు మొహాన ఇంత పౌడరు కొట్టుకుని, ఇస్త్రీ మడతలు వేసుకుని. స్వామి లుంగీ అయితే మార్చేడు కానీ గడ్డం గీయలేదు.

“స్వాములారు గడ్డం తీయకపోతే ఫొటోలో వాంటెడ్ పర్సన్‌లా కనపడగలరు. తరవాత మీ యిష్టం,” అన్నాడు మురళి.

“నువ్వు తీసే ఫొటోలో ఎలా పడ్డా ఫరవాలేదులే,” అన్నాడు స్వామి.

నాకెందుకో అనుమానం వచ్చింది. మురళి నిజంగా ఫొటోలు తీయగలడా? ఆమాటే అడిగేను.

“చూడండి,” అంటూ నాకళ్ళముందే మూడు రీళ్ళు తగలేసేడు – ఇద్దరిద్దరుగా, ముగ్గురూ కలిసి, ఒకొకళ్లుగా, మాగదిలో, గదిముందు … రకరకాలుగా. ఒక్క ఫొటోలో కూడా అతను లేడన్న సంగతి చాలా ఆలస్యంగా గుర్తించేం. “నువ్వు కూడా కొన్ని ఫొటోల్లోనైనా ఉంటే బాగుండును,” అంటే, మురళి నవ్వి, “నాకెందుకు మాష్టారూ ఫొటోలు,” అన్నాడు.

కెమేరా తెచ్చినప్పటి ఉత్సాహం లేకపోయినా అతను నవ్వుతూ, “ఫొటోలు తెచ్చేను,” అన్నప్పుడు అందరం ఆత్రపడ్డాం అవి చూడ్డానికి. అవి మా ఫొటోలే అని అతను చెప్పేడు కనక సరిపోయింది. సగం నెగిటివులు పూర్తిగా నల్లగా ఉన్నాయి. కొన్ని పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అవి ట్రావెల్ బాగ్‌కి  విండోల్లా ఉపయోగించవచ్చు అంటూ సంబరపడ్డాడు మురళి. మిగిలినవి చూపిస్తూ, “ఇదుగో, ఇక్కడ మీరూ, ఇది అతనూ, ఆపక్కన చలం కదూ, ఇదుగో స్వామి గడ్డం,” అంటూ ఒకొకళ్ళనే అతను గుర్తు పడుతుంటే మేం కళ్ళు చించుకు చూసేం, “అవును, అలాగే ఉంది, కావచ్చు,” అంటూ. చూడ్డం అయింతరవాత, “ఎవరికి ఏవి కావాలో చెప్తే, కాపీలు తీయించి ఇస్తాను,” అన్నప్పుడు మాత్రం మేం ముగ్గురం మొహమొహాలు చూసుకుని తరవాత చెప్తాం అంటూ తప్పుకున్నాం.

000

ఆ రాత్రి మురళి ఎందుకో నలత పడ్డట్టు కనిపించేడు. పలకరిస్తే ఏమీ లేదన్నాడు. రెండో రోజూ, మూడో రోజూ కూడా గదికి త్వరగా వచ్చి పడుకోడంతో నాకు అనుమానం వచ్చింది. గట్టిగా మందలించి అడిగేను. మూడు రోజులయిందిట భోజనం చేసి. ఎందుకని అడిగితే జవాబు లేదు. అప్పుడే నాకు మరో విషయం కూడా గుర్తొచ్చింది. అప్పుడప్పుడు హాస్టల్లో భోంచేసి వచ్చేనని చెబుతూండేవాడు. అప్పుడు కూడా ఇలాగేనా?

“అవునండీ.”

నాకు కడుపులో దేవినట్టయింది. “నాకెప్పుడూ ఎందుకు చెప్పలేదు?”

“ఏమని చెప్పను?”

అతనిమొహంలోకి చూడలేకపోయేను. ఎంత మూర్ఖుడివిరా అనుకున్నాను. డబ్బు చాలక హాస్టల్లోంచి వచ్చేశాడని అర్థమయింది. ఫొటోలకి ఇరవై రూపాయల్దాకా ఖర్చయిఉంటుంది. మళ్ళీ డబ్బు చేతిలో పడేవరకూ సేఠ్జీ ఇంట్లోవాళ్లు ఇచ్చిన మిఠాయిలు తిని నీళ్ళు తాగి పడుకుంటున్నాడు.

నాభోజనంకార్డు ఇచ్చి చెప్పేను, “ఇంకెప్పుడూ ఇలాటి నిరసనవ్రతాలు పట్టకు. పండుగలనీ, పబ్బాలనీ, పుట్టినరోజులనీ నెలకి పదిహేను రోజులు నేను మావాళ్ళింట్లోనే తింటాను. నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నాకార్డు తీసుకెళ్ళి తిను. తెలిసిందా?”

“సరేనండీ,” అన్నాడు మురళి. అతనికళ్ళలో కన్నీటిపొరలతో నాకు కళ్ళు చెమర్చేయి.

క్రమంగా నాకు మురళి ఆప్తుడయేడు. కదాచితుగా అతడిని మా మామగారింటికి కూడా తీసుకెళ్తూ ఉండేవాడిని నాస్నేహితుడని. పిల్లలతో బాగా ఆడుకునేవాడు కానీ భోజనందగ్గర మాత్రం చాలా మొహమాటపడేవాడు. తరవాత తెలిసింది నేను లేనప్పుడు కూడా వెళ్ళి, సేఠ్జీ వాళ్ళిచ్చిన మిఠాయిలు పిల్లలకి పెట్టేవాడని.

కొన్నాళ్ళవరకూ ఎలాటి విపరీతాలు జరగలేదు. జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగిపోతూంది. ఒక విధమైన పరీక్షజ్వరం వాతావరణంలో వ్యాపిస్తూంది.

మళ్ళీ ఓ కుదుపు ఇచ్చేడు మురళి. ఈసారి టేప్ రికార్డరు! “లేకపోతే నువ్వు మురళివి ఎందుకవుతావు?” అన్నాను కోపంగా.

మురళి ఇకిలించేడు చిన్నపిల్లాడిలా. ఎవరో స్నేహితుడిదిట తెచ్చేడు. ఇక్కడ గదిలో ఉన్నవాళ్ళందరి స్వరాలూ రికార్డు చేద్దామనిట. ఇక్కడ అంత రికార్డు ఇవ్వగల గాయకులున్నారని నాకు తెలీదే అన్నాను.

“దానికేఁవుందండీ. శిలలు కరిగించే సంగీతం వినిపించితే తప్ప తీసుకోనంటుందా టేపు? మీరు పదమూడో ఎక్కం చెప్పినా ఎంతో చక్కగా రికార్డు చేస్తుందిది. మీ కంఠస్వరం మీకు వినాలని ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. మీ గొంతులో కోయిలలు కూయవచ్చు. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు.”

సిలోన్ రేడియోలా మురళి వాగుతుంటే మేం అందరం నవ్వేశాం విశాలంగా. ఏనాడూ గట్టిగా మాటాడని చలం మూడు రోడ్లకి వినిపించేలా గొంతెత్తి పాండవోద్యోగంలో పద్యాలు చదివేడు. స్వామి “నాకేం రాదు బాబూ,” అంటూ గునిసి, “కావలిస్తే నా సివిలింజినీరింగు పాఠం చదివేస్తాను,” అన్నాడు.

“పోనీ ఓ పన్చేద్దాం. మనం అందరం కలిసి ఓ నాటకం వేద్దాం. ఏదైనా ఓ పుస్తకం తీసుకుని చదివేయడమే,” అన్నాడు చలం.

“ఇంతవరకూ రికార్డు చేసింది చాలు. అది పెట్టు. ఎలా వచ్చిందో చూద్దాం,” అన్నాన్నేను.

“అరరె, మాష్టారు పోల్చీసేరే,“ అంటూ టేపు రివర్స్ చేసేడు.

“అది నా గొంతే”, “అదుగో అది నేనే,” “ఇదెవరు?” అంటూ స్వామీ, చలం దానిచుట్టూ చేరి గోల చేస్తుంటే నేను చూసి నవ్వుకున్నాను.

ఆపూటంతా సరదాగా గడిచిపోయింది. “ఇంక తీసుకెళ్ళి ఇచ్చేయ్. అది గాని చెడిపోయిందంటే నీతలకి చుట్టుకుంటుంది ఏలిన్నాటి శని ఏడేడు పధ్నాలుగేళ్ళయినా వదుల్చుకోలేవు మళ్ళీ,” అన్నాను.

“రేపిస్తాలెండి. ఇంకా కొందరి గాత్రాలు రికార్డు చేసుకోవాలి,” అని మురళి అన్నప్పుడు నాకు కొంచెం అనుమానం తగిలింది. “చేసుకోవాలి అంటున్నావు. ఏం చేస్తావేమిటి ఇవన్నీ?” అనడిగేను.

“ఏం లేదండీ. ఊరికే అన్నాను,” అనేసి తప్పించుకున్నాడు కానీ ఏదో ఉందనీ, ఊరికే అనలేదనీ నాకు వెంటనే అనిపించింది. ఆ రాత్రి మురళి ఒప్పుకున్నాడు తను టేపు కొనుక్కున్నాడుట. అతని మూర్ఖత్వానికి అంతు లేదేమో అనిపించింది. వరసగా రెండు సినిమాలు చూడ్డానికి తాహతు లేనివాడు నలభై అయిదు రూపాయలు పెట్టి టేపు కొన్నాడంటే ఏంటనుకోడం? అదీ రికార్డరు తనదగ్గర లేనప్పుడు!

“మూర్ఖుణ్ణే అనుకోండి మాష్టారూ, నాకు మనుషులు కావాలి. నాజీవితంలో తారసపడిన ప్రతి వాళ్ళూ – నేనంటే అబిమానం అనండి సానుభూతనండి – ఏదో చూపించిన ప్రతి మనిషీ నాకు ఆప్తుడే. నేను పస్తు పడుకున్నానంటే మీరు మీల్సుకార్డు ఇస్తారు. పుస్తకం లేదంటే చలం ఎక్కణ్ణుంచైనా తెచ్చి ఇస్తాడు. ఇవన్నీ చిన్న విషయాలు మీకు. నాకు మాత్రం ఆజన్మాంతం గుర్తుంటాయి. మన చదువులయిపోయి మనం విడిపోయిన తరవాత మళ్ళీ కలుసుకోకపోవచ్చు. కలుసుకున్నా గుర్తు పట్టకపోవచ్చు. అందుకే నేనిలా ఫొటోలూ అవీ సేకరించుకుంటాను. చూడండి కష్టపడి డబ్బు సంపాదించి ఎలాగో టేపు రికార్డరు కొనుక్కుంటాను. నేను రిటైరయిపోయినతరవాత పనేం ఉండదు కదా. ఇవి చూసుకుంటూ నన్నొక ప్రాణిలా చూసుకున్న మిత్రులందర్నీ తల్చుకుంటూ కాలం గడుపుతాను. లేకపోతే ముసిలికాలం గడవడం కష్టంవండీ.”

మురళిమాటలు వింటుంటే నాకు మనసు మొద్దుబారిపోయింది. హుషారుగా నవ్వుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ గలగల్లాడుతూ తిరిగే ఈ కుర్రాడిలో ఇంతటి ఒంటరితనం గూడు కట్టుకుఉందని ఎవరనుకోగలరు?

నేను మురళిని మరింత జాగ్రత్తగా పరిశీలించసాగేను. అయితే అది అతనికిష్టం లేనట్టు, తను గీసుకున్న గిరి దాటి నన్ను చేరనివ్వలేదు. అతను సంపాదించే వస్తుసంచయం నాకు తమాషాగా ఉండేది. ఓ రోజు ఎవరో ఇచ్చేరని లక్కతో చేసిన బాల్ పాయింట్ పెన్ను తెచ్చేడు, “దీనిమీద పూసలు చూడండి ఎంత బావున్నాయో,” అంటూ. మరోరోజూ ఓ అగ్గిపెట్టె తెచ్చేడు, “చూడండి,” అంటూ.

“బల్లమీద కొత్తగా ఉంది,” అన్నాను. అంతకంటె ఏఁవనడానికీ నాకు తోచలేదు.

“అంతే కాదండీ, ఇది జపాన్నించి వచ్చింది. ముగ్గురు చిత్రకారులు కారుమీద దేశాలు తిరుగుతూ మాకవి గారింట్లో కలిసేరు. చాలాసేపు వాళ్ళతో మాటాడేనండీ. ఇది నాకు ఒకాయన ఇచ్చేడు. పుల్లలు చూసేరా, ప్లాస్టిక్. మందు కూడా చూడండి తెల్లగా ఉంది. తమాషాగా లేదూ?”

మురళి చెప్పే తీరు మాత్రమే నాకు తమాషాగా అనిపించింది. “మొత్తమ్మీద నీపెట్టె అంతా ఇలాటి చిల్లర సామానుతోనే నింపేసేట్టున్నావు,” అన్నాను మందహాసంతో.

“మరింకేం ఉంటాయండీ అందులో పెట్టడానికి?” అతను నవ్వుతూనే అన్నా నాకు అయ్యో అనిపించింది.

ఒక్కోమారు అనుకునేవాణ్ణి అతనికి చెప్పాలని, “నేనూ  నీవయసులో ఇలాగే అనుకున్నాను. కొత్తగా కళ్ళు తెరిచి ప్రపంచం చూడ్డం మొదలు పెట్టిన ప్రతి ప్రాణికీ ప్రతి వస్తువూ అందంగానూ ఆశ్చర్యంగానూ కనిపిస్తుంది అనీ, కాలం గడిచి సంసారాల్లోనూ ఉద్యోగాల్లోనూ దిగింతరవాత అగ్గిపెట్టె ఒట్టి అగ్గిపెట్టెలాగే కనిపిస్తుందనీ, అతను కడుతున్నది ఇసక గూళ్ళనీ …” కానీ మళ్ళీ అతనిమొహం చూసి చెప్పలేకపోయేవాణ్ణి.

మురళిమొహం చూస్తే సద్యోవికసితప్రసూనాలూ, పాలతో కడిగిన ముత్యాలూ తలపుకొస్తాయి. అర్థబలమూ, అంగబలమూ లేకపోయినా “నాజీవితం సుందర సురుచిరకావ్యంలా మలుచుకుంటాను,” అన్న గుండెనిబ్బరం కనిపించేది ఆ మొహంలో. ఆరోజుకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను.

మూడో టెర్ములో నేను ఇంటికి వెళ్ళలేదు చదువు సాగదని. “ఓమారు ఇంటికి వచ్చి వెళ్ళండి,” అంటూ మాఆవిడ రాసిన ప్రతి ఉత్తరం పెట్టెలో పడేసేను. మార్చి మొదటివారంలో “ఒంట్లో బాగులేదు, వెంటనే రావలసింది,” అంటూ తాఖీదులాటి టెలిగ్రాం రావడంతో, “రెండు రోజుల్లో వచ్చేస్తాను,” అని నా సహవాసులకి చెప్పి బయల్దేరేను. తీరా ఇంటికొచ్చి చూస్తే, నిజంగానే మాఆవిడ మంచంలో ఉంది. రెండు రోజులనుకున్న నేను పదిహేను రోజులు ఉండిపోవాల్సివచ్చింది. సరిగ్గా పరీక్షలముందు ఇలాటి అవాంతరం తెచ్చిపెట్టిన దేవుడెంత కఠినుడు అనుకోడం తప్ప ఏం చేయలేకపోయేను.

తిరిగి వచ్చేసరికి చలం కాలేజీకి తయారవుతున్నాడు. స్వామి వెళ్ళిపోయినట్టున్నాడు. చేతిసంచీ ఓమూల పారేసి, మొహం కడుక్కుని నేను కూడా కాలేజీకి వెళ్ళడానికి తువాలందుకోబోతుంటే గదిలో ఏదో వెలితిగా ఉన్నట్టనిపించింది. “మురళి ఊళ్ళో లేడా?” అని చలాన్ని అడిగేను.

“మురళి చనిపోయేడండీ.”

“ఆఁ!

” ఎలెక్ట్రిక్ షాక్ తిన్నట్టు ఉలిక్కిపడ్డాను.

“అవునండీ, ఏక్సిడెంటు. మంగళవారం రాత్రి సైకిలుమీద వస్తున్నాడు. డబుల్సు ఎక్కేరుట. కాలేజీ కాంపౌండు దాటి రోడ్డుమీదికి వస్తుంటే వెనకనించి లారీ యమస్పీడులో వచ్చి గుద్దేసింది. వీళ్ళు తప్పుకోలేకపోయేరు,” చలం చెప్పడం ఆపేడు.

అప్పటికే నేను నిలబడలేక కూలబడిపోయేను మంచంమీద. చాలాసేపయినతరవాత అడిగేను, “వాళ్ళవాళ్ళెవరైనా వచ్చేరా?”

“అతనికి అయినవాళ్ళెవరూ ఉన్నట్టు లేదండీ. కాలేజీరిజిస్టరు చూసి ఏదో ఎడ్రెసుకి ఉత్తరం రాసేం. ఎవరో దూరపుబంధువుట వచ్చి ఆ పెట్టే, జంబుఖానా పట్టుకుపోయేరు.”

అప్రయత్నంగా ఆమూల చూసేను. అందరిజ్ఞాపకాలకోసం తాపత్రయపడిన మురళి మాకు ఏమీ మిగల్చకుండా పోయేడు.

ఆమూల శూన్యంగా ఉంది.

000

 

(కామధేను, మే 1, 1972, లో ప్రచురితం.)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “జ్ఞాపకచిహ్నం”

  1. చాలా బావుందండి కథ. “మనిషి ఎంత తాపత్రయ పడ్డా ఈ జీవితం నీటి బుడగే!” అన్నది చాల సున్నితంగా చెప్పబడింది. మీరు రాసిందే అయితే అంత బాగా రాసినందుకు, నేను అనుకుంటున్నట్టు వేరే వారిది అయితే పరిచయం చేసినందుకు నిజంగా ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s