ఊసుపోక – కథా? బ్లాగా?

(ఎన్నెమ్‌ కతలు 13)

కథా? బ్లాగా? సీరియస్‌గానే అడుగుతున్నాను. ఆమధ్య నాకు హఠాత్తుగా అనుమానం వచ్చింది బ్లాగుకీ కథకీ తేడా ఏమిటి, ఏవి కథలు, ఏవి బ్లాగులు అని.

బహుశా తేడా విషయంలోనేమో అనిపిస్తోంది. ఎలా రాస్తున్నారని కాక ఏం రాస్తున్నారన్నదానికే పెద్దపీట అనుకుంటాను. కథలో పేర్లు మార్చి, రూపురేఖలు మార్చి, స్థలాలూ కాలాలూ మార్చి, వున్నవి దాచి, లేనివి కల్పించి చెప్తాం. నేను “కాఫీ రంగూ రుచీ” గురించి రాసినప్పుడు అలవాటుగా కల్పించి కాఫీ మానేసేనని చెప్పి, మళ్లీ దిద్దుకున్నాను, వూరికే “కథ రక్తి కట్టడానికి” అలా రాసేను కానీ రక్తి కట్టలే. ప్చ్. అబద్ధాలాడి పట్టుబడిపోయాను. ఇది ప్రమాదాలు తెచ్చే నిజం కాదు కనక సరిపోయింది.
నేను కథలు రాస్తున్న కొత్తల్లో, 1952-53 ప్రాంతాల్లో ఓచిన్న కథలాటిది, “రాద్ధాంతం” అని రాసేను. తెలుగు స్వతంత్ర వారు దానికి గల్పిక అనో స్కెచ్ అనో పేరు పెట్టేరు కథ అనడానికి తగినంత సరుకు లేదని కాబోలు. మాపక్కింటావిడ పేరు చుక్కమ్మగారు. చుక్క అంటే ఫుల్‌స్టాప్ అన్న అర్థం సాగదీసి, మేడమ్ ఫుల్‌స్టాప్ అని ఒక పాత్రకి పేరు పెట్టేను. పేరు తప్పిస్తే ఆవిడకీ నాకథకీ ఏంసంబంధం లేదు. అయినా ఆవిడకి కోపం వచ్చిందిట. మాఅమ్మచేత చీవాట్లు తిన్నాను.

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే కథల్లో బోల్డు కల్పనలుంటాయి. ఎవరేనా “నాకథ ఎందుకు రాసేవు” అఁటూ తగువుకొస్తే మరో భాగం చూపించి “ఇదుగో, నువ్వు ఇలా లేవు కదా” అంటూ తప్పించుకోవచ్చు (చూ. పైన చెప్పిన మార్పుల లిస్టు).
నా (అనువాదాల) తూలిక తొలి రోజుల్లో ఎవరో ఒక అమ్మాయి రచన వేసుకున్నాను. తన ఫొటో కూడా పెట్టేను కళగల మొహం. మరో నెలరోజులకి కాబోలు నాకు ఒక మెయిలు ఫార్వర్డు చేసింది ఆ అమ్మాయి. అమెరికాలో వున్న ఒకాయన దగ్గర్నుంచి తనకి వచ్చిందని. అతను ఆవిడరచన చాలాబాగుందనే కాక, తాను అర్థరాత్రి కూర్చుని ఆరచయిత్రి వివరాలన్నీ తవ్వి తీసానని రాసేడు. నేను ఆమెసేజి అంతా పెట్టలేదు కానీ “ఆరచన బాగుంద”న్న ఒక్క వాక్యం నా కామెంట్సు పేజీలో పెట్టేను.

వారం తిరక్కుండా మరో మెయిలొచ్చింది అతని దగ్గరనుండే. తాను ప్రైవేటుగా రాసిన మెయిలు ఆలా పబ్లిష్ చెయ్యడం అన్యాయం, అక్రమం. చట్టవిరుద్ధం, అని మాయాబజారులో రంగారావులా అక్షర కథాకళి చేస్తూ! సరే నేను వెంటనే ఆమెయిలు తీసేసి, అతనికి క్షమాపణలు చెప్పుకున్నాను. దానికి సమాధానం రాసాడు, ఆరచయిత్రి self aggrandizement అనే వ్యాధితో బాధ పడుతోందని చెప్పి, తాను అసలు ఎంతగొప్పవాడో, ఎన్ని పుస్తకాలు పబ్లిష్ చేసేడో, ఎన్ని కాన్ఫరెన్సులకి వెళ్లాడో ఓపేజీ రాసేడు. (మరి ఇది self aggrandizement కాదా? ఏమో మరి). ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అతను మాయిద్దరికీ చేసిన మహోపకారం నన్ను, సదరు రచయిత్రినీ కోర్టుకి ఈడవకపోవడం.

అప్పుడప్పుడు నా కథలూ, వ్యాసాలు వేరే సైటులలో కనిపిస్తాయి. నాకది సంతోషమే. . ఏమాటకామాట ఒప్పుకోవాలి. వాళ్లు నాపేరు తీసేయలేదు ఎప్పుడూను. అంచేత “పోన్లే పాపం అక్కడ కూడా నావే కదా చదువుకుంటున్నారు, అదీ ప్రచారమే” అనుకుంటాను. సాధారణంగా చాలా పత్రికలు తమకి క్రెడిట్ ఇవ్వమంటారు ఇతరచోట్ల ప్రచురించుకున్నప్పుడు.

బ్లాగులు కథలు కావు. సొంత ఆలోచనలూ, సొంత జీవితాల డైరీ. మధ్యాన్నంవేళ భోజనాలయేక, పిట్టగోడమీంచి పొరుగమ్మతోనో, అరుగుమీద నిలబడి ఇరుగమ్మతోనో కబుర్లు చెప్పుకున్నట్టు, మంచీ చెడ్డా, ఇష్టాలూ, కోరికలూ, చిరాకులూ రాసేసుకోవచ్చు బ్లాగుల్లో. . ఎవరికి తోచింది వారు, తోచింది తోచినట్టు, వాక్ లేక బ్లాగ్ స్వాతంత్ర్యం ప్రకటించి, రాసేసుకోవచ్చు కానీ డైరీలు గుట్టు. బ్లాగులు రట్టు. అంచేత, ఏంరాసినా ఆపైన పుట్టుకొచ్చే ఉపకథలు -కందపిలకల్లా-గురించి కూడా తెలుకోడం, వాటిని ఎదుర్కొనడానికి సన్నిద్ధమవడం కూడా బ్లాగురచనల్లో భాగమే అని గుర్తించాలి.

అమెరికాలో అప్పుడప్పుడు కేసులు చూస్తూంటాను కనక చెప్తున్నాను. కేసు పెట్టడం చాలా తేలిక. అవతలివాడు తప్పు చేసేడు అనేయడం తేలిక. నేను తప్పు చెయ్యలేదు అని ఋజువు చేసుకోడం కష్టం. మన చట్టాలు ఆలా ఏడుస్తున్నాయి. “అందరూ చేస్తున్నారు కదండీ” అన్న వాదన చెల్లదు. “నాకు నచ్చింది కనక నేను పెట్టుకున్నాను” అన్న వాదన కూడా సమర్థనీయం కాదు కోర్టుల్లో.

కోర్టువారి నిజాలు వేరని “ముత్యాలమ్మ” చెప్పింది గుర్తుందా? రావిశాస్త్రిగారి “మాయ” కథ (ఆరు సారాకథలు) చదవండి. అందులో ముత్యాలమ్మ ఉపన్యాసం ఇక్కడ మళ్లీ పెట్టేద్దును కానీ వాళ్ల అబ్బాయి కూడా లాయరే. హక్కులంటూ నన్ను కోర్టుకీడ్చే హక్కు వారికుందని విరమించుకున్నాను ఆ ఆలోచన.

అలాగే కాపీరైటు సంగతులు కూడాను. నిజానికి పైన చెప్పిన ఈమెయిలు కూడా కాపీరైటు వైలేషను కిందకే వస్తుంది. ఫార్వర్డు చెయ్యెచ్చు అని స్పష్టంగా చెప్తే తప్ప మనం మరొకరికి పంపకూడదు. మామూలుగా ఎవరి రచనలు వారు ఎన్ని చోట్ల అయినా పెట్టుకోవచ్చు. డబ్బు ఇచ్చి, నీకథ మరెక్కడా పెట్టడానికి వీల్లేదు అని రాతపూర్వకంగా తెలియపరిస్తే తప్ప. మన వారపత్రికలు డబ్బు ఇచ్చినవాళ్లు కూడా అభ్యంతరం చెప్పరు ఎందుకంటే అది వాళ్లకి కూడా ప్రచారమే కనుక. అలాగే అనువాదాలు కూడా. నేను ఇండియా వచ్చినప్పుడు అడిగితే, అందరూ ఏం పర్మిషన్లండీ, మీఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నవాళ్లే ఎక్కువ., అలాగే ఇంటర్నెట్‌లో విరివిగా అందుబాటులో వున్న బొమ్మలూ అవీను. ఆబొమ్మల సొంతదారులు ఎవరేనా ఎక్కడేనా పెట్టుకోవచ్చు అని వుంటే బాధ లేదు. మనదేశంలో పర్మిషన్ల పట్టింపు అంతగా లేదు. ఎవరో కదాచితుగా కాపీరైటుగురించి మాటాడినా ఎవరూ కోర్టులకెక్కుతున్నట్టులేదు. కానీ ఎవరేనా మనని కోర్టుకి కెక్కించడానికి సరదా పడితే, అప్పుడు అందరూ చేస్తున్నారన్న వాదన నిలవదు కదా. కొత్తబ్లాగురులు ఇలాటి విషయాలు కూడా తెలుసుకుని వుంటే మంచిదని.

విహారి కొన్ని సలహాలు ఇచ్చారు. కొత్తపాళీ అక్కడక్కడ సమయానుకూలంగా ఇస్తున్నారు. ఈమధ్య జ్యోతి బ్లాగులో యప్,మీ. విపులంగానే చర్చించారు. ఈసలహాలన్నీ ఒకచోట చేర్చి, కూడలీ, జల్లెడలాటి ప్రముఖ బ్లాగులు ఒక వనరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బ్లాగు ఎంత సొంతమైనా కొన్ని నియమాలు పాటించడం మనకే ఆరోగ్యం. వాక్‌స్వాతంత్ర్యం, బ్లాగ్‌స్వాతంత్ర్ర్యం – రెండూ ఆచరణీయమూ. అభిలషనీయమూను. నేను ఎవర్నీ రాయొద్దు అనడంలేదు.
అడుసు చూసుకుని అడుగుపెడితే తరవాత వచ్చే గాలిదుమారం తట్టుకోడానికి ఓపిక వుంటుందని.

(మా.ని. జూన్ 2008.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

19 thoughts on “ఊసుపోక – కథా? బ్లాగా?”

 1. అలాగే అమ్మ అను కానీ గాలూ అంటే గాడూ లా వుంది. హీహీహీ. నాకు మరో హాసికం కత గుర్తొస్తోంది. వాసుదేవశాస్త్రిగారు అని ఒక కవి మరొకాయన్ని మీ కపిత్వం బాగుంది అని ఎక్కిరించాట్ట. కవిత్వం అనాలి అని రెండో ఆయన అన్నాడు. అప్పుడు ఈయనేమో ప,వయోరబేధః అని సంస్కృతంలో ఒక రూలుంది కదా అన్నాట్ట. అయితే మరి మిమ్మల్లని పాసుదేవశాస్త్రి అనొచ్చా అన్నాట్ట రెండో ఆయన,.. మరి ఇంకా బాగా బాగా కతలూ అవీ రాసేయ్.

  మెచ్చుకోండి

 2. కొత్తపాళీ, రాధికా, థాంక్స్.

  మహేష్, మీరూ నేనూ మాటాడుతున్నది ఓకటి కాదు. నాప్రశ్న మీరు తాళం వేసుకుంటారా లేదా అని మాత్రమే. తాళం అంటే జాగ్రత్త తీసుకోడం. మీరు ఆతరవాత ఏంజరుగుతుందో, — ఎవరో ఏదో అన్నారని – చెపుతున్నారు. నేను అన్నది అలా జరగడానికి అవకాశం వుందని ఆలోచించుకోమని. నాకున్న మేధ పరిధిలో నేను సూటుగానే జవాబులు ఇస్తున్నాను.
  నాకు తెలిసి రెండు సార్లు జరిగింది తెలుగుదేశంలో – రచయితలు సాటిరచయితలని కోర్టుకి ఎక్కించడం. మేం అంతటి రచయితలం కాం అని మీ వాదన. పోనీ, మరోలా అడుగుతాను. మీరచన గురించి ఎవరో ఏదో అంటే మీకు నొప్పి. మీమాటల, రచనలమూలంగా మరొకరికి నొప్పి కలగకుండా చూసుకుంటారా లేదా.

  ఈకామెంట్సు చాలావరకూ కాపీరైటు ప్రస్తావన అయినా, నా వ్యాసంలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది – డైరీలు గుట్టు. బ్లాగులు రట్టు. మీరు ఏంరాసినా వాటివెంట పుట్టుకొచ్చే ఉపకథలు (consequences) కూడా వుంటాయి, అవి తెలుకోడం, వాటిని ఎదుర్కొనడానికి తయారుగా వుండడం అవసరం అని, అది కూడా బ్లాగురచనల్లో భాగమే – అని గుర్తుంచుకుంటే మంచిది అన్నాను.
  మీరు ఒప్పుకోకపోతే , ఇక్కడికి వదిలేద్దాం. బ్లాగరులకి రెండు కోణాలూ అందేయి కనక వారిష్టం వారు ఏది ఆచరణలో పెట్టుకుంటారో అన్నది.

  నేను పని కట్టుకుని ఏ అనామకులకో మరో ఆదిభగవాన్లకో మీరు అలా రాయకండి చెప్తే అది మీరన్న moral policing అవుతుంది.

  మీకు కొత్తపాళీ, విహారియందు గౌరవం వున్నందుకు సంతోషం.

  మెచ్చుకోండి

 3. మంచి విషయాలు చెప్పారు మాలతిగారు.నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నాకు కూడా యేప్ మీ గారి వ్యాఖ్య అభ్యంతర కరం గా తోచలేదు.సున్నితంగానే చెప్పారు అనిపించింది.

  మెచ్చుకోండి

 4. బాగా చెప్పారండీ.
  ప్రైవసీ, కాపీరైటు విషయాలు బ్లాగు గుంపులో బాగానే చర్చించారు.
  మీరన్నట్టు కూడలి లాంటి చోట ఇవి సంకలిచి పెడితే బానే ఉంటుంది.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ, మీరు రాసిన వ్యాసానికీ (అపీల్ కీ) తరువాత ఇస్తున్న వివరణలకీ అప్పుడప్పుడూ కాస్త gap, అక్కడక్కడా కొన్ని gulf లున్నట్టు నాకనిపిస్తోంది.

  నేను లెవనెత్తిన విషయాలు ఊరూ, పేరూ చెప్పకుండా అవాకులు పేలి, తరువాత “మా ప్రైవసీ కోసం పేర్లు చెప్పటం లేదు, మాలాగే మీరూ తెలివిగా వ్యవహరించండి వెధవల్లారా” అంటున్న అనామక అభిప్రాయగాళ్ళు/గత్తెల కి సంబంధించింది.

  నా లాంటివాళ్ళు బ్లాగు రాస్తున్నది ఎవర్నో కాపీకొట్టి మమ్మల్ని మేము గొప్పచేసుకోవడానికి కాదు. దానివల్ల నాకు ఈ నెట్ ప్రపంచం ద్వారా ఓరిగేది పెద్దగా లేదు కూడా. కాబట్టి మీరు చెప్పిన కాపీరైట్ అంత కాంప్లికేషన్ అస్సలు లేదు, ఉన్నా మన భారతదేశంలో ‘రైటు కాపీ’యే గానీ ‘కాపీ రైట్’ లేదుగా! ఎవరో బాధపడినట్లు అంత త్వరగా అమెరికా పరిస్థితులు ఈ విషయంలో ఇక్కడ రావులెండి.

  “మీయింటికి కన్నం వెయ్యడానికి సవాలక్ష మార్గాలున్నాయని మీరు తలుపు తాళం వెయ్యకుండా బయటికి వెళ్లరు కదా” అన్నారు. నిజమే. కానీ, దొంగతనానికి వచ్చిన దొంగ, మీరు మీ పిల్లాడ్ని ఎలా పెంచాలో చెబితే మీరు బుద్దిగా వింటారా? లేక వాడ్ని తన్ని తగలేస్తారా? ఇక్కడ ఈ “అనానిమస్’ కామెంట్ గాళ్ళు/గత్తెలూ చేస్తున్న పని అదే. అందుకే వాళ్ళు మాట్లాడే ప్రైవసీ నార్మ్ మాకు అఖ్ఖరలేదు అంటున్నా.

  మా స్థాయిలో మేము చాలా నిబద్దతతో ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. తెలియక తప్పుచేస్తే ఎత్తి చూపడానికి ‘విహారి’, ‘కొత్తపాళి’ లాంటివారు ఆల్రెడీ ఉన్నారు. ఇలాంటి ‘యుప్ మి’ , ‘అనానిమస్’ లాంటి పేరూ, ముఖం లేని ఉద్దారకులు అస్సలు అవసరంలేదు.

  మెచ్చుకోండి

 6. ఎక్కడి నుంచి ఏ మాట ని ఉదహరించాలన్నా కూడా భయమేస్తోంది మాలతి గారు! నేను ఏదన్నా ఒక్క మాటని వేరే చోట నుంచి తీసుకున్నా ‘ఇది ఫలానా చోట్నించి తీసుకున్నాను, వారికి థాంకులు అని చెప్పేస్తాను.’ అయినా సరే, ‘ నీ థాంకులు సంగతి తర్వాత, అసలు నన్నడక్కుండా ఎందుకు తీసుకున్నావ్ ‘ అంటారని ఒక పక్క దడే!

  మొత్తానికి గట్టి విజిలేయించే అంశం రాసారు. ‘ఒకమ్మాయి రచన వేసుకున్నాను ‘ అని చదివి, భయమేసి గబ గబా ముందుకు పోయి చూస్తే…అమ్మయ్య, నేను కాదు!

  మెచ్చుకోండి

 7. బాబూ దుర్గేశ్వరా,మొదట మాలతి గారికి దండం పెట్టుకుని దీవించమని అడగండి.ఆమె దీవిస్తే మనతల్లి మనల్ని దీవించినంత.

  మాలతి గారు ప్రస్తావించిన విషయాలు గతంలో బ్లాగులు బ్లాగు గుంపుల్లో కాస్త,కూడలికబుర్లలో ఎక్కువగానూ కాపీరైటు గురించి చర్చలు జరిగాయి.కాపీరైటు,పర్మిషన్లు,ఇంకా ఇలాంటివి బ్లాగరులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇవ్వాళ అమెరికాలో ఉన్నవాతావరణం రేఫు భారతదేశానికి పాకదన్న నమ్మకం ఏమీలేదు కదా?

  మెచ్చుకోండి

 8. ఈ టపాలో విషయాలతో నేను ఏకీభవిస్తాను.

  ఇక్కడ చెప్పదలచుకున్నది సృజనాత్మకత చంపుకోమనో, బ్లాగులు రాయవద్దనో కాదు. ఇతరుల రచనలకీ, కంటెంటుకీ, ప్రైవసీకీ గౌరవం ఇవ్వమని. అంతే.

  కాపీరైట్లు, ప్రైవసీ వగయిరాలని వదిలెయ్యడం కంటే వాటిని తెలుసుకోవడమే మంచి పద్ధతి.

  ఉదా: మీరెక్కడి నుంచో ఒక వ్యాసం, ఒక ఫోటో లేదా వార్త తీసుకుని పునర్ ప్రచురించాలనుకున్నారనుకోండి. దానికి ఒక లంకె వేసి సోర్స్ ని ఇవ్వడం సరయిన పద్ధతి.

  ఈ మధ్యే ఒక పత్రిక తన వ్యాసాల్లో నుంచి ఉదహరించిన ఒక్కో పదానికి వేల డాలర్ల చొప్పున ఇవ్వమని దావా వేసింది. ఆఫ్కోర్స్ ఇది అమెరికాలో అనుకోండి.

  భారతంలో ప్రస్తుతానికి “లా” అంత గట్టిగా లేకపోవడం వలన చేసిన తప్పు ఒప్పు అవదు. అదెలా ఉంటుందంటే భారతంలో ఎవరూ పట్టించుకోరు గనక పైరేటెడ్ విండోస్ వాడటం సమ్మతమే అన్నట్టు.

  కాపీరైటు సమస్యలు కొంత కాంప్లికేటెడ్. దానిని గురించి చర్చించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

  ఆసక్తి ఉన్నవారు ఇంతకు ముందు తెలుగుబ్లాగర్ల గుంపులో జరిగిన ఈ చర్చాహారాన్ని ఒకసారి చూడండి.

  మెచ్చుకోండి

 9. దుర్గేశ్వర – అలిగేంతటిదాన్ని కాదండి. మీబ్లాగు ఎక్కడుందో చెప్పండి. మామూలుగా నూటికి 90 శాతం బ్లాగులోని విషయాల్లో నేను అజ్ఞానిని.
  నాకున్నదల్లా పాతకాలపు కథలూ, పండినతలాను. అవి మాత్రం ఉపయోగించగల చోటికే వెళ్తాను.
  మహేష్ కుమార్ – మిమ్మల్ని రూల్స్ మార్చుకోమనడానికి నేవెంతటిదాన్ని. నాసైటుద్వారా ఎవరైనా ఒకవ్యక్తి ఆచోకీ తీస్తే నాకు కొంత బాధ్యత వుంది. మీయింటికి కన్నం వెయ్యడానికి సవాలక్ష మార్గాలున్నాయని మీరు తలుపు తాళం వెయ్యకుండా బయటికి వెళ్లరు కదా. ఆస్పృహ వుండడం అవసరం అంటున్నాను, మీరు అక్కర్లేదంటే సరే.
  నేను నాఅభిప్రాయాలు ఎవరిమీదా రుద్దే ప్రయత్నం లేదు సార్. మీలాగే నా అభిప్రాయాలు నేను చెప్పుకున్నాను.
  ప్రస్తుతం మనం వున్నది వ్యాపారయుగం. అందులో నీతి లాభాలగురించి ప్రస్తావించడం. నష్టాలు కూడా వున్నాయనీ, మనం అనే ప్రతి మాటకీ,. చేసే ప్రతిక్రియకీ పరిణామాలు కూడా వుంటాయనీ గమనించుకోడం విజ్ఞానం (Education). ఆరెండో కోణం కూడా ఆలోచించుకుని, తదనుగుణంగా రాసుకోండి అన్నాను. ఇది కేవలం సలహా మాత్రమే.
  నా చివరి వాక్యం చూడండి. నేను అడుసు తొక్కనేల, కాలు కడగనేల – అనలేదు. అడుసు తొక్కినతరవాత పరిణామాలు ఉంటాయి, ఆలోచించుకుని, దాన్ని ఎదుర్కోడానికి సిద్ధపడండి అన్నాను.
  రచయితలా రచయిత్రులా అన్న ప్రశ్న లేనేలేదు
  మాపక్కింటావిడకి కోపం వచ్చిందని నేను రాయడం మానేయలేదు. ఆవెంటనే రాద్ధాంతంపై సిద్ధాంతం అని మరో కథ రాసేను. నేను చెప్పేదల్లా పరిణామాలుంటాయని గుర్తుంచుకోమని. నానిజానికీ ఫెమినిజానికీ మధ్య కథ మీ పైదరాబాదులో ఘనాపాఠీ సాహితీవేత్తలే నాకు చెప్పకుండా స్త్రీవాదకథల సంకలనంలో వేసుకున్నారు. దానిమూలంగా నన్ను స్త్రీవాదిని అంటున్నారు నా వ్యక్తిగతవిలువలకి అది సరి కాదు కాని నేను చెయ్యగలిగిందేమీ లేదు.

  జ్యోతి – అయోమయం నిజమే.. అందుకే ఈచర్చ.

  మీప్రశ్నకి సమాధానం పైన కొంత వుంది. మనం సాధారణంగా ఇళ్లలో మాటాడుకునే మాటలు గాలికి పోతాయి. బ్లాగులో పెట్టినవి విశ్వవ్యాప్తం క్షణాలమీద. నాయిష్టం వచ్చినది నేను రాసుకుంటాను అని మీరన్నట్టుగానే వాళ్ల ఇష్టం వచ్చింది వాళ్లు రాస్తున్నారు. మీకెంత స్వతంత్రం వుందో వాళ్లకీ అంతే వుంది. మరి బ్లాగు నీతి అదే కదా. నేను అంటాను కానీ మీరు అనొద్దు అంటే సాగదు బ్లాగుల్లో. మహా అయితే మాడరేషన్ లో డిలిట్ చెయ్యగలరు. అప్పుడు వాళ్లు వాళ్లబ్లాగుల్లో రాస్తారు.

  మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు సంతోషం.

  మెచ్చుకోండి

 10. నాకైతే అంతా అయోమయంగా ఉంది మాలతిగారు. హాయిగా బ్లాగులు రాసుకుంటుంటే నాకు నీతులు చేప్తున్నారు అదీ తమ పేరు కూడా చెప్పలేని ధైర్యవంతులు..

  మెచ్చుకోండి

 11. న్యాయానికీ చట్టానికీ తేడా ఉన్నట్టే, వ్యక్తి సృజనాత్మకతకూ, బ్లాగులో ప్రైవసీ వయెలేషన్ కూ చాలా తేడా ఉందని నా నమ్మకం. మీరు చెబుతున్నది కూడా దాదాపు అదే అనుకుంటాను. కాకపొతే మీరు కాస్త చుట్టుతిప్పి చెప్పారు అంతే.

  ఇక మీరు ఉదహరించిన ‘కేసు’ బ్లాగు ప్రపంచంలో కంటే బాహ్యప్రపంచంలో సర్వసాధారణం అని గ్రహించగలరు. మీ రచయిత్రి లాంటివారూ, వారి మీద ఇంట్రెస్ట్ సూపిన మరో వ్యక్తిలాంటివారు లేనిదెక్కడ? ఇలాంటి exceptions కోసం, మనం మన rules మర్చుకుందామని పిలుపినిద్దామా?

  బ్లాగ్ అనేది ఒక personal expression. “I’d rather make mistakes, than do nothing. I’d rather mess up, than miss out completely” అన్నది నా లాంటి బ్లాగరలకి స్ఫూర్తి. అంత perfect గా రాయాలనుకునేవాళ్ళు ఆల్రెడీ print and electronic media లో తమ పాండిత్యాన్ని వెలగబెడుతున్నారు. ఇక్కడ ఉండే చాలా మంది సాధారణ మనుషులు…రచయితలూ…రచయిత్రులూ కాదు.

  లోపాలను ఎత్తిచూపడం వేరు, మీ విలువలని బ్లాగర్లపై రుద్దడం వేరు. మీరన్న Yup me అక్కడ చేసింది అదే. అది బూతులు తిట్టడం కన్నా దారుణమని నా అభిప్రాయం. ఇక వారు ఎత్తిచూపిన ‘అమూల్యమైన’ విషయాలలో ‘అతి”శయోక్తులెక్కువా అసలు నిజాలు తక్కువ. బ్లాగులో ఇచ్చిన ID ని మాత్రమే చూసి ఎవరూ వెంటపడక్కరలేదు… అది సంపాదించడానికి సవాలక్ష ఈజీ మార్గాలున్నాయి…చెప్పమంటారా???…చాలా మందికి తెలిసినవే కాబట్టి అర్థం చేసుకోగలరు.

  తమ insecurity కి sensibility అనే ముసుగుతొడుక్కుని వారు చేస్తున్న moral policing కి నేను బద్ధవిరోధిని. ఎవరూ ఎవర్నీ స్వాగతించి “మా బ్లాగులు చూడండి” అని మొరాయించట్లేదు. “మేము మా ఆలొచనల్నీ, అనుభవాల్నీ,అభిప్రాయాల్నీ రాస్తున్నాం వీలైతే చూడండి” అని తప్ప.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.