ఊసుపోక అయ్యో నారాతా

(ఎన్నెంకతలు 14. తెలుగు జ్యోతి, న్యూజెర్సీ, పత్రిక, జూన్ 2008, లో సంక్షిప్తరూపంలో ప్రచురింపబడింది)

 

 

నాచిన్నప్పుడు నేను ఉత్తరాలు బాగా రాసేదాన్నిట. -ట అని ఎందుకంటున్నానంటే ఓసారి నాస్నేహితురాలు, ఫిఫ్తుఫారంలో క్లాస్‌‌మేటు రాసిన మాట అది. అవి ఇంకా అణాలూ, కాణీలూ చెలామణీ అయేరోజులు. ఒకసారి తను నాకు రాసింది, సత్తుఅణాలిచ్చి మల్లెపూలు కొనుక్కున్నట్టు నువ్వు రాసే వుత్తరాలకోసం నేను నీకు ఉత్తరాలు రాస్తున్నాను అని. ఎంత మనోజ్ఞమయిన భావన! నిజంగానే నేను అంత గొప్పగా రాసేదాన్నని చచ్చినా నమ్మను కానీ ఆ సున్నితమైన భావం, ఆభావంలో మంచిముత్యంలా పొదిగిన ఆ ఆత్మీయతా అంత చక్కనిదీ, చిక్కనిదీ కనుకనే నాకు ఇప్పటికీ మనసులో చెరగని ముద్ర వేసుకుని వుండిపోయింది.

 

ఇలా పూర్వం ఒకరికొకరు ఎంతో ఆత్మీయంగా రాసుకునే వుత్తరాలే కాలక్రమాన చేత్తో రాసేరోజులు పోయి, ఫోనులూ, ఈమెయిలులూ అయిపోయేయి. దరిమిలా పత్రికలలో, అంతర్జాలంలో అభిప్రాయలుగా కూడా అవతరించడానకి అదే మూలం కావచ్చు. ఎందుకంటే, బ్లాగులలో చూస్తున్నాను అంత ఆత్మీయంగానూ అక్కా, అమ్మా అన్న పిలుపులతోపాటు త్వం శుంఠః అంటే త్వం శుంఠః అని వేసి వేయించుకోడాలూను.

నేను నా నెట్టవతారం ఎత్తేక, మీకథ బాగుందండీలాటి పొడిమాటలతో మొదలుపెట్టి, అలనాటి చెలులవలె ఆప్తులఅయిపోయిన వారు నాకు చాలామంది కాకపోయినా చాలినంత మంది వున్నారు.

 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నెట్పత్రికలలో కనిపించే వుత్తరాలు. వాటికి చాలా పేరులున్నాయి – మీ అభిప్రాయాలూ, మీమాటా, వ్యాఖ్యలూ, అక్షింతలూ, దీవెనలూ (చివరిరెండూ బ్లాగులలో ఎక్కువగా కనిపిస్తాయి.) – ఇలా. ఏపేరు పెట్టి పిలిచినా అవి వుత్తరాలే. అందులో ప్రకటితమయేవి ఆరాసినవారి మనోభావాలే.

కల్పనలకుండాలి బరువూ, లోతూ అంటూ బోధించే పండితులు వర్థమానరచయితలకి తరుచూ తగులుతూంటారు.

ప్రజాస్వామ్య పత్రికలయుగంలో పాఠకులే పాలకులు. వారిఅభిప్రాయాలమీద రచయితలకి గౌరవం వుండాలి. వుంటుంది కూడాను. కాని ఒక్కోప్పుడు మాత్రం గందరగోళంగా వుంటుంది.

 

ఆమధ్య ఒక యువరచయిత్రి కథకి వస్తువు ముఖ్యమా, కథనం ముఖ్యమా అని అడిగింది నన్ను. అపుడు నేను గంభీరంగా ఊపిరి తీసుకుని కథలు రకరకాలు అంటూ ఒక దంపుళ్లపాట అందుకోబోయాను. వెంటనే గుర్తొచ్చింది నేను ఇంతకుముందు రాసిన వ్యాసమూ, తిన్న చీవాట్లూను. అంచేత, అలా బోరుకొట్టే వ్యాసాలు మానేసి, వూరికే పోచికోలు కబుర్లు చెప్పి పబ్బం గడుపేసుకున్నాను.

ఓసారి నాకథ ఏపత్రికలోనో కనిపించినతరవాత నాకూ మామామయ్యకీ జరిగిన సంభాషణా, మాఅమ్మ తీర్పూ చెప్పాను తనకి. ఆకథ ఏమిటంటే …

ఇదిగో కనకమహలక్ష్మీ, కథల్లో ఇన్ఫర్మేషను రియలిస్టిగ్గా వుండాలా అక్కర్లేదా?’’

వుండాలి.’’

మరి విశాఖఎక్స్‌ప్రెస్ పొద్దున్న పది గంటలకి వస్తుందని రాసావేం? నీమాట నమ్ముకుని ఆరుగంటలకే వెళ్లి కూర్చున్నాను స్టేషనులో.  అది మధ్యాన్నం నాలుగ్గంటలదాకా రాలేదు.

నాకథకోసం అలా రాయవలసివచ్చింది.

కావలిస్తే కథ మార్చుకో. అంతేగాని అలా తెలిసీ తెలీని రాతలు రాయకు.  రైల్వే గైడు చూసి సరిగ్గా రాయి నెక్స్ట్ టైము. అసలు మన రచయిత్రులింతే. సరిగ్గా ఏదీ తెలుసుకోరు.

అప్పుడు మామయ్యకి మా అమ్మ ఇచ్చిన తీర్పు: నేనందుకే చెప్పేను, దానికథలు చదవకు. రైల్వేగైడు కొనుక్కు చదువుకోమని.

                                                                       

కిందటేడు ఇండియా వెళ్లినప్పుడు ఓ పాత స్నేహితురాలు కమ్ రచయిత్రిని కలిసాను.

మాటలసందర్భంలో ఏమేనా కొత్తకథలు రాసావా?అని అడిగాను.

మొదలెట్టాను కాని సాగడం లేదు.

ఏం?”

పాఠకుల ప్రశ్నలు చూస్తే భయం వేస్తోంది. నువ్వూ చూస్తున్నావు కదా. ఆయనెవరో నీకు ముగ్గురు పిల్లలు కదా, కథలో ఇద్దరే అని రాసావు. పిల్లలు నొచ్చుకోరూ అని కోప్పడ్డారు. మరో కత. ఆవిడకి పచ్చచీరంటే ఇష్టం. ఆయనకి వంకాయకూరంటే ప్రాణం. ఓరోజు ఆయన చిలకాకుపచ్చ చీర తెచ్చాడు. ఆవిడ గుత్తివంకాయ కూర చేసింది. ఆవిడచీర చూసి మూతి ముడుచుకుంది. ఆయన కూర పక్కకి తోసేసి లేచిపోయాడు. మరి అది కథ అవునా కాదా?”

బాగానే వుంది, భేతాళుడిప్రశ్నలా. దానికి ముందు, అంటే ఆయన అలాటి చీరలే అప్పటికే ముప్ఫై తెచ్చివుంటేనూ, అలాగే ఆవిడ వరసగా తొమ్మిది రోజులు అదే కూర చేసివుంటేనూ కథ మనోహరంగా  వుంటుంది. పోతే ఎవరు చెప్తున్నారు అన్నదాన్నిబట్టి కూడా వుండచ్చు అన్నాను గోడమీద పిల్లివాటంగా. ఆ మీదట నేనే అడిగాను. ఏం కథ రాద్దాం అనుకుంటున్నావు?

చావు గురించి.

 బాగానే వుంటుంది. అని మళ్లీ మామామయ్యమాటలు గుర్తొచ్చి, కాస్త రిసెర్చి చేసి రాయి, అని సలహా ఇచ్చాను. 

నేనూ అదే విన్నాను, కాని రిసెర్చి అంటే వారూ వీరూ శలవిచ్చినవే కదా. వారు కూడా స్వానుభవంతో చెప్పినవి కావు కదా. అంది.

లేదులే. రామారావుగారూ, సరస్వతీదేవిగారూ చావుమీద గొప్ప కథలు రాయలేదూ అన్నాను.

వారి కథలు పోయినవారు పోగా మిగిలినవారు పడే అవస్థలు. నేను రాయబోయేది చచ్చినాడికథ. అంటే చనిపోయినవాడు ఏం అనుకుంటున్నాడు, ఏంచేస్తున్నాడు లాటివి.

నాకేం తోచలేదు. గొప్పచిక్కే వచ్చిపడింది.

మరేం చేస్తావు?

చచ్చిపోవాలేమో, అంది.

చచ్చిపోయింతరవాత ఎలా రాస్తావు? అక్కడ కాయితాలూ, కంప్యూటర్లూ వుంటాయో వుండవో, రాసినకథ పంపడానికి తపాలావసతులు వుంటాయో వుండవో.

అది తెలుసుకోడానికేనా చచ్చిపోవాలి కదా.

నాకు గుండెలు గుభేలుమన్నాయి. నేరకపోయి అడిగానేమో అనిపించింది.

అదేం మాటే. చూడముచ్చటయిన సంసారం. రత్నమాణిక్యాల్లాటి బిడ్డలూ, అదేం ఆలోచనే అన్నాను గాభరా పడిపోతూ.

మరి చావుగురించి ఎలా తెలుసుకోవడం? అంది.

రాను రాను గడ్డుసమస్య అయిపోతోంది.

మరో సందేహం. ప్రాణాలతోనే వున్న కుక్కలూ, గాడిదలగురించి కూడా మనకి చాలా సాహిత్యం వుంది కదా.  నీవున్ కవివి కావు కద అని ఆయనెవరో కొండవీటి గాడిదని అడినప్పుడు మరి ఆయన గాడిద భాషా సంస్కృతులు తెలుసుకునే అడిగారా? అప్పట్లో యూనివర్సిటీలు అలాటి కోర్సులిచ్చేవా?

ఇచ్చేవేమో. వాళ్లందరూ గాడిదలసాంప్రదాయాలు క్షుణ్ణంగా చదువుకున్నారేమో, అన్నాను. అంతకన్న ఏంచెప్పను?

చావుమీద కథ రాయడం కోసం చావలేను. గాడిదమీద రాయడానికి గాడిదని కాలేను. మరి నాకు సాహితీపాలకులని అలరించే రచయిత్రినయే యోగంలేదు కాబోలు, అంది నా నేస్తం నీరు గారిపోతూ.

నాకు ఎనలేని జాలి ముంచుకొచ్చింది. ఆడువారు మంచికథకులు కాలేకపోవుటకు కారణములు అంటూ ఓ వ్యాసం రాసెయ్యాలనిపిస్తోంది. 

 

నేను అప్పుడప్పుడు ఈ-వుత్తరాలు చూస్తూంటాను. అలా చూస్తుంటే, ఒకసారి ఒక ఆభిప్రాయం కనిపించింది. .

ఎందుకండీ ఇలాటి కథలు రాసి మమ్మల్ని చంపడం?

మొదట ఉలికిపడినా, సర్దుకుని తరువాతి కథకి సాగేను.

ఇందులో నాకు ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.

రచయితగారూ, అర్థం వున్న కథలు రాయండి. చదువుతాం.

సంపాదకులూ, ఇలాటి కథలు వెయ్యకండి.

నాకు అనుమానం వచ్చి, రెండు నెలలు వెనక్కి వెళ్లి మరో నాలుగు కథలమీద వ్యాఖ్యానాలు చూశాను. రాసినవారి పేర్లు చూశాను. నా పరిశోధనాఫలితాలు క్రోడికరించి వేరే థీసిస్ రాస్తానెప్పుడో. ఇప్పటికి మాత్రం రిసెర్చర్లు తమ పరిశోధనాంశాలని కాన్ఫరెన్సులలో సమర్పించినట్టు కొన్ని సాధారణాంశాలు చెప్తాను.

 

పైన ఇచ్చిన వుదాహరణలు – ఇలా కత్తులు విసిరేవారు సుమారుగా ఓ నలుగురు వున్నారు. అవే పేర్లు మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. వారు వాడే పదకట్లు ఓ డజను వుంటాయి. వీరు కథ నిజంగా, పూర్తిగా చదివేరో లేదో, అందులో ఏం వుందో తెలుసుకునే ఆలోచన చేసేరో లేదో అనుమానమే. గారడీ చేసేవాడు చొక్కా చేతిలోంచి పేకముక్కలు లాగినట్టు అవే మాటలు మళ్లీ మళ్లీ లాగి పారేస్తుంటారు తమ వ్యాఖ్యలకింద. కట్ ఎండ్ పేస్ట్ వీరికి గొప్ప సౌకర్యం. అయితే. ఇలాటి వ్యాఖ్యలవల్ల ఏమిటి సాధించదల్చుకున్నారు ఆలేఖామాత్రులు నాకయితే అర్థం కాదు సప్తజన్మలెత్తినా.

 

ఉదాహరణకి ఒక్కమాట అర్థమయితే ఒట్టు అన్నవుత్త.ర. (వుత్తరాల రచయిత)ని తీసుకోండి. చక్కటి జానుతెనుగు, మెచ్చుకోక తప్పదు. మరి అలాటి మనిషికి  కాస్తలో కాస్త అయినా తెలుగు వచ్చుననే అనుకుంటాం కద. మరి ఒక్క ముక్కయినా ఎలా అర్థం కాకుండా పోయింది? నేనే ఆ కథారచయితని అయితే, నావంతుకి నేను చేయగల పని ఏమిటి?

ఇలా నన్ను ఆలోచింప జేయగలగడం ఆ వుత్తరంవల్ల కలిగిన తొలి ఫలితం అనుకుందాం.

ఆదివారం మజ్జానం మాయింటికి రండి. ప్రవేటు క్లాసు పెడతాను అని చెప్పనా?

పోనీ, మీరే నాకు క్లాసు పెట్టండి అని వినయవిధేయతలతో వేడుకోలు అంపుకోనా? ఇది మరీ ప్రమాదం. ఎందుకంటే ఆ వుత్త.ర. నాకథని సీరియస్గా తీసుకోకపోయినా ఈమాటని సీరియస్గా తీసుకోవచ్చు. నాకు పాఠం చెప్పేయడానికి మహోత్సాహంతో పాఠాలు మొదలు పెట్టేస్తానంటూ మాయింటికో, నాచాటులోకో వచ్చేయొచ్చు. నిజంగా ఆలా క్లాసు పెట్టేస్తే. నేను తట్టుకోగలనా? నాది అసలే బక్క ప్రాణం. 

 

ఒకసారి ఎక్కడో చూసాను ఒకరచయిత అప్‌డేట్ చెయ్యడం కష్టంగా వుంటోంది. నాబ్లాగు మూసేద్దాం అనుకుంటున్నాను అని రాసేరు.

దానిమీద వ్యాఖ్య శుభం. వెంటనే మూసేయండి మరి.అని.

నాకు ప్రాణం చివుక్కుమంది. ఎందుచేతనంటే ఆ రచయిత చాలాకాలంగా రచనలు చేస్తున్నారు. అయిన పెద్దలు మెచ్చుకున్నారు. సాటి బ్లాగరులు అభినందించారు.  ఈమధ్య వచ్చిన వ్యక్తిగత కారణాలమూలంగా వారు తనకి కలిగిన నిస్పృహని బ్లాగులో రాసుకున్నారు. అలాటప్పుడు ప్రోత్సాహకరంగా ఓముక్క రాస్తే బాగుంటుంది. ఏమీ రాయకపోయినా బాగుంటుంది. అఁతే కానీ మరింత నిరుత్సాహపరచడం తగునా?

 

ఆ వుత్త.ర. తానేదో గొప్ప హాస్యంగా రాసేననుకుని మురిసిపోతూ వుండొచ్చు. కంప్యూటరుతో వచ్చిన చిక్కే ఇది. తెరవెనక ఎవరు ఎలా వుంటారో, వారి పరిస్థితులేమిటో మనకి తెలీవు. తెలిసీ తెలియని అస్తవ్యస్త పరిస్థితులలో పరాచకాలు రాణించవు.

 

పోతే, మరో సంగతి. అందరిసంగతి నాకు తెలీదు కానీ నాకు మాత్రం రెండు, మూడు నెలలు పడుతుంది ఒక కథ రాయడానికి.. టైం ఈజ్ మనీ అనుకుంటే రచయితలకి నో మనీ. (కొందరికి మాత్రమే ఈజీ మనీ). అంత పాటు పడి దేశంలో పత్రికలకి పంపిస్తే అవి అందేయో, లేదో, ప్రచురణకి అంగీకరించేరో లేదో తెలీదు. ప్రచురించినతరవాత అయినా ప్రచురించాం అని తెలియబరచరు. అంచేత నెట్ పత్రికలకి ఇవ్వడం మొదలు పెట్టాను. అక్కడ పైన చెప్పినలాటి వుత్త. ర.లు, సగం సగం చదివో, చదవకుండానో మాకర్థం కాలేదంటూ ఓవాక్యం గిలికి పారేస్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం – తమరిని ఎవరూ కూచోబెట్టి నువ్విది చదివి తీరాలీ అంటూ బెత్తం పట్టుకు బెదిరించలేదు కద. నాకు రాయకు అని చెప్పడం కన్నా తమరు చదవడం మానేయడం తేలిక గదా. ఎంచేతంటే చదవడం మానేడడం తమరిచేతిలో పని. నాచేత రాయడం మానిపించడం తమరిచేతిలో లేని పని. చిత్తగించవలెను.

 

పాతికేళ్లకిందట ఆరుద్రగారు నాకు ఒక వుత్తరం రాసేరు, నాప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ. అందులో ఈ విషయమే ప్రస్తావిస్తూ, ఏరీతి రచియించిరేని సమకాలికులు మెచ్చరు గదా‌‌ అని చేమకూర వేంకటకవి వాపోయినట్టు చెప్పారు. అలాటివే మరో నాలుగు ఉదాహరణలు కూడా ఇచ్చారు. గురజాడ అప్పారావుగారు కొయ్యబొమ్మలె మెచ్చు కనులకు కోమలుల సౌరెక్కునా? అన్నది కూడా ఇలాటి వ్యాఖ్యలవిషయంలోనే. ఆయనకి విజయనగరం రాజావారి ప్రాపకం వచ్చినతరవాతే మహాకవి అయిపోయారు. బంగారుపళ్లెరానికి గోడ చేర్పు మరి!

 

నిజానికి, కథ చదవగానే ఏశక్తి పాఠకుడిని వుత్తరాలు రాయడానికి ప్రేరేపిస్తుంది? ఆ కథలో ఏదో ఒక మాటా, ఒక వాక్యం, ఒక పాత్రా, ఒక సంఘటనా – వీటికి స్పందిస్తాడు పాఠకుడు. ఏదో ఒకదానికి పోలింది తనజీవితంలోనో తనకి ఆప్తులయినవారి జీవితంలోనో సంభవించినప్పుడు ఆ కథ నచ్చుతుంది. అలా పోలికలు చూసుకోగలిగిన పాఠకుడు అనుకూలంగా స్పందిస్తాడు. అందుకు భిన్నంగా  తనకి ఎక్కడా ఆలాటి అనుభవం లేనప్పుడు చిరాకు పడతాడు. అలాటిసందర్భాలలో రాసే వుత్తరాలే వింతశోభలతో విరాజిల్లుతూ నలుగురినీ ఓదరికి చేరుస్తాయి.

ఎలా అంటే –

ఒకరు మీ కథ మీమొహంలా వుంది అని ఒక అభిప్రాయం వెలిబుచ్చారనుకోండి. (మీ- అనే అంటారు). దానిమీద నాలాటి రచయిత అయితే, మీ అభిప్రాయం నాకు అర్థం కాలేదు. నామొహం అందంగా వున్నట్టా, లేనట్టా? మరి నాకున్న మొహం చూసే కద నన్ను చేసుకున్నారు మావారు, అదీ కానీ కట్నం ఆశించకుండానూ” అనొచ్చు. లేదా, నాకు రెండు మొహాలు ఉన్నాయనుకుంటున్నారా? అబ్రహాం లింకన్‌ని ఎవరో టూ-ఫేస్డ్ అన్నారుట. దానికి ఆయన నాకు రెండు మొహాలుంటే నేను ఈ మొహఁవేసుకుని ఎందుకు తిరుగుతానూ అన్నాట్ట. ఆయన రూపసి కాడనీ, అది దాచుకోడానికే ఆయన గడ్డం పెంచేడని ప్రజావాణి. అనైనా అనొచ్చు.

 

అప్పుడు సహజంగానే ఆ ఉత్త.ర. అబ్రహాం లింకన్కీ మీకథకీ సంబంధం ఏమిటండి అంటూ మరో ఉత్తరం రాస్తాడు. నేను జవాబివ్వకముందే మరొకరెవరో అందుకుంటారు. అసలు కథలో మీకు నచ్చనిదేదో చెప్పకుండా మీ మొహంలా వుంది అంటే ఏం తెలుస్తుందండీ ఆకథలో లోపాలేమిటో‌ అని.  అప్పుడు మరెవరో మరేదో అంటారు. ఇది  దీనికే నేను పెట్టుకున్న ముద్దుపేరు అ.గీ.పా.త.దే. (అగ్గిపుల్ల గీసిపారేసి తమాశా దేఖో) అని.

 

ఇలా నలుగురూ నాలుగు రకాలుగా మేలులాడుకుంటూ కొంతకాలం జరుపుతారు. ఈలోగా ఆనెట్పత్రికవారు కారణాంతరాలవల్ల ఆ మేలు తీసేస్తారు. ఇది నెట్ సౌఖ్యం. మరో గారడీ. ఇంగ్లీషులో అంటుంటారు చూడండి.  Now you have it, now you don’t అని. అలాగే ఇదీను.

 

నిజానికి ఆ వుత్త.ర.లననడానికి లేదులెండి. ఈనాటి నీతి అదీ. మీ బ్లాగు నలుగురి కళ్ల బడడానికి వర్డ్‌ప్రెస్‌వారు ఇచ్చే సలహాలు చూడండి. అవతలివారు యతి అంటే మీరు ప్రతి అనాలి. ఎంత వ్యతిరేకంగా, ఎంత ఘాటుగా మాటలు విసిరితే అంత ఘనత. అసలు కథలో ప్రధానాంశం ఏమిటీ, సన్నివేశాలు దానికి తగ్గట్టు వున్నాయా, లేవా వంటి సూక్ష్మవిషయాలు పట్టించుకోనక్కరలేదు. పత్రికలలో ఉత్తరాలకి కూడా ఇదే రూలు. మీపేరు నలుగురి కళ్లా పడాలంటే, నలుగురి నోళ్లా నానాలంటే మీరు ఔద్ధత్యం ప్రదర్శించక తప్పదు. ఏంచేస్తాం, లోకం అలా వుందనుకుని ప్రవాహంలో కలిసిపోవాలి, అంతే..

 

అయితే పొగిడితే మంచీ, తెగిడితే ద్రోహమూనా? అని అడక్కండి. కాదండీ, ఎంతమాత్రమున్నూ కాదు. నేను అనేది తెగడడంలో రెండు రకాలున్నాయి కదా. ఏమిటి బాగులేదో, ఎందుకు బాగులేదో చెప్పడం ఒక పద్ధతి. హెచ్చరిక – అలా మంచీ చెడూ వివరిస్తూ రాస్తే మీరు ఉత్త.ర.గా రాణించలేరు. మంచి discerning reader అయిపోతారు.  మీఆశయం అదా లేక ఉత్తుంగతరంగాలు రేపడమా అన్నదానికి మీరే సమాధానం ఇచ్చుకోవాలి.

అంకితం – స్నేహితురాలూ, తే.జో.శీలీ వైదేహికి ప్రేమతో.  — మాలతి.

(మా.ని. జూన్ 2008. )

 

 

 .

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

27 thoughts on “ఊసుపోక అయ్యో నారాతా”

 1. మంచి విషయాలు చెప్పారు…చెయ్యి తిరిగిన రచయిత్రి మీరు మీరు కధని ఎటైనా తిప్పగలరు.కొత్త వారికీ కొంత తడబాటు తప్పదు మరి… మీ సూచనలు శిరోధార్యం.

  మెచ్చుకోండి

 2. రానారెగారూ, ధన్యవాదాలు.
  మొహమాటం. బాగా అన్నారు. నిజమే, ఒకొకప్పుడు బాగుందన్నవారిని ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తుంది. ఒకొకప్పుడు ఎందుకు బాగుందనిపించిందో చెప్పడం కష్టం కూడా. నాకు ముఖ్యంగా ఈసమస్య కవితలు చదివినప్పుడు.

  మెచ్చుకోండి

 3. మాలతిగారూ, మీరు మాట్లాడుతూ వుంటే వింటున్నట్టుంది గానీ ఈ టపాలో మీర్రాసింది చదువుతున్నట్టుగా అనిపించలేదు. ‘దంపుళ్లపాట’ భలే ప్రయోగం.
  సింగిల్లైను విమర్శలకు నొచ్చుకుని ఎందుకు అని ప్రశ్నించేవారు ‘బాగుంది’ వంటి సింగిల్లైను అభినందనలకు ‘కిమ్’ అనరే అన్నారు కొందరు మిత్రులు. ఎందుకు బాగుందో ఏది బాగా నచ్చిందో తెలుసుకోవాలనే చిన్న కోరిక నాలుగుముక్కలు రాసినవారెవరికైనా తప్పకుండా వుంటుందనే నేననుకుంటాను. నా మటుకు నాకు ‘బాగుంది’ అంటే ఉత్సాహంతోపాటు, ‘ఎందుకు బాగుందో చెబితే బాగుండును కదా’ అనిపిస్తుంది. ఐతే … మీకేం నచ్చిందో చెప్పండి అని అడిగితే సంతోషం సినిమాలో ‘ఇంకోసారి చెప్పండి ప్లీజ్‘ అని కోటశ్రీనివాసరావు బ్రహ్మానందాన్ని నంజుకుతిన్నట్టుగా వుంటుందేమో కదా అని మొహమాటం! 🙂

  మెచ్చుకోండి

 4. శునకానందం, సింగిల్ లైను విమర్శలు, కీబోర్డుకావరం — 🙂 బాగున్నాయి.
  నిజమేనండీ కొందరిమాటలు సీరియస్ గా తీసుకోకూడదని తెలియడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి.
  వాళ్లని చచ్చి చూడమనండీ – అద్వితీయమైన సలహా. నాడైరీలో రాసుకున్నాను. థాంక్స్.

  మెచ్చుకోండి

 5. ఎక్కడో చదివాను. మనం ఎవర్నైనా మెచ్చుకొంటే ఇద్దరు ఆనందిస్తారు ..కాబట్టి ఈ పొగడ్తలు పొట్టివైనా గట్టి మేల్ తలపెట్టేవే… కానీ విమర్శించినప్పుడు ఒక్కరికే ఆ అనందం … ఐతే ఇలా కారణం చెప్పకుండా ‘ అసలు మీ కధేం బాగోలేదు ‘ అనేవాల్లకు కలిగేదానికి వేరే పేరుంది శునకానందమనీ… ఈ మధ్య చాలా బ్లాగ్‌లలో విరివిగా కనిపిస్తున్నాయి ఈ సింగిల్ లైన్ విమర్శలు. పాపం వాళ్ళు ఎదో మూడ్‌లో ఉండి చదువుతారు.. ఎక్కడో, ఏదో, ఎందుకో, నచ్చదు. సర్లే ఈ రాసినోల్లేమన్నా మనల్ని అడగొచ్చరా అనే కీబోర్డుకావరంతో ఒక మాట అనేసిపోతారు. అసలు ఇలాంటి కామెంట్‌లకి సమాధానమివ్వడం, వారి అభిప్రాయనికి కారణాలు అడగడం అనవసరం. అడిగారు కదాని తీరిగ్గా కూర్చుని తప్పుల్ని తవ్వి మరీ బయటకు తీస్తారు. నిజంగా మనసుపెట్టి చదివినవాళ్ళు నచ్చకపోతే మొదటిసారి చదివినప్పుడే రచయిత్రి(రచయిత) అంతరంగాన్ని అర్ధం చేసుకొని స్పందిస్తారు( అది ఏ విధంగానైనా సరే).

  ఇక మీస్నేహితురాలికి నా తరపున చిన్న సలహా: మీరు నిరభ్యరంతంగా చావు మీద మీ కల్పనలతో కధను అల్లవచ్చు. ఎవరన్నా పాఠకులు లాజిక్ అడిగితే వాళ్ళని చచ్చి చూడమనండి లేదా మీరు చచ్చి తిరుగుతున్న ఆత్మలతో సంప్రదింపులు జరిపాకే ఇది రాసానని జవాబివ్వండి… 😉

  మెచ్చుకోండి

 6. మాలతి గారూ,

  ముందుగా మీ సదభిమానానికి ధన్యవాదాలు.

  నిష్పక్షపాతంతో,సహేతుకంగా పాఠకులు చేసే నిర్మాణాత్మక విమర్శలు ,కవులు/రచయితలు తమ ప్రతిభ పెంచుకోవటానికి నిస్సందేహంగా ఉపయోగ పడతాయి. నా వరకూ నేను ,ఒక రచన పాఠకులకి నచ్చటానికి కల కారణాలు కూడా తెలుసుకోవాలని అనుకుంటాను (వీలయితే). కొన్నిసార్లు సునిశితమైన స్పందనాశక్తి గల పాఠకులు , కవి/రచయిత తమ రచనలలో ఒక కోణం లో ఆవిష్కరించిన విషయాలకు, తమ విశ్లేషణ ద్వారా చక్కటి ఎక్స్టెన్షన్ ఇవ్వటమో,అందులో నిబిడీకృతమైన మరొక కొత్త కోణం పై వెలుగుని ప్రసరింపచేయటమో జరుగుతుంది.
  ఇవేమీ లేని విమర్శలపై మీరు రాసిన టపా ఆల్రెడీ ఉండనే ఉంది.:)

  ఎప్పటి లాగే ఆలస్యంగా….

  వైదేహి శశిధర్

  మెచ్చుకోండి

 7. @ వికటకవి గారూ, నిజమే కానీ నేను మాత్రం బాగుందన్నప్పుడు కూడా ఏమిటి బాగుంది అని మథనపడుతుంటాను. తరుచూ మాటాడుకునేవాళ్లయితే అడుగుతాను నీకు బాగున్నది ఏమిటి అని.
  @ వెటిజన్ రానారె గారి సంపాదకీయం నేనింకా చూడలేదు. చూస్తాను. జెండర్ స్పెసిఫిక్ లక్షణాలు అంటే ఏమో మరి, ఈ కలంపేర్లరోజుల్లో ఎవరు ఎవరో చెప్పలేం కదా.
  వ్యాఖ్యలు వైయక్తితంగా చేస్తున్నట్టు కూడా అనిపిస్తోంది చాలాసార్లు. అంటే మరేదో రకమైన కక్షలూ, కార్పణ్యాలూ వున్నప్పుడు కథని వదిలేసి కథకులని దులపడం. దానికి రెండోవేపు ఇష్టమయినవాళ్లయితే అద్భుతం అంటూ మెప్పులు కురిపించడం … ప్చ్.

  మెచ్చుకోండి

 8. “…నెట్పత్రికలలో కనిపించే వుత్తరాలు. వాటికి చాలా పేరులున్నాయి – మీ అభిప్రాయాలూ, మీమాటా, వ్యాఖ్యలూ, అక్షింతలూ, దీవెనలూ (చివరిరెండూ బ్లాగులలో ఎక్కువగా కనిపిస్తాయి.) – ఇలా. ఏపేరు పెట్టి పిలిచినా అవి వుత్తరాలే. అందులో ప్రకటితమయేవి ఆరాసినవారి మనోభావాలే”.
  అవును.
  కొన్ని పొట్టిగా తియ్యాగా ఉంటాయి. కొన్న పొడుగ్గ చేదుగా కూడ ఉంటాయి. అసలు కొన్నింటికి మీరన్న అ లు, దీ లు, మా లు, ఏవి ఉండవు. కొందరు ఒక మాట అని వెళ్ళిపొతారు. వాళ్ళతో మాట్లాడలన్నా కుదరదు.
  పొద్దులో రానరె గారు కూడ ఈ జాబులు – జవాబుల మీదే సంపాదకీయం వ్రాసారు. మీరు ఉత్తరాల మీద వ్రాసారు. ఇంకేవరో కూడ వీటిమీద వ్యాఖ్యానించారు.

  ఈ జాబులు జలుబులకి జెండర్ స్పెసిఫిక్ లక్షణాలేమన్నా ఉన్నవా?

  మెచ్చుకోండి

 9. మాలతి గారు,

  నాకు ఫలానాది నచ్చలేదు అని చెప్పటానికి, ఆ ముక్క రాసినవాళ్ళు రచయిత అది రాసి అరగదీసుకున్న బుర్రలో కనీసం పాతిక శాతమన్నా సొంత బుర్ర అరగదీసుకోవాలి. బాలేదని చెప్పటానిక్కూడా ఇంత బుర్ర ఖర్చెందుకని ఒక్క ముక్కలో ముగిస్తుంటారు అనమాట. అదిసరే, మరి బాగుందన్నవాళ్ళని ఎంతమంది ఎందుకు బాగుందని అడగరే?

  మెచ్చుకోండి

 10. @ మహేష్ కుమార్, థాంక్స్.

  @ కొత్తపాళీ, 🙂 మీరు రెండోసారి చదివేరని పొంగిపోనా, ఇలా తప్పులు పడుతున్నారని విచారించనా? లేదండీ మగవాళ్లు ఎలా రాస్తున్నారో నాకెలా తెలుస్తుంది.

  ఆడవాళ్లరచనలని తప్పులు పట్టడం సర్వసాధారణం కదా. ఆఖరికి కాళీపట్నం రామారావుగారు కూడా ఈలేడీ రైటర్సు రాసేస్తున్నట్టు అనకుండా వుండలేకపోయారు కుట్ర కథలో. నిజానికి నాకథల్లో కూడా వున్నాయి అలాటి విసుర్లు. అదే మరి తెలుగు హాస్యం. 🙂

  మెచ్చుకోండి

 11. మీ టపా మళ్ళి చదువుతూ ఉంటే ఇంతకు ముందు తోచని అర్ధాలు తోస్తున్నై. 🙂

  ***“చావుమీద కథ రాయడం కోసం చావలేను. గాడిదమీద రాయడానికి గాడిదని కాలేను. మరి నాకు సాహితీపాలకులని అలరించే రచయిత్రినయే యోగంలేదు కాబోలు,” అంది నానేస్తం నీరుగారిపోతూ.

  నాకు ఎనలేని జాలి ముంచుకొచ్చింది. ఆడువారు మంచికథకులు కాలేకపోవుటకు కారణములు అంటూ ఓ వ్యాసం రాసెయ్యాలనిపిస్తోంది. … ***
  అంటే ,, మగ రచయితలు ఇవన్నీ (గాడిదలూ గట్రా) అయ్యే రాస్తున్నారంటారా? వామ్మో, మీతో పని కాదు!

  మెచ్చుకోండి

 12. నిజమే పొగడ్తలైనా తెగడ్తలైనా వాటికి కారణాలుండాలి. కాకపోతే ఒక్కోసారి “బాగుంది” అనిపిస్తుంది, దానికి కారణాలు వెదకడం కష్టం.

  మెచ్చుకోండి

 13. @ ప్రవీణ్, అవునండీ చాలా ఆలస్యంగా తెలిసింది. 🙂
  @ కృష్ణారావు, పొగడ్తలు కూడా సహేతుకం కానక్కరలేదని కాదండీ కానీ అంత నొప్పి అనిపించదు కారణాలు తెలీకపోతే. ఆరచనకి సంబంధించినంతవరకూ రచయిత చెయ్యవలిసింది ఇంక ఏమీ లేదన్న జ్ఞానమూ, దానివల్ల తృప్తీను. అంతే.

  మెచ్చుకోండి

 14. టపా చాల బాగుంది. ఇక్కడో విషయం. అప్పుడు కాని ఇప్పుడు కాని.. WRITERS (రచయతలు.. రచయత్రులు), BLOGGERS (తెలుగు లో ఏమని అంటారు??) అంటూ ఉంటారు.. విమర్శలు సహేతుకంగా ఉండాలని.. మరి ఆ సహేతుకమనేది.. పొగడ్తలకి అక్కరలేదా??

  మెచ్చుకోండి

 15. మీ అభిప్రాయాలు బాగా చెప్పారు.

  పాఠకుల అభిప్రాయాలు మన రచనల్ని సరిదిద్దుకోవడానికి మంచి మార్గం అని నా అభిప్రాయం.
  కొంత మంది ఆలోచించి తమ అభిప్రాయాలు రాస్తారు. ఆ అభిప్రాయాలు కొన్ని సార్లు మనం ఆలోచించిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకో కోణంలో కుడా ఉంటాయి. అది కూడా మంచిదే.
  అయితే ఏ అభిప్రాయం ఎంచుకోవాలో, ఏది వదిలెయ్యాలో రచయితదే తుది నిర్ణయం.

  మెచ్చుకోండి

 16. @సుజాత, 🙂 నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు. ప్రతిది excellent అయితే, Excellent becomes ordinary. Then I have to raise the bar :))

  @బొల్లోజు బాబా, థాంక్సండీ.

  @ సౌమ్య, టాల్స్ టాయ్ కదూ చెప్పింది all happy families alike, but each unhappy family is unhappy in its own way అని. బాగుంది అంటే సర్వాంగసుందరంగా వుంది అనుకుంటాం. బాగులేదు అంటే ఏ అంగం బాగులేదు అన్న ప్రశ్న వస్తుంది. తెలిస్తే రచయితకి దిద్దుకోడానికి అవకాశం వుంటుంది. అసలు ఏదీ బాగులేదు అంటే సరే. :p.

  మెచ్చుకోండి

 17. బాగుందండీ. ఇంతకీ, బాగుందన్నప్పుడు ఇలా ఒక పదం రాసి వదిలేస్తే ఒప్పుకుంటారు కదా. బాలేదన్నప్పుడు కూడా అలానే రాస్తే మరి ఎందుకు ఒప్పుకోరు?

  మెచ్చుకోండి

 18. చెప్పదలచుకొన్న విషయం ఒద్దికగా, వినయంగా పోష్టులో ఇమిదిపోయింది. దొడ్డచేయి కదా!
  చాలాబాగున్నాయండి, మీరు చెప్పిన విషయాలు.
  సాహితీయానం

  మెచ్చుకోండి

 19. మాలతి గారూ, మాటల్లేవు! చప్పట్లే!
  కుటుంబరావు గారి తర్వాత అంత flow తో రాయగలిగేది మీరేనని నాకనిపిస్తుంది.(ఈ పోస్టు చదవక ముందు కూడా) ముఖ్యంగా ‘దంపుళ్ల పాట ‘ కి మరో సారి చప్పట్లు! విశాఖ ఎక్స్ప్రెస్ కూడా!

  ఉత్తరాల రోజులు గుర్తుకు తెచ్చారు. అందుకు థాంక్సు!
  ఇంతకంటే ఏమి రాయాలో తెలీడం లేదు. మొత్తం మీద excellent అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మీరేం రాసినా నాకది భలేగా నచ్చుతుంది మరి!

  మెచ్చుకోండి

 20. @సిబిరావు గారు, థాంక్స్.
  @కొత్తపాళీ, థాంక్స్.
  @రాధిక, అవును పుత్తరాలు .. మరో ఫిఫ్తుఫారం స్నేహితురాలు తన ఎడ్రెస్ ఇచ్చింది 57 ఏళ్ల తరవాత. నేను ఉత్తరం రాసి, మల్లెపూలదండలాటి తన ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాను.
  @ తెరెసా, సర్టిఫికేటని కాదండీ మీకు నచ్చుతాయని తెలిస్తే సంతోషం. ఇంకమీద తెరెసా కూడా చదువుతున్నారు ఈకథ అనుకుంటాను మళ్లీ కొత్తది పెట్టినప్పుడు.

  వారాంతంలో ఇంతమంది చదువుతారనుకోలేదు. అందరికీ కృతజ్ఢతలు.

  మెచ్చుకోండి

 21. మాలతిగారూ,
  మీ రచనలకి వీరాభిమానిని నేను. మీకు నెను సర్టిఫికేటిచ్చేదేవిటిలే అని ఎప్పుడూ కామెంటు రాయలేదు. మీరు ఈ ‘కామెంటోపాఖ్యానం’ సమయానుకూలంగా రాశారని ఆనందం వెలిబుచ్చుతూం ఓ ్ముక్క రాయాలంపించింది. ఆభినందనలు.

  మెచ్చుకోండి

 22. అచ్చు పత్రికలలో వచ్చే రచనలకూ, నెట్ పత్రికలకూ ఒక ముఖ్య తేడా ఉంది. మన రచనకు స్పందనగా ఎన్ని ఉత్తరాలు వచ్చినా, ఎదో కోటా ఉన్నట్లుగా 1 లేక 2 ఉత్తరాలే వేస్తారు. మీ కథనం పాఠకులకు నచ్చితే నెట్లో వచ్చే ఉత్తరాల వర్షాన్ని ఎవరూ ఆపలేరు. తాజాగా సుజాత రచన అమ్మాయిలు – ఆంటీలు కు రెండు రోజుల్లో 41 వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇలాంటి తృప్తి మీకు అచ్చు పత్రికలలో లభ్యమా? నెట్ లోకి వచ్చి, ఎందరి అభిమానాలనో మీరు సంపాదించుకో గలిగారు కదా. మీరు అచ్చులోనే ఉంటే ఈ ఉత్తరం మీకు వచ్చేది కాదు.

  మెచ్చుకోండి

 23. అప్పటి సంగతి తెలియదుగానీ ఇప్పుడు కూడా మీ ఉత్తరాలు మళ్ళా మళ్ళా చదివిస్తాయి.చూస్తూ ఉంటే మీ స్నేహితురాలు కూడా మంచి రచయితలా అనిపిసున్నారు.
  నిజమే కొంతమంది రాసే కామెంట్లు చదివితే ఎందుకు రాస్తారో తెలియదు.బాగుంటే ఎందుకు బాగుందో చెప్పకపోయినా పర్లేదు.కానీ బాగోలేదన్నప్పుడు ఎందుకు బాగోలేదొ చెపితే మనకి కాస్త హెల్ప్ ఫుల్ గా ఉంటుంది కదా.

  మెచ్చుకోండి

 24. Awesome post madam!!

  మీ ఇతర టపాలు చదివి కూడా నేనెప్పుడూ ఉత్తరం రాయలేదు.. భయం వేసింది.. ఏం రాస్తానో అని.

  కానీ ఈ టపా మాత్రం భలే ఉంది. నాకు బాగా నచ్చింది. మనం ఏం రాసినా అది చదివే వారిని బట్టే ఉంటుంది కదా!! చాలా మంచి విషయాలు చెప్పారు.

  Poornima

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s