మూఢనమ్మకాలు

సంగాపురం సుబ్రహ్మణ్యస్వామికి అమెరికాగడ్డమీద అడుగెట్టగానే అర్జెంటుగా చెయ్యాల్సివచ్చినవి రెండు.  మొదటిది పేరు మార్చుకోడం, రెండోది చెయ్యి కాల్చుకోడం.

అసలు ఎయిర్పర్టులోనే మొదలయింది పేరుతో తంటా. ఇమిగ్రేషను కౌంటరు దగ్గర మనిషి పాస్పోర్టూ సుబ్రహ్మణ్యంమొహమూ మూడుమార్లు మార్చి మార్చి చూసి ఈ భూప్రపంచంలో ఇలాటి పేరుగలవాడు మరొకడుండడులే అని నిర్థారణ చేసుకుని పొమ్మన్నాడు. ఒకళ్ళిద్దరు తెల్లవాళ్ళు మంచితనానికి పోబోయి హలో చెప్పి పేరు వినగానే జడుసుకున్నట్టు “ఓ” అనేసి పక్కకి తప్పుకున్నారు.

ఆ తరవాత సంగాపుర్ అనీ, సుబ్రహ్మణ్యస్వామి అనీ సుబ్రహ్మణ్యం అనీ, స్వామి అనీ, మణ్యం అనీ అనేకవిధాల వాళ్ళమీద ప్రయోగాలు చేసి చూశాడు. suburuలో “సు”లాగ, brownలో బ్ర లాగ అని ఓ సూచికలపట్టిక కూడా తయారు చేశాడు ఒకొక అక్షరానికీ. కానీ వాళ్ళు తన సూచనలన్నీ గాలికొదిలేసి పోల్చుకోడానికి వీల్లేనంతగా తనపేరు చిత్రవధ చేసేస్తున్నారని తెలిసేసరికి ఓ నెలరోజులు గడిచిపోయేయి.

అతడికి కడుపు మండింది. సుబ్రహ్మణ్యం పుట్టడానికి ముందురోజు నాయనమ్మకి సుబ్రహ్మణ్యేశ్వరుడు కలలో కనిపించేడుట. బారసాలనాడు నాగరాజు నట్టింట నాట్యం చేస్తూ దర్శనమిచ్చేడు. అలా అతడిపేరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా స్థిరపడిపోయింది. ముచ్చటగా అమ్మ పెట్టుకున్నపేరు చప్పిడికూరలు తినే ఈ జనాల నోళ్ళ తిరగవు. ఆ ఆపరేషనేదో నేనే చేసేస్తే కనీసం నేనే చేసేనన్న మాటేనా దక్కుతుందని “నాపేరు సుబ్బులు, నాకారు సుబురు” అంటూ ఓ చిన్న గీతం కట్టేడు.

అది కూడా సాగలేదు. ఊళ్ళోవాళ్ళు ల,రయోరబేధః అని సూత్రీకరించి పేరూ కారూ కూడా సుబురు చేసేశారు. ఇహ గతి లేక తలా తోకా తెగ్గొట్టి, మణి అని మొదలుపెట్టి, మన్‌ గా స్థిరం చేసేడు చివరికి సుబ్రహ్మణ్యస్వామి. తనకి మనిషిమీద మాత్రమే నమ్మకం. అంచేత మన్‌ అన్న పేరులో విశేషార్థం గూఢం!

రెండోబాధ – సుబ్రహ్మణ్యస్వామి దేశంలో ఉన్నప్పుడు గిన్నేదో గరిటేదో తెలీకుండా పెరిగేడు. మేనత్తో నాయనమ్మో కంచంలో కూడు పడేస్తుంటే అవేమిటో, ఎలా వచ్చేయో తెలీకుండానే తినేసి, కదాచితుగా కూరలో ఉప్పెక్కువ, చారు నీళ్ళూ అంటూ సాధిస్తూ గడిపేశాడు.

అమెరికా వచ్చేక, అన్నం ఎలా వండుతారు, వంకాయకూరలో ఉల్లిపాయలరుచి ఎలా వస్తుందిలాటి ప్రశ్నలు ఉదయించేయి. మొదటి రెండురోజులు పచ్చి కూరలూ, రొట్టెముక్కలూ తిన్నాడు కానీ రాను రాను ఆ చప్పిడి కూడుతో జిహ్వ చచ్చి ఎక్కళ్ళేని నీరసం ఒచ్చి, నిజంగానే జొరం వచ్చినట్టు అనిపించసాగింది. ఉప్పూ పులుసూ తినేవాడికి వచ్చేంత కోపం వచ్చింది. ఆ రోజుల్లోనే బజారులో దేశవాళీ మొహం కనిపిస్తే అతనిమొహం చప్పున మతాబాలా వెలిగేది.

సాధారణంగా అమెరికాలో కొంతకాలం ఉన్న మనవాళ్ళకి కొత్తమొహాలు ఇట్టే తెలిసిపోతాయి. చూడగానే సడెన్ బ్రేకు వేసినట్టు ఆగిపోతారు. ఆ తరవాత “మీరు తెలుగువారా?” అని ఇంగ్లీషులో పృచ్ఛించి, గోత్రనామాలు చెప్పుకున్నాక ఫోన్నెంబర్లు ఇచ్చి పుచ్చుకోడాలు అయింతరవాత ఎవరి దారిన వారు పోతారు. కొంచెం ఎక్కువ కాలం ఉన్నవాళ్ళయితే కొత్తవాళ్ళని అప్పడప్పుడు భోజనాలకి పిలుస్తారు. తరవాత కొందరివిషయంలో స్నేహాలు బలపడి, తామే వారిని పిలిచి వస్తున్నాం అని చనువుగా వారాలు చెప్పుకున్నట్టు చెప్పుకునే పరిస్థితులు కూడా తటస్థపడతాయి అరుదుగానే అయినా.

సుబ్రహ్మణ్యానికి అలాటి స్నేహాలు ఒకట్రెండు తగిలేయి. కానీ రాను రాను తనకే ఆ బతుకు హేయంగా తోచి, “వంట మహా యజ్ఞమా ఏమిటి, నేనే చేసుకుంటాను,” అని ఓ శుభముహూర్తాన బజారుకెళ్ళి ఓ రెండు గిన్నెలు కొనుక్కొచ్చేడు. ఆ మధ్యనే పరిచయం అయిన సుందరిగారిని పిలిచేడు ఫోనులో, “కూర పొయ్యిమీద పెట్టేను, తరవాతేం చెయ్యమంటారు?”, “బియ్యంలో ఎన్ని నీళ్ళు పొయ్యాలి?”, “ఎంతసేపు ఎన్ని డిగ్రీలు ఫారెన్‌హైటులో పెడితే అన్నం అవుతుంది?”లాటి ప్రశ్నలతో ఊదర పెట్టేస్తుంటే, ఫోనులో జవాబులు చెప్పలేక ఆవిడే కారేసుకు వచ్చేశారు మొదటిరోజున. తరవాత ఓ వారంరోజులకి సరిపడా పాఠాలు రాసిచ్చేరు. మొత్తంమీద నెల తిరిగేసరికి అన్నం కూరా చేసుకోడం చేతనయేయి. సుందరిగారు అప్పుడప్పుడు సాంబారూ, పచ్చళ్ళూ ఇస్తూ వచ్చేరు.

నాలుగు నెలలపాటు అంతా సజావుగానే సాగిపోతోందనిపించింది. ఆ సమయంలోనే సుందరిగారి భర్తకి మరో ఊళ్ళో ఉద్యోగం రాడంతో వాళ్ళు మకాం మార్చేశారు హఠాత్తుగా.

సుబ్రహ్మణ్యంపరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. “ఆ రోజులు రావు” అంటూ దరువులేసే సమయం మళ్ళీ ఆసన్నమయింది అతని అమెరికన్‌జీవితంలో. కళ్ళలో నీళ్ళు ఒచ్చేయి. సుందరిగారు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అమ్మ పోయినరోజులు జ్ఞాపకం వచ్చేయి.

అదుగో అప్పుడే  తనని చదివించి, తనమీదే ఆశలు పెట్టుకున్న మేనమామా, తనకోసమే బతుకుతున్న మరదలు శ్రీజ్ఞానప్రసూనాంబా గుర్తుకొచ్చేరు. తనమాటకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తనే “ఇప్పుడు కాదు, పరీక్షలయింతరవాత,” “చదువయింతరవాత,” “ట్రైనింగయింతరవాత” “ఉద్యోగం వచ్చింతరవాత,” … … అంటూ వాయిదాలేస్తూ వచ్చేడు ఇంతవరకూ. అతడికి ఇప్పుడు తెలివొచ్చింది మరియు తెలిసొచ్చింది ఆ శుభముహూర్తం ఇదే అని. అర్జెంటుగా మామయ్యని ఫోనులో పిలిచి, “నేను పెళ్ళి చేసుకుంటాను. రెండువారాల్లో బయల్దేరి వస్తున్నాను,” అని చెప్పేడు.

మేనమామ పరమానందపడిపోయేడు. “బావుందిరా, అల్లుడా మంచిముక్క చెవినేసేవు. నాయనమ్మ కూడా సంతోషిస్తుంది. కానీ మరీ రెండువారాల్లో అంటే ఎలా? మంచి ముహూర్తం ఉందో లేదో .. చూసుకోవద్దూ?” అన్నాడాయన.

“నాకు అలాటి నమ్మకాలు లేవు మామయ్యా. ఈ ఆచారాలూ, చాదస్తాలూ, దేవుళ్లూ, దయ్యాలూ అవన్నీ మెడకాయమీద తలకాయ ఉన్నవాడెవడూ నమ్మడు. నేను రిజిస్టర్డ్ పెళ్ళి చేసుకుంటాను. అలా అయితేనే వస్తాను. అంతే. కావలిస్తే మరో వారం తీసుకో. ఆ తరవాత నాకు కుదరదు,”అన్నాడు మన్‌ తనేదో వాళ్ళని ఉద్ధరిస్తున్నట్టు.

“అలా అంటే ఎలారా? మా సరదాలు మావి.”

“సరదా లేదు బురదా లేదు. ఇలాటి ఆచారాలమూలంగానే కొంపలు గుణ్ణాలయిపోతున్నాయి. వెధవాచారాలూ వెధవ సరదాలూను.”

“నేనేం లేని పరుగులకి పోనులే. ఉన్నంతలో జరుపుకోడానికేం? పెద్దది నాయనమ్మ మీపెళ్ళి చూడ్డానికే బతికుంది. ఆవిడతృప్తికోసంవైనా చెయ్యాలా ఒద్దా?”

“వీల్లేదు మామయ్యా. నాఆశయాలకి విరుద్ధంగా నేం చచ్చినా చేసుకోను. రిజిస్టర్డ్ పెళ్ళికి ఒప్పుకుంటేనే పెళ్ళి. లేకపోతే మరోత్తిని చూసుకుంటాను.”

“మరోత్తిని చూసుకుంటాను,” అన్న మాటతో మేనమామ లొంగిపోయేడు. దేశం కానీ దేశం, కనీసం చిన్నప్పట్నుంచీ తెలిసినవాడిపంచన పడుంటుంది పిల్ల అని తనకి తనే నచ్చచెప్పుకుని, “అలాగే కానియ్ నాయనా, నీఇష్టం,” అన్నాడు.

ఆవిధంగా సుబ్రహ్మణ్యానికి రెండు కష్టాలూ గట్టెక్కేయి. నెల తిరక్కుండా ఆ పెళ్ళిలాటిదేదో జరిపించుకొచ్చేశాడు. ఆ తరవాత రెండు నెలలకి ప్రసూన అని పిలవబడే శ్రీజ్ఞానప్రసూనాంబ సారెతో కల్యాణతిలకంతో వెంకటేశ్వరస్వామిపటంతో దిగింది.

పటం చూసి, “గరాజులో పెట్టేయ్” అన్నాడు మన్‌. ప్రసూనకి ప్రాణం చివుక్కుమంది. తన స్నేహితురాలు ఎంతో ఆప్యాయంగా ఇచ్చిన పటం. కొత్తింట్లో శుభప్రదం అని తెచ్చింది. మన్‌ ఇంకా కొన్ని గ్రౌండు రూలులు కూడా తెలియజేశాడు. అందులో ముఖ్యమైనవి –

“నన్ను అండి గిండి అనకు. అందరం మనుషులమే. నేనెంతో నువ్వంత.”

“పని కూడా అంతే. ఇద్దరం సరిసమానులం. అంత పనీ నువ్వే చెయ్యక్కర్లేదు. ఇద్దరం కలిసి చేసుకుందాం.”

“మీనాన్న బుద్ధి లేక నిన్ను చదివించలేదు. ఇక్కడ బోలెడు అవకాశాలున్నాయి. ముందు ఈయస్సెల్‌ పరీక్షకి చదువు.”

“ఈయస్సెలంటే?”

“అదే. ఇంగ్లీషు మాటాడ్డం నేర్చుకో.”

ప్రసూనకి కొన్ని మాటలు నచ్చేయి, కొన్ని బాధ కలిగించేయి. తన పేరు మాత్రం ఎవరడిగినా ప్రసూన అనే చెబుతోంది. బ్రెజెన్స్‌కీ లాటి పేరు పలకగలిగినవాళ్ళు ప్రసూన అని ఎందుకనలేరూ?

“పర్సనంటారు చూసుకో,” అన్నాడు మన్‌ హేళన చేస్తూ.

“పోన్లే, అలాగైనా మనిషనవుతాను,” అంది అప్పటికి నాలుగు ముక్కలు నేర్చుకున్న ప్రసూన.

000

ఆ అమ్మాయి రాగానే సుందరిగారొచ్చి నాలుగు రోజులుండి, అంట్లు తోంకోడం, బట్టలుతుక్కోడం, బాతురూంలు కడుక్కోడంలాటి మహావిద్యలు నేర్పి వెళ్లేరు. ప్రసూన ఎంత పల్లెటూళ్ళో పుట్టినా ఇలాటిపనులు చేసి ఎరగదు. “అయ్యో రాతా,” అనుకుంది మనసులోనే కానీ పైకి పొక్కలేదు.

000

ప్రసూన స్కూలికెళ్ళి పుస్తకాలచదువు చదువుకోకపోవచ్చు కానీ తెలివితక్కువ పిల్ల మాత్రం కాదు. మన్‌ మూడోక్లాసు కుర్రాడిలా చదివిన చిట్టాలో నిజంగా అమల్లోకి వచ్చింది మొదటి రూలొటే. మేనత్త మేనమామ పిల్లలు, చిన్నప్పట్నుంచీ ఒకచోట పెరిగినవాళ్ళు. అంచేత నువ్వు నువ్వు అనుకోడంలో విశేషం ఏమీ లేదు.

సమానత్వంగురించీ మానవత్వంగురించీ అన్ని కబుర్లు చెప్పిన మన్‌ ఇటున్న పుల్ల పెట్టడన్న సంగతి తెలుసుకోడానికి అట్టే కాలం పట్టలేదు ఆమెకి. రోజంతా కారుమీదో ఫోనుమీదో కాలక్షేపం చేసేస్తున్నాడు. ఏంవైనా అంటే తన ఉద్యోగం అలాటిదంటాడు.

ప్రసూన వచ్చి నాలుగు నెలలవుతోంది. మెల్లిమెల్లిగా స్థానికమర్యాదలకి అలవాటు పడుతోంది.

పైవారం కనకంగారింట్లో సత్యనారాయణవ్రతంట. ఆవిడ ఫోన్ చేసి తప్పకుండా ఇద్దరూ రావాలని చెప్పింది. ఆ సాయంత్రం మన్‌తో చెబితే, “ఇంత అభివృద్ధి సాధించిన దేశంలో ఉంటూ కూడా ఈ వ్రతాలూ పూజలూ ఏమిటి? చాదస్తం కాకపోతే,” అన్నాడు. పెళ్ళికిముందు సుందరిగారింట్లో చేసిన భోజనాలు మర్చేపోయేడు.

“పూజక్కాకపోతే భోజనానికనుకో. బొత్తిగా నాలుగ్గోడలమధ్య మనిషి మొహం కనిపించక జైల్లో ఉన్నట్టుంది. ఓ మారలా వెళ్ళి కనిపిస్తే ఏం?” అంది ప్రసూన.

ఆ పిల్లకి ఊపిరాడ్డం లేదిక్కడ. హలో, పొలోమంటూ ఎవరైనా ఫోనులో పిలిచినా మొక్కుబడిలాగే ఉంది గానీ తీరిగ్గా ఊసులాడుకోడం, మనసారా మాటాడుకోడం అన్నది లేదు.

“ముందీ మూఢనమ్మకాలు పోవాలి మనదేశం బాగుపడాలంటే. ఆమాటే అన్నానని చెప్పు.”

“పోయినవారం మీ బాసింట్లో గ్రాడ్యేషనుకి వగరుస్తూ పరిగెట్టుకెళ్ళలేదూ?”

“అది వేరూ. బెస్ట్ విషెస్ చెప్పడంలో తరతరాల మూర్ఖత్వం ఎక్కడుందీ?”

“ఆ వేరులేమిటో నీకే తెలియాలి. అదీ ఖర్చుతో కూడుకున్నదే. అందులో మాత్రం ఏదో జరగాలన్న ఆశ లేదూ? బెస్టు విషులు చెప్పినప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగాలన్న ఆశా, జరుగుతుందన్న నమ్మకమూ లేవూ?”

“నీదొట్టి మట్టిబుర్ర.,” అంటూ కంప్యూటరుముందు కూర్చున్నాడు మన్‌.

“మట్టిబుర్రే అయుండాలి. లేకపోతే ఆ గోడమీద మీ నాన్నగారిఫొటో నాకు ఒట్టి కాయితపుముక్కలాగ, 30 డాలర్ల ఫ్రేము దండుగఖర్చులాగ ఎందుకు కనిపిస్తుందీ?”

మన్‌ తినేసేలా ఆవిడవేపు చూసి గబగబ రాసుకోడం మొదలుపెట్టేడు.

ప్రసూనకేం తోచలేదు. ఒకవిధంగా అతను రాకపోడమే మంచిదేమో అని కూడా అనిపిస్తోంది. తీరా వచ్చి అక్కడ కూడా ఈ వితండవాదనలే మొదలుపెడితే మరీ చిరాకు. ఆ నాలుగునెలల్లోనూ గమనించింది సుబ్రహ్మణ్యం అంతటివాడే అని. ఏమిటి చెయ్యడం? పూజకి పోకపోతే ఏం బాగుంటుంది? దేవుడిమీద నమ్మకం ఉన్నా లేకపోయినా లోకమర్యాదలంటూ ఉంటాయి కదా. తను వెళ్ళడానికే నిశ్చయించుకుంది.

తీరా అక్కడికి వెళ్ళింతరవాత ఆ పిల్లకి అర్థమయింది తను ఒక్కత్తీ అలా రావడం బాగులేదు. “ఐ నెవర్ గో ఎలోన్,” అంది ఒకావిడ పత్తికాయల్లాటి విచ్చుకున్న కనుగవతో, అచ్చపు అమెరికను ఏక్సెంటుతో.

ప్రసూన చుట్టూ చూసింది. మొగాళ్ళంతా ముందుగదిలో కూచుని రాజకీయాలూ ఉద్యోగాల్లో ఈతిబాధలూ మాటాడుకుంటున్నారు. ఆడవాళ్ళంతా వంటింట్లోనూ డైనింగ్రూంలోనూ చేరి రెసిపీలు చర్చించుకుంటున్నారు. ఎవరు ఎవరితాలూకో కూడా సరిగ్గా తెలీడంలేదు! కానీ ఇక్కడ భార్యాభర్తలు కలిసే వెళ్తారుట ఎక్కడికెళ్ళినా. అది వారి సామరస్యానికి చిహ్నంట!

ప్రసూనకి చిన్న కోపం కూడా వచ్చింది. మన్‌కి తెలీదూ ఆమాట?

పూజా, భోజనాలూ అయేక, బయల్దేరుతుంటే, కనకంగారు సుబ్రహ్మణ్యంకోసం కొంచెం ప్రసాదం ఓ ప్లాస్టిక్ సంచీలో వేసిచ్చారు.

ఇంటికొచ్చేక అతనికిస్తే, “నాకా పిచ్చినమ్మకాలు లేవని చెప్పేనా? నేను తిన్ను,” అన్నాడతను మొండిగా.

“పోనీ ప్రసాదం కాదు రవకేసరి అనుకుని తిను,” అంది ప్రసూన.

“నాకు స్వీట్లు ఇష్టంలేదు. అవి ఆరోగ్యం కాదు.”

000

రెండు రోజులయింది. అవేళ శుక్రవారం. షాంపూతో తలస్నానం చేసి, మన్కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శుభవార్త చెప్పడానికి. తను తల్లి కాబోతోంది.

మామూలుకంటే ఆలస్యంగా వచ్చేడు మన్‌ దివాలా పడ్డ మొహంతో.

ప్రసూన గాభరాగా “అలా ఉన్నావేం?” అనడిగింది.

అతను ప్రసూనవేపు దీనంగా చూసి లోపలికి నడిచేడు. ఉద్యోగం పోయింది!

ఆ రోజు మామూలుగానే తెల్లారింది. మామూలుగానే ముస్తాబయి పన్లోకెళ్ళేడు. తిరిగొచ్చేవేళకి హుష్ కాకీ అన్నంత తేలిగ్గా ఎగిరిపోయింది ఉద్యోగం.

“అసలేం జరిగింది?” అనడిగింది ప్రసూన.

మధ్యాన్నం ఓ మీటింగు పెట్టేరు. అంతవరకూ ఎవరికీ ఏమీ తెలీదు. ఆ మీటింగులో యజమానులు చెప్పేర్ట, “మీరందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. బాగా వృద్ధిలోకి రావలిసినవాళ్ళు. వస్తారు కూడాను. మన కంపెనీపరిస్థితులు చాలా బావున్నాయి. అంచేత రీఆర్గనైజు చేసి మరింత పెద్ద కంపెనీగా తీర్చి దిద్దబోతున్నాం.  దానికవసరమైన మార్పులు స్టాఫులో కూడా చెయ్యాలి. మాకై మేం ఎవరినీ పొమ్మని చెప్పలేం. ఇదుగో ఈ బుట్టలో కవర్లున్నాయి. కవర్లలో పింకు స్లిప్పులున్నాయి. తలో కవరు తీసుకుని ఇంటికెళ్ళండి. పింకుస్లిప్పులు ఉన్న కవరు గలవారు సోంవారంనించీ ఆఫీసుకి రానక్కర్లేదు. మంచి రికమెండేషన్లు ఇస్తాం తప్పకుండా. రెండు వారాలు సివరెన్సు పే కూడా యిస్తాం.”

ప్రసూనకి కళ్ళు తిరిగేయి. చిప్ప చేతికిచ్చి వీధిలోకి తగిలెయ్యడంలో కూడా ఇంత నాజూకుతనం ఉంటుందని ఆ తెలుగుపడుచుకి ఇప్పుడే తెలిసొచ్చింది!

“సర్లే, భోజనానికి లే. తరవాత చూద్దాం,” అంది.

“నువ్వు తినెయ్. నేంతరవాత పెట్టుకు తింటాను,” అన్నాడు కంప్యూటరు ముందు కూచుని మరో ఉద్యోగంకోసం వేట మొదలెడుతూ.

పుట్టబోయే బుల్లిబుజ్జాయిగురించి చెప్పలేకపోయింది ఆ సమయంలో. రాత్రి చాలా సేపయినతరవాత చెప్తే, “ఇప్పుడా?” అన్నాడతను అదేదో ప్రసూన తప్పయినట్టు.

నిజానికి ప్రసూనని బాధిస్తున్నది మరోవిషయం. ఆ రోజు సత్యనారాయణ ప్రసాదం మన్‌ తినకపోవడం ఆ పిల్లకి బావులేదు. తరవాత తింటాడేమోనని ఫ్రిజ్‌లో పెట్టింది. ఆ మాటే ఇప్పుడంది, “సత్యనారాయణప్రసాదం అలా ఒద్దనకూడదు అంటారు. పోనీ ఇప్పుడు కొంచెం నోట్లో వేసుకో.”

“మోకాలికీ బట్టతలకీ ముడి పెట్టడం అంటే ఇదే. మళ్ళీ ఆ మాటెప్పుడూ నాదగ్గిర తేకు,” అంటూ కస్సుమన్నాడు మన్‌.

ఎడతెగని ఆతురతతో వెతుకున్నాడు కానీ ఎంత వెతికినా ఉద్యోగం దొరికే ఆశ కనుచూపుమేరలో కనిపించడంలేదు. బొప్పి కట్టినచోటే మళ్ళీ తగిలినట్టు ఇంటినించి ప్రసూనతండ్రి పోయేడని వార్త వచ్చింది. ఆ అమ్మాయికి తల్లికంటే తండ్రిదగ్గరే చనువెక్కువ. పట్టరాని దుఃఖంతో కర్మవేళకి వెళ్తానంది మన్తో.

“అసలే ఇక్కడ ఉద్యోగం పోయి నానావస్థలుగా ఉంటే ఇప్పుడదో ఖర్చా? పోయినాడు పోనే పోయేడు. నువ్వెళ్ళి ఏం చేస్తావు? బూడిద,” అన్నాడు మన్‌ మొరటుగా.

ఆ పిల్ల కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ పక్కగదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.

ప్రసూనకి మన్‌ అపనమ్మకాలు నచ్చడంలేదు. అతనికి ఉద్యోగం పోయింది. తనకి తండ్రి పోయేడు. పుట్టబోయే బిడ్డకి ఏ ముచ్చట్లూ లేవు. పోనీ, తనే మొక్కుకుందాం అంటే మొక్కుకుని ఏం చేస్తుంది? అతను ఇంట్లో పూజయినా చెయ్యనివ్వడు. పూజ కాదు కదా ఓ ప్రతిమనయినా పెట్టుకోనివ్వడు. మనసులోనే ఓ దణ్ణం పెట్టుకని నీకింతే ప్రాప్తం అనుకుంది. ఎవరికి? ఏమిటి? ఎంత ప్రాప్తం అన్నవి ఆ అమ్మాయికే సరీగా తెలీడంలేదు.

కానీ ఆ పిల్లబాధ మన్కి అర్థమయింది. అతనికి మరీ కోపం వచ్చింది. ప్రసూనకి బుద్ధి చెప్పే ఉద్దేశంతో రాత్రికి రాత్రి కూచుని మూఢనమ్మకాలమీద ఓ పెద్ద వ్యాసం రాసేశాడు. అది ఓ ప్రముఖ వారపత్రికకి పంపించేడు. అది అచ్చయింది. దాంతో ఎక్కళ్ళేని ఉత్సాహం వచ్చి, దాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఇంటర్నెట్లో పడేశాడు. దానిమీద వాదోపవాదాలు చెలరేగేయి. మన ఊరువాడే అని గ్రహించిన నలుగురు యూనివర్సిటీ కుర్రాళ్ళు అమితోత్సాహంతో అతనిచేత ఓ ఉపన్యాసం ఇప్పించేరు. ఆ ఉపన్యాసం విన్న ఒక అమెరికను మన్ దగ్గరకొచ్చి, కొంచెంసేపు మాటాడి, అతని ఉపన్యాసం మెచ్చుకుని, “లంచికి రాగలరా?” అని అడిగేడు. మంగళవారం యూనివర్సిటీ ఎవెన్యూమీద ఉన్న ఫ్రాంకీస్‌లో కలవడానికి నిశ్చయం అయిపోయింది. ఆ విధంగా మిస్టర్ హార్డింగ్ గారితో డాక్టర్ మన్‌ లంచికెళ్ళడం జరిగింది. ఆ తరవాత హార్డింగ్ మన్‌ తెలివితేటలు గ్రహించి, అతని ఆనూ పానూ కనుక్కుని, “మా కంపెనీలో ఒక ఖాళీ ఉంది. వస్తావా?” అనడిగేడు.

మన్‌ పరమానందభరితుడై, ఇంటికొచ్చి, “చూశావా నా శక్తిసామర్థ్యాలు?” అన్నాడు ఉప్పొంగిపోతూ భార్యతో.

ఆవిడ కూడా సంతోషించింది. తరవాత తీరిగ్గా ఉన్నప్పుడు, “నీఉద్యోగం ఊడకపోతే, నామీద అంత కోపం రాకపోతే నువ్వా వ్యాసం రాసేవాడివే కాదు కదా,” అంది డొంకతిరుగుడుగా.

అతని సామర్థ్యంలో తను రహస్యంగా మొక్కుకున్న మొక్కుబడిపాలు కూడా ఉందని ఆవిడనమ్మకం. ప్రసూనమాటెలా ఉన్నా యస్.యస్. మన్‌గా ప్రసిద్ధికెక్కిన సంగాపురం సుబ్రహ్మణ్యస్వామికి ఉత్సాహం పట్ట పగ్గాల్లేకుండా ఉంది. వరసగా “మనవాళ్ళూ- నమ్మకాలూ,” “అస్తి, నాస్తివాదం”, “ఆస్తికుల చాదస్తం”, “ప్రజలలో మౌఢ్యం” అంటూ ఊకదంపుడుగా వ్యాసాలమీద వ్యాసాలు రాసి పారేస్తున్నాడు ఎడా పెడా. అతనికీర్తి ఊరూ వాడా వ్యాపించేసింది కార్చిచ్చులా. అపర చార్వాకుడని ఆధునికులు మురిసిపోతే పిదపకాలం పిదపబుద్ధులు అని ఛాందసులు ఈసడించి పారేశారు.

ప్రసూనకి ఆవిషయాలేమీ పట్టడంలేదు. పుట్టబోయే బిడ్డవిషయంలో మన్‌ కాస్తయినా సరదా చూపిస్తే బాగుణ్ణని ఉందాపిల్లకి. పురిటికి పుట్టింటికెళ్ళే ఆశల్లేవు. ఇక్కడ ఉన్న డాక్టర్లూ, సదుపాయాలూ అక్కడ లేవని అతను అడ్డుపుల్లలేశాడు.

కొడుకు పుట్టేడు. అప్పటికి భర్త మనస్తత్వం ప్రసూనకి బాగా అర్థమయిపోయింది. ఊళ్ళోవాళ్ళ మూర్ఖత్వంమీద కట్టలు కట్టలు గిలికేస్తున్న మన్‌కి ఇంట్లో ఒక మనిషి ఉందన్న ధ్యాస లేదు. ఆ మనిషి ఏం చేస్తోందన్న ఆలోచనలేదు.

“బుష్ అని పెట్టుకుందాం పేరు,” అంది ప్రసూన ఒళ్ళో పాపాయిని చూస్తూ.

హాస్యానికంటోందేమో అనుకున్నాడు మన్. ఆ మాటే అన్నాడు కూడా, “బుష్షేమిటి? అదేంపేరు?”

“అమెరికాలో పుట్టేడు కదా. ప్రసిడెంటయే అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతాయని,” అంది నవ్వుతూ.

ఆమె తండ్రిపేరు నాగభూషణం. తన రహస్యమొక్కు కూడా తీరిపోతుంది రెండూ కలిసొచ్చేలా పెట్టుకుంటే. ఆమాట చెప్తే అతను పడనివ్వడు.

మన్‌కి అదేమీ అర్థంకాలేదు. చేతిలో ఉన్న కాయితాలకట్ట నెత్తికేసి కొట్టుకుంటూ, “నీఖర్మ” అనేసి, మరో వ్యాసం రాయడానికి కూర్చున్నాడు కీబోర్డుమీద చేతులేసి, “మూఢనమ్మకాలమూలంగా మనదేశం ఎంత అధోగతిపాలవుతోందో సహేతుకముగా నిరూపించెదను,” అంటూ మొదలెట్టేడు.

అతని చిరాకు చూస్తే ప్రసూనకి మరింత హుషారొచ్చింది. “ఈసారి ఆడపిల్ల పుడితే ప్రమీల అని పెడతాను. పాం అని పిలుచుకోవచ్చు,” అంది అతన్ని రెచ్చగొడుతూ.

“ఇల్లు పాములపుట్ట చేసేస్తున్నావు,” అన్నాడతను కూడా నవ్వుతూ.

“నాకు ప్రహ్లాదవిజయం జ్ఞాపకం వస్తోంది.”

“ఎందుకూ?”

“లేడులేడంటూనే రాత్రీ పగలూ నీకదే ధ్యాస కదా హిరణ్యకశిపుళ్ళా! నేను ఉన్నాడని నమ్ముతూ రోజుకో రెండు నిముషాలు తలుచుకుంటే తెగ ఆరాటపడిపోతున్నావు కొంపలు ములిగిపోయినట్టు. ఆ కాయితాలు పక్కన పెట్టి, బాబునోమారు ఎత్తుకోకూడదూ.”

“ఇంట్లో పిల్లాడెక్కడికి పోతాడు. ఇది ఇవాళ మెయిల్ చెయ్యకపోతే సమయానికి అందదు.”

“చెప్తున్నా కదా. నీఖర్మ. కాదు కాదంటూనే స్వర్గానికెళ్ళిపోతావు. నాయనమ్మ చెప్పింది పగనైన వగనైన ప్రాణభీతినైన – ఎలా తల్చుకున్నా సాయుజ్యం ప్రసాదించేస్తాట్ట ఆ మహావిష్ణవు,” అంది తలొంచుకుని ఒళ్ళో పిల్లాడితో మాటాడుతున్నట్టు.

“హిరణ్యకశిపుళ్లాటి మూర్ఖుణ్ణంటావు నేను,” అన్నాడు మన్ నమ్మలేనట్టు ప్రసూనమొహంలోకి చూస్తూ.

అవునేమో అని లీలగా తోచిందతనికి క్షణంలో సగంసేపు. క్షణంలో ఒఖ్ఖ సగంసేపు మాత్రమే!

000

(రచనాకాలం 2002)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మూఢనమ్మకాలు”

 1. నిష్పూచీగా అంటే carelessly. దుష్టసమాసం కానీ మారోజుల్లో వాడుకలో వుంది. నేను కూడా borderline భక్తురాలినే కనక మీకు సాయుజ్యం వస్తుందో రాదో చెప్పలేను కానీ లేడు లేడు అంటూ అదే పనిగా గిలగిల్లాడేవారిని చూస్తే నాకు నవ్వొస్తుంది. 9/11 తరవాత అమెరికాలో ఆస్తికులు నాస్తికులుగానూ, నాస్తికులు ఆస్తికులుగానూ మారిపోయినవారి సంఖ్య చాలా పెద్దదని అప్పట్లో చదివాను. ఆయనో ఆవిడో వున్నాలేకున్నా బోలెడు కథలకి మస్తుగా వస్తువు అయిపోయాడు, లేక పోయింది. కదా. 🙂

  మెచ్చుకోండి

 2. బావుంది గరేజీలో పెట్టు… విరగబడి నవ్వుకున్నాను..

  నిష్ఫూచీ అంటే ఏంటీ ఎప్పుడూ వినలేదు ఈ పదం …

  ప్రశూన ప్రసాదం తినిపించే ప్రయత్నాలు మా మాతాదేవి నా మీద ఎప్పుడూ ప్రయోగించేదే.. కాకపోతే నాకు స్వీట్సంటే ఇష్టం.

  ‘ పగనైన,వగనైన,ప్రాణభీతినైన, ఎలా తల్చుకున్న దేవుడు సాయుధ్యం ప్రసాదిస్తాట ‘… ఇలాంటి అర్ధం వచ్చేలానే సామాజిక భాషలో మా అమ్మమ్మ ఏదో చెప్పి నాకు చాలాసార్లు అమ్మ దగ్గర బడిత పూజ తప్పించేది ( చిన్నప్పుడు ఎందుకో నాకు దేవుడంటే చాలా చలా ఇష్టం ఉండేది కాదు)… మొత్తానికి నాలాంటివాళ్ళందర్నీ హిరణ్యకసిపులుగా జమకట్టేసారన్నమాట. ఇంతకు ముందు ఈ వాదనల్లో విస్తృతంగా పాలుపంచుకొనేవాన్ని కానీ చేయగలిగింది ఏమీ లేదని నేను నమ్మక పోయినా నమ్మేవాళ్ళ నమ్మకాన్ని గౌరవిస్తానని ఒక డెసిషన్ తీసేసుకున్నా.
  మనలో మనమాట ఇప్పుడు ఏ విధంగానూ తలచుకోవడం లేదు కదా నా పాత బ్యాలెన్సుకి వడ్డితో కలిపి సాయుధ్యం వచ్చే ఛాన్స్ ఎమైనా ఉందంటారా 😉

  మెచ్చుకోండి

 3. సారీ, రమ్యా. అది దాదాపు 5 ఏళ్లకిందట పోతన ఫాంట్స్ తో టైపు చేసింది. మళ్లీ మరోసారి పీడీయఫ్ చేసి చూస్తాను. పొరపాటు తెలియజేసినందుకు థాంక్స్.

  మెచ్చుకోండి

 4. అయ్యో, మీరు ఇచ్చిన లంకె లో తెలుగు అక్షరాలు కనిపించట్లేదండి, అన్ని ఏవో సింబల్స్ , లెటర్స్ వున్నాయి. 😦

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s