నేనూ, నారచనలూ (వ్యాసం)

 

స్నేహితురాలూ, హైదరాబాదులో లేఖిని సంస్థాపకురాలూ అయిన డా. వాసా ప్రభావతిగారు తాను నేనూ, నారచనలూ అన్న శీర్షికతో కొంతమంది రచయిత్రుల వ్యాససంకలనం ప్రచురిస్తున్నాననీ, నన్ను కూడా రాయమనీ అడిగారు. ఈవ్యాసం ప్రభావతిగారి సంకలనంకోసం రాసింది. కొన్ని చిన్న మార్పులతో ఇక్కడ పెడుతున్నాను.

ఎందుకంటే, ఇందులో కొన్ని సంగతులు మీఅందరితో అర్జంటుగా పంచేసుకోవాలని అనిపించింది. ఇంకో శుభవార్త – నాఖజానాలో వున్న పీడీయఫ్ కథలన్నీ అయిపోయేయి. ఇంక ఏం పెట్టినా, ఇలా దస్తూరీ స్వహస్తం … 🙂

 

నేనూ, నారచనలూ

*

 

నారచనావ్యాసంగానికి ఆనాటి సాంఘికవాతావరణం, మాయింట్లో వాతావరణం చాలా దోహదం చేసేయి. మాఇంటి వాతావరణం నామనస్తత్త్వాన్నీ, రచయితగా వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దుకోడానికి ఇతోధికంగా ఉపకరించేయి. 

కుటుంబం, సామాజిక నేపథ్యం. నాకు పదేళ్లు వచ్చేవరకూ మేం అడయారులో వుండేవాళ్లం. మానాన్నగారు థియసాఫికల్ సొసైటీ హైస్కూల్లో లెక్కలమాస్టారుగా పని చేసేవారు. ఆనాటి సాంఘికపరిస్థితులదృష్ట్యా చూస్తే మా అమ్మా నాన్నగారూ కూడా  ahead of their times అనే అనుకోవాలి. మానాన్నగారు విరివిగా పుస్తకాలు కొని పడేసేవారు. అప్పట్లో చాలామంది ఇళ్లలోలాగ ఇది చదవకూడదు, అది చదివితీరాలి వంటి ఆంక్షలు ఎప్పుడూ లేవు నాకు. అలాగే ఆడపిల్లవి సైకిలు తొక్కరాదు, జామచెట్టెక్కరాదు, నలుగురిలో నవ్వరాదులాటి ఆంక్షలు కూడా లేవు మాయింట్లో. అందుచేతనేనేమో నాకు ఆడవాళ్లందరికీ మగవాళ్లందరూ పరమశత్రువులు అనే స్త్రీవాదం అంతగా ఒంట బట్టలేదు.

చదువు. మానాన్నగారు అడయారులో వుద్యోగం వదిలేసిన తరవాత చాలా వూళ్లు తిరిగాం. మొదటిసారి, అంటే నాకు పదేళ్లప్పుడు, స్కూల్లో ఎడ్మిషన్‌ గడువు మించిపోవడంచేత నేను ఫస్టుఫారంలో చేరడానికి వీల్లేకపోయింది. వూరికే ఇంట్లో కూర్చోడం ఎందుకు అంటూ మాఅమ్మ నన్ను ఓ దుంపలబడికి తోలింది. 

ఆతరవాత మళ్లీ అలాటిపరిస్థితుల్లోనే యస్సెల్సీ పరీక్ష రెండోసారి రాయాల్సొచ్చింది. ఆతరవాత మళ్లీ కాలేజీలో చేరేవరకూ ఆటవిడుపే కనక నాకు పత్రికలమీదా కథలమీదా మోజు పెరగడం, మన ఎడ్యుకేషనుమీద నమ్మకం తరిగిపోవడం జరిగేయి. ఈనాటి చదువులమీద నాకున్న అభిప్రాయం అవేద్యాలు అన్నకథలో స్పష్టం చేసేను. ఇంకా కొన్ని కథల్లో కూడా ఈ కాలేజీచదువులు లేనివారి మేధని ఎత్తి చూపించడంద్వారా వ్యక్తం చేశాను. నాకు ఆదినుండీ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్‌మీద అట్టే గౌరవం లేదు. కానీ మాఅమ్మకీ, నాన్నగారికీ వున్నందున, నేను యం.ఏ. ఇంగ్లీషు చేసేను.. ఈనాడు అందరూ అంటున్నట్టుగానే ఆరోజుల్లో నేను కూడా ఇంగ్లీషు సాహిత్యం ఎంచుకోడానికి కారణం ఉద్యోగాలే. అప్పట్లో నాకు తెలీదు తెలుగుసాహిత్యంమీద రిసెర్చ్ అమెరికాలో చేస్తారని! తరవాత యం.ఏ. లైబ్రరీసైన్సు కూడా చేసేను పుస్తకాలంటే ఇష్టమని. తిరుపతి లైబ్రరీలో తొమ్మిదేళ్లు పని చేసినా, అమెరికా వచ్చింతరవాత నేను చేసిన వుద్యోగాలన్నీ నాచదువుతో గానీ తెలివితేటలతో గానీ సంబంధం లేనివే.

 

యస్సెల్సీ రోజుల్లో నేను మాఅమ్మతో పాటే, మాఅమ్మ వెనకే తిరుగుతూండేదాన్ని పురాణాలకీ, ఉపన్యాసాలకీ. మాఅమ్మ సలహామీద భక్తవిజయం చదవడం నాకు ఇప్పటికీ గుర్తే. అందులో కథలు నాకు చాలా నచ్చేయి. తెలుగులో కథలు రాయాలంటే ఇంగ్లీషు పుస్తకాలే చదవాలన్నఅభిప్రాయం నాకు సమంజసంగా తోచదు. కథాసంవిధానం తెలుగుకథల్లోనూ వుంది.

రాంభట్ల లక్ష్మీనారాయణశాస్త్రిగారు ఎ.వి.యన్. కాలేజీలో తెలుగు లెక్చరరు. ఆయన మావీధిలోనే వున్న రామకృష్ణమిషన్ హాలులో భారతం, బాగవతంలాటి గ్రంథాలు చదివి అర్థం చెప్పేవారు. మొదట ఆయన ఒప్పుకోలేదు పురాణాలు చెప్పుకోడం హీనం అని. కాని సాహిత్యాభిలాష గల కొందరు పెద్దలు ఆయన్ని మొహమాటపెట్టి ఒప్పించేరు. ఆయన మంచి పండితుడు కనక చక్కగా వివరించి చెప్పేవారు. అది పురాణకాలక్షేపంలా కాక సాహిత్యగోష్ఠిలాగే వుండేది. కథ చెప్పడం ఎలాగో భాగవతం చదివినా తెలుస్తుంది. పంచతంత్రం చదివినా తెలుస్తుంది. తెలుసుకోవాలనే ఇచ్ఛ వుండాలి కానీ …

ఏతావాతా నాస్కూలు నా బుర్రలోనే వుంది అనిపించింది. నాకు నిరంతరం ఎడతెగని ఆలోచనలు. అన్నీ ప్రశ్నలే. ప్రతివిషయానికీ చిన్నా పెద్దా అన్నిటికీ అనుమానాలే. బాగున్నావా అంటే ఎందుకడుగుతున్నారు, అడక్కపోతే ఎందుకడగలేదు ఇలా అదే పనిగా ఆలోచిస్తుంటే ఎంత చిన్న విషయానికైనా అనేక కోణాలు స్ఫురించేవి. ఇలా వాచ్యం చేస్తే సిల్లీగా అనిపించొచ్చు కానీ ఇది కథలు రాయడానికి బాగా పనికొచ్చే గుణం.

మాయింట్లో కబుర్లూ, వేళాకోళాలూ, గిల్లికజ్జాలూ.. లాటివి లేవు. పరమ నిశ్శబ్దం. అందుకే మావాళ్లు నాకు ఎలాటి ప్రోత్సాహం యిచ్చారో అప్పట్లో నాకు తెలీలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపిస్తున్నాయి ఇదుగో నీకు కథలు రాయడానికి పనికొస్తుంది అని నామొహమ్మీద చెప్పకపోయినా, దానికి తగిన వాతావరణం కొంతవరకూ కల్పించేరు. మా అక్కయ్య ఓసారి నా పుట్టినరోజుకి రీడర్స్ డైజస్ట్‌ చందా కట్టింది నాపేరుమీద. అలాగే మానాన్నగారు ఓసారి విజయవాడలో ఆంధ్రప్రభ ఆఫీసుకి తీసుకెళ్లారు. అప్పుడు నీలంరాజు వెంకటశేషయ్యగారు ఎడిటర్. ఎందుకు అక్కడికి వెళ్లేమో, దానివల్ల నాకేం తెలిసిందో ఇప్పటికీ తెలీదు.

ఇంకా నా తీరుతెన్నులు, నా వ్యక్తిత్వంగురించి రెండు ముక్కలు చెప్పాలి. పార్టీలు, సందడీ నాతత్త్వానికి సరిపడవు.  పదిమందిలో గలగల్లాడుతూ కబుర్లు చెప్పలేను. రాయడం అంటే తీరిగ్గా ఆలోచించుకుని బోలెడు స్క్రిప్టులు తయారు చేసుకోవచ్చు. నేనేం రాసినా ముందు ఎన్నో వాక్యాలు నాతల్లోనే తిరగరాసుకుంటాను. బహుశా ఆరోజుల్లో అంతా చేత్తోనే రాయవలసి వుండడంచేతనేమో.. కట్ఎండ్పేస్టులాటి వసతులు లేవు కదా. రెండోది, చిత్తశుద్ధి ఒక ముఖ్యమైన విలువగా భావిస్తాను జీవితంలోనూ రచనల్లోనూ కూడా. కేవలం పేరుకోసం, ప్రచారంకోసం పనీ చెయ్యను. చేస్తాను, చేస్తానంటూ మాట ఇచ్చి చెయ్యకపోవడం, మొక్కుబడికోసం ఏదో చేసినట్టు అకటావికటంగా పూర్తి చేయడం నాకు హీనంగా అనిపిస్తాయి.

నాకు నేనే ఆలోచించుకోవాలన్న నిర్ణయానికి నేను చిన్నతనంలోనే వచ్చేశాను మానాన్నగారి శిక్షణలో. ఒకసారి నేను స్కూల్లో చదువుతున్నరోజుల్లో ఆయన మరోకుర్రాడిని స్వయంగా స్కూలికి తీసుకువెళ్లారు అతనిచేత ఫీజు కట్టించడానికి. వాడికి చేస్తారు, నాకెందుకు చెయ్యరు అని అడిగాను ఆరోజు. వాడికి స్వయంగా చేసుకునే తెలివితేటలు లేవు, నువ్వు చేసుకోగలవు అన్నారు ఆయన. అప్పట్లో అది నాకు వెన్ను తట్టినట్టే అనిపించినా, చాలాకాలం తరవాత అర్థం అయింది, ఆటెక్నిక్ మనసంస్కృతిలో ఎంత బలవత్తరమైన సాధనమో అన్న సంగతి.

అబ్భ ఎంతబాగా చేస్తావు‌ అంటూ పొగడ్తలతో ఎదటివారిచేత అరవచాకిరీ చేయించుకోడం మన సమాజంలో గొప్ప వ్యసనం. ఇది ఆడవాళ్లు కూడా చేస్తారు. కాస్త ఎడ్రెసు రాసి ఈ వుత్తరం పోస్టు చేద్దురూ, మీకు పుణ్యముంటుంది అనే పుణ్యవతులు ఎంతమంది లేరు మనయిళ్లలో. అయితే ఇది ప్రేమా, కుట్రా అన్నది తేలిగ్గా నిర్ణయించలేం. ఒకరిమీద ఒకరు ఆధారపడడం మానవనైజం. అది ఆత్మీయత కావచ్చు, స్వార్థం కావచ్చు. మనం ముఖ్యంగా గమనించవలసింది మాత్రం ఏదో ఒక్క సంఘటన తీసుకుని సీదాగా ఓమనిషి తత్త్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం అనే. ఒక చిన్నసంఘటన, ఒక కోణం మాత్రం తీసుకుని ఒకమనిషిని పరమ దుష్టుడుగానో శిష్టుడుగానో చిత్రించి సిద్ధాంతాలు ప్రతిపాదించేయడం చాలామంది చేసే పొరపాటు..

ఇంట్లోవారిని నిర్లక్ష్యం చేసి వూరివారి బాధలూ, సమస్యలూ నెత్తినేసుకుని తమఔన్నత్యాన్ని ప్రదర్శించుకోడం సంఘసంస్కర్తలూ, మహాకవులూ చేసేపని. కాలక్షేపం కొంతా, స్వోత్కర్ష కొంతా కలిసి, పొరుగువారికి సాయం చెయ్యడమే జీవితపరమావధిగా పెట్టుకుంటారు. ఆతరవాత తమకి ఏ కాస్త అసౌకర్యం కలిగినా, తత్క్షణమే అక్కడినించి లేచి పోతారు. అదే స్వంతఇంట్లో అయితే అలా లేచిపోగల సౌకర్యం లేదు. వెళ్లిపోయినా సాయంత్రం భోజనంవేళకి తిరిగి వచ్చేయాలి. కష్టమైనా నిష్ఠూరమయినా భరించాలి. వీరికి ఆ బలం వుండదు. అందుకే ఇంటివిషయాల్లో పట్టించుకోరు. అది వారి వ్యక్తిత్వంలో లోపమేనని నా అభిప్రాయం. ఈసంగతి నాకు అవగతం కావడానికి చాలా సంవత్సారాలు పట్టింది. అది అర్థం అయేక రాసిన కథే ఆనందో బ్రహ్మా”.

ఇలాటివారు స్త్రీలలో కూడా వున్నారు కనకే నేను సమస్యలని జండర్ దృష్టితో కాక, మానవీయ దృష్టితో చూస్తాను. ఇది నాకూ ఫెమినిస్టులకీ మధ్య గల, చెప్పుకోదగ్గ బేధాల్లో ఒకటి. 

రచనా వ్యాసంగం. నేను కథలు రాయడం ఎప్పుడు మొదలుపెట్టేనో నాకు బాగా జ్ఞాపకం లేదు. ఈమధ్య ఫిఫ్తుపారంలో నా స్నేహితురాలు, శాంత అమెరికా వచ్చింది. అరవై ఏళ్లతరవాత ఇప్పటికీ ఆరోజుల్లో నేను రాసినకథలు తనకి జ్ఞాపకం వున్నాయిట. తను చెప్పినా నాకు జ్ఞాపకం రావడం లేదు! తనే చాదస్తం అన్న ఓకథ చెప్పి, ఆకథ రాసినందుకు మామాస్టారికి కోపం వచ్చిందన్న సంగతి కూడా చెప్పింది. నాకథలతో జనాలని చికాకు పెట్టడం నాచిన్నతనంలోనే మొదలయిందని నాకిప్పుడే తెలిసింది!

 

నాదగ్గరున్న పాత కాయితాల కట్టని చూసుకుంటే 1953లో తెలుగుస్వతంత్రలో వచ్చిన కథలు కనిపిస్తున్నాయి. విరివిగా పత్రికలు చదవడం, మాఅమ్మతో పురాణాలు వినడంతో నాకూ రాయాలనిపించి ఏదో రాసేదాన్ని. మొదట చిన్నవి ఈనాటి కార్డుకథలలాటివి రాసేను. అప్పుడే చూసేను తెలుగుస్వతంత్ర వాటికి పెట్టినపేర్లు గల్పిక, స్కెచ్, కథానిక, కథ అని. అంటే సైజుని బట్టి ఇలా పేర్లు పెడతారు కాబోలు అనుకున్నాను. అంతకుమించి కథకీ కథానికకీ తేడా ఏమిటో తెలీలేదు. నాకు తోచిందేదో నేను రాసి పంపేయడం, అది ఏబుట్టలో పడుతుందో పత్రికలవాళ్లే చూసుకోడం జరుగుతూ వచ్చింది.

ఆతరవాత కథలనిపించుకోగలవి రాయడం మొదలుపెట్టినతరవాత ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లాటి వార, మాస పత్రికలకి కూడా పంపడం మొదలుపెట్టేను. అన్ని పత్రికలూ పంపినవి పంపినట్టు వేసుకునేవారు. ఒక్క భారతి మాత్రం వేసుకోలేదు. రెండో మూడో తిరగ్గొట్టినతరవాత వాళ్లకి పంపడం మానేశాను. ఆదాయం నామొదటి కథకి ఐదు రూపాయలు వచ్చాయి. తరవాత ఇరవై రూపాయలు వచ్చేయి. రచనలమీద నేను గొప్పగా చెప్పుకునే ఆదాయం అదే. ఆకథలేమిటో నాకు ఇప్పుడు గుర్తు లేదు. నాపేరుమీద మనియార్డరు రావడమే గుర్తు.

కథలు రాయడం తెలుగుకథలు చదివీ, వినీ నేర్చుకోవచ్చు అనడానికి నిదర్శనం నా కాశీరత్నం కథ. మాయింట్లో కాశీరత్నంపొద మా ముందు గేటుమీదకి ఎగబాకి కన్నులపండుగ చేస్తూ వుండేది. చక్కని ఎరుపురంగుతో ముఖమల్ రుమాలు పరిచినట్టు మిలమిల మెరిసిపోయే చిన్న పువ్వులు, అతిసుకుమారం. ఇలా తుంపగానే అలా వాడిపోయేవి. దాన్ని గురించి కథ రాయాలి, పురాణకథల భాష వాడాలి అనుకున్నాను. ఆరోజుల్లో విశాఖపట్నం మెయిన్ రోడ్‌మీద వెలిసిన కనకమహలక్ష్మి విగ్రహంగురించి వింతైన కథ ఒకటి ప్రచారంలో వుండేది. 

మెయిన్ రోడ్ మధ్యన వెలిసిన విగ్రహాన్ని మరొక చోటికి మార్చడానికి ప్రయత్నించగా, వూరంతా కలరా, మసూచీ వ్యాపించాయిట. కనకమహలక్ష్మి ఎవరికో కలలో కనిపించి, తనకి నడివీధిలో వుండడమే సమ్మతమనీ కదిలించవద్దనీ ఆదేశించిందిట. ఆవిగ్రహం ఇప్పటికీ అక్కడే, ‌రోడ్డుమధ్యలో వుంది.

ఈవిషయాలు మనసులో పెట్టుకుని కాశీరత్నం కథ రాశాను. కానీ నాకు అలాటి నమ్మకాలు వున్నాయా అంటే ఇప్పటికీ చెప్పలేను. బహుశా ఆసందేహం మూలంగానే కావచ్చు ముగింపులో దాన్ని కాస్త తేలిక పరిచేశాను.

తెలుగులో కథ రాయడానికి ఇంగ్లీషు కథలే చదవాలన్న సూక్తి నేను ఒప్పుకోను అంటే నేను ఇంగ్లీషుకథలు చదవలేదనీ, వాటివల్ల స్ఫూర్తి పొందలేదనీ కాదు.

నేను తిరపతిలో పని చేస్తున్న రోజుల్లో ఒక ఎటెండరు పాతకాలపు పలకసర్లపేట తెచ్చి నాకు అమ్మజూపాడు. నేను తీసుకోడానికి మొగ్గు చూపలేదు నగలమీద మోజులేని కారణాన. అతను మీరు తీసుకుంటే బాగుంటుందమ్మగారూ అన్నప్పుడు మాత్రం ఆశ్చర్యపోయేను. నాకు ఒకరకం మనస్తత్వం అర్థం అయింది. తనవస్తువు తనదగ్గర కాకపోతే తాను గౌరవించేవారిదగ్గర వుండాలని అతని కోరిక. అదే ఓ గొలుసుకథ అయింది. ఓహెన్రీ కథలు జ్ఞాపకం వచ్చి,. దానికి తగ్దట్టు కథ మెలికలు తిప్పినా, అందులో సంఘటనలూ, సంభాషణలూ నూటికి నూరుపాళ్లూ తెలుగుదనం వెదజల్లిన కథే. ఎక్కడా విదేశీ సంస్కారం కానీ వాసనలు కానీ లేవు.

అప్పట్లో రాసిందే తృష్ణ కూడా. తిరుపతిలైబ్రరీలో ఎటెండర్లూ, ఆఫీసుబాయ్‌లూ పుస్తకాలు చదివేవారు. అందులో ముఖ్యంగా షణ్ముగం అని ఓ ఎటెండరు వుండేవాడు. అతనికి మొత్తం  లైబ్రరీ హోల్డింగ్సు, లక్ష పుస్తకాలు, కరతలామలకం. ఏసబ్జెక్టు, ఏపుస్తకం అడిగినా క్షణాలమీద తెచ్చి ఇచ్చేవాడు. (ఇది అక్షరాలా నిజం). షణ్ముగం క్లాస్4 కాదు కానీ కథకోసం బాలయ్యని క్లాస్4 ఎంప్లాయీని చేసేను. కథంతా కల్పితమే కానీ అందులో నేను ఆవిష్కరించలుచుకున్నది చదవాలనే తృష్ణ అందరికీ వుంటుందనీ, దానికి ఉద్యోగాల్లో తరగతివారీగా అర్హతలు నిర్ణయించడం న్యాయం కాదనీను. నిజమైన చదువుమీద నాకున్న అభిమానం ఆకథలో వ్యక్తం అవుతుంది.

తిరపతిలో వున్నప్పుడే రాసిన మరోకథ విషప్పురుగు. మాలైబ్రరీ కొండచరియలో వుంది.  ఎండాకాలం లైబ్రరీలో వాటరుకూలరుకింద పాములు చేరేవి. లైబ్రరీలో ఒక ప్యూను, పాములవాడు, వాటిని పట్టి బయట పారేసేవాడు. అవేం చెయ్యవు అమ్మగారూ అంటూ ఓసారి నాదగ్గరికి తెచ్చి చూపించేడు. నిజంగా జరిగింది అంతే. ఆకథలో మిగిలినదంతా కల్పితమే. అందులో ముఖ్యమైన అంశం అకారణంగా మనకి మనమే కల్పిచుకునే భయాలు. దాంతో ఎదుటివాడికి లేని గుణాలు అంటగట్టి కక్షలూ, కార్పణ్యాలూ పెంచుకోడం. చదువుకున్నవారిలో కన్నా చదువుకోనివారిలోనే మానవీయ విలువలు ఎక్కువ అని కూడా నేను ఆరోజుల్లోనే గ్రహించేను.

చిరుచక్రం”, “ప్రాప్తంలాటి కథలన్నిటిలోనూ నేను చదువు లేనివారినీ, డబ్బులేని వారినీ చిత్రించినా, వారిధైర్యం, స్థైర్యం చూపడమే నాద్యేయం. అలాగే వానరహస్తంలో ముత్తయ్య. వారంటే జాలి కాదు మనం చూపవలసింది. తమ పరిధిలో వారు తమ జీవితాలని ఎలా చక్కదిద్దుకున్నారో చూడగలగాలి మనం. అదే నాఉద్దేశ్యంలో ఎదటివ్యక్తిని గౌరవించడం అంటే.

నాకథల్లో మనస్తత్త్వాలు చిత్రించడానికి ప్రయత్నిస్తాను. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక నైతిక విలువ. అదే నాకథలకి ఆలంబన. నాకథల్లో స్త్రీపాత్రలని వ్యక్తిత్వంగల మనుషులుగా చిత్రిస్తాను. వాళ్లు పడుతున్న బాధలని కాక, వాటిని ఎదుర్కొని తమ వ్యక్తిత్వాలని నిలుపుకున్నవారుగానే చూపడానకి ప్రయత్నిస్తాను. నవ్వరాదులో కమలిని, జీర్ణతృణంలో కనకవల్లి, చిరుచక్రంలో సింహాచలం, నిజనికీ ఫెమినిజానికీ మధ్యలో సీత వీళ్లందరూ నిజజీవితాల్లోంచి వచ్చిన మనుషులు. జీవితవిలువల్ని అర్థం చేసుకున్నవారు.

 

మనసంస్కృతిలో మౌనం మెచ్చుకోదగ్గ విలువ. మూగనోము అందుకే పడతారు. మంచుదెబ్బలో వకుళ మౌనంద్వారా తనని మోసగించినవారిని చిత్రహింస పెడుతుంది. నా కథ 1964లోరచన పత్రికలో పడింది. ఆరుకాయితాలు చింపి దాచుకున్నాను. 1966 ప్రాంతాల్లో ఆచంట జానకిరాం గారితో పరిచయమయింది. ఆయన మాయింటికి వచ్చినప్పుడు. చూపించేను. ఆయన ఆ ఆరుకాగితాలూ ఇంటికి తీసుకెళ్లి, చదివి, మర్నాడు మంచి ఆరంజిరంగు అట్ట వేసి, బైండు చేసి తెచ్చారు..కథ అంతా చాలా బాగుంది కాని వకుళ ఆత్మహత్య చేసుకోడం బాగులేదు అన్నారు. నిజానికి నేను ఆత్మహత్య అనలేదు. హఠాత్తుగా చనిపోయినవారు ఎంతమంది లేరు. అలాగే ఇదీనూ అనుకున్నాను. అసలు కథల్లో చావు ముగింపుగా ఎప్పుడు వాడతాం అన్నవిషయంమీద వ్యాసం రాయాలి ఎప్పుడో.. ఆతరవాత మరికొందరు ప్రముఖ రచయితలు కూడా ఆకథ ప్రసక్తి తెచ్చినతరవాత నాకు నమ్మకం కలిగింది నేను మంచికథే రాసేనని. ఈకథ పెళ్లయంతరవాత రాస్తే మన గాసిప్ రచయిత్రులు ఇంకా ఎన్ని కథలు అల్లేవారో అని కూడా అనిపిస్తోందిప్పుడు.

 

అమెరికా వచ్చేక నాసాహిత్య సేవ. 1973లో అమెరికా వచ్చేను. ఆతరవాత రాసిన కథలకి నేపథ్యంగా నాకు అమెరికన్ సంస్కృతిగురించి ఏర్పడిన అవగాహనగురించి కొంచెం చెప్పాలి. అమెరికనులు నన్ను అడిగే ప్రశ్నలమూలంగా వీరి సంస్కృతి, భాష, మౌలికమైన భావజాలం, జీవనసరళీగురించిన ఆలోచనలు కలిగేయి. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే, వారికీ మనకీ మౌలిక విలువల్లో వ్యత్యాసం తక్కువే అనిపించింది. ఒకదేశానికీ మరొకదేశానికీ వున్న తేడా కంటె ఒక తరానికీ మరొక తరానికీ వున్న తేడాయే ఎక్కువ. అంశాన్ని నాదృక్కోణాలుఅన్న కథలో చిత్రించాను..

 

అమెరికాలో సామాజిక, కౌటుంబిక విలువల స్వరూపం చారిత్ర్యాక దృష్టితో పరిశీలించగా నాకు అవగాహన అయింది బ్రిటన్లో కొందరు మతప్రవక్తలు తమ మతవిశ్వాసాలకి రక్షణ లేనికారణంగా అమెరికాకి వలస వచ్చారు. ఇక్కడ వారు దారిద్ర్యం, రోగాలవంటి అనేక ఈతిబాధలు ఎదుర్కోవలసివచ్చింది మొదట్లో. క్లిష్టపరిస్థితుల్లో ఎవరికి వారు తమ యోగక్షేమాలు చూసుకోవలసిన అగత్యం ఏర్పడింది. పిల్లలకి చిన్నతనంనుంచీ నేర్పే పాఠాలవెనక వున్న వైయక్తికవిలువలు, స్వశక్తిమీద ఆధారపడడం, అక్కడినుండి వచ్చినవే. ఎవరికర్మకి వారే కర్తలు. ఈవిలువ వికటిస్తే, దుర్నీతికి దారి తీస్తుంది. కేవలం తనస్వార్థమే చూసుకుని, అడ్డు వచ్చినవారినందరినీ అణగదొక్కేయడమో నిర్లక్ష్యం చెయ్యడమో జరుగుతుంది.. ఈమనస్తత్త్వం అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. (ఈవిషయంమీద కథ రాస్తాను ఎప్పుడో.)

 

రెండోది, సమాజంలోనైనా నైతికవిలువలు ఆపరిసరాలనుండీ, జనాభానుండీ పుట్టుకొస్తాయి. అమెరికాలో జనాభా తక్కువా స్థలం ఎక్కువా. అంచేత, నాగది, నాఇల్లు అంటూ గిరి గీసుకు కూచోడానికి ప్రతి ఒక్కరికీ వీలయింది. కుటుంబం అంటే, భార్యా, భర్తా, పిల్లలూ అన్న వివరణ ఏర్పడింది. (అమెరికన్ ఇండియనులకి అలా కాదు) అందుకు భిన్నంగా మనకి కుటుంబం అంటే మూడు తరాలుఅటు వృద్ధులయిన తల్లిదండ్రులూ, ఇటు పిల్లలూ కూడా ఒకే కుటుంబంలో భాగం.. ఎవరిగది వారిది, ఎవరి మంచం వారిది అంటూ ముడుచుకుపోయే సౌభాగ్యం మనకి లేదుఒక గదిలో పదిమంది వుంటాం, ఒక మంచంమీద నలుగురం పడుకుంటాం. అందులో మనకిస్నిగ్ధమాధుర్యంగోచరిస్తుంది. ఆప్యాయతలే కనిపిస్తాయి. మనకీ వారికీ మౌలికమైన విలువల్లో వ్యత్యాసం తక్కువే అనిపించింది నాకు.

అలాగే భాష, నుడికారంలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. మనమాటల్లో మతపరమయిన పదాలు సర్వసాధారణం కర్మ, ఋణం తీర్చుకోడం, పాపాన పోవడం లాటివి. దానికి విరుద్ధంగా అమెరికాలో వ్యాపారసంబంధమైన పదాలు నిత్యజీవితంలో, I;m not buying (నీమాట నమ్మను),లాటి వాక్యాలు వాడుకలో కనిపిస్తాయి. అంతమాత్రంచేత వాళ్లకి మానవసంబంధాలు లేవని కాదు. భాష తీరు తెలుస్తుంది, అంతే.

 

ఇలాటి భిన్నత్వం ఎత్తి చూపుతూ రాసిన కథలుకొనేమనిషి”, “జమాఖర్చులపట్టిక‌”. వీటిలో నేను ఇది మంచీ, ఆది చెడూ అని కాక, వీరలా, వారలా అని మాత్రమే చిత్రించడానికి ప్రయత్నించాను. చాలాకాలంగా విదేశాల్లో స్థిరపడిపోయిన మనవాళ్లే మనవాళ్లనే కొత్తరంగు కళ్లద్దాలలోంచి చూడడం డాలరుకో గుప్పెడు రూకలు కథలో కనిపిస్తుంది. 

భాషగురించి పాత్రలకి తగినట్టు భాషకి  ప్రాధాన్యం ఇస్తాను. నాకు పరిచయంలేని పాత్రలు నేను తీసుకోను. అందుకే నాకథల్లో అట్టేమంది అమెరికనులు కనిపించరు. ఇంతకాలం వున్నా నేను వారిభాష పూర్తిగా ఆకళించుకోలేకపోయాననే అనకుంటున్నాను.

 

అమెరికాకి వచ్చిన మనవాళ్లు ఇక్కడి జీవనసరళికి తొందరగానే అలవాటు పడతారు. ఉద్యోగాలు నిలబెట్టుకోడానికి అది అవసరం. సరదాలకోసం సమాజంలో లీనమవడం కూడా మామూలే. స్థానబలిమి అంటే ఏమిటో అమెరికా వచ్చేకే నాకు బోధపడింది. తనరంగంలో ఎంతగొప్పవారయినా మనం the others.” మన వాళ్లు ఉద్యోగాల్లో నిలదొక్కుకోడానకి యావఛ్చక్తినీ ధారపోయాలి.. వారివెంట వచ్చిన ఇల్లాళ్లకి కూడా పరోక్షంగా అదే బాధ. ముఖ్యంగా 60, 70 దశకాల్లో ఇదే జరిగింది. ఒకవేళ భార్యలు కాలక్షేపంకోసం ఉద్యోగాలు చేసినా, మళ్లీ వంట పనీ, ఇంటిపనీ, చాకలిపనీలాటి అలవాటులేని చాకిరీ అంతా కలిసి వీరినిమరో ప్రపంచంలో (పదిమంది శ్రీశ్రీలు కూడా చూడలేని లోకం), అయోమయోవస్థలో పడేశాయి. ఆకారణంగా వాళ్ల వ్యక్తిత్వాలూ, ఆలోచనాధోరణీలో విపరీతమైన మార్పు వచ్చింది. ఇదే నేను అమెరికా వచ్చింతరవాత రాసినకథల్లో దేవీపూజ”, “నిజానికీ, ఫెమినిజానికీ మధ్య”, “ఆనందో బ్రహ్మాలో ఆవిష్కరించాను.

 

 గుర్తింపు. మనిషి మనుగడకి గుర్తింపు జీవనాడి. రచయితకి కూడా అవరసమేనని వేరే చెప్పక్కర్లేదు. 1970లో  తృష్ణ కథ ఆంధ్రజ్యోతికి మామూలుగా పంపిస్తే, దాన్ని ఆ పత్రికవారు ఉగాదికథల పోటీలకుప్పలో పడేసి, లేని కేటగిరీ ఒకటి సృష్టించి, ప్రత్యేక బహుమతి ప్రకటించేరు. మంచికథని గుర్తించడం అంటే అదే అనుకుంటాను. అలాగే 1971లో చిరుచక్రంకి ప్రథమబహుమతి వచ్చింది. 2002లో సఖ్యసాహితీ, 2006లో లేఖిని సాహిత్యసభలలో అనూహ్యమైన ఆదరాభిమానాలు పొందేను. 50వ దశకంనుండీ రాస్తూ లబ్ధప్రతిష్ఠలయిన రచయితల మొదలు ఇప్పుడిప్పుడే కలంపట్టిన యువరచయితలవరకూ 200 మందికి పైగా ఆసభలకొచ్చి నన్ను చకితురాలని చేసేరు. మునిపల్లె రాజు గారనుకుంటా తెలుగుస్వతంత్రలో మీకథలు, మాతోటలో అవీ మాకు గుర్తేనండి అంటూ శీర్షికలతో సహా చెప్తే నేనెంత పొంగిపోయేనో మాటల్లో చెప్పలేను. ఇక్కడ నేను చెప్పుకోవలసిన ముఖ్యమైన విశేషం నాకు ఏమాత్రమూ పరిచయంలేని డాక్టర్ వాసా ప్రభావతిగారు పూనుకుని ఈసభలు నిర్వహించడం. నేను వస్తున్నానని మాఅన్నయ్య ఆవిడకి చెప్పగానే, ఆవిడ ఆఫోనులోనే ఆహ్వానాలు మొదలుపెట్టి, రెండు రోజులలో అంతపెద్ద సభ ఏర్పాటు చెయ్యడం. డాక్టర్ నాయని కృష్ణకుమారి గారూ, డాక్టర్ చేకూరి రామారావు గారివంటి ప్రముఖ సాహితీవేత్తలు అనేకులు ఆసభలకి హాజరయి, సభని జయప్రదం చేయడం జన్మలో మరుపురాని అనుభవం నాకు. తిరపతిలో వున్నప్పుడు కూడా లైబ్రరీలోనే కాదు వూళ్లో కూడా జనాలు ఎంతో ఆదరభావంతో చూసేవారు నన్ను.

 

ఆధునిక సమాజంలో మన అస్తిత్వాన్ని కొలిచేవి రెండు ఒకటి ఆర్థిక స్థాయి. రెండు నెట్వర్కింగ్ ద్వారా సాధించుకోగల గుర్తింపు. నాకు మొదటిది లేదు. రెండోది చేతకాలేదు.

 

తూలిక (www.thulika.net). ప్రారంభించి ఏడేళ్లయింది. ఒక్కచేతిమీదుగా, నాఖర్చుతో, కేవలం తెలుగు కథలకీ, కథలమీద వ్యాసాలకీ పరిమితమైన ఏకైక వెబ్ పత్రిక ఇది.

తూలిక ప్రారంభించడానికి కారణాలు: 1. రచయితగా మనడానికి నాకు అమెరికా వాతావరణం అనువు కాకపోవడం, 2. పైన చెప్పినట్టు మనవాళ్లూ” “మనపద్ధతులూలలో కనిపించిన మార్పులు. వాటికి నేను తట్టుకోలేకపోయాను. అంచేత నాది అయిన ప్రపంచం ఒకటి సృష్టించుకోవలసి వచ్చింది, 3. భిన్నసంస్కృతుల మధ్య తేడాలూ, సామ్యాలూ స్పష్టం కావడం. అందులో భాగమే అమెరికాలోనూ ఇండియాలోనూ వున్న స్టీరియోటైపు అభిప్రాయాలని చెదరగొట్టాలన్న తపన. అందుకే నేను మన సంస్కృతిని ప్రతిబింబించే కథలు మాత్రమే అనువాదాలకి స్వీకరిస్తున్నాను కానీ ఈనాడు దేశంలో ప్రబలుతున్న నూతనపోకడలు కాదు. అంటే వాటికి విలువ లేదని కాదు. ప్రస్తుతం అమలులోవున్న జీవనసరళిని అన్నిరకాల మీడియాలూ బాగానే ప్రచారం చేస్తున్నాయి. నాదృష్టి ఆమీడియాలు నిర్లక్ష్యం చేసినవారిమీద.  4. మనదేశంలోనే కొన్నిభాషలకి ఇస్తున్న ప్రాముఖ్యత తెలుగుకి లేదు. విదేశాల్లో అంతకన్నా లేదు. అంచేత కూడా తెలుగుకథల అనువాదాలు  మాత్రమే నేను వేసుకుంటున్నాను. ఇతర వెబ్‌సైటులు, తెలుగువారే మొదలు పెట్టినవి కూడా, ఇతర భాషలకి ప్రాచుర్యం ఇస్తున్నారు. అవే కథలూ, అదే రచయితలూ .. అలా కాక ఇంకా చాలామంది వున్నారు అని చూపడం నా అభిమతం.

 

తూలికలో నేను రాసి ప్రచురిస్తున్న పరిశీలనాత్మక వ్యాసాలకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. వందకి పైగా అనువాదాలు ప్రచురించాను ఇప్పటికి. అందులో 80 శాతం నేను చేసిన అనువాదాలే. ఇతర అనువాదకులలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది శారద (ఆస్ట్రేలియా). చక్కని కథలు స్వయంగా రాస్తూ, నేను అడిగినప్పుడల్లా కాదనకుండా, ఓపిగ్గా అనువాదాలు చేసి అందిస్తున్న ప్రతిభాశాలీ, సౌజన్యమూర్తీ.  

 

తెలుగుతూలిక (https://tethulika.wordpress.com).  నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ విదేశీ వాతావరణంలో తొలిసారి నాకు ప్రాణం పోసింది నాఅనువాదాల తూలిక అయితే, మలిసారి జన్మ నిచ్చింది నాతెలుగుతూలిక. ఇది కేవలం నేను తెలుగులో రాసిన, రాస్తున్న నా రచనలకే పరిమితం. ఈరెండో తూలిక, తెలుగుతూలిక, ప్రారంభించాక, నేను గ్రహించిన సత్యాలు నాకథలు ఈనాటి యువపాఠకులని ఆకర్షించి ఆకట్టుకోడం. వీరిలో చాలామందికి నేనెవరో తెలీదు. నావయసు తెలీదు. నారచనలద్వారానే పరిచయం అయి, ఆప్తులయిపోయిన వర్థమాన రచయిత్రులు సౌమ్య, సుజాత, రాధిక.. . వీరితో చర్చలు ఎంతో ఆసక్తికరంగా వుంటున్నాయి. కల్పనతో స్నేహం, చర్చలు ఈబ్లాగుకంటే చాలాకాలం ముందే ఏర్పడింది. నాకు తెలీని పుస్తకాలగురించి చెప్పేవారిలో సౌమ్యని చెప్పుకోవాలి (అందరూ ఆడపిల్లలే, ప్చ్ ఫెమినిజం అనకండి. మగరచయితలు కూడా వున్నారు, తరుచూ మెయిలులిచ్చుకోం గానీ). వీరందరూ నావయసులో సగమో, మూడోవంతో కనక, నాకథలు కాలానికి నిలిచినట్టే అనిపిస్తుంది. మీకు రావలసిన గుర్తింపు రాలేదు అని ఈ యువరచయితలు. అన్నప్పుడు అదే నాకు గొప్ప గుర్తింపు అనిపించింది.

 

నాపాతకథల్లో కంటె ఈమధ్య రాస్తున్న కథల్లో హాస్యం, వ్యంగ్యం పాలు ఎక్కువ అని కూడా అన్నారు ఒకరిద్దరు. దీనికి కారణం కొంతవరకూ నాఅనుభవాలమూలంగా కలిగిన అసంతృప్తి కావచ్చు. ఎక్కువమంది పాఠకులని ఈవ్యంగ్యం, హాస్యం ఆకర్షించడం కూడా కావచ్చు.

నా రచనలద్వారా ఆప్తురాలయిన మరో యువరచయిత్రి వైదేహి. నాతెలుగుతూలికలో నేను రాస్తున్న ఊసుపోక వ్యాసాలు, (లత ఊహాలోకం శైలిలో), చదివి, తమ తెలుగుజ్యోతి (న్యూజెర్సీ) పత్రికకి రెగ్యులర్‌గా రాయమని కోరడం నాకెంతో ఆనందం కలిగించింది.

 

స్టాటిస్టిక్స్. మొదట, ఇంగ్లీషు అనువాదాల. తూలికలో నేను మూడు నెలలకోసారి ఒక ఒక వ్యాసమూ, రెండో మూడో అనువాదాలు పెడుతూ వచ్చాను. ఈమధ్య ఆపద్ధతి మార్చి, రెండునెలలకోసారి ఒకవ్యాసమూ, ఒక అనువాదం మాత్రమే పెడుతున్నాను. హిట్స్ వారానికి 350-450 వుంటున్నాయి. తెలుగుతూలిక మొదలు పెట్టినతరవాత  ఈ సంఖ్య 700-800 కి పెరిగింది. అది నాబ్లాగు అభిమానుల అభిమానం, తద్వారా ఇస్తున్న మద్దతు అనుకుంటాను. తూలికలో మొదటినుండీ పరిశీలనాత్మక వ్యాసాలకి ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం తెలుగు చదవడం అలవాటు లేకపోయినా, తెలుగుమీద అభిమానం చూపుతున్న యువతరం అనుకుంటున్నాను.  ఇంతకుముందు ప్రస్తావించిన, తెలుగురచయిత్రులమీద నేను రాసిన పుస్తకంలోని మొదటి ఛాప్టరు 2002లో తూలికలో పెడితే ఆ ఒక్కవ్యాసానికే రెండువేలకి పైగా హిట్స్ తగిలేయి. కొందరు కొన్నివ్యాసాలు కాపీ చేసి తమ సైటులలో పెట్టుకున్నారు కూడా. తెలుగుతూలికలో కూడా హిట్టులు (తిట్టులు ఏమైనా వుంటే నాదాకా రాలేదు :)). శతాధికంగా వుంటున్నాయి. ముఖ్యంగా కూడలి, జల్లెడలలో నమోదు అయింతరవాత సంఖ్య చూస్తే నాకు కళ్లు జిగేల్మన్నాయి. ఆయా అధినేతలకి ధన్యవాదాలు.

 

తూలికకి గుర్తింపు మాట చెప్పాలంటే. గత ఏడేళ్లలోనూ అమెరికాలో తెలుగుసాహిత్యంతో ఏమాత్రమో పరిచయంవున్నవారిలో కనీసం ముప్పాతికమంది తూలిక పేరు వినే వుంటారు. అయినా తూలిక గురించిన ప్రస్తావన ఏసాహిత్యవ్యాసాల్లోనూ కనిపించదు. ఏసాహిత్యసభల్లోనూ వినిపించదు. కారణం నా నెట్వర్కింగ్ స్కిల్స్ లో లోపమే. 

 తూలిక పాఠకులనుండీ కొన్ని వందల అభినందన మెయిళ్లు వచ్చేయి గత ఏడేళ్లలోనూ. తమంత తాము వచ్చి నాకు పరిచయం చేసుకున్న ఉద్ధతులు డజనుమందికి పైగా వున్నారు అమెరికాలోనే. కానీ తూలికలోని అనువాదాలని పుస్తకంగా వెయ్యమని సలహాలిచ్చినవారున్నారు కానీ అలాగే వేద్దాం, సాయం చెయ్యండి అంటే ముందుకి వచ్చినవారు ఇద్దరే. ఆమొత్తం ప్రచురణకి చాలదు కనక నేను తీసుకోలేదు.

 

తెలుగు ఫెమినిజంగురించి నాఅభిప్రాయం నాకాలం రచయితల్లో కొందరు మేం ఫెమినిస్టులం అని గొప్పలు పోతూంటేమరి కొందరు మేం ఫెమినిస్టులం కాము అని ప్రత్యేకించి ప్రకటించుకుంటున్నారు. ఈరెండో తరగతి జనాభాలో నేను వున్నాను కనక నాఅభిప్రాయం చెప్తాను. ఈనాడు ఫెమినిజం అన్న పదానికి అనేక వివరణలు ప్రచారంలో వున్నాయి. అందులో తెలుగుదేశంలో ప్రాచుర్యంలో వున్న వివరణ పురుషాధిపత్యం, పురుషాహంకారంలాటి పడికట్టురాళ్లతో పులిసిపోయింది. కొంతమంది ఈ ఫెమినిజంపేరు మీదుగా స్వార్థంతో కుహనావిలువలతో సమాజానికి హాని చేస్తున్నారు. నిజానికి ఈనాడు అమెరికాలో ప్రాచుర్యంలో వున్న థర్డ్ వేవ్ ఫెమినిజానకీ, దీనికీ పోలికే లేదు.

 

ఆడదాన్ని కొట్టినా వూరకుక్కని కొట్టినా హింస హింసే. ఇది కేవలం జెండర్ సమస్యే కాదు. మనచుట్టూ నిత్యం అనేకరకాల హింసలు జరుగుతున్నాయి వున్నవాడు లేనివాడినీ, పెద్దవాడు చిన్నవాడినీ, ఆ చిన్నవాడు ఇంకా చిన్నవాడినీ, ఒకరంగువాడు మరోరంగు వాడినీ … ఇలా ఎవరు ఎవరిని కొట్టగలిగితే వారు, ఎలా వీలయితే అలా, హింసించడమే జరుగుతోంది. వీటివెనక ప్రముఖంగా వున్నది స్వార్థం, అహంకారం. తాను ఎదుటిమనిషికన్న మిన్నఅని ఋజువు చేసుకోడానికి చేసే బృహత్‌యత్నం. ఒక్కమాటలో ఫెమినిజం హ్యూమనిజంలో ఒకభాగం. చాలా చిన్నభాగం. మగవారు ఆడవారిని హింసించడం మానేస్తే లోకంలో బాధలన్నీ తీరిపోతాయనుకోడం భ్రమ. మార్పు రావలసింది ప్రాథమికంగా మనుషుల తత్త్వాలలో. వ్యక్తివికాసం పేరుతో, సక్సెస్ పేరుతో, individuality పేరుతో మానవీయవిలువలు మర్చిపోతున్నారు.

 

చివరిమాటగా, సంకలనం తలపెట్టి, నన్ను గుర్తుంచుకుని, వ్యాసం రాయమని కోరిన సాహితీసోదరి, ఆత్మీయురాలు డాక్టర్ వాసా ప్రభావతిగారికి మనఃపూర్వకంగా నా కృతజ్ఞతలు..                 

 

 

(మాలతి, ని. జూన్ 2008.)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

23 thoughts on “నేనూ, నారచనలూ (వ్యాసం)”

 1. బార్గవీరావుగారి విషయం తెలిసింది కానీ సరళాదేవిగారు పోయారని తెలీదు. కొంతకాలం ఆరోగ్యం బాగులేదని విన్నాను. అవును కావలిసినవారు ఇకలేదనుకుంటే బాధ. మీకు వీలయినప్పుడు డైరెక్టుగా ాస్తూ వుండండి. thulikan@yahoo.com.

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ
  మా సరళాక్క క్రితం ఏడాది దసరాల్లో పోయారు. అదే విధంగా మూడు లక్రితం భార్గవీరావు పోయారు.వాళ్ళని నేను చాలా మిస్ అయ్యాను.మీతో ఈవిధం గా కలవడం బాగుంది.నేను ఎక్కువగా అందరి తో కలవలేను వీళ్ళు పోయాక ఒంటరిగా అనిపించేది .మీరు వెంటనే స్పందించడం సతోషం.ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. సుభద్రాదేవిగారూ, మీరెప్పుడూ నాకాప్తులే. మిమ్మల్ని మర్చిపోయాననుకున్నారా :).
  సరళాదేవిగారికీ, వీర్రాజుగారికీ నా శుభాకాంక్షలు తెలుపండి. సరళాదేవిగారి ఎదురు చూసిన ముహూర్తం కథ విస్తృతంగా చర్చించాను నాపుస్తకంలో. ప్రభావతిగారి పుస్తకం గురించిన అప్ డేట్ కి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు
  మీరూ మీరచనలు చదివాను.హైదరాబాద్ లో మీ రెండు సభలకు వచ్చాను.ప్రభావతిగారు ప్రచురిస్తున్న ఈపుస్తకం ప్రస్తుతం ప్రెస్సుకి వెళ్తుంది,మా పెద్దక్క పి సరళా దేవి వలన,మావారు శీలా వీర్రాజు గా రి వలనా మీరు నాకు దగ్గరి వారే అనిపించుతోంది.సాహిత్యం మరీ దగ్గరితనాన్ని పెంచింది
  సుభద్ర

  మెచ్చుకోండి

 5. రాజేంద్రగారూ, నాపేరు మీకింతగా గుర్తుందంటే చాలా సంతోషంగా వుందండీ.
  మీ అభిప్రాయాలు నాకు మరింత ఆనందదాయకం.
  మరి మీరు ఇప్పుడు విశాఖతీరాన వున్నారు కదా. మహారాణిపేటలో దుంపలబడి ఇంకా వుందా 🙂
  కిందటిసారి వచ్చినప్పుడు మామేనగోడలు పెళ్లి హడావుడిలో చూడడం పడలేదు.

  మెచ్చుకోండి

 6. చాలా కాలం క్రితం సంగతి ఇది.నాచిన్నప్పుడు మా స్వస్థలం గుంటూరు జిల్లా నిడుబ్రోలు జిల్లాశాఖాగ్రంధాలయం లో వచ్చే పత్రికల్లో మరీ తరచూ వచ్చేపేరు కాకపోయినా కనిపించిన ప్రతిసారీ నిడదవోలు మాలతి అన్న పేరు మామిత్రుల మధ్య కాస్త చర్చకు (అందరం బచ్చాగాళ్ళమే)ఆవిడది నిడదవోలా?నిడుబ్రోలా అని?
  అప్పటి ప్రముఖపత్రికారచయిత్రులు,మాలతి గారు కాక ఇంకోమాలతి(చందూర్)సి.ఆనందారామం,కె.రామలక్ష్మి,ఇక సీరియళ్ళలో యుద్ధనపూడి వగైరాలు.
  మాలతి.ని.గారి రచనలన్నీ చదివాను అని చెప్పను గానీ,ఆమె వెలిబుచ్చేభావాలను ఆమె పాత్రలు ద్వైధీభావం లేక నిక్కచ్చిగా చెప్పే పద్ధతి నాకు ఇష్టం.
  అనుకరణ,హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండగలగటం మాలతి.ని గారి విజయాలకు ఒకప్రబలకారణం అని నా నమ్మకం.

  మెచ్చుకోండి

 7. సుజాతా, నేను ఇండియా వచ్చినప్పుడు మనం మాటాడుకోడం గుర్తుంది బాగానే. ఆమీటింగులో నువ్వు వుండి వుంటే బాగుండేది. సాహితీలోకం .. ఏమనుకుంటోందో తెలుసుకోవాలని నాక్కూడా వుంది. 🙂 … ఈసారి నేను హైదరాబాదు వస్తే నీదే పూచీ పూర్తిగా 🙂

  ప్రవీణ్, విహారి – మీ మాటలు నాకు ఎంతో ప్రోత్సాహకరంగా వున్నాయి. కృతజ్ఞతలు.
  మహేష్ కుమార్ – మీరు అర్భకులేమిటి కానీ, మీకు నచ్చినందుకు సంతోషం.

  పూర్ణిమా, నా ప్రముఖ … స్టేటస్ కేం గానీ రాయమన్న విషయాలు ఏమిటా అని కోంచెంసేపు ఆలోచించి, నామాటలు మళ్లీ చదువుకుని అర్థం చేసుకోడానికి ఇంతసేపు పట్టింది. అవును రాస్తానని మాటిచ్చేసేను. సరే, ఆలోచించి రాయడానికి ప్రయత్నిస్తాను. కథలకి ప్రేరణ ఇక్కడ రాసేశాను కదా. ఇంకా ఏమైనా వుందా రాయడానికి.
  ఏమైనా చూస్తానులెండి ఇదో పరీక్ష అనుకుని. థాంక్స్.
  మాలతి

  మెచ్చుకోండి

 8. చాలా వివేకవంతమైన స్వీయవిశ్లేషణ. ఇలాంటి అంతర్చక్షువులు నాలాంటి అర్భకులకు ఎప్పటికైనా కలుగునా! కష్టమే!!

  ఇంత లోతైన విశ్లేషణనికూడా అశువుగా అర్భాటరహితంగా చెప్పగలగటమే మీ రచనా వ్యాసంగానికి ఇంతమంది అభిమానుల్ని తెచ్చిపెట్టిందనిపిస్తుంది. నేను మీ బ్లాగులోని కొన్ని టపాలనుతప్ప మిగతావి చదవలేదు. ఇక ఆ పని అర్జంటుగా మొదలెట్టాలి.

  మెచ్చుకోండి

 9. ప్రవీణ్ గారు,
  కుటుంబరావు గారి తర్వాత అలాంటి ఫ్లో మాలతి గారి రచనల్లో చూశాను నేను. వాక్యాలు జల జలా సహజంగా జారిపోవడం.

  మాలతి గారు,
  హైదరాబాద్ లో మీ సభ మిస్ అయినందుకు (అప్పుడు నేను గుర్గావ్ లో ఉన్నాను. మీతో బాంబే కి ఫోన్ చేసి మాట్లాడాను, గుర్తుందా) భలే బాధపడతాను. నేనూ ఉంటే సభలో మీ గురించి మాట్లాడలేకపోయినా(అంత అనుభవం, పాండిత్యం రెండూ శూన్యమే కనుక)వేదిక మీద నిర్వాహకులతో కలిసి కుర్చీలో, టేబుల్ క్లాతో సర్ది తృప్తి పడేదాన్ని. ముఖ్యంగా మీ రచనల గురించి సాహితీలోకం లో ఉన్న అమూల్యాభిప్రాయలు తెలుసుకునేదాన్ని.

  మెచ్చుకోండి

 10. నాకు మీ రచనల్లో ముఖ్యంగా నచ్చేది భాష. కొన్ని రచనలు చదివితే అవసరం కోసం పదాలు వాడినట్టు అనిపిస్తుంది.
  పదాలు వాటి దారిని అవే వెతుక్కోవాలి. అప్పుడే వాటికో అందం. అలాంటి రచనలనే నేను ఇష్టపడతాను వ్యాసాల్లో గానీ, కథల్లో గానీ.
  ఆ భాష ,తీరు మీ వ్యాసాల్లో, రచనల్లో కనబడుతుంది.

  ఈ వ్యాసంలో మీరు తెలిపిన సంగతులు చాలా ఆసక్తికరంగానూ, ఎడ్యుకేటీవ్ గానూ ఉన్నాయి.

  మెచ్చుకోండి

 11. మాలతి గారు,

  అంతర్జాలం లో మొట్ట మొదటి సారి ఏకబిగిన చదివిన పెద్ద వ్యాసం మీదే. చాలా బాగా చెప్పుకొచ్చారు. మీ రచనా ప్రస్థానాన్ని చెప్పిన తీరు నన్ను చదివింపచేసిందేమో. ఇలాంటి వ్యాసాలే మరింత మంది వర్ధమాన రచయిత/త్రులు పుట్టడానికి దోహదం చేస్తాయి.

  “ఆధునిక సమాజంలో మన అస్తిత్వాన్ని కొలిచేవి రెండు – ఒకటి ఆర్థిక స్థాయి. రెండు నెట్వర్కింగ్ ద్వారా సాధించుకోగల గుర్తింపు. నాకు మొదటిది లేదు. రెండోది చేతకాలేదు. ”

  మీరన్న ఈ పై మాటలు నగ్నసత్యాలు. ఎంతో మంది రచనలు మరుగున పడ్డానికి, మెరుగులు దిద్దుకోకపోవడానికి కారణాలు.

  — విహారి

  మెచ్చుకోండి

 12. ఈ వ్యాసం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. మీరో ప్రముఖ రచయిత అని తెలిసింది.. ఈ బ్లాగు వల్లే!! అంతకు ముందు నుండీ మీ టపాలు చదువుతున్నాను. ఇలా మీ అనుభవాలను మాతో పంచుకుంటుంటే.. ఎంత బావుందో మాటల్లో చెప్పలేను!

  అయితే ఈ రెండు విషయాల మీద తప్పక రాస్తారు కదూ.. ౧) కథ ఆఖరున పాత్రని ఎందుకు చంపాలి.. ఆ సందర్భాలు ౨) కథ రాయటానికి రచయితకు కలిగిన ప్రేరణ

  అలానే “ఫెమినిజం” అంటే “మగవారికి వ్యతిరేకం” .. మీరన్నట్టు ఆ థెర్డ్ వేవ్ కి ఏ మాత్రం సంబంధం లేదు.. దాని మీద కూడా వీలు పడినప్పుడు మీ అభిప్రాయం చెప్పగలరు.

  మీ వ్యాసాలకై వేచి చూస్తుంటా!! Thanks!!

  మెచ్చుకోండి

 13. సిరిసిరిమువ్వ, నిజమేనండీ, తెలుగుతూలిక మొదలు పెట్టిందగ్గర్నుంచీ చాలాకాలంతరవాత పుట్టింటికొచ్చినంత సంబరంగా వుంది. 🙂 ధన్యవాదాలు.
  సుజాత, బొల్లోజు బాబా, నిషిగంధ, parameshmca –
  మీరు వెలిబుచ్చిన అదరాభిమానాలకి ధన్యవాదాలు.
  కిరణ్ గారూ మీసలహా పాటించడానికి ప్రయత్నిస్తాను.
  కొత్తపాళీ, మీరు చెప్పింది నిజమే. కథకి వెనక వున్న ప్రేరణ ఏమిటో తెలుస్తే కథని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలుగుతాం. ఈవిషయంమీద చాలా రాయొచ్చు. త్వరలోనే మరో టపా రాస్తాను. మీ ఆలోచనలు ఇక్కడ వెలిబుచ్చినందుకు కృతజ్ఞతలు.
  కల్పనా, నీ టపా చూసాను. అక్కడ రాసేను, మళ్లీ చెప్తున్నా. అఫ్సర్ తో మాటాడుతున్నప్పుడు తెలిసింది నీచెయ్యి నొప్పి చిన్న నొప్పి కాదని. త్వరలోనే చికిత్స పొందగలవని ఆశిస్తున్నా. నీదగ్గరనించి రావలసిన మంచికవితలూ, వ్యాసాలు ఇంకా చాలా వున్నాయి కద.

  మెచ్చుకోండి

 14. మాలతి గారు,

  ఇది చదివాక బోలెడన్ని పురా జ్ఞాపకాలు. ఇక్కడ ఒకటి, రెండు మాటల్లో రాయడం దేనికిలే అని ఒక చిన్న పోస్ట్ లాంటిది నా బ్లాగ్లో రాసాను.

  కల్పన

  మెచ్చుకోండి

 15. “ఒకదేశానికీ మరొకదేశానికీ వున్న తేడా కంటె ఒక తరానికీ మరొక తరానికీ వున్న తేడాయే ఎక్కువ” అక్షరసత్యాలు మాలతి గారూ!!
  అద్భుతమైన వ్యాసం.. పొద్దున్నించీ ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో.. చాలా చోట్ల నాకు నేనే కనబడ్డాను కూడా! ముఖ్యంగా మీ ఇక్కడి లైఫ్ గురించి చెప్తున్నప్పుడు!

  మెచ్చుకోండి

 16. చాలా బాగుంది. మీ వ్యాసం. మొదట్లో మీ బ్లాగు ఎవరో నాబోటి అమెట్యూర్ బ్లాగరి దనుకున్నాను. చాలా బాగా వ్రాస్తున్నారే అని కామెంటిచ్చాను కూడా. ఇప్పుడు మీ బ్లాగుపట్ల గౌరవం ఇంకా పెరిగింది.
  బొల్లోజు బాబా

  మెచ్చుకోండి

 17. excellent.

  రచయిత రాసిందే పట్టించుకోవాలి మిగతా వివరాలన్నీ ఎందుకూ అంటారు కొంతమంది. కానీ నా మట్టుకి నాకు ఆయా కథల వెనుక రచయితకి ఉన్న ప్రేరణ ఏవిటి అనేది తెలుసుకోవడం చాలా బాగుంటుంది.

  మిమ్మల్ని ఇది రాయడానికి పురిగొల్పిన వాసా ప్రభావతిగారికీ, రాసినందుకు మీకూ అభినందనలు.

  మెచ్చుకోండి

 18. బాగుంది మాలతి గారు! మీరు మీ కథలను ప్రస్తావించినపుడల్లా ఆ కథలన్నీ వరస పెట్టి గుర్తొచ్చాయి. ఫెమినిజం గురించి రాసింది కూడా బాగుంది.
  “నాది అయిన ప్రపంచం సృష్టించుకోవడం” చాలా నచ్చింది. అదే నయం చాలా సార్లు!

  మెచ్చుకోండి

 19. !

  >>> నాది అయిన ప్రపంచం ఒకటి సృష్టించుకోవలసి వచ్చింది

  !!, congrats.

  మీరు ఎక్కడన్నా ఇతర సైట్ల గురించి చెపితే లింకులు ఇవ్వండి, అంటే క్లిక్కబుల్ లింకులు ఇవ్వండి. ఉదాహరణకు మీరు చాలా సార్లు మీ సైట్ల గురించి చెప్పినారు కాని ఎక్కడా క్లిక్కబుల్ లింకులు ఇవ్వలేదు! అలాగే ఇతర బ్లాగర్ల గురించి చెప్పినారు కానీ వారి బ్లాగులకు లింకులు అంతర్గతంగా ఇచ్చి ఉండాల్సింది, అంటే సౌమ్య అనే పేరు క్లిక్ చేస్తే సౌమ్య గారి బ్లాగునకు వెళ్లాలి అన్న మాట. గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు కేవలం క్లిక్కబుల్ లింకులనే పట్టించుకుంటాయని విన్నాను. ఇప్పుడు పరిస్తితులు ఎలా ఉన్నాయో తెలీదు, కానీ ఇలా క్లిక్కబుల్ లింకులు ఇవ్వడంవల్ల చాలా లాభాలు ఉన్నాయి అని మాత్రం ఘంటా పదంగా చెప్పగలను

  మెచ్చుకోండి

 20. అభినందనలు.
  తెలుగుతూలిక లేకపోతే చాలామందికి మీ గురించి తెలిసి ఉండేది కాదు.
  మీరు రాసేది చదువుతుంటే ఏ భేషజాలు పదాడంబరాలు లేకుండా మీరు ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఫెమినిజం గురించి చక్కగా చెప్పారు, మీ అభిప్రాయమే నాది కూడాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s