కథల వెనక కథలు

 

ఏకథ అయినా ఎక్కడ మొదలవుతుంది, ఒక కథకి ప్రేరణ ఏమిటి అన్న ప్రశ్న ఎలా వచ్చిందో ముందు చెప్తాను.నేను కిందటివారం రాసిన “నేనూ, నారచనలూ” టపామీద కొత్తపాళీగారు ఓ వ్యాఖ్య పెట్టేరు.

 “రచయిత రాసిందే పట్టించుకోవాలి మిగతా వివరాలన్నీ ఎందుకూ అంటారు కొంతమంది. కానీ నా మట్టుకి నాకు ఆయా కథల వెనుక రచయితకి ఉన్న ప్రేరణ ఏవిటి అనేది తెలుసుకోవడం చాలా బాగుంటుంది” అని.

దానిమీద నేను,  సమాధానం రాస్తూ, ప్రేరణమీద రాయడానికి చాలా వుంది అన్నాను, అనాలోచితంగానే.

అయితే రాయండి అని పూర్ణిమగారు అన్నారు. అప్పుడు నాకు తెలివొచ్చింది. J ఏంరాయాలా అని ఆలోచిస్తూ వాక్‌కి బయల్దేరి, దారి తప్పి పొరుగూరు వెళ్లిపోయాను. మాయింటినించి మైలున్నర నడిస్తే పొరుగూరే లెండి. దారి తప్పి తిరుగుతూంటే నాలుగుముక్కలు తోచేయి. ఇవి మీప్రశ్నకి సమాధానం అవునో కాదో మీరే చెప్పాలి.

నిజానికి రాస్తున్నవారందరూ ప్రేరణ కలగబట్టే కదా రాస్తున్నారు. అందుకు సందేహం లేదు. అయితే ఏకథ ఏప్రేరణతో వచ్చింది అంటే అప్పుడు బోలెడు కథలవెనక కథలు తెలుస్తాయి. ఈవిషయమే కొత్తపాళీ అన్నది, కథలకి ప్రేరణ ఏమిటో తెలుసుకోడం తనకి ఇష్టమని. దానికి నాకు తోచిన టీక ఏమిటంటే చిన్నకథలకి ఒక ముఖ్యలక్షణం క్లుప్తత. అంటే, అటు ఆరుతరాలూ, ఇటు మూడు తరాలూ, లోకంలో గల సమస్త జనుల సమస్యలూ, మినిఎన్‌సైక్లోపిడియాలాగ రాసుకుంటూ పోడానికి నవలలో అయితే సాగుతుందేమో కానీ చిన్నకథలో అలా కాదు.. కథలో ప్రధానాంశంమీద మాత్రమే కేంద్రీకరించి కథ నడపాలి. తెలుగువాళ్లలో అలా రాయడానికి రావిశాస్త్రిగారికి పెట్టింది పేరు. ఆయన కథని శిల్పం చెక్కినట్టు ఒక్కొక్కమాట చెక్కుతారని ప్రసిద్ధి. అలా క్లుప్తంగా చెప్పినప్పుడు సహజంగానే చెప్పకుండా వుండిపోయినసంగతులు చాలా వుంటాయి.

ప్రతిభగల రచయిత కథలోనే మొత్తం చెప్పగలగాలి అంటారు గానీ దానికో లిమిటుంటుంది. చాలా మంచికథలో రచయిత తాను చెప్పదలుచుకున్న విషయం అంతా క్లుప్తంగా, స్పష్టంగా చెప్పి వుండొచ్చు. కానీ, ఆ కథ వెనక కథ ఏమిటో తెలుసుకున్నప్పుడు, ఆకథకి ప్రయెజనం ద్విగుణీకృతమవుతుంది. అంటే ఒకకథగా పరిపూర్ణంగా ఆవిష్కరించడం జరిగినా, దానికి వెనక వున్న ప్రేరణ ఏమిటో తెలిసినప్పుడు మరొకస్థాయి అర్థాన్ని సంతరించుకుంటుంది అని. (కొత్తపాళీగారూ, నా అర్థం తప్పయితే, చెప్పండి).

ఉదాహరణకి, నేను రాయని కథ ఒకటి, అంటే నిజంగా జరిగింది, చెప్తాను. ఒకసారి నేను మాఅమ్మాయిని చూడ్డానికి లాసాంజలస్ వెళ్లేను. తన గదిలో గోడమీద ఒక ఇంగ్లీషు కవిత వుంది. మామూలుగా మనం రోజూ అనుకునే మాటలే రేపు ఏంఅవుతుందో తెలీదు, అంచేత ఈరోజు హరివిల్లు చూసి ఆనందించు .. అని. కింద తన స్నేహితురాలి పేరు చూసి, టాషా కవితలు రాస్తుందని నాకు తెలీదే అన్నాను.

అది టాషా కాదు, సారా రాసింది అంది మా అమ్మాయి. (నేను పేరు తప్పు చదివాను.).

నేను గతుక్కుమన్నాను. ఎందుకంటే

టాషా చిన్న చెల్లెలు సారా. చిన్నమ్మాయి. తొమ్మిదేళ్లు.

అంతచిన్నమ్మాయికి అంత ఫిలాసఫీ ఏమిటి అని.

ఆకవిత రాసిన రెండునెలలకి

ఆఅమ్మాయి మరో ఇద్దరు స్నేహితులతో, సైకిళ్లమీద రోడ్డు దాటుతోంది.

అటునించి వస్తున్న కారు చూసుకోలేదు.

ప్రమాదం జరిగింది.

మిగతా ఇద్దరికి చిన్న దెబ్బలే కానీ సారాకి ప్రాణాంతకమైంది.

మరో రెండు వారాలకి ఆచిన్ని ప్రాణం పోయింది.

అవును, మీలాగే, నాకు చాలా బాధగా అనిపించింది. అంతేకాదు, ఇతర ఆలోచనలు అంతచిన్నమ్మాయికి అంత గంభీరమైనవిషయం ఎందుకు రాయాలనిపించింది,, తాను అట్టే కాలం బతకనని తనకి తెలుసా, కాకతాళీయమా, …

ఇక్కడ నేను ఉదాహరణగా ఇవ్వడానికి కారణం, వాక్యం తరవాత వాక్యం చదువుతుంటే, మీఆలోచనలు మారుతూ వచ్చేయి కదా. అలా మీఆలోచనలు మారుతూ సాగడానికి అనువుగా వాక్యాలు విరిచేను కూడా అనుకోండి. 

కథల్లో కూడా అంతే జరుగుతుంది. మీకు ఒకొక్కవిషయం తెలుస్తుంటే, కథ పువ్వు విడినట్టు వెల్లివిరుస్తుంది. కథ అంతకంతా అర్థవంతమవుతుంది.

నారచనలువ్యాసంలో చాలా చోట్ల నేను ఒక చిన్నవాక్యం ఇచ్చి, ఇదే ఈకథకి ప్రేరణ అని చెప్పేను. అంటే ఆ ఒక్కవాక్యంతో కథ తయారయిపోయిందని కాదు. అది ప్రేరణలో తొలిమెట్టు మాత్రమే. అంతకుముందూ, ఆతరవాతా జరిగిన చాలా సంఘటనలు విన్నవీ, కన్నవీ, చదివినవీచాలా విషయాలు బుర్రలో పురుగుల్లా తొలుస్తూనే వుంటాయి నాకు ఎప్పుడూను.. అందులో కధకి పనికొచ్చేవి ఏరుకుని, కూర్చుకుని కథని ఓకొలిక్కి తెస్తాను. 

ఈవ్యాసంలో, ఏదో ఒకకథ మొదలు పెట్టినతరవాత ఆతొలి ప్రేరణని ఎలా మలుచుకున్నానో చెప్తాను. మీరూ మీకథలని ఎలా మలుచుకుంటున్నారో రాస్తే మంచి చర్చ అయి, మరిన్ని పనికొచ్చే విషయాలు తెలుస్తాయి. 

ఒకొక్కప్పుడు ఏదో ఒకవాక్యం ఠకీమని తగులుతుంది అన్నాను. నవ్వరాదు కథకి మూలం కూడా ఒక్కవాక్యమే. అది 1968లో రాశాను. కాని దానికి మూలకారణమైన వాక్యం విన్నది 1957 ప్రాంతాల్లో. ఆ ఒక్క వాక్యంమీద కథ రాయడానికి అంతకాలం పట్టింది నాకు.

ఆవాక్యం మావాళ్లలోనే, ఒకాయన. ఆయనకి సంగీతం చాలా ఇష్టం. నలుగురు ఆడపిల్లలకీ వీణ చెప్పించేరు. పెద్దమ్మాయిని మేనత్త తనంత తనే కోరి కోడలుగా చేసుకుంది. మేనరికం అంటే ఈపిల్ల ఏం నేర్చుకుందో తెలిసే వుండాలి కద. పెళ్లి అయింతరవాత, ఆఅమ్మాయి వీణ తీస్తే, సంగీతం ఏమిటి సానికొంపలాఅందిట అత్తగారు. ఆమాట మాఅమ్మ ఎవరితోనో చెప్తుంటే విన్నాను. ఆతరవాత కొంతకాలానికే. చిన్నతనంలోనే ఒక రకమైన మస్క్యలర్ డిస్ట్రెఫీతో చనిపోయింది. నేను షాకు తిన్నాననే అనుకుంటాను. అందుకే నాకు దాన్నిగురించి రాయడానికి అన్నేళ్లు పట్టింది.

 

అయితే, వాళ్లింట్లో సంగతులు నాకు పూర్తిగా తెలీవు. నిజంగా ఏంజరిగిందో, వున్నదున్నట్టు రాయడానికి లేదు. నాకు అర్థం అయిందల్లా తనవాళ్లే అంత కఠినమైన మాట అన్నారు అన్నదే. అచ్చంగా ఆకథే రాయాలని మొదలుపెట్టలేదు నేను నాకథ.

నాకు చిన్నప్పుటినుండీ నవ్వుతాననీ, నవ్విస్తాననీ పేరుంది. అంచేత, నవ్వడంమీద సరదాగా రాద్దాం అనే మొదలుపెట్టేను. అందుకే ఆమధ్యకాలంలో, 1957-68, అప్పుడప్పుడు వింటున్నమాటలు, చూస్తున్నవిషయాలు పెళ్లి కాని ఆడపిల్లలు అన్నగార్ల ఇంట్లో కాలక్షేపం చెయ్యడం, కాలేజీలో హాస్యాలూ, సినిమాకబుర్లూ … ఇవన్నీ ఆకథలో చోటు చేసుకున్నాయి. హాస్యంగా మాటాడినా, మరోవేపు జనాలని తప్పుకుతిరగడం కూడా నాలక్షణమే. నేనంటే ప్రత్యేకంగా అభిమానం చూపించే స్నేహితురాళ్లు కూడా వున్నారు ఆ పదేళ్లకాలంలోనూ. అలా అనేక విషయాలు, వేరు వేరు స్థలాల్లో వేరు వేరు కాలాల్లో జరిగినవి అనేకం కలిసి ఓకథగా రూపు సంతరించుకున్నాయి. అయితే అందులో సౌందర్యం ఏమిటంటే వాటినన్నటిని ఒకగూట్లోకి చేర్చడం. అది సమర్థవంతంగా చేసానా లేదా అన్నది మీరే చెప్పాలి.

ఇంతటి విషాదకరమైన విషయమే అక్కర్లేదు కథ రాయడానికి. జీర్ణతృణంకథ రాయడానికి ఆధారం అక్షరాలా గరికపోచలే. నేను 1961-62లో లైబ్రరిసైన్సులో చేరేను. అదే సంవత్సరం కొత్తలైబ్రరీ భవనానికి ప్రారంభోత్సవం అయింది. ఇప్పుడున్న లైబ్రరీ అదే. అప్పుడు లైబ్రేరియన్, కోనేరు రామకృష్ణరావుగారు లైబ్రరీచుట్టూ తోట వేస్తే బాగుంటుందనీ, అందర్నీ మొక్కలు తీసుకురమ్మనీ ప్రోత్సహించారు. నేను నిజంగానే అవేవో గడ్డిపరకలు తీసుకువెళ్లేను. ఎక్కడినుంచో నాకిప్పుడు జ్ఞాపకంలేదు కానీ గడ్డి ఇచ్చిన మాట నిజం. ఆతరవాత కొంతకాలం తరవాత చూస్తే, నిజంగానే ఆ గరికపోచలు పచ్చని తివాసీలా కన్నులపండుగ చేసేయి. ఇది అమెరికాలోలాగ కత్తిరింపులసొగసు కాదు. నిలువుగా పెరిగి, సహజమైన కొనలతో వుండే అందం.

అయితే పచ్చగడ్డిమీద కథ ఏం రాయగలం, పల్లెపదాలు రాయొచ్చునేమో కానీ. అంచేత మళ్లీ నా ఖజానాలోంచి కథ లాగాల్సివచ్చింది పత్తిలోంచి దారం లాగినట్టు. చెప్పేను కదా మానాన్నగారు స్కూలుటీచరు కనక, స్కూళ్లలో జరిగే ట్రాన్సఫరులూ, పెన్షనుకోసం పడే అగచాట్లూ నాకు అవగతమే. అంచేత, నా గరికపోచలకి ఓ టీచరమ్మని కథానాయకిని చేసేను. వూరిబయట బంగళా, తుపాకీతో దొరగారూ కొంత రావిశాస్త్రిగారి కథలు చదవగా పట్టుబడ్డ (లేదా పట్టుకోవాలని తాపత్రయపడుతున్న) నుడికారం. రావిశాస్త్రిగారి పువ్వులు కథలో ఈతుపాకీ పేలదు అని ఓవాక్యం వుంది. అది చాలా గొప్పవాక్యం ఆకథలో. పోతే, విశాఖ హార్బరులో అప్పుడప్పుడు కనిపించే తెల్లదొరలూ.

 

అంటే నేననడం ప్రేరణ అంటే మీట నొక్కినట్టు ఏదో ఒక మాటా, ఒక సంఘటనా, ఒక వస్తువూ .. వూపునివ్వడం మాత్రమే కాదు. కథ మలచడం మొదలు పెట్టిన్నప్పుడు ఇతర సామగ్రి చాలా వాడుకోడం జరుగుతుంది.. ప్రేరణనిచ్చేది ఒకటి కావచ్చు, కథ మరొకటి కావచ్చు.

 

ప్రతికథకీ ఓమనిషో ఓసంఘటనో మాత్రమే కావాలని ఏం లేదు. ఫలరసాదుల గురియవే పాదపములూ”, “వానరహస్తంలాటి కథలు ముందు శీర్షిక పెట్టేసుకుని, తరవాత కథలు ఆలోచించేను. వానరహస్తంఅన్న శీర్షిక ఎందుకు పెట్టేనని ఎవరైనా అడుగుతారేమోనని చూస్తున్నా కానీ ఇంతవరకూ ఒక్కరూ అడగలేదు. ఇంక సస్పెన్సు భరించలేక నేనే చెప్పేస్తున్నాను.

నేను ఆంధ్రాయూనివర్సిటిలో ఆనర్సు చదివేరోజుల్లో వానరహస్తం అన్న శీర్షకతో ఒక నాటిక చూసాను భారతి మాసపత్రికలో. దానికి మూలం w.w. Jacobs రాసిన Monkey’s paw అన్న ఓ చిన్నకథ. నాకు నాటకాలంటే సరదాలేదు కానీ ఆశీర్షికా, దానివెనక కాంసెప్టూ చాలా నచ్చేయి.  శీర్షికే ప్రేరణ అయినా, నాకథకీ దానికీ మరే సంబంధమూ లేదు. మళ్లీ సంఘటనలకోసం నాభోషాణం వెతక్కోవాల్సొచ్చింది. అంతకుముందు, అంటే ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో మా అప్పాయమ్మ కొడుకు పదేళ్ల కుర్రాడు నాకు కాలేజీకీ కాఫీ తెచ్చేవాడు. రెండునెలలు అయింతరవాత అప్పాయమ్మ చెప్పింది వాడు ఆపని చెయ్యనంటున్నాడని. తోటి పిల్లలు హేళన చేస్తున్నారట కాఫీలు మోస్తున్నాడని. అది తలుచుకున్నప్పుడు నాకు తోచింది అతని వ్యక్తిత్వం. నాకథలో ముత్తయ్యని అలా దిద్దేను. అలాగే నేను లైబ్రరీలో పని చేసేరోజుల్లో ఒకమ్మాయి వుండేది యల్.డి. క్లర్కు. ఇంటినిండా పదిమంది పెద్దా, చిన్నా. తన ఆదాయం ఒక్కటే అందరికీ ఆధారం. అలాటి కొందరు క్లర్కులని చూసిన తరవాత తయారయిన పాత్ర సావిత్రి.

ఆఅమ్మాయికి కన్నీరు పిలిచిన పలుకు తల్లి. ఆవిషయం నేను హాస్యానికైనా వాడుకోవచ్చు, విషాదం సృష్టించడానికేనా  వాడుకోవచ్చు. ఆకళ్లు, … వాటినిండా నీళ్లులాటి వాక్యాలు వాడుకోవాలంటే, కథకుడి బలహీనత చూపాలి. అలాగే ముత్తయ్య తల్లి కల్లూ ఒల్లూ తిప్పుకుంటూ ఊసులాడతాదని ఆయమ్మనొగ్గేసి నాకొడుకు పొట్ట కొట్టీసినాడులాటి వాక్యాలు రాయడానికి కూడా కథకుడిని సావిత్రికి ఆపోజిట్‌గా నిలబెట్టాను. అంచేతే, కథకుడిని అబ్బాయిని చేసేను.

 

నిజానికి రాయడం full-tme ఉజ్జేగమే. మీరు రోజుకో కథ రాయక్కర్లేదు. కానీ దానిగురించిన తపన వుండాలి సదా. కనిపించిన ప్రతివస్తువూ, ప్రతి సంఘటనా, ప్రతి మనిషీ కథగా వెంటనే మారిపోరు. పదిలంగా దాచుకుంటే ఎప్పుడేనా పనికొస్తాయి. ప్రేరణ విషయంలో నాకు తెలిసింది ఇంతే.

 

 

(ఆగస్ట్. 1008.)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

21 thoughts on “కథల వెనక కథలు”

 1. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు శశికళగారూ. మీమాట నిజమే. ఒకొకప్పుడు ఆ పాత్రలు కథ రాస్తున్నప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాయి. కొన్ని సమయాల్లో కథలో పాత్ర మారిపోయి, ఆ మారిపోయినపాత్ర మాత్రమే నాతో ఉంటుంది.

  మెచ్చుకోండి

 2. మీ కధ వెనుక కధ , దానిమీద అద్భుతంగా జరిగిన చర్చ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. రచనలు చెయ్యాలని ఆశించే కొత్తవారికి ఇదో వర్క్ షాపు అనుభవంలా ఉంది. ఇక్కడ మంచి మార్గానిర్దేశం కూడా దొరుకుతుంది. ఇంత మంచి చర్చ మాముందుంచిన మీకు ధన్యవాదాలండి. కధకి ప్రేరణ మన నిజజీవితంలో ఎదురయిన వ్యక్తులో, సంఘటనలో, ఎవరో చెప్పిన విషయాలో, కధల్లో చదివిన కొన్ని పాత్రలూ మస్తిష్కంలో నిక్షిప్తం అయ్యి కధ రాస్తుంటే మనముందు కదలాడుతూ ఉంటాయని నా అనుభవం.

  మెచ్చుకోండి

 3. అసలు మీ కధల వెనుక నేపధ్యం తెలుసుకోవాలని నేనెప్పుడో అడుగుదామనుకున్నా ( కొత్తపాళీగారు నా ప్రశ్నను హైజాక్ చేసేసారు , నిరశన)… నాక్కూడా నేపధ్యాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎప్పుడు మొలుపెడుతున్నారో చెప్పేలేదు

  మెచ్చుకోండి

 4. @ మాలతి గారు
  నాకు మీతో ఏకీభవిస్తూ నాకు తెలిసింది పంచుకోవాలనిపించింది పంచుకున్నాను అంతే… మీరు చదివారు కాబట్టి దాని కర్తవ్యం నెరవేరింది 🙂

  @ రాధిక గారు
  అవును.. అలాంటివే కాలానికి అతీతంగా అన్య్వయించుకోగలము… మాలతి గారివి ఇప్పటి వరకు నేను ఎక్కువ చదవలేదు… మీ వ్యాఖ్య ఆవిడ రచనలకు మంచి పరిచయంలా పనిచేస్తుంది నాకు…

  మెచ్చుకోండి

 5. దిలీప్ గారూ సరిగ్గా ఇదే విషయ0 గురి0చి నేను మాలతి గారితో మాట్లాడాను.వారి కధల్లో పాత్రలకి ముగి0పు వు0డదు.మన వ్యక్తిత్వాన్ని,పరిస్థితుల్ని,మన:స్థితిని బట్టి వాటికి సమాధానాలు చెప్పుకోవడమో,ముగి0పు ఇచ్చుకోవడమో చేస్తు0టాము.అలా0టి కధలే ఎక్కువ కాల0 నిలుస్తాయి.ఏ తర0 వాళ్ళు చదివినా వాళ్ళ తరానికి చె0దినట్టు అన్వయి0చుకోగలరు.ముఖ్య0గా అదేనాకు నచ్చుతు0ది మాలతిగారి కధల్లో.

  మెచ్చుకోండి

 6. సౌమ్యా, కాస్త వివరంగా చర్చిస్తావేమో అనుకున్నాను.

  ఏకాంతపు దిలీపు గారూ, , ప్రేరణకి సంబంధించినవి కాకపోయినా, మంచి విషయమే చర్చించారు. వ్యాఖ్యలు ఎంతమంది చదువుతారో నాకు తెలీదు. టైము తీసుకుని వివరంగా రాసినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. “ప్రతిభగల రచయిత కథలోనే మొత్తం చెప్పగలగాలి అంటారు గానీ దానికో లిమిటుంటుంది.”

  అవును. ఈ “మొత్తం చెప్పగలగడం” అంటే ఏంటి అనేది ఒక చదువరి నుండి ఇంకో చదువరికి మారుతుంది. కొంతమందికి ఒక కథకి ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉండాలి. వాటి మధ్యలో ఏమి జరిగినా చివరికి వాళ్ళు ముగింపు కోసమే చదువుతారు. రచయిత ముగింపు ఇవ్వకపోయినా ఆ రచయిత “మొత్తం చెప్పలేకపోయాడు” అనే అంటారు.

  కొంత మందికి అసలు ముగింపే లేకపోయినా, వాళ్ళు ఊహించే ముగింపు లేకపోయినా, ఆ ముగింపు తమలో మిగిల్చిన ప్రశ్నలు తమని వెంటాడుతుంటే, అలా వెంటాడి తమ తమ పరిధిలో వాళ్ళ జీవితాలని అర్ధం చేసుకోడానికి సాయపడితే ఆ రచయిత మొత్తం చెప్పగలిగినట్టే. పుస్తకం చదివిన ఆ కొన్ని రోజులే కాదు, ఆ తరవాత వాళ్ళ జీవితాల్లో ఒక భాగమైపోతాడు.

  రచయిత కొన్ని సార్లు తన అనుభవాలతో/తన వైన ఆలోచనలతో పాఠకుడిని ప్రభావితం చెయ్యకుండా, అలాంటి సంధర్భాల్లో పాఠకుడు కూడా ఆలోచించాలి అనుకుంటే మొత్తం చెప్పకుండా వదిలేస్తాడు…

  చాలా తక్కువ మంది రచయితలు మాత్రమే ఒక ఖచ్చితమైన వ్యక్తిత్వమున్న పాత్రలని సృష్టించగలరు. అలాంటి పాత్రలున్న రచనలకి ప్రారంభం, ముగింపు, అసలు రచయిత ఎంత చెప్పాడు అనే వాటి గురించి పాఠకుడు ఆలోచించడు… ఎందుకంటే రచయిత ఏం చెప్తున్నాడు అనేదానికన్నా ఆ పాత్ర ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది అని పాఠకుడు ఆలోచించి తనకి తను సమాధానం చెప్పుకుంటాడు కాబట్టి…

  మెచ్చుకోండి

 8. మహేష్ కుమార్ – మీ ప్రశ్నకి కొత్తపాళీ చెప్పిన సమాధానం నాకు కూడా నచ్చింది. ఆయన చెప్పినట్టు కథ ముందు చదివి ఎంత అర్థం అయిందో చూసుకుని, తరవాత ప్రేరణ ఏమిటో తెలుసుకున్నప్పుడు మరోక కోణం అధికంగా కనిపంచవచ్చు. దీనిమీద కలిగే మరో రెండు ఆలోచనలు ఏమిటంటే, మనం చదివే ప్రతికథా అంతగా మనని ఆకట్టుకోకపోవచ్చు. రెండోది, ఈనాడు అందుబాటులో వున్న మీడియామూలంగా ముందు ఆకథగురించి ఎక్కడో చదివేసి, ఆతరవాత కథ చదివే స్థితి ఏర్పడవచ్చు.
  అప్పుడు మీరన్నట్టుగా మనబుర్ర, మనతో నిమిత్తం లేకుండానే, ప్రీకండిషను అయిపోవచ్చు. అప్పుడు అర్థం చేసుకునే తీరులో మార్పు వస్తుందనే నేను కూడా అనుకుంటున్నాను.

  కొత్తపాళీ – అందరిచేతా రాయించేయడం మీకు మామూలే కదా 🙂 మీవివరణ నాకు నచ్చింది. థాంక్స్. మొదటి పేరా మళ్లీ రాయడనికి ప్రయత్నిస్తాను. ఏమిటో ఈబ్లాగుకు బాలారిష్టాలు చాలా వచ్చినట్టున్నాయి.

  పూర్ణిమా – మీరు బ్లాగుకీ డైరీకి చెప్పిన తేడా నేను కూడా అంగీకరిస్తాను. అలా అందరిముందూ పెట్టేముందు, ఎవరికోసం అన్న ఆలోచన కూడా అధికంగా వచ్చి, కథని ఓకొలిక్కి తెస్తుందనుకుంటా. అలాగే, చదివిన పుస్తకాలు కోట్ చేసేంత గుర్తులేకపోయినా మీరన్నట్టు internalize చేసుకుంటామని నాక్కూడా అనిపిస్తోంది. మీకంటే మూడు రెట్లు పెద్దదాన్ని కనక, బుర్ర బద్దలు కొట్టుకోడం కూడా అదే ప్రపోర్షన్లో జరుగుతోంది. నామాట విని, ఎందుకు రాసానా అని ఆలోచించడం మానేయండి. మరొకసారి, మీరు భయంమీద రాసిన కథ అద్భుతంగా వుంది. నేను కూడా రాయాలనుకుంటూనే వున్నా చాలాకాలంగా ఇదే విషయంమీద. మీరు రాసేశారు కనక నేనింక రాయలేను.

  రాధికా థాంక్స్. కవితలకి కూడా అంతే అనుకుంటాను. దినదినమూ, క్షణక్షణమూ ఎన్నిటికో స్పందిస్తూంటాం. అనేక రకాల చేతనాచేతనావస్థల్లో. అవన్నీ మనలో కలిగించిన చలనమే రచనాప్రక్రియరూపంలో ఆవిష్కరిస్తాం అనుకుంటాను.

  మెచ్చుకోండి

 9. చాలా ఆశక్తికర0గా వున్నాయ0డి.నిజమే రాయడానికి చాలా కారణాలు వు0టాయి.ఒక మాటో,ఒక స0ఘటనో,మన చుట్టుపక్కల వున్న వ్యక్తులో,వ్యక్తిత్వమో ఏదన్నా కారణ0 కావచ్చు.కొన్ని భావాలు లోపల వు0డిపోయి ఏదో ఒక రోజు హఠాత్తుగా పాత్రలరూప0లో బయటకి వస్తాయి.నిజానికి ప్రేరణ ఏమిటి అనేప్రశ్నకి సమాధాన0 చెప్పడ0 చాలా కష్ట0.దానికి సమాధాన0 చెప్పాల0టే జీవిత0లోని వెనుక పేజీలన్నీ తిప్పుకు0టూ రావాలి.

  మెచ్చుకోండి

 10. బాగున్నాయి మీ కథల వెనుక కథలు!! మొన్న ఎవరో.. నీ బ్లాగుకీ, డైరీకీ తేడా ఏంటి అని నన్ను అడిగారు. డైరీలో నా ఆలోచనలూ, ఆ ఆలోచనలు కలిగించిన సందర్బాలు, మనుషులు, ఆ క్షణాలు, ఇవ్వన్నీ ఉంటాయి యధావిధిగా!! కానీ బ్లాగులో అవి పూర్తిగా తయారయ్యి అందరికి ముందుకీ వస్తాయి. ఇదే నాకు తెలిసిన తేడా!! నిజమే.. మనం రాసే ప్రతీ అంశానికి ఏదో ఒక ప్రేరణ ఉంటూనే ఉంటుంది. కొన్ని సార్లు నేను ఏదో చదివి మర్చిపోతాను. కానీ ఆ భావం నాలో ఇంకిపోతుందనుకుంటా, ఏదోలా బయటకి వచ్చాక, ఎందుకు రాసానా అని ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా త్వరగా గుర్తు రాదు!!

  నా బ్లాగుకొచ్చి మరీ ఈ టపా గురించి చెప్పినందుకు ధన్యవాదాలు!! లేకపోతే ఎప్పటికి చదివేదాన్నో!! మీ అనుభవాలు మీరు ఇలా పంచుకుంటారని ఆశిస్తూ..

  పూర్ణిమ

  మెచ్చుకోండి

 11. కాదేదీ కథ కనర్హం అని నిరూపించారు మొత్తానికి.
  నేనేదో యధాలాపంగా రాసిన వ్యాఖ్య మీతో ఇంత మంచి టపా రాయించినందుకు చాలా సంతోషం.
  మొదటి పేరా మాత్రం ఒక మూణ్ణాలుగు సార్లు చదువుకుంటేనే గానీ అన్వయం కుదర్లేదు నాకు 🙂

  మహేష్ లేవనెత్తిన కొత్త ప్రశ్నలకి నా ఆలోచన – కథ, అది ఎటువంటి ముడిసరుకు నుంచి పుట్టినా, ఒక సారి కథగా తయారైన తరువాత – అదే మూల వస్తువు, పాఠకుడికి సంబంధించినంత వరకూ. వీలైనంత వరకూ పాథకులు ముందు ఆ కథని చదివాలి, చదివి తమ స్థాయిలో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. ఆ మూల వస్తువు తరవాతివే రచయిత చెప్పే ఇతర వివరణలైనా, విమర్శకుల విశ్లేషణలైనా.
  సో, ఒకసారి పాఠకుడు కథ ఆంటూ చదివాక, ఏదో ఒక ఇంటర్ప్రెటేషను మనసులొ ఏర్పడుతుంది. అంచేత పాజిబిలిటీస్ తగ్గించడం ఏమీ లేదు అని నా వుద్దేశం.

  మెచ్చుకోండి

 12. చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక కథకు ఒకే ప్రేరణుండొచ్చు లేక ఒక్కో పాత్రకు ఒక్కో సంఘటనో లేక వ్యక్తో స్ఫూర్తినందించొచ్చు. ఇలాంటి కథ వెనుక కథలు తెలుసుకుంటే, ఆ కథను అర్థం చేసుకునే తీరులోకూడా మార్పొస్తుంది.

  కాబట్టి, ఈ పంధా free imagination ని తగ్గిస్తుందా లేక interpretation possibilities యొక్క పరిధిని కుంచిచివేస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కోణంలో కొంత ఆలోచించి చెప్పగలరు.

  మెచ్చుకోండి

 13. “అన్న వ్యాఖ్యతో ఉదయించింది.” తరవాత ఉన్న ఖాళీ ప్రదేశాన్ని తొలగించండి. అవును, కథ వెనుక కథ, అసలు కథంత ఆసక్తిగా ఉంటుంది, పాఠకులకు. కథ వెనుక కథలతోనే చక్కటి కథ రాశారే, తమాషాగా – బాగుంది.

  పూర్ణిమ బ్లాగులో మీ లేఖ చదివి ఇక్కడి కొచ్చా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.