పాతికేళ్ల నాతపస్సు – ఈపుస్తకం

ఆధునిక తెలుగు వాఙ్మయంలో రచయిత్రుల కృషి

 

      తెలుగు కథా సాహిత్యంలో రచయిత్రుల స్వర్ణయుగం (195075).

 

చాలా బ్లాగుల ప్రొఫైలులలో కనిపించే ఒక వాక్యం తాము రచయితలము కాము అనీ, ఏవో తమకి తోచిన ఊహలు నలుగురితో పంచుకోవాలన్నసరదాతోనే రాస్తున్నాం అనీ. మీలో చాలామందికి తెలీకపోవచ్చు కానీ 1950, 60 దశకాల్లో చాలామంది రచయిత్రులు కూడా అలానే అనేవారు. ఆకాలంరచయిత్రులలో అలా అనేవారు ఇప్పటికీ వున్నారు. అలా అంటూనే మొత్తం కథాసాహితిని రెండుదశాబ్దాలపాటు ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలేరు వారు. ఆరోజుల్లో పత్రికాధిపతులకీ, ప్రచురణకర్తలకీ తమ షరతులు డిక్టేట్ చేసిన రచయిత్రులున్నారు. మగరచయితలకంటె రెట్టింపు ప్రతిఫలం పుచ్చుకున్నవారున్నారు. మగవారు ఆడపేర్లతో రచనలు చెయ్యడం ప్రచురింపబడడంకోసమేనని రావిశాస్త్రిగారు నాతోనే అన్నారు ఒకసారి.

 

నాపుస్తకం Telugu Women Writers, 1950-1975, Andhra Pradesh, India ( A Unique phenomenon in the history of Telugu fiction) లో రచయిత్రులు సాధించిన ఈవిశేష ప్రాచుర్యానికి దోహదం చేసిన పరిస్థితులు, కుటుంబంలోనూ, సమాజంలోనూ, వారి రచనల్లో ఆవిష్కరించిన కథావస్తువులూ, అశేషపాఠకుల నాకట్టుకున్న శైలీ విశ్లేషించాను. నామటుకు నాకు నా సాహిత్యయానంలో నేను చేసిన ఏకైక సేవ ఇదొక్కటే అనిపిస్తుంది. అమెరికాలో మాలాటివారి పెంపకంలో పెరిగిన పిల్లకి మనసంస్కృతిమీద ఎలాటి అభిప్రాయాలు ఏర్పరుచుకుంటుందో తెలుస్తుంది మా సరయు వ్యాసం, In her own words, కూడా చేర్చాను ఇందులో.

ప్రముఖ ఫెమినిస్ట్ రచయిత్రి, కవయిత్రీ, నాచిరకాల మిత్రురాలూ అయిన కల్పనా రెంటాల నాపుస్తకానికి సహృదయంతో పీఠిక రాయడం నాకు పరమానందం కలిగించిన విషయం.

పోతే, ఈక్రింది వ్యాసం చదివితే నాపుస్తకానికి నేపథ్యం తెలుస్తుంది. ఈవ్యాసంలో కొంతభాగం స్త్రీల రచనలు ఒక చారిత్ర్యక పరిశీలనఅన్న శీర్షికతో రచన, అక్టోబరు 2002,లో ప్రచురింపబడింది. 

                                      000

1950-1975 మధ్య కాలంలో రచయిత్రులు కధానికా, నవలాసాహిత్యంలో ప్రముఖపాత్ర వహించారన్నది అందరూ ఒప్పుకుంటారు. ఆప్రాముఖ్యతకి కారణాలు కూడా స్థూలంగా ఆనాటి సాంఘికపరిస్థితులూ, రాజకీయ పరిస్థితులూ అని కూడా అందరూ అంగీకరించిందే..

గత 11 శతాబ్దాలు స్థూలంగా కాక, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సంఘటన తీసుకుని పరిశీలిస్తే బోధపడే సత్యాలను పరామర్శించడం ఈ వ్యాసంలో నా లక్ష్యం.

జానపద సాహిత్యం, బాగా ప్రాచుర్యంలో వున్న వాఙ్మయంమాట ఆటుంచి, ఇంట కూర్చుని కాలక్షేపానికే కలం పుచ్చుకుని రచనలు చేసిన స్త్రీలు ఎవరు అంటే  ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి ఆంధ్ర కవయిత్రులు చూడాలి. లక్ష్మీకాన్తమ్మగారు తమ గ్రంథంలో రెండువందలమందికి పైగా మహిళలు సృష్టించిన సాహిత్యం గురించి ప్రస్తావించారు. వీరందరూ కవిత్వమే రాయడం ఆనాటి సాంప్రదాయాన్ననుసరించి జరిగింది.

ఆధునిక కథావాఙ్మయంలో నాచర్చదృష్ట్యా నేను పరిశీలిస్తున్న అంశాలు మూడు. 1. సాంఘికంగా రచయిత్రులు తమకి తాముగా సంతరించుకున్న స్థానం. 2. వారి విద్యాపరిమితులు, 3. సంఘంలో కాలక్రమాన వచ్చిన మార్పులు. ఇవన్నీ ఒకదానినుండి మరొకటి విడదీయలేనంతగా పెనవేసుకుని ఉన్నాయన్నది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.

స్త్రీలకి తరతరాలుగా విద్యాసదుపాయాలు లేవని పదేపదే చెప్పుకుంటున్నాం స్థూలంగా. కానీ అది అందరిపట్ల నిజం కాదని తేలిగ్గానే తెలుస్తోంది. లక్ష్మీకాన్తమ్మగారు ఉల్లేఖించిన 200మందికి పైగా వున్న కవయిత్రులని గమనిస్తే. అయితే వారందరూ ఉన్నతకుటుంబాలకి చెందినవారు. రాజులూ, బ్రాహ్మణులూ, ఇతర ధనికవర్గాలు. 12-19 శతాబ్దాలమధ్య, తాళ్లపాక తిమ్మక్కనుండీ కిందటితరం ముద్దుపళని వరకూ కవిత్వం చెప్పగలవారే. ఆకాలంలో విద్య వున్నతకుటుంబాలలోవారికే పరిమితమయింది. ఉన్నతకుటుంబాలలో స్త్రీలు చదువుకున్నవారే. 

ఈవాతావరణానికి కారణం సాంప్రదాయం. ఇది తప్పా ఒప్పా అన్నది కాదు నాచర్చ. జరిగినకథ అర్థం చేసుకోవాలన్న యత్నంలో భాగం మాత్రమే ఇది. ఆనాటిసాంఘికపరిస్థితులలో -రాచపుట్టుక అయినా కాకపోయినా- జరుగుబాటుగల అన్ని కుటుంబాలలోనూ స్త్రీలకి రాణివాసం వుండేది. తద్వారా వారికి ఓపలేనంత తీరిక. రచన ఒక కాలక్షేపం. వారి కథావస్తువులు దైవచింతనా, ధార్మికచింతనా, లేదా వీరగాథలూ, కదాచితుగా శృంగారం. ఆకార్యక్రమంలో వ్యవస్థని ప్రతిఘటించే తత్త్వం లేకపోవడం గమనార్హం. అంచేతే అప్పట్లో స్త్రీలరచనావ్యాసంగానికి మగవారు అభ్యంతరపెట్టలేదు.

ఉదాహరణకి శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె, రచయిత్రి అయిన మోహనాంగి కథలో సందేశం చూడండి.

రాయలవారు ఆలోచనాధీన అయిన కుమార్తెను చూచి, ఎట్టి గట్టి సమస్య పట్టుకొంటివని అడిగితే, ఆమె ఇచ్చిన సమాధానం,

తండ్రీ, సమస్యపూర్తికి నెదం దలపోయుటలేదు

మీరలేమండ్రొ! మదీయ సాహసము నారసి

అని, కావ్యమొనర్ప బూనితి … గేలి సేయు జనులందరు మెచ్చెడునట్టి శైలితో అంటుంది. ఇక్కడ నాకు పాదం పూర్తిగా జ్ఞాపకం లేదు కానీ, ఆడవారు వంటయింటిలో నుండక ఈరాతలెందుకు అని గేలి సేయు జనులకి అని చెబుతుంది.

ఆమాటకి రాయలువారి సమాధానం, పలుకవమ్మ మరొక్క తరిని…. ఎంతచెప్పిన వినకయుంటివింత దనుక అంటూ పరమానందం వెలిబుచ్చడమే కాక, నీ మృదుకవితాశైలి కొమ్ములు తిరిగిన మదవత్కవి పుంగవులకును గలుగవు అని అభినందించాడు (లక్ష్మీకాన్తమ్మ. పు.30-31).

నావ్యాసం ప్రచురించిన తరవాత, నేను నాయని కృష్ణకుమారిగారినీ, కోలవెన్ను మలయవాసినిగారినీ కలవడం జరిగింది. వారిద్దరూ కూడా కృష్ణదేవరాయలికి మోహనాంగి అన్న కుమార్తె వున్నట్టు  ఆధారాలు లేవనీ, ఆమె రాసింది అని చెప్పుకుంటున్న మరీచీపరిణయకర్త ఎవరో నిర్ధారణగా తెలియదనీ అన్నారు నాతో. ఇద్దరూ కూడా సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన విదుషీమణులు కనక వారి మాట గౌరవిస్తాను.  మోహనాంగి కథ కట్టుకథే అనుకున్న తరవాత, నాకు తోచిన అభిప్రాయం ఇలాటి కథ పుట్టడానికి కారణాలు వెతికినప్పుడు ఆనాటి సాంఘికపరిస్థితులు తెల్లమవుతాయని.

ఉదాహరణకి, ఒక రచయిత కానీ రచయిత్రి కానీ ఒక సాధారణకుటుంబంలోని తండ్రీ కూతుళ్లమధ్య జరిగిన కథని ప్రభువులకథగా మలిచివుండవచ్చు ఆఅంశానికి సాహిత్యస్థాయి కల్పించడంకోసం. అలాగే అందులో గేలి సేయు జనులందరు మెచ్చెడు రీతిలో కవితలు అల్లాలి అంటే ఆనాడు గేలి సేయు జనులున్నప్పుడే కదా అలాటి ఆలోచన కలిగేది. సమాజంలో అట్టే గౌరవప్రతిపత్తులు లేని ఒకసామాన్య కవయిత్రి ఇలాటి కథ కల్పించివుండవచ్చు. ఇది పరిశోధకులు చేపట్టవలసిన అంశం.

 

ఇది 16వ శతాబ్దపుకథగా చెప్పుకుంటారు. అంతకు పూర్వం 11వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు తనకుమార్తె లీలావతి వితంతువు కాగలదని జ్యోతిశ్శాస్త్రంమూలంగా గ్రహించి, ఆమెని గణితశాస్త్రవిశారదని చేసినకథ చాలామందికి తెలిసిందే. లీలావతి ఆయన కుమార్తె కాదనీ, భార్య అనీ, ఆయనే లీలావతీగణితం రాసి, భార్య పేరు పెట్టేరనీ కూడా ఒకకథ ప్రచారంలో వుంది. దీనివెనక గల చరిత్రకూడా ఎవరూ అట్టే పరిశీలించినట్టు కనిపించదు.

చారిత్ర్యకంగా మనకి ఆట్టే దూరం కాని కథ భండారు అచ్చమాంబకథ. ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావుగారు వీరేశలింగంగారిద్వారా ప్రభావితుడైన సంఘసంస్కర్త, ప్రముఖ పాత్రికేయుడు. ఆయన ప్రోత్సాహంతోనే అచ్చమాంబగారు ఓనమాలతో మొదలుపెట్టి మహా రచయిత్రి స్థాయికి చేరుకున్నారు. ఆవిడ మొదట చదువుపట్ల ఉదాసీనంగానే వున్నారనీ, తమ్ముడు ప్రోత్సహిస్తూంటే ఇతర కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారనీ, అప్పుడు అచ్చమాంబగారే ఆఇతరసభ్యులని ఒప్పించి. చదువుకున్నారనీ లక్ష్మీకాన్తమ్మగారు రాశారు. ఆరోజుల్లో అది సామాన్యమైన విషయమేమీ కాదు. అచ్చమాంబ తెలుగులోనే కాక సంస్కృతంలోనూ ఇంగ్లీషులోనూ కూడా నిష్ణాతురాలై, అబలాసచ్చరిత్రవంటి గ్రంధాలూ, కథలూ రాసి చరిత్రలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. (లక్ష్మీకాన్తమ్మ, 105-06)

20వ శతాబ్దం తొలిదశకంలో బెంగుళూరు నాగరత్నమ్మ గారు ముద్దుపళని రాసిన రాధికాస్వాంతనం ప్రచురించడానికి ప్రయత్నించినపుడు, ప్రభుత్వం (అదీ బ్రిటిష్ వారు!, వీరేశలింగంగారూ ) నిషేధించేరనీ, తరవాత, కొందరు తెలుగు పండితులు పూనుకుని ఆనిషేధాజ్ఞను శ్రమ పడి తొలగించారని ఆరుద్ర సాధికాస్వాంతనం పీఠికలో రాసారు. (పు.20-21).

ఈకథలన్నిటిలోనూ సూత్రప్రాయంగా స్పష్టమవుతున్న విషయం ఉన్నతకుటుంబాల్లో మగవారు ఆడవారి విద్యార్జనకీ రచనావ్యాసంగానికీ చేయూతనివ్వడం. ఇందులో పరిమితులు నేను కాదనడం లేదు. ఇది కలవారి కుటుంబాల్లోనే జరిగింది. రెండోది ఆటంకాలు లేకపోవడం స్త్రీలు ఇంట్లోనే వుండి చదువుకున్నారు కనక.

 

ఈసందర్భంలో వీరేశలింగంగారి కృషి ప్రస్తావించక తప్పదు. ఆయనకాలంలో స్త్రీపునర్వివాహ చర్చల్లో ఆడవారూ, మగవారూ ఇరుపక్షాలా వుండడం గమనార్హం. అంటే మనదేశంలో ఇది జండర్ సమస్యగా కాక సాంఘికసమస్య అని అంగీకరించాలి. మౌలికంగా ఆయన కృషిని హర్షించిన స్త్రీలలో కొన్ని విషయాల్లో ఆయన్ని ప్రతిఘటించిన వారున్నారు,. వీరేశలింగంగారు ప్రచారం చేసిన స్త్రీపునర్వివాహాలను నిరసిస్తూ పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు సావిత్రి అనే మాసపత్రిక స్థాపించి నడిపారు కొంతకాలం. (లక్ష్మణరెడ్డి. తెలుగులో పత్రికారచన. పు.121).

పులుగుర్త లక్ష్మీనరసమాంబగారి మనుమరాలు నాస్నేహితురాలు. మేం ఆంధ్రాయూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం. తనవివాహవిషయంలో తాను స్వతంత్రించి నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారనీ (అబ్బాయి కమ్యూనిస్టు కావడం ఒక అభ్యంతరం), నాయనమ్మ లక్ష్మీనరసమాంబగారు మాత్రం మనసారా దీవించి, పెళ్లి చేసుకోమని చెప్పి పంపించారనీ చెప్పింది నాతో. అంటే స్థూలంగా మనం చెప్పుకునే సాంఘిక న్యాయాలకీ, ధర్మాలకీ, నిత్యజీవితంలో మనకోరికలకీ, కార్యసాధనకీ అనుగుణంగా మనం చేసుకునే నిర్ణయాలకీ ఎడం వుంటుంది. ఆ ఎడం గుర్తించినపుడు, సాంఘికపరిస్థితుల అవగాహనలో స్పష్టత ధృధతరం కాగలదు. ఒకచిత్రంలో ప్రతిరేఖా మరొక కోణాన్ని అందించినట్టే.

 

ఇటువంటిదే మరొక కథ. వీరేశలింగంగారి చివరిదశలో బత్తుల కామాక్షమ్మ గారు రెండు పదులు నిండని బాలిక. వితంతువు. ఆమె రాసిన తన అనుభవాలూ – జ్ఞాపకాలూ అన్న చిన్న వ్యాసం (నాలుగుపేజీలే) చదువుతుంటే నాకు కనులు చెమ్మగిల్లేయి.. ఆనాటి సాంఘికపరిస్థితులలో తాను ఏవిధంగా నెగ్గుకొచ్చారో వివరించారు ఆవ్యాసంలో.    

వారి వ్యాసంలో ప్రధానాంశాలు సూక్ష్మంగా – ఆమె దీక్ష, స్ఫూర్తి, కార్యదక్షత, ఆమెకి ఎదురైన ప్రతిబంధకాలూ, తాను వాటిని ఎదుర్కొని తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొన్న తీరు సూటిగా, నిరాడంబరంగా వివరించారు. (యుగపురుషుడు వీరేశలింగం. వీరేశలింగం స్మారకోత్సవముల సంచిక. హైదరాబాదు. పు. 69-72). అది చదువుతుంటే చూడండి నేనెంత కష్టాలు పడ్డానో అన్నట్టుండదు. నాకున్న పరిధిలో నేనిలా మలుచుకున్నాను నాజీవితం అంటూ అమాయకంగా చెబుతున్న భావన కలుగుతుంది మనకి అది చదువుతూంటే. ఉదాహరణకి, ఆమె శ్రేయోభిలాషీ, వీరేశలింగంగారి అనుయాయి అయిన కొటికలపూడి సీతమ్మగారు కామాక్షమ్మగారిని పునర్వివాహం చేసుకొమ్మని ప్రోత్సహించారు. కాని కామాక్షమ్మగారికి పునర్వివాహేఛ్చ లేదు. అయితే ఆమె పునర్వివాహాలకి వ్యతిరేకి కారు. తాను చేసుకోలేదు కాని పునర్వివాహాలకి వుద్యమించిన స్త్రీలకి అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించారు. అది ఆమె వ్యక్తిత్వానికి గీటురాయి. ఈవ్యాసం ఇక్కడ.

వీరేశలింగంగారు ఉద్దేశించిన విద్యకీ, కామాక్షమ్మగారు తీర్చి దిద్దుకున్న జీవనసరళికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. విద్యార్జన ఒక ఎత్తు. దాన్ని తమ దృక్పథాలకి అనుగుణంగా తీర్చి దిద్దుకోడం మరొక ఎత్తు.

1950ల నాటి తెలుగు పడుచులు ఈసత్యాన్ని సంపూర్ణంగా గ్రహించి వినియోగించుకున్నారు. ఈ సాంఘిక వాతావరణం – అంటే కలిగినవారిళ్ల ఆడవారు నాలుగ్గోడలమధ్యా వుంటూనే – చదువుకుని, కథలు రాసుకోడం, ఇంటా బయటా వారి వ్యాసంగానికి అభ్యంతరం లేకపోవడం – 1950-60లలో కూడా జరిగింది. అధికంగా ఆనాటి పత్రికలు వారికి పుష్కలంగా ప్రోత్సాహమిచ్చాయి. అది ఆసరాగా ఇంట కూర్చునే రచయిత్రులు (ఈనాడు బ్లూస్క్రీన్ వెనక దోబూచులాడినట్టే) తమ ఇష్టాయిష్టాలనీ, కోరికలనీ, సంప్రదాయ విరుద్ధమైన అభిప్రాయాలనీ స్వేచ్ఛగా రాసేరు. పాఠకుల మన్ననలను పొందేరు.

అయితే ఈమెప్పులతోపాటు అపహాస్యాలూ, అపనిందలూ కూడా నెత్తినేసుకున్నారు ఆనాటి రచయిత్రులలో కనీసం కొందరు. బహుశా అనూచానంగా మనసాంప్రదాయంలో వుండే తిట్టుకవిత్వపు పోకడలు కావచ్చు. 1970వ దశకం తిరిగేసరికి, రచయిత్రులమీద కార్టూనులూ, జోకులూ బాగానే పుంజుకున్నాయి. ఇందులో సాహిత్యచర్చ ఎంత? సాంఘిపరమైన వేళాకోళాలూ, హాస్యాలూ, ఎత్తిపొడుపులూ ఎంత అన్నది చర్చనీయాంశం.

 

తెనాలి రామకృష్ణుడు శ్లేషతో మొల్లని ప్రశ్నించడం, మొల్ల కూడా అతనకి తగినట్టు శ్లేషతోనే జవాబు చెప్పి తన పరువు నిలబెట్టుకోడమే కాక అతని గౌరవాన్ని కూడా పొందడం చాలామందికి తెలిసిన కథే. అసలు వారిద్దరూ సమకాలీనులు కారు అన్నారు లక్ష్మీకాన్తమ్మగారు తన ఆంధ్రరచయిత్రులు గ్రంథంలో. అంచేత ఇది కట్టుకథే అనుకున్నా అలాటి కథ కల్పించడానకి కారణభూతులు ఎవరు, కారణాలు ఏమయి వుంటాయి అని ఆలోచించినప్పుడు మనకి ఆనాటి ఆచారాలూ, అలవాట్లూ, దృక్కోణాలూ తెలుస్తాయి.

 

అలాగే మరో కథ మొల్ల ప్రతాపసింహుని ఆస్థానానికి వెళ్లి తన రామాయణం కావ్యగానం చేసిందన్నది. చరిత్రకారుడు ఏకామ్రనాథుని కథనం ప్రకారం మొల్ల ప్రతాపసింహుని ఆస్థానంలో తనరామాయణం గానం చేసి, ఆమహరాజుకి అంకితం ఇవ్వబోయింది. ఆసభలోని పండితులు అది శూద్రకవిత్వం కనక నిషిద్ధమని, రాజుని అంకితం పుచ్చుకోనివ్వలేదు. వారిమాట కాదనలేక, ప్రతాపసింహుడు మొల్లరామాయణం అంకితం పుచ్చుకోకుండా, సత్కరించి రాణివాసానికి అంపాడుట. (ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం. సం.8. పు. 113-114)

ఈకథ చదివినతరవాత నాకు కలిగిన సందేహాలుః  శూద్రవనిత అయిన మొల్లకి అసలు ఆస్థానప్రవేశం ఎలా కలిగింది? కావ్యగానం ఎలా చేయగలిగింది? కావ్యగానం అయినతరవాత కాని అది శూద్రకవిత్వమని తెలియలేదా ఆపండితవరులకు? రాజుగారు పండితులమాట కాదనలేక .. అన్నది కూడా హాస్యాస్పదంగానే వుంది నాకు. మొల్ల కవిత్వం నిషిద్ధం అనిపించుకోడానికి కారణం జండర్ కాదు, పాండిత్యలేమి కాదు. ఆమె కుమ్మరి కులంలో పుట్టడం. ఈకథ కూడా నిజం కాకాపోవచ్చు. సాహిత్యచరిత్రకారులు పరిశీలించవలసినది ఈకథకి ప్రేరణ ఏమయివుంటుందనే.

 

ఇంతటి చరిత్ర వెనకేసుకుని, 1960 దశకంలో ప్రత్యేకంగా మన కథారచయిత్రులు, తమ పూర్వులకంటే భిన్నంగా సాధించినది ఏమైనా వుందా అంటే చాలా వుంది అంటాను నేను.

చరిత్ర సజీవం. ప్రతితరంలోనూ కొత్తదనం వుంటూనే వుంది. ఏ సాహిత్యమైనా ఆదేశ, కాల, పరిస్థితులమీద ఆధారపడి తనదైన ప్రత్యేక వాతావరణంలో పుట్టి వృద్ధి చెందుతుంది. ఆదృష్టితో చూస్తే, 1950, 60 దశకాల్లో మన స్త్రీలు సృష్టించిన సాహిత్యం ఆనాటి సాంఘికపరిస్థితులని ప్రతిఫలించడంలో సఫలీకృతమయిందనే చెప్పుకోవాలి.

కాని మన విమర్శకులు రచయిత్రులు సాధించింది ఏమీ లేదనే అంటున్నారు. తెలుగులో ఉత్తమశ్రేణి రచయిత్రులు – శ్రీదేవి, సరళాదేవి, పవని నిర్మలప్రభావతి, వాసిరెడ్డి సీతాదేవి, తురగా జానకీరాణి,  కల్యాణసుందరీ జగన్నాథ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మలప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మ వంటివారు కూడా కాథరీన్ మాన్స్‌ఫీల్డ్‌లా కథాశిల్పంలో సాధించిన ప్రత్యేకత ఏమీ లేదు అన్నారు కేతు విశ్వనాథరెడ్డి తమ దృష్టిలో (పు. 73, 1998.) (అవునండీ నాపేరు కూడా చేర్చారు!).

మన రచయిత్రులు మాన్స్‌ఫీల్డ్‌లా రాయలేదు. మన వాతావరణానికీ, సంస్కృతికీ అనువైన మనంగా రాసేరు. మన పలుకుబడీ, మన పాఠకలోకం, మన వాతావరణం, మన సామాజిక, సాంస్కృతిక దృక్పథాలకి అనుగుణంగా రాశారు (రాశాం) అని నాఅభిప్రాయం.  కథాశిల్పంలో ప్రత్యేకత వుండబట్టే అంతటి ఘనమైన పాఠకలోకాన్ని సృష్టించగలిగారు. ఆశిల్పం ఏమిటి అంటే మన సాహిత్యచరిత్రలోనే వెతుక్కోవాలి గానీ ఇతరసంస్కృతులతో పోల్చి కాదనుకుంటాను.

 

అలాగే కొంతకాలం క్రితం ఇంటర్నెట్‌లో మన తెలుగు రచయిత్రులు నొబెల్ ప్రైజుకి తగుదురా తగరా అని ఒక చర్చ మొదలుపెట్టి అసలు వారు జ్ఞానపీఠ్ అవార్డుకి కూడా తగరని తేల్చేరు. నాకు ఈబహుమతులు ఏప్రాతిపదికమీద ఇస్తారో తెలీదు కనక నేను ఈవిషయం చర్చించదలుచుకోలేదు. మీకెవరికైనా ఓపిక వుంటే చూడండి.  

నేను ఆదిలోనే చెప్పినట్టు ఇది నేపథ్యం మాత్రమే. నాపుస్తకంలో సవిస్తరంగా చర్చించాను ఆధునిక కథాసాహిత్యంలో  50, 60 దశకాలనాటి రచయిత్రుల కృషి. 

 

 

 

(ఆగస్ట్ 2008. )

 

 

 

            

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

27 thoughts on “పాతికేళ్ల నాతపస్సు – ఈపుస్తకం”

 1. బండారు అచ్చమాంబ కొమర్రాజు లక్ష్మణరావు గారి అక్కయ్య అనీ, ఆమె నాగపూరులో ఉన్నప్పుడు లక్ష్మణరావు గారు వాళ్ళింటివద్దే ఉండి చదువుకున్నారనీ వికీపీడియాలో ఉంది.

  మెచ్చుకోండి

 2. @ మహేష్ గారు

  మీరు చెప్పినదానితో ఏకీభవిస్తాను… కన్నడ సాహిత్యం గురించి నాకు పెద్దగా తెలియకపోయినా అక్కడ జనంతో బాగా పరిచయం ఉండటం వల్ల కొంత అవగాహన ఉంది…

  కన్నడ, తెలుగు జనాలతో పరిచయం ఉంటే “కువెంపు” ని “సినారె”తో పోల్చేప్రయత్నం చెయ్యరేమో…ఒకవేళ ఆ ప్రయత్నం చేసి ఉంటే అది ఇద్దరికి జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చాయి కాబట్టి మాత్రమే అనుకోవాలి… వారివురి రచనలు పోల్చేంత శక్తి నాకు లేకపోయినా ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను… “కువెంపు”కి జనం లో ఉన్న అభిమానం, ఆదరణ ఖచ్చితంగా “సినారె” కి లేవు అని చెప్పగలను… అది వారిరువురి రచనల విశిష్టతలో ఉన్న తారతమ్యం వల్లనో, లేక మన తెలుగు వాళ్ళు, విమర్శకులు మీరన్నట్టు ఉండటం వల్ల వచ్చినదో, లేక వారిరువురి వ్యక్తిత్వాలలో ఉన్న తారతమ్యం వల్ల వచ్చినదో నాకు తెలియదు….

  నేను వారిరువురి రచనలు చదవకపోయినా, నాకున్న లోక జ్ఞానంతో నేను చెప్పగలిగేది ఏంటంటే “కువెంపు” జనం మనిషి… “సినారె” అభిమానుల మనిషి…

  @ మాలతి గారు

  నా ప్రశ్నకి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా ఆనందంగా ఉంది… 🙂 మీరు నిజంగా మీ పాఠకులని పట్టించుకుంటారనే నమ్మకం నాకు కలిగింది అని మీకు సవినయంగా తెలియచెయ్యడానికి ఆత్రుత పడుతున్నాను…

  మెచ్చుకోండి

 3. కన్నడ సాహిత్యం గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పడం మరిచాను. చాలా వరకూ కన్నడ సాహితీవేత్తలు, ఆంగ్ల పండితులు. వారు ఇంగ్లీషు ప్రొఫెసర్లుగా యూనివర్సిటీలలో చదువు చెప్పెవారో లేక కన్నడంతో సమానంగా ఆంగ్లంలో రాయగలిగినవారో అయ్యుంటారు. కువెంపు నుంచీ గిరీష్ కార్నాడ్ వరకూ అలాంటివారే. కాబట్టి వారి తమ కన్నడని ఇంగ్లీషులోకూడా అర్థమయ్యేలా చెప్పగలరు. I mean, they can communicate their Kannada in English with same fluency and effectiveness. ఈ విధానంకూడా వారి సాహిత్య ఖ్యాతికి ఉపయోగపడిందని నాకనిపిస్తుంది.

  నేను కర్ణాటక (మైసూర్)లో ఇంగ్లీషు సాహిత్యం చదివాను. అక్కడ వారు చెప్పేది ఒక్కటే మాట “understand and appreciate English literature. But, if you want to “feel” literature, go back to your regional language literature” అని. అంత గొప్పగా వారు ఆలోచించబట్టే వారి సాహిత్యం ఇంకా నిల్చిఉంది. మనం అలాకాదుకదా! అదే మన ఖర్మ.

  మెచ్చుకోండి

 4. కొత్తపాళీగారూ, సరే మరో అవతారం చూశారు, హీహీ :).
  మీరు కూడా అవగాహన లేదంటే ఎలాగండీ. ముఖ్యంగా ఈఅవార్డులమీద, రచయిత్రులలో అవార్డులకి తగినవారు ఎవరో ఏమైనా చెప్తారేమోనని చూస్తున్నాను.

  మెచ్చుకోండి

 5. మాలతిగారూ, మీలోని ఈ పరిశోధకురాలి అంశ చూసి నిజంగా వి్భ్రాంతి చెండి ఉండిపోయాను. అంటే నమ్మశక్యం కాలేదు అని కాదు, ఎంత బాగా చేశారు అని. మీరు లేవనెత్తిన వివిధ అంశాల మీద నాకు ఎమీ అవగాహన లేదు గనక ఏమీ తెలివైన కామెంటు చెయ్యలేను. మనస్ఫూర్తిగా అభినందించడం తప్ప!

  సుజాత, డా. అచ్చమాంబ గారు వేరు. ఆవిడ ఇంచుమించు కొ.కు. కి సమకాలికులు. విజయవాడ వాస్తవ్యులు. మొదట కాంగ్రెస్ లో ఉండి, తరవాత కమ్యూనిస్టు పార్టీలో స్థానిక రాజకీయాల్లో చురుకుగా పని చేసేవారు.

  మెచ్చుకోండి

 6. @ అయ్యో సుజాతా, ఎత్తిచూపడం అంటే నాదృష్టికి తేవడం అన్న అర్థంలో వాడేను, తప్పుగా కాదు.నాకే అనిపించింది కవయిత్రులగురించి రాస్తున్న వాక్యంలో కవయిత్రిగా ప్రసిద్ధి చెందినవారినేఉదహరించడం సమంజసమని. అంచేత అచ్చంగా నీప్రశ్నకే సమాధానం కాదు నేమ చేసిన మార్పు కానీ మరోసారి చూసుకోడానికి పనికొచ్చింది.
  పోతే, భండారు అచ్చమాంబగారి కాలం 1874-1905. ఆవిడ వేరు. డాక్టర్ అచ్చమాంబ, కొమర్రాజు లక్ష్మణరావుగారి అమ్మాయి, భండారు అచ్చమాంబగారి మేనకోడలని, లక్ష్మణరావుగారు చెల్లెలిమీద ప్రేమతో కూతురికి ఆపేరు పెట్టుకున్నారనీ ఎక్కడో చదివినట్టు గుర్తు. అవునో కాదో గట్టిగా చెప్పలేను.
  @ మహేష్ కుమార్ గారూ, నాకు కన్నడసాహిత్యంతో పరిచయంలేదు కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకూ మీరు చెప్పినమాటలు నిజమే అనిపిస్తుంది నాక్కూడా. నాకు నవ్వొచ్చే విషయం మూఢనమ్మకాలని నిరసించేవారు కూడా రచయితల విషయంలో చేసే వ్యక్తిపూజలు.

  మెచ్చుకోండి

 7. రాజేంద్రగారు జ్ఞానపీఠం గురించి చెప్పినతరువాత కన్నడిగులకూ తెలుగు వారికీ తేడా చెప్పక తప్పదనిపించి రాస్తున్నాను. నాలుగు సంవత్సరాల నా మైసూర్ అనుభవంలో నేను తెలుసుకున్న సత్యం, ‘కన్నడిగులు తమ భాషని పుస్తకాల్లోనేకాక జీవితాల్లో అన్వయించుకుని బ్రతుకుతారు’. అలాగే సాహిత్యం కూడా. అర్థవంతమైన సాహిత్యం ఎక్కడున్నా దాని గురించి సాహితీవేత్తలేకాక, జనబాహుళ్యంకూడా నిత్యజీవితంలో చర్చించి, ఆస్వాదిస్తారు. ఈ సంస్కృతి అక్కడ 6 వతరగతి నుండే ప్రారంభం అవడం ఒక అద్భుతమనిపిస్తుంది.

  మన తెలుగువారిలాగా సాహిత్యానికి “పవిత్రత” ఆపాదించి దూరం చెయ్యకుండా, సూక్ష్మంగా అర్థం చేసుకుని “సాధిస్తారు”. ఈ సాధనలో తెగడటం కూడా ఉంటుంది. సినారె ని తెగిడి మన తెలుగు సాహిత్యంలో ఎవరూ బట్టగట్టలేరు, కానీ అక్కడ ‘కువెంపు’ ని సాహిత్యపరంగా నిరసించినా, అర్థవంతమైన criticism అయితే చాలా సహృదయతతో స్వీకరిస్తారు. మన సాహిత్యం,సాహితీవేత్తలు (చాలావరకూ) ఇంకా ఫ్యూడల్ భావాలనుంచీ బయటపడి ప్రజాస్వామ్యం వైపు ప్రయాణించలేదు.

  అసలు సాహిత్యపు విలువలతోపాటూ,బహుశా ఈ చిన్నపాటి తేడాలు కన్నడ సాహిత్యానికి జ్ఞానపీఠాల్ని తెచ్చిపెట్టాయనిపిస్తుంది. తెలుగులో అటు జనాల ఆమోదంలేకుండా, ఇటు సాహితీవేత్తల అభినందనలు లేకుండా (మీరు చెప్పిన) ఇంత సాహిత్యం అసలు ఉండటమే ఆశ్చర్యం. ఉన్నా దానివలన వచ్చిన లాభమేమిటో నాకు సందేహమే!

  మెచ్చుకోండి

 8. మాలతి గారు,
  ఎత్తి చూపడం కాదండోయ్, నిజంగానే ఇద్దరు అచ్చమాంబలూ ఒకరేనా కాదా అనేది నాకు తెలియదు. కొ.కు నవల ‘అనుభవం ‘ లో డాక్టర్ అచ్చమాంబ రాసిన పిల్లల పెంపకం పుస్తకం ప్రసక్తి వస్తుంది. అందువల్ల ఇద్దరూ ఒకరేనా కాదా అని అడిగానంతే!

  మెచ్చుకోండి

 9. @ప్రవీణ్ గారూ,
  కొన్ని రచనలు గానీ కథలు గానీ చదివినప్పుడు నాకు ఆ నేపథ్యం అర్థమవదు – నిజమేనండీ. నాక్కూడా. ఎప్పుడో కాదు ఇప్పుడే చాలాబ్లాగుల్లో వాళ్లేం మాటాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను చాలా బ్లాగులజోలికి పోను. -:).
  పాఠకుడికి ఆ మెంటల్ సెటప్ అనండీ, ఔదార్యం అనండి కావాలి. ఈ కథ ఏసామాజికనేపథ్యంలో సాగుతోంది అన్నది, మనకి తెలీనిది తెలుస్తోంది అన్న స్పృహ కావాలి. ఈనాటి విమర్సలలో చాలావరకూ కనిపిస్తున్నది తమ అభిప్రాయాలకి అనుగుణంగా వుందో లేదో అని మాత్రమే.
  @దిలీప్ గారూ, క్షమించాలి, నిజం చెప్పాలంటే, ఈ అవార్డులన్నీ సాహిత్యదృక్పథంతో కాక సామాజికదృక్పథంతో సాగుతున్నాయి. చూడండి ఎవార్డులు ఎవరికి వచ్చేయో. అందరూ సాంఘిక దురన్యాయాలమీద రాసినవారే. అంచేతే, ఇప్పుడు వచ్చే రచనలు కూడా అలా ఎవరినో ఒకరిని దులపడంమీదే దృష్టి పెడుతున్నారు.
  నిజంగానే, నాకు పేర్లు తోచలేదు. ఎందుకంటే, నిజంగా అత్యుత్తమ రచయిత అని ఎలా నిర్ణయిస్తామో నాకు తెలీదు. కొలమానాలెప్పుడూ వైయక్తికమే. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు.

  మీరు నాయందు చూపిన అభిమానానికి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. @ మాలతి గారు

  ఎవరి పేర్లయినా చెప్తారేమో అనుకున్నాను… 🙂 😦

  @ రాజేంద్ర గారు

  రాజకీయాలు జరుగుతాయని చాలామందికి తెలుసండి.. కానీ రొటేషన్ల పద్ధతి కాకపోవచ్చు… అలా అనుకుంటే కన్నడిగులు 7 జ్ఞానపీఠలని ఎలా సాధించుకున్నారు?

  మెచ్చుకోండి

 11. బాగా చెప్పారు. ఏ కథనయినా/రచననయినా అది జరిగిన కాలానికణుగుణంగా కూడా పరిశీలించాలి.

  కొన్ని సార్లు కొన్ని రచనలు గానీ కథలు గానీ చదివినప్పుడు నాకు ఆ నేపథ్యం అర్థమవదు. ఎందుకిలాంటి ఆలోచనలు చేసారు, ఎందుకిలా జరుగుతుంది అనే వాటికి సమాధానాలు కొన్ని ఆలోచిస్తే అర్థమయేవి, కొన్ని నా ఆలోచనలకే అందేవి కావు.

  అలాంటివాటిని మీరు విశ్లేషించే ప్రయత్నం అభినందనీయం.

  నాకయితే కొన్ని సార్లు కథ రాసే రచయిత(త్రి) వయసు/జనరేషను కూడా రచన నేపథ్యాన్ని ప్రభావితం చేస్తుందనిపిస్తుంది.
  ఎందుకంటే కొన్ని ఫెమినిస్టు (ఉదాహరణకి మాత్రమే) రచనలు చూస్తే వారు వారి వ్యాసాల్లో ఉటంకించే సంగతులు కొన్ని సార్లు అసలు ప్రస్తుత సమాజానికి సంబంధించినవే కావని నాకనిపిస్తుంది. (దానికి నే పెరిగిన నేపథ్యం కూడా కారణం కావచ్చు.)

  అంటే పాఠకుడు పెరిగిన నేపథ్యం కూడా అతను రచనని చూసే విధానం మారుస్తుందేమో ?

  మీకు మరో మారు అభినందనలు.

  మెచ్చుకోండి

 12. రాజేంద్రగారూ, మీకు చాలా ఓపికే అంత లిస్టు టైపు చెయ్యడానికి. అది ఇలా వ్యాఖ్యలలో కలిసిపోకుండా వేరే ఒక టపాలా పెడితే బాగుంటుందేమో మీరు తెలుసుకున్న యితర గుట్టులు కూడా తెలుసుకుని.
  లక్ష్మికాన్తమ్మగారి గురించి మీకు తెలిసినది రాసిపంపండి. చాలామంది నేనడిగితే ఇవ్వరండి. అడిగి, అడిగి వేసారిపోయాను.

  మెచ్చుకోండి

 13. దిలీప్ గారు వెలిబుచ్చిన ఆవేదనను అర్ధం చేసుకోగలను,కానీ మా గురువు గారు బూదరాజు గారు ఆ గుట్టుని అనగా జ్ఞానపీట ఎలా వస్తుంది అన్నదాన్ని గుప్పెట విప్పి మరీ చెప్పాక ఆ పీట రొటేషన్ లో తప్ప మామూలుగా రాదన్నదీ అర్ధమయ్యింది నావరకు.
  అందుకు వారిచ్చిన వివరాలతో మనం ఒక అంచనాకు రావచ్చు.
  ——2002 వరకూ సదరు విజేతల పేర్లు,ఆవార్డు అందుకున్న సంవత్శరం,వారు రాస్తున్న,రాసిన భాష…

  *
  G. Sankara Kurup (1965) Malayalam
  *
  T.S. Bandyopadhyaya (1966) Bangla, Uma Shankar Joshi (1967) Gujarati and K.V.
  *
  Puttappa (1967) Kannada
  *
  Sumitranandan Pant (1968) Hindi
  *
  Firaq Gorakhpuri (1969) Urdu
  *
  V. Satyanarayana (1970) Telugu
  *
  Bishnu Dey (1971) Bangla
  *
  R.S. Dinkar (1972) Hindi and D.R. Bendre (1973) Kannada, Gopinath Mohanty (1973)
  *
  Oriya V.S. Khandekar (1974) Marathi
  *
  P.V. Akilandam (1975) Tamil
  *
  Ashapurna Devi (1976) Bangla
  *
  K.S. Karanth (1977) Kannada
  *
  S.H.V. Ajneya (1978) Hindi
  *
  B.K. Bhattacharya (1979) Assamese
  *
  S.K. Pottekkatt (1980) Malayalam, Amrita Pritam (1981) Panjabi
  *
  Mahadevi Varma (1982) Hindi
  *
  Masti V. Iyengar (1983) Kannada
  *
  Thakazhi S. Pillai (1984) Malayalam
  *
  Pannalal Patel (1985) Gujarati
  *
  S. Rautroy (1986) Oriya
  *
  V.V.S. ‘Kusumagraj’ (1987) Marathi
  *
  C. Narayana Reddy (1988) Telugu
  *
  Qurratulain Hyder (1989) Urdu
  *
  V.K. Gokak (1990) Kannada
  *
  Subhash Mukhopadhyaya (1991) Bangla
  *
  Naresh Mehta (1992) Hindi
  *
  Sitakant Mahapatra (1993) Oriya
  *
  U.R. Anantha Murthy (1994) Kannada
  *
  M.T. Vasudevan Nair (1995) Malayalam
  *
  Mahasveta Devi (1996) Bangla
  *
  Ali Sardar Jafri (1997) Urdu
  *
  Girish Karnad (1998) Kannada
  *
  Nirmal Verma (1999) Hindi, Gurdial Singh (1999) Punjabi
  *
  Indira Goswami (2000) Assamese.
  * Rajendra Shah (2001) Gujrati
  * D. Jayakantan (2002) Tamil
  మరో మాట సినిమాల వరకూ సావిత్రికి,యస్.వి.రంగారావుకు ప్రభుత్వపరంగా ఎలాంటి అవార్డులూ,పురస్కారాలు లేవు,అలాగే సాహితీ రంగంలో కూడా చాలా వరకూ అంతే.జాషువా ఫౌండేషన్ వారు జ్ఞానపీట కన్న ఎక్కువనగదు ఇచ్చి సాహితీవేత్తలను సన్మానిస్తున్నారు.అయితే ప్రభుత్వపరంగా లభించే సదుపాయాలు వేరనుకోండి :).
  ఇక మాలతి గారికి,అమ్మా నేను లక్ష్మీకాన్తమ్ గారు సశరీరులుగా ఉన్నప్పుడు కలవలేదు గానీ,వేటపాలెం లైబ్రరీలోనూ,కొన్ని ధార్మికసంస్థలలోనూ,వారి కమ్యూనిటీకి చెందిన కార్యకలాపాల్లోనూ ఆవిడ చాలా చురుగ్గాపాల్గొనటం వల్లా తెలుసుకోగలిగాను.అవిడ గురించి వీలయనంతవరకూ(నాకు)సమాచారం పంపగలను.అలాగే మీరొకమాటు పరుచూరి శ్రీనివాస్ గారినీ సంప్రదించగలరు.

  మెచ్చుకోండి

 14. మాలతి గారూ, అబినందనలు.. ఈ వ్యాసంలోనే మీ శ్రమకి ఆనవాలు తెలుస్తోంది!! మీరు పేర్కొన్న రచయిత్రులలో ఒక్క రంగనాయకమ్మ గారివి తప్ప నేనింకెవరి రచనలు చదవలేదు 😦 వారందరినీ నాలాంటివారికి పరిచయం చేస్తూ ఇంత మంచి పుస్తకం అందిస్తున్నందుకు ధన్యవాదాలు!

  మెచ్చుకోండి

 15. మీస్పందనలవల్ల ఇది ప్రచురించాలని నేను పడిన తాపత్రయం సబబే అనిపిస్తోంది. అందరికీ నాకృతజ్ఞతలు.

  సుజాతా, నేను ఉదహరించింది భండారు అచ్చమాంబ. కానీ కవిత్వంరాసినవారు అన్పప్పుడు అది సరి కాదని, మార్చేను. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. విమర్శలవిషయంలో నా అభిప్రాయం కూడా అదే. విశ్వనాథరెడ్డిగారు, వీరికి భాషాసారళ్యము కూడా లేదు అని కూడా రాశారు. పురాణంవారయితే, contradictory statements కూడా ఇచ్చారు వేరు వేరు సందర్భాలలో. కల్పన తన ముందుమాటలో రాసింది ఈవిషయాలు.

  సుజాత, సిరిసిరిమువ్వ గారు, పుస్తకం ఫార్మాట్ చేసి ఇవ్వడం వరకే నా వంతు, మార్కెటింగ్ createspace.com వారిదే. వాళ్లకి ఈమెయిలిస్తే తెలుస్తుందేమో.
  లేదా, Hyderabad Book Trust వారు అక్కడ పబ్లిష్ చేయ్యడానికి ఒప్పుకుంటే జరగొచ్చు.

  cbrao గారూ, కాలాతీతులు అన్న ఒక్క నవలతో గొప్పపేరు తెచ్చుకున్న పి. శ్రీదేవి 30 ఏళ్లకే అకాలమరణం పాల పడ్డారు. నాయని కృష్ణకుమారిగారు ఏంచెప్పను నేస్తం అన్న కవిత రాసింది ఆమె మీదే. పి. సరళాదేవి మీరు చెప్పిన కుంకుమరేఖలు రాసిన రచయిత్రే. ఆవిడ కూడా అట్టే రాయకపోయినా మంచికథలు రాసారని మాకాలంలో పేరు పొందారు.. రెండు సంకలనాలు ప్రచురించారు. ఇప్పుడు విజయనగరంలో వుంటున్నారు కానీ ఏమీ రాస్తున్నట్టులేదు.

  ఏకాంతపు దిలీపు, మీరన్నమాట నిజమేనండీ. నాక్కూడా కేవలం రచయిత్రులమీదే చేసే ఈవిమర్శలు, అందునా మంచివిమర్శకులుగా పేరు పొందివవారినుండి వచ్చినప్పుడు అర్థం కాదు. ఈవిషయం ఇంకా వివరంగా నాపుస్తకంలో చర్చించాను. ఎవరికి జ్ఞానపీఠ్ అవార్టులస్థాయి వుందో నేను చెప్పలేనండీ. సాహిత్య ఎకాడమీ ఎవార్డులు ఎలా వస్తాయో తెలిసిన తరవాత, అవార్డులగురించి నాఅభిప్రాయాలు పబ్లిక్ గా చెప్పదగ్గవి కావు. :p. కానీ మీరు నాపుస్తకం చదివితే 50, 60ల నాటి రచయిత్రులగురించి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోగలరు.

  మెచ్చుకోండి

 16. మన మగాళ్ళు వెలగబెట్టింది కూడా పెద్దగా ఎమీలేదండి అలా పోలికలు తీసుకురావలసివస్తే… 15 కోట్ల తెలుగు జనాభాకి ఇప్పటివరకూ 2 జ్ఞానపీఠ పురస్కారాలు మాత్రమే వచ్చాయి… అది ఆలోచించాల్సిన విషయం… అందరికన్నా ఎక్కువ కన్నడిగులు గెలుచుకున్నారు… దక్షిణ భారతదేశం నుండి ఒక్క మహిళ కూడా గెలుచుకోలేదు… అసలు మొత్తం దేశం మీద ఐదుగురు (మొత్తం నలభైలో) మహిళలకే జ్ఞానపీఠ పురస్కారాలొచ్చాయి… వాళ్ళ నేపధ్యాలు కూడా గొప్పగా ఉంటాయి… అయినా, తెలుగులో రాస్తున్నంత మన దేశంలో ఏ ఇతర భాషల్లోనూ మహిళలు రాయడం లేదు ( ఇంగ్లీషూ పక్కన పెడితే) అనేది నిస్సందేహం… ముందున్న కాలం అంతా మన వాళ్ళదే… ఈ తరంలో తెలుగు మహిళ ఆలోచిస్తున్నంత వైవిధ్యంగా, తెలుగు మగాడు ఆలోచించడం లేదు అని నా నమ్మకం. తెలుగు మగాడి ఆలోచన ఒక మూస పద్ధతిలో బంధించబడిపోయింది…

  అయినా తెలుసుకోవాలనే కుతూహలంతో అడుగుతున్నాను… మీరు దాదాపు పేరుగాంచిన అందరి తెలుగు రచయిత్రులని చదివి గమనించి ఉన్నారు కాబట్టి… తెలుగులో ఏ రచయిత్రులు గతంలో గానీ,ఇప్పుడు గానీ జ్ఞానపీఠ ఆ పై స్థాయి ఏ పురస్కారానికైనా అర్హులు అని మీరు అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను… మీరిచ్చే పరిచయం నన్ను తప్పకుండా వాళ్ళ రచనలని చదివేట్టు చేస్తాయి అని చెప్పగలను…

  మెచ్చుకోండి

 17. “తెలుగులో ఉత్తమశ్రేణి రచయిత్రులు – శ్రీదేవి, సరళాదేవి” -ఈ సరళా దేవి ఎవరు? కథలా, కవితలా వీరు రాసినది? వీరి పుస్తకాలు ఏవీ చూసిన జ్ఞాపకం లేదు. కుంకుమ రేఖల రచయిత్రేనా? ఇంకేమన్నా రాసారా వీరు?
  కథా సాహిత్యంలో రచయిత్రుల స్వర్ణయుగం (1950-75) అనే విషయం పై 172 పేజీల పుస్తకం రాసారంటే, ఈ విషయం లో Ph.d చేసినంత శ్రమించినట్లే – మీ కృషి ఫలించినందుకు అభినందనలు.

  మెచ్చుకోండి

 18. మాలతి గారు,
  పొద్దున్నే అయిదింటికి ఇంత మంచి స్ఫూర్తి దాయకమైన వ్యాసం చదవడం ఈ రోజంతా నన్ను ఉల్లాసంగా ఉంచగలదని చెప్పగలను. పేరా పేరా కి విడి విడిగా స్పందన రాయాలని ఉంది.

  ఊటుకూరి లక్ష్మి కాంతమ్మ గారు రాసిన పుస్తకం (మొదలు చివరా లేకుండా దొరికింది) ఒకసారి నేనుమా కాలేజీ లైబ్రరీలో చదివాను ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు రాస్తే అవన్నీ గుర్తొచ్చాయి.

  ఈ మధ్య పవని నిర్మల ప్రభావతి గారి పాత పుస్తకాలు ఒకటి దొరికితే చదివాను. రంగనాయకమ్మ గారి పుస్తకాల సంగతి సరే సరి, తెలుగు చదవడం వచ్చాక చదివింది అవే మొదట! మీ సాహిత్యమూ చదివాను. ఇప్పుడు విశ్వనాథ రెడ్డి గారన్న మాట విని విస్తుపోతున్నాను. కథాశిల్పం లో ఈ ముగ్గురికీ ఒక్కో ప్రత్యేకత ఉందని నేననుకుంటున్నానే!

  (అవునూ, అచ్చమాంబ గారంటే “బిడ్డల పెంపకం” గురించి రాసిన డాక్టర్ అచ్చమాంబ గారా లేక ఈవిడ వేరా?)

  మొత్తానికి మీ తపస్సు ఫలించి పుస్తకం బయటికొచ్చినందుకు మీకు శుభాకాంక్షలు! (చంద్ర ముఖిని వదిలించుకున్నందుకు కూడా!)

  అయితే ఈ పుస్తకం ఇందులో మీరు రాసిన రచయిత్రులకు చేరే మార్గం ఏమీ లేదా?

  మెచ్చుకోండి

 19. నాదే కదండీ తప్పు మిమ్మల్ని క్షమించడం ఏమిటి. మార్చేను. అవును బాపట్లే. మీరు ఎప్పుడయినా వారిని కలిశారా. నాకు లక్ష్మీకాన్తమ్మగారి సాహిత్యసేవగురించి ఇంగ్లీషు తూలికలో రాయాలని వుంది కానీ తగినంత సమాచారం లేదు.
  మీసూచనమేరకి ఆమె పేరు సరిచేసాను. మీఅభిమానానికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 20. అమ్మా,క్షమించాలి ఊటుకూరి లక్ష్మీకాన్తమ్ అనబోయి ఉమాకాంతం అనేసాను,ఆవిడది మా పక్క ఊరే కదండీ -బాపట్ల.

  మెచ్చుకోండి

 21. రాజేంద్రగారూ, మీరు వెంటనే చదవడం నాకెంతో సంతోషంగా వుంది. ఉమాకాంతం అని రాశానా. లక్ష్మీకాంతమ్మగారిగురించా మీరు చెబుతున్నది. ఏమైనా మరోసారి చూస్తాను.
  పోనీ, మీకు ఇంగ్లీషులో సుళువు అనుకుంటే, http://englishthulika.wordpress.com లో నా preface పూర్తి పాఠం పెట్టేను. మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ
  మాలతి.

  మెచ్చుకోండి

 22. అమ్మా,చదవటానికైతే మొత్తం కాస్త ఆత్రంగా చదివాను కానీ మెదడులోకి సింకవటానికి (ఇంగ్లీషు)ఇంకటానికి(తెలుగు) కాస్త కంటే ఎక్కువే సమయము పట్టెట్లు ఉంది.

  మీరు ఇక్కడ ఉమాకాంతం అని వాడారు,ఆవిడ తనపేరు ఎల్లప్పుడూ ఉమాకాన్తమ్ అని రాసుకునేవారు 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.