జేబు

జేబు

 

నాకు కొత్త పరికిణీ, జాకట్టూ కావాలిఅంది పరిమళ అమ్మతో.

వారం రోజులు కూడా కాలేదు  కొత్తస్కూలని కొత్తబట్టలు కుట్టించేం. మళ్లీ ఇప్పుడే ఏమిటి? అంది అమ్మ.

పోనీ పరికిణీ అక్కర్లేదు. జాకట్టు కుట్టించు. కొత్తది కుట్టించకపోతే నేను స్కూలికి వెళ్లనుఅంది పరిమళ.

 బాగుంది వరస. రోజుకో కొత్త జత కావాలేమిటి రాణీగారికిఅంది అమ్మ నవ్వుతూనే.

రోజుకోటి అక్కర్లేదు. నాకు ఇంగ్లీషు క్లాసు వున్నరోజున వేరే జాకట్టు కావాలి,అంది.

ఏమయింది ఇంగ్లీషు క్లాసులో?అనడిగింది అక్కయ్య. ఇలాటికోరికలకి మూలం స్కూలేనని అక్కయ్య గ్రహించేసింది.

పరిమళ మాటాడలేదు.

అమ్మ సరేలే చూద్దాం. పైనెల బాబి పుట్టినరోజు వస్తోంది కదా. అప్పుడు నీక్కూడా కుట్టిస్తాలేఅంది.

అలా కాదు. నాకు ఇప్పుడే కావాలి అంది పరిమళ మళ్లీ.

బాగానేవుంది వరస. లేడికి లేచిందే ప్రయాణం అని, కో అనేసరికి కొనీడానకి ఎలా అవుతుంది. ఏవిటాతొందరఅంటూ కసురుకుంది అమ్మ.

పరిమళ ఊరుకుంది కానీ మనసులో ఉక్రోషం పట్టలేకుండా వుంది.

                                                            000

ముందు రోజు …

స్కూళ్లు తెరిచారు. పదోక్లాసులో అడుగు పెట్టింది పరిమళ. కొత్త పరికిణీ జాకట్టుతో, పుస్తకాలూ, జామెట్రీ బాక్సూ గుండెల్లో  పొదివి పట్టుకుని, అన్నీ కొత్తమొహాలు. క్లాసులో అడుగుపెడుతుంటే గుండెలు చుక్ చుక్ మంటూ చిన్ని రైలింజనులా కొట్టుకున్నాయి.

కొత్త స్కూలు. ఊరిపెద్ద దానం చేసిన గొడ్లపాకలో పెట్టారు. పిల్లలు కూర్చోడానికి నాలుగు నాపరాయి పలకలు నల్లరాయి బండలమీద అమర్చేరు. పరిమళకి అలాటి స్కూలు చూడడం అదే మొదలు. కొత్తమొహాలూ, కొత్త క్లాసు, కొత్త మేష్టరు, కొత్తపుస్తకాలు, కొత్త పరికిణీ, కొత్త జాకట్టు .. . అమ్మ వారంరోజులకిందట తనని బజారుకి తీసికెళ్లి, తనే ఎంచుకున్న పువ్వుల పరికిణీగుడ్డా, మామిడిచిగురు జాకట్టు గుడ్డా కొని, అక్కడే అరుగుమీద కుట్టుమిషను పెట్టుకుని కూర్చున్న అమీరుసాయబుచేత కుట్టించిన కొత్త పరికిణీ, జాకట్టూ సమస్తం చక్కగా అమిరేయి.

అయినా కొత్త క్లాసు కొత్త క్లాసే.

అడుగులో అడుగేసుకుంటూ, తల ఓరగా వంచుకుని దొంగతనం చేయబోతున్నట్టు చుట్టూ చూస్తూ క్లాసులో అడుగు పెట్టింది. మేష్టారు ఇంకా రాలేదు. ఏడుగురు మగ పిల్లలు కుడిపక్క వరసల్లోనూ, ఐదుగురు ఆడపిల్లలు ఎడమపక్క రాతిపలకలమీదా సర్దుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

పరిమళ కళ్లు నెమ్మదిగా పాక నలుమూలలా ఓ చుట్టు చుట్టి, ఎడమవేపు రెండోవరసలో కూర్చున్న ఇద్దరు అమ్మాయిలమీద వాలేయి. ఎందుకో వారిద్దరూ ప్రత్యేకంగా కనిపించారు. వాళ్లమీద ఆపిల్లకళ్లు అట్టే నిలిచిపోయేయి. అందులో అటువేపు వున్న అమ్మాయి తనని గమనించి మెల్లిగా నవ్వి, పక్కనున్న అమ్మాయికి చెప్పినట్టుంది. రెండో అమ్మాయి వెనుదిరిగి తనవేపు చూసింది. యుగాలసేపు అనిపించినతరవాత, మెల్లిగా వాళ్లవేపు నడిచింది. వాళ్లు కూడా రమ్మన్నట్టు జరిగి చోటిచ్చారు తనకి.

నీపేరేమిటి అని అడిగింది జరిగి చోటిచ్చిన అమ్మాయి. తెల్లగా, పల్చగా వుంది, కోలమొహం, గట్టిగా పట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేంత సుకుమారం. ఆఅమ్మాయిపేరు రమణిట. రెండో అమ్మాయి చామనచాయ, నిన్నెక్కడో చూసేనంటూ పలకరించే కళ్లూ, పెదవులమీద చిరునవ్వు అక్కడే పుట్టిందేమో అనిపిస్తూంది. విశాలట ఆపిల్ల పేరు.

పరిమళ అంది మందరస్థాయిలో, రహస్యం చెబుతున్నట్టు.

అటువేపు కూచున్న అబ్బాయిల్లో ఒకడు మాష్టారుఅన్నాడు తనపక్కవాడితో.

రమణితో మాటాడుతున్న పరిమళ ఇటు తిరిగి, ప్రవేశిస్తున్న మాష్టారిని చూసి, నోరు తెరుచుకు వుండిపోయింది.  గుండె ధన్ ధన్ మని రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది. ఆయన వాళ్ల ఇంటాయన! నెలరోజులవుతోంది పరిమళా వాళ్లూ ఆయింట్లో అద్దెకి దిగి. వచ్చిందగ్గరునుంచీ ఆయన అమ్మతో ఒకటే గొడవ, గుమ్మంముందు ముగ్గు వెయ్యడానికి వీల్లేదూ, రాత్రి ఎనిమిది తరవాత రేడియో పెట్టడానికి వీల్లేదూ, శాస్త్రీయసంగీతమే పెట్టాలీ, కొళాయినీళ్లు తమనే ముందు పట్టుకోనివ్వాలీ .. అంటూ.  అందులో రేడియో పెట్టడంలాటివి తనకి పరోక్షంగా తగులుతున్నాయి.

 

ఆయన కుర్చీ దగ్గరికి వెళ్లి, చుట్టూ ఓమారు చూసి, హు ఓ కొత్తమ్మాయి వచ్చిందన్నమాట అన్నారు తనవేపు చూస్తూ. తరవాత ఎటెండెన్స్ తీసుకుంటూ తనపేరు వచ్చేసరికి తలెత్తి తనవేపే చూస్తూ ప్రమీల అన్నారు.

ప్రమీల కాదండీ, పరిమళఅంది కాస్త బెదురుగా. 

పరిమళఅన్నారు మేష్టారు తినేస్తున్నట్టు చూస్తూ.

క్లాసులో చిన్న నవ్వులు వినిపించేయి. సైలెన్స్ అంటూ అరిచేరు మేష్టారు.

ఇంగ్లీషు క్లాసు.

నాన్‌డిటైల్డ్ టెక్స్ట్‌బుక్కు పంచపాండవులూ ద్రోణాచార్యుడిదగ్గర విలువిద్య నేర్చుకోడం, అర్జనుడు చెట్టుమీద పిట్టకన్ను తప్ప మరేమీ కనిపించడం లేదనడం, ఆచార్యులవారు concentration అంటే అదీ అని వివరించడం …

పుస్తకంలోకి తలదూర్చేసిన పరిమళకి కుడిబుజం వెనకవేపుకి ఓచిన్నకాగితం బాణం వచ్చి తగిలింది.

పరిమళ వులిక్కిపడింది. ఒళ్లో వున్న జామెట్రిబాక్స్ డబ్ మంటూ కింద పడింది. ఇంగ్లీషు మేష్టారికి తెగ కోపం వచ్చేసింది.

ఎవరది అని ఆయన అడక్కండానే తెలుస్తోంది. పరిమళ వంగి చెల్లాచెదరయిపోయిన స్కేలూ, కాంపసూ, పెన్సిలూ, రబ్బరూ, .. ఒక్కటొక్కటే ఏరుకుంటోంది ఆయనవేపు బెదురుగా చూస్తూ.

క్లాసులో అబ్బాయిలు కిస్‌కిస్‌మంటూ నవ్వేరు.

సైలెన్స్ అంటూ మేష్టారు అరిచి, పరిమళని ఇలా రా అని తన కుర్చీదగ్గరికి పిలిచారు.

పరిమళ జామెట్రీ బాక్సూ, అందులో వుండవలసిన సామానూ అంతా బల్లమీద పెట్టి ఆయనదగ్గరికి వెళ్లింది.

ఆ పోపులడబ్బా నాక్లాసుకి ఎందుకు తెచ్చేవు? అని అరిచేరాయన, కొట్టడమే తరువాయిగా.

పరిమళ జవాబు చెప్పలేదు.

ఆచెత్తడబ్బా ఇంగ్లీషుక్లాసులో కావాలా? అని మళ్లీ రొకాయించేరు.

అక్కరలేదు సార్ అంది పరిమళ బెదురుగా.

రేపటినించీ నాక్లాసుకి జామెట్రీబాక్స్ తీసుకురాకు, అందరికీ చెప్తున్నా, నాక్లాసుకి ఎవరూ జామెట్రీబాక్సు తీసుకు రావడానికి వీల్లేదుఅంటూ క్లాసు మొత్తానికి తాఖీదిచ్చేరు ఆయన.

క్లాసులో పన్నెండు జతల కళ్లు తనవేపు తిరిగేయి నీనించేఅంటూ.

ఆరోజుకి క్లాసు అయిపోయింది. తనకి జాగా ఇచ్చిన స్నేహితురాళ్లిద్దరూ, రమణీ, విశాలా మాటాడుకుంటూ బయటికి వచ్చేరు. వాళ్ల ఇళ్లు ఇరుగూ పొరుగూన్ట. తనఇంటికి దారి అటువేపే. అంచేత వాళ్లతో నడుస్తూ, వచ్చి, వాళ్ల ఇళ్లు దాటింతరవాత తన ఇంటివేపు దారి తీసింది.

ఇహమీదట ఇంగ్లీషుక్లాసుకి జామెట్రీబాక్స్ తీసుకెళ్లరాదు. మరి పెన్సిలూ, రబ్బరూ, పెన్సిలు చెక్కుకునే మరా ఇవన్నీ ఎలా … చేత్తో పట్టుక్కూచోలేదు కదా. మధ్యాన్నం చూసింది అటుపక్క కూచున్న బక్కరాజు మహ షోగ్గా జేబులోంచి పచ్చమర తీసి పెన్సిలు చెక్కుకోడం. వాడికేం, ఒకటి కాదు మూడు జేబులున్నాయి నిక్కరుకి రెండూ, చొక్కాకి ఎడంవేపు గుండెకానుకుని ఓజేబు. ఆజేబుమీద సిరామరక. హీహీహీ …

ఎందుకే నవ్వుతున్నావూ?అంది రమణి.

ఇందాకా తెల్లచొక్కా రాజుగాడి జేబు … హీహీ .. నువ్వు చూసేవా … మల్లెపూవుమీద పురుగులా… అంది నవ్వుతూ.

ఏమో నేను చూడలేదు. నువ్వు చూసేవుటేఅని అడిగింది విశాలని. విశాల కూడా చూడలేదు. వాళ్లకి నవ్వు కూడా రాలేదు. ఏంవుంది అందులో నవ్వడానికి?

అంత స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తెల్లచొక్కా, చొక్కాకున్న జేబూ, జేబుమీద మరకా వీళ్లెలా చూడలేదో పరిమళకి అర్థం కాలేదు. వాళ్లు చూసి వుంటే మరి వాళ్లకి నవ్వొచ్చేదా అన్నది కూడా తెలీలేదు. ప్చ్ కొందరింతే…

చంద్రుడిమీద కుందేలుపిల్లలాటి సిరామరక తలుచుకుంటే తనకి నవ్వొచ్చింది. మంచిపని అయింది అబ్బాయిగారికి అని కూడా అనిపించింది. కానీ … బాగా ఆలోచించినతరవాత చొక్కాకి జేబు వున్నందున గల లాభాలే ఎక్కువ కనిపించేయి. నవ్వు పోయి మొహం సీరియస్సయిపోయింది

మేష్టారికి నువ్వంటే కోపం. అనవసరంగా నీమీద కేకలేసేరు అంది రమణి.

నేనంటే ఆయనకెందుకూ కోపంఅంది పరిమళ. 

ఏమో మరి. వాళ్లింట్లో అద్దెకి వున్నారు కదా. మరేదో అయివుంటుంది.

పరిమళ అప్పుడే ఓనిర్ణయానికి వచ్చేసింది. తను మాట పడదు. మళ్లీ ఇంగ్లీషు క్లాసుకి తను జామెట్రీ బాక్స్ పట్టుకురాదు. మరి పెన్సిలూ, అది చెక్కుకోడానికి మరా, రబ్బరూ, ఎలా?   

                                                            000

లేడికి లేచిందే ప్రయాణమాఅంటూ కసిరిన అమ్మ పోన్లెద్దూ ఓపని అయిపోయినా అయిపోయినట్టేఅనుకుంది తెల్లారి లేచేక. ఎలాగా బాబీకి కొనాలి కదా. పైగా ఆకుట్టుపనివాడు అన్నరోజుకి ఇస్తాడో ఇవ్వడో. ఇప్పుడే మొదలెడితే నయం అని ఆ సాయంత్రమే తమ్ముడితోపాటు రామయ్యసెట్టి కొట్టుకి తీసికెళ్లింది బట్టలు కొనడానికి. బాబిగాడికి చొక్కా గుడ్డ ఎంపిక ఇట్టే అయిపోయింది కానీ పరిమళకి నచ్చిన రంగూ, పువ్వులూ, అంచూ కూడేసరికి పొద్దు వాలింది.

అమ్మ వాటికి ధర చెల్లించి, అరుగుమీదున్న అమీరుసాయిబుకిచ్చింది కుట్టడానకి.

సాయిబు కొలతలు తీసుకున్నాడు.

నాజాకట్టుకి జేబు పెట్టుఅంది పరిమళ.

సాయిబు అమ్మవేపు చూశాడు.

జాకట్టుకి జేబూ ఏమిటే?అంది అమ్మ.

బాబీ చొక్కాకి పెట్టేడు కదా. నాకూ అలాగే పెట్టమనుఅంది పరిమళ అదేమీ వింత కానట్టు.

వాడంటే మగవాడుఅంది అమ్మ.

వాడు మగవాడయితే, నేను ఆడవాడు. నాజాకట్టుకి జేబు వుండాలి. లేకపోతే నాకు జాకట్టే అక్కర్లేదు.

ఆడవాడు ఏమిటే?అంది అమ్మ నవ్వుతూ.

.జాకట్టుకి జేబు బాగుండదు అమ్మాయిగారూఅన్నాడు సాయిబు.

నాకు బాగుంటుందిఅంది పరిమళ ఒత్తి పలుకుతూ.

పోనిద్దూ. సరదా పడుతోంది. ఓచిన్న గుడ్డముక్క అతికిద్దూఅంది అమ్మ. ఇదేదో తెమిల్తే కానీ ఇంటికెళ్లి వంట మొదలెట్టడం జరగదు. ఏడు కొట్టేసరికి కంచంముందు కూచోపోతే సోష వచ్చేస్తుంది ఆయనగారికి..

జేబు పెట్టడానికి ఒప్పందం అయింపోయింతరవాత ఎక్కడ అన్న ప్రశ్న వచ్చింది. అబ్బాయిలచొక్కాల్లా ఎడంవేపు గుండెదగ్గరా, నాన్నగారి కమీజుకి లాగ పక్కజేబా …

పక్కకి పెడతానులెండి, కనపడకుండాఅన్నాడు సాయిబు.

పరిమళ, పక్కకి కాదు. ఎడంవేపు కిందంచు దగ్గర పెట్టు. కుడిచేత్తో రాసుకుంటున్నప్పుడు రబ్బరు అందుకోడానికి అనువుగాఅంది పరిమళ. ఆపిల్ల ఎప్పుడూ ఏవిషయంలోనూ ఏదో ఒకటిలెద్దూ అంటూ సర్దుకుపోడానికి ఒప్పకోదు. ఏం చేసినా, అవసరం అయితేనే, ఆతరవాత ఆ అవుసరానికి అనువుగానూ.

మొత్తమ్మీద పరిమళ జాకట్టుకి చిన్నజేబు జాకట్టు చిగుళ్ల ఎడంవేపు పెట్టడానికి నిశ్చయం అయేసరికి ఆరుంబావు అయింది. అమ్మ తొందరపడుతూ పిల్లలిద్దరినీ రిక్షా ఎక్కించి ఇల్లు చేరింది ఆరాటపడిపోతూ.

మర్నాడు తెలుగు గ్రామరుక్లాసు. పరిమళకి ఇంగ్లీషు మేష్టరంటే ఎంత భయమో తెలుగుమాష్టారంటే అంత ఇష్టం. ఆయన చెప్పే పద్యాలూ, గ్రామరూ, అన్నీ ఎంతో చక్కగా అర్థం అవుతాయి తనకి.

పాణిని కథ చెప్తున్నారు.

            పరిపూర్ణ చంద్రబింబమువోలె శాంతమై కళకళలాడు మొగంబు వాడు

            వున్నతోరస్కుండయి చూడంగ తగు మేని సొబగువాడు

            ఆసాయమాయాసమనక గురవర పదాబ్జ శుశ్రూష నెరపువాడుఁ

            గాని అది ఏమి పాపమో గడగి యొక్క పాఠమయిన అప్పగించిన పాపమున బోఁడు.

(తా.క. నేను ఉదహరించిన పద్యం సంపూర్ణంగా నాకు ఎక్కడా దొరకలేదు. ఫేస్బుక్కులో మరొకసారి అడిగితే, శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు
ఇలా ఉండవచ్చుననీ, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారి మునిత్రయచరిత్ర లోనిది అయిఉంటుందని తెలియజేసేరు. దీనిమీద ఇంకా ఎవరికైనా వివరాలు తెలిస్తే చెప్పగలరు. – మాలతి)

 

పరిమళకి ఈపద్యం చాలా ఇష్టం. చివరిపాదంలో చమత్కారం ఆపిల్ల మనసునాకట్టుకుంది. పద్యంలో పదే పదే వాడు అని రావడంతో నిన్నట్నుంచీ తనని వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలి అనిపించింది. క్లాసు అయిపోయిన తరవాత మేష్టారిదగ్గరికి వచ్చింది నాకో సందేహం మాష్టారూ అంటూ.

ఏమిటమ్మా?అన్నారాయన చిరునవ్వుతో. ఆయనకి కూడా పరిమళ అంటే ప్రత్యేకాభిమానం చాలా తెలివైనదని.

అదేనండీ. వాడు ఏకవచనం, వారు బహువచనం కదండీ.

అవునమ్మా
మగవాడు ఏకవచనం, మగవారు బహువచనం. మరి ఆడవారు బహువచనం కదా, ఆడవాడు ఏకవచనం ఎందుకు కాదూ?

 మాష్టారు నవ్వేరు,

పరిమళ మాత్రమే నవ్వలేదు. ఆపిల్లకి నిజంగానే ఆసందేహం వచ్చింది. తనకి సమాధానం కావాలి, అంతే.

వ్యాకరణం ఏది ఎందుకు ఎలా లేదో చెప్పదమ్మా. వున్న మాటలు కాలగతిలో ఎలా రూపాంతరం పొందేయో చెప్పుతుంది అంతే. నువ్వు ఆడవాడు అంటే, మరో పదిమంది అలాగే అంటే అదే కరెక్టయిపోతుంది కొంతకాలానికి. నువ్వు గొప్ప రచయిత్రివి అయింతరవాత చెయ్యి ఆపని.అన్నారాయన సగం హాస్యంగానూ, సగం నిజంగానూ.

నేనిప్పుడే అంటానండీ,అంది పరిమళ. ఆపిల్లకి ఆయనదగ్గర అంత చనువుంది మరి.

లేదులే. నువ్వు పెద్ద రచయిత్రివి అయేవరకూ ఆగాలి. అప్పుడయితే నీమాట చెల్లుతుంది. ఆర్షప్రయోగం అని అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడంటే, నీకు భాష రాదంటారు. ఇంతకీ ఈవాదన ఎందుకు వచ్చిందసలు?అన్నారు మేష్టారు.

పక్కనే వున్న రమణి ఇదుగో, ఈ జాకట్టుజేబుతో వచ్చిందండీ, అంది నవ్వుతూ, ఆజేబు ఆయనకి కనిపించేలా రవంత లాగి.

ఏమిటీ ..  నేనెప్పుడూ జాకట్టుకి జేబు చూడలేదులే .. అందుకన్నాను,ఆయన పరిమళ మొహంలోకి చూస్తూ.

అదేనండీ మన పరిమళ అంటే.అంది వెనకునున్న విశాల.

 

రాత్రంతా ఆలోచిస్తూనే వుంది పరిమళ. జేబుకి ఆడా మగా ఏమిటి అని. చాలా చాలా ఏళ్లకి ముందు, అమ్మా, అమ్మమ్మా బయటికి వెళ్లని రోజుల్లో వాళ్లకి, ఇలా పెన్సిళ్లూ, రబ్బరు ముక్కలూ పట్టుకుతిరగాల్సిన అవుసరం లేని రోజుల్లో జేబులు అక్కర్లేకపోయి వుండొచ్చు. ఇప్పుడు తను అవన్నీ పట్టుకు తిరగాలంటే, రోజూ మహ చిరాగ్గా వుంటోంది పొద్దస్తమానం, ఏదో ఒకటి చేతిలోంచి జారి పడిపోవడం, మళ్లీ కొత్తది కావాలని ఇంట్లో గొడవాను.

పోనీ చిన్నసంచీ కుట్టిస్తా, అందులో పెట్టుకో అంది అక్కయ్య. కానీ ఆసంచీ కూడా పారేసుకోకుండా చూసుకోవాలి కదా అస్తమానం. అదీ ఓ పనే … జేబులో అయితే అవన్నీ ఓచోట పడుంటాయి.  తాను అనుక్షణం చూసుకోనక్కర్లేదు పెన్సిలుందా, రబ్బరుందా … అనుకుంటూ. అప్పుడు తన తలకాయని వేరే విషయాలకి వినియోగించుకోవచ్చు కదా అనుకుంటూ నిద్ర పోయింది.

                                                000

పదిహేనేళ్లయింది. అమెరికాలో స్థిరపడిన పరిమళ, ఇండియా వచ్చి, రమణిని చూడ్డానికి వాళ్లింటికొచ్చింది.

రమణి ఉప్పొంగిపోతూ, అబ్భ, ఎన్నాళ్లకెన్నాళ్లకి కనిపించేవే. నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదు. ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో నీకథలు పత్రికలలో కనిపించినప్పుడల్లా నేనూ విశాలా నీగురించే అనుకుంటాం.

పరిమళ కూడా సంతోషంగా వుంది తనకథ చదివి, తనని తలుచుకునేవారు వున్నారని తెలిసి.

రమణి, పద, పద, విశాల హైదరాబాదులో వుంటుంది కానీ వాళ్లక్కయ్యని చూడ్డానికొచ్చిందిట నిన్ననే. పద, వాళ్లింటికెళ్దాంఅంటూ హడావుడి చేసి లాక్కుపోయింది వాళ్లింటికి.

విశాల ఇంట్లో ముగ్గురూ కూచుని పొట్టాచారిగారి గురించీ, లెక్కల మాష్టారు గురించీ, ఇంకా ఎన్నో విషయాలు గలగల మాటాడేసుకున్నారు. ఆరోజుల్లో నువ్వొక్కదానివే పరికిణీ, జేబు జాకట్టుతో క్లాసు కొచ్చేదానివి. మేం ఇద్దరం నవ్వుకునేవాళ్లం నీ వుపాయాలకిఅంది రమణి.

పరిమళ కూడా నవ్వేసి, మీరెందుకు పెట్టించుకోలేదూ మీజాకట్లకి పోకెట్లు?అంది.

ఎక్కడ … మాఅక్కయ్యకి చిన్నవి అయిపోయినబట్టలన్నీ సద్వినియోగం చెయ్యడంతోనే సరిపోయింది నాకు అంది విశాల.

నాకు ఆ అదృష్టం కూడా లేదు. నాకు వున్నవాడొక్కడూ అన్నయ్య అయిపోయేడు. వాడి చొక్కాలు నన్ను తొడుక్కోనిచ్చినా బాగుండేది. జేబులు అవే వచ్చేసి వుండేవి, ప్చ్, తోచలేదు కానీఅంది రమణి.

మన తెలుగు మేష్టారు ఎక్కడున్నారు? అనడిగింది పరిమళ.

రిటైరయిపోయారు. ఆ ఇంట్లోనే వున్నారు.

వెళ్లి చూద్దామాఅంది పరిమళ చిన్నప్పటి ప్రసంగాలు లీలగా మనసులో మెదిలి.

పదండయితే తొరగా. ఇప్పుడయితే ఆయన ఇంట్లోనే వుంటారు. మరో గంట పోతే దొరకరు. వాకింగుకి వెళ్లిపోతారు.అంది విశాల.

ముగ్గురూ కలిసి మేష్టారింటికి వచ్చేరు. ఆయన వరండాలో కూర్చున్నారు భాగవతం చదువుకుంటూ. పక్కనే స్థంభాన్నానుకుని కూర్చుని, రాత్రికూరకి చిక్కుడుకాయలు ఈనెలు తీస్తున్నారు ఆయన భార్య కామమ్మగారు.

గేటు తోసుకుని వస్తున్న ముగ్గురు ఆడవాళ్లని చూసి, మేష్టారు చత్వారం కళ్లద్దాలు సవరించుకుంటూ ఎవరూ అన్నారు.

కామమ్మగారు గుర్తు పట్టి, అదేనండీ, మన రమణీ, విశాలా, పరిమళాను అని, రండమ్మా అంటూ వాళ్లని ఆహ్వానించింది ఆప్యాయంగా.

వాళ్లు మేష్టారికి నమస్కారాలు చేసి, ఆపక్కనే చాపమీద కూర్చున్నారు.

జేబుజాకట్టు పరిమళేనాఅన్నారు మేష్టారు నవ్వుతూ ,

రమణి కూడా నవ్వింది, అవునండీ అదే అంటూ.

పరిమళ సిగ్గు పడిపోయింది. ఏమిటో అప్పట్లో అలా బుద్ధి పుట్టింది అనుకుంటూ. 

కామమ్మగారు ఇంట్లోకి వెళ్లి, మూడు గ్లాసుల్లో మజ్జిగ తీసుకొచ్చారు. ఇప్పుడెందుకండీ అంటూనే పుచ్చుకున్నారు అమ్మాయిలు.

అమెరికాలో వున్నావన్నమాట అయితే.  కిందటినెల మామనవరాలొచ్చి వెళ్లిందిలే, పాంట్లూ, టీషర్టులూను. నువ్వూ అంతేనేమో. … నిలువునా జేబులే… అన్నారాయన మాటలసందర్భంలో నవ్వుతూ.

జేబూలూ, ఆ జేబులనిండా నోట్లూ… అంతేనా …అన్నారు కామమ్మగారు కూడా నవ్వుతూ. ఆవిడ హాస్యానికే అన్నారు.

పరిమళ చప్పున మొహం పక్కకి తిప్పుకుని, అదేం లేదండీఅంది.

అయ్యో అలా అనకుండా వుండవలసింది అనిపించింది కామమ్మగారికి మనసులోనే.

పరిమళ మాత్రం మరుక్షణంలో తేరుకుని, తేలిగ్గా నవ్వేస్తూ, జేబులూ, ఈ జోలె కూడానండీ ఇప్పుడుఅంది చేతిసంచీ చూపిస్తూ. తరవాత సంచీలోంచి ఇది మీకోసంఅంటూ ఓ బాల్ పాయింటు పెన్ను తీసి మేష్టారికిచ్చింది. ఆయన అందుకున్నారు కృష్ణార్పణం అంటూ.

రమణి ఎన్ని జేబులున్నా, ఎక్కడున్నా మన పరిమళ మన పరిమళేనండీ మాష్టారూ. జేబులనిండా ఇప్పటికీ కాగితాలూ, పెన్సిళ్లేఅంది.

కథలు రాస్తున్నావని విన్నాను. చదువులతల్లి కటాక్షం వుంది నీకు. నేను అప్పుడే అనుకున్నాను నువ్వు మంచి రచయిత్రివి అవుతావనీ. అదే సంతోషం నాకుఅన్నారాయన.

మంచి రచయిత్రి అనేం లేదండీ. ఏదో గిలుకుతూంటాను తోచినప్పుడుఅంది పరిమళ వినయంగా..

అదేనమ్మా. పెన్సిలు దాచుకోడానికి జేబూ, మనసు దాచుకోడానికి పెన్సిలూనుఅన్నారు గుంభనగా.

పరిమళ తెల్లబోయి ఆయనమొహంలోకి చూసింది. ఆయన వదనం గంభీరంగా వుంది. అక్కడేవో అర్థాలు స్ఫురించేయి తనకి. మిగతా ముగ్గురూ అయోమయంగా చూశారు.  

ఆపైన ఎవరికీ మాటలు తోచలేదు. నిశ్శబ్దం బరువుగా తెర దించింది వారిమధ్య.

చీకటి పడుతోంది, వెళ్లొస్తాం మేష్టారూఅంటూ లేచేరు ముగ్గురూను.

ఉండండమ్మా, ఒక్కక్షణంఅంటూ కామమ్మగారు లోపలికి వెళ్లి, ఓపళ్లెంలో పళ్లూ తాంబూలంతోనూ తిరిగొచ్చారు. వాళ్లకి బొట్లు పెట్టి, తాంబూలాలు చేతిలో పెట్టారు. పరిమళ వంగి వారిద్దరి పాదాలకి దణ్ణం పెడుతుంటే కనులు చెమ్మగిలేయి. ఈ సాంప్రదాయాలు తను మరిచిపోయి ఎంతకాలం అయిందో …. కానీ ఈరోజు అప్రయత్నంగానే ఆదంపతులకి నమస్కరించాలనిపించింది.  

మరోసారి వెళ్లొస్తాం మాష్టారూ, వెళ్లొస్తాం అమ్మా, అని ఇద్దరికీ చెప్పి గేటువేపు నడిచారు ముగ్గురూ..

పరిమళ గేటుదగ్గర ఒక్కక్షణం ఆగింది. ఓరవొంపుగా తలొంచి, కొనకళ్ల చూస్తే ఆయన కళ్లొత్తుకోడం కనిపించింది.

చిన్నగా నిట్టూర్చి, రమణిభుజమ్మీద చెయ్యేసి ముందుకి నడిచింది ….

                                                000

(పైన ఉదహరించిన పాణిని పద్యం నాకు గుర్తున్నట్టుగా రాసేను. పొరపాటులుండొచ్చు.

రూపసీ, సద్వర్తనుడూ అయిన పాణిని చిన్నతనంలో విద్యాభ్యాసంలో మాత్రం అట్టే ప్రకాశించలేదట.. కొంతకాలం గురుకులవాసం చేసి, తరవాత, ఏదో కారణంచేత సహవాసి హేళన చేయడంచేతో, గురువుగారి ప్రోద్బలంతోనో హిమాలయాలకు వెళ్లి, తపస్సు చేసి ఆతరవాత అఘటిత ప్రజ్ఞాధురీణుడు అయినాడనీ, అష్టాధ్యాయి అన్న వ్యాకరణగ్రంథం రాసి, మొత్తం ప్రపంచంలోనే వైయాకరణులందరికీ మార్గదర్శకుడు అయినాడనీ ప్రతీతి.)

                                                000

 

(కథ కొత్తగా ఇప్పుడే రాసాను కానీ ఈ జేబు వుదంతం 1950లో జరిగిందని ఆనాటి స్నేహితురాలు శాంత గుర్తు చేసింది నెలరోజులక్రితం. ఆగస్టు 2008. )

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “జేబు”

 1. Respected Malathi Garu,
  I read the story and the reviews. Story is splendid. With a slight scent from midway of the story it self that it could be related to some thing in your own childhood. The bhavam “Pocket is to hide pencil and pencil is to hide mind” is excellent.

  No one had done this so far. As Sri Buchchi babu garu said in his renowned Chivaraku migiledi, opinions are strange, We feel ours as others opinions at times and vice versa. Now I am also forming an opinion that pencil hides mind 🙂

  Regards

  Seetharam

  మెచ్చుకోండి

 2. @రాధిక, ఎప్పుడోకప్పుడు నేను వాడేసుకుంటా. — 🙂 తప్పకుండానూ ..
  నా పాత్రచిత్రణ గురించి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. సంతోషం. అయితే ఆలోచింపచేసేలా లేవని కొందరి అభిప్రాయం. ఈవిషయంలో ఎవరైనా కామెంటు చేస్తారేమోనని చూస్తున్నాను.

  మెచ్చుకోండి

 3. ఎప్పటిలానే చాలా బాగుందండి.పాత్రల్లో సహజత్వం వుంటుంది.మీ చాలా కధల్లో స్త్రీ పాత్రలకి గొప్ప వ్యక్తిత్వం వుంటుంది.అది ఏదో కావాలని చొప్పించినట్టుగా/ఆపాదించినట్టుగా కాక,ఆ పాత్రతో పాటూ వ్యక్తిత్వం కూడా ఎలివేట్ అవుతూ వుంటుంది.అలాగే స్వతంత్ర భావాలను కలిగి మీరు రాసినట్టుగా కాక ఆపాత్రే మాకళ్ళముందుకొచ్చినట్ట్టుగా వుంటుంది.
  మనసుదాచుకోడానికి పెన్సిల్ అన్న మాట నాకూ తెగనచ్చేసింది.మీరు అనుమతిస్తే ఎప్పుడోకప్పుడు నేను వాడేసుకుంటా.

  మెచ్చుకోండి

 4. independent – ధన్యవాదాలు. assertivenessతో .. బాగా పట్టుకున్నారండీ. 50వ దశకం రచయిత్రులకీ 80వ దశకం రచయిత్రులకీ మధ్యగల పెద్ద వ్యత్యాసం అదీ. థాంక్స్.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ..నాక్కూడా చాలా బాగా నచ్చిందండి మీర్రాసిన విధానం. Arrogance కాకుండా Assertiveness పాత్రలో బాగా కనబడి మనసుకి “పరిమళ” హత్తుకుపోయింది.

  మెచ్చుకోండి

 6. రాజేంద్ర – ధన్యవాదాలు ఆసాంతం చదివినందుకు.
  మహేష్ – మీ విశ్లేషణ బాగుంది. నాకు ఏలేబులూ ఇష్టం లేదు కనకనూ, మా.మార్కు చూపడంకోసమూ పొడిగించాను. :). ముఖ్యంగా జేబు ఎందుకోసం అన్నప్రశ్నకి జవాబు చెప్పాలనే నాతాపత్రయం.

  సుజాత – ధన్యవాదాలు. ఆవాక్యం రెండురోజులు ఆలోచించాను. ఎవరికళ్లకయినా ఆనుతుందా అని ఆాటపడ్డాను కూడా.
  నెటిజన్ – ధన్యవాదాలు. ఆవయసులో అంత పరిణతా అన్నారు. Ann Frank డైరీ రాసింది ఆవయసులోనే కదండీ. పైన పాణిని పద్యం వల్ల కూడా అదే స్ఫురించగలదనుకున్నాను. మీ తరువాతి వాక్యంలో ఆవిషయం విశదం చేసినట్టున్నారు.
  లేదండీ. నేను ఫెమినిజం కథ రాయాలనుకోలేదు. నేను వ్యక్తం చెయ్యదలుచుకున్నది పరిమళ వ్యక్తిత్వం మాత్రమే.
  ఆనాటి వాతావరణం స్ఫురింపచేయడానికి ఆరోజుల్లో వాడే మాటలే వాడాలని షార్పెనర్ వాడలేదు. అందుకే అమెరికానించి తిరిగి వచ్చింతరవత, పాకెట్ అంటుంది చూడండి. జాకట్ అన్నది ప్రాస కోసం.
  concentrationకి ఏకాగ్రత అన్నమాట గుర్తు రాలేదు ఎంత తన్నుకున్నా. 😦

  – మాలతి

  మెచ్చుకోండి

 7. అంత చిన్న పిల్ల పరిమళలో అంత గంభీరమైన ఆలోచనాలా?
  *
  పరిమళ కి అంత చిన్న వయుస్సులోనే – “చంద్రుడిమీద కుందేలుపిల్లలాటి సిరామరక తలుచుకుంటే తనకి నవ్వొచ్చింది, ” లాంటివి స్ఫురించే అవకాశం ఉందా?
  *
  “జేబుకి ఆడా మగా ఏమిటి అని. చాలా చాలా ఏళ్లకి ముందు, అమ్మా, అమ్మమ్మా బయటికి వెళ్లని రోజుల్లో వాళ్లకి, ఇలా పెన్సిళ్లూ, రబ్బరు ముక్కలూ పట్టుకుతిరగాల్సిన అవుసరం లేని రోజుల్లో జేబులు అక్కర్లేకపోయి వుండొచ్చు. ఇప్పుడు తను అవన్నీ పట్టుకు తిరగాలంటే, రోజూ మహ చిరాగ్గా వుంటోంది పొద్దస్తమానం, ఏదో ఒకటి చేతిలోంచి జారి పడిపోవడం, మళ్లీ కొత్తది కావాలని ఇంట్లో గొడవాను.”
  ఆ వయసులో అంత పరిణితా?
  *
  విశిష్టమైన వ్యక్తిత్వం వికసిస్తున్న దశలో, అలాంటి ఆలోచనలు ఎందుకుండకూడదు!
  *
  కత్తి మహేష్ కుమార్ గారన్న, “అర్ధవంతమైన ఫెమినిజం” ని దృష్టిలో పెట్టుకుని ఈ రచన చేసారనపించలేదు.
  చేసారా?
  *
  సుజాతగారన్నట్టు, “పెన్సిలు దాచుకోడానికి జేబూ, మనసు దాచుకోడానికి పెన్సిలూను” చాలా బాగుంది.
  రబ్బరు, పెన్సిల్, concentration వాడినప్పుడు,షార్పనెర్ వాడొచ్చుకదా!
  కధ ఆసాంతం ఆపకుండా ఏకబిగిన చదివించింది.
  మంచి కధని అందించారు.

  మెచ్చుకోండి

 8. మాలతి గారు,
  పెన్సిల్ దాచుకోడానికె జేబూ, మనసు దాచుకోడానికి పెన్సిలూ!వాహ్!

  కూడలి తెరిచాక చివరాఖరికి మీ బ్లాగు చూస్తాను నేను. ఎందుకంటే మీ బ్లాగు చదివాక ఇంకే బ్లాగన్నా చదివితే మీ బ్లాగు చదివిన Taste పోతుందని! ఇక చెప్పడానికేం లేదు.ఈ రోజంతా ఈ కథే ఉండాలి నా మెదడులో!

  మెచ్చుకోండి

 9. నేను జీవితంలో (ఎక్కువకాకున్నా) చదివిన కధల్లో చాలా కొద్దిసార్లు మాత్రమే కనబడిన “అర్థవంతమైన ఫెమి‘నిజం’” ఇక్కడ కనబడింది. సామాజిక వివక్షని ఇంత సూటిగా-సున్నితంగా, అమాయకంగా-అధికారికంగా,అసహనంగా- అంతర్లీనమైన తిరుగుబాటుగా చెప్పిన వివేకవంతమైన కథ ఇది.

  కాకపోతే, పరిమళ ఆలొచిస్తూ నిద్రపోవడంతో కథ ఆపుంటే మరింత open ended గా ఉండి నిగారించి ఉండేదనిపించింది. ఆ తరువాత రాసినదాంట్లో ఒక సెంటిమెంటల్ వాల్యూవచ్చింది. కానీ, పైనచెప్పిన లోతు తగ్గించింది. అది నా అభిప్రాయం మాత్రమే. నేను కథలో ఎటువంటి మార్పు కోరడం లేదు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s