కళాప్రపూర్ణ డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు

కళాప్రపూర్ణ డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు (డిసెంబరు 21, 1917-డిసెంబరు 1, 1996)

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావుగారిచేత సాహితీరుద్రమఅనిపించుకున్న కళాప్రపూర్ణ, ఆంధ్రసరస్వతి, ధర్మప్రచారభారతి,  డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారికి రుద్రమ అన్న బిరుదు స్వభావోక్తి. కాకతి రుద్రమ కత్తి ఝళిపించినట్టే లక్ష్మీకాన్తమ్మగారు కలం ఝళిపించారు అని మాత్రమే కాదు. క్షాత్రధర్మాలయిన కత్తిసామూ, కర్రసామూ, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చి ధైర్యమూ, స్థైర్యమూ కూడా సంతరించుకున్న విదుషి. 

ఏడవ ఏటనే అన్నగారితో పాటు గాత్రం, వీణా ప్రారంభించిన లక్ష్మీకాన్తమ్మగారు పదిహానేళ్లు నిండేవేళకి, కవితలల్లుతూనే, కుట్టుపనీ, ఎంబ్రాయిడరీ, నాట్యంవంటి కళలు నేర్చినా, వంట మాత్రం నేర్వలేదట. బాపట్లలో కాపురం పెట్టినతరువాత భర్త హయగ్రీవగుప్తగారు నేర్పేరని రాసుకున్నారు స్వీయచరిత్రలో.

 

బాల్యంలో అన్నదమ్ములతో గోళీకాయలూ, కోతికొమ్మచ్చీ అడుతూ స్వేచ్ఛగా ఆరుబయట గడిపిన ఆమెకి సభల్లో, సాంఘికసేవలో పాల్గొనడానికి కావలసిన చిత్తస్థైర్యం తేలిగ్గానే అలవడినట్టు కనిపిస్తోంది. 

ఆమె పన్నెండవయేటనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం, ఉత్తేజపూరితమయిన దేశభక్తిగేయాలు పాడడం చేసేవారుట.

 

బంగారురేకులు అద్దిన పెరుగన్నం, కుంకుమపువ్వు రంగరించిన వేడిపాలు తాగించే నాయనమ్మగారిదగ్గర అల్లారుముద్దుగా పెరిగారు. చిన్నప్పడే కామాక్షమ్మగారి ప్రోత్సాహంతో ఆంధ్రయువతీ సంస్కృత కళాశాల (ముందు చెప్పుకున్న ఆర్యవైశ్యసేవా సదనం ఇదే) లో సంస్కృతం చదువుకున్నారు. 18వ యేట ఉభయభాషా ప్రవీణ పట్టాతో పాటు తెలుగుమొలక, విద్వత్కవయిత్రి బిరుదులు కూడా అందుకున్నారు.  దాదాపు ఆరుదశాబ్దాల సాహిత్యకృషి చేసి పన్నెండు బిరుదులూ, ఇరవై ఘనసత్కారాలూ పొందిన కవయిత్రి. ఆధునిక తెలుగు రచయిత్రులలో కనకాభిషేకం, గజారోహణం వంటి ఘనసన్మానాలు పొందిన కవయిత్రి నాకు తెలిసినంతవరకూ లక్ష్మీకాన్తమ్మగారు ఒక్కరే.

 

 13వ యేట ఊటుకూరి హయగ్రీవ గుప్తగారితో లక్ష్మీకాన్తమ్మగారి వివాహం జరిగింది. 18వ ఏట తొలిసంతానం  కలిగింది కానీ ఆరునెలలు మాత్రమే బతికిందిట ఆపాప. పదకొండుమంది పిల్లలలో ఇప్పుడువున్నవారు ఇద్దరు అమ్మాయిలూ, ముగ్గురు అబ్బాయిలూ.  మంచి చదువులు చక్కగా చదివి జీవితాలలో స్థిరపడ్డారు.

 

లక్ష్మీకాన్తమ్మగారు ప్రముఖ కవి, బ్రహ్మసమాజ మతావలంబి, మధురకవి బిరుదాంకితులు నాళం కృష్ణారావుగారి రెండవసంతానం. తల్లి నాళం సుశీలమ్మగారు వైదికధర్మానురక్త, సంఘసేవాతత్పరురాలు. ఆంధ్ర మహిళా గానసభ స్థాపకురాలు. వరసకి పినతల్లి అయిన బత్తుల కామాక్షమ్మగారు వీరేశలింగంగారి చివరిదశలో 15 ఏళ్ల బాలిక. రాజమండ్రిలో ఆర్యసేవా సదనం స్థాపించి విశేషమయిన ఖ్యాతి వడసిన మహామనీషి. ఈసేవాసదనం తరవాత బాలికా సంస్కృతపాఠశాలగా మార్చబడింది. ఇలాటి వాతావరణంలో పెరిగిన లక్ష్మీకాన్తమ్మగారికి, సాహిత్యం, సంగీతం, సంఘసేవ అక్షరాలా వెన్నతో పెట్టిన విద్యలు అంటే ఆశ్చర్యంలేదు.

 

ఆరుద్రగారు సమగ్రాంధ్రసాహిత్యంలో మోహనాంగీ మొల్లవంటి రచయిత్రులగురించిన సమాచారం లక్ష్మీకాన్తమ్మగారి ఆంధ్రకవయిత్రులు గ్రంథంనుండి స్వీకరించారు. ఆధునికయుగం సంపుటం చివర ఉపయుక్తగ్రంథాల జాబితాలో లక్ష్మీకాన్తమ్మగారిపేరూ, గ్రంథం పేరూ పేర్కొన్నారు. కానీ సమగ్రాంధ్రసాహిత్యం ఆధునికయుగం సంపుటిలో లక్ష్మీకాన్తమ్మగారి సాహిత్యకృషి గురించి గానీ,ఆంధ్రకవయిత్రులు గ్రంథం గురించిన ప్రస్తావన లేదు. నేను ఆరుద్రగారిని తప్పుపట్టడం లేదు. వారి కారణాలు వారికి వుంటాయి. కానీ నేను ఈవ్యాసం రాయడానికి మాత్రం అది ఒక కారణమయింది. ఇంగ్లీషులో ఇంకా వివరంగా రాసి తూలిక.నెట్ లో ప్రచురిస్తాను త్వరలోనే.

 

 ఆరుద్రగారు లక్ష్మీకాన్తమ్మగారి సంస్మృతి సంచికలో సంగీతవిద్రుమ సాహతీరుద్రమ అన్న వ్యాసంలో ఈతరం ఆంధ్రరచయిత్రులందరికీ ఇష్టమయిన అత్తగారు అని ప్రశంసిస్తూ, ఆమె స్వీయచరిత్ర ఈశతాబ్దపు తొలిదశకాలంలో సంగీత సాహిత్యాభిరచులతో జాతీయోద్యమపు చైతన్యంగల వున్నత వర్గాల లోగిళ్లలో ఆడపిల్లలు ఎలా పెరిగి పెద్దవారై దేశసేవకు, సంఘసేవకు సాహితీసేవకు అంకితమయ్యారో విశదం చేస్తున్నాయి అంటారు. ఇది పదునైన వాక్యం. అందుకే రాయడం ఈబ్లాగు నేను.

 

ఆమె స్వీయచరిత్ర,సాహితీరుద్రమ అన్న గ్రంథం తొలిపలుకులో తెరిచిన పొత్తంబిది, నా జీవితమందున జరిగిన ఘటనల మొత్తంబిది అని రాసుకున్నారు. నిజానికి ఈపుస్తకం చదివితే కేవలం ఆమెజీవితంలో జరిగిన ఘటనలు మాత్రమే కాదు, ఆనాటి సాంఘికోద్యమాలలో స్త్రీల పాత్రా, సమాజికధర్మాలూ కూడా మనకి అర్థం అవుతాయి. 

 

లక్ష్మీకాంతమ్మ గారి తొలి సంపూర్ణగ్రంధం,ఆంధ్రకవయిత్రులు, ఆమె ఇది రచించడానికి కారణం తెలుగు భాషా సమితి, మద్రాసు, వారు 1953లో ప్రకటించిన పోటీ. మొదట తాను ఆపుస్తకం రచించడానికి సుముఖంగా లేరట. కారణం – వీరేశలింగంగారే తమ కవులచరిత్రలో ఐదారువందలమంది రచయితలని పేర్కొనగా, అందులో ఐదారుగురు మాత్రమే స్త్రీలు. పరిశీలించి చూస్తే నిజంగా వందమంది ఎన్నదగినవారుంటారు. అందులో చెప్పుకోదగ్గ రచయిత్రి ఒక్కరే వుండొచ్చు. అలా ఏ ఒక్కరినో తీసుకుని ఒకగ్రంథం రాయడం నిజంగా రచయిత్రులు లేరని బయట పెట్టుకోడమే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడు బొడ్డుపల్లి పురుషోత్తంగారు మీరు పరిశోధించి మరో పదిమంది వున్నారేమో చూడవచ్చు కదా అంటే, సరేనని పూనుకుని పరిశోధన సాగించారు. గౌతమీగ్రంథాలయం (రాజమండ్రి), సారస్వతనికేతనం (వేటపాలెం), ఒరియంటల్ లైబ్రరీ (మద్రాసు), సరస్వతీ మహల్ (తంజావూరు) లాటి లైబ్రరీలు తిరిగి, ఆనాటి వివిధ పత్రికలూ, గృహలక్ష్మీ, భారతి, హిందూసుందరి వంటి పత్రికలు వందలకొద్దీ తిరగేసి, 264 మంది రచయిత్రులని కనుగొని, గ్రంథస్థం చేసారు లక్ష్మీకాన్తమ్మగారు. తెలుగు సాహిత్యచరిత్రలో సాధికారికంగా ఇంతమంది రచయిత్రులవిశేషాలు పొందుపరిచిన ఘనత లక్ష్మీకాన్తమ్మగారిదే. ఆవిడ రచించిన తొలిగ్రంథం ప్రథమ బహుమతి గెలుచుకోవటం మరొక విశేషం. ఇక్కడే మరోమాట కూడా చెప్పాలి. విజ్ఞాన్ కుమార్ నాకు ఆంధ్రకవయిత్రులు ప్రతిలో 86 మంది రచయిత్రులు మాత్రమే వున్నారు. లక్ష్మీకాన్తమ్మగారు తమ ముందుమాటలో రెండవ ముద్రణకి లో ప్రచురణ ఖర్చులూ, కాగితంధరలగురించి రాశారు. కానీ భావి పరిశోధనలకి ఎంతో ఉపయోగకరమైన ఇటువంటి గ్రంథాన్ని ఖర్చులకి వెరచి 264మంది రచయిత్రులనుండీ 86 మందికి కుదించడం విచారించవలసిన విషయం. సాహిత్య ఎకాడమీవంటి సంస్థలు ఇది గుర్తించాలి.

 బాపట్లో కాపురం పెట్టినతరవాత ఒకొక్కప్పుడు అలివికాని వేవిళ్లు అనుభవిస్తూ కూడా భర్త గుప్తగారి సహకారంతో, కుటుంబం సంభాళించుకుంటూనే, వెయ్యి వరకూ ప్రసంగాలు చేశారు. వందలకొలదీ సభల్లో పాల్గొన్నారు. సెనేట్ సభ్యత్వాలూ, అధ్యక్షపదవులూ వంటివి అనేకం అలంకరించారు. అనేక సాంఘికసేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహించారు. ఆమె సాహిత్యకృషి జాబితా ఎనిమిది పేజీలుంది. ఆపైన జాబితాకి ఎక్కనివి ఎన్నో!  

 

బత్తుల కామాక్షమ్మగారు వీరేశలింగంగారి రచనలవల్ల ఉత్తేజితులయి, సంఘసేవకి పూనుకున్నారు. ఆవిడ ప్రేరణతో, లక్ష్మీకాన్తమ్మగారు వైశ్యసేవా సదనం సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీకాన్తమ్మగారి సాన్నిహిత్యంలో నాయని కృష్ణకుమారిగారి వంటి ప్రముఖులు ఎంతో సాహిత్యసేవ చేసారు. లక్ష్మీకాన్తమ్మగారి పరిచయంభాగ్యం నాకు 1968, 1969లలో ఆంధ్రరచయిత్రులసభలలో కలిగింది. ఇలా సజీవమూర్తులనిగురించి ఆలోచించినప్పుడు మన సాహిత్యం, సంస్కృతి నిరంతరంగా ప్రవహించే ఏరు అన్నవాక్యం అర్థవంతమయి తోస్తుంది. (నాకు తెలిసినవారికి తెలిసినవారికి తెలిసినవారికి తెలిసిన వారు అని చెప్పుకుంటాం చూడండి అలాగన్నమాట).. చరిత్ర పాఠాల్లో వీరేశలింగం యుగం, ఆధునిక యుగం అంటూ ఛిన్నాభిన్నంగా, అతుకులబొంతలా కనిపించే సంస్కృతి, ఇలా ఒకొక్క వ్యక్తిని గురించి తెలుసుకున్నప్పుడు, అనుస్యూతమయి సజీవస్రవంతియయై గలగల పారే సెలయేరయి  స్ఫురిస్తుంది. 

 

లక్ష్మీకాన్తమ్మగారి ధార్మికజీవితంగురించి కొంచెం ప్రస్తావించాలి. మొదట్లో తండ్రిని అనుసరిస్తూ బ్రహ్మమతం అభిమానించారు. అత్తవారింట వైదిక ఆచారాలను పాటిస్తారు. ఒకసారి వారింటికి అతిథిగా వచ్చిన వైష్ణవభక్తుడు ఆదివరాహాచార్యులవారి బోధనలతో లక్ష్మీకాన్తమ్మగూరు కూడా వైదిక మతాచారాలను పాటించటం ప్రారంభించారని కుమార్తె సుహాసిని సంస్మృతిలో రాసేరు. లక్ష్మీకాన్తమ్మగారు తాను కఠిననియమాలతో కూడిన పూజలూ వ్రతాలూ ఆచరించాననీ, దైవసాక్షాత్కారాలు పొందాననీ స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.

 

1988లో గుప్తగారు చనిపోయినతరవాత, భర్తృవియోగం తాలూకు దుర్భరవేదన అనుభవిస్తూ కూడా, సాహితీమిత్రుల మాట కాదనక, సభలకి హాజరయి ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇస్తూ వచ్చేరు. కెనడా, అమెరికా, జపాన్, జకొస్లేవికియా వంటి అనేక దేశాలు సందర్శించి, ప్రముఖ విదేశీపండితులతో సాహిత్య చర్చలు, తనకి వచ్చీ రాని ఇంగ్లీషులోనే చర్చలు జరిపి, వారి మన్ననలు పొందేనని రాశారు స్వీయచరిత్రలో. 

 

తన జీవితం తెరిచిన పొత్తంబిది అని చెప్పుకున్న లక్ష్మీకాన్తమ్మగారి జీవితంలో సామాన్యులకి సైతం తటస్థపడే ఘట్టాలు ఒకటి రెండు కనిపిస్తున్నాయి.

ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో ప్రతిసారీ తనకే ప్రధమస్థానం రావడం గిట్టని విద్యార్థులు కొందరు కామాక్షమ్మగారితో ఆమెమీద చాడీలు చెప్పేరుట. అవి విని కామాక్షమ్మగారు లక్ష్మీకాన్తమ్మగారిమీద  కోపం తెచ్చుకున్నారుట. ఇలా మొదలయిన మనస్ఫర్థ చివరివరకూ కొనసాగడం విచారకరం. అలాగే, కనుపర్తి వరలక్ష్మమ్మగారు తన మహిళా హితైక మండలిలో ఒక సభ్యురాలు సమయానికి చందా కట్టలేదని, ఆమె సభ్యత్వం రద్దు చేసినప్పుడు, లక్ష్మీకాన్తమ్మగారు అది అన్యాయమని ఉద్యమం లేవదీసి, వరలక్ష్మమ్మగారిమీద విశ్వాసరాహిత్యతీర్మానం ప్రతిపాదించేవరకూ పోయింది. ఊరిలో పెద్దలందరూ కల్పించుకుని వారిద్దరిమధ్య తిరిగి సయోధ్య కలిగించడానికి ప్రయత్నిందారు కానీ పూర్వమున్న ఆత్మీయత మళ్లీ ఎన్నటికీ తిరిగి రాలేదని రాసారు లక్ష్మీకాన్తమ్మ గారు.

 

విశిష్టవ్యక్తిత్వంగల మహితాత్ముల్లో కార్యం సాధించాలన్న దీక్షతో పాటు, పట్టుదలలు కూడా మంకుపట్టుదల అనిపించే స్థాయిలోనే వుంటాయేమో ఒకొకపుడు. పట్టూ విడుపూ వుండాలి వంటి మాటలు మనలాటి సామాన్యులకే కానీ పెద్దలకి వర్తించవేమోననిపిస్తుంది ఇలాటి కధలు విన్నపుడు. కానీ ఇలాటికథలమూలంగానే, ఒకరకమైన తృప్తి కూడా కలుగుతుంది. మానవనైజం అనుకుని సాంత్వన పొందుతాం.  (ఇలాటివి నాకూ అనుభవమే మరి)

 

లక్ష్మీకాన్తమ్మగారు చిన్నతనంనుండీ ఘనాపాఠీ పండితులమధ్య పెరిగారు. చిన్నవయసులోనే మనుచరిత్ర, వసుచరిత్ర, కుమారసంభవం వంటి ప్రబంధాలూ, మహా కావ్యాలు చదివారు. అమె అర్థవివరణలకి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేవారట.

ఆమె సదా నవ్వుతుంటారుట. పిలకా గణపతిశాస్త్రిగారు, అప్పటికింకా చిన్నవారు, క్లాసులో ఆమె నవ్వు చూసి తికమక పడ్డారుట. తరవాత లక్ష్మీకాన్తమ్మగారి నవ్వుని గురించి వ్యాఖ్యానిస్తూ ఆనవ్వులో నేను కాళిదాసమహాకవి ప్రదర్శించిన గంభీరార్థాలను, సౌందర్యాలనూ ఏరుకొని ఆ అమ్మాయ తెలివితేటలను మనసులోనే ఆశీర్వదించేవాణ్ణి అన్నారాయన ఆమెతండ్రి కృష్ణారావుగారితో.

 

ప్రముఖ కళాకారుడు, కవి సంజీవదేవ్ ఒకసారి లక్ష్మీకాన్తమ్మగారితో మాటాడుతూ,నాదృక్పథాలలో మీరు సమర్థించనివేవో ఒకటి, రెండు చెప్పమని ఆమెని అడిగారట. అప్పుడు కూడా లక్ష్మీకాన్తమ్మగారు గంభీరతతో కూడుకున్న నవ్వు నవ్వేరుట. అప్పుడు సంజీవదేవ్‌‌గారికి కూడా నవ్వొచ్చింది. అలా వాళ్లిద్దరూ కొంచెంసేపు నవ్వులు నవ్వుకున్న తరవాత,మీరు భౌతికవాదులా, అంతర్మఖవాదులా తెలుసుకోవాలని వుంది అని లక్ష్మీకాన్తమ్మగారు అడిగారు. సంజీవదేవ్ గారు వివరించిన తరవాత,ఇప్పుడు అర్థం అయింది, మీరు ఉభయవాదులు అన్నారుట లక్ష్మీకాన్తమ్మగారు. ఇంతకన్నా వివరంగా ఇక్కడ రాయడం కష్టం. సంస్మృతి సంచిక పుటలు 143-45 చూడండి.  

 

లక్ష్మీకాన్తమ్మగారు రాసిన గ్రంథాల్లో కొత్తదనం చూపిన రచన సరస్వతీసామ్రాజ్య వైభవము. ఇది లక్ష్మీకాన్తమ్మగారి ఊహాజనిత నాటిక. మొల్ల, తిమ్మక్క, మోహనాంగి, రంగాజమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి పలువురు ప్రముఖ రచయిత్రులు చేసిన సభ. అందులో లక్ష్మీకాన్తమ్మగారు సరస్వతిపాత్ర ధరించారు. తొలిసారి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.

 ఆమె రచించిన కన్యకమ్మనివాళి పేరులో సాంప్రదాయక రచన అనిపించినా, నిజానికి ఈనాటి సామాజికధోరణుమీద విసుర్లతో కూడిన వ్యంగ్యాత్మక రచన. దీనికి స్ఫూర్తి ఆరుద్రగారి కూనలమ్మపదాలు అని రాశారు ఆమె.

 

          పద్యకవితలు బూజు

          పదకవిత్వమె మోజు

          కథలు వ్రాస్తే ప్రైజు

                   ఓ కన్యకమ్మా.

          తిండి చాలక శోష

          భాషకోసం ఘోష

          ఎందుకు కంఠశోష

                   ఓ కన్యకమ్మా

 

          తాగుతాడు హమేషా

          వాగుతాడు తమాషా

          వాడేను షా హంషా

                   ఓ కన్యకమ్మా

 

లక్ష్మీకాన్తమ్మగారి కృతులగురించి రాయవలసింది ఎంతో వుంది.

ఆవిడ స్వీయచరిత్ర చదివి పక్కన పెట్టిన తరవాత నాకు, పైన వుదహరించిన ఆరుద్రగారివ్యాఖ్యానం మరొకసారి స్ఫురణకి వచ్చింది. పుట్టినిల్లూ మెట్టినిల్లూ కూడా జమీందారులు. అంచేతే వారి రచనా, జీవనసరళీ కూడా ఒక ప్రత్యేకత సాధించుకున్నాయి. లక్ష్మీకాన్తమ్మగారి సాహిత్యకృషి, సంఘసేవలలో సాంప్రదాయకవైభవంతో పాటు ఆధునికమైన భావజాలం కొంతవరకూ కనిపిస్తాయి.  

సాహితీరుద్రమ చదివితే, లక్ష్మీకాన్తమ్మగారు ఆవిష్కరించుకున్న లక్ష్మీకాన్తమ్మగారు గోచరమవుతారు. సంస్మృతి చదివితే, బంధువర్గం, సాహిత్యంలో, సంఘంలో ఆప్తులు గ్రహించిన లక్ష్మీకాన్తమ్మగారు కనిపిస్తారు. లక్ష్మీకాన్తమ్మగారి కృతులు చదివితే మీకే తెలుస్తుంది లక్ష్మీకాన్తమ్మగారి పరిపూర్ణ వ్యక్తిత్వం.

లక్ష్మీకాన్తమ్మగారి పుస్తకాలు archive.org లో దొరుకుతాయి. లింకు ఇక్కడ

 (అడిగిన వెంటనే లక్ష్మీకాన్తమ్మగారి పుస్తకాలు పంపిన విజ్ఞాన్ కుమార్‌గారికి కృతజ్ఞతలు).

 

(తూలిక.నెట్ అక్టోబరు, 2008 లో తొలిసాగి ప్రచురితం.)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “కళాప్రపూర్ణ డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు”

 1. శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారి గూర్చిన వ్యాసం చాలా వివరంగా ఉందండి. మాతరానికి అందని ఆ గొప్ప రచయిత్రి గురించీ, వారి సాహితీసేవ గురించి చక్కగా తెలియచెప్పారండి. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. @ సౌమ్య, లేదు. రెండు పుస్తకాలు లేవు. ఆంధ్రరచయిత్రులు అన్నది నాపొరపాటు. లక్ష్మీకాన్తమ్మగారు రాసిన పుస్తకం పేరు ఆంధ్రకవయిత్రులు. ధన్యవాదాలు. పన్లో పనిగా నీకు ఈ పుస్తకం కావలస్తే, ఆర్కైవ్.ఆర్గ్ లో ఉంది.

  మెచ్చుకోండి

 3. “కానీ సమగ్రాంధ్రసాహిత్యం ఆధునికయుగం సంపుటిలో లక్ష్మీకాన్తమ్మగారి సాహిత్యకృషి గురించి గానీ, “ఆంధ్రరచయిత్రులు” గ్రంథం గురించిన ప్రస్తావన లేదు”
  -ఆంధ్ర రచయిత్రులు, ఆంధ్ర కవయిత్రులు అని రెండు పుస్తకాలు రాసారా వీరు??

  మెచ్చుకోండి

 4. సత్యవతి గారూ,
  నమస్కారం. మీరు అచ్చమాంబగారిమీద మోనోగ్రాఫ్ రాయడం ఆనందదాయకం. అబలాసచ్చరిత్ర రత్నమాల మీదగ్గరుందంటే నాకు ఆశ్చర్యం, ఆనందం కూడా. ఆమధ్య మరెవరో కూడా అడిగేరు. అది ఇప్పుడు ఎక్కడయినా దొరుకుతుందా. లేకపోతే, తిరిగి ప్రచురించే అవకాశాలేమైనా ఉన్నాయా? లేదా, మీరు e-Book గా ప్రచురించగలరా. ఆపుస్తకానికి సాహిత్యచరిత్రలో ప్రత్యేకస్థానం ఉందండీ. తప్పకుండా నలుగురికీ అందుబాటు అయేలా చూడమని నా ప్రార్థన.
  పోతే, నాదగ్గర అంతకంటే సమాచారం ఏమీ లేదండీ. నేను మీకు ఇవ్వగలసూచనలు కూడా ఏమీ లేవు విషయచర్చలో. ఏమైనా గుర్తొస్తే మళ్ళీ రాస్తాను.
  మీ కృషి విజయవంతం కావాలని కోరుకుంటూ,
  మాలతి

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ
  నమస్కారం.ఊటుకూరి వారి మీద వ్యాసం బావుంది.
  ముఖ్యంగా మీకు రాయునది ఏమిటంటే సి పి బ్రౌన్ అకాడెమి వారి కోరిక మీద నేను భండారు అచ్చమాంబ గారి జీవిత చరిత్ర రాస్తున్నాను.120 నుంచి 150 పేజీలు రాయాలని సంకల్పం.
  ఆవిడకు సంబంధించి హిందూ సుందరి,అబలా సచ్చరిత్ర రత్నమాల,సంగిసెట్టి ఇటీవల వేసిన పుస్తకం,అచ్చమాంబ కధల్లో ఏముంది అని మీరు రాసిన వ్యాసం,ఆంధ్ర కవయిత్రులు నా దగ్గరున్నాయి.
  కొమర్రాజు లక్ష్మణ రావు గారి జీవిత చరిత్రలు సంపాదించే పని లో ఉన్నాను.
  మిమ్మల్ని కోరేదేమిటంటే మీ దగ్గర ఏమైనా సమాచారముందా?
  ఏమైనా సూచనలివ్వగలరా?
  మీకున్న అపారమైన అనుభవంతో ఏమైనా సలహాలివ్వగలరా?

  నమస్కారాలతో
  సత్యవతి కొండవీటి

  మెచ్చుకోండి

 6. ‘andhra rachayitrulu’, ‘naa videshi paryatana anubhavalu’ ‘andhrula keerthana vangmaya kalaseva’, ‘kanthi sikharalu’, ‘sadukthi manjari’, ‘samskruti’, ‘kanyakamma nivali’, ‘saraswathi samrajya vaibhavam’, ‘na telugu manchala’
  -ఇవన్నీ డీఎల్లై లో ఉన్నాయి. ’సాహితీ రుద్రమ’ కూడా చూసినట్లే గుర్తు.

  మెచ్చుకోండి

 7. @ సిరిసిరిమువ్వ – తప్పులూ, పేరాలూ సరి చేసానండీ. థాంక్స్.
  @ సౌమ్యా – మళ్లీ అచ్చువేసే ప్రయత్నాలేమీ కనిపించడంలేదు. మీలాటివాళ్లు పూనుకుని గలాటా లేవదియ్యాలి. అందుకే రాసేను ఈ బ్లాగు. థాంక్స్.
  @ సుజాతా – సరే మరి. ఇప్పుడయినా చదువుతున్నావా ఆవిడ రచనలు. బజారులో దొరక్కపోవచ్చు కానీ లైబ్రరీలలో తప్పకుండా వుంటాయనుకుంటాను.

  మెచ్చుకోండి

 8. చాలా బాగుంది మాలతి గారు! నేను స్కూల్లో ఉన్న రోజుల్లో ఒకసారి ఆమెకు మా స్కూల్లో సన్మానం చేసారు. అప్పుడు ఆవిడ గురించి కానీ ఆమె సాహితీ సేవ గురించి కానీ తెలీని వయసు!

  చాలా మంచి విషయాలు చెప్పారు.

  మెచ్చుకోండి

 9. బాగుందండీ పరిచయం.
  బ్లాగు template మారిన విషయం ఇప్పుడే చూస్తున్నాను.
  మరి… ఈ “సాహితీ రుద్రమ” లాంటి పుస్తకాలు…ఇప్పుడు కూడా తిరిగి అచ్చు వేస్తున్నారా? అలాంటి ప్రయత్నాలేమైనా ఉన్నాయా?

  మెచ్చుకోండి

 10. మంచి పరిచయం. అక్కడక్కడా కొంచం అప్పుతచ్చులు కనిపిస్తున్నాయి.
  మీరేమి అనుకోకపోతే ఒక్క మాట, పేరాల ఆర్డరు కొంచం మారిస్తే వ్యాసం ఇంకా బాగుంటుంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.