శివుడాజ్ఞ కొత్తకథ

(ఈకథకి రెండు ముగింపులు. మీకు ఏది సరి అయిన ముగింపు అనిపించిందో చెప్పండి. మూడో ముగింపు కూడా వుందనుకోండి. అది మీరు ఊహించుకుంటారని రాయలేదు.. మాలతి)

ఆరోజు మంగళవారం. శివరావుపూజకి దీపాలు, పువ్వులూ, కర్పూరం సమకూరుస్తోంది సుమన. కానీ మనసంతా మరోచోట వుంది.  

రెండు రోజూలక్రితం అత్తయ్యగారు మిల్వాకీనించీ ఫోన్ చేశారు ఇక్కడికి వచ్చి మూడు రోజులయిందనీ, మరో వారం రోజులు వుండొచ్చనీ. ఆమాట  తెలిసిందగ్గర్నుంచీ ఆమెని మళ్లీ చూడాలని ఒకటే తహతహగా వుంది. ఆమాట శివరావుకి చెప్పింది కూడాను.

 అంతకుముందు అత్తయ్యగారు న్యూయార్కునించి ఫోను చేసినప్పుడు కూడా చెప్పింది అతనికి.

అలాగే. తప్పకుండా ఆవిడని చూడ్డానికి వెళ్దాం అన్నాడతను. అతనికి తెలుసు ఆ అత్తయ్యగారంటే సుమనకి ఎంత అభిమానమో. పైగా దేశం వదిలి ఇంత దూరం వచ్చేక ఆవూరి కాకి కనిపించినా తుళ్లిపడుతుంది హృదయం. దూరాలు మనుషుల్ని ఎంత దగ్గర చేస్తాయో తెలియాలంటే కొన్నాళ్లు విదేశీవాసం చెయ్యాలి. అందులోనూ అమెరికా అయితే మరీ తేలిక అయినవారికోసం ఆర్తి స్ఫష్టం కావడానికి. 

శివరావు స్నానం చేసి, బట్టలు మార్చుకుని దేవీస్తవం చదువుకుంటూ గదిలోకి వచ్చేడు. అమెరికా వచ్చి ఆరేళ్లయింది. మూడుగదుల వాటా తీసుకుని అందులో ఒకగది పూజగదిగా అమర్చుకున్నారు. సుమనకి అంత పట్టింపుల్లేవు కానీ శివరావుది నిప్పూ నీళ్లూ కడిగే వంశం. నిత్యపూజలవల్లే తాను ఇంత అభివృద్ధి సాధించేనని గట్టిగా నమ్ముతాడు అతను.   

శనివారం ఏమయినా పనుందా?” అనడిగింది సుమన తనలో తను మాటాడుకుంటున్నంత నెమ్మదిగా.

శివరావు దేవీస్తవం ఉచ్చరిస్తూ తలూపేడు అవునో కాదో తెలీకుండా.

సుమన వూరుకుంది. ఆసమయంలో అడగడం తనదే పొరపాటు. జవాబులు వచ్చే సమయం కాదది. కానీ మనసు ఆచుకోలేక అడిగింది. నిజానికది ప్రశ్న కాదు. మొన్నటినించీ సూచా వాచా తెలియజేస్తూనే వుంది రానున్న శనివారం మిల్వాకీ వెళ్తే బాగుంటుందని.

చిన్నప్పుడు చల్లటి సాయంసమయాల చక్కని కథలు చెప్పిన అత్తయ్యగారు మిల్వాకీ వచ్చేరు. అంతకుమున్ను న్యూయార్కులో వుండగా ఆవిడే ఫోను చేసి చెప్పేరు. అంతకుపూర్వం కథ ఏమిటంటే అత్తయ్యగారు కాలిఫోర్నియాలో వున్న కొడుకు రాంబాబుని చూడ్డానికి వచ్చారు. అక్కడినించీ న్యూయార్కు వచ్చేరు కోడలి అన్నగారు ఈస్టుకోస్టు చూపిస్తాను రమ్మని పిలిస్తే.

ఆకోడలి అన్నగారి ఇంటిలో తెలుగుజ్యోతి పత్రిక తీసి చూస్తూంటే సుమన పేరు కనిపించింది. ఆవిడ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోతూ అయ్యో, ఈ పిల్లిక్కడుందా? మాఅమ్మాయిలాటిదే. ఇంతప్పటినుండీ తెలుసు నాకు ఈ పిల్లని. మాయింటికి రోజూ వచ్చేది, అన్నారావిడ ఎడంచేయి గాలిలో మూడడుగులు ఎత్తి చూపుతూ.

ఆవెంటనే ఆయింటాయన చకచకా ఇంటర్నెట్టేక్కేసి, జాలంలో గాలంవేసి సుమన అజా పజా ఎక్కలాగి, అక్కడ కనిపించిన నెంబరుకి ఫోను చేసేడు. 

సుమన ఇంట్లోనే వుంది. ఫోను తీసి హలో చెప్పింది.

వెంటనే అవతలినుండి మీచిన్ననాటి నేస్తం ఇక్కడున్నారు, వుండండి ఫోను ఆవిడకి ఇస్తాను అని సుమన జవాబుకి ఎదురుచూడకుండానే అవతలివేపు మాయమయిపోయేడు.

సుమన ఈ స్నేహితురాలెవరయి వుంటారు చెప్మా అనుకుంటూ తికమక పడుతూ, ఎదుటనున్న గోడా, ఆపక్కనున్న కిటికీ, ఆకిటికీలోంచి కనబడుతున్న చెట్టూ, చెట్టుమీద పిట్టా చూస్తూ కూచుంది ఫోను పట్టుకుని అయిదు నిముషాల పాటు. గోదారీ గట్టుందీ పాట కూడా గుర్తొచ్చింది. గోదావరి కనపళ్లేదు కానీ …

మరో అయిదు నిముషాల తరవాత మళ్లీ ఆయనే వచ్చి, హలో సారీ చెప్పి, ఉండండి ఇప్పుడే వస్తున్నారు అని చెప్పి మళ్లీ ఫోను బల్లమీద పెట్టేశాడు.

సుమనకి అయోమయంగా వుంది. తన స్నేహితులందర్నీ పేరు పేరునా తలుచుకుంది కానీ ఎవరా అన్నది తెగలేదు. తన స్నేహితులయితే తనకి ఆర్నెల్లముందే తెలిసేది. వాళ్లక్కడ ఇండియాలో వీసా అందుకోగానే, ఇంకా అంతకుమున్నే తనకి ఆఘమేఘాలమీద వార్త అందజేసి వుండేవాళ్లు,

ఆఖరికెలాగైతేనేం, ఫోనులో హలో వినిపించింది. రవంత పెద్దతనం వుంది గొంతులో.

సుమన హలో అని ఎవరండీ అంది సందేహిస్తూ.

నేనమ్మా, అత్తయ్యగారిని. గుర్తున్నానా? రోజూ సాయంకాలాలు మాయింటికి వచ్చేదానివి.

అత్తయ్యగారా! అయ్యో మిమ్మల్ని మర్చిపోతానా, ఎప్పుడొచ్చారు? ఎక్కడున్నారు?” అంది హడావుడిగా ముందు ఉలికిపడి, తరవాత ఎగిరి గెంతేసినంత పన్చేస్తూ. కాళ్లు భూమ్మీద ఆన్లేదు మరింక. 

అవునమ్మా. రాంబాబు ఇప్పుడు కాలిఫోర్నియాలో వున్నాడు కదా. ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశానికి వచ్చేను. అన్నారు. ఆవిడ కూడా ఆపిల్ల తనని గుర్తు పెట్టుకున్నందుకు పొంగిపోయారు.

బాగుందండీ. మీ గొంతు వింటుంటే నాకు మళ్లీ మీ వంటింటిలో కూర్చున్నట్టే వుంది, అంది సుమన. 

నువ్వెక్కడున్నావు. ఇక్కడికి దగ్గరేనా?” అని అడిగారావిడ.

లేదండీ. మాకు న్యూయార్కు చాలా దూరం. మీరు షికాగో వస్తే చెప్పండి. మేమే వస్తాం మిమ్మల్ని చూడ్డానికి అంది సుమన.

చికాగోనా. లేదు, చికాగోలో మావాళ్లెవరూ లేరు. మీకు మిల్వాకీ దగ్గర కాదా?”

మిల్వాకీ ఇంకా దగ్గర అత్తయ్యగారూ. చెప్పండి ఎప్పుడొస్తున్నారు?” అంది సుమన ఉత్సాహంగా.

ఇంకా తెలీదమ్మా. అక్కడ మా పెత్తండ్రి మనవరాలు వుంది. రమ్మని తెగ పిలుస్తోంది. ఆఅబ్బాయికి అదేదో కంపెనీలో వుద్యోగం. తనేమో ఇద్దరు పిల్లలని చూసుకుంటూ ఇంట్లోనే వుంటోంది. రమ్మని మరీ మరీ పిలుస్తోంది కానీ నేనే ఆలోచిస్తూన్నా. ఏమిటో ఈ తిరగడాలు.. నానా హైరానాను. అన్నారావిడ ఆయాసపడుతూ.

రండి. తప్పకుండా రండి. నాక్కూడా మిమ్మల్ని చూడాలని చాలా వుంది. నేను మిల్వాకీ వచ్చి మావూరు తీసుకు వస్తాను. మాయిల్లు కూడా మీరు చూడాలి. … ప్రయాణాలు … అవునులెండి. అనుకుంటాం కానీ ఇక్కడా ప్రయాణాలు అంత తేలిగ్గా సాగవు. అంది సుమన హడావుడిగా, 

అత్తయ్యగారిని మళ్లీ చూడాలని మాచెడ్డ తహతహగా వుంది. జరక్కపోవచ్చన్న నిస్పృహ కూడా వెనువెంటే తన్నుకొస్తోంది ఎదలో. పెద్దావిడ, ఆవిడని ఇబ్బంది పెడుతున్నానేమో అని కూడా అనిపించింది ఒక్క క్షణం.  

అవును, ఇక్కడ చెప్పుకోడానికి కార్లున్నాయి, విమానాలున్నాయి. విశాలంగా రోడ్లున్నాయి. లేనిది మాత్రం టైము. రోజుకి ముప్పైయారు గంటలున్నా చాలని వుద్యోగం శివరావుది, ఆపైన సంఘసేవా. ఎవరింట్లో ఏపూజా ఏవ్రతం అయినా ఈయనగారికి పనే. ఏరోజు చూసినా రానున్న మూడువారాలకి బుక్కయిపోయుంటాడు.

ఇప్పుడు అత్తయ్యగారు మిల్వాకీ వచ్చారు. రాగానే ఫోను చేసారు. ఆవిడ పెత్తండ్రి మనవరాలు, రత్నమాల, కూడా ఎంతో చనువుగా ఆవీకెండు తప్పకుండా రండని మరీ మరీ చెప్పింది.

శివరావు ఏవారం ఏంచేస్తాడో సుమన అడగడం మానేసి చాలా రోజులయింది. తనకేదేనా ఆలోచన వున్నా లాభం సున్నా, ముందుగా చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. అతనికెప్పుడూ హఠాత్తుగానే పనులు తగులుతుంటాయి. ఒకొక్కప్పుడు, వూళ్లో అయితేనూ, తెలుగువాళ్లయితేనూ తను కూడా వెళ్తుంది. లేకపోతే అతన్ని తోలేసి, తనపనేదో తను చూసుకుంటుంది. సుమనకి కథలూ, కవితలూ, కంప్యూటరులో తెలుగు బ్లాగులూ, ఆరేళ్ల పండు. … ఇదే లోకం.

పూజా, బ్రేక్ ఫాస్టూ అయేక, బట్టలు మార్చుకుంటూ అన్నాడు, ఈవారం పడదేమో. ఇంకా తెలీదు కానీ మా బాసు ఏదో కొత్త ప్రాజక్టుగురించి మాటాడదాం, అన్నాడు.

అంటే ఆరోజంతా గోవిందా. గాల్ఫ్ కోర్స్లో తప్ప మాటాడలేడా బాసురుడు. పెద్దాయనతో పని కనక వారెక్కడికి రమ్మంటే అక్కడే హాజరవాలి, రాచనేతికి కొంగు పట్టమని …

మళ్లీ అతనే, ఏం, ఏమైనా పనుందా?” అని అడిగేడు.

లేదు. వూరికే అడిగేను అంది సుమన. ఎలాగా జరగదని తెలిసి ఎందుకు చెప్పడం తన మనసులో మాట అనిపించింది. పైగా ఆతనికి ఆమాత్రం గుర్తు లేనందుకు కాస్త నొప్పి కలిగింది కూడా. పండుని కేకేసింది స్కూలికి టైమవుతోందంటూ.

శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకి వచ్చేడు శివరావు ఆఫీసునుంచి. వస్తూనే హుషారుగా హనీ అన్లేదు కానీ అంత సరదాగానూ చెప్పేడు, రేపు మిల్వాకీ వెళ్దాం.

సుమన తెల్లబోయింది.

ఇంత రాత్రమప్పుడు పిలిచి తెల్లారి వస్తున్నాం అంటే వాళ్లేం అనుకుంటారో. వాళ్లకి వీలవుతుందో లేదో కనుక్కోవాలి కదా అంది.

మనమేమీ వాళ్లింట్లో తిష్ఠ వెయడం లేదు కదా. వూరికే చూసి వచ్చేద్దాం. మహా అయితే ఓ గంటసేపు కూర్చుంటామేమో. లంచికి వాళ్లనేం ప్రయత్నాలు చెయ్యొద్దని చెప్పు. అందరం రెష్టారెంటుకు వెళ్దాం. అన్నాడు శివరావు. అతని ధోరణి చూస్తే  రెష్టారెంటులో ఎవరికేం కావాలో  ఆర్డరు చేసేసేడేమో కూడా అనిపిస్తుంది ఎవరికైనా.

సుమన కొంచెంసేపు ఆలోచించి, సరే పిలిచి చూద్దాం, వాళ్లు కానీ వీల్లేదంటే తగువు తీరిపోతుంది అనుకుంటూ ఫోను చేసింది.

రత్నమాల ఫోను తీసి, తప్పకుండా రండి అంది ఆప్యాయంగా.

 సరేనండీ. మేం వచ్చేసరికి పదకొండవుతుందేమో. మీరేం లంచి ప్రయత్నాలు చెయ్యకండి. నాకు అత్తయ్యగారిని చూడడమే ముఖ్యం అంటూ సుమన నొక్కి నొక్కి చెప్పింది.

 అలా అనకండి. మీరు మాఇంటికి వూరికే రమ్మంటే వస్తారేమిటి. అత్తయ్యగారికోసమే అయినా వస్తున్నారు కదా. మా ఇంట్లోనే లంచి. కాదంటే నేను ఒప్పుకోను. అత్తయ్యగారిచేతే చెప్పిస్తాను కావలిస్తే, అంది ఆపేక్ష వుట్టిపడుతూ.

సుమనకి ఆఅమ్మాయి కలుపుగోలుతనం నచ్చింది. హాయిగా అనిపించింది.

మర్నాటి ప్రయాణానికి కావలసినవి సమకూర్చడం మొదలు పెట్టింది.

రాత్రి ఒకంతట నిద్దర పట్టలేదు. ఆనాటి అత్తయ్యగారిల్లూ, ఆవిడ చెప్పిన కథలూ చెప్తూ వేసిన పోపు ఘుమఘమలూ కూడా నిన్నో మొన్నోలా వుంది తలుచుకుంటుంటే. ఆఖరికి ఏరెండు గంటలకో రెప్పలు బరువెక్కుతుండగా, ఇంటిముందు కారు ఆగిన చప్పుడు వినిపించింది.

పక్కకి తిరిగి చూస్తే శివరావు గాఢనిద్రలో వున్నాడు. ఎవరై వుంటారు చెప్మా అనుకుంటుండగానే, టింగ్ టింగ్ మంటూ గంట మోగింది. పక్కనున్న భర్తని కుదిపి లేపుతూ, ఎవరో వచ్చినట్టుంది అని అతనికి చెప్పి, తను లేచి వెళ్లి తలుపు తీసింది.

ఎదురుగా ప్రకాశం, హైస్కూల్లో శివరావు క్లాసుమేటు, నిలబడి వున్నాడు నవ్వు మొహంతో. ఇంటిముందు కారులో వెనకసీటులో తల్లిదండ్రులు కాబోలు వడలిన మొహాలతో కూర్చుని చూస్తున్నారు దీనంగా.

సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడతను విచారిస్తూ. 

లేదు లెండి. ఈవేళలో చేసే పని ఏంవుంటుంది కనక, రండి, అంటూ సుమన తలుపు బార్లా తీసింది.

ప్రకాశం వెను దిరిగి కారుదగ్గరికి వెళ్లి, తల్లిదండ్రులని దిగమని చెప్పి, డిక్కీలోంచి సూట్కేసులు దింపసాగేడు. శివరావు కూడా మంచం దిగి హాల్లోకి వచ్చేడు.

ప్రకాశం మళ్లీ సారీ చెప్పి, తల్లిదండ్రులని విస్కాన్సిన్ డెల్స్కి తీసుకెళ్లి వెనక్కి వెళ్తున్నాం అని చెప్పేడు. నాలుగు రోజులయింది. తిరుగు ప్రయాణంలో పెద్దవాళ్లు సొమ్మసిల్లి పోయారని గ్రహించి, ఈపూట ఇక్కడ పడుకుని రేపు వెళ్దాం అని ఆగేడుట.

మంచిపని చేసావు. ఈవిధంగానేనా నిన్ను చూడడం అయింది. రా, రా. అంటూ హడావుడిగా ఆహ్వానించేశాడు శివరావు.

పెద్దవాళ్లిద్దరూ హమ్మయ్య అంటూ నిట్టూర్చారు. వాళ్లకి ప్రాణం లేచొచ్చింది నిజమైన ఇల్లు కనిపించేసరికి. 

మొత్తంమీద అందరూ ఆకబురూ ఈకబురూ చెప్పుకుంటూ పక్కలెక్కేసరికి నాలుగయింది.

అందరికంటె ముందుగా లేచి, కాఫీ, పెడుతున్న సుమనకి మిల్వాకీ ప్రయాణం సంగతి గుర్తొచ్చింది. అప్పటికే ఎనిమిది దాటింది. హడావుడిగా రత్నమాలని పిలిచి, అనుకోకుండా చుట్టాలొచ్చారనీ, ఇవాళ రాలేమని, పావుగంటసేపు క్షమాపణలు చెప్పుకుంది.

ఫరవాలేదండీ. ఇలాటివన్నీ నాకు అలవాటే. ఇరవై ఏళ్లనుంచీ వున్నాను కదా. మీకింకా కొత్తలా వుంది. మరేం బాధ పడకండి. వీలయినప్పుడే రండి. అంది రత్నమాల. 

తెల్లారి ఒకొకళ్లూ లేచేసరికి తొమ్మిది దాటింది.

పండు తెల్లారే లేచేడు టీవీలో కార్టూనులు చూసుకోడానికి వచ్చి, కొత్తవాళ్లని చూసి, హాల్లోకి గుమ్మందగ్గరే నిలబడిపోయేడు. ఫరవాలేదులే, రా అన్నాడు శివరావు. 

ప్రకాశం తండ్రి రా. పేరేమిటి అని దగ్గరికి పిలిచేరు చనువుగా.

పండు అని సిగ్గుపడుతూ చెప్పి, టీవీదగ్గరగా కూర్చున్నాడు.

టీవీకి అంతదగ్గరగా కూర్చోవద్దని చెప్పేనా అంటూ శివరావు మందలించేడు.

కాఫీలూ, ఫలహారాలూ అయేసరికి పదకొండు.

ఏమిటో వాడి చాదస్తం. ఇది చూడాలి, అది చూడాలి అంటూ ఒకటే రభస. మాకేమో వచ్చే కాలమా, పోయే కాలమా. ఎక్కడ్నుంచి వస్తుంది అంత ఓపిక అంది తల్లి, కొడుక్కి వినబడకుండా ఓకన్ను అటేసి.

ఒకరితరవాత ఒకరు స్నానాలూ, ధ్యానాలు ముగించేసరికి లంచి టైమయింది. ఏకంగా అదే బేక్ఫాస్టు అదే లంచి అంటూ, సుమన కాస్త భారీ ఎత్తున వంటలు మొదలు పెట్టింది.

లంచి అవగానే వెళ్తాం అంటూ ప్రకాశం లేచేడు కానీ శివరావు ఒప్పుకోలేదు. ఇంతకాలం అయింతరవాత వచ్చేరు. అమ్మా, నాన్నగారూ రెస్టు తీసుకున్నట్టు వుంటుంది. ఈరాత్రికి వుండి వెళ్లండి అంటూ ఇన్సిస్టు చేసేడు. ప్రకాశం మొదట కొంచెం మొహమాటపడినా సరే నన్నాడు అమ్మ మొహం చూసి. ఆవిడకి ఇంకా అలసట తీరలేదు..

సాయంత్రం మాటలమధ్యలో మిల్వాకీలో కొత్తగా కట్టిన ఆంధ్రాగుడి మాట వచ్చింది.

ప్రకాశం తల్లివేపు తిరిగి, గుడికి వెళ్దామా. రేపు ఏకాదశి కదా అని అడిగేడు, తల్లి ముందురోజు అన్నమాట గుర్తొచ్చి. అతనికి ఇలా అవసరం అయినప్పుడు తిథి వార నక్షత్రాలు గుర్తొస్తాయి. శివరావుతో మరోపూట గడపగలగడం అతడికి సంతోషమే.

శివరావుకి కూడా ప్రాణం లేచొచ్చింది. అవునండీ. అందరం కలిసి వెళ్దాం. ఏమంటావు అంటూ సుమనవేపు తిరిగి అటునించి అటే మీ అత్తయ్యగారిని కూడా చూసి రావచ్చు అన్నాడు.

ప్రకాశం రండి. అందరం నావాన్లో వెళ్దాం సరదాగా అన్నాడు. కొత్తవాను. అమ్మా, నాన్నలకి సుఖంగా వుంటుందని వాళ్లు వచ్చేముందే కొన్నాడు. దాన్ని ఈవిధంగా సద్వినియోగం చెయ్యడం అతనికి ఆనందదాయకం.

ప్రకాశం తల్లి సందిగ్ధంగా తలూపింది.

సుమన ఇరకాటంలో పడింది. ఇలాటిసమయాల్లో సరేనంటే తప్పు కాదంటే ముప్పు.

మీ వానులో వెళ్తే మళ్లీ మమ్మల్ని దిగబెట్టడానికి మీరు ఇంతదూరం వెనక్కి రావాలి కదా. మీకెందుకు శ్రమ అని ప్రకాశంతో అని, పొద్దున్నే వాళ్లకి రావడం వీలు పడదని చెప్పేను. వాళ్లు మరో పనేదేనా పెట్టుకోవచ్చు. మళ్లీ ఇప్పుడు వెళ్తే బాగుంటుందా అంది శివరావుతో. 

ఫరవాలేదండి. మిల్వాకీ ఎంతదూరం కనక. గంట ప్రయాణం. మరేం చెప్పకండి. పదండి అన్నాడు ప్రకాశం.

శివరావు దానికేంవుంది. వస్తున్నాం అని చెప్తాం. వాళ్లకి వీల్లేకపోతే ఆమాట వాళ్లే చెప్తారు కద. పోనీ, నేను మాటాడతాలే రత్నమాలగారితో అన్నాడు. తాను గొప్ప ప్రోబ్లమ్ సాల్వరునని గట్టినమ్మకం అతనికి.

ఆదివారం తెల్లారి లేచి అందరూ కలిసి ప్రకాశం వాన్లో మిల్వాకీ వెళ్లడానికి నిశ్చయం అయిపోయింది.

ప్రకాశం జీపీయస్ సెట్ చేసేడు పకడ్బందీగా.

శివరావుకీ, ప్రకాశానికీ ఉత్సాహం పట్ట పగ్గాల్లేకుండా వుంది.

ప్రకాశం అమ్మా నాన్నగారికీ ఎప్పుడెప్పుడు ఇల్లు చేర్తామా అని వుంది.

పండుకి ఎక్కడికో వెళ్తున్నాం అన్న సరదేయే తప్ప ఎక్కడికి ఎందుకు అన్న విచారం లేదు.

సుమనకి మనసు ఎలా వుందో చెప్పడం కష్టం.

000

ఆలయంలో అర్చన చేయించి, ప్రసాదాలు పుచ్చుకుని, బయటపడేసరికి ఒంటిగంటవుతోంది.

మీదయవల్ల మేం కూడా ఏకాదశిపూట భగవంతుని దర్శనం చేసుకున్నాం అన్నాడు శివరావు పరమానందంగా.

మాదేం వుంది నాయనా. ఆంతా ఈశ్వరేచ్ఛ. మిమ్మల్ని ఇలా చూస్తాం అని మేం అనుకున్నామా అంది ప్రకాశం తల్లి.

శివుడాజ్ఞ లేందే చీమయినా కుట్టదు. అన్నారు ప్రకాశం తండ్రి.

చీమ ఎందుకు కుట్టదు?” అని అడిగేడు పండు ఏదో కథలా వుందని.

శివుడు ఆజ్ఞ ఇవ్వాలన్నమాట. శివుడు చీమతో నువ్వు ఇప్పుడు కుట్టొచ్చు అని చెప్తే కుడుతుంది. లేకపోతే కుట్టదు అన్నారాయన.

మరి ఎలా తెలుతుంది మనకి శివులాగ్న ఎపుడయిందో?” అన్నాడు పండు.

చీమ కుట్టినప్పుడు తెలుతుంది.

శివులాజన లేదని ఎలా తెలుతుంది?”

కుట్టకపోతే ఆజ్ఞ లేదన్నమాటే.

చెప్పే ఓపిక మీకుండాలి కానీ వాడయి ఆపడండి ప్రశ్నలు అంది సుమన నవ్వుతూ.

పిల్లలు కదమ్మా. అలా అడక్కపోతే మొద్దులంటాం మనమే. అన్నారాయన నవ్వుతూ. ఎనిమిదిమంది మనవలు ఆయనకి మరి.

000

రత్నమాల గారింటిముందు కారాగింది. ఆవిడ అందరినీ నవ్వుతూ ఆహ్వానించింది లోపలికి. హాల్లో కూర్చున్నాక జూస్, కోక్ తెచ్చిచ్చింది.

సుమన కళ్లు అత్తయ్యగారికోసం వెతుకుతున్నాయి.

ముగింపు – 1

మా నానమ్మని ఒక్కపూటలో మిస్సయేరు మీరు. ఈరోజు వుదయమే కాలిఫోర్నియాకి ప్లేను ఎక్కించి వచ్చేను. అంది రత్నమాల నెమ్మదిగా.

సుమన, ఆహా. అలాగా. ఫరవాలేదు లెండి. అంది వెలితిపడ్డ మనసుని దాచుకుంటూ.

మీరు పొద్దున ఫోను చేస్తే ఏం చెప్పాలో తోచలేదు. ఆవిడ లేరు, రావద్దు అని చెప్పలేను కదా అంది రత్నమాల క్షమాపణ ధ్వనిస్తూ.

బుధవారం వెళ్తానన్నారు ఫోనులో మాటాడుతున్నప్పుడు, అంది సుమన అప్పటికీ సందేహం తీరక.

అవును, బుధవారానికే బుక్ చేసేం. నిన్న మామామయ్య, ఇక్కడే వుంటారులెండి, వచ్చి తను ఈరోజు కాలిఫోర్నియా వెళ్తున్నాననీ, నానమ్మ ఈరోజే బయల్దేరితే తోడుంటాననీ చెప్పేడు. ఎయిర్లైన్కి పోన్ చేస్తే అది కూడా మామయ్యే చేసేరులెండి లక్కీగా టికెట్టు మార్చడానికి వీలేనని తెలిసింది. అంచేత ఆవిడ వెళ్లిపోతానంటే నేను సరేనన్నాను. మామయ్య తోడు మంచిదే కదా అని అంది రత్నమాల.

పోన్లండి. అదీ మంచిదే. ఇలాగైనా మీ పరిచయం అయింది కదా. మా వూరు రావాలి మీరు అన్నాడు శివరావు.

అవునండీ. తప్పకుండా రండి. నేను కూడా ఇంట్లోనే వుంటాను, అంది సుమన. అత్తయ్యగారిని చూడలేదన్న కొరతే తప్ప పాపం రత్నమాల ఆదరణలో లోపం లేదు మరి

తిరుగు ప్రయాణంలో మధ్యసీటులో కిటికీపక్కన కూర్చుని ఆలోచిస్తోంది సుమన శివరావుకీ రత్నమాలకీ మధ్య జరిగి వుండగల సంభాషణ.

ఆనుకోకుండా ప్రయాణం అయేమండీ ఇవాళ. నాస్నేహితులతో మిల్వాకీగుడికి వస్తున్నాం.

అలాగా. అక్కడినించి మాయిల్లు ఎంతో దూరం లేదు. మాయింటికి రావాలి మీరు,

ముందు రామని చెప్పేం కదా అంటోంది సుమన

దానికేంవుందండీ. మనలో మనకేమిటి. ఫరవాలేదు రండి.

నేనూ అదే అన్నానండీ తనతో.

లేదా మరో స్క్రిప్టు

అనుకోకుండా ఈరోజు మిల్వాకీ ప్రయాణం తగిలిందండీ. గుడికి వస్తున్నాం.  …

ఇంకేం మరి. రండి మాయింటికి కూడా.

మీకు ఫరవాలేదంటేనే వస్తాం. అట్టే సేపుండం లెండి

గుమ్మంలో అడుగెట్టకుండానే బేరాలు పెడుతున్నారేమిటండీ. మీరసలు రండి. తరవాత చూద్దాం

లంచి మీరేం చెయ్యకండి రెష్టారెంటుకి వెళ్దాం.

ముందు మీరు రండి. తరవాత చూద్దాం భోజనాల సంగతి.

.అదీ కాకపోతే మరోలా సాగి వుండొచ్చు సంభాషణలు. కానీ …

ఎన్ని స్క్రిప్టులు రాసుకున్నా సుమనకి అత్తయ్యగారిని చూడాలని చాలా ఆతురతగా వుందిలాటి మాటలు భర్తనోట వచ్చినట్టు తోచడం లేదు ఆఅమ్మాయి బుద్ధికి. 

అదే క్షణంలో ముందుసీటులో కూర్చున్న శివరావు వెనక్కి తిరిగి, సీట్లసందులోంచి చెయ్యి పెట్టి, సుమన మోకాలిమీద దరువేస్తూ అన్నాడు, డిసెంబరులో ఇండియా వెళ్తాం కదా. అప్పుడు నిన్ను తప్పకుండా విశాఖపట్నం తీసుకెళ్తాను. మీఅత్తయ్యగారిని తప్పకుండా కలుసుకుందాం. ఎంతదూరం కనక, రాజమండ్రిలో రాత్రి రైలెక్కితే తెల్లారేసరికి విశాఖలో వుంటాం.

సుమనకి నవ్వొచ్చింది కానీ నవ్వలేదు.

శివులాన లేదంతే, అన్నాడు పండు రెండు చేతులూ గాల్లోకి ఎత్తి వదిలేస్తూ.

 సుమన బాబువైపు ఓసారి చూసి, భర్తతో సరేనన్నట్టు తలూపి, కిటికీలోంచి చూడసాగింది మహోద్వేగంతో దూసుకుపోతున్న పోతున్న పొలాల్నీ, ఆ పొలాల్లో సినిమాబొమ్మల్లా కదులుతున్న పశువుల్నీ ….

ముగింపు – 2.

అందరూ కూర్చుంటుండగా అత్తయ్యగారు పక్కగదిలోంచి వచ్చేరు.

సుమన మనసు ఎగసిపడింది ఆమెని చూడగానే. రాజరాజేశ్వరీ దేవిలాటి నిండువిగ్రహం. వయసు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా అట్టే మార్పు లేదు అత్తయ్యగారిలో.

ఆదే చిరునవ్వు, అవే కళ్లు ఆపేక్షలు చిప్పిలుతూ. తల మాత్రం బాగా నెరిసిపోయింది. తనకి గుర్తున్నంతవరకూ మంచి నిగనిగలాడే నల్లని కురులు. కొబ్బరినూనె రాసి చక్కగా దువ్వి బిగించి ముడి వేసుకుని మల్లెచెండు తురుముకునేవారు.

సుమన అలా చూస్తూ ఎంతసేపు వుండిపోయిందో. ..

అత్తయ్యగారు దగ్గరగా వచ్చి, మునివేళ్లతో చుబుకం పుచ్చుకుని, ఏదీ చూడనీ, నీ మొహం. పెద్దదాన్ని అయిపోయాను కదూ, కళ్లు సరిగా ఆనవు. బాగున్నావా. వీడు నీకొడుకా. బాగున్నాడు నీపోలికే … అంటూ ఆపకుండా పేరు పేరునా వరసగా్ అందర్నీ పలకరిస్తుంటే, సుమన కళ్లు చెమర్చాయి.

ఆఁ, అవునండీ, ఆయనే మావారు, వీడే మాఅబ్బాయి అంటూ… పొడి పొడి మాటలతో జవాబు చెబుతోంది.

ఎన్నో అడగాలనుంది. ఏదో చెప్పాలనుంది. ఒక్కమాట కూడా రావడంలేదు నోటికి. ..

శివరావూ, ప్రకాశం, వాళ్ల నాన్నగారు వాళ్లకలవాటయిన టాపిక్కులో పడిపోయారు. ప్రకాశం తల్లి సోఫాలో ఒదిగి కూర్చుంది మౌనంగా. ఆవిడకి మొహమాటంగా వుంది ఏం చెప్పడానికైనా చెయ్యడానికైనా.

రత్నమాల భర్త ఇంట్లో లేకపోయినందుకు క్షమాపణలు చెప్పుకుని, సుమన, అత్తయ్యగారివేపు చూసి నవ్వుతూ, అంది, మీడయలాగులు బాగున్నాయి. పదండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. లంచి తిన్నతరవాత మాటాడుకుందురు గానీ అంది వంటింటిలోకి దారి తీస్తూ.

పండు రహస్యంగా, నేను టీవీ చూసుకోవచ్చా అనడిగేడు శివరావుని.

ఎక్కడికొచ్చినా అదేనా. నీకలరుబుక్కులో రంగులెయ్యి అన్నాడు.

వంటింటివేపు నడుస్తున్న రత్నమాల వెనక్కి తిరిగి, చూసుకోనీండి. పిల్లలు కదా. మాపిల్లలు వుంటే బాగుండు. ముగ్గురూ ఆడుకునేవాళ్లు. స్కూళ్లకి వెళ్లిపోయారు అంది రిమోటు అందిస్తూ.  

వంటింట్లో ఏమైనా సాయం చెయ్యనా?” అనడిగింది సుమన.

చెయ్యడానికేం లేదండి. మరో అయిదు నిముషాల్లో అంతా రెడీ. మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటుండండీ. అంది రత్నమాల.

అత్తయ్యగారు సుమన పక్కన కుర్చీలో కూర్చుని, ఎంతకాలానికెంతకాలానికి చూశాన్నిన్ను. ఎంత ఎదిగిపోయావు అంటూ మొదలుపెట్టి, నుదుటిమీద ముంగురులు సవరిస్తూ, నల్లగా, ఒత్తుగా బారెడు జుత్తు, ఒకంతట లొంగేది కాదు జడ వెయ్యడానికి. కత్తిరించేసేవు. మీఆయన కత్తిరించేసుకోమన్నాడా?” అన్నారు.

లేదండీ. ఆయనేం అనలేదు. నాకే ఏదో సుళువు అనిపించి అంటూ అసంపూర్తిగా వదిలేసింది.

అయితే, ఒక్క బిడ్డతో సరిపెట్టేశావన్నమాట. ఎంచేతా .. సుబ్భరంగా సంపాదించుకుంటున్నారు… కడిపెడు బిడ్డల్ని కనాలి గానీ. ఒక కన్ను కన్నూ కాదు, ఒక బిడ్డ బిడ్డా కాదు అనేవారు మాఅత్తగారు.

తెల్లబోయింది సుమన. ఇలాటి సంభాషణ తను ఎప్పుడూ విన్లేదు, వూహించను కూడా లేదు. ఏంచెప్పాలో తోచక వూరుకుంది.

అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు? ఆపెద్ద కారు మీదేనా? .. నువ్వు ఎందుకు వుద్యోగం చెయ్యడం లేదు? మీఆయన వీల్లేదన్నాడా?”

సుమన పెంకె పిల్లాడి గుప్పిట్లో ఇరుక్కున్న పిట్టలా ముడుచుకు పోయి, రత్నమాలవేపు చూసింది పాహి మాం అని చూపులతోనే వేడుకొంటూ. ఆవిడ తలొంచుకుని సీరియస్గా తనపని చూసుకుంటోంది. నవ్వు ఆపుకుంటోందేమో …

ఆఖరికి సుమన వొంట్లో వున్న శక్తినంతా కూడగట్టుకుని, అత్తయ్యగారివాగ్ధాటికి అడ్డుపడుతూ, లేదండీ. ఆయనేం అనలేదు. అసలు ఆయనేం అనరు. అన్నీ నా ఇష్టాయిష్టాలే నావరకూ అంది.

మరి ఇంకేం? ఇక్కడ బేబీసిట్టరులూ, డేకేరులూ అన్ని సదుపాయాలూ వున్నాయి కదా.

మనపిల్లాడ్ని వాళ్లకీ వీళ్లకీ అప్పచెప్పి నేను సాధించేదేం వుంది అనుకున్నానండీ అంది తనేదో తప్పు చేసినట్టు అవిడ అనుకుంటున్నందుకు నొచ్చుకుంటూ.

నేనూ అదే అన్నానండీ అంది రత్నమాల ఇంతసేపటికి నోరు విప్పి.

తరవాత, ప్లేట్లూ, గ్లాసులూ బల్లమీద పెడుతూ, సుమనతో అందరినీ రమ్మని చెప్పండి. అయిపోయింది. అంది.

సుమన బతుకు జీవుడా అనుకుని గబుక్కున ఎగిరి గెంతేసి పక్కగదిలోకి పరారీ అయింది. 

భోజనాలవేళ పిల్లాడికి తినిపించాలన్న నెపంతో అత్తయ్యగారి పక్కన కూచోలేదు కానీ ఎదురుసీటు అయిపోయింది.  తింటున్నంతసేపూ అత్తయ్యగారు సుమనని ఏవో అడుగుతూనే వున్నారు. అల్లుడుగారికి ఆదాయం ఎంత, తాము వుంటున్న ఇల్లు మనదేనా, …

సుమన రత్నమాలవేపు చూసింది, ఇందుకేనేమో ఈవిడ మమ్మల్ని రమ్మని పిలిచింది అనుకుంది. రత్నమాల కూడా ఆ చాదస్తం ఆవిడ ఇక్కడికి వేంచేసేకే తెలుసుకుందేమో. 

తిరుగుప్రయాణంలో కారులో శివరావు సుమన వేపు తిరిగి, అత్తయ్యగారిని చూడ్డం అయింది. యూ హాపీ?” అన్నాడు,.

సుమనకి ఏంచెప్పాలో తోచలేదు.

 

 

000

 

(అక్టోబరు 2008. )

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

25 thoughts on “శివుడాజ్ఞ కొత్తకథ”

 1. లచ్చిమీ, పోనీలే ఆలస్యంగానేనా వచ్చినందుకు సంతోషం 🙂
  శ్రీవల్లీ రాధికా, థాంక్స్. నా వ్యాఖ్య మీ బ్లాగులోనే పెట్టేను.

  మెచ్చుకోండి

 2. ammaa baagundi mee sivudi aajna
  rendu mugimpulu jaragadaaniki possibiliies vunnnayi present situations lo
  kaabati rendoo samnjasame

  hmm ika pote nenu inta late gaa commentadaaniki reason entante maaku ee sites bloked office lo so late ayyindannamaaata :):):)

  మెచ్చుకోండి

 3. శ్రీవల్లీరాధిక గారూ, థాంక్స్. మీ బ్లాగులో ‘అలలు విరిగే చోటు కథ కోసం చూసాను కానీ దొరకలేదు. కథకి మరేదైనా పేరు పెట్టేరా.

  మెచ్చుకోండి

 4. మాలతిగారూ! ముగింపు ఏదైనా మిగతా కథ చదవడానికి బాగుంది.
  శివరావు పాత్ర చాలా సహజంగా వుంది.
  టైటిల్ కి సరిపోవాలంటే ప్రస్తుతానికి మొదటి ముగింపు బాగుంది.
  మీ రెండో ముగింపు చదివితే నా ‘అలలు విరిగే చోటు” కథ గుర్తొచ్చింది.
  అందులో ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య ఇదేవిధమయిన ఇబ్బంది నెలకొంటుంది.
  “తాను గొప్ప ప్రోబ్లమ్ సాల్వరునని గట్టినమ్మకం అతనికి. లాంటి వాక్యాలు మంచి అబ్సర్వేషన్ ని చూపిస్తే..
  “అదే క్షణంలో ముందుసీటులో కూర్చున్న శివరావు వెనక్కి తిరిగి, సీట్లసందులోంచి చెయ్యి పెట్టి, సుమన మోకాలిమీద దరువేస్తూ అన్నాడు” లాంట్ వాక్యాలు కథని కళ్ళ ముందు కనిపించేలా చేశాయి.

  మెచ్చుకోండి

 5. నాకు మొదటి ముగింపే నచ్చింది. రెండో ముగింపు – కథ టైటిల్ కీ దానికీ సంబంధం ఉన్నట్లు కూడా అనిపించలేదు.
  అలా ప్రశ్నలు అడగడం లో అసహజత్వం ఏమీ కనబళ్ళేదు కానీ. ఇవి రెండూ కాక మూడో ముగింపు – నేను అనుక్కున్న ముగింపు నాకు బానే అనిపిస్తోంది. అయితే, “శివుడాజ్ఙ” కీ, ఆ ముగింపుకీ ఏమిటా సంబంధం? అని ఆలోచిస్తున్నా ఇంకా 🙂
  Anyways, beauty of the whole affair is – it can be ended in multiple ways 🙂

  మెచ్చుకోండి

 6. జ్ఞాపకాలే ఒదార్పు,
  జ్ఞాపకాలే మైమరుపు
  జ్ఞాపకాలే నిట్టూర్పు,
  జ్ఞాపకాలే మేల్కొలుపు

  అని అనుకొంటే మొదటి ముగింపు సరి అయినది అనుకోవచ్చు.

  కాని ఇక్కడ అత్తగారి స్థానంలో అమ్మ గారినో ఓ అత్మీయ బంధువునో ఉంచామనుకొండి ఒక రకమైన వెలితి అలా ఉండిపోతుంది. ఆ మాటలు అవీ ఆ తరం వాళ్ళ చాదస్తమండీ. ఇప్పటికిప్పుడు మేము ఫలనా గొప్ప వృత్తిలో ఉన్నాము, కాబట్టి మీ మాట తీరు మార్చుకొండి, అని అంటే మార్తారా? నా స్వానుభవం ఇది.

  మా అమ్మ చెప్పినా వినదు.. ఎక్కడికైన వెళ్తున్నప్పుడు ఆవిడని మేమే పట్టుకోవాలి. కాని మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసేసి అరిచేస్తూ ఉంటుంది. అదో ఆత్మీయత అంతే. సో, జ్ఞాపకాల ఓదార్పుతో పూడ్చలేని వెలితికన్నా కొన్ని సమాధానం చెప్పలేని ప్రశ్నలకి తలవంచి, వారి ఆత్మీయతని అందుకోడం బాగుంటుంది అనిపిస్తుంది. రెండో ముగింపు కూడా సమంజసమే.

  మెచ్చుకోండి

 7. @చదువరి, 🙂 మీరు చెప్పేవరకూ తోచలేదు “ఇక శివుడాజ్ఞ అయిందమ్మా”లో అంతరార్థం. అద్బుతంగా చెప్పేరు. శాడిస్టిక్ అయినా జరగడానకి అవకాశం వున్న యదార్థమే కదా.

  @ కొత్తపాళీ, నెటిజన్, నిజమే. అత్తయ్యగారు మనసు నొచ్చుకున్నట్టు చూపించాలి.
  థాంక్స్

  మెచ్చుకోండి

 8. నేను నా ముగింపును సూచించానండీ.. “ఇక శివుడాజ్ఞ అయిందమ్మా” అనే డవిలాగుతో కథ ముగిస్తాననడంలో నా ఉద్దేశ్యం.. అత్తయ్య గారిని చంపెయ్యడమే 🙂 మరీ శాడిస్టిగ్గా ఉండి నాకే నచ్చలేదులెండి.

  మెచ్చుకోండి

 9. నెటిజన్, చాలా థాంక్స్ మీ అభిప్రాయాలు వివరించినందుకు. మీరన్నట్టు అత్తయ్యగారు మనసుకి నచ్చినవ్యక్తి అని బాగానే ఆవిష్కరించడం జరిగింది. ఆమె ప్రశ్నలు కూడా ఆకోణంనుండే చూడాలి. మనం అందరం కూడా మనకి వచ్చిన, అలవాటయిన భాషలోనే మాటాడతాం. ఆవిడ ప్రశ్నలవెనక ఆంతర్యం వెనకటిరోజుల్లో అలా మాటాడేవారనే. *ఇంతప్పటి పిల్ల* ఇప్పుడు సుఖంగా వుందా అన్న ఆరాటమే ఆమెకొచ్చినభాషలో ఆమె చెప్పింది – అది నేను స్పష్టం చెయ్యలేకపోయానని స్ఫష్టంగానే తెలుస్తోంది :).

  మెచ్చుకోండి

 10. అత్తయ్యగారిని “మళ్లీ చూడాలని ఒకటే తహతహగా వుంది” ఉంది సుమనకి.
  “చిన్నప్పుడు చల్లటి సాయంసమయాల చక్కని కథలు చెప్పిన అత్తయ్యగారు మిల్వాకీ వచ్చేరు.” చిన్నప్పటి అనుభూతులు, జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి అందుకనే సుమనలో ఆ “తహ, తహ”.
  అలాగే, ఆ అత్తయ్యగారిలో కూడా – “… ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోతూ “అయ్యో, ఈ పిల్లిక్కడుందా? మాఅమ్మాయిలాటిదే. ఇంతప్పటినుండీ తెలుసు నాకు ఈ పిల్లని. మాయింటికి రోజూ వచ్చేది,” అన్నారావిడ ఎడంచేయి గాలిలో మూడడుగులు ఎత్తి చూపుతూ.
  “మీ గొంతు వింటుంటే నాకు మళ్లీ మీ వంటింటిలో కూర్చున్నట్టే వుంది,” అంటూ సుమన.
  ఇద్దరి మధ్య ప్రేమ అప్యాయతలకు లోటు లేదు.
  అటువంటి రాజరాజేశ్వరీ దేవిలాటి నిండువిగ్రహం, వయసు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా అట్టే మార్పు లేని అత్తయ్యగారు చిరునవ్వుతో, ఆపేక్షలు చిప్పిల్లుతున్న కళ్ళతో, “ఎంతకాలానికెంతకాలానికి చూశాన్నిన్ను. ఎంత ఎదిగిపోయావు” అంటూ మొదలుపెట్టి, నుదుటిమీద ముంగురులు సవరిస్తూ, “నల్లగా, ఒత్తుగా బారెడు జుత్తు, ఒకంతట లొంగేది కాదు జడ వెయ్యడానికి. ఇంకా అలాగే ఉంది నీ జుత్తు,” అనే అత్తగారు, నీ భర్త జుత్తు కట్ చేసుకోమన్నాడా, “..కడిపెడు బిడ్డల్ని కనాలి,” అనో, “అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు,” అనో లేదా “ఆపెద్ద కారు మీదేనా? .. నువ్వు ఎందుకు వుద్యోగం చెయ్యడం లేదు? మీఆయన వీల్లేదన్నాడా?” అన్న ప్రశ్నల శరపరంపరతో సుమనని ఉక్కిరిబిక్కిరి చెయ్యడం అన్నది ఆ పాత్రకి నప్పలేదు.
  సుమన హతాశురాలవడం సంగతి పక్కన బెడితే, అత్తగారే సుమనని కలిసిన తరువాత దెబ్బతిన్నట్టు ఉంటే కధ ఎలాగుండేదో.
  అలాంటి అత్తయ్యగారు లేరా అంటే ఉంటారు.
  కధకి మీరు రెండు ముగింపులిచ్చి, మూడవది మీరు చెప్పండి అని పఠితను అడిగారు కాబట్టి, అలాఐతే ఎలాఉండేది అని ఒక్క ఆలోచన.
  కధ మీది, మీ అత్తయ్యగారు, మీ సుమన. మీ శివుడి ఆజ్ఞ ..:)

  మెచ్చుకోండి

 11. వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు. ప్రవీణ్, అవునండీ, ఒకవిధంగా ప్రయోగాత్మకమే. Crispness – ఏమోమరి. కథావస్తువు అలాటిది కావడం మూలానేమో.. సుమన అంతర్మథనం కదా కథంతా.
  నేను కూడా చాలామందికి మొదటి ముగింపే నచ్చుతుందనుకున్నాను. ఎందుకంటే రాధిక అన్నట్టు రెండో ముగింపు భయంకరం.
  చదువరి – అత్తయ్యగారు ఫోను చేసి వుండేవారే అన్నమాట కనీసం నావిషయంలో నిజం కాదు.సుమన ఇంట్లో స్నేహితులు వున్నారని చెప్పింది కనక పిలవరు. తరవాత కాలిఫోర్నియానించి తీరికగా పిలవొచ్చులే అని.
  ఎందుకులెండి అన్నవారు అయిదోక్లాసు చదివినవాళ్లు కూడా ఆదాయాలు అడగరు అన్నారు కానీ, వున్నారండీ అలాటివారు కాలేజీలు వెలగబెట్టినవారిలో కూడా.. అంతే కాదు. కథలో ఒకరకమైన వూపు తీసుకురావడానికి అతిశయోక్తులు వాడతాం. అదే ప్రశ్న అడిగారా లేదా అని కాక సుమనకి ఇబ్బంది కలిగించేప్రశ్నలు వచ్చేయి అనే అర్థం. ఉదాహరణకి ఎక్కడ చచ్చావురా పొద్దున్నుంచీ అని అడగడం వినే వుంటారు నిజంగా ఎదుటివాడు చచ్చిపోయివుంటే అలా అడగడం సాధ్యం కాదు కదా.
  సిరిసిరిమువ్వ – . మీప్రశ్నకి- నేను చిన్నప్పుడు ఎలా రాసి వుండేదాన్ని అంటే, నేను ఫోనులూ, కారులూ లేని ఇంట్లో పెరిగాను. అంచేత మొదట ఫోనులు అవుట్. తెలుగుజ్యోతికి బదులు, ఏదో పత్రిక అని రాసేదాన్ని. ఎందుకంటే అప్పుట్లో ఏ పత్రికకి పంపబోతున్నానో తెలీదు కనక. ఇండియాలో అయితే సుమన-అత్తయ్యగారల సమాగమనం జరగక్కపోవడం ఇంకా తేలిక. అంచేత అట్టే తేడా వుండేది కాదనుకుంటా మిగతా కథలో.
  నా adaptation గురించి కూడా ఒకమాట చెప్పాలి. నేను ఎడప్ట్ అయింది చాలా తక్కువండీ. ఉదాహరణకి. ఫోను. నాకు ఫోనులో మాటాడుతుంటే గోడతో మాటాడుతున్నట్టు వుంటుంది. అంచేతే నేనెప్పుడూ ఎవరికీ ఫోను చెయ్యను. చెయ్యవలసివస్తే ప్రాణాంతకం. 
  పోతే, రెండో ముగింపు చాలామందికి నచ్చకపోవడానికి కారణం అది సరిగా నేను డెవలప్ చేయకపోవడమే అనుకుంటాను. ఆమాటే వైదేహి కూడా నాతో అంది. అందులో అత్తయ్యగారికోణం చూపలేదు. ఆమె ప్రవర్తనకి నిజంగా న్యాయం జరగలేదు. అది మళ్లీ రాయాలి.
  తెరెసా, చదువరి మరో ముగింపు ఆలోచించాం అన్నారు కానీ ఏమిటో చెప్పలేదు. నాకు తోచినవి రెండు. 1, సుమన అత్తయ్యగారు కలుసుకుని ఎంతో హాయిగా, సంతోషంగా గడుపుతారు ఓపూట. ఇది శిల్పం దృష్ట్యా ఒప్పించడం కష్టం. . పాఠకులకి తృప్తినివ్వొచ్చు కానీ కొత్తదనం లేక పేలవంగా వుంటుంది.
  మరో ముగింపు దుష్టబుద్ధితో అత్తయ్యగారిని స్వర్గానికి పంపేయడం. సిరిసిరిమువ్వ మీరడిగిన ప్రశ్నకి – ఇదీ 50, 60 దశకాల్లో చాలా ఎక్కువగా జరిగింది. ఒక పాత్రని సృష్టించడం, ఏం చెయ్యాలో తెలీక చంపేయడం. ఆ పద్ధతి మార్చుకుంటున్నాను ఇప్పుడు.
  అదీ కథ. మరోసారి మీఅభిప్రాయాలు వెలిబుచ్చినందుకు కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 12. మాలతి గారూ నాకూ మొదటి ముగింపే నచ్చింది.రెండవ ముగింపు వాస్తవానికి చాలా చాలా దగ్గరగా వుంది.రెండవ ముగింపు నాకు నిజ జీవితం లో ఎదురైతే….ఆమ్మో….భయం గా వుంది.నాకు ఇష్టమైనవాళ్ళని ఇష్టపడలేనన్న ఊహే నాకు భయాన్ని కలిగిస్తుంది.

  మెచ్చుకోండి

 13. ఓహో! ప్రయోగాలు చేస్తున్నారన్నమాట కథలతో. 🙂
  ఒకటి కన్నా ఎక్కువ ముగింపులు ఇవ్వడం బాగుంది. నాకూ మొదటి ముగింపే నచ్చింది. (చదువరి గారు అన్న పాయింటూ సరయినదే)

  ఏమనుకోకపోతే ఎందుకో ఈ కథలో crispness లోపించింది అనిపించింది. ఇదీ అని చెప్పలేను కానీ మాటలో, ఫ్లోనో ఎక్కడో ఏదో మిస్సయిందనిపించింది. ఆలోచించి చెబుతాను.

  కథ చెప్పడంలో నాకు నచ్చే పాయింటు చుట్టుపక్కల పరిసరాల్ని రచయిత establish చేసే విధానం, వ్యక్తుల హావభావాల్ని కూడా కథలో వివరించగలగడం.

  ఉదా: “అయ్యో, ఈ పిల్లిక్కడుందా? మాఅమ్మాయిలాటిదే. ఇంతప్పటినుండీ తెలుసు నాకు ఈ పిల్లని. మాయింటికి రోజూ వచ్చేది,” అన్నారావిడ ఎడంచేయి గాలిలో మూడడుగులు ఎత్తి చూపుతూ.

  మీ లాంటి వారి నుంచి ఇవన్నీ బాగా గమనించాలి.

  మెచ్చుకోండి

 14. మొదటి ముగింపే నచ్చింది నాకు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలగానే మిగిలిపోతేనే అందంగా ఉంటాయి. ఇక్కడ సుమనకి అత్తయ్యగారి మీద ఉన్న అభిమానం జీవితాంతం ఒక మధురానుభూతిలా మిగిలిపోతుంది.
  ముగింపు సంగతి పక్కన పెడితే —–“సుమనకి కథలూ, కవితలూ, కంప్యూటరులో తెలుగు బ్లాగులూ, ఆరేళ్ల పండు. … ఇదే లోకం”………..హ..హ్హ..హ్హ..తెలుగు బ్లాగుల్ని కూడా కథలోకి దింపేసారుగా…….you are too smart. అసలు ఓ రచయిత(త్రి) కి ఉండాల్సిన మొదటి లక్షణం ఇదే, మారుతున్న కాలానికి తగ్గట్టు తన రచనలను మార్చుకోవటం……adaptation….
  ఇప్పుడు మీకో ప్రశ్న(just out of curiosity)—మీరు రచనలు మొదలుపెట్టిన తొలి రోజులలో (అప్పుడు మీ వయస్సు ఓ 25 సంవత్సరాలు ఉంటుందనుకున్నా, అంటే సుమారుగా ఓ 45-50 సంవత్సరాల క్రితం), ఇదే సందర్భాన్ని ఎలా చెప్పి ఉండేవారు.

  మెచ్చుకోండి

 15. అంత హడావుడిగా వెళ్ళే పనైతే అత్తయ్య గారు ఖచ్చితంగా సుమనకు ఫోను చేసి “అమ్మాయ్! ఇలా వెళ్తున్నాను.. నిన్ను కలవకుండా వెళ్ళడం వెలితిగా ఉంది. ఐనా తప్పడం లేదమ్మా…” అంటూ నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళేవారు. అంచేత రెండోదే సరైనదని అనిపిస్తోంది.

  ఇక శివుడాజ్ఞ అయిందమ్మా అనే డవిలాగుతో ముగిసే ముగింపొకటి తట్టింది కానీ.., అది నాకే నచ్చలేదు.

  మెచ్చుకోండి

 16. కొన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతేనే బాగుంటాయి. అత్తయ్యగార్ని కలవలేకపోయిన మొదటి ముగింపే నాకు నచ్చింది మాలతిగారూ. మూడో ముగింపుకి మూడు రకాల ఊహలొచ్చాయి,అన్నీ pessimistic గానే ఉన్నాయి 😦

  మెచ్చుకోండి

 17. Sorry for not giving my email/name but if you do not want to publish this, go ahead. If you want to, fine with me too.

  Even if a lady like attayya garu comes IMO she will *never* ask about the salaries etc because she will know/learn about amrika life quickly, even if she never went to school beyond 5th grade. So again IMO first ending is a better option – attayya garu could not see Sumana. This ending is what happens in a perfect world. But when was the last time world was perfect? So your second ending actually showed the faminine aspect of life – ladies actually do talk this way 😉 No offense intended to you though. Pandu character really ticked the story along in first ending and it actually helps the story title as well.

  Story itself is pretty good. Regards.

  మెచ్చుకోండి

 18. కధయితే చదివాం,కానీ దసరా శెలవులు కదండి,కామెంటు తర్వాత రాస్తామన్నమాట( ఏం రాయాలొ తెలీక అనుకోకండి) 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s