Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India by Peter L. Schmitthenner

 

మామూలుగా ఇంగ్లీషు పుస్తకాలు చదవడం తక్కువ. అందులో కథాసాహిత్యం కానివి మరీ తక్కువ. కానీ ఈపుస్తకం నాదృష్టిని ఆకట్టుకోడానికి కారణం తరవాత చెప్తాను.

19వ శతాబ్దంలో బ్రిటిష్ పండితులు తెలుగుభాష నేర్చుకోడానికి కారణాలు మతప్రచారమూ, పాలనాదక్షత పటిష్ఠం చేసుకోడంకోసం అని అందరికీ తెలిసినదే.

ఆనాటి పాశ్చాత్యపండితులలో ఘనత వహించినవాడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను. బ్రౌనుకీ ఆనాటి ఇతర పాశ్చాత్యపండితులకీ (ఓరియంటలిస్టులు) తేడా బ్రౌను ప్రజలతో మాటాడడానికి వాడుకభాష నేర్చుకోవడంఅవసరం అని గుర్తించడం.

రచయిత పీటర్ ష్మిట్‌హెనర్ బ్రౌన్ జీవితంలో బాల్యంనుండీ చివరివరకూ సంఘటనలు వరుసక్రమంలో తీసుకుని ఆయనని ప్రభావితం చేసిన వ్యక్తులూ, సంఘటనలూ విశ్లేషించాడు ఈపుస్తకంలో. తెలుగుభాష ప్రాచుర్యానికి మాత్రమే కాక, తెలుగువారి సంస్కృతిని అర్థం చేసుకోడానికి బ్రౌను పడిన ఆరాటం, ఆతపనలో ఆయన ఎదుర్కొన్న దుర్ఘటనలూ, సాటి ఓరియంటలిస్టులతో స్నేహాలూ, వైరాలూ, అపోహలూ, ఉద్యోగానికి సంబంధించిన విధులు నిర్లక్ష్యం చెయడం, తన్మూలంగా ఆర్థిక ఇబ్బందులకు లోను కావడం వంటి ఎన్నో విషయాలను సూక్ష్మంగా పరిశీలించి, ఆవిష్కిరించాడు ఈపుస్తకంలో.

ఆరోజుల్లో ఎవరు తెలుగు నేర్చుకోవాలన్నా బ్రాహ్మణ పండితులు ప్రబంధాలతో మొదలుపెట్టేవారట. బ్రౌను ఆచదువు నిత్యజీవితంలో ఉపయోగపడదని గ్రహించి, తనకు తానే స్వయంకృషితో తెలుగు నేర్చుకున్నాడు. తనకి ఉపయోగపడేభాష వేమనపద్యాలలాటి మౌఖికసాహిత్యంలో వుందని గ్రహించి, వేమనపద్యాలు నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆవిధంగా వాడుకభాషకి సాహిత్యస్థాయి కల్పించడానికి బ్రౌను దోహదం చేశాడని చెప్పొచ్చు. ఆసందర్భంలోనే వాడుకభాషకి వ్యాకరణం కూడా రచించడం మొదలుపెట్టేడు. ఆదిని ఆయన ఆపుస్తకం ఉద్దశించింది తెలుగు నేర్చుకోదలచిన పాశ్చాత్యులకోసమే. 

ఓరియంటలిస్టులూ, వారి అధ్వర్యంలో తెలుగుపండితులూ తయారు చేసిన అనువాదాలూ, తెలుగు పుస్తకాలూ కూడా నిత్యజీవితంలో సామాన్యజనులకి అర్థంకాని గ్రాంథికంలో వుండడం బ్రౌను స్వయంగా తెలుగు నేర్చుకోడానికి నిశ్చయించుకున్నాడు. అనువాదం అంటే మాటకి మాట అర్థం రాయడం కాదు, ఆజాతి సంస్కృతీ, జీవనసరళీ క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి అని బ్రౌను గ్రహించి, పాలకుడుగా కాక స్నేహితుడుగా, ఆప్తమిత్రుడుగా స్థిరపడడానికి కృషి చేసేడు అంటాడు పీటర్. “In 1825, I found Telugu literature dead. In thirty years I raised it to life” అని ఆయన గట్టిగా నమ్మి, తెలుగుసాహిత్యాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నాడు.

గ్రాంథికభాష వాడే పండితులని నిరసించిన బ్రౌను వారిలాగే వ్యావహారికభాషవిషయంలో అక్షరదోషాలూ, వ్యాకరణదోషాలగురించి  అంత పట్టుదలా చూపడం చూస్తే నాకు నవ్వొచ్చింది. బ్రౌను కూడా మరొకరకమైన బ్రాహ్మణీకం స్వీకరించినట్టు అనిపిస్తుంది.

బ్రౌన్ మొదట చేసిన పని వాడుకభాషకి వ్యాకరణసూత్రాలు రాయడం. ఆయన చదివిన, వాడుకభాషలో రాసిన మొదటి పుస్తకం ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీయాత్ర చరిత్ర కావచ్చునట. కానీ బ్రౌన్కి ఆపుస్తకంలో నచ్చనివిషయం రచయిత వీరాస్వామి విరివిగా ఇంగ్లీషూ, తమిళపదాలు విరివిగా వాడడం. బ్రౌన్కి భాషాసంకరం సమ్మతం కాదు. తెలుగువాళ్లు మంచితెలుగు రాయాలని బ్రౌను చాలా పాటుపడ్డట్టు కనిపిస్తుంది.

ఆయన తెలుగుని పరిశుద్ధం చేసి [purify], ఒక క్రమపద్ధతిలో తెలుగుభాషని తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నాలలో శాశ్వతంగా స్థిరపడిపోయినవి ప్రింటులో ని తొలగించడం, రకారం ‘L’ లాగ రాయడం అంటాడు పీటర్.

 బ్రౌను తెలుగుఇంగ్లీషు నిఘంటువు, తరవాత ఇంగ్లీషుతెలుగు నిఘంటువు ప్రాచుర్యంలో వున్నగ్రంథాలు. తెలుగు వ్యాకరణం, అనేక ప్రతులు సేకరించి, సమీకరించి, పరిష్కరించి ప్రచురించిన వేమన పద్యాలు. కనీసం యూనివర్సిటీలలో కొందరు తెలుగు సాహితీవేత్తల గమనికలో నిలిచిన పుస్తకాలు, ఇవి కాక, ఇంకా తాతాచార్ల కథలు వంటివి ఎన్నో సేకరించి, ఇంగ్లీషులోకి అనువదించేడు.

అయితే, చాలామంది తెలుగువారిదృష్టికి రాని విషయాలు అసలు తెలుగువారంటే, తెలుగుభాష అంటే బ్రౌన్‌కి అంత ఆసక్తి ఎందుకు కలిగింది, ఆయన క్రైస్తవవిశ్వాసాలకీ తెలుగుసాహిత్యానికీ మధ్య ఏర్పడిన అవినాభవసంబంధం ఎలాటిది, సామూహికంగా, భాష ప్రాతిపదికగా తెలుగువారు ఒక ప్రత్యేక జాతిగా చైతన్యం పొందడంలో బ్రౌన్ పాత్ర ఏమిటి, ఆయనకి తెలుగువారంటే వున్న అభిప్రాయాలేమిటి, కాలక్రమంలో ఆ అభిఫ్రాయాలు ఎలాటి మార్పులు చెందేయి, ఆయన సమకూర్చిన నిఘంటువులకీ, పరిష్కరించి ప్రచురించిన పుస్తకాలకీ వెనక ఆయన పడిన శ్రమ, ఆక్రమంలో ఆయన విషయసేకరణకి చేస్తున్న కాలంలో రూపొందిన అభిప్రాయలూ.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అనేకం పీటర్ నిశితంగా పరిశీలించి గ్రంథస్థం చేసేడు ఈపుస్తకంలో. బ్రౌన్ పండితుడుగానే కాక, ఉప్పూ పులుసూ తినే మామూలుమనిషిగా కూడా దర్శనమిస్తాడు ఈపుస్తకంలో. తనకి తెలుగు పాఠాలు చెప్పిన బ్రాహ్మణపండితులు సాంప్రదాయాలను వదలలేక, ఒకొకప్పుడు కొన్ని విషయాలు గుప్తంగా దాచుకున్నారు అంటాడు. అలాగే పుస్తకాలు ఎరువు అడిగితే కూడా తెలుగువారు ఇవ్వడానకి ఇష్టపడరు అంటాడు. అలాటప్పుడు ఆయన తెలుగులో మర్యాదగా మాటాడితే సంతోషించి తమ పుస్తకాలు ఇచ్చేవారట.

బ్రౌన్ నిర్విరామ కృషిలో చెప్పుకోదగ్గ మరొక విశేషం ఆయన ఎప్పుడూ ఒక ఎడిషన్‌తో తృప్తి పడకపోవడం. ప్రతి పుస్తకం ప్రచురింపబడినతరవాత కూడా మళ్లీ సంస్కరిస్తూనే వుండేవాడట. 

మరొక తెలుగుఇంగ్లీషు నిఘంటువు సమకూర్చిన జె.పి.యల్. గ్విన్ ఆపుస్తకానికి పరిచయవాక్యాలు రాస్తూ, మామూలుగా  బ్రౌనుగురించి ప్రాచుర్యంలో వున్న పరస్పరభిన్నమయిన రెండు అభిప్రాయాలనూ (అద్వితీయమైన సేవ చేసిన ఘనుడని కొందరు పొగిడితే, కేవలం పాశ్చాత్యులకి సర్వసాధారణమైన కపటదృష్టితో చేసాడని మరికొందరు తెగడడం) పీటర్ సాకల్యంగా పరిశీలించి ఆవాదనల వెనక గల కారణాలూ, అవి ఏర్పడడానికి తోడ్పడిన పరిస్థితులనీ సమగ్రంగా చర్చించాడు అని మెచ్చుకున్నారు. ఆమాటల్లో ఎంతో నిజం వుందనిపించింది నాకు పుస్తకం చదివిన తరవాత.

నామాటగా – ఇటీవల గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న తెలుగుభాషని గురించిన చర్చలు చూస్తే, ఒకవిధంగా ఆనాటి వ్యవస్థే మళ్లీ ఇప్పుడు ఉందా అనిపిస్తోంది.  ఈమధ్య బ్లాగుల్లోనూ పత్రికలలోనూ తెలుగుని పునరుద్ధరించాలన్న ఆవేశం కనిపిస్తోంది. క్షీణిస్తోంది అనుకుంటేనే కదా పునరుధ్ధరించాలి అనే వాదం తలెత్తేది. కొందరు తెలుగుభాషయందు తమకు గల అభిమానంతో తెలుగులో రాయాలనీ, తెలుగుకథలు చదవాలనీ మాటాడాలనీ విశేషమైన ఆసక్తి చూపుతుంటే, మరికొందరు మాకు తెలుగురాదని దాదాపు ఆనందించే స్థితిలో వున్నట్టు వున్నారు. ఇది ఒక కారణం నేను ఇప్పుడు ఈపుస్తకం పరిచయం చెయ్యడానికి.

రెండోకారణం ఈపుస్తకం నాకు ఆప్యాయంగా పంపిన పీటర్ యల్. ష్మిట్‌హెనర్ మావూళ్లోనే (మాడిసన్, విస్కాన్సిన్) హిస్టరీ ప్రొఫసర్, బాబ్ ఫ్రికెన్‌బర్గ్‌ ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేశాడు. ప్రస్తుతం వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్‌టిట్యూట్, చరిత్రవిభాగం ఛైర్‌గా పని చేస్తున్నాడు. పీటర్‌కి తెలుగుపాఠాలు చెప్పిన గురువులలో నేను కూడా వున్నాను. పీటర్ తన ముందుమాటలో ఈవిషయం పేర్కొనడం నాకు సంతోషంగా వుంది J.

పుస్తకానికి సంబంధించిన వివరాలుః

Author: Peter L. Schmitthenner

Title: Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India.

324 pages.

Rs. 600.00

Publisher & distributor:

Manohar Publishers and Distributors

4753/23 Ansari Road, Daryaganj

New Delhi 11002

 

(మాలతి.ని. అక్టోబరు 2008.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India by Peter L. Schmitthenner”

 1. నేను ఎందుకో ఇవాళ ఈవ్యాసం మళ్ళీ చదివాను. గత వ్యాఖ్యకీ ఈ వ్యాఖ్యకీ మధ్య కొన్ని బ్రౌన్ లేఖలూ, బ్రౌన్ గుంచి కొన్ని ఇతర perspectives విన్నాను.

  మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాసం చదువుతూ ఉంటే, ఈమధ్యలో కలిగిన ’బ్రౌన్’ జ్ఞానం వల్ల కొంచెం ఆలోచనలో పడ్డాను.
  “గ్రాంథికభాష వాడే పండితులని నిరసించిన బ్రౌను వారిలాగే వ్యావహారికభాషవిషయంలో అక్షరదోషాలూ, వ్యాకరణదోషాలగురించి అంత పట్టుదలా చూపడం చూస్తే నాకు నవ్వొచ్చింది. బ్రౌను కూడా మరొకరకమైన బ్రాహ్మణీకం స్వీకరించినట్టు అనిపిస్తుంది. ”
  – 🙂 Good one!

  The book appears to be very interesting. Is it available in India??

  మెచ్చుకోండి

 2. @ ప్రవీణ్, థాంక్స్.
  @ నెటిజన్, మీరు పనికట్టుకుని వచ్చి చదివినందుకు థాంక్స్. ఇక్కడ విస్కాన్సిన్ లోనే 15 ఏళ్లపాటు తెలుగు పాఠాలు చెప్పేను. నాది చాలా చెకర్డ్ జీవితం 🙂
  @ సౌమ్య, నేను తెలుగు పుస్తకాలు చూడలేదు కానీ అందులో బ్రౌన్ వ్యక్తిగత జీవతం ఇంత చర్చించివుండరు అని అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 3. బాగుంది పరిచయం.
  బ్రౌన్ పై తెలుగులో పుస్తకాలు వచ్చాయి కదా…. పరిచయాలు.. నేను చదవలేదు కానీ, చూసాను రెండు పుస్తకాలను. చిన్న సైజువి.

  మెచ్చుకోండి

 4. మొన్న మీరు వ్యాఖ్యానించి నప్పటి నుండి ఎదురు చూడడం.. ఈ టపా కోసం! బ్రౌన్ తెలుగు భాష సేవ ని గురించి చక్కగా తెలిపారు. ఆ కాలం వారి ఆలోచన సరళిని కూడ పరిచయం చేసారు. బాగుంది!

  తెలుగు నేర్పుతున్నారా మీరు?
  ఎవరికి? ఎక్కడ?

  మెచ్చుకోండి

 5. బాగుంది… ఇప్పటికీ మనం బ్రౌణ్యం నిఘంటువు ఉపయోగిస్తూనే ఉన్నాము.
  అలాంటి వ్యక్తి గురించిన పూర్వాపరాలు పుస్తకంగా రావడం ఆసక్తికరమే.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s