ఊసుపోక – ఒక చెత్త క్షోభ

(ఎన్నెమ్ కతలు 21)

నా చెత్తభ్రమణం టపాతో ఈ సీరీస్ ముగించేద్దాం అనుకుంటుండగా, నిన్ననే ఓ వాఖ్య నాకళ్ల బడింది.

అమెరికా, అమెరికా అంటూ చెత్త రాసింది మూర్ఖురాలు.

నాచెత్తభ్రమణం మీద ఓ చిన్నవాడి చిత్తక్షోభ ఇదీ!

అపార్థానికి తావులేదులెండి. నా చిత్తభ్రమణం టపాకి లింకిచ్చారు. కాగా నాకు ఒరిగిందేమిటంటే మరో పది హిట్లు అధికంగా తగిలేయి. అందుచేత ఆ చిన్నవాడికి, ఎడ్మినిస్ట్రేటరుకి కృతజ్ఞతలు.

రమణి రాసినట్టు కొందరు అనామక నామధేయాలతో వ్యాఖ్యలు మనబ్లాగుల్లో పెడితేనూ, పెట్టడానికి ప్రయత్నిస్తేనూ, మరి కొందరు వేరే సైటుల్లో రాసుకుంటారు. ఆ బుద్దిమంతుడి ధర్మమా అని నాకు మరోటపా రాయడానికి మరో సరుకు దొరికింది. హీ హీ.

ఆలోచిస్తుంటే నాకు రెండు సందేహాలూ, ఒక అనుమానం కలిగేయి. చెప్తాను.

నా ఐక్యూ చాలా లో అని నాలో నేనే కాక మీలో ఎవులేనా అనినా ఒప్పేసుగుంటాను. అయితే ఈ చెత్త భ్రమణంలాటి పదాలు నాబుర్రలో పుట్టడం నా మూర్ఖత్వం మూలానే అనుకుందామా? ఇది మొదటి సందేహం.

రెండోది ఈ చెత్త రాయడం నేను మూర్ఖురాలిని కావడంచేతే అనే అనుకుందాం కేవలం వాదించడానికే.

నాకు అర్థం కాని సంగతి ఆ కుర్రవాడు పైన రాసిన అభిప్రాయంతో పాటు ప్రకటించుకున్న తన మేధాసంపత్తి. ఇలాటివి చదివే నేను అమెరికా చెత్త కాబోలు అనుకుని ఇండియా వెళ్లిపోయి… అంటూ రాస్తే నాకు ఆశ్యర్యంగా వుంది. ఇక్కడే నాకు తికమకగా వుంది. నాలాటి మూర్ఖులు రాసిన బ్లాగులు చూసి తమ జీవనసరళికి అతిముఖ్యమైన నిర్ణయాలు చేసేసుకునేవారు వున్నారంటేనే ఆశ్చర్యంగా లేదూ .

ఆలోచనలతో తల వేడెక్కి చిన్న మగత నిద్ర పట్టినట్టుంది. ఏటి సిన్నమ్మా! బెగులెట్టుకు కూకుడుండిపోనావు అంటూ సంద్రాలు నవ్వుతూ ఎదట ప్రత్యక్షమయింది.

నిట్టూర్చి, నేనెంత ఘోరఁవైన పన్జేసేసేనో చెప్పేను సంద్రాలుకి, ఇలా వుర్దిలోకి రావాల్సిన చిన్నవాడు పాపం నాకత చదివి ఛస్ ఇది కాదు సొరగం అదీ, అది కాదు సొరగం ఇదీ అనుకుంటూ ముందుకీ వెనక్కీ తిరుగుతున్నాడంట అని చెప్పి ఆపాపం నాదేనని చెప్పాను చెప్పలేని బాధతో.

అవుతే మరేటి సేస్తవు? అనడిగింది సంద్రాలు.

ఏవుందీ. ఇహ మీద ఆ రిసెర్చిలేవో నేనే జేసేసి, ఎవరు ఎక్కడ బతకాలో, ఎవరెలాటి ఉజ్జోగాలు చూసుకోవాలో, ఏం తినాలో అన్నీ నేనే నిర్ణయాలు చేసేస్తూ రాసేస్తాను అన్నాను.

గఁయ్యిమని లేసింది సంద్రాలు, నీకేటి మతి పోనాదేటి. ఆయనెవురో బుద్ది బుగ్గయి నీకతల్ల అవుపిచ్చిన మాట లట్టుకుని దేసిం ఎల్లిపోనాడా. మాపటేల మరో యమ్మ విసాపట్టంవెల్లి సేపలమ్ముకోమంటాది. వుంకో బాబు ముంబయెల్లి యాపారం ఎట్టుకో అంతడు. ఈ పెద్ద పెద్ద సదూలు సదూకున్న బాబు ఆలమాటా ఈలమాటా యినుకుంటా బొంగరంల్ల తిరగతడా. ఆయన సదూకున్న సదూలేటయిపోనాయి. “ఏది ఆసికాలు, ఇందలో నిజివెంతున్నదీ, నాను సదూకున్నాను, నానెక్కడుండలో, ఏటి సెయ్యాలో నాకు తెలవాల అని ఆ బాబుకుండాల గానీ నీమాటా నీమాటా ఇనుకుంటా ఎంతదనిక ఎల్తడు. ఇనాల్నుంటే ఆలెవరో కవున్సిలీరున్నరు గంద. ఆల్నడగాల. రెండొందలుచ్చుకుని నీకు ఏది బాగున్నదో అది సెయ్యి అన్సప్తరు. జలుబొదిలిపోతది. అయినా దేసింలో వున్నడు ఆడికి తెలీదేటి దేసిం ఎలాగున్నదో. నివ్వు సెప్పీదేటి. ఆరి యవ్వారం ఆరిది. నీ యవ్వారం నీది. అంది.

అంతేనంటావా అన్నాను ఆమాత్రం దన్ను దొరికినందుకు గుండె కూడదీసుకుని. సంద్రాలు మాయమయిపోయింది.

ఇంకా ఆలోచిస్తూనే వున్నాను. ఇది థాంక్స్గివింగు వారం. అమెరికా ( అదుగో, చూశారా మళ్లీ అమెరికా అంటోంది1 ప్చ్.), ఇంతకీ ఇదీ అమెరికా అధ్యక్షులవారు ఒక సీమకోడిని క్షమించేసి, ఆకాశంలోకొదిలేసి, మరో సీమకోడిని కోసుకు తినే శుభదినం. మరి నేను కూడా సాంప్రదాయం పాటించి అన్ని కోళ్లనీ సాధుభావంతో వదిలీయాలి. ఎలాగా కోడ్ని తినను కనక అన్నిటినీ గాలికొదిలేస్తే పోలే …

క్షమ కవచము. క్రోధమది శతృవు, జ్ఞాతి హుతాశనుండు, మిత్రము దగు మందు …  అన్నారు కదా.

అంచేత మరో వ్యాఖ్యోడి కత కూడా నా కవచానికి దృష్టాంతంగా చెప్తాను. 

ఈమధ్య నేను రాసిన ఇంగ్లీషుపుస్తకంమీద వచ్చిన సమీక్ష మీద రెండు వ్యాఖ్యలొచ్చేయి అది తెలుగులో రాసి వుండవలసిందని. నాకు తోచిన సమాధానం ఏదో నేను చెప్పుకున్నాననుకోండి. అందులో ఒకాయన నిజంగానే పుస్తకం చదివి మాటాడుతున్నట్టు కనిపించింది. బాగానే వుంది.

రెండో బుజ్జితండ్రికి మాత్రం పుస్తకం చదివే లక్షణమూ, ఓపికా వున్నట్టు కనిపించలేదు. కనీసం సమీక్ష కూడా సరిగ్గా చదవలేదు. నాకంటే తనకే ఎక్కువ హైక్యూ వుందని ఋజువు చెయ్యాలని కాబోలు హోరుమంటూ మొదలెట్టాడు ప్రశ్నల జోరు. ఏదో ఓ వ్యాఖ్య రాసి పారేయడమే అతగాడిలక్ష్యమేమో మరి. పుస్తకం చదవని కాడికి అది తెలుగులో వుంటేనేమిటి స్వహీలీలో వుంటేనేమిటి అనిపిస్తోంది నాకు.

ఈ ఉత్త (రాల) రచయితలు బాగా చదువుకున్నవాళ్లు, మంచి వుద్యోగాల్లో వున్నవాళ్లు. ఎందుకు ఇలా తమ అమాయత్వాన్ని (మూర్ఖత్వం అంటే బాగుండదు కదా) పత్రికల్లో అంతర్జాలంలో ప్రదర్శించుకుంటారు.?

ఈమధ్యనే విన్నాను అమెరికా (మళ్లీ అమెరికా మాట! :) లోనే ఆటిజమ్అన్న ఒక రకం మానసిక తత్త్వం అనుకుందాం దాన్నిగురించి. ఆలోపం వున్నవాళ్లలో కొందరు అతి చిన్నవిషయాలు చొక్కా బొత్తాలు పెట్టుకోడంలాటివి చెయ్యలేరు. కానీ కొన్ని ఇతర విషయాల్లో ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనంలాటి కళల్లో అద్వితీయమైన ప్రతిభ చూపుతారు. లేదు లేదండీ. నేను మనవాళ్లని ఆటిస్టిక్ అనడంలేదు. ఊరికే గుర్తొచ్చింది, చెప్పానంతే. :p .

మనిషి మెదడు చాలా చిత్రమయినదిట. అందులో చాలా చిన్నచిన్న అరలుంటాయిట. ఆటిజమ్ వున్నవాళ్లలో జరిగేది అదే. ఒక భాగం పని చేసినట్టు మరొక భాగం పని చెయ్యదు. ఈ వాదన ఈవ్యాఖ్యలాళ్లకి ఆన్వయించి చూచుకుంటే, కొందరికి తమ రంగాల్లో గొప్ప ప్రతిభావిశేషాలు చూపినా, వాఖ్యానాలు రాయడానికి కూర్చున్నప్పుడు వేపకాయంత వెర్రి తన్నుకొస్తుందేమోనని నా అనుమానం.

పాఠకమహాశయులారా! నన్ను అర్థం చేసుకోరూ దయ చేసి. నేను కూడా ఆకోవలోకే రావచ్చు కీబోర్డు చేపట్టి ఇటువంటి  టపాలు రాయడానికి కూచున్న సందర్భాలలో.

చివరిమాటగా ఇందుమూలంగా చేరువయిన అభిమానులకీ, ఈటపాలవల్ల ప్రజ్వరిల్లిన చిరాకుతో నారచనా వ్యాసంగానికీ ముడిసరుకు సరఫరా చేస్తున్న పుణ్యమూర్తులకీ ధన్యవాదాలు.  :).  


(నవంబరు 28, 2008. )

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

26 thoughts on “ఊసుపోక – ఒక చెత్త క్షోభ”

 1. హనుమంతరావుగారికి,
  నమస్కారాలు. మీకు నాయందు గల అభిమానానికి కృతజ్ఞతలు. ఈఊసుపోక వ్యాసం సీరియస్ గా తీసుకోకండి. ఈబ్లాగు విషయం పక్కకి పెట్టేసి, మీరు సమీక్ష రాస్తారని ఆశిస్తున్నాను. స్త్రీలరచనల అవహేళన విషయం నాకు ఈమాటలో చర్చించాలని తోచలేదు బాబ్జీల attitudeమూలంగా. నాపుస్తకం విషయంలో మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నలు నాకు విడిగా రాయండి. నాఇమెయిల్ thulikan@yahoo.com.
  మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ,
  మాలతి.
  కొత్తపాళీ, చదువరి, కిరణ్, తెరెసా, మీరు నాయందు చూపిన అభిమానానికి సంతోషం.
  ఈచర్చ ఇక్కడితో సమాప్తం. పదండి, కథలు చదువుకుందాం. –

  మాలతి

  మెచ్చుకోండి

 2. హనుమంతరావుగారికి,
  నాదృష్టిలో –
  నేను సీరియస్‌గా రాసిన సాహిత్యవ్యాసాలలో తూలిక గానీ మరెక్కడ కానీ, ఇంగ్లీషులో కానీ, తెలుగులో కానీ, హాస్యం, వ్యంగ్యం, చొప్పించలేదు, సందర్భానికి అవసరం అయితే తప్ప. మరొకసారి మనవి చేసుకుంటున్నాను ఈమాట.కామ్‌లో కూడా మర్యాద నేను మాత్రమే పాటించేను.
  ఊసుపోక వ్యాసాలు (హాస్యం కూడా సాహిత్యంలో భాగమే అయినా)లో వ్యంగ్యం, హాస్యం దృష్టిలో పెట్టుకుని రాసినవి. ఈధోరణి మన సాహిత్యంలో ఇదివరకే వుంది. ఇంతవరకూ రాసిన 21 ఊసుపోక వ్యాసాలూ అదే శైలిలో వున్నాయి.
  ఇంకా కావాలంటే సెలెబ్రెటీ రోస్ట్ లాంటిది అనుకోండి. అంటే మీ బాబ్జీలుగారికి సెలెబ్రెటీ స్థాయి కల్పించేనన్నమాట‼

  మీదృష్టిలో –
  నేను నా ఊసుపోకలో సాహిత్య మర్యాద పాటించలేదు అని మీ వాదన. (ఈమాటలో పాటించినవిషయం మీరు గమనికలోకి తీసుకోరు). మరి అదే రూలు మీ కోణంనించి మీ బాబ్జీలుగారికి అన్వయించి ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు? ఆయన నాపుస్తకాన్ని పాసిబూరెలు అంటే మీరు అభ్యంతరం చెప్పలేదు. నేను మాత్రమే ఇలా జవాబులు ఎందుకు చెప్పుకోవలసి వస్తోంది? అవునండీ, ఏమిటి ఈ తర్కం?
  పాఠకులకి మాత్రమే చీల్చి చెండాడే అధికారం వుంది, రచయితలకి లేదు అన్న వాదన నేను అంగీకరించను.
  We have to agree to disagree.
  బాబ్జీలు భాష మీకు ఆమోదకరంగానూ నాభాష అభ్యంతరకరంగానూ వుండడం (భిన్న సందర్భాలలో కూడా) ఆశ్చర్యం.
  స్త్రీలరచనలవిషయంలో విమర్శకులూ, పాఠకులూ ఆడిన హాస్యాలూ, వేళాకోళాలూ, ఎత్తిపొడుపులూ నాపుస్తకంలో కాస్త వివరంగానే చర్చించేను. దయచేసి చూడండి.
  కిరణ్, మీకూ అదే ప్రశ్న. ఈ శృతులు నాకు మాత్రమేనా? బాబ్జీలు కామెంటు మరోసారి చూడండి. ఆయనకి నాపుస్తకం అక్కర్లేదు.

  మెచ్చుకోండి

 3. చదువరి గారికి,

  నేనేమీ అభ్యంతకరమైన భాషని “ఆస్వాదించలేదు”. మాలతి గారి పుస్తకం పై నా అభిప్రాయం చూడండి ఈ మాటలో తెలుస్తుంది. అక్కడాయన అన్నదానికి ఇక్కడిది ప్రాయశ్చిత్తం అనే పద్ధతిలో ఉత్తమ సాహిత్య పత్రికలు నడపకూడదని నా అభిప్రాయం.

  మాలతి గారికి,

  మీ బాబ్జీలు, మీ బాబ్జీలు అని మీరు పదే పదే అన్నారు. ఈమాటలో రాతల ద్వారా తప్ప ఆయనకూ నాకూ సంబంధం లేదు. మరేమీ తెలియదు. ఆయన ఇంతకు ముందర స్త్రీల రచనలని మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు, ఎక్కడా అవహేళన చేసినట్లు నాకు గుర్తు లేదు. ఇప్పుడు “నవలామణులు,” “పాచిబూరి” అన్న ప్రయోగాలతో ఆయన తప్పు చేస్తే అది ఫెమినిజం గురించి మీరూ వేలూరీ అన్నదానిని ఖండించే వేడిలో చేశారా? లేక మిమ్మల్నీ, స్త్రీ రచనలనీ వేళాకోళం చేశారా? అవహేళన చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ, నాతో, సంపాదకులతో సహా ఎందుకు మౌనం వహించారు?

  నేనింతగా నొక్కి అడగడానికి కారణం స్త్రీ రచనలని పూర్వం వేళాకోళం చేశారన్నది మీ పుస్తకంలో ఓ ముఖ్యాంశం. దానినే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించారు. అది ఇప్పటికీ సంస్థాగతంగా అలాగే కొనసాగుతోందా? మరి దాని గురించి ఈమాటలో మీరెందుకు చర్చించలేదు – బాబ్జీలు గారి కామెంట్ మూలంగా సందర్భం వచ్చినా?

  రచయితలకి కూడా చీల్చి చెండాడే అవకాశం ఉంది. అది మీరు ఈమాట లో వాడుకొని ఉండాల్సింది. అక్కడ మర్యాదకో మాటా, ఇక్కడ మీ పత్రికలో మరో మాటా చెప్పినందుకే నా బాధ.

  నేనీ ప్రశ్నలన్నీ మీకే ఎందుకేస్తున్నాను, బాబ్జీలు గారినెందుకడగను? అన్నారు. నాకు మీరు ముఖ్యం. మీరో పేరున్న రచయిత్రి, పాతికేళ్ళు శ్రమించి ఓ పుస్తకం రాశారు. ఈమాటలో హుందాగా చర్చించారు. నాకు మీమీద ఓ ఉన్నత అభిప్రాయం కలిగింది. మీ పుస్తకాన్ని మరోసారి చదివాను. దాని మీద విమర్శనాత్మకమైన సమీక్ష రాద్దాం అని వేరే ఏమన్నా చదవడానికి మీ వెబ్ సైట్ కొచ్చాను. ఇక్కడ ఈ వ్యాసం, ఈ చర్చా చదివి నాకు చాలా ఆశాభంగమయింది. కారణం మీరా, నేనా? సరిగా తెలియదు. నేనింతగా స్పందించడానికి అసలు కారణం అది.

  బ్లాగు లోకంలో రాసే అలవాటు లేదు. కటువు మాటలు దొర్లినందుకూ, సంయమనాన్ని కోల్పోయినందుకూ, అందరూ క్షమించండి. సెలవ్.

  కొడవళ్ళ హనుమంతరావు

  మెచ్చుకోండి

 4. ఇక్కడి చర్చ చూసాక ఈమాటలో జరిగిన చర్చ చదివాను. చదివాను గాబట్టి నాకు అనిపించినది నేను రాస్తున్నాను…

  ఈ వ్యాసంలో నానా మాటలూ అన్నట్టు హనుమంతరావు గారు రాసారు -నాకు అలా అనిపించలేదు. హై క్యూ లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేనివారు, చిత్రంగా “పాచి బూరి” రుచిని మాత్రం ఆస్వాదించారే అని మాత్రం అనిపించింది. హతాశులైపోవాల్సినంత విషయంగానీ, అవసరంగానీ అసలే లేదని కూడా అనిపించింది.

  మెచ్చుకోండి

 5. ఇహిహి
  మొదట ఈ టపా చదవగానే – ఇదేమిటి ఇలా వ్రాసేశారు – హనుమ గారు చూస్తే ఊరుకుంటారా –
  అనే అనుమానాలు టక్కున వెలిగాయి.

  మాలతి గారూ,
  మీరెంత లైట్ టోన్లే వ్రాయాలని ప్రయత్నించినా కొంచెం శృతి మించినట్టే ఉంది.
  పాపం బాబ్జీలు ఉండేది ఇండియాలోనేమో, మీ పుస్తకం ఎలా తెప్పించుకోవాలో తెలీదేమో.

  మెచ్చుకోండి

 6. కొత్తపాళీ గారికి,

  నేను నా అసలు పేరుతో సూటిగా రాశాను. మీరు యువర్ ఆనర్ అంటూ కోర్టు భాషలో ఎందుకు మాట్లాడటం? మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం లేదు కాని ఈ కోర్టు భాష, శేముయేలు జాక్సను అన్న పేరూ కలిసి నాకు Samuel Johnson మాటలు గుర్తు తెప్పించాయి. క్షమించండి.

  లైట్ గా తీసుకొని నలుగురితో కలిసి నవ్వుకోమంటారా? పార్టీకి బాబ్జీలు గారిని కూడా పిలిచి చెప్పండి, చూద్దాం.

  కొడవళ్ళ హనుమంతరావు

  మెచ్చుకోండి

 7. మాలతి గారికి,

  మీరు ఊసుపోకకే రాసినా, ఈమాటలో జరిగిన చర్చ సాహిత్యపరమైనది కనుక, మీ వ్యాఖ్య వ్యక్తిగతమైనదీ, నాదృష్టిలో అనుచితమైనదీ కనుకనే నేనభ్యంతరం చెప్పాను.

  ఈమాటలో బాబ్జీలు గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా అవమానించే వ్యాఖ్యలు చెయ్యలేదు. పాఠకులకి తీవ్ర పదజాలంతో రాతలని చీల్చి చెండాడే స్వాతంత్ర్యం ఉంది – పూర్తి అజ్ఞానంతో కూడా! నచ్చని వాళ్ళు వాటికి తిరుగు అభిప్రాయాలు రాయొచ్చు; సంపాదకులకి ఫిర్యాదు చెయ్యొచ్చు. మీరు ఈమాటలో ఇలా సమాధానమిచ్చారు: “Baabjeelu, Since you say you mean no offense to me personally, none is taken. Thanks for your expressing views.” ఇప్పుడు నేను అభ్యంతరం పెట్టి ఉండాల్సిందంటున్నారు. ఏమిటీ తర్కం?

  మీరన్నట్లు ఈ ప్లాట్ఫారం వేరు, నిజమే. కాని, “I intend to run Thulika as a creditable, literary magazine. Personal attacks, gossip, scandals, … are not acceptable,” అన్నది దీనికి వర్తిస్తుందా? లేక అది ఇంగ్లీషు భాగానికే పరిమితమా? వర్తించకపోతే చెప్పండి, నాలాటి వాళ్ళు ఈ చాయలకి రారు. వర్తిస్తే, మీరు రాసినది మరోసారి ఆలోచించమని మనవి.

  కొడవళ్ళ హనుమంతరావు

  మెచ్చుకోండి

 8. యువరానర్,
  “బుజ్జితండ్రి, చదివే లక్షణం లేని వాడు, హై క్యూ ఉందని రుజువు చేసుకోవాలనుకునే వాడు” ఇత్యాది మాటలనడం ఆ నిర్దిష్టమైన మాటలు అనడమే అవుతుంది గానీ నానా మాటలు అనడం కిందికి రాదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను.
  క్షమకీ ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడానికీ చాలా తేడా ఉందని కూడా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
  పరస్పర లంకెలతో వ్యాపించిన ఈ అంతర్జాలంలో ఒక వేదిక మీద మొదలైన చర్చా వాదం ఇంకొన్ని వేద్కల్లోకి వొలికి పోతుండడం సహజమే అయినా ఒక సంపాదక వర్గం నడిపే పత్రిక్కీ ఒక వ్యక్తి తన ఆలోచనల ప్రతిబింబంగా రాసుకునే బ్లాగుకీ చాలా తేడా ఉందని కూడా కోర్టువారికి మనవి చేస్తున్నాను.
  పలుపు ఫిక్షనులో నా ఆరాధ్య నటుడు శేముయేలు జాక్సను అన్నట్టు ..
  It ain’t the same ball park. It ain’t the same league. It ain’t even the same sport.
  అసలే ఇక్కడ జనాల కళ్ళు కాస్త కలర్ సెన్సిటివ్ అయినట్టున్నాయని పై డయలాగులోని కలర్ఫుల్ భాగాన్ని తొలగించి నలుపు తెలుపు భాగాన్నే ఉదహరించాను. అయినా భావం అర్ధమవుతోందనుకుంటాను!
  లైట్ తీస్కోండి!!

  మెచ్చుకోండి

 9. హనుమంతరావుగారికి,

  నేను ఊసుపోక రాసిన మాటలు మీకు అభ్యంతరకరంగా తోచడం విచారకరం. ఏరచనకైనా వస్తువూ, సందర్భాన్నీ బట్టి కంఠస్వరం వుంటుందని మీకూ తెలుసనుకుంటాను.

  నేను రాసిన పుస్తకం సీరియస్‌గా రాసింది. వేలూరి సమీక్ష సీరియస్‌గా రాసింది. బాబ్జీలు సమీక్ష అవహేళనతో కూడుకున్నది. అయినా ఈమాట.కామ్ లో నేను ఓపిగ్గా, మర్యాదగానే సమాధానం ఇచ్చాను.

  సమీక్షమీద అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు కాదు నా అభ్యంతరం. అది సరిగ్గా చదవకుండా, నాపుస్తకం మొత్తం ప్రశ్నోత్తరాలరూపంలో రాబట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది నాకు. 1975కి ముందు రచయిత్రులగురించి రాసిన పుస్తకంమీద ఆయనకి ఆసక్తిలేదనే కాక ఎవరికైనా ఎందుకు వుంటుందని ప్రశ్నించారు. ఆసక్తి లేనప్పుడు, మిగిలిన ప్రశ్నలు అనవసరం.

  ఆడవాళ్లంతా unassumingగా వుండాలి అని నేను అనలేదు, అలా అన్నట్టు సమీక్షలోలేదు. బాబ్జీలు సమీక్ష సరిగ్గా చదవలేదు కనకనే ఆప్రశ్న వేశారు. పైగా “నవలామణులు”, “పాసిబూరి” అంటూ హేళన చేశారు. మీరు కూడా అక్కడ ఆభాషకి అభ్యంతరం చెప్పలేదు. ఎందుచేత?

  ఇక్కడ నా బ్లాగులో నేను ఊసుపోక శీర్షికతో రాస్తున్నవి కేవలం సరదాకి, ఇందులో హాస్యం, వ్యంగ్యం, చిరాకు, అన్నీ వుంటాయి. నాక్షమ కూడా ఆకోవలోనిదే. ఈ ప్లాట్‌ఫారం వేరు అని మాత్రమే చెప్పగలను.

  ఏమైనా మీరు నాబ్లాగుకి వచ్చి మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. మాలతి గారికి,

  మీ పుస్తకంపై వేలూరి గారు ఈమాటలో రాసిన సమీక్షపై జరిగిన చర్చపై మీరు పైన చేసిన వ్యాఖ్యానం చదివి ఇది రాస్తున్నాను.

  పుస్తకం చదవకపోయినా సమీక్ష చదివి సమీక్ష మీద వ్యాఖ్యానించడంలో తప్పేమీ లేదనుకుంటాను. బాబ్జీలు గారు ముందర అభ్యంతరపెట్టింది వేలూరి గారు ఫెమినిజం పై చేసిన వ్యాఖ్యపై. అది సమంజసమైనదే.

  మీకాయన ప్రశ్నల తీరు చికాకుని కలిగించవచ్చు. అంతమాత్రాన, బుజ్జితండ్రి, చదివే లక్షణం లేని వాడు, హై క్యూ ఉందని రుజువు చేసుకోవాలనుకునే వాడు, ఇలా నానా మాటలనడం, మానసిక తత్త్వం లోకెళ్ళడం, ఎంతమాత్రం హర్షించదగ్గది కాదు.

  పైపెచ్చు ఇది మీ క్షమ కి ఓ దృష్టాంతమన్నారు. ఇదేనా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అంటే?

  హతాశుడైన
  కొడవళ్ళ హనుమంతరావు

  మెచ్చుకోండి

 11. జ్యోతి, నాకు మీతొలిపరిచయం ఇంకా గుర్తుంది, మీరిలాగే ఎవరో చెత్తగా రాసేరని రాసినమాట మీద కదా.. మీవిజయోస్తుకి థాంక్స్.
  రమణి, టైపాటులు, బాగుంది. హాహా, మీరేనేమో అనుకున్నా. మీకూ మళ్లీ థాంక్స్.

  మెచ్చుకోండి

 12. వా……:( ముందు ఇచ్చిన వ్యాఖ్య నేనే రాశాను. ’రామన్ ’ (raman) అని అచ్చు తప్పు కాదు కాదు టైపాటు. నేను ’రమణి ని. రైటో రైటు…. అంటూ రాశిన వ్యాఖ్య నాది. అంటే రమణి ది. ఎవరో ఈ అనామక రామన్ అనుకొనేరు…. వా……………………… 😦

  మెచ్చుకోండి

 13. మాలతిగారు ,,

  వేరీ గుడ్డు,, మీకు కూడా అక్షింతలు పడ్డాయన్నమాట. విజయోస్తు.. ఎవ్వరేమనుకున్నా, ఎవ్వరేమైనా మీరిలాగే రెచ్చిపోండిక…

  మెచ్చుకోండి

 14. మహేష్ కుమార్- ప్రత్యామ్నాయ బ్లాగు బాగుంది. ఇది కూడా ఓరకం సాహిత్యసేవేలెండి.
  సిరిసిరిమువ్వ, బుజ్జి – షావుకారు జానకి, ఏనాటిమాట. ఎప్పుడో 60లలో చూశాను ఆవిడ సినిమాలు. మరి సంద్రాలు నాతోనే గదండీ,
  రాజేంద్రకుమార్ – సంద్రాలు ఏటో నామాటినదండి. దానికెంత తోస్తే అంతే. ఆఊసేటో సెప్పండి.దానికందిస్తాను సెకట్రీనాగ.
  రామన్, సుజాత – నిజమేనండి. తొక్క దళసరి చేసుకోవాలి. కానీ బుర్రలో పురుగు తొల్చీసింది సరదాగా ఓటపా కట్టీమనీ ..
  రాధిక, అన్వేషి, కల్యాణరామారావు, నెటిజన్ – ఇంకా అందరూ కొంచెంసేపు కులాసాగా నవ్వుకున్నారు గద, అంతే సాలు నాకు. సంతోషం.
  సుజాత – ఆసైటు ఎడ్మినిస్ట్రేటరు కూడా నాకు తూలికద్వారా పరిచయమే. వారై వస్తే సరే, నేనెందుకు ముగ్గులోకి లాగాలి అని 🙂

  మెచ్చుకోండి

 15. మాలతి గారు,
  అమెరికా గురించి ఏమైనా…..ఏమైనా రాసే హక్కు మీకుంది. మీకెందుకు మీరు రాసెయ్యండి!

  కొంత మంది అలాగైతే మరి కొంతమంది మరో లాగా! మన moral values (వారికున్నా లేకపోయినా) ని ప్రశ్నించనిదే వారికి నిద్ర పట్టదు. ఏం చేద్దాం, లోకో భిన్న రుచిః !(అబ్బ, విసర్గ రాయడం మర్చిపోలేదు)

  నిజానికి “చెత్త భ్రమణం” అనే పద సృష్టి అందర్నీ ఎంత ఆకట్టుకుందో మీకు నేను చెప్పాలా?

  ఇలాంటి అనోనీమస్సులను నేను మీరు చెప్పినట్టు సీమకోళ్ళకు మల్లే వదిలేసి వారి కామెంట్లను భ్రూణ హత్య టైపులో నా బ్లాగులోనే చంపేసి, సంస్కారం, కాస్తో కూస్తో పాయింటూ ఉన్న కామెంట్లను ప్రచురించిన సదర్భాలు ఒకటో రెండో ఉన్నాయి.

  అయినా బ్లాగర్లకు ఇంతో కొంతో తోలు మందం ఉండాలని చదివిన గుర్తు! సరే ఏం చేస్తాం, మంద పర్చుకుందాం!

  అదిసరే, ఆ బ్లాగు లింకు మీరివ్వలేదేం?

  మెచ్చుకోండి

 16. మాల్తమ్మా,ఆ సంద్రాలు దాయి అల్లక్కడ అమ్రికాలో ఏటి జేస్తంది,ఓపాలి ఇల్లిక్కడ సీతమ్మధారంపుతారేటి,సిన్నూసుంది ??!!! 🙂
  మెత్తటి చెప్పకు గంధమద్ది కొట్టటంటే విన్నాను,ఇవ్వాళ చదివాను 🙂

  మెచ్చుకోండి

 17. రైటో రైటు, ఈ మధ్యఈ అనామకుల వ్యాఖ్యలకి, సరదా, సరదా టపాలు రాసెసి , వాళ్ళ మాటలని (వ్యాఖ్యలని) ఉప్మా లో కరివేపాకు లా తీసేసి [రుచికోసం టపా రాసేస్తామన్నమాట 🙂 ] మన దారిలో మనం ఉంటే మనకి ఈ అనవసరమైన చెత్త క్షోభలు ఉండవు. సంద్రాలు పాత్ర నిజంగా షావుకారు జానకిని మరిపించింది. . 🙂
  ఈ మధ్య రెండు రోజులకొకసారి ఇలాంటి అనుభవం చవి చూడాల్సి వస్తొంది మన బ్లాగరు గుంపులో. వీటికి మనసు కష్టపెట్టుకోకుండా టేక్ ఇట్ ఈజీ పాలసీ లో ఉంటే మంచిది. ముఖ్యంగా కొత్త బ్లాగర్లు కొంచం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. (ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని అనుకోవద్దు నా రాతలు చూసి, స్వానుభవం కూడా ఉంది).

  మెచ్చుకోండి

 18. అవును, నాకు కూడా ‘సంసారం ఒక చదరంగం’ లో షావుకారు జానకి లాగా అనిపించింది సంద్రాలు. ఆ సినిమాలో షావుకారు జానకి మట్లాడేదంతా విసాపట్టం భాషేనా ఐతే..

  గఁయ్యిమని లేసింది సంద్రాలు, “నీకేటి మతి పోనాదేటి. ఆయనెవురో బుద్ది బుగ్గయి నీకతల్ల అవుపిచ్చిన మాట లట్టుకుని దేసిం ఎల్లిపోనాడా. మాపటేల మరో యమ్మ విసాపట్టంవెల్లి సేపలమ్ముకోమంటాది. వుంకో బాబు ముంబయెల్లి యాపారం ఎట్టుకో అంతడు. ఈ పెద్ద పెద్ద సదూలు సదూకున్న బాబు ఆలమాటా ఈలమాటా యినుకుంటా బొంగరంల్ల తిరగతడా. ఆయన సదూకున్న సదూలేయిపోనాయి. “ఏది ఆసికాలు, ఇందలో నిజివెంతున్నదీ, నాను సదూకున్నాను, నానెక్కడుండలో, ఏటి సెయ్యాలో నాకు తెలవాల” అని ఆబాబుకుండాల గానీ నీమాటా నీమాటా ఇనుకుంటా ఎంతదనిక ఎల్తడు. ఇనాల్నుంటే ఆలెవరో కవున్సిలీరున్నరు గంద. ఆల్నడగాల. రెండొందలుచ్చుకుని నీకు ఏది బాగున్నదో అది సెయ్యి అన్సప్తరు. జలుబొదిలిపోతది. అయినా దేసింలో వున్నడు ఆడికి తెలీదేటి దేసిం ఎలాగున్నదో. నివ్వు సెప్పీదేటి. ఆరి యవ్వారం ఆరిది. నీ యవ్వారం నీది. ” బాగా చెప్పారు.

  మెచ్చుకోండి

 19. ఓ చెత్త వ్యాఖ్య మీద మరో మంచి టపా రాసి మీకు మీరే సాటి అనిపించారు.
  ఎక్కువ “హై”క్యూ——ఈ హైక్యూ లు ఎక్కువయ్యే అసలు సమస్య 🙂
  సంద్రాలు మాటలు—ఓ సినిమాలో షావుకారు జానకి డవిలాగులు గుర్తుకొచ్చాయి.
  “ఆరి యవ్వారం ఆరిది. నీ యవ్వారం నీది”–రైటో….వెల్ సెడ్ సంద్రాలు.

  మెచ్చుకోండి

 20. ఈ అను‘భవం’ మీదాకా వచ్చిందన్నమాట! ఇంకానయం నా బ్లాగుకి ప్యారడీబ్లాగే మొదలయ్యింది. కొందరంతే పాపం…వయదలిచి వదిలెయ్యాలి. లేదా ఇలా ఒకటపారాసి మన సానుభూతి తెలియజెయ్యాలి. మీ టపా నాకు చాలా బాగా నచ్చింది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.