శివుడాజ్ఞ (రెండో ముగింపుతో)

(అక్టోబరులో రాసిన శివుడాజ్ఞ కథకి రెండు ముగింపులు ఇచ్చేను. రెండోముగింపుమీద వచ్చిన వ్యాఖ్యలు ఆధారంగా, ఈకథ మార్చి పూర్తి చేసేను. ఈకథ తెలుగుజ్యోతి, డిసెంబరుసంచికలో చూడగలరు. దీని ముగింపు విషయంలో నాకూ వైదేహికీ జరిగిన చర్చ త్వరలోనే మరో వ్యాసంలో రాస్తాను. మాలతి)

                                     000

 

రేపు మిల్వాకీ వెళ్దాం అన్నాడు శివరావు.

సుమన అతనివేపు చూసింది నిజంగానా అన్నట్టు. శివరావు అనుజ్ఞ అయింది.  

 

చిన్నప్పుడు చల్లటి సాయంసమయాల చక్కని కథలు చెప్పి తనని అలరించిన అత్తయ్యగారు మిల్వాకీ వచ్చేరు. అప్పటికి రెండువారాలుగా అడుగుతోంది శివరావుని మిల్వాకీ వెళ్దాం అని. అతనికి ఎప్పటికప్పుడే ఏదో ఒ పని. ఊళ్లో ఎవరింట ఏపూజ జరిగినా అతనికే పని. సుమనకి దైవభక్తి అంతంత మాత్రమే అయినా అతన్ని కాదనలేక కూడా వెళ్తుంది. పూజకి కాదు ప్రసాదాలకి అనుకో అంటాడతను. ఆరేళ్ల పండుకి ఇల్లు తప్ప ఎక్కడ అయినా సరదాయే. 

ఇదే ఆఖరి శనివారం. రేపు వెళ్లకపోతే మరి అత్తయ్యగారిని చూడడం పడదు. 

రేపు మిల్వాకీ వెళ్దాం అని శివరావు అనగానే ఎగిరి గెంతేసింది సుమన మనసు.. అత్తయ్యగారిని గురించిన ఆలోచనలు ఝుమ్మని లేచేయి. ఆవిడ కాలిఫోర్నియాలో వున్న కొడుకు రాంబాబుని చూడ్డానికి వచ్చారుట. వాళ్లింట్లో తెలుగుజ్యోతి పత్రిక తీసి చూస్తూంటే సుమన పేరు కనిపించింది. ఆవిడ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోతూ అయ్యో, ఈ పిల్లిక్కడుందా? నాకు మాఅమ్మాయిలాటిదే.. ఇంతప్పటినుండీ తెలుసు ఈ పిల్లని. మనింటికి రోజూ వచ్చేది కదుట్రా, అన్నారావిడ కొడుకుతో ఎడంచేయి గాలిలో మూడడుగులు ఎత్తి చూపుతూ. ఆవెంటనే రాంబాబు ఇంటర్నెట్టేక్కేసి, సుమన అజా పజా ఎక్కలాగి, అక్కడ కనిపించిన నెంబరుకి ఫోను చేసేడు. సుమన ఫోను తీసి హలో అంది.

అవతలినుండి వుండండి, ఫోను మీస్నేహితురాలుగారికి ఇస్తాను అని బల్లమీద ఫోను పెట్టేసి వెళ్లిపోయాడు. సుమనకి అయోమయంగా వుంది.. ఎవరయి వుంటారు చెప్మా ఈస్నేహితురాలుగారు అని ఆలోచిస్తుండగానే, ఫోనులో హలో వినిపించింది. రవంత పెద్దతనం ధ్వనించింది గొంతులో.

సుమన హలో అని ఎవరండీ అంది సందేహంగా.

నేనమ్మా, మంగళగిరిలో అత్తయ్యగారిని. గుర్తున్నానా? రోజూ సాయంత్రాలు మాయింటికి వచ్చేదానివి.

అత్తయ్యగారా! అయ్యో మిమ్మల్ని మర్చిపోతానాండీ, ఎప్పుడొచ్చారు? ఎక్కడున్నారు?” అంది హడావుడిగా ముందు ఉలికిపడి, తరవాత ఎగిరి గెంతేసినంత పన్చేస్తూ. కాళ్లు భూమ్మీద ఆన్లేదు మరింక. 

అవునమ్మా. రాంబాబు ఇప్పుడు కాలిఫోర్నియాలో వున్నాడు కదా. ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశానికి వచ్చేను. అన్నారావిడ కూడా ఆపిల్ల తనని గుర్తు పెట్టుకున్నందుకు పొంగిపోతూ.

బాగుందండీ. మీ గొంతు వింటుంటే నాకు మళ్లీ మీ వంటింటిలో కూర్చున్నట్టే వుంది, అంది సుమన. 

నువ్వెక్కడున్నావు. ఇక్కడికి దగ్గరేనా?” అని అడిగారావిడ.

లేదండీ. మాకు కాలిఫోర్నియా చాలా దూరం. మీరు షికాగో వస్తే చెప్పండి. మేమే వస్తాం మిమ్మల్ని చూడ్డానికి.

చికాగోనా? లేదు, చికాగోలో మనవాళ్లెవరూ లేరమ్మా. మీకు మిల్వాకీ దగ్గర కాదా?”

మిల్వాకీ ఇంకా దగ్గర అత్తయ్యగారూ. చెప్పండి ఎప్పుడొస్తున్నారు?” అంది సుమన ఉత్సాహంగా.

ఇంకా తెలీదమ్మా. అక్కడ మా పెత్తండ్రి మనవరాలు వుంది. రమ్మని పట్టు బడుతోంది. ఆఅబ్బాయికి అదేదో కంపెనీలో వుద్యోగం. తనేమో ఇద్దరు పిల్లల్నీ చూసుకుంటూ ఇంట్లోనే వుంటోంది, ఆలోచిస్తున్నా, ఈప్రయాణాలు హైరాన అన్నారావిడ ఆయాసపడుతూ.

రండి. తప్పకుండా రండి. నాక్కూడా మిమ్మల్ని చూడాలని చాలా వుంది. మేమే మిల్వాకీ వచ్చి మిమ్మల్ని  మావూరు తీసుకు వస్తాం. మాయిల్లు కూడా మీరు చూడాలి. … ప్రయాణాలు … అవునులెండి. ఇక్కడా ప్రయాసే, అంది సుమన గలగలా మాటాడేస్తూ,

పండు, ఎవలూ అన్నాడు సుమనతో. వాడిక్కూడా అర్థం అయిపోయింది అమ్మ ఎవరో చాలా ఇష్టమయిన స్నేహితురాలితో మాటాడుతోందని.

అమ్మమ్మ అంటూ మొదలు పెట్టి వాడికి అరగంటసేపు చెప్పింది తన చిన్ననాటి ఆప్తురాలిగురించి. వాడు వినడం మానేసి చాలాసేపయిందని తను గుర్తించనేలేదు!

అత్తయ్యగారు మిల్వాకీ వచ్చేక మళ్లీ ఫోను చేశారు. ఆవిడ పెత్తండ్రి మనవరాలు రత్నమాల కూడా ఎంతో చనువుగా

శనివారమో ఆదివారమో తప్పకుండా రండని మరీ మరీ చెప్పింది.

సుమనకి ఒహటే ఆరాటం. రాత్రి ఒకంతట నిద్దర పట్టలేదు. ఆనాటి అత్తయ్యగారిల్లూ, ఆవిడ కథలూ చెప్తూ వేసిన పోపు ఘుమఘమలూ కూడా నిన్నో మొన్నోలా వుంది తలుచుకుంటుంటే. ఆఖరికి ఏరెండు గంటలకో రెప్పలు బరువెక్కేయి.,

000

రత్నమాల గారింటిముందు కారాగింది. ఆవిడ అందరినీ నవ్వుతూ ఆహ్వానించింది లోపలికి. సుమనకళ్లు అత్తయ్యగారికోసం వెతుకుతున్నాయి. గుండెలు చిక్కబట్టుకుని కూచుంది.

అత్తయ్యగారు చీరె మార్చుకుంటున్నారు. వస్తారు, అంది రత్నమాల చిన్నగా నవ్వుతూ.

మరో నాలుగు నిముషాలకి అత్తయ్యగారు పక్కగదిలోంచి వచ్చేరు. రాజరాజేశ్వరీదేవిలాటి నిండువిగ్రహం. వయసు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా అట్టే మార్పు లేదు అవిడలో. ఆప్యాయత వుట్టిపడే చిరునవ్వు, ఆపేక్షలు చిప్పిలేకళ్లు. తల మాత్రం బాగా నెరిసిపోయింది. అప్పట్లో మంచి నిగనిగలాడే నల్లని కురులు. కొబ్బరినూనె రాసి చక్కగా దువ్వి బిగించి ముడి వేసుకుని మల్లెచెండు తురుముకునేవారు. రెండో చెండు తనకోసం గుమ్మందగ్గర  పక్కనే బల్లమీద వుంచేవారు క్రమం తప్పకుండా.

సుమన అలా చూస్తూ ఎంతసేపు వుండిపోయిందో. .. అత్తయ్యగారు దగ్గరగా వచ్చి, మునివేళ్లతో చుబుకం పుచ్చుకుని, ఏదీ చూడనీ మొహం. పెద్దదాన్ని అయిపోయాను కదూ, కళ్లు సరిగా ఆనవు. బాగున్నావా? వీడు నీకొడుకా? బాగున్నాడు నీపోలికే … అంటూ ఆపకుండా పేరు పేరునా వరసగా అందరిగురించీ అడుగుతుంటే సుమన కళ్లు

చెమర్చాయి.

ఆఁ, అవునండీ, ఆయనే మావారు, వీడే మాఅబ్బాయి అంటూ… పొడి పొడి మాటలతో జవాబు చెబుతోంది.

ఎన్నో అడగాలనుంది. ఏదో చెప్పాలనుంది. ఒక్కమాట కూడా రావడంలేదు నోటికి.

అత్తయ్యగారు సుమన పక్కన కుర్చీలో కూర్చుని, ఎంతకాలానికెంతకాలానికీ  చూట్టం నిన్ను. ఎంత ఎదిగిపోయావు. మళ్లా నేను నిన్ను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. దేనికయినా పైవాడి దయ అంది.

అవునండీ. నాక్కూడా మిమ్మల్ని చూడాలి అని వుంది కానీ జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు అంది సుమన.

అందుకే అంటారమ్మా శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదని.

దాని బంగారుకన్నంలో వేలు పెట్టితే కులుతుంది అన్నాడు పండు.

అత్తయ్యగారు నవ్వుతూ, ఆహా, అట్లానా. మీ అమ్మ చెప్పిందా. అప్పుడు కూడా శివుడాజ్ఞ అయితేనే కులుతుంది, అన్నారు వాడి బుగ్గ పుణికి.

ఎలా తెలుతుంది శివులాగిన అయింది అనీ అడిగాడు పండు. వాడికి కథలంటే మహ సరదా.

అత్తయ్యగారు మళ్లీ బుగ్గ గిల్లి, నీకూ మీఅమ్మ మాదిరే కతలు కావాలేం అని నవ్వుతూ, కుట్టినప్పుడు తెలుస్తుంది అన్నారు.

శివులాని లేకపోతే కుట్టదా

కుట్టదు.

రత్నమాల వాళ్లిద్దర్నీ చూసి నవ్వుతూ, అంది, బావున్నాయి మీడయలాగూలు . పదండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. భోంచేసితరవాత మాటాడుకుందురు గానీ అంది వంటింటిలోకి దారి తీస్తూ.

పండు బిక్కమొహం వేసుక్కూచున్నాడు. రత్నమాల వాడిమొహం చూసి, మాపిల్లలు వుంటే బాగుండు. ముగ్గురూ ఆడుకునేవాళ్లు. వాళ్ల ఫ్రెండు పుట్టినరోజు. ఉండమన్నాను కానీ విన్లేదు. అంది రిమోటు అందిస్తూ.  

వంటింట్లో ఏమైనా సాయం చెయ్యనా?” అనడిగింది సుమన.

చెయ్యడానికేం లేదండి. మరో అయిదు నిముషాల్లో అంతా సిద్ధం. మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటుండండీ. అంది రత్నమాల.

భోజనాలబల్లదగ్గర, అత్తయ్యగారు సుమన పక్కనే కూర్చుని, నుదుటిమీద ముంగురులు సవరిస్తూ, నల్లగా, ఒత్తుగా బారెడు జుత్తు, ఒకంతట లొంగేది కాదు జడేయటానికి. మీఆయన కత్తిరించేసుకోమన్నాడా?” అన్నారు.

లేదండీ. ఆయనేం అనలేదు. నాకే ఏదో తేలిగ్గా వుంటుందనిపించి అంటూ అసంపూర్తిగా వదిలేసింది.

అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడా? రెండు చేతులా నొల్లుకోడానికే కదా వున్నవూరూ, కన్నతల్లీ అన్నీ వదిలేసుకు ఇంత దూరం ఈ పరుగులూ …. ఏమేనా వెనకేస్తున్నావా. చెప్పలేం తల్లీ సిరులు ఎలా వస్తాయో ఎలా పోతాయో. నువ్వు ఎందుకు పని చూసుకోలేదూ? మీఆయన ఒప్పుకోలేదా? … .అయితే ఒక్క బిడ్డేనా? ఎంచేతా .. సుబ్భరంగా సంపాదించుకుంటున్నారు… కడిపెడు బిడ్డల్ని కనాలి గానీ. ఒక కన్ను కన్నూ కాదు, ఒక బిడ్డ బిడ్డా కాదు అనేవారు మాఅత్తగారు. నాకూ మారాంబాబు ఒక్కడే కదా.

తెల్లబోయింది సుమన. ఈవాగ్ధోరణి తాను వూహించను కూడా లేదు. ఏంచెప్పాలో తోచడంలేదు. పెంకె పిల్లాడి గుప్పిట్లో ఇరుక్కున్న జేగురుపిట్టలా ముడుచుకు పోయి, రత్నమాలవేపు చూసింది పాహిమాం అనుకుంటూ.. ఆవిడ తలొంచుకుని దీక్షగా తనపనేదో తాను చేసుకుంటోంది. నవ్వు ఆపుకుంటోందేమో …

ఆఖరికి సుమన వొంట్లో వున్న శక్తినంతా కూడగట్టుకుని, అత్తయ్యగారి వాక్ప్రవాహానికి ఆనకట్ట వేస్తూ,  లేదండీ. ఆయనేం అనలేదు. అసలు ఆయనేం అనరు. నాకు సంబంధించినంతవరకూ నా ఇష్టాయిష్టాలే. నాకేం తోస్తే అదే చేసుకుపోతుంటాను అంది.

మరి పని ఎందుకు చెయ్యవూ… ఇక్కడ పిల్లల్నాడించేవాళ్లూ కనిపెట్టుకునుండేవాళ్లూ అన్ని సదుపాయాలూ వున్నాయి కదా.

మనపిల్లాడ్ని వాళ్లకీ వీళ్లకీ ఒప్పచెప్పి నేను సాధించేదేంవుంది అని నేనే చూసుకుంటున్నానండీ అంది తనేదో తప్పు చేసినట్టు అవిడ అనుకుంటున్నందుకు నొచ్చుకుంటూ.

నేనూ అదే అన్నానండీ అంది రత్నమాల ఇంతసేపటికి నోరు విప్పి. తరవాత, ప్లేట్లూ, గ్లాసులూ బల్లమీద పెడుతూ, సుమనతో అందరినీ రమ్మని చెప్పండి. అయిపోయింది. అంది. సుమన బతుకు జీవుడా అనుకుని గబుక్కున ఎగిరి గెంతేసి పక్కగదిలోకి పరారీ అయింది.  తిరిగి వచ్చేక, పిల్లాడికి తినిపించాలన్న నెపంతో అత్తయ్యగారి పక్కన కూచోలేదు కానీ పూర్తిగా తప్పించుకోలేకపోయింది. ఎదురుకుర్చీలో కూచున్నారావిడ.

తింటున్నంతసేపూ అత్తయ్యగారు సుమనని ఏవో అడుగుతూనే వున్నారు అల్లుడుగారు నిన్ను బాగానే

చూసుకుంటాడా? ఆదాయం బాగుందా?  ఇల్లు మనదేనా?

తిరుగుప్రయాణంలో కారులో శివరావు సుమన వేపు తిరిగి, అత్తయ్యగారిని చూడ్డం అయింది. యూ హాపీ?” అన్నాడు,.

సుమనకి ఏంచెప్పాలో తోచలేదు.

000

సుమన కలం బల్లమీద పెట్టి, చేతిలోని కాగితం మడత పెడుతుంటే శివరావు వచ్చేడు ఆఫీసునుంచి. సుమన చేతిలో కాగితం చూస్తూ ఉత్తరాలా? ఎక్కడినుంచి? అన్నాడు.

సుమన మౌనంగా తనచేతిలోని కాగితం అతనికి అందించింది. శివరావు అందుకుని సుమనవైపు చూశాడు. ఆవుత్తరం అత్తయ్యగారినుంచిలా వుంది. అనుమానంగా చూశాడు ఆమెవేపు. చూడమన్నట్టు తలూపింది సుమన.

చిరంజీవి సౌభాగ్యవతి సుమనకి,

మీ అత్తయ్య దీవించి వ్రాయునది, నేను ఇక్కడ క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను.

నువ్వు అంత దూరం పని గట్టుకుని నన్ను చూట్టానికి రావటం నాకెంతో ఆనందంగా వుందమ్మా. నిన్ను మళ్లీ చూస్తానని జన్మలో అనుకోలేదురా బంగారూ. నన్ను గుర్తు పెట్టుకుని, చూట్టానికి వచ్చేవు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. 

నీకు చిన్నప్పటినుండీ ఎంతో మప్పితం. బడి కాంగానే రోజూ మాయింటికి పరుగెత్తుకు వచ్చేసేదానివి, గుర్తుందా. నేను నీకోసం ఎదురు చూస్తుంటే మామయ్యగారు నన్ను ఎగతాళి పట్టించేవారు నీ అభిమాన పత్రిక ఇంకా రాలేదా అంటూ. నువ్వు ఆరేళ్లపిల్లవి చూస్తూండగానే నాకళ్లముందే హైస్కూలు ముగించేంత ఎదిగిపోయేవమ్మా. అయితేనేంలే. నాకెప్పుడూ, ఇప్పటికీ ఆ ఆరేళ్లపిల్లలాగే కనిపిస్తావే చిట్టితల్లీ.. అందుకే నిన్నటిరోజున నిన్ను చూడంగానే ఎన్నో అడగాలని ఆరాటం నాకూ …. ఎలా వున్నావు? ఏం చేస్తున్నావు? నీ కాపురం ఎలా వుంది?  అబ్బాయికి నువ్వంటే ప్రేమేనా? బాగా చూసుకుంటున్నాడా? … నేనూ అనుకున్నాలే నా ప్రశ్నలు నీకు చిరాకుగా వుంటాయని. ఏం చెయ్యనూ .. నేను నీలా చదువుకోలేదు కదమ్మా. మీకాలపు మర్యాదలూ మన్ననలూ నాకేం తెలుస్తాయి చెప్పూ. మీలా సినిమాలూ, రాజకీయాలూ నాకు తెలీవు. నాకు తోచిన సంగతుల నాకు చేతనయినట్టు మాటాడతాను. మరి నా తాపత్రయం అట్లాంటిది. అంతే. మాటొచ్చింది కనక అడుగుతున్నాను, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటాడా? ఇక్కడ తాగుడూ, వ్యామోహాలూ ఎక్కువట కదా. లేదులే వూరికినే అన్నాను. అబ్బాయి బుద్ధిమంతుడిలాగే వున్నాడు. చూశాను కదా. 

నీకు జ్ఞాపకం వుందా? ఓసారి మామయ్యగారు వూరెళ్లి, అక్కడినుంచి వుత్తరం రాసేరు. నాకు చదువు రాదు కదా. నీచేత చదివించుకున్నాను. చదవమన్నానే కానీ పూర్తిగా చదవనివ్వలేదు నిన్ను. నువ్వేం అడుగుతావో, ఏం చెప్పాల్సొస్తుందోనని సగంలో  నీచేతిలోంచి ఉత్తరం పెరుక్కున్నాను. ఇప్పుడు పెద్దదానివయేవు. నువ్వూ కాపురం చేసుకుంటున్నావు. మరి ఇప్పుడు తెలిసిందా?. మీ ఆయనకూడా సరసుడే అనుకుంటాలే. అప్పట్లో మామయ్యగారు తిరిగి వచ్చేక కాస్సేపు పోట్లాడుకున్నాం. నాకు చదువు రాదని తెలిసి ఎందుకు వుత్తరం రాయటం అని నేనూ, అందుకే చదువు నేర్చుకో అని మీ మామయ్యగారూను. మీరు గుంటూరు వెళ్లిపోయనతరవాత నీకు ఉత్తరం రాయాలని చదువు మొదలు పెట్టాను కూడాను  కానీ సాగలేదమ్మా.

నువ్వు స్కూల్లో చేతిపనుల క్లాసులో చిన్న చదరంత చాప అల్లి తెచ్చావు గుర్తుందా? అత్తయ్యగారూ, మీరు పూజ చేసుకున్నప్పుడు కూచోడానికి బాగుంటుందని మీకోసం అల్లేనండీ అంటూ తెచ్చి ఇచ్చేవు. అది అలాగే పదిలంగా అట్టి పెట్టుకున్నాను, తెలుసా? కూచుంటే ఆరిగిపోతుందని గోడవార పెట్టేను కానీ ఎప్పుడూ దానిమీద కూచోనేలేదు. తిరిగి వెళ్లేక దానిమీద కూచుని మీదంపతులపేరున సత్యనారాయణవ్రతం చేయిస్తాను మీరిద్దరూ  పదికాలాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో కళకళలాడుతూ వర్థిల్లాలని కోరుకుంటూ.

నువ్వు నన్ను చూడడానికి వచ్చేవు. అంతే చాలు తల్లీ నాకు. నిన్ను మళ్లీ చూస్తానని నేను జన్మలో అనుకోనేలేదు సుమా. మళ్లీ ఇంకోసారి చూడలేనేమో కూడాను. ఈజగన్నాటకంలో నాపాత్ర ముగిసే సమయం వచ్చింది. ఆ శివుడాజ్ఞకోసం ఎదురు చూస్తున్నాను. ఆయిన ఆజ్ఞ ఎప్పుడు అయితే అప్పుడు వెళ్లిపోతాను. ఈ పిచ్చి అత్తయ్యగారిమీద కోపం పెట్టుకోకమ్మా. వుండనా మరి.

                                                                             సదా నీ మేలు కోరుతూ, శుభాశీస్సులతో,

                                                                                  మీ అత్తయ్య

శివరావు కాగితం తిరగా బోర్లా చూసి, కవరుకోసం చూసి చుట్టూ చూసి, సుమన మొహంలోకి చూశాడు. నెమ్మదిగా

దగ్గరకొచ్చి, తనపక్కన కూర్చుని, అత్తయ్యగారి మనసు కనిపెట్టి అద్దం పట్టినట్టు రాసేవు. అచ్చంగా ఆవిడ మాటలే.

ఆవిడ ఇది చూస్తే ఎంత మురిసిపోతారో అన్నాడు.

సుమన పెదవి విరిచి, రాతలకేముంది చేతల్లో కనిపించాలి గానీ అంది.

నువ్వలా గిల్టీగా ఫీలవకు. మనసులో వుండడం కూడా ముఖ్యమే. అదీ లేనివాళ్లెంతమంది లేరు,. అన్నాడు. రెండు నిముషాలాగి, వాతావరణం తేలిక పరచడానికి, అది సరే కానీ నాకేమిటి తాగుడూ, వ్యామోహాలు అంటగట్టేవు అన్నాడు దగ్గరగా జరిగి, మొహంలో మొహం పెట్టి చూస్తూ.

సుమన ఒక కన్ను సగం మూసి కొంటెగా నవ్వింది, అతనిగుండెలమీదకి వాలుతూ.

ఇంతలో ఫోను మోగింది ఛప్, రసభంగం అంటూ శివరావు లేచి,. ఫోను అందుకున్నాడు. అయ్యో… ఎప్పుడూ…  అలాగే చెప్తానండీ…. అని, ఫోను పెట్టేసి ఇటు తిరిగేడు.

సుమన మొహం పాలిపోయి వుంది. చేతిలో కాయితంమీద కళ్లు నిలిచిపోయాయి. శివుడాజ్ఞ అన్న పదం వేలితో తడమసాగింది.

శివరావు నెమ్మదిగా వచ్చి, సుమన పక్కన కూర్చుని, అత్తయ్యగారికి రాత్రి గుండెపోటు వచ్చిందిట. ప్రమాదంలేదు. టెస్టులు చేస్తున్నారుట. సర్జరీ అవసరం కాకపోవచ్చుట, అన్నాడు వీలయినంత గబగబా.

సుమనకి కళ్లలో ఉబికివస్తున్న నీటిపొరల్లోంచి శివుడాజ్ఞ అలుక్కుపోయి, సరిగ్గా కనిపించడంలేదు. శిరావు చెయ్యి పుచ్చుకుని, సత్యనారాయణవ్రతం చేద్దామండీ అంది బొంగురు పోయిన గొంతుతో, జీవితంలో మొదటిసారిగా.  

శివరావు వులికిపాటు కప్పి పుచ్చుకుని, అలాగే. తప్పకుండా చేద్దాం. వచ్చే శనివారం పౌర్ణమి అనుకుంటాను అన్నాడు.

 

000

(నవంబరు 2008. )

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “శివుడాజ్ఞ (రెండో ముగింపుతో)”

 1. సౌమ్యా, నచ్చలేదు. సరే.
  ఉత్తరం ఎందుకు అంటేః అత్తయ్యగారి పాత్రని పూర్తిగా (మొదటికథలో జరగనిది) ఆమెకోణంలోనుండి ఆవిష్కరించడంకోసం. అది ఎలా చేస్తాం అన్నది టెక్నిక్‌కి సంబంధించినది. 1. కథకుడే అత్తయ్యప్రవర్తనని వివరించవచ్చు. 2. మూడో వ్యక్తి (శివరావు గానీ, రత్నమాల గానీ) మనోవిశ్లేషణ ఉపన్యాసం ఇవ్వొచ్చు. లేదా 3. సుమనే అత్తయ్యగారి ప్రవర్తన గురించి తనలో తాను వితర్కించుకోవచ్చు.
  మూడోదే న్యాయంగా తోచింది నాకు. ఎందుకంటే వారిద్దరిమధ్య అనుబంధం సుమనకే ఎక్కువ తెలుసు కనక.
  అది మళ్లీ ఎలా చెప్పొచ్చు అంటే మనసులో ఆలోచనల్లాగ లేదా డైరీలో రాసుకుంటున్నట్టు, సుమన మరో కథ రాసినట్టు – చెప్పొచ్చు. నామటుకు నాకు అత్తయ్యగారే చెప్తే ఎలా చెప్పివుండేవారో అన్నది వుత్తరంలోనే బాగా స్పష్టం చెయ్యగలను అనిపించింది. అదన్నమాట కథ.

  ఇష్టం

 2. హ్మ్మ్…. నాకు ఏమిటో ఈ కథ నచ్చలేదు😦 అంతా బాగానే ఉంది కానీ, చివరికి వచ్చేసరికి అర్థం కాలేదు. సుమన ఉత్తరం ఎందుకు రాసుకుంది అంటారు??

  ఇష్టం

 3. రాధికా, అదా సంగతి. నీకు గుర్తుందా నువ్వు అన్నమాటమీద కథ రాస్తానని నీకు మాటిచ్చాను ముందొకసారి. అంచేత నీ అభిప్రాయం స్పెషల్. నీఆలోచనకి న్యాయం చేకూర్చేనా లేదా అని. మొత్తంమీద ఒకటికి రెండు కథలొచ్చేయి🙂

  ఇష్టం

 4. మాలతి గారూ శీర్షిక చూసి రెండవ ముగింపు ని కధకి కలిపి పోస్ట్ చేసారేమో అనుకుని ఇటువైపు రాలేదు.బాగుందండి ఉత్తరం ఆలోచన.

  ఇష్టం

 5. మధురవాణీ,😦 అనుకోనక్కర్లేదండీ🙂 ఉత్తరంలో కాదుకానీ, తరవాత సుమన వాక్యం, రాతలకేం గానీ, చేతల్లో కనిపించాలి, అన్న వాక్యంలో స్ఫష్టం చేసేననుకున్నాను. మీరన్నది నిజమే. సంకల్పం మొదలు ఆచరణ తరవాతాను.

  ఇష్టం

 6. నిజమేనండీ మాలతీ గారూ..
  ఎదుటి వారి మనసుల్ని అర్ధం చేసుకోవడం.. అన్నదాకే నా ఆలోచనలు వెళ్ళాయి.
  మీరన్నట్టు అర్ధం చేసుకున్నా ఆచరణలో పెట్టడం చాలా కష్టం.. అనేది చాలా గొప్ప విషయం.
  మీ కథలో నిగూడంగా ఉన్న ఆ విషయం నాకు తట్టనే లేదు మీరు చెప్పేవరకూ..
  అర్ధం చేసుకోవడమే గొప్ప అన్న దగ్గరే నా ఆలోచనా పరిధి ఆగిపోయినట్టుంది. అందుకే ఆచరణ దాక వెళ్ళలేదు😦
  పోనీలెండి.. అక్కడిదాకా వెళ్ళగలిగితే.. మెల్లగా ఆచరణ కూడా ప్రయత్నించవచ్చు.. ఏమంటారూ?🙂

  ఇష్టం

 7. ఎవరైతేనేమిటీ – మీ అభిప్రాయాలు మీవి. ఈలింకు కూడా చూడండి. http://madhuravaani.blogspot.com/.
  నెటిజన్ – ఈకథకూడా మీకు నచ్చినందుకు సంతోషం.
  మధురవాణీ, మొదటికథలో రెండోముగింపు నిజమే నీరసంగా వుంది. మీకు ఉత్తరం నచ్చినందుకు సంతోషంగా వుంది. ఎదటివారి మనస్తత్త్వం అర్థం అయింతరవాత కూడా ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో ఎత్తి చూపడానికి ప్రయత్నించేను ఆవుత్తరంతో.
  ధాంక్స్.

  ఇష్టం

 8. మాలతి గారూ,
  నా బ్లాగులో నేను రాసింది ఓపికగా చదివి మీ అభిప్రాయాలు వెల్లిబుచ్చినందుకు ధన్యురాలిని. వాస్తవానికి అదే నా మొదటి ప్రయత్నం. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
  మీ ‘శివుడాజ్ఞ’ అన్నీ ముగింపులు చదివాను. కథ చాలా బావుంది. మొదటి పోస్టులో మొదటి ముగింపు చక్కగా ఉంది. మీరన్నట్టుగా.. రెండవ ముగింపు కాస్త అసంపూర్ణంగా అనిపించింది. అందుకే ఎక్కువమందికి అది నచ్చలేదనుకుంటా.. కానీ, రెండోసారి మళ్ళీ రాసారు కదా..కథ మొత్తం. అది చాలా బాగా నచ్చింది నాకు. సుమన ఉత్తరంలో రాసింది అద్భుతం. మనసుల్ని అర్ధం చేసుకోవడం అంటే ఇదేనేమో.. అనిపించింది నాకు.
  ఇప్పటి నుంచీ మీ పోస్టులు క్రమం తప్పకుండా చదవాలని నిర్ణయించుకున్నాను. మీ అనుభవసారం, ఆలోచనా తీరూ మీ శైలి లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.
  మీ బ్లాగుని చూడగాలిగినందుకు చాలా సంతోషంగా ఉంది🙂

  ఇష్టం

 9. సుమన వ్ర్రాసుకున్న అత్తయ్య గారి ఉత్తరం ఆ రెండు పాత్రలకి నప్పింది. ఇదొక మలుపు.
  శివుడాజ్ఞ లో ఉండటం – పోవటమే కాకుండా – దారిలో ఉంచటం ( “..సర్జరీ అవసరం కాకపోవచ్చుట,”)కధకురాలికే చెల్లు.🙂
  ఇది మరో ముగింపు.
  ఇది చాలా మంది పాఠకులని రంజింపచేస్తుంది.

  ఇష్టం

 10. Seems that you already decided what you wanted to write even before you asked audience for a mugimpu. This story sounds a lot dampier than the earlier endings. In fact if one read the first version and came here, he will be disappointed.

  Not one lady – even if she never went to school – would ever ask such questions to a lady settled in USA. Those old ladies who never went to school, in fact have better common sense – I have to disagree with your views. But then it is your story. Go ahead.

  [This comment has been edited. You may have misunderstood. I did not ask the readers for mugimpu on this sir. — Malathi]

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s