అయ్యో, ఒక్కరయినా చెప్పలేదు!

అమెరికా వెళ్లడానికి ఆయత్తమవుతున్నాను. కనిపించిన ప్రతివారూ సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. ఒక మహావీర దేశభక్తుడి వచనాలు, “ఇదుగో చూడు. నువ్వు పరదేశం వెళ్తున్నావు. అంటే నువ్వు అక్కడ మనదేశానికి అనధికార ప్రతినిధివి అన్నమాట. గాంధీ గారి వారసురాలినని మరువకు.”
“ఏ గాంధీ?” అన్నాను భక్తిప్రమత్తులతో. ఎందుకంటే నాకింకా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు మనసులో మెదులుతున్నాయి.
ఆ మ.వీ. దేశభక్తుడు నావేపు అసహ్యంగా చూసి విసురుగా చేతులూపుకుంటూ వెళ్లిపోయాడు.
నాకు లెక్కల్లో డిగ్రీ వుంది. చిన్నచిన్నతప్పుల్తో పైథాగరస్ సిద్ధాంతంమీద చిన్న ఉపన్యాసం ఇవ్వగలను. అంతకంటె ఓచూపువాసి తక్కువగా ఐన్‌స్టీన్ గురించి కూడా మాటాడగలనేమో. కానీ శంకరుడిగురించో పాణిణిగురించో అడిగితే కటకటలాడాలి.
హడావుడిగా లైబ్రరీకి వెళ్లి ఓ కట్ట వుస్తకాలు తెచ్చేను – మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, అరబిందో, గురు మహరాజ్ జీ, బాబాలూ, కోబ్రాలూ, హిందూమతం, ఎలిఫెంటా కేవులు, మీనాక్షి ఆలయం, బృందావన్ గార్డెనులు – ఒకటేమిటి కనిపించిన ప్రతివిషయంమీదా ఓ పుస్తకం తీసేసుకున్నాను.
ఇంకా అమెరికా వెళ్లి, అమూల్యమైన అభిప్రాయాలతోనూ, అనన్యసామాన్యమైన వస్తుసంచయంతోనూ తిరిగొచ్చిన వారిని కూడా సంప్రదించేను. వాళ్లందరూ కూడా అప్రతిహతమైన సలహాలే ఇచ్చేరు.
ఉదాహరణకిః
“నువ్వు నువ్వే. గుడ్డిగా వాళ్లని అనుకరించి మనజాతికి తలవొంపులు తేకు.”
“నువ్వు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిన విషయం రోములో రోమనుడివలే మనవలె.”
“నూలు చీరెలు పుష్కలంగా పట్టుకెళ్లు. అక్కడ నూలుబట్టలధరలు మండిపోతున్నాయిట.”
“చీరెలు పట్టుకెళ్లకు. అక్కడెవరూ చీరెలు కట్టుకోరు.”
“అమెరికనులు individualistic.”
“అమెరికనులు Self-reliant.”
“అమెరికనులు చిత్తశుద్ధి గలవారు.”
“ఓహో అమెరికా! అదొక భూతలస్వర్గం. డాలర్లంటే రోడ్డుమీద చిత్తుకాయితాలే అనుకో.”
“అక్కడ అమ్మాయిలందరూ అందమైన బాపూబొమ్మలే. నాకో డేటు సంపాదించిపెట్టరాదూ?” మా తమ్ముడి స్నేహితుడు సన్నగా నసిగేడు.
మరో మేనగోడలు రహస్యంగా, బాంబే ఫేషన్ పత్రికలో ప్రకటించిన లేటెస్టు ఫెషను నైలాన్ పాంటీలు ఓరెండు పేకట్లు పంపమంది నేను అమెరికాలో దిగిగానే.
ఇంకా ఫోర్కు ఎలా పట్టుకోవాలో, ఎప్పుడు థాంక్యూ చెప్పాలో, ఏ కారు కొనాలో, ఏ టూత్‌పేస్టు వాడాలో ..లాటివిషయాల్లో ఎనలేని సలహాలు ఉచితంగా వచ్చేసేయి వెల్లువలయి.
000
ఆఖరికి నేను న్యూయార్కులో దిగేను సగం నిండిన సూట్‌కేసుతోనూ, పచ్చళ్లూ, పొళ్లూ పూరాగా నిండిన చేతిసంచీతోను. కష్టములవారు నన్ను మతిమాలినదానినిగా గుర్తించి వుంటే, ఆమాట నాకు తెలీకుండా జాగ్రత్త పడ్డారు.
వారం రోజులపాటు తినడం, పడుకోడం, తినడం, పడుకోడం కార్యక్రమం అయిన తరవాత, ఓరోజు వుదయమే తెలివొచ్చింది.
మేలుకొని, కళ్లు తెరిచి, వొళ్లు విరుచుకుంటూ కిటికీలోంచి చూశాను.
శీతాకాలపు తొలి మంచు సుతారంగా కురుస్తోంది!
ఆహా! నాజీవితంలో తొలిహిమానీ తుంపరలు!
ఓహో … నాడెందము ఆనందమందిరమయి, నందనవనమయి నందివర్థనాలు విరగబూసింది.
తెల్లని మంచు దూది పింజల్లా గాలిలో విలాసంగా తేలి, సుతారంగా చెట్టుకొమ్మలమీదా, ఇళ్లమీదా, కారులమీదా వాలుతున్నాయి.
గుప్పుమని హృదయములో ఉత్సాహం ఉరకలు వేసింది.
లేచి, గబగబా మొహం కడుక్కుని, కాఫీ తాగి, కోటూ, బూటూ, మఫ్లరూ, టోపీ చుట్టబెట్టుకున్నాను. దసరాల్లో గంగిరెద్దు గుర్తుకొచ్చింది కానీ అట్టేసేపు నిలవలేదు ఆతలపు.
వీధిలో అడుగు పెట్టి మోము ఎత్తి కళ్లతోనే అమందానందం అనుభవిస్తున్నాను.
చల్లని మంచు లేత పుప్పొడిలా మొహంమీద వాలుతోంది మృదువుగా. నామానసవీణ ఘల్లున మోగింది.
రెండోకాలు తీసి ముందుకి వేశాను.
థమ్…
ముందుకి వేసిన కాలు ఇంకా ఇంకా ముందుకి సాగి, నాకాయాన్ని సాష్టాంగప్రణామఫక్కీలో నేలపాలు చేసింది.
క్షణకాలం ఆగి, నన్ను నేను కూడతీసుకుని, మెల్లిగా లేచి మళ్లీ రెండో పాదం ముందుకి వేశాను.
థమ్,
రెండోసారి నేలకరిచాను.
కాని లేవక తప్పదు. అలనాటి బ్రూస్-సాలెపురుగు కథలో‌లా మళ్లీ లేచి, మానవాళికి ఏమాత్రమూ జయంట్ స్టెప్ కాని అడుగు వెయ్యడానకి, బలి తల మోపిన పాదము కానీ పాదము ఎత్తి, చుట్టూ చూశాను ఈ పద్మవ్యూహంలోంచి ఎలా బయట పడడమా అనుకుంటూ. .
నాలుగడుగుల దూరంలో చిరునవ్వుతో నన్ను తిలకిస్తున్న అమెరికన్ ఒకాయన ముందుకొచ్చి చెయ్యి అందించాడు.
నేను గబుక్కున ఆచెయ్యి దొరకపుచ్చుకుని ఆ మంచుగుండంలోంచి బయటపడ్డాను.
తరవాత అతని చెయ్యి వదిలేసి, నాదారిన పోబోతూ అన్నాను, “ఇంతవరకూ తెలీనేలేదు. ఒక్కరయినా చెప్పలేదీ మాట నాకు.”
“ఆఁ?” అన్నాడు అతను అయోమయంగా చూస్తూ.
“మంచులో జారిపడతాం అని.”

000

(ఒకమాటః ఈకథ నేను అమెరికా వచ్చేక రాసిన మొదటి కథ. 1982లో ఇంగ్లీషులో Wisconsin Review లో ప్రచురింపబడింది. ఆతరవాత భాషమీద కూడా ఇలాగే హాస్య, వ్యంగ్యంధోరణిలో రాసి పంపిస్తే వాళ్లు వేసుకోలేదు. మాడిపార్ట్‌మెంటులో సంస్కృతం ప్రొఫెసరు ఫ్రాన్సిస్ విల్సన్ నాయందు ప్రత్యేకాభిమానం చూపే ఆత్మీయురాలు. ఆమెని అడిగేను ఈరెండు కథల్లో తేడా ఏమిటని.
“మొదటికథలో అమెరికన్‌ని హీరో చేసావు. రెండోకథలో హేళన చేశావు” అన్నారావిడ. ఏకథ ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాం అన్నది ఆలోచించుకోవాలి అని ఆమె అభిప్రాయం. అందునా ఇతర సంస్కృతులవారికోసం రాసే కథలవిషయంలో ఇది మరీ అవసరం. – మాలతి, డిసెంబరు 2008. .)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “అయ్యో, ఒక్కరయినా చెప్పలేదు!”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s