ఊసుపోక – “కలం బలం” అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?

(ఎన్నెమ్ కతలు 25)

 నాచిన్నప్పుడు స్కూళ్లలో వక్తృత్వపోటీలకి కలం బలమా కత్తి బలమా అన్న విషయం తరుచూ తీసుకునేవారు. విద్యార్థులు అమాయకత్వంచేతా, పంతులిగారి కటాక్షం ఆశించీ కలం బలం అన్నవాదనకే ఎక్కువగా మొగ్గు చూపేవారు.

పోటీలు జరగడానికి అవసరం కనక పంతులుగారు కత్తి బలం అన్న వాదం తీసుకుని కొందరయినా వాదించాలని పిల్లల్ని బలవంతం చేసి ఎదురు నిలబెట్టేవారు.

నేను ఇదివరకు పుస్తకాలు ప్రచురించుకోడం గురించి రాసేను. గత పదిరోజుల్లోనూ కథలూ, వ్యాసాలూ ప్రచురించుకోడంలో ఈతిబాధలు కూడా తెలిసొస్తున్నాయి.   

ఇదుగో, ఇదీ వరస

. సాధారణంగా ప్రతి పత్రికకీ పాలసీ వుంటుంది. వారు ఏ ధ్యేయంతో పత్రిక మొదలు పెట్టేరో, ఎలాటి రచనలు వేసుకుంటారో చెప్తారు పాలసీ స్టేట్మెంటులో. 

రచయితలకి సూచనలు కూడా ఇస్తారు. ఇదివరకయితే కాగితానికి ఒకే వైపు రాయాలి, తిరుగుటపాకి పోస్టేజి జత పరచాలి లాటివి వుండేవి. సంపాదకులదే తుది నిర్ణయం అనీ, వారికి మన కథ ప్రచురణార్థం చిరుమార్పులు చెయ్యడానికి అధికారం కలదు అని కూడా వుంటుంది.

ఇప్పుడయితే, ఈమెయిలు చెయ్యొచ్చు, ఫలానా ఫాంటులో, ఇన్ని మాటలకి మించకుండా … ఇలా వుంటున్నాయి.

కొన్ని పత్రికలు రచయితలకి ప్రతిఫలం కూడా పంపేవారు. కొన్ని పత్రికలు ప్రచురించిన పత్రికకాపీ పంపేవారు. వాళ్లు ఏది ఇస్తే అదే మహా ప్రసాదం అనుకుని స్వీకరించేవాళ్లం. నాలాటి చిన్నసైజు రచయితలు పత్రికలవారు ఏది ఇస్తే అదే తీసుకోడం, ఏమీ ఇవ్వకపోతే వూరుకోడం, అంతే. భమిడిపాటి రామగోపాలంగారిలాటి పెద్దలు దబాయించి వస్తూలు చేసేవారుట. ఆయనే చెప్పేరు నాతో ఒకసారి.

రచయితలకి పత్రికలవారు ఇచ్చే గౌరవంగురించి పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు ఒకసారి ఎక్కడో రాశారు.

 స్థూలంగా కథ ఇదీ

ఆంధ్రపత్రిక, భారతి సంస్థాపకులు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఒక సుప్రసిద్ధ రచయిత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికి ఉత్తరం రాసేరుట దయచేసి మా పత్రికకి వ్యాసం రాసి పంపండి, మీరు తప్పక రాసి పంపగలరని ఆశిస్తూ, ప్రతిఫలం జత పరిచాం, అని రాసి, డబ్బుతో సహా ఉత్తరం పంపించేరుట.

ఆతరవాత శివలెంక శంభుప్రసాద్‌ గారి హయాంలో ఆరచయతకే రాస్తూ, మీరు మాపత్రికకి వ్యాసాలు పంపవలసినదిగా కోరుతున్నాం. మీరచన అందుకున్న వెంటనే ప్రతిఫలం పంపగలం. అని రాసేరుట. ఇక్కడ ప్రతిఫలం జత పరచడం జరగలేదు.

ఆతరవాత రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆరచయితే మరో ఉత్తరం అందుకున్నారు. మీరు వీలు చూసుకుని మాపత్రికకి వ్యాసాలు పంపుతే సంతోషం అని ఆవుత్తరం. అందులో ప్రతిఫలంమాటే లేదు!

ఈ మూడు వుత్తరాలూ ఉదాహరణగా తీసుకుని పత్రికాధిపతులకి రచయితలయందు గౌరవం ఎలా తగ్గుతూ వచ్చిందో ఎత్తి చూపారు సత్యనారాయణమూర్తిగారు.

ఆరోజుల్లో పత్రికలు ప్రతిఫలం ఇచ్చినప్పుడు కూడా రచనమీద హక్కులు రచయితలవే. ఒక పత్రికకి రచన పంపితే తొలిసారి ప్రచురణకి మాత్రమే ఆ పత్రికకి రచయిత అంగీకారం ఇచ్చినట్టు అనే అర్థం. తరవాత రచయితలు సంకలనాలు ప్రచురించుకున్నప్పుడు ఆయా పత్రికలకి కృతజ్ఞతలు తెలుపుకునేవారు. అదీ ఆచారం. వీటికి రాతకోతలు లేవు.

ప్రతిఫలం మాట వదిలేద్దాం. ఇప్పుడు రచయితలకి తమ రచనల మీద హక్కులు ఎలా వుంటున్నాయో చూడండి.

నేను ఇదివరకెప్పుడు ఏ పత్రికకి పంపినా పాత ఆచారాలు మనసులో వున్నందున హక్కులవిషయం పరీక్షగా చూడ లేదు. పత్రికలవారి పాలసీలు గమనించలేదు. ఈవిషయంలో పూర్వకాలం నుండీ వస్తున్న అచ్చు పత్రికలు ఆనాటి సాంప్రదాయాలే పాటించడం కొంత కారణం కావచ్చు. 

ఇప్పుడే తెలిసింది కొన్ని సైబరు సైటులు కొత్త నిబంధనలు పెడుతున్నారు అని.

ఆ సైటులకి మనం ఒక కథో వ్యాసమో ఇస్తే, దానిమీద సర్వహక్కులు తమవే అంటున్నారు. వారు ప్రచురించిన తరవాత మీరెక్కడ ప్రచురించుకోవాలన్నా మీరు ముందుగా వారి అనుమతి తీసుకోవాలిట. వారు అనుమతి ఇవ్వకపోతే మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు.

ఇలాటి నిబంధనలలో అంతర్గతంగా వాచ్యం చేయకుండా మణిగి వున్న భాగాలు పత్రిక లేక సైటువారు ప్రచురించిన రచన తమ ఇష్టప్రకారం మార్చుకోడం, వున్న వాక్యాలు తీసేయడం, కొత్తవి చేర్చడం లాటివి చేస్తే, రచయితకి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. పత్రిక లేక సైటువారు ఒక సంకలనం ప్రచురిస్తే, అందులో మీవ్యాసమో కథో వేసుకుంటే మీతో చెప్పక్కర్లేదు. ఒక్కమాటలో రచయిత హక్కులన్నీ హుళక్కి. ఇంతే సంగతులు.

నాదృష్టిలో ఇది రచయితల కృషిని అవమానించడమే. నేను రాసిన కథో వ్యాసమో రూపు దిద్దుకోవడంలో నా కృషి కంటే వారి ప్రచురణకే ఎక్కువ ప్రాధాన్యత అని చెబుతున్నట్టు వుంది ఈనిబంధన. నాదృష్టిలో అది కళాపోసన కాదు, వ్యాపారసరళి. బహుళ జనాదరణ పొందిన ఈమాట.కామ్, కౌముది.నెట్, వంటి నెట్‌.పత్రికలు ఇలా రచయితల హక్కులు సంగ్రహించకపోవడం వారి సాహిత్యాభిమానానికి నిదర్శనం అనే అనుకుంటున్నాను. 

ఇక్కడే మరొక హక్కు లేదా రచయితలకు గల/వుండవలసిన స్వాతంత్ర్యం గురించి కూడా చెప్పుకోవాలి.

నేను రాయడం మొదలు పెట్టినదగ్గర్నుంచీ, సంపాదకులు యథాతథంగా వేసుకుంటూనే వస్తున్నారు కనక నాకు ఈసంగతి అసలు తోచను కూడా లేదు.

ఇప్పుడు సంపాదకులు కథలని ప్రచురణకి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు సూచిస్తున్నారు. “Fine tuning” పేరుతో అలాటి చిన్న మార్పులు చేయడానికి కూడా తమకి హక్కులు వున్నాయంటున్నారు. బాగుంది..

అయితే చిన్న అంటే ఎంత చిన్న?

అప్పుడప్పుడు వర్థమాన రచయితలు నాతో వారి రచనగురించీ, సంపాదకుల దగ్గర్నుంచి వారు అందుకున్న సూచనలగురించి ప్రస్తావిస్తూ వుంటారు. ఆసూచనలు లేక వ్యాఖ్యలుఒక మాటో, ఒక వాక్యమో, తుదో, మొదలో మార్చమనడం కావచ్చు. సన్నివేశాలు బలంగా లేవూ, తీసుకున్న అంశం కథకి పనికి రాదు అనేనా కావచ్చు. 

ఉదాహరణకి నేను కన్నా, విన్నా కొన్ని సూచనలు తీసుకుని సమీక్షిస్తే ఇలా వుంటుంది.

మీరు కథ బజారులో మొదలుపెట్టేరు. కాలేజీలో మొదలు పెట్టి రాయండి

మీరు వాడిన తెలుగుమాటలు ఎవరికీ అర్థం కావండీ. ఇంగ్లిష్ మాటలు పెట్టండి

మీ హీరో కాలేజీ స్టూడెంట్ కదా. ఇప్పుడెవరు అలా మాటాడుతున్నారండీ?

ఫలానా సన్నివేశంలో మీ పాత్ర కుర్చీమీద కూర్చున్నట్టు రాసేరు. కౌచ్ అని రాస్తే బాగుంటుంది.

… ఈ వాక్యాలు తీసేయండి

… ఆ వాక్యాలు తిరగరాయండి

పాత్రలని పటిష్టం చెయ్యండి

ముగింపు ఇచ్చి వుంటే, ముగింపు పాఠకులకి వదిలెయ్యండి

ముగింపు పాఠకులకి వదిలేస్తే, ముగింపు ఇవ్వలేదు. అసంపూర్ణంగా వుంది.

ఇవీ, ఇలాటివీ చెప్పి, ఆ రచయిత ఏమిటండీ. ఇలా నాకథంతా మార్చేయమంటున్నారు? అని అన్నారు.

కథ మొదలూ, తుదీ, మధ్యలో సంభాషణలూ, కథకుడి భాషణలూ అన్నీ మార్చేస్తే ఇహ మిగిలేది ఏమిటి, పేర్లూ,  సుమారుగా కథాంశం! 

ఏం చెప్పాలో నాకు తెలీలేదు. కానీ నాకు అంతకంటె ఆశ్చర్యం ఈసంపాదకులకి ఇంత టైమెక్కడ దొరికిందా అని. వాళ్లకీ ఉద్యోగాలుంటాయి, సంసారాలుంటాయి, ఇతర వ్యాపకాలుంటాయి. వీటన్నటిమధ్య, వారికి అందిన ప్రతి రచననీ ఇంత నిశితంగా పరిశీలించి, చర్చించే టైమెక్కడిది చెప్మా అని నాకు ఆశ్చర్యం.

విమర్శల విషయం తీసుకుంటే, ఈనాడు సాహిత్యచర్చల్లో ప్రముఖంగా కనిపిస్తున్న ఒక అంశం కథనం ఎంతవరకూ పాఠకుల మేథకి వదిలిపెట్టాలి అన్నది. ఈవిషయంలో వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు నామేథోశక్తిని శంకించే, కించ పరచే రచనలంటే నాకు గౌరవంలేదు అన్నారు (ఈవాక్యం సుమారుగా నాకు గుర్తున్నట్టు రాస్తున్నాను..).

నా అభిప్రాయం కూడా అదే. నేను కూడా పాఠకులు ఆలోచించుకోవాలి అనే అనుకుంటూ రాస్తాను. ఒకటి రెండు వాక్యాల్లో అన్యాపదేశంగా పాత్రల అభిప్రాయాలు సూచించి వదిలేస్తాను పాఠకులు గ్రహించగలరనే. (ఈమధ్య వచ్చే కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే అట్టే వదిలిపెట్టడానికి వీల్లేదు అనే అనిపించినా,) కథలు చదివి ఆలోచించుకునే మంచి పాఠకులు  వున్నారని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఎంతవరకూ వదిలివేయాలి అన్నది రచయిత నిర్ణయానికే వదిలిపెట్టాలి అని కూడా అంత గట్టిగానూ నమ్ముతాను.

ఈసందర్భంలోనే నేను గమనించినది

కొన్ని విమర్శలు చూసినప్పుడు, అవి రాసినవారు కథలో రచయిత ఏం చెప్తున్నాడు అన్న దృష్టితో కాక మనం రచయితకి ఇవ్వగల సలహాలు ఏమిటి అన్న దృష్టితో చదువుతున్నారేమో అనిపిస్తుంది .

వున్నదున్నట్టు చదివి శిల్పంలో ఏమి లోపమో చెప్తే అదో దారి. ఫలానా చోట సందర్భశుధ్ధి లేదు అంటే అదో దారి. అంతేకానీ, ఇలా ఎందుకు రాసేవు, అలా ఎందుకు రాయలేదు అంటే ఏం చెప్తాం? ఒక స్నేహితురాలు చెప్పినట్టు, ఇతివృత్తం ఇచ్చేస్తాను కథ మీరే రాసుకోండి అనాలనిపిస్తుంది! J)

అలాటి సూచనలు రచయితల ప్రతిభావ్యుత్పత్తులకి ప్రతిబంధకాలు. ప్రతి రచయితకీ ఓ శైలి వుంటుంది. తాను చెప్పదల్చుకున్నది తనకి అనువైన పద్ధతిలో, తాను ఎన్నుకున్న భాషలో చెప్తాడు.

సంపాదకులు ఆరచనావిధానం లేక శైలి తమ పాఠకులని ఆకట్టుకునేదిగా వుందా, తమ పాలసీ పరిథిలో ఇముడుతుందా లేదా అన్నది చూసుకుని, అంగీకరించడమో నిరాకరించడమో జరుగుతుంది సాధారణంగా. అలాగే జరగాలి. చిన్న అసంబద్ధతలు ఎత్తి చూపినా సంతోషమే. అంతేగానీ పేర్లు మాత్రం వుంచి కథ తిరగరాయండి అంటూ కథల వర్క్ షాపు పెట్టేయడం సమంజసంగా తోచదు నాకు.     

ఆరుద్ర “త్వమేవాహమ్” గ్రంథాన్ని రోణంకి అప్పలస్వామి గారికి అంకితమిస్తూ:

“దీపాన్ని వెలిగించేందుకు దీపం
సాన పట్టినమీదటే వజ్రం
బంగరు పళ్ళానికి గోడ చేర్పు
మీ చేతి చలువ వీడి కూర్పు.”

అన్నారు. తన రచనను బంగారుపళ్లెంతో పోల్చడం గమనించండి. రచనకీ, రచయితకీ మధ్యగల అవినాభావసంబంధం అర్థమవుతుంది.  

అలాగే తన సినీవాలీ గ్రంథాన్ని సినీనటుడు కొంగర జగ్గయ్యకి అంకితమిచ్చినప్పుడు జగ్గయ్య అంటారు.

 “పరిణతిలో ప్రభవించిన
కావ్యం నా కిస్తానంటే
తీసుకునే స్తోమతు నాలో
ఆశగా తలవొంచుకుంది.”

“‘అల్లుడా రమ్మ’ని ఆరుద్రగారు
పిలిచి పిల్లనిస్తామంటే
ములిగిపోయాను కృతజ్ఞతతో
ఏం చెప్పను? ఎలా చెప్పను?”
ఇది రచయిత అంటే సాహిత్యాభిమానులకి గల గౌరవం సూచిస్తుంది.

 రచయితలకీ, సాహిత్యపోషకులకీ, పత్రికాధిపతులకీ మధ్య గల సంబంధాలలో మార్పు కోరదగ్గదే కానీ ఈవిధంగా కాదు!

నామనవిః

సంపాదకులకీ, సైటు నిర్వాహకులకీః  99 శాతం రచయితలకి రాతలే వారి ఆస్తి. అది మీరు హక్కుభుక్తం చేసుకోడం న్యాయం కాదు. దయచేసి రచయితలకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండి. 

వర్థమాన రచయితలకిః  మీకథలు ఎవరికి పంపిస్తున్నారో, వారి పాలసీలేమిటో, మీహక్కులేమిటో ఓసారి పరీక్షగా  చూసుకోండి.


(డిసెంబరు 20, 2008. )

 

 

  

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

37 thoughts on “ఊసుపోక – “కలం బలం” అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?”

 1. సంపాదకుడంటే నా
  కింపారెడు భక్తి గలదు, ఎంచేతనగా
  సంపూర్ణ మనుజాడతడు
  చింపాంజీ కన్న నయము సిరిసిరిమువ్వా!
  – ఇది శ్రీస్కీ అభిప్రాయం!
  🙂

  మెచ్చుకోండి

 2. ఊసుపోక రాతలు ప్రధానంగా పోచికోలు కబుర్లే అయినా కదాచితుగా ప్రయోజనాత్మకమయిన విశేషాలు కూడా దొర్లుతాయి అనడానికి నిదర్శనం ఈవ్యాసం. నేను కాలక్షేపానికే అని మొదలు పెట్టి రాసినా ఘాటయిన విషయాలు ప్రస్తావనలోకి వచ్చేయి. చదువరులూ, బ్లాగరులూ, రచయితలూ, విమర్శకులూ, పత్రికలవారూ, సైటునిర్వాహకులూ యథోచితంగా సాదరంగా స్పందించడం నాకు చాలా సంతోషంగా వుంది. మంచి సమాచారం అందింది ఈరూపంగా.
  అందరికీ మనఃపూర్వకంగా మరోసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 3. “60 ఏళ్ల పై బడ్డ రచనలకు కాపీరైట్ ఉంటుందా!”
  ఉంటుంది.
  దీనిపై ఇండియన్ కాపీరైట్ ఆక్ట్ ఇలా ఉంది:
  What is the term of protection of copyright?
  The general rule is that copyright lasts for 60 years. In the case of original literary, dramatic, musical and artistic works the 60-year period is counted from the year following the death of the author. In the case of cinematograph films, sound recordings, photographs, posthumous publications, anonymous and pseudonymous publications, works of government and works of international organisations, the 60-year period is counted from the date of publication.
  ఇండియన్ కాపీరైట్ ఆక్ట్ పూర్తి పాఠం:
  http://copyright.gov.in/handbook.htm
  నాగరాజు

  మెచ్చుకోండి

 4. ఏ వెబ్ పత్రికలు రచనలపై సర్వహక్కులూ తమవని చెప్తున్నాయి? ఆ పేర్లు వెల్లడించండి. మిగతా రచయితలు అలాంటి పత్రికలకు ఉత్తరాల ద్వారా తమ అసమ్మతి తెలియచేయవచ్చు. 60 ఏళ్ల పై బడ్డ రచనలకు కాపీరైట్ ఉంటుందా! పరుచూరి గారు ఈ విషయమై భారతీయ చట్టమేమంటుంది?

  మెచ్చుకోండి

 5. తెలుగు రత్న ఒక ప్లాట్ పారంమే. ఇది కేవలం పత్రిక కాదు . ఇదో సోసల్ మీడియా & నెట్ వర్క్ . ఇక్కడ రచనలను ఎడిట్ చెయ్యం. రచన ప్రచురించిన తరువాత రచయుత దానిని ఎడిట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు అతని కంట్రోల్ పేనల్ ద్వారా. ఎక్కువ మంది రచనలను నెట్లోకి తీసుకురావడమే మాప్రయత్నం . నెట్ గురుంచి పెద్దగా తెలియని రచయుతలకు , బ్లాగులు లేని రచయుతలకు , తమ రచనలు ఎక్కువమంది చదవాలనుకునే రచయుతలకు ఇదో చక్కటి ప్లాట్ పారమ్మే.

  నా ఉద్దేశ్యంలో రచన రచయుత క్రియేటివిటీ కి సంబందించినది . బాగుందా లేదా అని పాఠకులే చెప్పాలి . సంపా్దుకుల పైత్యం రచయుతలమీద రుద్దకూడదు .

  మెచ్చుకోండి

 6. సాయి బ్రహ్మానందం గారూ, నా బ్లాగుకి వచ్చినందుకూ, మీవ్యాఖ్యకీ కూడా ధన్యవాదాలు. నాకు మొత్తం సాహితీలోకంలో ఏంజరుగుతోందో తెలీదండీ. నేను ఏవో కొన్ని సందర్భాలు మాత్రమే తీసుకుని కొంత హాస్యానికే రాసేను విషయం సీరియస్ అయినా. ఊసుపోక వ్యాసాలు సమగ్రం కాదు. ఊసుపోకలో నేను ఏదో ఒక చిన్న సంఘటన తీసుకుని విస్తరించి రాస్తాను. అంతే.
  మంచి విమర్శకులు లేరని కానీ, మంచి విమర్శలని గౌరవించే రచయితలు లేరని కానీ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి నేను బుచ్చిబాబుమీద వ్యాసం రాసినప్పుడు, పైన వ్యాఖ్యానించిన వంశీ మాగంటి ఇచ్చిన సలహాని నేను వెంటనే అంగీకరించేను. అలాగే ఇక్కడ నా బ్లాగులో పాఠకులు అభిప్రాయాలని కూడా మన్నిస్తూనే వున్నాను.

  మెచ్చుకోండి

 7. మాలతి గారూ,

  మీ బ్లాగు చూడ్డం ఇదే ప్రథమం. మంచి విషయాన్ని ప్రస్తావించారు. మీరన్నట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథలపై పెత్తనం వారిదే అన్న ధోరణుంది. గతంలో నేను కొన్ని వెబ్ పత్రికల్లో శీర్షికలు నిర్వహించాను. అవన్నీ ఆ పత్రిక వారి సొంతమేననీ, అవి వారి అనుమతి లేకుండా నేను ప్రచురించకూడదనీ పెద్ద లొల్లి చేసారు. అలాగే ఒక తెలుగు సాంస్కృతిక సంస్థకి నాటికలూ, నాటకాలూ రాసిస్తే, ప్రదర్శించిన ఖర్మానికి అవి వారివే అన్నట్లు మాట్లాడారు. ఆ నాటికలు వేరెవరు ప్రదర్శించినా ఆ సదరు తెలుగు సంస్థ పేరు చెప్పాలనీ, రచయిత పేరు చెప్పినా చెప్పకపోయినా నష్టం లేదనీ, నానా యాగీ చేసారు. అంటే రాసిన రచయితకలకేమీ హక్కులుండవన్నమాట.
  ప్రచురించిన పత్రికలకే సర్వాధికారాలంటూ కాపీ రైట్ లాలో ఎక్కడా లేదు. కొన్ని పత్రికలు మీరు చెప్పినట్లుగానే ఉంటున్నాయి. “మీ ఆర్టికల్ వేసుకొని మీకొక ఫ్లాట్ ఫారం మా పత్రికిస్తోందంటూ ఒక వెబ్ పత్రిక సంపాదకుల ఉవాచ. ఆ క్షణం నుండీ ఆ పత్రిక జోలికెళ్ళడం మానేసాను. ఇలా ఉంటున్నారు సంపాదకులు.
  ఇహ ప్రచురణ ముందు రాసినదానిపై సమీక్షలంటారా, శృతి మించనంత వరకూ పరవాలేదు. సమీక్షకీ, విమర్శకీ తేడా తెలీదు చాలామందికి. అయినా నాకు తెలిసి మీరు చెప్పిన పీర్ రివ్యూ సమీక్షలు ఈమాట పత్రికొక్కటే చేస్తుంది.
  మిగతా పత్రికా సంపాదకులు ధ్యానముద్రలో ఉన్న తధాగతులు. వారితో అంతా శాంతే! కథాసంపుటులేసే సంపాదకులతో అసలు గొడవే లేదు. ప్రచురింపబడ్డ కథయితే చాలు. కళ్ళు మూసుకొని అచ్చేస్తారు. సమీక్షా, వల్లకాడూ ఇలాంటివి అస్సలుండవు.
  ఈమాట కాకుండా ఇంకే పత్రికలు ప్రచురణ ముందు సమీక్షలు చేస్తున్నాయి? మీరు ప్రచురణ ముందు సమీక్ష వల్లొచ్చే తలనొప్పులు రాసారు. ఒక్కోసారి అవి రచయితలకీ ఉపయోగిస్తాయి కదా? ముఖ్యంగా వర్ధమాన రచయితలకి. కాదంటారా?

  సాయి బ్రహ్మానందం గొర్తి

  మెచ్చుకోండి

 8. శ్రీనివాస్ గారూ,
  మీ ప్రశ్నకి నాకు తోచిన సమాధానం – టెక్నికల్ రైటింగ్‌కీ క్రియెటివ్ రైటింగ్‌కీ తేడా – నాకు తెలిసినంతవరకూ రెండింటిలోనూ నిబద్ధతా, వస్త్వైక్యతా, స్పష్టతా అవసరమే. టెక్నికల్ రైటింగ్‌లో అంశం నిర్నీతమయి వుంటుంది. మీరు సాధికారకంగా నిరూపించదలుచుకున్న అంశానికి పరిమితం మీ అభివ్యక్తీకరణ.
  క్రియెటివ్ రైటింగులో వస్తువు (ఒక అనుభవం కానీ ఒక సంఘటనగానీ) నిర్ణీతమే అయినా అది ఆవిష్కరించడానికి అనేక మార్గాలు వుంటాయి. రచయిత పరస్పర వైరుధ్యం గల అనేక అంశాలు తీసుకుని నేర్పుతో వాటిని ఒక్కతాటిమీద నడపొచ్చు.
  Technical writing needs to be objective. Creative writing can be subjective. మోకాలికీ బట్టతలకీ ముడిపెట్టడం కథల్లో మాత్రమే సాధ్యం.

  మీ వ్యాఖ్యే వుదాహరణగా తీసుకోండి. (ఉదాహరణగా మాత్రమే)
  టెక్నికల్ ఎడిటర్ అభిప్రాయం ఇలా వుంటుందిః
  ఊసుపోకలో విషయం రచయతల, సంపాదకుల పరిధులు, మీ వ్యాఖ్యలో సంపాదకుల కోణం ఆవిష్కరించారు. ఆదృష్ట్యా చూస్తే ఊసుపోక రచయిత వయసూ, వూరూ, ఉద్యోగాల ప్రసక్తి అప్రస్తుతం. ఆమె కూడా రచయితా, సంపాదకురాలూ అన్నదృష్టితో చెప్పగలిగింది ఏమైనా వుంటే చెప్పాలి. (కొత్తపాళీ, వైదేహీ చేసిన వ్యాఖ్యలలో అలాటి వస్తుసంయమనం వుంది.)
  అదే కథల ఎడిటర్ అయితే ఇలా వుంటుందిః
  మీవ్యాఖ్యలో రెండు విషయాలు వున్నాయి. 1. సంపాదకుల, ఎడిటర్ల కృషి. 2. ఊసుపోక రచయిత్రి వయసూ, వూరూ, వుద్యోగమూ, ఇంకా కావలస్తే, ఆవిడ ఒడ్డూ, పొడుగూ, నెట్ వర్తూ కూడా చేర్చి రాయొచ్చు. అయితే వాటిమధ్య గల సంబంధం – కార్యకారణభావం – కూడా ప్రతీత్మకంగా ఆవిష్కరించాలి.
  మీకూ వంశీగారికీ కూడా మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  – మాలతి

  మెచ్చుకోండి

 9. Sreenivas gaaru

  You nailed it here in these lines….awesome…I am so happy to see that comment now…and I mean it…Have not seen it in few years…Hope people get it in the right sense..

  “అందరూ కాకపోయినా సద్విమర్శను కూడా స్వీకరించని అహం,లేదూ, రచనకీ మంచి రచనకీ తేడా తెలియక పోవడం ఈనాటి రచయితల్లో కనిపించే లక్షణం. రచన చేయడం కంటే ఆ రచనని తర్వాత మెరుగుపెట్టడం ముఖ్యమూ కష్టమూ అని గమనించిన రచయితలు ఎంతమంది? అసలు తాము రాసిందే వేదంగా భావించమనే నిరంకుశత్వం మాత్రం చాలా రచయితల్లో ఉంది. మేము మారం, కానీ వ్యవస్థ మారాలి అని నినదించే వాళ్ళే అందరూనూ. 20-25 కవితలు(!), లేక 6-10 కథలు పూర్తయితే వెంటనే ఒక సంకలనం తెచ్చుకోవాలనే తపన.”

  Hope people take “vimarSa” as “vimarSa”

  Vamsi

  మెచ్చుకోండి

 10. Maalati-gaaru,

  Since you asked: “ఎవరైనా అటువైపు వారి దృక్కోణాలు కూడా తెలియజేస్తే చర్చ అర్థవంతం అవుతుందని ఆశిస్తున్నాను…”. నిజానికి మొదటే ఈ రెండు మాటలు కూడా చెప్దామనుకున్నాను.

  మీరు కాసింత మెత్తమెత్తగా చెప్పారు. తెలుగుదేశంలో అయితే ఎడిటరా వాడెడవు/వాడెవత అనేసి పోతారు. నా రచనని ఎవడో రివ్యూ చేయడమేమిటి, నాన్సెన్స్ అనో, ఒకసారి రాసింది మళ్ళీ ముట్టుకోనండీ అనో, వెటకారంగా మీ స్థాయికి నా రచన మార్చలేను లేండి అనో, మాట్లాడి వెళ్ళే ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు (మీ వయస్సు వాళ్ళు కూడా!) నాకు తెలుసు.

  టెక్నికల్ పేపర్ల ప్రచురణలో పాటించే నియమాలు తెలుగు సాహిత్య రంగానికి కూడా చెల్లుతాయనే నేను నమ్ముతాను. ఎందుకు చెల్లవో మీరు చెప్పగలరా? చాలా సంవత్సరాలుగా, అదీన్ను UW-Madison లాంటి మంచి SA-studies centre వున్న పరిసరాల్లో/ప్రాంగణంలో వున్నారు కాబట్టి మీ పై బ్లాగు నాకు చాలా ఆశ్చర్యాన్ని, కాదు నిరుత్సాహాన్నే కలగచేసింది. Undertoneలో సంపాదకుణ్ణి బ్లాగు పొగుడుతూ వేళాకోళన చేయడం కనపడుతుంది, లేదా వినపడుతుంది. అందరూ అవసరం, కలిసి పనిచేయాలి అని మళ్ళీ మళ్ళీ అంటూనే!!

  Quote begin: నాకు అంతకంటె ఆశ్చర్యం ఈసంపాదకులకి ఇంత టైమెక్కడ దొరికిందా అని. వాళ్లకీ ఉద్యోగాలుంటాయి, సంసారాలుంటాయి, ఇతర వ్యాపకాలుంటాయి. వీటన్నటిమధ్య, వారికి అందిన ప్రతి రచననీ ఇంత నిశితంగా పరిశీలించి, చర్చించే టైమెక్కడిది చెప్మా అని నాకు ఆశ్చర్యం. Quote-end.

  You are questioning the dedication and sincerety of the editors! How sad! And yet, expect a balanced input and discussion!

  May be I am repeating myself. ఈ రోజు తెలుగు కథ/కవితా రచయితలెవరికీ peer-reviewing మీద కానీ, అంతకంటే ఒక ఎడిటర్ ద్వారా తన రచన మెరుగుపడుతుందనీ కానీ నమ్మకాలు లేవు. ఒకటి మాత్రం నిజం, రచయితలు అందరూ కాకపోయినా సద్విమర్శను కూడా స్వీకరించని అహం,లేదూ, రచనకీ మంచి రచనకీ తేడా తెలియక పోవడం ఈనాటి రచయితల్లో కనిపించే లక్షణం. రచన చేయడం కంటే ఆ రచనని తర్వాత మెరుగుపెట్టడం ముఖ్యమూ కష్టమూ అని గమనించిన రచయితలు ఎంతమంది? అసలు తాము రాసిందే వేదంగా భావించమనే నిరంకుశత్వం మాత్రం చాలా రచయితల్లో ఉంది. మేము మారం, కానీ వ్యవస్థ మారాలి అని నినదించే వాళ్ళే అందరూనూ. 20-25 కవితలు(!), లేక 6-10 కథలు పూర్తయితే వెంటనే ఒక సంకలనం తెచ్చుకోవాలనే తపన. ఇది మీమీద కానీ, కొందరు రచయితలమీద కానీ నిష్టూరంగా అంటున్న మాటలు కాదు. ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఇంకా నమ్మకపోతే మీకు గౌరవం ఉన్న ఏ ఒక్క ఎడిటర్‌నో అడగండి. ఒక మంచి ఎడిటర్ ద్వారా యేమి సాధ్యం అన్నది యేనాటికి గ్రహించగలరో…ఆచరించగలరో!

  భవదీయుడు,
  శ్రీనివాస్

  మెచ్చుకోండి

 11. కొత్తపాళీ గారూ, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. అన్ని వైపులనించీ అభిప్రాయాలు రావాలన్న నాకోరిక తీర్చారు. సంపాదకులు, విమర్సకులూ, వ్యాఖ్యాతలూ, సైటు నిర్వాహకులూ అందరూ తమ అభిప్రాయాలు వెలిబుచ్చాలనే నేను కోరుకుంటున్నాను. రచయితలు అందరూ నిరంకుశులు అన్నమాట మాత్రం నేను అంగీకరించలేను. పత్రికలవారు చాలామంది ఏసలహాలూ ఇవ్వడంలేదు. వేసుకుంటాం అనో వేసుకోం అని చెబుతారు. కానీ సలహాలు యిచ్చినప్పుడు రచయిత ఉద్దేశ్యం, శైలీ గుర్తించి తమ అభిప్రాయాలు చెపితే, రచయితలకి ప్రోత్సాహంగా వుంటుంది కదా. నాబోటి మొండిఘటాలు నాపత్రికలోనే వేసుకుంటాను అని హఠం వేయొచ్చు కానీ రచయితలకి పత్రికలలో కనిపిస్తే గౌరవం కదా. అందుకేనేమో హక్కులగురించి అంతగా పట్టించుకోడం లేదు. అయినా మనదేశంలో ఎవరూ పట్టించుకోడంలేదులెండి. మంచి సంపాదకులు, విమర్శకులూ, సలహాలు ఇచ్చేవారూ లేరనడంలేదు నేను.

  మెచ్చుకోండి

 12. హనుమంతరావుగారి చివరి వ్యాఖ్యకి, అటువంటి సాధకబాధకాల చర్చలు, కనీసం రచయితల మధ్యన, ఆంధ్రదేశంలో అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి. అవి మనదాకా రావు, అంతే.

  మెచ్చుకోండి

 13. ఒక రచయితగా మీ బాధని అర్ధం చేసుకోగలను మాలతి గారూ. పనిలో పనిగా, ఒక సంపాదకుణ్ణి కూడా కావడం వల్ల మీర్రాసిన మాటలు నన్ను కొంచెమైనా కుట్టాయి అని ఒప్పుకోకపోతే అది అబద్ధమే. ఆ లెక్కన ఈ వ్యాఖ్య కొంచెం బుజాలు తడుముకున్నట్టుగా అనిపిస్తే అనిపించవచ్చు గాక. ఆంధ్ర దేశంలో సాహిత్య పేజీల్ని సంపాదకించడం గురించి నాకేమీ తెలీదు. అమెరికాలో గత ఇరవయ్యేళ్ళలో వివిధ స్థాయిల్లో .. స్థానిక తెలుగు సమితి వార్తావాహిని దగ్గర మొదలెట్టి, జాతీయ స్థాయి అచ్చు పత్రికలో, ప్రత్యేక కార్యక్రమాలకి వేసే రెండు మూడొందల పేజీల జ్ఞాపికల్లో, ఇప్పుడు ఒక జాల పత్రికలో .. ఇన్ని రకాల సంపాదక వేషాలు వేస్తూ వస్తున్నాను. మొన్న మొన్నటి దాకా, అమెరికాలో తెలుగు సంపాదకుడు అంటే తెలుగు టైపిస్టుకి గౌరవ నామం. సంపాదకత్వాన్ని ఆ స్థాయి నుండి పైకి లేవనెత్తి, ఆ పాత్రకి ఒక సాహిత్య విలువని కల్పించిన మంచి సంపాదకులు మన మధ్యనే ఉన్నారు. అనేక తెలుగు పత్రికల్ని నిర్వహించి ఇప్పుడు వంగూరి ఫౌండేషన్ ప్రచురణలకి ప్రధాన సంపాదకులుగా ఉన్న ఆచార్య పెమ్మరాజు వేణుగోపాల రావుగారు, మొదట తానా పత్రికకీ ఇప్పుడు తెలుగు నాడి మాస పత్రికకీ ప్రధాన సంపాదకులైన డాక్టర్ జంపాల చౌదరి గారు, ఈమాట ప్రధాన సంపాదకులు వేలూరి వేంకటేశ్వర్రావు గారు, మొదట సుజనరంజని నడిపి ఇప్పుడు కౌముది పత్రికని నడిపిస్తున్న కిరణ్ ప్రభగారు వీర్లో కొందరు మాత్రమే. పటిష్ఠమైన సంపాదకత్వ దృష్టితో డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో వెలువడిన 2005 తానా జ్ఞాపిక రచనల క్వాలిటీ విషయంలో పలువురి ప్రశంసలు అందుకుంది.
  శ్రీనివాస్ గారు చెప్పినట్టు టెకింకల్ పేపర్సు మాత్రమే కాదు. నేను రాసిన అనేక కథలు, సమర్ధవంతులైన సంపాదకుల చేతిలో ఎంత కొత్త విలువ సంతరించుకున్నాయో నాకు తెలుసు.
  ఒకటి మాత్రం చెప్పగల్ను .. కవి (రచయిత) యే నిరంకుశుడు, సంపాదకుడు కాదు. సంపాదకుల ప్రతిపాదనల్ని తోసి పుచ్చే హక్కు రచయితకి ఎప్పుడూ ఉంది.

  మెచ్చుకోండి

 14. శ్రీనివాస్ గారూ, ఏం చేస్తాం కాకిపిల్ల కాకికి ముద్దు.:) అయినా తెలుగు కథలకీ ప్రొఫెషనల్ పేపర్లకీ పోలికేమిటండీ. సంఖ్యలో ఎడిటర్లకంటే రచయితలు ఎక్కువ అవడంచేత వారి స్వరాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయేమో. నేను నాకథలు సాటిరచయితలకి చూపించి వారి అభిప్రాయాలు తీసుకుంటాను. అందులో నాకు అభిప్రాయబేధం లేదు. నాకథల్లో పత్రికలవారు అంగీకరించనవి వున్నాయి. దానికి కూడా నేను తప్పు పట్టడం లేదు. నా అభ్యంతరం పైన వుదహరించినట్టు ఆసాంతం మొదట్నుంచీ చివరివరకూ తప్పులు పట్టే విమర్శలవిషయంలో. ఏ రచయిత కానీ తనదైన శైలిలో చెప్తాడు కథ. (వైదేహి అన్నట్టు స్వంతగొంతులో). ఎడిటర్లు ఆవిషయం గమనించినప్పుడు విమర్శలు బాగుంటున్నాయి.
  వైదేహీ, వీలు చేసుకుని నీఅభిప్రాయం పెట్టినందుకు కృతజ్ఞతలు.నువ్వు ఎలా వుండాలో చెప్తున్నావు. నా అభిప్రాయం కూడా అదే. పైగా ఒక కూడా, అలా వుండేదేమో కూడా అనిపిస్తోంది. నేను ఒకొక సందర్భం తీసుకుని, రాసేను. ఎంచేతంటే రచయిత దిద్దుకోవలసి వచ్చినప్పుడు ఆ సందర్భమే ముఖ్యం కానీ ఈ జనరలైజేషనులు కావు కదా.
  హక్కులవిషయంలో కూడా సర్వహక్కులూ ప్రచురించేవారివే అనేవారు ఏకారణంచేత అలా అంటున్నారో చెప్తారేమోనని ఆశించేను.
  Kate, I saw your blog too. Thanks for visiting my blog.

  మెచ్చుకోండి

 15. మంచి చర్చా విషయం.నా ఉద్దేశ్యం లో సంపాదకులు కానీ, రచయితలు కానీ రచన తాలూకూ సాహిత్య విలువల్ని, స్థాయిని పెంచటాన్ని మాత్రమే తమ ఉద్దేశ్యం గా ఎంచుకున్నపుడు అది ఇద్దరికీ ఉపయోగకరమవుతుంది. సంపాదకులు , రచన ప్రధాన అంశానికి,టెంపోకి,రచయిత ఉద్దేశ్యాలకి కాంట్రడిక్షన్స్ లేని మార్పులు, చేర్పులు సూచించగలిగితే (ఆ మార్పుల వల్ల ఆ రచన స్థాయి పెరిగితే) తప్పకుండా హర్షనీయమే.సూచించాలి కూడా.అది మంచి సంపాదకుల లక్షణం అని నా అభిప్రాయం.అటువంటి సూచనలని రచయితలు కూడా ఆహ్వానించాలి.అయితే రచయిత భావాలకి,శిల్పానికి,రచయిత నిర్దేశించుకున్న కధా గమనానికి విరుద్ధమైన మార్పులు సంపాదకులు సూచించటం జరిగితే రచయితలు అంగీకరించవలసిన అవసరం లేదు.ఎందుకంటే అల్టిమేట్ గా కధ రచయిత స్వంత గొంతులోంచే వినిపించాలి కాబట్టి.రచయితలు/సంపాదకులు /పాఠకులు ఒకే స్ఫటికానికి భిన్న కోణాలు.ఏ ఒక్క కోణం లేకపోయినా అసంపూర్ణమే అనిపిస్తుంది.
  రచయితలకి,సంపాదకులకి,పాఠకులకి కూడా సంయమనం ,ఔచితి, ఒకరి హక్కుల పట్ల మరొకరికి గౌరవం ఉండటం మాత్రం తప్పనిసరి అనిపిస్తుంది.
  చివరగా, సాహిత్యానికి స్థాయీ భేదాలున్నట్లే, రచయితల స్థాయి లో,సంపాదకుల స్థాయిలో,పాఠకుల స్థాయిలో కూడా తేడాలున్నాయి.ఆఖరికి వచ్చేసరికి ఎంతవరకు ఎవరి సలహాలు స్వీకరించాలి అనేది ఆ విచక్షణ మీదే ఆధారపడుతుందేమో.

  ఎప్పటిలాగే ఆలస్యంగా
  వైదేహీ శశిధర్
  (మాలతి గారూ,మొత్తానికి నా లాంటి బద్ధకస్తుల చేత కూడా కామెంట్ రాయించిన టపా !)

  మెచ్చుకోండి

 16. హనుమంతరావుగారితో నేనంగీకరించే సందర్భాలు చాలా తక్కువ. మొన్నామధ్య ఈమాట కామెంట్లలో, మరల ఈరోజు. కాకుంటే ఆయనకు విజయవాడ పుస్తకప్రదర్శన గురించి, ఏదో అందర్నీ తెలుగుదేశంలో అందర్నీ కలిపి “చర్చించడం” గురించి చాలా అపోహలున్నట్లున్నాయి :-). అయినా మొన్నొక పెద్దమనిషి డెట్రాయిట్ లో ఈ విషయమై మాట్లాడినప్పుడు ముందువరసలో కూర్చుని విన్నారు కదా. ఆ సలహాలు మీకు నచ్చలేదనుకుంటాను.

  కొంచెం పరుషంగా అంటున్నానేమో కానీ, నా దృష్టిలో ప్రధాన సమస్య తెలుగు రచయితలతోనే! మనకి *ఈరోజు* పటిష్టమైన ఎడిటింగ్, ప్రచురణశాఖలున్నాయని కాదు… ఒకవేళ వున్నా వాటిని వేళాకోళం చేసే రచయితలే యెక్కువ. ఎక్కడినుండి వస్తుందో కానీ వాళ్ళపైన, వాళ్ళ రచనా పటిమపైన మహా నమ్మకం. నేను కథా/కవితా రచయితని కాదు కానీ, నా సబ్జెక్టులో రాసే పేపర్లు ఎడిటింగ్ ద్వారా యెంత మెరుగు పడ్డాయో నాకు తెలుసు.

  ఇంకా, గత పదేళ్ళలో 15-20 పుస్తకాల ప్రచురణలో కొద్దో గొప్పో నా పాత్రుంది కనక బ్లాగుల్లో చిత్రీకరింపబడుతున్న చెడ్డగా పరిస్థితులేమీ లేవు అని చెప్పగలను.

  శివగారు రాసిన చివరి 2 వాక్యాలు పూర్తిగా నిజం కాదు. ఇండియన్ కాపీరైట్ లా ఇంటర్నెట్లో లభ్యమవుతుంది. ఒకసారి చదవండి.

  భవదీయుడు,
  శ్రీనివాస్

  మెచ్చుకోండి

 17. అందరికీ ధన్యవాదాలు. కొత్తవిషయాలు తెలుసుకోడం సంతోషంగా వుంది. ఎవరైనా అటువైపు వారి దృక్కోణాలు కూడా తెలియజేస్తే చర్చ అర్థవంతం అవుతుందని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 18. ప్రతిఫలం ఇచ్చినా సరే రచయుతకి ఆ రచనపై హక్కులు ఎల్లప్పుడూ ఉంటాయి . పబ్లిషర్ కొంత సొమ్ము ఇచ్చి అన్నిహక్కులు నాకే అని వ్రాతపూర్వకంగా రచయుతతో ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప.

  60 సంవత్సరాల(లేదా రచయుత బతికి ఉన్నంతకాలం ఏది ఎక్కువైతే అది ) తరువాత అవి ఎవరైనా ఉపయోగించుకునే పబ్లిక్ డొమైన్‌ అయిపోతాయి . ఇప్పటికి 60 సంవత్సరాల క్రింతం వచ్చినవి రచనలు , వీడియో , ఆడియో లకు మనం ఎటువంటి రాయల్టీలు చెల్లించక్కర్లేదు .

  మెచ్చుకోండి

 19. మాడిసన్ ప్రజలు సబ్-జీరో చలిని అనుభవించి పలవరిస్తారని వినికిడి. బైరాగి కవితాకామిని లా ఇక్కడ సియాటిల్ లో మాకు మామూలుగా హిమసుందరి “చేలాంచలాల కొస విసరులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమైనట్లు అగుపించినా,” ఈసారి మాత్రం దీర్ఘ గాఢ కౌగిలిలో బంధించి వణికిస్తోంది. 🙂

  ఇక్కడా, ఇతరత్రా చదివితే నాకనిపించేది – సంపాదకులు, పాఠకులు, విమర్శకులు, రచయితలు – వీళ్ళకి ఒకరిమీద మరొకరికి సద్భావము లేదని. కించిత్ ద్వేషముందని నా అనుమానం. ఇటీవల నేను చదివిన ధూర్జటి పద్యమొకటి గుర్తొస్తున్నది (అన్వయం సరయినదో కాదో భైరవభట్ల కామేశ్వరరావు గారు చెప్పగలరు):

  చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్
  వదరన్, సంశయ భీకరాటవుల త్రోవల్ దప్పి వర్తింపగా
  మదన క్రోధ కిరాతులందుగని భీమప్రౌఢిచే తాకినన్
  చెదరున్ చిత్తము చిత్తగింప గదవే శ్రీకాళహస్తీశ్వరా!

  తాత్పర్యము: శ్రీకాళహస్తీశ్వరా! గొప్ప చదువులు చదివిన అధములు కొందరు ఇష్టము వచ్చినట్లు మాట్లాడి, ప్రవర్తించి సమర్థించుకోడం విని మావంటివారు సంశయారణ్యంలో చిక్కుకొని ఉండగా, మామీద కామక్రోధములను కిరాతులు చాకచౌక్యంతో దాడి చేయగా, మనసు చెదరి చెడుచున్నది. దయచేసి దానిని అదుపులో పెట్టుము.

  ఈ పద్యంలో నాకు కనిపించిన గొప్పదనం, పండితాధములు – సంపాదకులు, పాఠకులు, విమర్శకులు, రచయితలు – వీళ్ళలో ఏ వర్గమయినా కావొచ్చు; మిగిలినవాళ్ళు సంశయారణ్యంలో చిక్కుకున్న వాళ్ళు! సందర్భానుగుణంగా అందరూ వాడుకోవచ్చు. 🙂

  దేవుడి మీద భారం వేసే అలవాటులేనివాణ్ణి కాబట్టి ఒకటడుగుతాను. ప్రస్తుతం హైద్రాబాదులో జరుగుతున్నట్లే, వచ్చే వారం బెజవాడలో పుస్తకాల పండగ జరగబోతోంది. ఇలాంటి చోట్ల, ఈ నాలుగు వర్గాల వాళ్ళలో పది మందిని పోగుచేసి, సమావేశపరచి, సాధకబాధకాల గురించి ఎందుకు మాట్లాడుకోరు? సొంత బ్లాగులున్నా, సొంతంగా పుస్తకాలు ప్రచురించుకునే స్తోమతు కొందరికి ఉన్నా, పత్రికలు లేకుండా తెలుగు సాహిత్యం మనగలుగుతుందా? ఆలోచించండి. అందరికీ కృతజ్ఞతలతో,

  కొడవళ్ళ హనుమంతరావు

  మెచ్చుకోండి

 20. రచయిత యొక్క intellectual property హక్కులకీ, పబ్లిషర్లతో పంచుకునే copy హక్కులకీ గల తేడా భారతదేశంలో మనం గుర్తించకపోయినా ఈ ట్రెండ్ తప్పక వస్తుందనుకుంటాను.

  మెచ్చుకోండి

 21. కొడవళ్ళ హనుమంతరావు గారికి నెనరులు. ఇక్కడ మాలతి గారు గాని మీరు గాని ఉదహరించిన పేర్లు తెలిసిన వారు చాలా తక్కువమంది. వారికీ విధంగానైనా తెలిసే అవకాశం లభించింది.

  మెచ్చుకోండి

 22. మా బాగా చెప్పారు మాలతిగారు. ఈ మధ్య పత్రికలకి రాయట్లేదు కాబట్టి ఈ కష్టాలను ఇప్పటికింకా ఎదుర్కోలేదు.. ఈ మధ్య ఆంధ్ర జ్యోతివారు నా కథని ప్రచురించారు. బ్లాగులనించి అచ్చులోకి వెళ్ళటం తెలుగు బ్లాగర్లకి శుభ పరిణామమే అయినా, అసలు కథలో వున్న కీలక విషయాలను ఎలా స్థలాభావం(??)తో తొలగించారో కింది లంకెలు చూస్తే తెలుస్తుంది. అసలు మనం మన బ్లాగులు – “ఇది నా కాపీరైటు… పత్రికల్లో పబ్లిష్ చెయ్యాలంటే మా దగ్గర వ్రాత పూర్వక అనుమతి పొందాలి” అని అనే స్థాయి ఎదగాలని నా ఆశ.
  http://palakabalapam.blogspot.com/2008/12/blog-post_20.html
  http://palakabalapam.blogspot.com/2008/12/blog-post.html

  మెచ్చుకోండి

 23. ఏటి ఏడు కామెంట్లకే దణ్ణమంతన్రు?
  నెటిజన్ గారన్నట్లు ఇది ఆసామాసీ యెవారంకాదు.
  కూలంకషంగా చర్చకు ఆస్కారముంది,ఉండనివ్వండి
  హనుమంతరావు గారు ఒక్కసారి బోలెడు పుస్తకాలని గుర్తుకు తెచ్చారు ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 24. హనుమంతరావు గారూ, చాలా చాలా కృతజ్ఞతలు కరెక్ట్ సమాచారం అందించినందుకు. మీరు తప్పు పట్టేరనుకోడం లేదు. ఇటువంటి దోషాలు ఎవరైనా చూపితే నాకు చాలా సంతోషంగా వుంటుంది. ఇక్కడ మాకు 30 బిలో జీరో. అంచేత లైబ్రరికి వెళ్లే సాహసం లేక సరి చూడలేదు. ఇప్పుడే మారుస్తాను. మరొకసారి కృతజ్ఞతలు.
  నెటిజన్, లేదండీ. బ్లాగరులలో సామరస్యమే ఎక్కువ.
  సుజాత, వర్థమాన అనే కాదు. నాక్కూడా అలాటి సలహాలే వచ్చేయి కనకే రాస్తున్నాను. ఎటొచ్చీ వర్థమాన రచయితలు తొందరగా నిరుత్సాహపడతారనీ, అలా పడవద్దనీ చెప్పడమే నావుద్దేశ్యం.
  శివ, మహేష్ కుమార్, సుజాత, రాజేంద్రకుమార్ గారూ, మీరు రాసిన వ్యాఖ్యలు చూస్తే సంతోషంగా వుంది.
  అందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 25. మీ టపా, నెటిజెన్ గారి వ్యాఖ్య చూసి ప్రాణం లేచి వచ్చింది! వర్థమాన రచయితలు అనగానే రచన బాగున్నా ఏదో ఒకటి ఎత్తి చూపాలనే ఉత్సాహం ఎడిటర్ల సొంతం! ఒక్కోసారి కథ మొత్త తిరగ రాయమన్న సూచనలూ ఎదురవుతాయి.(స్వానుభవం) పది పన్నెండు కథలు రాసి ఉన్నా, కథ మొత్తం తిరగ రాయమన్న సలహా చదివి నిస్పృహ చెందాల్సి వస్తుంది.

  ఉదాహరణకు ” కాఫీ గబ గబా ఊదుకుంటూ తాగింది” అని రాస్తే “ఊదుకుంటూ గబ గబా తాగిందా, గబ గబా ఊదుకుంటూ తాగిందా..క్లారిటీ ఉండాలన్నారు. ఇది కంప్లైంట్ కాదు. ఇవి కూడా రచనలో దోషాలా అనే ఆశ్చర్యం! అంతే!

  నెటిజెన్ గారన్నట్టు ఇలా చదివి అలా వ్యాఖ్యానించే టపా కాదిది!ఈ మధ్య కాలంలో మీ టపాల్లో మరింతగా నచ్చిన టపా ఇది మాలతి గారూ!

  మహేష్,
  మన రచనలు మనకు ఎలాగూ బాగుంటాయి. మరొకరు మెచ్చి ప్రచురిస్తే అది మరింత బాగుంటుంది కదా!

  మెచ్చుకోండి

 26. ఈ కాలంలో సంపాదకీయంలో కూచునే మహామహులందరూ రచయితలుగా విఫలమైనవాళ్ళు లేక పత్రికాయాజమాన్యానికి అనుకూలమైన ఉండి కాస్తోకూస్తో అక్షరజ్ఞానం కలిగినవాళ్ళు. వాళ్ళు రచనల్ని బేరీజుచెయ్యడమంటే “పాఠకులకు ఇవి నచ్చవండీ” అని తమ పైత్యాన్ని రుద్దేరకాలేతప్ప రచనలపై సాధికారత కలిగినవాళ్ళు కాదు. అలాంటివాళ్ళ గురించి చర్చే అనవససరం. కానీ మీరు చెప్పిన దాంట్లో తెలుగు పబ్లిషింగ్ రంగంలోని వ్యవస్థాగత మార్పుంది చూసారూ..అదే అత్యంత కీలకమైన చర్చాంశం.

  అందుకే నావరకూ నా బ్లాగే బెస్టు..ఇష్టమొచ్చింది రాసి చక్కగా “పబ్లిష్:” చేసుకోవచ్చు. మార్పులు కావాలంటే మార్చుకోవచ్చు. ఒక వెబ్ పత్రిక్కి నా కథొకటి పంపి భంగపడ్డాను. అప్పటి నుంచీ నా conviction మరింత పెరిగింది. వీలైతే ఎప్పుడో ఒకప్పుడు ఒక పుస్తకం నేనే వేసుకుంటాను..ఆ దూలా తీరిపోతుంది.

  మెచ్చుకోండి

 27. “ఆ సైటులకి మనం ఒక కథో వ్యాసమో ఇస్తే, దానిమీద సర్వహక్కులు తమవే అంటున్నారు. వారు ప్రచురించిన తరవాత మీరెక్కడ ప్రచురించుకోవాలన్నా మీరు ముందుగా వారి అనుమతి తీసుకోవాలిట. వారు అనుమతి ఇవ్వకపోతే మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. ”
  …………………………………………………………………………………………………….
  అవును ఇలాంటి నిబందనలు నవ్వు తెప్పిస్తున్నాయి .కాపీరైటు నిబందనల ప్రకారం మీ రచనపై సంపూర్ణ్ హక్కులు రచయుతలకే ఉంటాయి (డబ్బులు తీసుకోకపోతే). వాల్లు అలా నిబందన పెట్టినా సరే చెల్లదు . అయినా రచయుతల వల్లే సైటు కి పేరు వస్తుంది . ఉచితంగా రచనలు ప్రచురించుకుని మరీ ఇలాంటి నిభందనలు అర్దరహితం

  కాని తెలుగురత్నఅలాంటిది కాదు . రచయుతలకు పుర్తి స్వేచ్చ , మరియు ఎప్పుడైనా తమ వ్యాసాన్ని ఎడిట్ చేసుకోవచ్చు , అవసరం లేదంటే తొలగించనూ వచ్చు .

  శివ బండారు
  http://teluguratna.com

  —————————————————————

  మెచ్చుకోండి

 28. “ఆ సైటులకి మనం ఒక కథో వ్యాసమో ఇస్తే, దానిమీద సర్వహక్కులు తమవే అంటున్నారు. వారు ప్రచురించిన తరవాత మీరెక్కడ ప్రచురించుకోవాలన్నా మీరు ముందుగా వారి అనుమతి తీసుకోవాలిట. వారు అనుమతి ఇవ్వకపోతే మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. ”

  అవును ఇలాంటి నిబందనలు నవ్వు తెప్పిస్తున్నాయి .కాపీరైటు నిబందనల ప్రకారం మీ రచనపై సంపూర్ణ్ హక్కులు రచయుతలకే ఉంటాయి (డబ్బులు తీసుకోకపోతే). వాల్లు అలా నిబందన పెట్తినా సరే చెల్లదు .

  ఒక సారి తెలుగురత్న చూడండి . రచయుతలకు పుర్తి స్వేచ్చ , మరియు ఎప్పుడైనా తమ వ్యాసాన్ని ఎడిట్ చేసుకోవచ్చు , అవసరం లేదంటే తొలగించనూ వచ్చు .

  మెచ్చుకోండి

 29. మాలతి గారికి,

  ఉత్తరాల సారాంశం బాగా గుర్తు పెట్టుకున్నారు. పోలాప్రగడ పుస్తకం, “ఆ రోజుల్లో…,” వ్యాసం, “రచయితలు బోళాశంకరులు.” ఉత్తరాలను అందుకున్న రచయిత కోరాడ రామకృష్ణ శాస్త్రి కాదు, పోలాప్రగడ గారి మేష్టారు ఇంద్రగంటి హనుమాచ్చాస్త్రి.

  నేనిక్కడ పనిగట్టుకొని తప్పులెత్తి చూపెట్టినట్లనిపించవచ్చు కాని, ఆరుద్రవి పేరున్న రచనలు కనుక సవరించడం భావ్యమేననుకుంటాను. సినీవాలి స్వీకారంలో జగ్గయ్య అన్నది:

  “పరిణతిలో ప్రభవించిన
  కావ్యం నా కిస్తానంటే
  తీసుకునే స్తోమతు నాలో
  ఆశగా తలవొంచుకుంది.”

  “‘అల్లుడా రమ్మ’ని ఆరుద్రగారు
  పిలిచి పిల్లనిస్తామంటే
  ములిగిపోయాను కృతజ్ఞతతో
  ఏం చెప్పను? ఎలా చెప్పను?”

  సినీవాలికి ఆర్థిక సాయం చేసినందుకు మహారాజా గారికి ఆరుద్ర కృతజ్ఞతలు చెప్పినట్లు నాదగ్గరి కాపీలో వెతికినంతవరకు కనబడలేదు. దాంట్లో శ్రీశ్రీ, వరద, కాటూరి లకు మాత్రం థేంక్స్ చెప్పాడు.

  ఆరుద్ర “త్వమేవాహమ్” ని రోణంకి అప్పలస్వామి గారికి అంకితమిచ్చాడు:
  “దీపాన్ని వెలిగించేందుకు దీపం
  సాన పట్టినమీదటే వజ్రం
  బంగరు పళ్ళానికి గోడ చేర్పు
  మీ చేతి చలువ వీడి కూర్పు.”

  కొడవళ్ళ హనుమంతరావు

  మెచ్చుకోండి

 30. అలా చదివేసి, ఇలా వ్యాఖ్యానించే టపా కాదు ఇది.
  “కొన్ని విమర్శలు చూసినప్పుడు, అవి రాసినవారు కథలో “రచయిత ఏం చెప్తున్నాడు” అన్న దృష్టితో కాక “మనం రచయితకి ఇవ్వగల సలహాలు ఏమిటి” అన్న దృష్టితో చదువుతున్నారేమో అనిపిస్తుంది . ”
  మీకు ఈ ధోరణి ఎక్కడ కనుపడుతున్నది. బ్లాగులో కనపడుతున్నదా మీకి ఇది?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.