ఊసుపోక – మరో యేడూ, కొత్త ప్రమాణాలూ

 (ఎన్నెమ్మ కతలు 26)

మామూలుగానే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగడం నాఅలవాటు. కానీ నూతనసంవత్సరం నాడు అందరూ ప్రతిజ్ఞలు చేస్తారు కదా. అంచేత ఈసారి నేనూ చేద్దాం అనుకున్నాను. చూసారా ఇది కూడా ఒక ఆలోచనకి ఆరంభమే!

వెనకటిరోజుల్లో కాశీ వెళ్లినవాళ్లు

 

తమకి చాలా ఇష్టమయిన వస్తువు ఏదో ఒకటి అక్కడ వదిలేసి రావడం ఆచారంట. అంటే నేను వంకాయకూరో సున్నుండలో అంటే పడి చస్తాను అనుకోండి. ఆ వంకాయకూరో సున్నుండలో కాశీలో వదిలేసి వస్తే మళ్లీ జన్మలో అది తినకూడదన్నమాట. అందులో కాంప్రమైజు లేదనుకుంటాను. అంటే మెంతివంకాయకూర వదిలేసి వచ్చేను, పచ్చికారం పెట్టి చేసుకు తినొచ్చు లాటివి అంగీకరించబడవు. అది తెలిశాక సున్నుండలు వదిలేయకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఇది కూడా మరి ఒకరకమైన ప్రతిజ్ఞకిందే వస్తుందా? ఏమో మరి.

నిజానికి ఇలాటి ప్రతిజ్ఞలన్నీ మన మనోదారుఢ్యాన్ని (డిసిప్లిను అంటారు కాబోలు ఇంగ్లీషులో) పరీక్షించడానికి అంటారు. వంకాయకూరా, సున్నుండలూ వదిలేయగలిగే మనోదారుఢ్యం నాకు వుందా లేదా అని పరీక్షించుకోడం అన్నమాట.  

ఇప్పుడు న్యూయియర్ నిర్ణయాలకి కూడా అదే రూలు. ఎటొచ్చీ ఈ నిర్ణయాలు ఇష్టాయిష్టాలకి సంబంధించినవి కావు, కష్టనష్టాలతో కూడుకున్నవి. 

ఈయేటికి ఇది ఆఖరిరోజు. నేనిప్పుడు గబగబా ఏం నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించేసుకోవాలి. గట్టిగా ఆలోచించడం మొదలెట్టేశాను. చాలామంది ఏదో ఒక దురభ్యాసాన్ని వదిలేయడమే ఎంచుకుంటారు.

ఆ దురభ్యాసాలజాబితాలో మొట్టమొదటిది సిగరెట్లు మానేయడం.టీవీలో ఒహటే పోరు క్విట్క్విట్క్విట్టంటూ.

సిగరెట్లు మానేయడం చాలా తేలికట కూడాను. ఎవరో ఓ పెద్దమనిషి చెప్పాడు, సిగరెట్లు మానేయడం చాలా తేలికండీ. నేను చాలాసార్లు మానేశాను. చాలాసేపు ఆలోచించిన తరవాత నాకు తోచింది నాకు లేని అలవాటు ఎలా వదిలేస్తాను. అంచేత ఇది పనికిరాదు నాకు.

రెండోది కాఫీ మానేయడం. ఇది ఆలోచించవలసిన విషయమే. కాఫీ వొంటికి మంచిది కాదని అంటారు కానీ నాకు మాత్రం నాఒంటికీ ఇంటికీ, ఇంటికి వచ్చే పోయేవారికీ నేను కాఫీ తాగడమే ఆరోగ్యకరంగా కనిపిస్తోంది చూడగా చూడగా. ఎందుకంటే, ఉదయం కాఫీ తాగకపోతే, నాకు చిరాగ్గా వుంటుంది. అప్పుడు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నాచుట్టుపక్కల వున్నవాళ్లకి ఆనందంగా వుండదు. నారోజుతో పాటు వాళ్లరోజు కూడా కష్టమయం అవుతుంది. ఇది సంఘద్రోహంగా పరిగణింపబడొచ్చు. నామీద ఎవరో ఒకరు పబ్లిక్ న్యూసెన్సు దావా వెయ్యొచ్చు. ఇలా ఆలోచించి కాఫీ మానేయడం శుభప్రదం కాదని దాన్ని దాటేశాను.

ఇంకో మోస్టు పాప్యులర్ ఆలోచన డైటింగు. తినడంకోసం బతుకుతామా బతకడంకోసం తింటామా అంటూ నినదించేవారు సాధారణంగా బకతకడంకోసం తింటాం, తిన్నతరవాత మనం చెయ్యవలసిన ఘనకార్యాలు చాలా వున్నాయి అని నమ్ముతారు. నిజంగా ఘనకార్యాలు చేసేవారి విషయంలో అది నిజం అని నేను నమ్ముతాను. సందేహం లేదు. అది నమూనాగా తీసుకుంటే నేను సాధించే ఘనకార్యాలేవీ లేవు కనక నేను తినడంకోసమే బతుకుదాం అనుకుంటున్నాను. (అదే ఋజువు చేయడానికి అన్నట్టు కాబోలు నిన్ననే ఓ ఆత్మీయురాలినుండి రెండు పెద్ద పేకట్లు లడ్డూలూ, కాజూ హల్వా వచ్చేయి J)

అది నాప్రాణానికి పైవాడు ఊపిన పచ్చజెండాలా వుంది. అంచేత డైటింగు కూడా నాజాతకంలో లేదని తేలిపోయింది.

ఇకపోతే ఈ ఊసుపోక కబుర్లు  కూడా నాకాఫీలాగే నాకు అచ్చొచ్చినవి. నాకు చాలా సరదాగా వున్నవి. ఇందులో కొంచెం కాంప్రమైజుకి తల ఒగ్గి, ఆసికాలూ, యెటకారాలూ మానేసి, చాలా మర్యాదగా, మప్పితంగా, రాద్దామా అని ఒక ఆలోచన వస్తోంది. అప్పుడు నారాతలకి కొత్త ప్రమాణాలు కూడా ఏర్పడవచ్చు. చూద్దాం.

(స్వగతం: New year resolutions are like government rules, made to be broken!)

 

ఈయేటికి చివరిమాటగా, మనస్ఫూర్తిగా, ఊసుపోక అభిమాన పాఠకులందరికీ శుభాకాంక్షలు. పునర్దర్శనం వచ్చే ఏడు J )

 

 

 

(డిసెంబరు 31, 2008. )     

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఊసుపోక – మరో యేడూ, కొత్త ప్రమాణాలూ”

 1. వంశీ, థాంక్స్.
  సిబిరావ్, బాగుందండీ. కాశీలో వదిలేసేంత ఇష్టం కాదులెండి రాయటం 🙂
  మహేష్, థాంక్స్.
  ఉష, ఏకంగా కవిత పెట్టేశారు.మీమూలంగా నాటపాకి మరొక కళ వచ్చింది.
  ప్రవీణ్, అవనిజ, బాగుంది. నేనేదో క్లిష్టతరమయిన, చాలామంది తల గోక్కునే పేరు పెట్టేననుకుంటే మీరిద్దరూ కలిసి సస్పెన్సు చంపేశారు. కొత్తసంవత్సరానికి చక్కని ప్రారంభమే:)

  మెచ్చుకోండి

 2. ప్రవీణ్ :). మాలతి గారు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలోనే నేను ఎన్నెమ్ కతలు అంటే ఏంటి అని అడిగా!

  మెచ్చుకోండి

 3. మనదింకో బాణీలేండీ. ఏడాదికొకసారి కొన్ని resolutions పెట్టుకోవటం. ఏడాది పొడుగూతా సమీక్షించుకోవటం, why did i break them, what is my rationale behind it ఇలాన్నమాట ఇదే ఏదో వూసుపోక నా ఊకదంపుడు వ్యవహారం 🙂 అలాని ఏమీ అనుకోకుండా వుండనూలేను.
  ***
  copy and paste from my blog of my new year wishes to you and all our blog friends.

  మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం, మాకెందుకిక దిగులని,
  గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది, వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
  మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది, పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
  నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది, అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
  ఋతువు కూడా ఒప్పేసుకుంది, శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
  మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి, తాను తరలి వెళ్తదేమో.
  కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.
  ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
  ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం …
  అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!

  రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
  మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు…

  మెచ్చుకోండి

 4. ఇన్నాళ్ళకు కానీ నాకర్థం కాలేదు. ఎన్నెమ్ కతలు అంటే (నిడదవోలు మాలతి కతలు) అని. 😛

  నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో కతలు మాకిలా చెబుతుండండి.

  మెచ్చుకోండి

 5. మీకు చాలా ఇష్టమయిన వస్తువు రాయటమయితే, అది కాశీలో గంగా స్నానమాచరిస్తూ వదిలి రావాలన్నమాట. ఇవన్నీ పిచ్చి నమ్మకాలు.

  అందుకోండి నూతన సంవత్సర శుభాకాంషలు.

  మెచ్చుకోండి

 6. mAlati gAru

  ayyO idi mee blAgu..mee ishTam…nA vyakhyalu tolagincinaa nAkEm abhyantaram lEdu…controversy ceyyAli anE uddESyamU lEdu, mimmalni ibbamdi peTTAli ani aa haikUlu ikkaDa peTTalEdanDI bAbU….ceppAnugA mee TapA cUsAka aavESam vaccEsindi ani….raaseyyAli ani anipincindi, raasEsAnu….:) ..mee ishTam, rAdhika gAri ishTam…

  intE sangatulu cittagincavalenu..

  vamSI

  మెచ్చుకోండి

 7. వంశీ గారూ,

  ఈ హైకూలు నాకు అర్థం కావు. కాస్త ఇబ్బందిగా కూడా వుందండీ. హైకూలు రాధిక చెప్పినట్టు ఇక్కడ ఎందుకండీ. మీకు ప్రేరణ ఇచ్చిన వారి సైటులోనే పెట్టుకోండి. లేదా, తెలుగురత్నవంటి పబ్లిక్ సైటులో పెట్టుకోవచ్చు.
  .
  కొత్తసంవత్సరం నన్ను ఇబ్బందిపాలు చేస్తూ మొదలుపెట్టించకండి

  మాలతి

  మెచ్చుకోండి

 8. వంశీ గారూ మీ కామెంటు అర్ధం కాలేదు.సుబ్బు గారి కవితల్ని పేరడీ చెయ్యాల్సిన అవసరం ఏమిటి?అదీ ఇక్కడ.

  మెచ్చుకోండి

 9. ఏమిటీ….టీ…టీ…వెటకారాలు మానేస్తారా?ఇలా అయితే మేము కారాలు,మిరియాలు నూరాల్సివస్తుంది 🙂 మీకు కూడా హృదయపూర్వక శుభాకాంఖలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s